సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1320వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

    •     శ్రీసాయి అనుగ్రహ లీలలు - ఏడవ భాగం

సాయిబాబుగారు తమకు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలు గతవారం పంచుకున్నారు. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నారు.


సాధారణంగా కూతురు డెలివరీ విషయంలో డాక్టరు 'ఆపరేషన్ చేయాలం'టే, 'వద్దు' అని, 'వీలైనంత వరకు అంటే 99% నార్మల్ డెలివరీ అయ్యేలా చూడండి' అని చెబుతాము. కానీ మా అమ్మాయి విషయంలో బాబా చేసిన లీల చదవండి. మా అమ్మాయికి డెలివరీ సమయం ఆసన్నమై తనని బెంగళూరులో వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్లో చేర్చాము. ఆ హాస్పిటల్లోని డాక్టరు అందరికీ నార్మల్ డెలివరీ చేయడం, చుట్టుపక్కల ఇళ్ళలో నార్మల్ డెలివరీ అయిన అమ్మాయిలను చూడటం వలన మేము ఆ డాక్టరు మీద సదభిప్రాయంతో ఉన్నాం. ఎంతో అనుభవమున్న ఆమె, "నార్మల్ డెలివరీ అవుతుంది" అని చెప్పి, ఒక రోజంతా మా అమ్మాయిని అలాగే ఉంచింది. రాత్రయింది, నేను నారాకోడూరులో ఉన్నాను. రాత్రి ఒంటిగంట సమయంలో నా భార్య నాకు ఫోన్ చేసి, “అమ్మాయికి నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. డాక్టరు, 'అంతా బాగానే ఉంది, రేపు నార్మల్ డెలివరీ చేద్దామ’ని చెప్పి ఇంటికి వెళ్లారు. మీరు బాబాని, 'నార్మల్ డెలివరీనా' లేక 'సిజేరియన్ చేయాలా' అని అడగండి” అని చెప్పింది. నేను సరేనని, రాత్రి 1.30 సమయంలో బాబాను అడిగితే, 'సిజేరియన్ చేయమ'ని బాబా సెలవిచ్చారు. నేను వెంటనే నా భార్యకు ఫోన్ చేసి బాబా ఇచ్చిన జవాబు తెలియజేశాను. దాంతో నా భార్య డాక్టరుకు ఫోన్ చేసి, “మా అమ్మాయికి సిజేరియన్ చేయండి” అని చెప్తే, ఆమె విస్తుపోయింది. ఆపై హాస్పిటల్‍కు వచ్చి, ఆపరేషన్‍కు సిద్ధం చేసింది. మా అమ్మాయి కుడిచేతి మణికట్టుకి బాబా లాకెట్ ఉన్న తాడు ఎప్పుడూ ఉంటుంది. ఆపరేషన్ మొదలుపెట్టేటప్పుడు నగలన్నీ తీసివేస్తుండగా, మా అమ్మాయి తన చేతికున్న బాబా లాకెట్‍ను మాత్రం అలాగే ఉంచమని చెప్పింది. వాళ్ళు సరేనని ఆ లాకెట్ మాత్రం తీయలేదు. తెలతెలవారుతుండగా ఆపరేషన్ థియేటర్ నుండి ఒక వ్యక్తి బయటికి వచ్చి, 'మగపిల్లవాడు' అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. నా భార్య, తన తల్లి ఆనందంలో ఆ వచ్చిన వ్యక్తిని సరిగ్గా గమనించలేదు. తర్వాత తెలిసిన విషయమేమిటంటే, 'ఆ హాస్పిటల్లో డాక్టరుతో సహా పనిచేసేవాళ్ళందరూ ఆడవాళ్ళేన'ని. మరి ఆపరేషన్ థియేటర్లో నుండి బయటకు వచ్చిన మగమనిషి ఎవరు? బాబానే ఆ రూపంలో వచ్చి ఉంటారని మా మనసంతా ఆయనపట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. ఇక్కడొక విషయం చెప్పాలి. మా అమ్మాయి గర్భవతిగా ఉన్నప్పుడు స్కానింగ్ చేసిన డాక్టరు కడుపులో ఉంది 'ఆడ', 'మగ' అని చెప్పకపోయినా మరో మూడు నెలల్లో కాన్పు అవుతుందనగా ఒక రాత్రి కలలో, పుట్టబోయే బాబుని, 6 నెలల వయసున్న మనవడిని నేను ఎత్తుకుని ముద్దాడుతున్నట్లుగా బాబా నాకు చూపించారు. అందువల్ల వాడి రంగు, పోలికలు అన్నీ నాకు ముందే తెలిశాయి. మా మనవడు అచ్చం బాబా చూపించినట్లే ఉన్నాడు. మనవడు పుట్టిన తర్వాత మేము శిరిడీ వెళ్ళాము. మా అమ్మాయి కళ్ళు మూసుకుని 'బాబుకు ఏం పేరు పెట్టాల'ని మనసులో బాబాని తలచుకుని కళ్ళు తెరిస్తే, ఎదురుగా ఉన్న ఒక హోటల్ బోర్డుపై 'సాయీష్' అని కనిపించింది. సంతోషంగా అదే పేరు బాబుకు పెట్టుకున్నాము. తనకి అన్నప్రాసన కూడా శిరిడీలోనే చేశాము.


'సాయీష్'కు 5 సంవత్సరాలు వచ్చేవరకు నారాకోడూరులో అమ్మమ్మ, తాతయ్యలమైన మా దగ్గరే పెరిగాడు. అప్పుడు బాబా పెద్ద పెద్ద ప్రమాదాల నుండి 'సాయీష్'ని కాపాడారు. సాయీష్‍కు 11 నెలల వయసున్నప్పుడు ఒకరోజు మేమూ, స్కూలు పిల్లలూ మేడ మీద ఉన్న స్కూలు శుభ్రం చేస్తున్నాము. సాయీష్‍ను వాకర్‌లో కూర్చోబెట్టి మా పనిలో మేము నిమగ్నమై ఉన్నాము. 'సాయీష్' వాకర్ నెట్టుకుంటూ మెట్ల దగ్గరకు వెళ్ళాడు. వాకర్ మొదటి మెట్టు మీదకి దిగింది. దూరాన ఉన్న మేము 'సాయీష్'ని చూశాము. నేను కంగారుగా 'బాబా' అని అనుకుంటూ పరుగెత్తాను. నేను వెళ్లేసరికి దాదాపు 10 మెట్ల మీదగుండా వాకర్ వేగంగా దొర్లుకుంటూ వెళ్లి ఆగింది. చిత్రంగా వాకర్ తిరగబడలేదు, సాయీష్‍కు చిన్న దెబ్బ కూడా తగలలేదు, వాడు భయపడి ఏడవనూ లేదు. అసలు అన్ని మెట్లపైనుండి దొర్లుకుంటూ పోతే, దెబ్బ తగలకుండా ఉంటుందా? బాబానే నా మనవడిని కాపాడారని మనసారా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాము.


ఇంకోసారి సాయీష్‍కు మూడు సంవత్సరాల వయస్సున్నప్పుడు నేను, నా భార్య వాడిని తీసుకుని స్కూటర్ మీద తెనాలి వెళుతూ దారిలో జాగర్లమూడి దాటిన తర్వాత రోడ్డు పక్కన నిమ్మకాయలు కొందామని ఆగాము. అక్కడ మేము, నిమ్మకాయలు అమ్మే వ్యక్తి తప్ప, దగ్గరలో ఇంకెవరూ లేరు. మేము నిమ్మకాయలు చూస్తూ సాయీష్ రోడ్డు మీదకు వెళ్లడం గమనించలేదు. మేము చూసేసరికి వాడు మాకు కొంచెం దూరంగా ఉన్నాడు. తెనాలి నుండి ఎక్స్‌ప్రెస్ బస్సు చాలా వేగంగా సాయీష్‍కు దగ్గరగా వచ్చేస్తుంది. వెంట్రుకవాసి గ్యాప్‍లో ఎవరో ఒక వ్యక్తి సాయీష్ చెయ్యి పట్టుకుని రోడ్డు పక్కకు లాగి వెళ్ళిపోయాడు. అదంతా చూస్తున్న మేము షాకైపోయాము. ఒళ్ళంతా వణుకు వచ్చేసింది. మేము తేరుకుని చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రదేశంలో రెప్పపాటు కాలమే కనిపించిన ఆ వ్యక్తి బాబాకాక ఎవరై ఉంటారు!! ఆ రూపంలో సాయీష్‍ని ఆయనే కాపాడారు. ఆ సంఘటనను ఊహించుకుంటే, మాకు ఇప్పటికీ భయమేస్తుంది. మేము అన్ని పనులూ మానుకుని వెంటనే సుల్తానాబాద్‍లోని బాబా మందిరానికి వెళ్ళాము. బాబాను చూడగానే కృతజ్ఞతతో మా కన్నుల నిండా నీళ్లు నిండిపోయాయి. జరిగిన సంఘటన విని గుడిలోని ఒకామె. "అవునండీ, బాబా నన్ను కూడా ఒకసారి తుఫానులో రిక్షాలో బాబా గుడికి వస్తుంటే జరగబోయే ప్రమాదం నుండి రక్షించారు” అని మాకు చెప్పింది. నమ్మినవారిని బాబా సదా రక్షిస్తూ ఉంటారు.


మేము బెంగళూరులో ఉండగా ఒక గురువారంరోజున నేను, నా భార్య, మా మనవడు స్కూటర్ మీద బాబా గుడికి వెళ్తూ మధ్యలో పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకుని బయల్దేరాము. మేమున్న రోడ్డునుండి కాస్త ముందుకి వెళితే మందిరం వస్తుంది. కానీ ట్రాఫిక్ నిబంధనలు అనుసరించి మేము అవతలివైపుకి వెళ్లాల్సి ఉంది. అలా వెళితే మధ్యలో బారికేడ్లు ఉన్నందున చాలా దూరం ముందుకు వెళ్లి యూ-టర్న్ తీసుకుని మళ్ళీ వెనక్కి రావాలి. అందుచేత నా భార్య, "అంత సమయం లేదు. ఆరతికి అందుకోలేము. ఈ కొంచెం దూరమే కదా! ఈ రోడ్డులోనే వెళదాం" అంది. నేను, “బాబా, నీదే భారం” అని వచ్చే వాహనాలకు ఎదురుగా వెళ్ళాను. ఒక నిమిషం ముందుకు వెళ్ళేసరికి మాకు ఎదురుగా ట్రాఫిక్ పోలీస్, ఎస్.ఐ. కనిపించారు. వాళ్ళు మమ్మల్ని ఆపి, లైసెన్స్, బండి కాగితాలు చూపించమన్నారు. లైసెన్స్ ఆంధ్రాలో ఉన్నందున నేను చూపించలేకపోయాను. పోలీసు ఫైన్ కట్టమని, రసీదు పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు. నేను వెంటనే, "ఆదుకోండి బాబా" అని బాబాను ప్రార్థించి ఆ ఎస్.ఐ.తో, “మేము బాబా గుడికి వెళ్తున్నాము. ఆరతికి సమయమవుతున్నందున ఇవతలివైపు రోడ్డులో వచ్చామ"ని చెప్పి, మా చేతిలో ఉన్న పూలు, నైవేద్యం ఉన్న కవరు చూపించి, "మమ్మల్ని పోనివ్వమ"ని అడిగాము. పక్కన ఉన్న పోలీస్ ఒప్పుకోలేదు కానీ, ఎస్.ఐ.గారు మమ్మల్ని పంపించారు. మేము ఆయనకు కృతజ్ఞతలు చెప్పి, బాబా గుడికి వెళ్ళి ఆరతిలో పాల్గొన్నాము. ఈ అనుభవం ద్వారా "చిన్న చిన్న విషయాలలో కూడా సరైన మార్గంలో నడవాలని బాబా తెలియజేశారు".


2015వ సంవత్సరంలో నా మనవడిని స్కూల్లో చేర్పించదలిచాము. అయితే బెంగళూరులో స్కూళ్లన్నీ దూరంగా ఉంటాయి. వ్యాన్లో వెళ్లి రావాలి. తనేమో చిన్నపిల్లవాడు. అందువల్ల 'ఏ స్కూల్లో చేర్చాలా?' అన్న విషయమై తర్జనభర్జన పడ్డాము. ఒకరోజు నేను బెంగళూరులోని బాబా మందిరంలో ఉన్నప్పుడు, “బాబా! సాయీష్‍ని ఏ స్కూల్లో చేర్పించాలి?” అని బాబాను అడిగాను. బాబా ఒక స్కూలు పేరు సూచించారు. బాబా చెప్పారు కనుక మా అమ్మాయివాళ్ళు సాయీష్‍ని అదే స్కూల్లో చేర్పించి, తాము ఉండే అద్దె ఇంటికి స్కూలు మరీ దూరం కాదులే అనుకున్నారు. కానీ భవిష్యత్తు తెలిసిన బాబా ఆ స్కూలు పేరే ఎందుకు సూచించారో నాలుగు సంవత్సరాల తర్వాతగానీ మాకు తెలియలేదు. వివరాలలోకి వెళితే, పెళ్ళైనప్పటినుండి మా అమ్మాయివాళ్లు 2005 నుండి 2013 వరకు అడ్వాన్స్‌గా 10 నెలల అద్దె చెల్లించి బెంగళూరులోని ఒక అద్దింట్లో ఉండేవాళ్ళు. ఆ ఇంటి యజమాని ప్రతి 6 నెలలకు ఒకసారి అద్దె పెంచుతుండేవాడు. అందువల్ల మా అమ్మాయివాళ్ళు ఆ అద్దె డబ్బులకు ఇంకొంచెం డబ్బు జతచేసి, నెలనెలా లోను కట్టుకుంటూ ఒక సొంత ఇల్లు కొనుక్కుందామనుకుని ఎన్నో ప్లాట్లు చూశారు. కానీ, వాటిలో ఏ ప్లాటూ తీసుకోవడానికి బాబా అనుమతిని ఇవ్వలేదు. చివరికి బాబు స్కూలుకు ఎదురుగా ఉన్న అపార్టుమెంటులో ఇల్లు తీసుకోవడానికి బాబా అనుమతించారు. ఆ ఇల్లు అన్నిటికీ సౌకర్యవంతంగా ఉంటుంది. ముఖ్యంగా మా మనవడికి స్కూలు బాగా దగ్గరయ్యింది.


ఒకసారి మేము, "మా అమ్మాయివాళ్ళకి ఒక స్వంత ఇల్లు అమర్చండి బాబా" అని బాబాను వేడుకున్నాము. అలా బాబాను అడిగిన కొన్నిరోజులకే చాలా తక్కువ ధరలో, అన్నివిధాలా సౌకర్యంగా ఉండే కొత్త ఫ్లాట్‍ను బాబా ఇప్పించారు. అదెలాగంటే, ఒకరోజు నా భార్య, తన స్నేహితురాలు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. మాటల మధ్యలో నా భార్య స్నేహితురాలు, "మేము ఒక అపార్టుమెంటులో ఫ్లాట్ తీసుకున్నాము. మీరూ తీసుకుంటారా?" అని అడిగింది. మాకెందుకో ఆమెతో బాబానే ఆ మాట చెప్పిస్తున్నారనిపించి, 'ఆ అపార్టుమెంటులో ఫ్లాట్ తీసుకోవాలా?, వద్దా?” అని బాబాను అడిగితే, బాబా తీసుకోమన్నారు. ఇంక ఆ అపార్టుమెంటు ఓనరుకి ఫోన్ చేసి వివరాలు అడిగితే, “రెండు రోజుల్లో డబ్బు కట్టినవారికి చాలా చాలా తక్కువలో ఫ్లాట్ ఇస్తాము" అని చెప్పారు. అయితే సమయానికి మా వద్ద డబ్బు లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోలేదు. అయినా బాబానే చూసుకుంటారనుకున్నాము. అదేరోజు సాయంత్రం మా మామగారు వచ్చి డబ్బు ఇచ్చారు. వెంటనే వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చి అపార్టుమెంట్ బుక్ చేసుకున్నాము. ఆరోజు గురువారం. అడ్వాన్స్ సరే, మరి మిగిలిన డబ్బు ఎలా? ఆ డబ్బు కూడా బాబా ఎలా ఏర్పాటు చేశారో చూడండి. మా అల్లుడు ముందు ఎల్.ఐ.సి. లోన్ పెడితే, ఇవ్వలేదు. సరేనని, బ్యాంకులో లోన్‍కి అప్లై చేశారు. ప్రాసెస్ నడుస్తుండగా ఒకరోజు మా అమ్మాయి, అల్లుడు బ్యాంకుకి వెళ్లి అక్కడున్న ఒక లేడీ ఆఫీసరుని కలిసి, “మా లోన్ విషయం ఏమైంది?" అని అడిగారు. అందుకామె, “మీకు లోన్ ఇవ్వడం కుదరదు” అని చెప్పింది. ఆమె ముందున్న కంప్యూటర్ స్క్రీన్ మీద ఉన్న బాబా ముఖచిత్రం చూసిన మా అమ్మాయి ఆమెతో, “మేమూ బాబా భక్తులం. ఈ ఫ్లాట్ బాబా ద్వారా మాకు వచ్చింది. ఇంకోసారి కంప్యూటర్‌లో చెక్ చేసి చూడండి” అని అడిగింది. అప్పుడు ఆ లేడీ ఆఫీసర్, "ఈ రోజుల్లో అందరూ సాయిభక్తులమని చెప్పుకునేవారే” అని కొంచెం వ్యంగ్యంగా అంది. ఆ మాటలకు మా అమ్మాయి కొంచెం బాధపడి ఆమెతో, “మీరు లోన్ ఇవ్వకపోయినా ఫరవాలేదు. మీరు బాబా భక్తులై ఉండి నిజమైన భక్తులను గుర్తించడం లేదు. మా భక్తి, విశ్వాసాలు బాబాకి తెలుసు. లోన్ విషయం ఆయనే చూసుకుంటారు" అని చెప్పి వచ్చేసింది. బాబా ఊరుకుంటారా? వారం తిరక్కుండానే లోన్ శాంక్షన్ అయినట్టు బ్యాంకు నుండి లెటర్ వచ్చింది. ఇంకేముంది? మా అమ్మాయివాళ్ళు గుంటూరులో ఒక అపార్టుమెంటు కొన్నారు. 'కొన్నారు' అనే కంటే 'బాబానే ఇప్పించారు' అనడం నూటికి నూరుశాతం సమంజసం. ఆయన కృపవల్ల వచ్చిన లోన్‍ని నెలనెలా తీర్చటం అయింది. అంతా ఆ సాయినాథుని దయ.


బాబాకి భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు తెలుస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన చెప్పేది జరగకపోవడం అనేది అసంభవం. అక్షరాలా, నూటికి నూరుపాళ్ళు జరిగి తీరుతుంది. అందుకే మేము ఏ విషయమైనా, చిన్నదైనా, పెద్దదైనా బాబాని అడిగి వారి నిర్ణయం ప్రకారం నడుచుకుంటాము. వారి సందేశం సచ్చరిత్ర లేదా ఇతర గ్రంథాల ద్వారా, స్వప్నం ద్వారా, వ్యక్తుల ద్వారా, టీవీ ద్వారా ఇంకా అనేక మార్గాలలో మనకు అందుతుంది. కానీ ఎఱుక కలిగివున్నవారికే అవి మన సమస్యలకు సమాధానాలని అర్థమవుతాయి. ఇకపోతే, 'బాబాని అడుగుతామ'ని పదేపదే చెప్తున్నారు, 'ఎలా అడుగుతారు?;' అని మీకు సందేహం రావచ్చు. మేము పెద్ద సమస్యలైతే చీటీల ద్వారా, చిన్న సమస్యలైతే బాబా సమాధికి తాకించి తెచ్చుకున్న నాణెం ద్వారా ఖచ్చితమైన జవాబును బాబా నుండి పొందుతాము. అలా, రోజూ మేము ఏదో ఒక విషయంలో బాబాని సంప్రదిస్తుంటాము. మేమే కాదు, మీరు కూడా సాయిభక్తులైతే మీ సమస్యను బాబాకు విన్నవించుకుని ప్రశ్న అడగవచ్చు. నిజమైన భక్తితో మనస్ఫూర్తిగా సమస్యను బాబా ముందు పెడితే, నూటికి నూరుపాళ్ళు మనకు ఏది మంచిదో అది బాబా మనకి సెలవిస్తారు. కానీ మనం మన మనస్సు చెప్పేది వినకుండా ఆయన సెలవిచ్చింది అక్షరాలా పాటించాలి. అలా అయితేనే మనం బాబాను అడగాలి. అలాకాక బాబాని పరీక్షించడానికి అడగరాదు.  అప్పుడే రెండో ప్రశ్నకు, మూడో ప్రశ్నకు అలా ఎన్ని ప్రశ్నలకైనా బాబా సమాధానం సరిగ్గా వస్తుంది. సరే, బాబా మాకు ప్రసాదించిన అసంఖ్యాక అనుభవాలను ఆనందించండి.

ఒకరోజు ఉదయం నేను స్నానం చేసి బాబా పూజ చేసుకుంటున్నాను. టీవీలో ‘శిరిడీసాయి’ సినిమాలోని పాట వస్తుంది. హారతి ఇస్తుండగా, టీవీలో వస్తున్న పాటలో “హారతి దర్శించండి. అంతా మేలు జరుగుతుంది” అనీ, ఊదీ పెట్టుకుంటుండగా, “ఊదీ ధరించండి. అంతా బాగుంటుంది” అనీ, నా పూజయ్యాక, "బాబా! నా కుటుంబాన్ని ఎల్లప్పుడూ కాపాడు తండ్రీ” అని బాబాను ప్రార్థిస్తున్న మరుక్షణం "నేను ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటాను" అనీ వచ్చింది. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగింది కాదు, అలా బాబా అనుగ్రహించారు.


ఒకరోజు మా పిన్నిగారు, “ఒక ఆశ్రమంవారు కొంతమందిని ఉచితంగా అయోధ్య చూడటానికి తీసుకుని వెళుతున్నారు, మీరూ మాతో వస్తారా?" అని అడిగారు. మేము వెళదామనుకుని ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకుని ఆరోజు కోసం ఎదురుచూస్తుండగా, ప్రయాణానికి రెండు రోజుల ముందు టీవీలో మేము అనుకోకుండా, 'అయోధ్యలో చాలా గొడవలు, రాస్తారోకోలు జరుగుతున్నాయి. ఈ సమయంలో అక్కడికి ప్రయాణం ఇబ్బందికరం' అన్న వార్త చూశాము. అంటే, మేము మా ప్రయాణం గురించి బాబాను అడగకపోయినా ఆయన, "అయోధ్య వెళ్ళవద్దని” టీవీ ద్వారా మమ్మల్ని హెచ్చరించారు. దాంతో మేము అయోధ్య వెళ్ళలేదు. కానీ, మా పిన్నిగారు వెళ్లొచ్చారు. ఆవిడ, "ప్రయాణంలో చాలా బాధలు, కష్టాలు పడ్డాము. మీరు రాకపోవడమే మంచిదయింది" అని అంది. ఆ మాట వినగానే మేము బాబా ఫోటో వైపు చూసి, మమ్మల్ని వెళ్ళకుండా ఆపినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నాము.


మనకు వచ్చే సందేహాలు చిన్నవైనా, పెద్దవైనా బాబా వాటిని నివృత్తి చేస్తారు. నేను సూర్యనమస్కారాలు చేసేటప్పుడు 'సూర్యాయ నమః', 'ఆదిత్యాయ నమః', 'భాస్కరాయ నమః' అని వరుస క్రమంలో చదవకుండా అటుది ఇటు, ఇటుది అటు చదివేవాడిని. అయితే ఒకరోజు, "బాబా! వాటిని వరుస క్రమంలో ఎలా చదవాలి?" అని బాబాను అడిగాను. చిత్రంగా అదేరోజు అనుకోకుండా నేను టీవీ చూస్తూ సూర్యనమస్కారాలు ఎలా చదవాలో విన్నాను. అలాగే కృష్ణపక్షం, బహుళపక్షంలలో ఏది ముందో, ఏది వెనుకో నాకు అర్థమవకపోతే అదేరోజు సచ్చరిత్రలో వాటి గురించి వివరంగా చదివేలా అనుగ్రహించారు బాబా.


ఒక గురువారం పూజ అయిన తర్వాత మేము మా అమ్మాయివాళ్ళు మా వద్దకు వచ్చి చాలా రోజులైందని, “మా అమ్మాయిని, అల్లుడిని, మనుమడిని ఇక్కడకు రప్పించండి బాబా” అని వేడుకున్నాము. వాళ్ళు ఉండేది బెంగళూరులో. అప్పట్లో ఫోన్లు లేవు. ఆరోజు సాయంత్రం టీవీ చూస్తుంటే కింద స్క్రోలింగ్‌లో, 'ప్రయాణం' అనే పదం నా భార్యకు కన్పించింది. వెంటనే తన మనసుకు 'మా అమ్మాయివాళ్ళు ప్రయాణంలో ఉన్నట్టు, ఇక్కడికే వస్తున్నట్లు' అనిపించింది. అదే నిజమైంది. మరుసటిరోజు ఉదయానికి మా అమ్మాయివాళ్ళు మా ఇంటికి రానే వచ్చారు. 'ప్రయాణం' అంటే, వాళ్ళు ప్రయాణంలో ఉన్నారన్న స్ఫురణను నా భార్యకు బాబానే కలిగించారు. అడగ్గానే బాబా మా కోరిక తీర్చారు.


తరువాయి భాగం వచ్చేవారం...

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 


 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 


2 comments:

  1. Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo