సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1335వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • తిరిగి దరికి చేర్చుకుని, సమాధానపరచిన బాబా 

ముందుగా ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి చాలా కృతజ్ఞతలు. నేను ఒక చిన్న సాయిభక్తురాలిని. నేను ఇటీవలే MBBS పూర్తిచేశాను. బాబా దయవల్ల నేను 2022, సెప్టెంబర్ మొదటివారం నుండి ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతున్నాను. ఈ బ్లాగు వల్ల భక్తుల భక్తి, విశ్వాసాలు రెట్టింపు అవుతున్నాయి. నేను ఏ బాధలో ఉన్నా ఈ బ్లాగు ఓపెన్ చేయగానే నా సమస్యకి తగ్గట్టు బాబా తమ భక్తుల అనుభవాలను చూపించి నాకు ధైర్యాన్ని ఇస్తున్నారు. ఆ బాబానే ఈ బ్లాగును నడుపుతున్నారు. ఆ తండ్రి పాదాలకు విన్నవించుకుంటున్న భావనతో నేనిప్పుడు నా అనుభవాలు మీతో పంచుకుంటాను. నేను చిన్నవయస్సులోనే మా అమ్మతో బాబా గుడికి వెళ్తుండేదాన్ని. కానీ బాబా లీలల గురించి ఏమీ తెలీదు. పెద్దయ్యేకొద్దీ నేను బాబాకి కొంచెం దూరమయ్యాను. కానీ బాబా తన భక్తులను ఏదో ఒక విధంగా తమ దగ్గరకు తెచ్చుకుంటారు కదా! నా విషయంలో కూడా అదే జరిగింది. ఇంటర్ చదివేటప్పటినుండి నేను నేనుగా లేను. ఎన్ని బాధలు పడ్డానో బాబాకే తెలుసు. ఆ బాధల కారణంగా నాకు దేవుడిపై కోపం వచ్చి, దైవం పట్ల నమ్మకం, భక్తి సన్నగిల్లాయి. 2018లో మా అమ్మ నేను పడే బాధని చూడలేక ఒక జ్యోతిష్యుని దగ్గరకు నన్ను తీసుకువెళ్ళింది. అతను మా అమ్మవాళ్ళని బయటకు పంపి, నన్ను అమ్మవారి గర్భగుడిలో కూర్చోబెట్టి నా గురించి చాలా ప్రతికూలంగా మాట్లాడాడు. నేను ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదని, రాముడు నా దగ్గర ఉండలేడని, ఇంకా చాలా మాటలు అమ్మవారి మీద ఒట్టు వేసి మరీ అన్నాడు. సున్నిత మనస్కురాలినైన నేను ఆ మాటలన్నీ విని మానసికంగా కృంగిపోయాను. అమ్మావాళ్లు బాధపడతారని అతను చెప్పిన విషయాలేవీ నేను వాళ్లతో చెప్పలేదు. కానీ నేను ఆరోజు నుండి జాతకాల పిచ్చిలో పడిపోయి, 'జ్యోతిష్యం ఉన్నప్పుడు, దేవుడు ఉండి ఏం లాభం? నా జీవితాన్ని గ్రహాలు నడిపిస్తుంటే, నేను బ్రతికి ఏం లాభం? ఎన్ని పూజలు, హోమాలు చేసినా అదే కర్మను అనుభవిస్తుంటే, పూజల వలన ఏం లాభం? నా జీవితం ఇలానే ఉంటుందని, ఫలానా సమయానికి ఇలానే అవుతుందని జ్యోతిష్యం చెపుతుంటే, అదంతా తెలిసి జీవించి ఏం లాభం?' ఇలా నా మనసులో ఎన్నో సందేహాలు. అలా కొన్ని నెలలు గడిచాక బాబాకి అపార భక్తులైన మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ శిరిడీ వెళదాం, రమ్మంటే ఎటువంటి ఆశ లేకుండా నేను వాళ్లతో శిరిడీ వెళ్ళాను. మా ఆంటీ బాబా తనకి ప్రసాదించిన అనుభవాలను ప్రయాణ సమయమంతా పంచుకుంటుంటే దైవం మీద భక్తి కోల్పోయిన నేను అదంతా ఆవిడ వెర్రితనం అనుకున్నాను. కానీ సమాధిమందిరంలోకి అడుగుపెట్టి బాబాని చూస్తూనే నాకు కన్నీళ్లు ఆగలేదు. ఎందుకో తెలీదుగానీ గుండెల్లో ఉన్న భారమంతా ఒక్కసారిగా పోయింది. బాబానే మా ఆంటీ ద్వారా నన్ను తమ చెంతకు రప్పించుకున్నారని అనిపించింది. తరువాత ఆంటీ నన్ను పారాయణ హాల్లోకి తీసుకుని వెళ్లి, శ్రీసాయిసచ్చరిత్ర పుస్తకం నా చేతికిచ్చి నాకున్న ప్రశ్నలను బాబాని అడగమని చెప్పింది. నేను, 'ఈ ఒక్క పుస్తకంలో నాకు కావాల్సిన సమాధానాలన్నీ ఎలా దొరుకుతాయి?' అన్న అనుమానంతోనే బాబాను ప్రశ్న అడిగి పుస్తకం తెరిచి అక్కడున్నది చదివాను. నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. జాతకరీత్యా పిల్లలు పుట్టరన్న దామూఅన్నాకు సంతానాన్ని అనుగ్రహించిన తమ లీలను బాబా నా చేత చదివించారు. తద్వారా 'జాతకాలను నమ్మవద్ద'ని తెలియజేసి నా మానసికవ్యధను, అనుమానాలన్నిటినీ చిటికెలో మాయం చేశారు బాబా. సర్వమూ ఆ సాయే అయినప్పుడు ఆ గ్రహాలు కూడా ఆయనే కదా! ఈ లోకాన్ని నడిపిస్తున్న ఆ సాయికి సాధ్యం కానిది ఏమీ లేదు. కాబట్టి సాయిభక్తులమైన మనం ఏ జాతకదోషాలకు భయపడవలసిన అవసరం లేదు. భక్తితో బాబాని నమ్ముకుంటే అంతా ఆయనే చూసుకుంటారు. ఆయన నాకు అంత గొప్ప అనుభూతినిచ్చినందుకు నేను ధన్యురాలిని.


ఇకపోతే, 'తమకి ఉపవాసం, పూజలు అక్కర్లేదని, జాతకాలను నమ్మి పూజలు చేసుకుంటూ సమయాన్ని వృథా చేసుకోవద్ద'ని వేరొక ప్రశ్నకు బాబా సమాధానం ఇచ్చారు. రెండవరోజు వేరొక విషయం గురించి తెలుసుకోవాలని పారాయణ హాల్లోకి వెళ్లి, "ఎంతో మంచి చేస్తూ, ఎవరికీ ఏ హాని చేయకుండా ఉండేవాళ్ళకి ఎప్పుడూ కష్టాలే ఎందుకు? అనేక పాపాలు చేసి, ధర్మానికి, దైవానికి భయపడకుండా ఉండేవాళ్ళకి అంతా మంచే ఎందుకు జరుగుతోంది?" అని బాబాను ప్రశ్నించాను. అప్పుడు సచ్చరిత్రలోని ఈ క్రింది వివరణ వచ్చింది.


శ్రీసాయిబోధనకు ప్రత్యేక స్థలముగానీ, ప్రత్యేక సమయముగానీ అక్కరలేదు. సందర్భావసరములను బట్టి వారి ప్రబోధము నిరంతరము జరుగుచుండెను. ఒకనాడొక భక్తుడు ఇంకొక భక్తుని గురించి పరోక్షమున ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్తసోదరుడు చేసిన తప్పులనే ఎన్నుచుండెను. మిక్కిలి హీనమైన అతని దూషణలు విన్నవారు విసిగిరి. అనవసరముగా ఇతరులను నిందించుటచే అసూయ, దురభిప్రాయము మొదలగునవి కలుగును. యోగులు నిందలను ఇంకొక విధంగా భావించెదరు. మలినమును పోగొట్టుటకు అనేక మార్గములు కలవు. సబ్బుతో మాలిన్యమును కడుగవచ్చును. పరులను నిందించువాని మార్గము వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరచును. ఒక విధముగా, వాడు నిందించువానికి సేవ చేయుచున్నాడు. ఎట్లన, వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు. కావున, తిట్టబడినవాడు తిట్టినవానికి కృతజ్ఞతలు తెలుపవలెను. అట్లు పరనిందకు పాల్పడినవానిని బాబా సరిదిద్దిన పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధమును సర్వజ్ఞుడైన బాబా గ్రహించిరి. మిట్టమధ్యాహ్నము బాబా లెండీతోటకు పోవునప్పుడు వాడు బాబాను దర్శించెను. బాబా వానికొక ఒక పందిని చూపి ఇట్లనెను: “చూడుము! ఈ పంది అమేథ్యమును ఎంత రుచిగా తినుచున్నదో! నీ స్వభావము కూడా అట్టిదే! ఎంత ఆనందముగా నీ సాటి సోదరుడిని తిట్టుచున్నావు! ఎంతో పుణ్యము చేయగా నీకు ఈ మానవజన్మ లభించినది. ఇట్లు చేసినచో శిరిడీ దర్శనము నీకు తోడ్పడునా?” బాబా మాటల భావమును గ్రహించిన ఆ భక్తుడు తను చేసిన తప్పుని తెలుసుకొని బాబాను క్షమాపణ వేడుకొనెను. ఈ విధముగా బాబా సమయము వచ్చినప్పుడల్లా ఉపదేశించుచుండెడివారు. ఈ ఉపదేశములను మనస్సునందుంచుకొని పాటించినచో ఆత్మసాక్షాత్కారము దూరము కాదు.


అది చదివాక, 'ఈ లోకంలో ఏది మంచో, ఏది చెడో నిర్దేశించడానికి మనమెవరం? అంతా ఆ భగవంతునికి తెలుసు. మనం మంచి చేశామని, వాళ్లు చెడు చేశారని అనుకోవడం వల్ల మనసులో అశాంతి చోటు చేసుకోవడం తప్ప ఏ ప్రయోజనం ఉండదు. 'మనకి బాబా ఉన్నారు. మనం ఎలా ప్రవర్తిస్తున్నాం?' అని చూసుకుంటే చాలు, ప్రశాంతంగా ఉంటాం. ప్రశాంతంగా ఉంటే దైవానికి సులువుగా చేరువవుతాము' అని నాకు అనిపించింది. అప్పటినుంచి 'ఎవరు మంచి/చెడు చేస్తున్నారు' అన్నది పట్టించుకోవడం మానేశాను. దానివల్ల నా జీవితంలో ప్రశాంతత వచ్చింది.


బాబా మన సందేహాలను తీర్చి సన్మార్గంలో నడిపించే గురువు, కోరికలను తీర్చే దైవం, మంచి స్నేహితుడు. సమయానుసారం ఆయన మనల్ని కనిపెట్టుకుని ఉంటారు. ఆయన నాకు ఆధ్యాత్మికంగా సహాయం చేసి నన్ను మంచి మార్గంలో నడిపిస్తున్నారు. నేను మానసికంగా చాలా బాధలు పడ్డాను. వాటిని బాబాకి తప్ప ఎవరికీ చెప్పుకోలేను. బాబా లేకుంటే నేను MBBS అంత తేలికగా పూర్తిచేయగలిగేదాన్ని కాదు. "ధన్యవాదాలు బాబా! నేను ఇంకా ఒక సమస్యతో బాధపడుతున్నాను. అందరిలా నేను యుక్తవయస్సును అనుభవించలేకపోతున్నాను. నేను చాలా కోల్పోయాను. ఇప్పుడు కూడా నాకు ఇష్టమైనది వదిలేసుకోవాలని అనకండి బాబా, తట్టుకోలేను. దయచేసి నా సమస్యను నాకు అనుకూలంగా పరిష్కరిస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాను బాబా. మీరు త్వరగా అనుగ్రహిస్తే, ఆ అనుభవాన్ని ఈ బ్లాగు ద్వారా తోటి భక్తులందరితో పంచుకుంటాను. దయచేసి త్వరగా పరిష్కరించరా బాబా...?"


చివరిగా ఇంకో చిన్న అనుభవం: ఇటీవల నాకు విపరీతమైన తలనొప్పి వచ్చి టాబ్లెట్స్ వేసుకున్నా తగ్గలేదు. అప్పుడు నేను బాబాని తలచుకుంటే, వెంటనే నొప్పి తగ్గి, మళ్ళీ రాలేదు. "ధన్యవాదాలు సాయీ. నేను అడగకుండానే ఇంతకాలం నాకు మీరు చాలా సహాయం చేశారు. ఇకమీదట కూడా అలానే తోడుగా ఉంటారని ఆశిస్తున్నాను సాయీ". ఇంతవరకు ఓపికగా సాయి నాకు ప్రసాదించిన అనుభవాలను చదివిన మీకు ధన్యవాదాలు. మరెన్నో అనుభవాలు మీతో పంచుకునేలా బాబా నన్ను అనుగ్రహిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.


6 comments:

  1. Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. ఓమ్ సాయి శ్రీ సాయి జయ జయ సాయి
    ఓమ్ సాయి శ్రీ సాయి జయ జయ సాయి
    ఓమ్ సాయి శ్రీ సాయి జయ జయ సాయి
    ఓమ్ సాయి శ్రీ సాయి జయ జయ సాయి
    ఓమ్ సాయి శ్రీ సాయి జయ జయ సాయి
    ఓమ్ సాయి శ్రీ సాయి జయ జయ సాయి

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo