1. చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి సమస్యను పరిష్కరించే బాబా
2. నామసప్తాహం చేయమని సూచననిచ్చి ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబా
3. బీపీ కంట్రోల్ చేసి ఆపరేషన్ జరిగేలా చూసిన బాబా
చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి సమస్యను పరిష్కరించే బాబా
సాయి భక్తులందరికీ నమస్కారం. బ్లాగు నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు. నా పేరు రేవతి. నేను ఈమధ్య ఒకరోజు మాకు తెలిసిన వాళ్ళింటికి వెళ్ళాను. ఆ సమయంలో ఆ ఇంటావిడకి బాగా జలుబు, దగ్గు ఉన్నాయి. ఆవిడ నాకు దగ్గరగా ఉండి మాట్లాతున్నంతసేపు దగ్గుతూనే ఉంది. కరోనా ప్రభావం తగ్గినా ఏదో మూల భయం ఉంటుంది కదా! అందువల్ల నేను బాబాను ఒకటే కోరాను, "బాబా! ఆవిడకి కరోనా కాకూడదు. నాకు జలుబు, దగ్గు రాకూడదు. నా వల్ల మావాళ్ళకి ఇబ్బంది కలగకూడదు" అని. బాబా దయవల్ల నెల రోజులు దాటినా నాకు కొంచెం కూడా జలుబు, దగ్గు లేవు. ఆవిడ కూడా బాగానే ఉన్నారు. "ధన్యవాదాలు బాబా".
2022, సెప్టెంబర్ 8న మా పెద్ద ఆడపడుచు చనిపోయారు. సెప్టెంబర్ 19న పెద్దకర్మ చేయాలని నిశ్చయించాం. అయితే 19, 20 తేదీలలో తుఫాను ఉందని వార్తలు వచ్చాయి. నిజంగానే 18వ తేదీ రాత్రి నుండి విపరీతంగా వర్షం మొదలై తెల్లారి కూడా కురిసింది. నేను, "బాబా! వర్షాన్ని ఆపగలిగేది మీరే తండ్రి. దయతో వర్షాన్ని అపి ఈ కార్యం చక్కగా జరిగేలా చూడండి. కార్యక్రమానికి వచ్చిన అందరూ ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్లేవరకు వర్షాన్ని ఆపితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. ఆశ్చర్యంగా అంత పెద్ద వర్షం కూడా ఆగిపోయింది. కార్యక్రమం చక్కగా జరిగింది. అందరూ ఎవరి ఇండ్లకు వాళ్ళు బయలుదేరిన తరువాత మళ్ళీ వర్షం పడింది. ఇంకో అద్భుతమేమిటంటే నేను, మావారు బండి మీద వెళ్తుంటే హఠాత్తుగా వర్షం మొదలైంది. మీరు నమ్ముతారో లేదో కానీ, మేము ఆ వర్షంలో పెద్దగా తడవలేదు. చిన్న చినుకులు పడితే ఏ మాత్రం తడుస్తామో అంతే తడిసాము. కానీ వర్షం పెద్దగానే కురిసింది. ఇదంతా బాబా లీలకాక మరేంటి? "థాంక్యూ బాబా".
మావారు కార్యక్రమం కోసం వారం రోజులు బాగా శ్రమపడ్డారు. అందువల్ల కార్యక్రమం పూర్తవుతూనే ఆయనకి జ్వరం వచ్చింది. నేను, "బాబా! మావారికి జ్వరం తగ్గితే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. బాబా దయవలన మావారికి జ్వరం తగ్గింది. తరువాత కొద్ది రోజులకి మా అమ్మకి జ్వరం వచ్చి బాగా సీరియస్ అయింది. అప్పుడు నేను బాబాను తలుచుకుని ఊదీ నీళ్లు అమ్మకి ఇచ్చాను. అలాగే, "జ్వరం తగ్గి అమ్మ మామూలు మనిషి అయితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. వారం రోజుల్లో అమ్మ కోలుకుంది. "ధన్యవాదాలు తండ్రి".
గతంలో కొన్ని నెలలు నేను ముఖం మీద మొటిమలు వచ్చి నొప్పితో చాలా ఇబ్బందిపడ్డాను. ఏది రాసినా తగ్గేది కాదు. చివరికి విసిగిపోయి బాబా ఊదీ మొటిమలపై రాసి, "బాబా! మీరే ఈ మొటిమల బాధ తగ్గించాలి" అని అనుకున్నాను. బాబా దయవల్ల మొటిమలు తగ్గాయి. ఇది సిల్లీగా ఉండొచ్చు కానీ, నేను ఆ మొటిమలతో బాగా బాధపడ్డాను. అందుకే బాబాని ప్రార్థించాను. ఒకసారి కన్ను నొప్పి వచ్చినప్పుడు కూడా బాబా ఊదీ రాస్తే, కన్ను నొప్పి తగ్గి నార్మల్ అయింది. ఇంకోసారి నా నోటిలో మాంసం పెరిగి బాగా నొప్పి పెడుతుండేది. ఆ కారణంగా ఏమీ తినలేకపోయేదాన్ని. అప్పుడు కూడా నేను ఏ మందులు వాడక బాబా ఊదీ రాస్తే, వాపు తగ్గి నార్మల్ అయింది. ఇలా బాబా చిన్న, పెద్ద అని తేడా లేకుండా మన ప్రతి సమస్యను పరిష్కరిస్తారు. ఏవో కొన్ని సమస్యలు మాత్రం మన కర్మఫలం కారణంగా సమసిపోక మనల్ని ఇబ్బందిపెడతాయి. అలాంటి సందర్భాలలో కూడా బాబా మెసేజులు మనకి ధైర్యాన్నిస్తాయి. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో బాబాని విడిచిపెట్టకూడదు, కోపగించుకోకూడదు. అయినా మనం ఎలా ఉన్నా బాబా మనల్ని విడవరు. ఇది నా అనుభవాల ద్వారా తెలుసుకుని చెప్తున్నాను. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా".
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
నామసప్తాహం చేయమని సూచననిచ్చి ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబా
ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నేను సాయిభక్తురాలిని. ముందుగా, నా ఈ అనుభవాన్ని పంచుకోవడం చాలా ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించమని సాయితండ్రిని వేడుకుంటూ, నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఒకసారి మా పిన్ని (మా అమ్మకి చెల్లెలు) అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో తన పరిస్థితి చాలా సీరియస్ అయింది. డాక్టర్లు కూడా ఏమీ చెప్పలేము అన్నారు. అటువంటి సమయంలో ఒకరోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో, క్రిస్టియన్ అయిన నా స్నేహితురాలు మా యూనివర్సిటీలోంచి సాయిబాబా ఫోటో పట్టుకుని బయటకు వస్తోంది. అప్పుడు నేను, "ఇదేమిటి, నువ్వు సాయిబాబా ఫోటో పట్టుకున్నావు?" అని తనని అడిగాను. అప్పుడు తను నాతో, "సైతాన్ నన్ను పట్టుకున్నాడు. బాబా నన్ను రక్షించాలి కదా! కానీ బాబా పట్టించుకోలేదు. అందుకే నాకు కోపం వచ్చింది. ‘సాయి నామసప్తాహం’ చేయడానికి బాబా ఫోటో తీసుకెళ్తున్నాను" అని చెప్పింది. తనేం చెబుతోందో నాకు అర్థం కాలేదు. ఇంతలో నాకు మెలకువ వచ్చింది. నేను అంతకుముందు ఎప్పుడూ ‘నామసప్తాహం’ అనే మాట వినలేదు. అందువల్ల, సాయిబాబాని పూజించే మా బంధువులొకరికి ఫోన్ చేసి, ‘నామసప్తాహం అంటే ఏమిట’ని అడిగాను. వారు నామసప్తాహం అంటే ఏమిటో వివరంగా చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది, ‘మా పిన్ని ఆరోగ్యం మెరుగవటం కోసం నామసప్తాహం చేయమని బాబా నాకు ఈవిధంగా సూచన ఇస్తున్నారు’ అని. ఆ సమయంలో నాకు పరీక్షలు జరుగుతున్నందువల్ల పరీక్షలు పూర్తయిన తర్వాత ఒక గురువారంనాడు సాయి నామసప్తాహం మొదలుపెట్టి బాబా దయతో చక్కగా పూర్తిచేశాను. సాయి నామసప్తాహం పూర్తయ్యేసరికి మా పిన్నికి ఆరోగ్యం చాలా మెరుగుపడింది. ఎంతో కరుణతో మా పిన్నికి ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకు బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అప్పటివరకూ నేను బాబాకి మామూలుగా నమస్కరించేదాన్నే తప్ప బాబాపై పూర్తి నమ్మకంతో పూజగానీ, నామస్మరణగానీ చేసి ఎరుగను. అటువంటిది బాబా నాకు తమ నిదర్శనాన్ని చూపటమే కాక, 20 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకునే అదృష్టాన్ని ప్రసాదించారు. “ఇకనుంచైనా కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా శిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకునే అదృష్టాన్ని ప్రసాదించండి బాబా. అందరినీ ఎల్లప్పుడూ చల్లగా చూడండి. అందరినీ రక్షించండి బాబా”. బాబా నాకు ప్రసాదించిన మరికొన్ని అనుభవాలను మరోసారి పంచుకుంటాను.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గరు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
బీపీ కంట్రోల్ చేసి ఆపరేషన్ జరిగేలా చూసిన బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయి భక్తులు అందరికీ నమస్కారం. నా పేరు రమాదేవి. నేను బాబా భక్తురాలిని. నా జీవితంలో నేను కోరిన ప్రతీ కోరికను బాబా నెరవేర్చారు. ఇటీవల ఆ సాయినాథుడు నాకు చేసిన మేలును మీతో పంచుకుంటున్నాను. ఒకరోజు నా భర్తకు తీవ్రంగా వెన్నునొప్పి, కడుపులో నొప్పి వచ్చాయి. ఆ రోజు సాయంత్రం డాక్టరు దగ్గరకు వెళితే డాక్టరు స్కానింగ్ చేయించమన్నారు. స్కాన్ రిపోర్టులో కిడ్నీలో స్టోన్ ఉన్నట్లు వచ్చింది. డాక్టరు, "స్టోన్ పరిమాణం పెద్దదిగా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలి" అని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమన్నారు. సరేనని, మావారు అడ్మిట్ అయ్యారు. వెంటనే బీపీ చెక్ చేస్తే, ఎక్కువగా ఉంది. బీపీ ఎక్కువగా ఉంటే ఆపరేషన్ చేయటానికి కుదరదు. అయితే ఎన్ని మందులు వాడినా మావారి బీపీ కంట్రోల్ కాలేదు. అప్పుడు నేను, "బాబా! నా భర్త బీపీ కంట్రోల్ అయి ఆపరేషన్ సురక్షితంగా జరిగేలా చూడు స్వామి. మావారికి పూర్తిగా నయమైతే మీరు నాకు చేసిన మేలును 'సాయి మహారాజ్ సన్నిధి'లో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల 3వ రోజు బీపీ తగ్గడంతో ఆపరేషన్ చేసారు. ఇప్పుడు నా భర్త బాగున్నారు. ఇలా నా ప్రతి కష్టంలో ముందుండి కష్టాన్ని దాటిస్తారు బాబా. ఆయన అందరినీ ఎల్లవేళలా కాపాడుతారు. "శతకోటి నమస్కారాలు బాబా".
అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం శ్రీ సాయి రామ్ నీ దయ వుంటే అని ్్
ReplyDeleteవున్నట్లే.బాబా మా కుటుంబం కాపాడుతూ ఉండు తండ్రి.నీకు నా నమస్కారాలు
నామ సప్తాహం అంటే ఏమిటో dhayachesi వివరించగలరు
ReplyDelete