- శ్రీసాయి అనుగ్రహ లీలలు - తొమ్మిదవ భాగం
సాయిబాబుగారు తమకు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలు గతవారం పంచుకున్నారు. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నారు.
2019, మార్చి 4, మహాశివరాత్రి. ఆరోజు ఇంట్లో పూజయ్యక, "ఇంట్లోనే ఉండి నామం చెప్పుకోవాలా? గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలా?" అని. బాబాను అడిగితే, “గుడికి వెళ్ళమ"ని బాబా సమాధానం వచ్చింది. అయితే, 'ఏ గుడికి వెళ్ళాలి? ఎక్కడ గుడికి వెళ్ళాలి?' అని ఆలోచిస్తుంటే, ముందురోజు టీవీలో, 'పదివేల శివలింగాలకు మీరే స్వయంగా అభిషేకం చేయవచ్చు' అని మేము చూసిన ఒక యాడ్ గుర్తొచ్చింది. అక్కడికి వెళ్ళమని బాబా సంకల్పమేమో అని మాకు అనిపించింది. అయితే ఆ యాడ్ ఒకేఒక్క నిమిషం కనిపించినందువల్ల మేము 'వేమవరం' అన్న ఊరి పేరు మాత్రమే చూసాము, ఫోన్ నెంబర్ చూడలేకపోయాము. అయినా ఆ ఊరి పేరు ఆధారంగా వెళదామని ఇంటి నుండి బయలుదేరాము. కొంత దూరం వెళ్ళాక ఓ చోట నా భార్య అక్కడున్న ఒక వ్యక్తిని “వేమవరం వెళ్లాలంటే, ఎలా వెళ్ళాలి”. అని అడిగింది. అందుకతను, “నాకు తెలియదు” అని చెప్పాడు. నా భార్య నిరాశగా ఒకడుగు వెనక్కి వేసింది. ఇంతలో పక్కనే ఉన్న ఒక కుర్రాడు వేమవరం ఎలా వెళ్ళాలో చెప్పాడు. బాబానే ఆ కుర్రాడితో చెప్పించారని భావించి కృతజ్ఞతలు చెప్పుకుని ఆ కుర్రాడు చెప్పిన రూటులో వెళ్ళాము. ఇరవై నిమిషాల తర్వాత అక్కడికి చేరుకున్నాము. అక్కడ పదివేల శివలింగాలను చూడగానే మాకు ఎంతో ఆనందం కలిగింది. శివరాత్రి రోజున అన్ని పాలరాతి శివలింగాలను దర్శించుకోవడం శుభసూచకంగా భావించాము. ఎదురుగా ఉన్న శివలింగానికి స్వయంగా మేము తీసుకుని వెళ్ళిన కొబ్బరిబోండం తదితర సామగ్రితో స్వయంగా అభిషేకం చేసుకున్నాము. పూజారి తృప్తిగా శివలింగానికి పూజ చేసి అడగకుండానే రెండు అరటిపళ్ళు, గులాబీపూలు, పెద్ద పువ్వు ఉన్న కొబ్బరి చిప్పను ప్రసాదంగా నా భార్య చేతికి ఇచ్చారు. అంతలో ఒక పెద్దాయన చేతిలో మారేడు దళాలతో అక్కడికి వచ్చారు. నా భార్య అతనిని, "రెండు దళాలు ఇస్తారా?" అని అడిగింది. అతను, “తప్పకుండా” అని ఆ మారేడు దళాలు ఇచ్చాడు. నా భార్య వాటిని పూజారికి ఇచ్చింది. ఆయన వాటిని శివలింగం మీద ఉంచారు. మాకు చాలా సంతోషంగా అనిపించి మమ్మల్ని గుడికి వెళ్ళమని ప్రేరేపించి, దారిలో అడ్రసు చెప్పించి, మారేడు దళాలు అందించి తృప్తిగా శివయ్యకు పూజ చేసుకునేలా చేసిన బాబాకి శతకోటి వందనాలు చెప్పుకున్నాము. ఇంకా ఆ రోజు మేము ప్రపంచంలోనే రెండవ పెద్ద స్పటిక లింగాన్ని కూడా దర్శించుకుని ఆ రాత్రి చేబ్రోలులోని శివాలయంలో జరుగుతున్న శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించాలని వెళ్ళాము. అక్కడ “ఎదురుకోలు” ఉత్సవంలో భాగంగా పార్వతీదేవి అమ్మవారి తరుపువాళ్ళు అమ్మవారికి చీర సారె పెట్టి పూజానంతరం వచ్చిన భక్తులకు లడ్డు ప్యాకెట్, పులిహోర, పానకం ఇచ్చారు. తర్వాత అందరం శివాలయానికి బయలుదేరాము. చివరగా నేను, నా భార్య నడుస్తున్నాము. ఓ చోట వీధి మధ్యలో ఒక లడ్డు ప్రసాదం ప్యాకెట్టు పడి ఉండడం మేము చూసి, "ఎవరి ప్రసాదమో జారిపోయి ఉంటుంది. ఏ కుక్కో, ఎలుకో తింటాయిలే" అని ఆ ప్రసాదాన్ని అలాగే వదలి వచ్చేసాము. తరువాత ఆదిదంపతుల కళ్యాణ అక్షింతలు, ఆశీర్వచనాలు తీసుకుని ఆనందంగా మా ఇంటికి చేరుకున్నాము. అలా ఆ సంవత్సరం శివరాత్రి ఉపవాస, జాగరణలతో ఆనందంగా గడిచిపోయింది. ఇదంతా బాబా కృపాకటాక్షం. ఇకపోతే మేము స్నానాలు చేసి బాబాకి దీపారాధన చేశాక నా భార్య బాబా పుస్తకం చదువుతుంటే, “దారిలో పడిఉన్న లడ్డు ప్రసాదం ప్యాకెట్ తీసుకోకుండా వదిలేసి వచ్చారు” అని వచ్చింది. తద్వారా 'కిందపడి ఉన్నా ప్రసాదం ప్రసాదమే. దాన్ని తీసుకోకుండా ఎందుకు వదిలి వచ్చామ’ని బాబా మమ్మల్ని సున్నితంగా హెచ్చరిస్తున్నారని మాకు అనిపించింది. క్రిందపడిన ప్రసాదాన్ని అలా వదిలేయకూడదని బాబా మాకు ఆవిధంగా తెలియజేశారు. మేము తప్పయిందని చెంపలేసుకున్నాము. బాబా సదా మా ముందుండి మమ్మల్ని నడిపిస్తూ, మా మనసులోని భావాలను గ్రహిస్తూ, తప్పు ఒప్పులను తెలియపరుస్తూ ఉంటారని అనడానికి నిదర్శనమే బాబా మాకు ప్రసాదించిన ఈ అనుభవం.
మేము మా కారులో ఒక చిన్న బాబా చిన్న విగ్రహం పెట్టుకున్నాము. విగ్రహం ఉంటే బాబా ఉన్నట్లే గదా! ఒకసారి మేము కారులో తెనాలి వెళ్తుండగా ఓ చోట బ్రిడ్జి మీద ఒక అమ్మాయి స్కూటీ మీద వస్తూ తనంతటతనే మా కారుకి తగిలి బాలెన్స్ చేసుకోలేక ప్రక్కకు పడింది. బాబా దయవలన తనకేమీ కాలేదు. కానీ వెనక వచ్చేవాళ్ళు హడావిడి చేసి, ట్రాఫిక్ పోలీసుని పిలిచారు. అతను వచ్చి అంతా పరిశీలించి, "తప్పు అమ్మాయిదే అనిపిస్తుంది” అని అన్నాడు. ఇంతలో ఆ అమ్మాయి చెప్పాపెట్టకుండా స్కూటీ మీద వెళ్ళిపోయింది. నేను నా ఫోన్ నెంబర్ ఆ పోలీసుకు ఇచ్చి, "ఏదైనా అవసరమైతే, ఫోన్ చేయండి" అని చెప్పి వచ్చేశాను. అయితే ఆ సంఘటన జరిగిన దగ్గర నుండి నా మనసులో, 'ఎప్పుడూ ఇలా జరగలేదు. చెయ్యని తప్పుకి వేరే వాళ్ళతో మాట పడాల్సి వచ్చింది' అని ఏదో తెలియని బాధగా ఉంది. నేను ఆరోజు సాయంత్రం పేపరు చదువువుతుంటే అందులో, “ఉదయం జరిగిన సమస్య తీరిపోయింది. బాధపడవద్దు” అని ఉంది. అది చదివాక నా మనసు తేలికపడింది. చూశారా! బాబా ఎలా ఓదార్చారో. ఇలా చిన్న, పెద్ద సమస్యల నుండి బాబా నన్ను చాలాసార్లు కాపాడారు. మన తప్పులేకపోతేనే సుమా!
బాబా ఊదీ దివ్య ఔషధమని చెప్పటానికి సందేహమే లేదు. ఒకసారి నేను అడుగు తీసి అడుగు వేయలేనంత నడుము నొప్పితో వారం రోజులు చాలా బాధపడ్డాను. పూజ తరువాత ఊదీ నుదుటన ధరించి, మరికొంత ఊదీ నోట్లో వేసుకోవడం నాకు అలవాటు. అలా చేస్తూ ఉన్నా నొప్పి ఏ మాత్రం తగ్గలేదు. వారం రోజులైన తర్వాత నొప్పి భరించలేక డాక్టరుకి చూపించుకుందామనుకున్నాను కానీ, 'బాబా ఉండగా డాక్టరు దగ్గరకి వెళ్ళడమెందుకు?' అని, 'రేపు చూద్దాం, రేపు చూద్దాం' అంటూ రెండు రోజులు గడిపాను. అప్పుడు నా భార్య బాబా పుస్తకం చదువుతుండగా, “ఊదీ తీర్థంతో నేను నీ నడుము నొప్పి తగ్గిస్తాను” అన్న వాక్యం కనిపించింది. వెంటనే ఆమె ఆ వాక్యాలు నాకు చూపించింది. ఇక అప్పటినుండి నేను పూజయ్యక కొంచెం ఊదీ నీటిలో కలిపి ఆ తీర్థాన్ని తీసుకోవడం మొదలుపెట్టాను. రెండోరోజుకి నడవగలిగాను. వారం రోజులు క్రమం తప్పకుండా ఊదీ తీర్ధం తీసుకున్నాక నడుము నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. బాబా చెప్పినట్లు పాటించడం వల్ల నేను ఆ బాధ నుండి విముక్తి పొందాను, బాబా తన భక్తులను వారివారి బాధల నుండి, నొప్పుల నుండి రక్షిస్తారు. మనకు ఆయనపై పూర్తి విశ్వాసం ఉండాలి.
పునర్జన్మను ప్రసాదించిన బాబా: 2010లో నా భార్య అనారోగ్యానికి గురైంది. బాబాని అడిగితే, “వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలి” అని అన్నారు. అయితే మేము కొన్ని కారణాల వల్ల చాలాకాలంపాటు ఆపరేషన్ వాయిదా వేశాము. రెండు సంవత్సరాల తర్వాత ఒకరోజు అర్ధరాత్రి నా భార్యకి బాగా సీరియస్ అయింది. అప్పుడు మేము బెంగుళూరులో ఉన్నాము. మేము ఉండే చోటు నుండి హాస్పిటల్‍కి కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. మా అల్లుడు ఆటో కోసమని వెళ్లి కొంతసేపటికి, 'ఇంత రాత్రివేళ ఆటోలు లేవు, దొరకవు" అని వెనక్కి వచ్చేశాడు. మేము బాబాని స్మరిస్తూ, ఆయనే ఆటో పంపుతారన్న నమ్మకంతో నా భార్యను తీసుకుని రోడ్డు మీదకు వెళ్ళాము. సరిగ్గా అప్పుడే ఒక ఆటో మా దగ్గరకి వచ్చి ఆగింది. అందులో ఇద్దరు యువకులున్నారు. వాళ్ళు మమ్మల్ని, "ఎక్కడికి వెళ్ళాల"ని అడిగితే, "హాస్పటల్"కని చెప్పాము. వాళ్ళు, “ఎక్కండి” అని మమ్మల్ని హాస్పిటల్‍కి చేర్చారు. నేను, “డబ్బులు ఎంత ఇవ్వమంటార"ని అడిగితే, “చిల్లర ఎంత ఉంటే, అంత ఇవ్వండ"ని అన్నారు. అప్పుడు నేను, "నా దగ్గర 30 రూపాయల చిల్లర డబ్బులున్నాయ"ని చెప్తే, “అవిచాలు, ఇవ్వండి” అని తీసుకుని వెళ్ళిపోయారు. మేం కంగారుగా హాస్పిటల్‍లోకి వెళ్ళిపోయాము. తర్వాత ఆలోచిస్తే, 'ఆటోవాళ్ళు ఎలా లేదన్నా కనీసం 200 రూపాయలు తీసుకుంటారు. కానీ వాళ్లు ఇచ్చినంత తీసుకుని వెళ్ళిపోయారు. అనుమానమే లేదు అది బాబా పంపిన ఆటో' అని అనిపించి, 'మనకు అన్నీ ఇచ్చే ఆయనకు కనీస ఛార్జి డబ్బులైన ఇవ్వలేద'ని చాలా బాధపడ్డాను. ఇకపోతే డాక్టరు నా భార్యని చూసి, కొన్ని మందులు వ్రాసారు. ఆ మందులు వాడుతూ ఇంకొక సంవత్సరం గడిపాము. 2013లో నా భార్య బాగా బలహీనపడిపోయి కనీసం నాలుగు అడుగులు కూడా వేయలేని స్థితికి వచ్చింది. అప్పుడు తనని హాస్పిటల్‍కు తీసుకుని వెళ్తే, అన్ని పరీక్షలు చేసి, "ఆమె శరీరంలో కేవలం 4 గ్రాముల రక్తం ఉంది. 12 గ్రాములు ఉండాలి" అని అన్నారు. డాక్టరు నా భార్యతో “నువ్వు కోమాలోకి వెళ్ళవలసిన దానవు, ఇలా ఎలా ఉన్నావ"ని అన్నారు. రోజుకొక బాటిల్ చొప్పున రక్తం ఎక్కించి 12 గ్రాములు అయ్యాక ఆపరేషన్ చేశారు. కావలసిన రక్తం అంతా బాబా ఉచితంగా ఏర్పాటు చేశారు. అలా బాబా సకాలంలో చేయవల్సినవన్నీ చేసి నా భార్యకు పునర్జన్మను ప్రసాదించారు. లేకుంటే కోమాలోకి వెళ్ళి గుండెకు రక్త సరఫరాకాక, పరిస్థితి వేరేవిధంగా ఉండేది. ఇప్పుడు అంతా బాగానే ఉంది. బాబా ఉండగా మనకి భయమెందుకు? ఆ బంగారు తండ్రికి సర్వదా మేము కృతజ్ఞులమై ఉంటాము.
2013లో మేము బెంగుళూరులో ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి 11 గంటల సమయంలో అకస్మాత్తుగా మా అమ్మాయికి శ్వాస తీసుకోవడం ఇబ్బందైంది. వెంటనే మేము పక్కనే ఉన్న ఒక చిన్న డాక్టరుకు చూపిస్తే, ఆయన పరీక్ష చేసి, “శ్వాసలో ఇబ్బంది ఉంది. ఇది గుండెకు సంబంధించినదై ఉంటుంది. మీరు వెంటనే ఈమెను సత్య సాయి హాస్పిటల్‍కి తీసుకుని వెళ్ళండి. వాళ్ళు వెంటనే పరీక్ష చేసి సమస్యేమిటో చెప్తారు. ఇప్పుడే వెళ్ళండి, రేపు ఉదయమైతే చాలా జనం ఉంటార"ని చెప్పారు. ఆ సమయంలో ఆటోలు దొరకక బైక్ మీద నేను, మా అల్లుడు అమ్మాయిని తీసుకుని హాస్పిటల్‍కు బయలుదేరాము. బైక్ బయలుదేరగానే నేను మనసులో, “బాబా! మా అమ్మాయికి గుండెకు సంబంధించిన సమస్య ఏమీ లేదు. అసలు ఈమెకు ఏ అనారోగ్యం లేదు, అంతా బాగానే ఉందని చెప్పించు తండ్రి. నేను మీకు 1000 రూపాయలు దక్షిణ శిరిడీకి పంపుతాను" అని బాబాను వేడుకున్నాను. మేము హాస్పిటల్‍కి వెళ్లినంతనే చకచకా పరీక్షలన్నీ చేసి, హార్ట్ స్పెషలిస్ట్ డాక్టరు కూడా పరీక్షించి, “సమస్యే మీ లేదు. అంతా బాగానే ఉంది. దుమ్ము వలన శ్వాసకు సమస్య వచ్చింది" అని చెప్పారు. ఆ మాట వింటూనే మా కంగారంతా మటుమాయం అయ్యింది. సంతోషంగా బయటికి వచ్చి వెళ్ళిపోతూ గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డుకు 100 రూపాయలు ఇవ్వబోతే, అతను “వద్దండి, బాబాయే మాకు జీతాలు ఇస్తున్నారు. అవి చాలు. మీ అమ్మాయికి ఏమీ లేదన్నారు. చాలా సంతోషం, వెళ్ళిరండి” అని అన్నారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటివారు ఉండబట్టి ధర్మం ఇంకా ఉందనుకున్నాను. తర్వాత బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుని శిరిడీకి దక్షిణ పంపించాను.
నేను బెంగుళూరులో ఉన్నప్పుడు ఒక కంపెనీలో జాబ్ చేస్తుండేవాడిని. ఒకరోజు ఉదయం 8 గంటలకు ఇంటి నుండి కంపెనీకి వెళ్ళడానికి బస్సు ఎక్కాను. నేను దిగాల్సిన స్టేజ్ దగ్గర ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. డ్రైవరు బస్సుని రోడ్డు పక్కకి తీసి ఆపకుండా సరిగ్గా స్పీడు బ్రేకర్ వద్ద బస్సు ఆపి నన్ను దిగమన్నాడు. నేను ఒక కాలు క్రింద పెట్టాను, రెండో కాలు ఇంకా బస్సు చివరి మెట్టు మీద ఉంది. అంతలో అప్రయత్నంగా నేను బస్సు వెనుకకు చూస్తే, ఒక 'మహేంద్ర జీపు' చాలా వేగంగా దూసుకొస్తోంది. దాని వేగాన్ని బట్టి అది నన్ను ఢీకొట్టడం ఖాయమని అర్థమవుతుంది. కానీ నేను అటు బస్సు దిగలేను, అలాగని వెనక్కి ఎక్కలేను. అంతలో నాకు బాబా జ్ఞాపకం వచ్చి, ఆయనను తలుచుకున్నాను. అంతే, నా మెడ మీద ఒక చేయి పడింది. అది నన్ను అమాంతం గాల్లోకి లేపి, ఆ జీపు కన్నా వేగంగా బస్టాపులో దించింది. ఆ చేయి బాబాదే. నా మెడ మీద ఏదో బరువు పడిందని తెలుసుగాని, బాబా కనపడలేదు. ఇదంతా బస్టాపులో ఉన్న ఒకతను చూస్తూ తలను అటు ఇటు ఆడించి, అవాక్కయి నోటి మీద వ్రేలు వేసుకున్నాడు. నేను బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుని కంపెనీకి వెళ్ళిపోయాను. ఆనాడు బాబా రక్షించకపోయుంటే నేను ఈరోజు ఇలా ఆయన అనుగ్రహాన్ని మీతో పంచుకోలేకపోయేవాడిని.
ఒకసారి నేను, నా భార్య, నా మనుమడు ముగ్గురమూ స్కూటీ మీద వెళ్తూ ఓ చోట రోడ్డు దాటాలనుకున్నాము. అయితే అక్కడ రోడ్డుకు ఒక పక్కన ఇద్దరు వ్యక్తులు బైక్ ఆపి మాట్లాడుకుంటున్నారు. నేను వాళ్ళను తప్పించే ప్రయత్నంలో స్కూటీని ఎడమవైపు త్రిప్పేసరికి ఒక ట్రాక్టర్ ఇసుక లోడుతో చాలా స్పీడుగా వస్తూ కనిపించింది. నా భార్య కంగారుపడి స్కూటీ మీద నుండి దిగేసింది. ట్రాక్టర్ డ్రైవరు కూడా కంగారులో క్రిందకు దూకడానికి ప్రయత్నించాడు కానీ, అంతలో ట్రాక్టర్ దానంతట అదే బ్రేక్ పడినట్లుగా మాకు చాలా కొద్దిదూరంలో ఆగిపోయింది. ఒక్క అంగుళం కూడా ముందుకు కదలలేదు. మేము పక్కకు తప్పుకున్నాక ట్రాక్టర్ కదిలింది. అదెలా సాధ్యమయిందో డ్రైవరుకు కూడా అర్ధం కాలేదు. వాళ్ళు, 'మాకు పెద్ద ప్రమాదం తప్పింది' అని అనుకుంటూ వెళ్ళిపోయారు. బైకు అతను కూడా, "ట్రాక్టర్ వస్తున్న స్పీడుకి మీ స్కూటీని ఢీ కొట్టడం ఖాయమనుకున్నాన"ని అన్నాడు. అంతా బాబా దయ. ఆయన రక్షణ ఉంటే అలా ఎందుకు జరుగుతుంది. ప్రక్కనే బాబా గుడి ఉంటే మేము వెంటనే ఆ గుడికి వెళ్ళాము. ఇంకోసారి కూడా మేము ముగ్గురం బెంగుళూరు మెయిన్ రోడ్డు మీద స్కూటీపై వెళ్తున్నాము. ఆ సమయంలో వాహనాలుతో రోడ్డు చాలా రద్దీగా ఉంది. అంత రద్దీలోనూ ఒక కారు చాలా స్పీడుగా వచ్చి వెంట్రుకవాసి గ్యాప్‍లో మమ్మల్ని క్రాస్ చేసింది. ముందున్న ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఉన్న కొంతమంది ఆ కారుని ఆపి, "ఏమిటా స్పీడు?” అని డ్రైవర్ను తిట్టి పంపించారు. నిజానికి ఆ కారు వేగానికి వచ్చే గాలికి ఎవరైనా కింద పడిపోవడం, వెనుక వచ్చే వాహనాలు పైనుండి వెళ్లిపోవడం జరిగేది. కానీ మాకు ఏమీ కాలేదు. అలా చిన్న, పెద్ద ప్రమాదాల నుండి బాబా మమల్ని రక్షిస్తూ ఉన్నారు.
2019, మే నెల చివరి వారంలో నా భార్య, మా మనవడు సాయీష్ అనంతపురంలో ఒక వివాహానికి వెళ్లి, రాత్రి 10 గంటలకు ఏసీ స్లీపర్ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి 12 గంటల సమయంలో నా భార్య నాకు ఫోన్ చేసి, "సాయీష్‍కి విరోచనాలు అవుతున్నాయి. బస్సువాళ్ళు సహాయం చేస్తున్నారు. ఎక్కడైనా టాబ్లెట్లు దొరుకుతాయేమోనని చూస్తున్నారు" అని చెప్పింది. బస్సు ప్రయాణంలో ఉండగా అర్ధరాత్రి వేళ ఇలా జరిగితే ఇబ్బంది కదా అని నేను వెంటనే, "బాబా! వాళ్ల ఇబ్బంది గుర్తించి వెంటనే సాయీష్‍కు విరోచనాలు అవకుండా అనుగ్రహించండి" అని బాబాను ప్రార్థించాను. బాబా దయ చూపారు. సాయీష్‍కి మళ్ళీ విరోచనం కాలేదు. విశేషం ఏమిటంటే, బస్సువాళ్ళు టాబ్లెట్లు ఇచ్చినప్పటికీ అవి వేసుకోకుండానే తనకి విరోచనాలు ఆగిపోయాయి. ఏ ఇబ్బందీ లేకుండా వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. బాబా అనుగ్రహంతో ఏ సమస్య అయినా అంతరించిపోవాల్సిందే!
మేము ఒకరోజు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి తెనాలి వెళ్ళాము. భక్త శ్రీరామదాసు సినిమా చూసి, ఇంటి పనులు, స్కూలుకు సంబంధించిన పనులన్నీ చూసుకుని, రాత్రి 7 గంటలకి తిరిగి ఇల్లు చేరాము. తలుపు తాళం తీయగానే అదో రకమైన మాడు వాసన వచ్చింది. వెంటనే వంట గదిలోకి వెళ్ళి చూశాము. మధ్యాహ్నం బయటికి వెళ్ళేముందు పాలు స్టవ్ మీద పెట్టి, స్టవ్ ఆఫ్ చేయటం మరిచిపోయి అలాగే వెళ్లిపోయామని అప్పుడు అర్థమైంది. స్టవ్ సిమ్‍లో వెలుగుతూనే ఉంది, పాలు మొత్తం ఆవిరైపోయాయి. గిన్నె అలాగే ఉంది. ఏదైనా ఐతే అని ఊహించటానికి చాలా భయమేసింది. ఏదేమైనా బాబా ఇంట్లోనే ఉండి, ఏ ప్రమాదమూ జరగకుండా చూసుకుని క్రొత్త ఇంటిని కాపాడారు. "సర్వదా మీకు కృతజ్ఞతలు బాబా".
మేము అప్పుడప్పుడు గుంటూరు వెళ్లి అక్కడ పనులన్నీ చూసుకుని స్కూటరు మీద తిరిగి నారాకోడూరు వచ్చేవాళ్ళం. మేము గుంటూరులో బయలుదేరగానే దట్టంగా మబ్బుపట్టి చినుకులు మొదలయ్యేవి. మేము, "బాబా! మేము ఇల్లు చేరేంతవరకూ వర్షం పడకుండా ఆపండి" అని బాబాను అడిగేవాళ్ళము. అంతే, వర్షం ఆగిపోయేది. ఇల్లు చేరి లోపలకు అడుగుపెట్టగానే పెద్ద వర్షం పడేది. ఇలా చాలాసార్లు జరిగింది.
సర్పాల నుండి బాబా కాపాడిన వైనం: ఒకసారి మేము గుంటూరు వెళ్ళి, రాత్రికి తిరిగి ఇంటికి వచ్చి తలుపులు తెరిచాక చూస్తే, పూజగదిలో బాబా విగ్రహం ముందు రెండడుగుల సర్పం బాబానే చూస్తూ కనిపించింది. అది మమ్మల్ని గమనించి ప్రక్క గదిలోకి వెళ్ళింది. దాన్ని కొట్టి చంపేశారు. బాబా మేము వచ్చేంతవరకూ దానిని ఎక్కడకీ కదలనీయకుండా చేసి మాకు కనిపించేటట్టు చేసారు. ఇంకొకసారి స్కూలు పిల్లలు ఆరు బయట చదువుకుంటుండగా ఒక పెద్ద జెర్రిపోతు గేటులో నుండి లోపలికి వచ్చి ఒక చిన్న సందులో దూరి మూడుగంటలపాటు అక్కడే ఉండిపోయింది. ఆ మూడు గంటలసేపు పిల్లలు, మేము చాలా కంగారుపడ్డాము. తరువాత నలుగురు వ్యక్తులు వచ్చి దానిని చంపేశారు. ఆ పాముని ఎటూ పోనివ్వకుండా ఆపింది బాబానే. అలా పై రెండు సందర్భాలలో పాముల వల్ల ఎవరికీ ఏ హాని కలగకుండా కాపాడారు బాబా.
ఒక శివరాత్రి నాటి సాయంత్రం మేము క్వారీలోని శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాం. ఆ సమయంలో కరెంటు లేదు. ఇంటి గేటు వద్ద ఒక చిన్న పాము పిల్ల పడగ విప్పి కన్పించింది. తర్వాత ప్రక్కకు వెళ్ళిపోయింది. శివరాత్రి రోజున బాబాయే ఆరూపంలో, బయటివాళ్ళెవరూ ఇంట్లో రాకుండా ఆపారు. ఇంకోసారి మేము ఊరు వెళ్ళడానికి బయలుదేరుతున్న సమయంలో ఇంటి గేటు వెలుపల నుండి ఒక పెద్ద కట్లపాము వచ్చి, ప్రక్కనే ఉన్న నీళ్ళ సంప్‍లో పడిపోయింది. తర్వాత మేము దాన్ని చంపివేశాము. అలా కాకుండా మేం ఊరికి వెళ్ళిన తర్వాత అది లోపలికి వచ్చి ఉంటే, తిరిగి వచ్చిన మేము దాన్ని చీకట్లో చూసుకునే వాళ్ళం కాదేమో! బాబానే ఆ ఆపద నుండి మమ్మల్ని రక్షించారు.
ముందు భాగం కోసం బాబా పాదుకలు తాకండి. |
|
తరువాయి భాగం కోసం బాబా పాదాలు తాకండి.
|
Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Very good experience with Baba.sai saves his devotees with love and affection.That is sai power.no harm when sai is there
ReplyDeleteOm sai ram om sai ram om sai ram
ReplyDeleteOM SAI RAM 🙏🙏🙏
ReplyDelete