సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1327వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • 'బాబా ఏది చేసినా మన మంచికే చేస్తార'నే ప్రసాదభావాన్ని అలవర్చుకోవాలి

'బాబా ఏది చేసినా మన మంచికే చేస్తార'నే ప్రసాదభావాన్ని అలవర్చుకోవాలి


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయి బంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. జీవితంలో ఒకసారి అనుభవించినటువంటి అనుభవాన్ని తిరిగి అనుభవించటం(Reliving the same movement again) అనేది చాలా అరుదు. నేను ఇప్పుడు పంచుకోబోయే అనుభవం అలాంటిదే. సరిగ్గా ఏడాది క్రితం పరిస్థితులు, అదే బాబా అనుగ్రహం మళ్లీ పునరావృతం అయ్యాయి. ఇక అనుభవంలోకి వస్తే.... మా అమ్మాయి కెనడాలో చదువుకోటానికి 2022, ఏప్రిల్ నెల మూడోవారంలో వీసాకి అప్లై చేసింది. కెనడా స్టూడెంట్ వీసా ప్రాసెసింగ్‌లో రెండు స్ట్రీమ్స్(పద్ధతులు) ఉంటాయి. వాటిలో ఒకటి 'స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్(SDS)'. దీన్ని తొందరగా అంటే 30 రోజుల్లో వీసా ప్రాసెస్ అవ్వటం కోసం వినియోగిస్తారు. దీనికి అప్లై చేయాలంటే, 'IELTS'లో ఓవరాల్‌గా 6.5 స్కోరు ఉండటంతోపాటు, ప్రతీ బ్యాండ్‍లో కనీసం 6 స్కోరు ఉండాలి. దాంతోపాటు ఒక సంవత్సరం కాలేజ్ ఫీజు, ఒక సంవత్సరం లింవింగ్ ఎక్స్‌పెన్సెస్ ముందుగానే చెల్లించాలి. అప్పుడు మాత్రమే 'స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్' కేటగిరిలోకి ఆటోమేటిక్‍గా అప్లికేషన్ ఫాం వెళ్తుంది. ఈ క్రైటీరియా మీట్ అవ్వని వాళ్ళు 'నాన్ స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్(non SDS)' కేటగిరిలోకి వెళ్తారు. ఈ కేటగిరీలో వీసా ప్రాసెస్ అవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. సరే, మా అమ్మాయి 'SDS'లో అప్లై చేసింది. అంతవరకూ బాగానే ఉంది. కానీ మేము అప్లై చేసిన తర్వాత తెలిసిన విషయమేమిటంటే, 'ప్రస్తుతం అందరూ 'SDS'లోనే అప్లై చేసుకుంటుండటం వల్ల అప్లికేషన్ల సంఖ్య పెరగడంతో ఆ కేటగిరీలో వీసా రావడానికి మూడు నుంచి నాలుగు నెలలు సమయం పడుతుందని, 'non SDS' కేటగిరీలో అప్లై చేసుకున్న వాళ్ళకి వారం రోజుల్లో, మరికొందరికైతే ఒకటి, రెండు రోజుల్లోనే వీసా అప్రూవల్ అవుతున్నాయ'ని. కానీ మేము చేసేదేమీలేక ఆ సమయం కోసం ఎదురుచూసాము. ఇప్పుడు మొదలైంది బాబా పరీక్ష(లీల). ఏప్రిల్‌లో అప్లై చేసిన అప్లికేషన్ల ప్రాసెసింగ్ మూడు నెలలు తర్వాత జూలైలో మొదలైయ్యాయి. ఏప్రిల్ రెండోవారం వరకూ ఉన్న ఫైల్స్ వరుస క్రమంలో వచ్చాయి. తరువాత ఏప్రిల్ మూడోవారంలో సరిగ్గా మా అమ్మాయి అప్లై చేసిన తేదీ నుంచి ఫైల్స్ స్కిప్ అయి నాలుగోవారంలోని ఫైల్స్, మే నెలలో అప్లై చేసుకున్న వాళ్ళ ఫైల్స్ క్రమపద్దతిలో ప్రాసెస్ కాసాగాయి. దీంతోపాటు ఏప్రిల్ నెలలో అప్లై చేసిన వాళ్ళకు 60%-70% రిఫ్యూజల్స్(తిరస్కరణ) రాసాగాయి. అలా మా అమ్మాయి ఫైల్ తాలూకు నిర్ణయం రావాల్సిన సమయం దాటి రెండు వారాలు అయిపోయింది. దాంతో ఇంట్లో అందరికీ టెన్షన్ మొదలైంది. ఆ ఒక్క వారం ఫైల్స్ తాలూకు రిజల్ట్స్ ఎందుకు రావట్లేదో అర్థంకాక చాలా ఆందోళన చెందాము. మా అమ్మాయి ప్రొఫైల్ బాగున్నప్పటికీ తనకన్నా మంచి ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి వీసా తిరస్కరింపడుతున్న విషయం తెలిసి మా ఆందోళన ఇంకా పెరిగింది. చివరికి జూలై 28 తెల్లవారుఝామున గం.2:43ని.లకి వీసా రిజెక్ట్ అయినట్టు మెయిల్ వచ్చింది. మేము అస్సలు ఊహించని పరిణామమది. మేమంతా తీవ్రమైన షాక్‌కి గురయ్యాము. ఎందుకంటే, కెనడాలో చదువుకోవటం అనే ఆలోచన నుంచి ప్రతీ విషయం బాబా అనుమతితోనే జరిగింది. అందువల్ల బాబా ఎలాగూ వీసా ఇప్పిస్తారని అప్పటికే షాపింగ్ కూడా మొదలుపెట్టి, ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాము. అలాంటిది అలా జరిగేసరికి మాకు చాలా బాధేసింది. మా అమ్మాయి తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంది. తను మానసికంగా చాలా కృంగిపోయింది. ఎందుకంటే, మేము ఒక్క కెనడాకి తప్ప వేరే ఏ ఇతర దేశాల యూనివర్సిటీలకు అప్లై చేసుకోకుండా వేరే ప్లాన్ అంటూ ఏమీ లేకుండా ఉన్నాము. పోనీ ఇప్పుడు ఏ దేశానికైనా అప్లై చేద్దామంటే వచ్చే సంవత్సరం మే నెల వరకు అవకాశం లేదు. అప్పటివరకూ అంటే ఒక సంవత్సరం వృధా అవుతుంది. నేను, "బాబా! ఎందుకిలా చేసారు? మీ అనుమతి లేకుండా మేమేమీ చేయలేదు కదా, మరి మమ్మల్ని ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో పడేసారు" అని భాధతో, ఒకసారి తిట్టుకుంటూ కూడా బాబాను అడిగాను. అయితే ఆయన ప్రేరణ వల్ల మేము మళ్లీ అప్లై చేయాలనుకున్నాము. మా అమ్మాయి కొన్ని అదనపు పత్రాలు జతచేసి, త్వరగా రిజల్ట్ వస్తుందని ఈసారి 'non SDS' స్ట్రీమ్‌లో అప్లై చేసింది. అయితే మా దరిద్రానికి తగ్గట్టు 'non sds' స్ట్రీమ్‍లో త్వరగా రిజల్ట్ వస్తున్నాయని అందరూ ఆ స్ట్రీమ్‍లో అప్లై చేస్తుండటంతో మళ్ళీ నెలరోజులు ఎదురుచూడాల్సిన దుస్థితి మాకు ఎదురైంది. చేసేదేమీలేక గతజన్మ కర్మఫలాలను అనుభవించక తప్పదని బాబా మీద భారమేసి ఎదురుచూసాము. ఎట్టకేలకు ఆగస్టు 26, తెల్లవారుఝామున 2:43 గంటలకు వీసా అప్రూవ్ అయినట్టు మెయిల్ వచ్చింది. మా ఆనందానికి అవధులు లేవు. మనసారా బాబాకి ధన్యవాదాలు తెలుపుకున్నాము. ఇదంతా నాణానికి ఒకవైపు. ఇది లౌకిక ప్రయోజనం మాత్రమే. మరి మన బాబా లౌకిక ప్రయోజనం మాత్రమే ప్రసాదించే గురువు కాదు కదా! కాబట్టి ఆ రెండోవైపు కూడా చూద్దాం.


బాబా మన కోరికలను నెరవేరుస్తుప్పుడు మన భక్తి, ప్రేమలు నిజమైనవని మనం అనుకుంటుంటాము. కానీ కొన్ని చావో రేవో వంటి పరిస్థితులను కల్పించి మనలను పరీక్షిస్తారు బాబా. తద్వారా మనలో జరిగే మానసిక సంఘర్షణ వల్ల మనం ఎంతవరకూ నిరంహాకారంగా ఉంటున్నాము, మనసు ఎంత పవిత్రంగా ఉంది అని నిశితంగా పరిశీలించుకునేలా చేస్తారు. మొదటిసారి పదిహేనురోజులు, రెండవసారి ఇరవైఎనిమిది రోజులు మేము పడిన వేదన, మానసిక సంఘర్షణ అంతాఇంతా కాదు. మేము ఆ సమయంలో మొదట బాబా మీద కినుక వహించినా తరువాత్తర్వాత గత జన్మల కర్మఫలాలను అనుభవించక తప్పదని, దానికోసం బాబాని నిందించటం అసలు సరికాదని, జరుగుతున్న దానిలో కూడా మనకు తెలియని బాబా అనుగ్రహం ఏదో ఉండే ఉంటుందని ఓపికగా ఎదురుచూసేలా మానసిక ధైర్యాన్ని బాబానే ఇచ్చి మానసికంగా మమ్మల్ని సంస్కరించి తమకు మరింత దగ్గర చేసుకున్నారు. అంతేకాదు శ్రద్ధ, సబూరీ అంటే మనం కోరుకున్నవి జరగడం కోసం ఎదురు చూడటం కాదనీ, అందుకు వ్యతిరేఖంగా జరిగినా తమపట్ల నమ్మకం, భక్తిప్రేమలు సహజంగా ఉండాలని, మా ఇంటికి, మాకూ తామే యజమాని అని అనుభవపూర్వకంగా మాకు నేర్పించారు బాబా. దీనిని బట్టి మనం బాబాని పట్టుకోవటం అబద్ధం, వారే మనల్ని పట్టుకుంటారనేది సత్యమని అర్థమైంది. నాకు సరిగ్గా చెప్పటానికి రాలేదేమో అనుకుంటున్నాను. ఏదేమైనా సమస్య వచ్చినప్పుడు మనసు చంచలమవటం మానవ సహజ లక్షణమే అయినా తక్షణమే మనం అందులో నుండి తేరుకుని, 'బాబా ఉండగా నాకేంటి?' అని మనసుకి చెప్పుకుని, 'బాబా ఏది చేసినా మన మంచికే చేస్తార'నే ప్రసాదభావంతో ఉండాలి.  "థాంక్యూ బాబా. మీ మనవరాలి బంగారు భవిష్యత్తును మీరే తీర్చిదిద్దాలి. సాయి మహరాజ్! మీరు ఎన్నో చేసారు. ఈ ఒకటి చేయనందుకు మిమ్మల్ని తిట్టాను. నన్ను క్షమించండి. అయినా తోడుగా ఉండి చాలా విషయాలు అనుభవంతో నేర్పించారు. మీరేది చేసినా మా మంచికే. మా తప్పులు క్షమించి, మీకు నచ్చే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దండి బాబా ప్లీజ్".


2022, ఆగష్టు రెండోవారంలో మా మమ్మీకి వైరల్ ఫీవర్ వచ్చి చాలా నీరసించిపోయింది. అప్పుడు నాకు మన బ్లాగులో చాలామంది భక్తులు 'దూరప్రాంతాలలో ఉన్న వాళ్ళ సంబంధీకులు జబ్బుపడినప్పుడు వాళ్ళకి ఊదీ పెడుతున్న భావనతో తామే ఊదీ పెట్టుకుంటే వాళ్ళకి అనారోగ్యం తగ్గింద'ని పంచుకున్న అనుభవాలు గుర్తుకు వచ్చి, "బాబా! రేపటివరకూ మమ్మీకి కాస్త నయమయ్యేలా అనుగ్రహించండి" అని బాబాను ప్రార్థించి, మా మమ్మీకి పెడుతున్నట్టు భావించుకొని నేను ఊదీ ధరించాను. బాబా అనుగ్రహం వలన మమ్మీ కోలుకుంది. "చాలా చాలా ధన్యవాదాలు సాయినాథా".


మరో అనుభవం: మా అమ్మాయి తను కెనడా వెళ్ళేలోపు తన కళ్ళు చెక్ చేయించుకుని, కాంటాక్ట్ లెన్స్, ఇంకా కళ్ళద్దాలు మార్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఐ చెకప్‍కి వెళ్ళింది. డాక్టరు, "నీ సైట్ చాలా ఎక్కువగా పెరిగింది. ఇలా పెరిగితే రెటీనా ఎక్స్ పాన్షన్ అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే రెటీనా చిరిగిపోయే అవకాశం కూడా ఉంది. అలాంటి పరిస్థితి వస్తే మాత్రం లేజర్ ట్రీట్మెంట్ చేయాల"ని చెప్పి టెస్టులు చేసారు. మాకు చాలా భయమేసింది. నేను, "బాబా రిపోర్టు నార్మల్ అని వచ్చేలా చూడండి" అని బాబాని వేడుకున్నాను. అయితే డాక్టర్, "రెటీనా కొంచెం పెరిగింది. కానీ ప్రస్తుతానికి అంత భయపడాల్సిన పనిలేదు. ఆరునెలల తర్వాత మళ్ళీ చెక్ చేస్తే, అప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఏదైనా నిర్ధారించే అవకాశం ఉంటుంద"ని చెప్పారు. కానీ బాబా తనకు ఏమీ కానివ్వరని నాకు నమ్మకం ఉంది. ఆయనే ఏదో ఒకటి చేసి పాప కంటి సమస్యను తగ్గించాలి, తగ్గిస్తారు కూడా. ఎందుకంటే, ఆయనే అన్నీటికి కర్తా, హర్తా. "బాబా! మీకు మాటిచ్చిన విధంగా తోటి సాయి బంధువులతో నా అనుభవాలు పంచుకున్నాను. ఇంకేమైనా మరిచిపోయి ఉంటే క్షమించి, జ్ఞాపకం చేయండి. ఆడపిల్లలు కొన్ని విషయాలను తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేరు. వాటిని కూడా మీతో చెప్పుకునే అవకాశం మీ భక్తులకు వరంగా ఇచ్చారు. అందుకే నువ్వు మా 'సాయి మావుళి'. సోదరునిలా, తండ్రిలా రక్షిస్తావు. తోబుట్టువులా ఆదరిస్తావు. ఎన్నో కష్టాలు - మాకు తెలియకుండానే కొన్ని, తెలియజేసి కొన్ని గట్టెక్కిస్తావు. గురువుగా మార్గనిర్దేశం చేస్తావు. ఒక్క మాటలో చెప్పాలంటే, మిమ్మల్ని నమ్మిన ప్రతీ భక్తునికి మీరే ఒక సైన్యం(One Man Army). మీరు ఒక్కరు ఉంటే చాలు. మేము ఏవీ కోరనక్కరలేదు. అన్ని వాటంతటవే వస్తాయి. ఎల్లప్పుడూ మీ ప్రేమను హృదయాంతర్గత పొరల్లో నుంచి ఆస్వాదించేలా అనుగ్రహించండి మహరాజ్. సాయి మిమ్మల్ని గురువుగా పొందే భాగ్యం ప్రసాదించినందుకు మరియు మీరు ఇచ్చిన ఈ జీవితానికి, ఇంకా మీరు అనుగ్రహించిన అన్నిటికీ కోటికోటి కృతజ్ఞతా పూర్వక నమస్కారాలు".


సర్వం శ్రీ సాయినాథ దివ్య చరణారవిందార్పణమస్తు!!!



5 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏

    ReplyDelete
  4. ఓం శ్రీ సాయి రామ్ రోజు సాయి అనుగ్రహం చదువుతాను బాగుంటాయి.నమితే‌ సాయి అనుగ్రహం వుంటుంది.సాయి నీ దర్శనం కోసం శిరిడీ రపించుకో ఇదే నా కోరిక.

    ReplyDelete
  5. 🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo