సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1313వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆటంకాలు లేకుండా సవ్యంగా సంబరం జరిపించిన బాబా
2. అర్థరాత్రి విపరీతమైన చెవినొప్పి నుండి కాపాడిన శ్రీసాయినాథుడు

ఆటంకాలు లేకుండా సవ్యంగా సంబరం జరిపించిన బాబా


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. నేను సాయిభక్తురాలిని. ఈరోజు నేను 2022, ఆగస్టు నెల, రెండవ వారాంతంలో మేము చేయించిన శ్రీవీరభద్ర సంబరం గురించి సాయిబంధువులతో పంచుకుంటున్నాను. నిజానికి నేను ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని మొక్కుకోలేదు. కానీ సాయి ఎంతో సవ్యంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా సంబరాన్ని జరిపించిన తీరును నేను పంచుకోకుండా ఉండలేను. నేను 3 లేదా 4 సంవత్సరాల క్రితం, 'ఒక కోరిక తీరితే మా ఊరిలోని శ్రీవీరభద్రునికి సంబరం చేయిస్తాన'ని మొక్కుకున్నాను. అప్పట్లో అమ్మ, నాన్న ఇద్దరూ మా ఊర్లో ఉండేవాళ్లు. నా అన్నదమ్ములిద్దరూ దగ్గరలో ఉన్న టౌన్‍లో ఉంటున్నారు. మాకు ఏ పని ఉన్నా వెళ్లి, వస్తుండేవాళ్ళం. 2021, మే నెల కరోనా సెకండ్ వేవ్‍లో మా దురదృష్టం వల్ల అమ్మ, నాన్న ఇద్దరూ మాకు దూరమయ్యారు. అప్పటినుంచి ఊరిలో ఉన్న ఇల్లు తాళం వేసి ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ఫర్నిచర్, వంటసామాను అంతా ప్యాక్ చేసి పెట్టేశాము. అందువల్ల ఎప్పుడు ఊరు వెళ్ళినా గదులు దుమ్ముతో నిండిపోయి, కాఫీ పెట్టుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాలో ఎవరికి వీలైతే వాళ్ళం ఊరెళ్ళి ఇల్లు క్లీన్ చేయించి వస్తున్నాము. ఇలాంటి పరిస్థితిలో ఊరిలో సంబరం చేయడానికి నేను చాలా టెన్షన్ పడి ఒక వారం ముందే ఊరెళ్ళి అక్కడ అన్నీ అమర్చుకోవాలని అనుకున్నాను. కానీ బుర్రంతా ఏవేవో ఆలోచనలు తిరుగుతూ 'ఎలా చేయగలమో!' అని కొంచెం ఒత్తిడిగా అనిపించి, "అంతా సవ్యంగా జరిపించమ"ని రోజూ బాబాకి మ్రొక్కుకుంటుడేదాన్ని. బాబా (మా ఊరిలోని) తమ గుడిలో ప్రతి గురువారం భోజనాలు తయారుచేసే ఆమె చేత మేము సంబరం చేసేరోజు దేవుడికి నైవేద్యం, ముందురోజు వచ్చే అతిథులకు ఆహారం తయారుచేసి ఇవ్వడానికి ఒప్పుకునేలా అనుగ్రహించారు. దాంతో నాకు 3 వంతుల భారం దిగిపోయి వారం ముందుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది.


ఇకపోతే నెలసరి టెన్షన్. సరిగ్గా సంబరం అనుకున్న సమయానికే నాకు నెలసరి వచ్చే సమయం కావడంతో నేను చాలా ఆందోళన చెందాను. కానీ బాబా దయతో ఆ సమస్యను ముందు నెల నుంచే కొంచెం ముందుకు జరుపుతూ సంబరానికి 4 రోజుల ముందే సమస్య అంతా సమసిపోయేలా అనుగ్రహించారు. మా పాప విషయంలో మాత్రం 1వ తారీఖున రావాల్సిన నెలసరి ఎంతకీ రాకపోయేసరికి ఇక టాబ్లెట్లు వాడక తప్పదనుకున్నాను. కానీ తనకి టాబ్లెట్లు పడవు. పైగా టాబ్లెట్లు వేయడమంటూ మొదలుపెడితే పూజ పూర్తయ్యాక కూడా చాలారోజులపాటు తను టాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే, సంబరం తరువాత తను హైదరాబాదులోని ఆఫీసుకి  వెళ్లాల్సి ఉంది. ఆ కారణాలతో చాలా టెన్షన్ పడి, "బాబా! పాపకి నెలసరి వచ్చేసేలా చేయండి" అని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. బాబా అనుగ్రహం వల్ల సంబరానికి ఇబ్బంది లేకుండా తనకి నెలసరి వచ్చేసింది.


ఇక అతిథుల విషయానికి వస్తే, పెళ్ళిళ్ళు వంటి చాలా శుభకార్యాలు ఉండడం వల్ల నేను అనుకున్నవాళ్ళు రాలేదు. ఇంకా ఊరిలో నాకు సహాయంగా ఉంటారని భావించిన వాళ్ళు వేరే పనుల వల్ల కుదరక రాలేదు. అయినా వేరేవాళ్ళ ద్వారా నాకు సహాయం అందేలా చేసి ఎంతో అందంగా, చాలా వైభవంగా పూజ జరిగేలా బాబా అనుగ్రహించారు. తల్లితండ్రులు లేకపోయినా వాళ్ళ బాధ్యతను తామే వహించి అన్నీ దగ్గరుండి జరిపించినట్లు సవ్యంగా నా మొక్కు తీర్చుకునేలా బాబా అనుగ్రహించారు. ఆయనకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో నాకు తెలియటం లేదు.


సంబరం పూర్తయిన మర్నాడు ఒక బీరువా తాళం కనిపించలేదు. పిల్లలు ఆడుతూ ఎక్కడైనా పడేశారేమో అని అనుకున్నాం. ఆ బీరువాలో ముఖ్యమైన డాక్యుమెంట్లు ఉండటం వల్ల అవి అవసరమైతే ఇబ్బంది అవుతుందని మా తమ్ముడు చాలా టెన్షన్ పడ్డాడు. కానీ నేను 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అనుకుని మామూలుగా ఆ తాళాలు ఎక్కడ పెడతామో అక్కడ మళ్ళీ వెతికితే, అవి పరుపు కవరులోకి వెళ్ళిపోయి ఉన్నాయి. నిజానికి మావారు, మా మరదలు ఆ చోటంతా అదివరకే వెతికారు. నేను వెతకబోతుంటే, ఇక అక్కడ వెతికే పని లేదన్నారు. కానీ నేను బాబాని తలచుకుని వెతికినంతనే ఆ తాళాలు దొరికాయి. "థాంక్యూ వెరీ వెరీ మచ్ బాబా. అన్నిటికీ నువ్వు ఉన్నావని నిదర్శనం ఇస్తున్నావు తండ్రీ. సంబరం బాధ్యత వహించినట్లే మా అమ్మాయి పెళ్ళి బాధ్యత కూడా మీదే బాబా. ఇంకా నా మనసులో ఉన్న కోరిక కూడా తీరేలా చూడు సాయీ".


ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


అర్థరాత్రి విపరీతమైన చెవినొప్పి నుండి కాపాడిన శ్రీసాయినాథుడు


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


నా పేరు కుమార్. నా వయసు 42 సంవత్సరాలు. మేము హైదరాబాదులో ఉంటాము. శ్రీసాయితో నాకు చాలా అనుబంధం ఉంది. ఆయన ఎంతో దయతో నన్ను, నా కుటుంబాన్ని ఎన్నోసార్లు ఎన్నోవిధాల కాపాడారు. ఆ అనుభవాలన్నింటిని కలిపితే ఒక పెద్ద పుస్తకమే అవుతుంది. నేను ఇదివరకు కొన్ని అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా సాయిబంధువులందరితో పంచుకున్నాను. ఇప్పుడు శ్రీసాయినాథుడు అర్థరాత్రివేళ విపరీతమైన చెవినొప్పి బారినుండి మా అబ్బాయిని ఎలా కాపాడారో పంచుకోబోతున్నాను. మా అబ్బాయి పేరు ఈశ్వర్. వాడికి 4½ సంవత్సరాల వయసు. వాడు ఒక శనివారం సాయంత్రం 5 గంటల వరకు చక్కగా ఆడుకున్నాడు. ఆ తరువాత కొద్దిసేపటికి చెవినొప్పి అని ఏడవడం మొదలుపెట్టాడు. మేము అంతగా పట్టించుకోలేదు. ఇంకొంచెంసేపటి తరువాత నొప్పి ఎక్కువైందని మరింత గట్టిగా ఏడవసాగాడు. దాంతో ఇన్ఫెక్షన్ ఏమోనని మెడికల్ షాపుకి వెళ్ళి ఇయర్ డ్రాప్స్ తెచ్చి వేశాము. అయినా నొప్పి తగ్గలేదు సరికదా బాధకి తట్టుకోలేక పిల్లవాడు మెలికలు తిరుగుతూ ఏడుస్తుంటే, ఇంట్లో అందరమూ చాలా కంగారుపడ్డాము. ఆందోళనతో ఎవరూ భోజనాలు చేయలేదు. ఎందుకంటే, బాబు అంతలా ఎప్పుడూ ఏడ్చింది లేదు. రాత్రి 10 గంటల సమయంలో ఏ డాక్టర్ దగ్గరకి వెళ్ళాలో తెలియక చాలా సతమతమైన మీదట చివరికి మా ఇంటికి సమీపంలో ఉన్న ఒక పిల్లల డాక్టర్ దగ్గరికి బాబుని తీసుకుని వెళ్ళాము. కానీ ఆ డాక్టర్ క్లినిక్ మూసేసి వెళ్ళిపోయారు. పిల్లాడి పరిస్థితి చూస్తే ఏమీ బాగాలేదు. వాడు ఆ రాత్రి నిద్రపోయేలా లేడనిపించింది. పిల్లాడినలా చూడలేక నేను పూజగదిలోకి వెళ్ళి, మేము రోజూ పూజించే శ్రీసాయినాథుని పటం ముందు నిల్చొని కన్నీళ్ళతో, "సాయినాథా! మీ దయతో పిల్లవాడికి చెవినొప్పి తగ్గి, ప్రశాంతంగా నిద్రపోతే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని చెప్పుకుని, కొద్దిగా ఊదీ తీసుకుని పిల్లవాడి నుదుటి మీద, చెవికి పెట్టి, మరికొంచెం ఊదీని నీళ్ళలో కలిపి ఆ తీర్థాన్ని వాడిచేత తాగించాము. ఆ సమర్థ సద్గురు సాయినాథుని దయవలన సరిగ్గా పది నిమిషాల తరువాత పిల్లవాడు ప్రశాంతంగా నిద్రపోయాడు. మధ్యలో రెండుసార్లు 'నొప్పి' అని లేచి ఏడ్చినప్పటికీ బాబా దయవలన వెంటనే నిద్రపోయాడు. పిలిచిన వెంటనే పలికే దైవం శ్రీసాయినాథుడు. ఈ కలియుగంలో సాక్షాత్తూ ఆ భగవంతుడే ఈ సాయినాథుని రూపంలో సద్గురువు అవతారంలో దీనజనోద్ధరణకై అవతరించారు. సాయినాథుడు లేని జీవితం ఊహించుకోడానికి చాలా కష్టం. సర్వకాల సర్వావస్థలయందు కంటికి రెప్పలా మమ్మల్ని కాపాడుతున్న నా తండ్రి సాయినాథునికి కోటానుకోట్ల కృతజ్ఞతాపూర్వక నమస్కారాలను, అంగాంగ, సర్వాంగ సాష్టాంగ ప్రణామాలను హృదయపూర్వకంగా సమర్పించుకుంటూ... సెలవు.


సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


3 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. సాయి అనుభవాలు చాలా బాగున్నాయి.సాయి అంటే సహాయం చేయకుండా వుండరు.అంత దయ గల దైవం సాయినాథ్.నా నమస్కారాలు నీకు శత కోటి నమస్కారాలు తండ్రి

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo