సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1381వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. మేలే చేస్తారు బాబా
2. ఆరోగ్య ప్రదాత శ్రీసాయి

మేలే చేస్తారు బాబా


అందరికీ నమస్తే! నేను ఒక సాయి భక్తురాలిని. ప్రతిరోజూ మనకు బాబాతో అనుభవాలు కలుగుతూనే ఉంటాయి. ప్రతి చిన్న అనుభవాన్ని ఎప్పటికప్పుడు ఇక్కడ వ్రాయలేము. అయినా అన్నీ వ్రాయాలనుకుంటే వందల అనుభవాలలో ఎన్నని గుర్తుపెట్టుకోగలము? అయితే, వాటిలోనుండి ఈమధ్యకాలంలో నన్ను కొంచెం ఇబ్బందిపెట్టిన సమస్య గురించి, ఆ సమస్యను బాబా పరిష్కరించిన విధానం గురించి ఈరోజు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.


మాకు ఒక అపార్టుమెంటులో స్వంత ఫ్లాట్ ఉంది. ఆ ఇల్లు అన్ని సౌకర్యాలతో చాలా బావుంటుంది. చూడగానే ఎవరికైనా నచ్చుతుంది. ఆ ఇంటిని మేము అద్దెకు ఇస్తుంటాము. అయితే, కొంచెం పాత ఫ్లాట్స్ అవటం వల్ల జనరేటర్ సౌకర్యం లేదు. పైగా మాది అన్నిటికంటే పైన ఫ్లోర్. అందువల్ల, ఇల్లు అద్దెకు కావాలని ఎవరు మమ్మల్ని సంప్రదించినా, ముందుగా బాబా ఫోటో ముందు 'yes', 'no' అనే చీటీలు వేసి, బాబా అనుమతించినవారికే (అంటే, బాబా 'yes' అని చెప్పినవారికే) ఇల్లు అద్దెకు ఇవ్వడం మాకు అలవాటు. అదేవిధంగా బాబా అనుమతితో కొంతకాలం క్రితం మేము ఒక కుటుంబానికి ఇల్లు అద్దెకు ఇచ్చాము. 2022, మే నెలలో వాళ్ళు ఇల్లు ఖాళీ చేశారు. ఆ తరువాత ఇల్లు అద్దెకు కావాలని ఎవరు వచ్చినా, మేము బాబా దగ్గర చీటీలు వేయడం, బాబా 'no' అని చెప్పడం జరుగుతూ ఉండేది. ఎప్పుడైనా అడపాదడపా బాబా ఎవరికైనా 'yes' అని చెప్పినా కూడా ఏదో కారణం వల్ల వాళ్ళు మళ్ళీ వచ్చేవారు కాదు. ఇలాగే నెలలు గడుస్తుండేవి. ప్రతి గురువారం, 'ఈరోజైనా ఎవరైనా అద్దెకు కుదిరేలా చూడు బాబా' అనుకోవడం, అలా జరగకుండానే ప్రతి గురువారం గడచిపోవడం జరుగుతుండేది. ఈమధ్యలో ఒక డాక్టరుగారు ఇల్లు అద్దెకు కావాలని పదేపదే మమ్మల్ని అడుగుతూ ఉండేవారు. ఆయన మమ్మల్ని సంప్రదించినప్పుడల్లా మేము బాబాని అడిగితే, బాబా మాకు 'no' అనే చెప్పేవారు. ఇక ఇది ఇలాగే కొసాగితే బాబా అనుగ్రహంపై శంక మొదలవుతుందేమోనని భయపడి, శిరిడీ వెళ్ళినప్పుడు, (ఈమధ్యలో ఒకసారి అనుకోకుండా బాబా మమ్మల్ని శిరిడీ రప్పించుకున్నారు. ఆ అనుభవాన్ని నేను ఇంతకుముందే ఈ బ్లాగులో పంచుకున్నాను.) "నేను ఇక చీటీలు వెయ్యను బాబా. నువ్వే మంచివాళ్ళు, ఇబ్బందిపెట్టనివాళ్ళు అద్దెకు వచ్చేలా చూడు; అలాంటివారు కాకపోతే వాళ్ళు రాకుండా నువ్వే చూసుకో" అని మనసులోనే బాబాకు చెప్పుకున్నాను. ఆ తరువాత కూడా చాలారోజులపాటు ఎవరో ఒకరు రావడం, ఇల్లు చూడడం, వెళ్ళడం జరుగుతూ వచ్చింది. ఇక్కడ అందరికీ ఒక విషయం చెప్పాలి. అనుకున్న పని ఆలస్యమవుతోందనీ, ఇల్లు ఖాళీగా ఉండటం వల్ల అద్దె రూపంలో వచ్చే ఆదాయం పోతోందనీ కొంచెం చిరాకుగా అనిపించినా, ఇంకేదో పెద్దగా కలగవలసిన ఇబ్బందిని లేదా కష్టాన్ని ఈవిధంగా డబ్బు నష్టపోవడం ద్వారా బాబా పరిహారం చేస్తున్నారేమో అనిపించేదే తప్ప వేరేగా నేను ఏమీ అనుకోలేదుగానీ 'నీ సంకల్పం ఎలావుంటే అలాగే చెయ్యి బాబా, ఏం ఫరవాలేదు' అనుకునేదాన్ని. కానీ ఒకప్రక్క ఇంటి గురించి వచ్చే ఫోన్లు, వారికి ఇల్లు చూపించడం, ఇంటి మెయిన్‌టెనెన్స్, కరెంట్ బిల్లు లాంటి ఎదురు పెట్టుబడులు, 'ఇంకా ఇల్లు అద్దెకు ఇవ్వలేదా?' అని అందరూ అడగడం.. వీటన్నిటితో ఒకప్రక్క చిరాకుగానూ, బాధగానూ ఉండేది. ఇంతలో, ఇంతకుముందు బాబా వద్దని చెప్పిన డాక్టరుగారు మళ్ళీ ఫోన్ చేశారు. 'నేను ఇక చీటీలు వెయ్యను, ఎవరు అడిగినా ఓకే అంటాను. వాళ్ళను రానివ్వడం, రానివ్వకపోవడం బాబా బాధ్యత' అని అంతకుముందే అనుకుని ఉన్నాను కదా! అయినా, ఈయన విషయంలో ఆల్రెడీ బాబా 'no' అన్నారు కదా అనుకుని, మళ్ళీ చీటీలు వేద్దామనిపించి బాబా ముందు చీటీలు వేశాను. ఈసారి బాబా నుంచి 'yes' అని సమాధానం వచ్చింది. మళ్ళీ ఇంకో డైలమా. ‘పదేపదే ఒకే విషయానికి చీటీలు వేయడం వల్ల అలా వచ్చిందేమో, ఇది నిజంగా బాబా అనుమతేనా?' అని. కానీ చివరిసారి వచ్చిన సమాధానాన్నే పరిగణనలోకి తీసుకుని డాక్టరుగారికే కన్ఫర్మ్ చేశాను. నేను కన్ఫర్మ్ చేద్దామని నిర్ణయించుకున్నది గురువారం. కానీ డాక్టరుగారు ఆరోజు ఫోన్ తియ్యకపోవడం వల్ల మరుసటిరోజు, అంటే శుక్రవారం కన్ఫర్మ్ చేశాను. ఈలోపు ఆ గురువారంరోజే నేను బాబా గుడిలో, బాబా ముందు కూర్చుని ఉండగా, ఇల్లు అద్దెకు కావాలని ఒకరు నాకు ఫోన్ చేశారు. వారితో మాట్లాడిన తరువాత, బాబా గుడిలో ఉండగా వారి వద్దనుండి ఫోన్ వచ్చింది కాబట్టి, ఇల్లు వారికి అద్దెకు ఇవ్వడానికి బాబా అనుమతి ఉన్నదేమో అని మనసులో ఒకవైపు అనిపిస్తున్నా, మరోవైపు వారి కుటుంబ నేపథ్యం, వారి వివరాలు చూస్తే మామూలు పరిస్థితిలో అయితే మేము వారికి ఇవ్వడానికి ఇష్టపడము. ఇలా ఈ పరిస్థితి నడుస్తూ ఉండగానే మేము శుక్రవారంనాడు డాక్టరుగారికి ఇల్లు అద్దెకు ఇవ్వాలని కన్ఫర్మ్ చెయ్యడం జరిగిపోయింది. అప్పటికీ ఎందుకో ‘ఇది జరగదేమో’ అనిపిస్తోంది. పైగా ఆ డాక్టరుగారు మాటవరసకి కన్ఫర్మ్ చేశారుగానీ, అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు. రెండు రోజుల తరువాత మేము ఆయన్ని అడిగిన తరువాత అడ్వాన్స్ ఇచ్చారు. ఆ మరుసటిరోజు ఈ ఫ్యామిలీ ఫోన్ చేస్తే, “ఆల్రెడీ ఇల్లు అద్దెకు ఇచ్చేశాము” అని చెప్పాము. పాపం, వాళ్ళు చాలా నిరాశపడ్డారు. వాళ్ళ పిల్లలకి మా ఫ్లాట్ చాలా నచ్చిందట. ‘నచ్చిన ఇల్లు మిస్సయ్యాము’ అని వాళ్ళు బాగా ఫీల్ అయ్యారు. ఇంత జరిగిన తరువాత, మళ్ళీ ఈ డాక్టరుగారు తన సమస్యలేవో చెప్పి, ‘ఇల్లు అద్దెకు తీసుకోలేన’ని చెప్పారు. ఇంక నాకు బాబా నిర్ణయం ఏమిటన్నది స్పష్టంగా అర్థమైపోయింది. అప్పుడు నేను అక్టోబరు 18, మంగళవారంనాడు ఈ ఫ్యామిలీకి ఫోన్ చేసి విషయం చెప్పి, డాక్టరుగారికి చెప్పిన రెంట్‌నే వీళ్లకు కూడా ఆఫర్ చేసి, “ఇల్లు అద్దెకు తీసుకుంటారా?” అని అడిగాను. వాళ్ళు ఒక్క అరగంటలో వాళ్ళ అంగీకారాన్ని తెలిపారు. అంతేకాదు, ముందు ‘25వ తేదీ తర్వాత ఫ్లాట్‌లో దిగుతాము’ అన్నవాళ్ళు మరుసటిరోజే, అంటే బుధవారంనాడే మొత్తం అడ్వాన్స్ మా అకౌంటులో వేసి, ఆరోజే ఫ్లాట్‌లోకి దిగిపోయారు. మరుసటిరోజు నేను డాక్టరుగారి అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసి, బాబాకు నమస్కరించుకుని ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడానికి పంపించాను. జరిగిన సంఘటనలన్నిటినీ విశ్లేషించుకుంటూ వెళ్తే చాలా విషయాలు గమనించవచ్చు. బాబా నన్ను ఇన్ని రోజులు పరీక్షించారేమో! అయితే, ఆ పరీక్షలో నేను గెలిచానో, ఓడానో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ, ఏది ఏమైనా, ఏ పని జరగాలన్నా అది బాబా అనుమతించినప్పుడే జరుగుతుంది. లేకపోతే మనం తలక్రిందులు అయినా కూడా అది జరగదు. చివరికి బాబా మనకి మేలే చేస్తారు. కానీ అది ఏమిటి అన్నది మన చిన్న బుర్రలకి అర్థం కాదు. బాబాపై నమ్మకముంచి, దీనికి ఏదో కారణం ఉండివుంటుందని వేచిచూడడమే మన పని.


మరొక అనుభవం: నాకు కొన్నిరోజులుగా అరచేయి వెనుక భాగంలో చూపుడువేలి క్రింద ఎత్తుగా, కాయలాగా ఉంది. అయితే, అక్కడ నొప్పిగానీ, దురదగానీ, మంటగానీ ఏమీ లేవు. ఊరికే అలా కాయలా ఉంది. పట్టి చూస్తే కొంచెం ఎబ్బెట్టుగా ఉండేది. మావారికి చూపిస్తే, తను కొంచెం కంగారుపడి ‘డాక్టరుకి చూపిద్దాం’ అన్నారు. డాక్టర్ దగ్గరకి వెళ్తే ఎన్ని టెస్టులు రాసేవారో, ఏం చేసేవారో తెలియదుగానీ, నేను బాబాను తలచుకుని, అది కనపడినప్పుడు, గుర్తువచ్చినప్పుడు అక్కడ బాబా ఊదీ రాయడం ప్రారంభించాను. ఎప్పుడు పోయిందో తెలియదుగానీ, ఒకరోజు చూసుకుంటే అది ఆనవాలు కూడా లేకుండా పోయింది. “బాబా! ఎల్లప్పుడూ మా మనసులలో నీ యందు నమ్మకం సడలకుండా, నీ శరణాగతి నుండి ప్రక్కకి జరగకుండా ఉండేలా చూడు తండ్రీ.”


ఆరోగ్య ప్రదాత శ్రీసాయి


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! నా పేరు రఘు. మాది హైదరాబాద్. ఈమధ్య మా సిస్టర్ తన ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్‌కి వెళితే లేడీ డాక్టర్ చెక్ చేసి, "గర్భసంచిలో గడ్డలున్నాయి. రెండు, మూడు నెలలలో ఆపరేషన్ చేయాలి" అన్నారు. పదేళ్ల క్రితం కాన్సర్‌తో మా నాన్నగారు చనిపోయారు. అందువల్ల మేము భయపడతామని సిస్టర్ విషయం మాకు చెప్పలేదు. అమ్మకి చెప్పింది. అమ్మ ద్వారా నాకు విషయం తెలిసి సిస్టర్‌కి ఫోన్ చేసి, "వెంటనే ఆపరేషన్ చేయించుకోమ"ని చెప్పాను. సిస్టర్ మళ్ళీ ఆ లేడీ డాక్టరు దగ్గరకి వెళితే, సెప్టెంబర్ నెల చివరిలో ఆపరేషన్‌కి డేట్ ఇచ్చారు. బాబా దయవల్ల ఆరోజు గురువారం అయింది. నేను బాబాకి అభిషేకం చేసి, "బాబా! ఆపరేషన్ బాగా జరిగి, గర్భసంచిలోని గడ్డలు నార్మల్ గడ్డలే అయ్యేలా దీవించండి. నేను మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను. అలాగే అనాధ శరణాలయంకి 1000 రూపాయలు విరాళం ఇస్తాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. డాక్టరు గురువారం ఉదయం ఆపరేషన్ చేసారు. నేను బాబాని ప్రార్థించి 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని మంత్రాన్ని జపించాను. ఆయన అద్భుతం చేసారు. ఆపరేషన్ బాగా జరిగి గర్భసంచిలో ఉన్న గడ్డలు నార్మల్ గడ్డలేనని డాక్టర్ నిర్ధారించారు. రెండు రోజుల తరువాత సిస్టర్‌ని డిశ్చార్జ్ చేసారు. నేను సిస్టర్‌ని చూడటానికి వెళ్లి వచ్చేటప్పుడు నాకు జ్వరం, ఒళ్లునొప్పులు వచ్చాయి. అసలే నాకు గతంలో కరోనా వచ్చి బాగా ఇబ్బంది అయింది(అప్పుడు బాబా దయవల్లే తగ్గిందని ఇదివరకు బ్లాగులో పంచుకున్నాను). అందువల్ల జ్వరం, ఒళ్లునొప్పులు అనేసరికి నాకు చాలా భయమేసి ఊదీ రాసుకుని 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని స్మరిస్తూ, "బాబా! మీ దయతో నాకు జ్వరం తగ్గితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవలన జ్వరం తగ్గిపోయింది. "బాబా! మీకు వందనాలు. ఆలస్యంగా నా అనుభవాలు పంచుకున్నందుకు నన్ను క్షమించండి. మీ దయతో జాయిన్ అయిన ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ కోర్సులో 6 మాడ్యూల్స్ పాస్ అయ్యాను. మిగిలిన 4  మాడ్యూల్స్ కూడా పాసై నాకు మంచి గ్రేడే వచ్చేలా దీవించండి స్వామి. నా భార్య మెడ, భుజాల నొప్పులతో భాదపడుతుంది స్వామి. దయచేసి తనకి నొప్పులు తగ్గించండి. అలాగే నాకున్న ఆరోగ్య సమస్యలు తగ్గేలా చేయండి బాబా. ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా మా ఇద్దరికీ ఎటువంటి సమస్యలు లేకుండా దీవించండి బాబా. ఇంకా నాకున్న సొంత ఇంటి కోరికను తీర్చండి బాబా. మీరే నాకు తల్లి, తండ్రి, గురువు. మీ ఆశీస్సులు మా మీద ఎప్పుడూ ఉండాలి తండ్రి".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!



3 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om sairam sai nannu vamsi ni kalupu sai na kapuranni nilabettu sai na bartha manasu manchi ga marchu sai thanu Mari nannu manaspurthi ga barya ga swikarinchela chudu sai naku na bartha tho kalisi undalani undhi sai nyayam anipisthe nannu na Barthani kalapandi said menu na anubhavanni said maharaja sannidhi blog lo panchukuntanu sai thanaki dhiram ga undaleka narakam ga undhi said Mir u thappa yevaru dunno solve cheyyaleru said plsss nannu na vamsi ni kalupu said

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo