సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1380వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శ్రీసాయి అనుగ్రహ లీలలు - పదిహేడవ భాగం

సాయిబాబుగారు తమకు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలు గతవారం పంచుకున్నారు. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నారు.


దైవ దర్శనాలు - తీర్థయాత్రలు :


సాయి భక్తులారా! బాబా ఆపద్బాంధవుడు, అనాధ రక్షకుడు అని తెలిపే ఈ లీల చదవండి. ఒకసారి శిరిడీ చేరుకోవడానికి రెండు రోజుల ముందు నుండి జ్వరం కారణంగా ఏమీ తినకపోవడం వల్ల నా భార్యకి బాగా నీరసంగా ఉంది. అయినా బాబాని దర్శించుకోవాలనే తపనతో ఆమె స్నానం చేసి, తయారై మెల్లగా మెట్లు దిగి క్రిందకు వచ్చింది. అప్పటికే తనకి చాలా అలసటగా అన్పించింది. పైగా ఎండ తీవ్రంగా ఉంది. తను చాలా నిస్సహాయంగా, ‘ఇప్పుడెలా గుడికి వెళ్ళడం?’ అని అనుకుంటుండగానే ఆ హోటల్‍వాళ్ళ ఫ్రీ వ్యాన్ వచ్చి తనని మందిరం వద్ద దింపింది. జనం బాగా ఎక్కువగా ఉన్నారు. తను ఎలాగో వెళ్ళి లైన్‍లో నిలబడింది. క్యూలైన్ అరగంటసేపు కదిలిక మధ్యాహ్న హారతి కోసం లైన్ ఆపేశారు. బాబా అలంకరణ, నైవేద్య సమర్పణ, హారతి పూర్తయిన తర్వాత ఎంతసేపటికో గాని లైన్ ముందుకు కదలలేదు. కారణం ఎవరో వి.ఐ.పి.లు దర్శనానికి వచ్చారట. సుమారు రెండున్నర గంటల సమయం ఒకే చోట నిలబడి ఉండేసరికి అసలే నీరసంగా ఉన్న నా భార్యకి ఇక ఓపికలేక, కళ్ళు తిరుగుతున్నటుగా అన్పించి, “బాబా బాగా దాహంగా ఉందయ్యా” అని అనుకుంది. అప్పుడు ఓ అద్భుతం జరిగింది. క్యూలైన్ నెమ్మదిగా కదులుతుండగా ప్రక్క లైనులో నుండి ఒక వాటర్ బాటిల్ దొర్లుకుంటూ నా భార్య కాళ్ళ దగ్గరకు వచ్చింది. తను క్రింద పడి ఉన్న బాటిల్ ఎలా తీసుకోవడమని సంశయించింది. మళ్ళీ అంతలోనే తన మనసుకి, 'ఇంత జనంలో బాబా నా చిన్న కోరికను విని, వెంటనే మంచినీళ్ళ బాటిల్ పంపిస్తే నేను దాన్ని చేత్తో తీసుకోవడానికి సంశయించడం ఏమిటి?' అనిపించి వెంటనే వంగి ఆ వాటర్ బాటిల్ తీసింది. అది బిస్లరీ వాటర్ బాటిల్. చల్లగా ఉంది, సీలు కూడా తీసి లేదు. ఆనందభాష్పాలతో నా భార్య బాబాకి కృతజ్ఞతలు చెప్పుకుని ఆ బాటిల్ సీలు తీసి సగం బాటిల్ నీళ్ళు త్రాగేసింది. బాబానే తన దాహం తీర్చారన్న కొత్త ఉత్సాహంతో బాబాను దర్శించుకుంది. తర్వాత నా భార్య గురుస్థాన్‍లో బాబాను దర్శించుకుని, ద్వారకామాయికి వెళ్ళి, ధునికి నమస్కరించుకుని, బాబా కూర్చునే రాయిని తాకి కొంచెం సేపు అక్కడే కూర్చుంది. ఉదయం ఏమీ తినకుండా బయలుదేరడం, క్యూలైన్‍లో ఎక్కువసేపు నిల్చుని ఉండడం వల్ల తనకి బాగా ఆకలిగా అనిపిస్తుంది. అంతలో తలకు రుమాలు కట్టుకున్న 16 సంవత్సరాల కుర్రాడు ఒక పళ్లెం నిండా కిచిడీ తీసుకుని ద్వారకామాయి లోపలికి వచ్చి బాబాకి నివేదించాడు. అదంతా చూస్తున్న నా భార్య, “నాకు కొంచెం ప్రసాదం పెడితే బాగుండు బాబా” అని అనుకుంది. అయితే, ఆ కుర్రాడు తన పళ్ళెం తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. 5 నిమిషాల తర్వాత నా భార్య రూముకు వెళదామని బయటికి వచ్చేసరికి, “రండి బాబా ప్రసాదం తీసుకోండి” అని ఆ కుర్రాడు ఒక ప్లేట్ నిండా కిచిడీ పెట్టి ఇచ్చాడు. నా భార్య, “కొంచెం ప్రసాదం అడిగితే, నా ఆకలి గుర్తించి ప్లేటు నిండా కిచిడీ ఇప్పించావా బాబా” అని బాబాకి కృతజ్ఞతలు చెప్పుకుని ఆ ప్రసాదం ఆరగించింది. తన ఒంటిలో క్రొత్త శక్తి పుంజుకోగా తిరిగి రూముకి వెళ్లకుండా గురుస్థానం దగ్గర కూర్చుని రాత్రి 7 గంటల వరకు బాబా సన్నిధిలో గడిపి, అప్పుడు సంతోషంగా తన రూముకు వెళ్ళింది. ఉదయం వెళ్ళేటప్పుడు మెట్లు దిగటానికే అలసిపోయిన ఆమెకు రాత్రి 7 గంటల వరకు ఉండే ఓపికను ఇచ్చి జాగ్రత్తగా చూసుకుంది ఎవరు? ఇంకెవరు? బంగారు తండ్రి బాబానే. అడగ్గానే దాహాన్ని, ఆకలిని తీర్చిన బాబా లీలలు ఏమని చెప్పను? ఎన్నని చెప్పను?


2017, ఏప్రిల్, 6వ తేదీన నా భార్య, తన తల్లి కలిసి శ్రీశైలం వెళ్ళారు. అక్కడ వాళ్ళు, మరో 50 మంది నా భార్య బాబాయ్ స్వామితో కలిసి గుంపుగా శ్రీశైలం అడవుల్లో ఉన్న దత్తాత్రేయుడు తపస్సు చేసిన ప్రదేశమైన కదళీవనం మరియు అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజ దత్త పాదుకలు దర్శనానికి బయలుదేరారు. అయితే ఆ ప్రయాణం ఎంతో ప్రయాసతో కూడుకున్నది. కృష్ణా నదిలో ఒక గంట పడవ ప్రయాణం చేసిన తర్వాత 6 గంటలసేపు ఏటవాలుగా ఉన్న కొండలు ఎక్కాలి. ఆ 6 గంటల ప్రయాణంలో గుక్క మంచినీళ్ళు కూడా దొరకవు. సాధారణంగా కొండలు ఎక్కాలంటే చేతిలో కర్రను ఆసరాగా తీసుకుని ఎక్కాల్సి ఉంటుంది. కానీ అక్కడున్న కర్రలన్నీ నా భార్యతో ఉన్న అందరూ తీసుకుని వెళ్ళిపోయారు. అందువల్ల నా భార్యకి చేతి కర్ర దొరకలేదు. ఇక్కడ నేను ఇంట్లో కొండలెక్కే అలవాటు లేని నా భార్యకు బాగా ఇబ్బందిగా ఉంటుందని, “బాబా! నా భార్య వాళ్లకు తోడుగా ఉండి ముందుకు నడిపించు. వాళ్లకు ఏ ప్రమాదం జరగకుండా చూడు” అని బాబాను ప్రార్థిస్తూ ఉన్నాను. భక్తుల స్వచ్చమైన కోరికను బాబా కాదంటారా? హఠాత్తుగా ఒక వృద్ధుడు నా భార్యను కలిసి, "ఏమ్మా! నీకు చేతికర్ర దొరకలేదా? నా చేతి కర్ర ఇస్తాను. అయితే నువ్వు నా చేతి కర్రను మళ్ళీ జాగ్రత్తగా తెచ్చివ్వాలి” అని తన చేతి కర్రను ఆమెకు ఇచ్చాడు. ఆ చేతి కర్ర మిగిలిన వాళ్ళ చేతికర్రల కంటే బాగా బలంగా ఉందట. చూశారా! బాబా లీల ఇక్కడ నుంచే మొదలైంది. 


నా భార్య వాళ్ళు కొండ దిగువన తమ ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుండి రెండు శునకాలు(తెల్లది, ఎర్రది) వీళ్ళతోపాటు కొండ ఎక్కసాగాయి. వాటిలో తెల్ల కుక్క నా భార్యకి తోడుగా నడవసాగింది. ఆమె కొండ ఎక్కలేక చాలా వెనుకబడిపోయినా ఆ కుక్క తనని వదిలి వెళ్ళేది కాదు. ఒకవేళ అది కాస్త ముందుకు వెళ్లినా నా భార్య నడవలేక ఒక చోట కూర్చుంటే, అది మళ్ళీ మెట్లు దిగి వెనక్కి వచ్చి నా భార్య పక్కనే కూర్చునేది. అలా నా భార్య కదళీవనంలో ఉన్న మూడు రోజులూ ఆ తెల్ల కుక్క కంటికి రెప్పలా ఆమెను కాపు కాసింది. దానికి అవసరమైన నీరు, ఆహారం ఆమె పెట్టేది.


మూడవరోజు అందరు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న దత్తాత్రేయుని నిజపాదుకలు చూడటానికి బయలుదేరారు. అప్పుడు కూడా నా భార్య బాగా వెనుకబడింది. చుక్కలు వచ్చే వేళ ఒంటరిగా నడుస్తున్న నా భార్యకి అంతకుముందు దారిలో చూసిన జంతు కళేబరాలు, ఒక చోట గుహలో ఏదో జంతువు యొక్క తెల్లని తోక గుర్తొచ్చి చాలా భయమేసింది. ఆ సమయమంతా నేను మా ఇంట్లో బాబాని ప్రార్థిస్తూనే ఉన్నాను. ఆ తండ్రి దయవల్ల ఎవరికీ ఏ ఆపద వాటిల్లలేదు. అంతేకాదు, అక్కడ ఒక అద్భుత లీల జరిగింది. పౌర్ణమి ముందురోజు సాయంత్రం 7-8 గంటల మధ్యలో వాళ్ళు అక్కడ సత్సంగం పెట్టుకున్నారు. నా భార్య బాబాయ్ స్వామి ప్రవచనం చెబుతున్నారు. నా భార్య 30 అడుగుల దూరంలో కూర్చుని ప్రవచనం వింటూ మనసులో, “బాబా! ఇంతవరకూ మా వెంటే ఉండి కాపాడావు. ఈ కదళీవనంలో మీరున్నట్లు నాకు మాత్రమేకాక ఇక్కడున్న అందరికీ తెలిస్తే బాగుండు” అని అనుకుంటూ స్వామి వైపు చూసింది. ఆయన పక్కనే ఉన్న ఒక రాయి మీద తెల్లని వస్త్రాలతో, తలకు గుడ్డతో కాలు మీద కాలు వేసుకుని శాంతమూర్తిలా బాబా నా భార్యకి కన్పించారు. ఆమె ఒక్క నిమిషం తన కళ్ళను తనే నమ్మలేకపోయింది. వెంటనే ఒక కుర్రవాడిని పిలిచి, "అక్కడ నీకు బాబా కనిపిస్తున్నారా?" అని అడిగితే, ఆ కుర్రాడు, “అక్కా! స్వామి ప్రక్కనున్న రాయి మీద తెల్ల బట్టలు, తలగుడ్డతో కాలు మీద కాలు వేసుకుని బాబా స్పష్టంగా కనిపిస్తున్నారు" అని అన్నాడు. దాంతో నా భార్య, 'తనకి దర్శనమిస్తున్నట్లే, ఈ కుర్రాడికి కూడా బాబా దర్శనమిస్తున్నారు. ఎంత ధన్యజీవి! ఎక్కడ శిరిడీ? ఎక్కడ కదలీవనం? నాకోసం ఇంత దూరం వచ్చావా బాబా” అని అనుకుని కన్నీళ్ళతో బాబాకి కృతఙ్ఞతలు చెప్పుకుంది. కదళీవనానికి బయల్దేరేముందు స్వామి “అక్కడ దివ్య అనుభవాలు కలుగుతాయ"ని చెప్పినట్లే బాబా దివ్యదర్శనం ఇచ్చారు.


2016, డిసెంబర్ 15వ తేదీన నా భార్య బాబా అనుమతితో సోమనాథ్, నాగేశ్వర్, త్రయంబకం, భీమశంకరం జ్యోతిర్లింగాల దర్శనానికి కొంతమందితో కలిసి వెళ్ళింది. వాళ్లంతా హైదరాబాదులో రైలు ఎక్కాల్సి ఉండగా మా ఊరు నుండి తను ఒక్కతే వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ తను ఎన్నడూ ఒంటరిగా ప్రయాణం చేయలేదు. అందుచేత మేము ఇప్పుడు ఎలా అన్న ఆలోచనలో ఉండగా ఒకరోజు నా భార్య బాబా పుస్తకం చదువుతుంటే, “ప్రయాణం సాఫీగా సాగుతుంది. ప్రయాణానికి డబ్బు, తోడు దొరుకుతాయి” అనే వాక్యం వచ్చింది. అయితే రేపే ప్రయాణమనగా కూడా నా భార్యకు తోడుగా వెళ్ళేవాళ్ళెవరూ కనిపించలేదు. దాంతో నేను ‘తను ఒక్కతే ఎలా వెళ్తుంద’ని, "నేను కూడా నీతో హైదరాబాదు వరకూ వచ్చి, నిన్ను రైలు ఎక్కించి వస్తాన"ని నా భార్యతో అన్నాను. అందుకామె, “వద్దు. బాబా, 'తోడు లభిస్తారు' అని చెప్పారు కదా!” అని అంది. ఆ రోజు గురువారం. అర్ధరాత్రి 1 గంటకే నిద్రలేచి స్నానాలు చేసి, బాబా పూజ, హారతి పూర్తిచేసి తెల్లవారుఝామున గం.4-30ని|లకు బస్టాపుకు వెళ్ళాము. ఆశ్చర్యం! అక్కడ మాకు బాగా తెలిసినవాళ్ళు హైదరాబాదు వెళ్ళటానికి బస్సుకోసం వేచి ఉన్నారు. బాబా నా భార్యకోసం తోడుగా పంపిన వాళ్ళు 'వాళ్ళే'నని నాకు అర్ధమై, ఆమెను వాళ్ళతో బస్సు ఎక్కించి 5 నిమిషాల్లో ఇంటికి తిరిగి వచ్చేసాను. చూశారా! బాబా నా భార్యకు తోడును చూపించి, నేను హైదరాబాద్ దాకా వెళ్లి, తిరిగి వేరే రైలు పట్టుకుని ఇంటికి ఏ అర్ధరాత్రికో చేరే శ్రమను తప్పించారు. "వందనాలు బాబా".


నా భార్య ఎప్పటినుండో చార్‌ధామ్ యాత్రకు వెళ్ళాలనుకుంటూ ఉండగా 2017లో తన బాబాయ్ స్వామి ఆ యాత్రకు ప్లాన్ చేస్తున్నాము అని చెప్పారు. ఇంకా నా భార్య సంతోషంగా ఆ యాత్రకు వెళ్లడానికి సిద్ధమైంది. ఏప్రిల్ నెలలో ఒకరోజు నేను, నా భార్య రిలయన్స్ మార్కెట్‍కి వెళ్లి ఇంట్లోకి కావలసిన వస్తువులు తీసుకుంటుండగా నా భార్య బాబాయ్ స్వామి హైదరాబాద్ నుంచి మాకు ఫోన్ చేసి, “ఛార్‌ధామ్ యాత్రకి టిక్కెట్లు బుక్ చేస్తున్నాము. రైలు టికెట్లు లేనందున విమానంలో వెళ్ళాల్సి ఉంటుంది. వెంటనే పదివేలు నా అకౌంటులో వేయండి. లేదంటే, నీ భార్యను తీసుకెళ్ళడం కుదరద"ని చెప్పారు. మా పర్సులో పదివేల రూపాయలు ఉన్నాయి. కానీ శని, ఆదివారాలు బ్యాంకు సెలవు అయినందున డబ్బు పంపడం ఎలాగో తెలియలేదు. ఆ విషయమే స్వామితో అంటే, “వెయ్యి, రెండు వేలు అయితే సర్దగలంగాని, పదివేలు ఎలా సర్దగలం?” అని అన్నారు ఆయన. ఆయన పక్కనే మా బంధువులున్నా వాళ్ళు, మేము సర్దుతామనే మాట అనలేదు. ఇట్టి స్థితిలో ఏం చేయడానికి తోచక, 'చార్‍ధామ్ యాత్రకు వాళ్ళతో వెళ్ళాలా? వద్దా?' అని బాబాను అడిగితే, 'వెళ్ళమ'ని బాబా సమాధానం వచ్చింది. ఇక బాబాయే సహాయం చేస్తారని మా మనసు శాంతించింది. గంట తర్వాత స్వామి ఫోన్ చేసి, "యాత్రకు వచ్చే వారిలో ఒకరికి మీ విషయం తెలిసి, పదివేల రూపాయలు సర్దుబాటు చేసి, నీ భార్యకు చార్‌ధామ్ యాత్రకు టిక్కెట్టు ఇప్పించార"ని చెప్పారు. ఆ వ్యక్తి రూపంలో బాబానే టిక్కెట్టుకు డబ్బిచ్చారని మేము సంతోషించాము. సోమవారం బ్యాంకు ద్వారా అతనికి డబ్బు పంపించి, ఫోన్‌లో అతనికి కృతజ్ఞతలు తెలియజేసాము.


ఇకపోతే మునుపు యాత్రలకు వెళ్ళినప్పుడు సరైన ఫోన్ లేక ఆయా ప్రదేశాల్లో ఫోటోలు తీసుకోలేకపోయానని నా భార్య ఇంటికొచ్చాక బాధపడింది. అందువల్ల ఈసారి తన యాత్ర నిర్ధారణ అయినప్పటి నుండి ఒక మొబైల్ ఫోన్ కొందామని సుమారు ఒక నెల రోజులు ప్రయత్నించాము. రెండు, మూడు సార్లు షాపుకి వెళ్లి మొబైల్ ఫోన్లు చూశాము కూడా. కానీ ఎందుకో మొబైల్ తీసుకోవడానికి బాబా అనుమతి లభించక తిరిగి వచ్చేసాము. చివరికి నా భార్య యాత్రకు వెళ్ళే రోజు దగ్గరపడుతుండగా ఫోటోలు తీసుకోవడానికి వీలుగా తక్కువ ధరలో ఏదైనా ఒక ఫోన్ తీసుకుందామని మా ఊరికి దగ్గరలో ఉన్న చేబ్రోలుకు బయలుదేరాము. అంతలో నా భార్య తమ్ముడు, అతని భార్య మా ఇంటికి వచ్చి, నా భార్య చేతికి ఒక కవరు ఇచ్చి, “వీటిని హనీ అమెరికా నుండి మీకోసం తెచ్చింది” అని ఇచ్చారు. (హానీ అంటే నా మేనకోడలు. తను బాబా దయతో అమెరికాలో చదువుకుంటుంది. తను సెలవులకి 2017 మేలో ఇండియాకు వచ్చింది.) వాళ్ళిచ్చిన కవరులో ఖరీదైన ఒక 'ఐ ఫోన్', మంచి పర్సు, కొన్ని అమెరికా చాక్లెట్లు ఉన్నాయి. ఆ ఫోన్ చూసిన మేము కొంచెం సేపటి వరకు ఇది కలా? నిజమా? అనే ఆశ్చర్యంలో ఉండిపోయాము. తక్కువ ధరలో ఫోన్ కొనుక్కుందామనుకున్న మాకు ఏకంగా 'ఆపిల్ ఐఫోన్‍ను, అది కూడా ఫోను కొనడానికి బయల్దేరిన సమయంలో  అందించడం బాబా లీలకాక మరేమిటి?


2017, మే 27వ తేదిన నా భార్య హైదరాబాదు వెళ్ళి, అక్కడ నుండి మిగిలిన వారితో కలిసి 28వ తేదీ ఉదయం 'చార్‌ధామ్' యాత్రకు ఫ్లైట్‍లో వెళ్లాల్సి ఉండగా 26వ తేదీ రాత్రి టీవీలో 'యాత్రకు అంతరాయం' అని కన్పించింది. ఆ తరువాత విపరీతమైన గాలి, ఉరుములు, మెరుపులతో పెద్ద వర్షం మొదలై రాత్రంతా కురుస్తూనే ఉంది. 27వ తేదీ తెల్లవారుఝామున బయల్దేరేముందు నేను, “బాబా! నా భార్య యాత్రకు అంతరాయం కలగకుండా చూడు” అని బాబాను ప్రార్థించాను. అంతే, 5 నిమిషాలలో వర్షం ఆగిపోయి వాతావరణం ప్రశాంతంగా మారిపోయింది. నేను కారులో నా భార్యను గుంటూరు రైల్వేస్టేషనుకు తీసుకువెళ్ళి, రైలు ఎక్కించి తిరిగి వచ్చాను. అలా బాబా దయవల్ల ప్రకృతి యాత్రకు సహకరించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుని నా భార్య యాత్రకు వెళ్ళింది.


బాబా తాము సమాధి చెందడానికి ముందు ఎలా తమ లీలలను చూపించేవారో, ఇప్పుడు అంతకంటే ఎన్నోరెట్లు అధికంగా చూపిస్తున్నారని మన అందరికీ అనుభవమే. ఛార్‌ధామ్ యాత్రలో బాబా గురువారం నాడు ఆ కొండ కోనల్లో నా భార్యకు దర్శనమిచ్చి, ముందుండి నడిపిస్తూ, ఒంటరిగా ఉన్నప్పుడు తోడుగా నిలిచి, ఏ ఆటంకం, ఆపద రాకుండా యాత్రను పూర్తి చేయించారు బాబా. ఎలాగంటే; ఛార్‌ధామ్ యాత్రలో భాగంగా నా భార్యవాళ్ళు మొదట యమునోత్రికి బయలుదేరారు. ఆరు కిలోమీటర్ల దూర ప్రయాణం చేయడానికి అందరూ గుఱ్ఱాలు ఎక్కారు. కానీ నా భార్య అంత దూరం ఆ గుఱ్ఱాన్ని కష్టపెట్టడం ఇష్టం లేక తను ఒక్కతే కాలినడకన ఆ కొండపైకి వెళ్లి యమునా నది జన్మస్థలం దర్శించుకుంది. అక్కడ స్నానం, పూజ అయ్యాక తిరిగి ఒక్కతే కొండ దిగి వస్తుంటే వర్షం మొదలైంది. తను అక్కడక్కడా ఆగుతూ పూర్తిగా కొండ దిగువకు వచ్చేసరికి రాత్రి 7:30 అయింది. తను అక్కడినుండి అందరూ కలసి వచ్చిన సుమో దగ్గరకి వెళ్ళాలని ప్రయత్నించింది. కానీ అంతా చీకటిగా ఉంది. పైగా మూడు, నాలుగు రోడ్లు కన్పించేసరికి తనకి ఎటు పోవాలో అర్థం కాలేదు. భాష సరిగా రాదు, వర్షంలో తడవడం వల్ల తనకి బాగా చలిగా ఉంది. అట్టి స్థితిలో తనకి ఏం చేయాలో తోచక, “ఏమిటి పరిస్థితి” అని బాబాని తలుచుకుంది. వెంటనే మిలటరీ యూనిఫారంలో ఉన్న 30 సంవత్సరాల వ్యక్తి ఒకరు తనకు కన్పించి, విషయం తెలుసుకుని, ప్రక్కనే ఉన్న 'అనౌన్స్ మెంట్ ఆఫీసు'లో మైకు తీసుకుని "మీ పేరు, ఊరు చెప్పి, మీ వాళ్ళను 'అనౌన్స్ మెంట్' ఆఫీసు' వద్దకు రమ్మని చెప్పండి” అని సలహా ఇచ్చాడు. తను అలాగే చేసింది. 5 నిమిషాల్లో ఆమెతో వెళ్లిన యాత్రికులు ఇద్దరు వచ్చి, ఆమెను 'సుమో' వద్దకు తీసుకెళ్లారు. లేదంటే చాలా ఇబ్బంది అయ్యేది. కానీ ఏ ఇబ్బంది లేకుండా బాబా ఆ మిలటరీ వ్యక్తి రూపంలో సహాయం చేశారు. "చాలా కృతజ్ఞతలు తండ్రి".


తరువాత వాళ్ళు గంగోత్రికి ప్రయాణమయ్యారు. గంగోత్రిలో కారు దిగగానే నా భార్యకి బాగా చలిగా అన్పించి దుప్పటి తీసి కప్పుకుని అరకిలోమీటరు దూరం నడిచి గంగానది తీరానికి చేరుకుంది. నది నీళ్లు చల్లగా జివ్వుమంటున్నాయి. అందుచేత నదిలో దిగి స్నానం చేయడానికి సాహసించక అందరూ ఒడ్డునే కూర్చున్నారు. నా భార్య మాత్రం, 'గంగలో మునిగితే పాపాలు పోతాయంటారు. మరి ఇంత దూరం వచ్చి స్నానం చేయకుంటే ఎలా?' అని ఒక చెంబుతో నీళ్లు తీసుకుని తన తల మీద పోసుకుంది. అంతే, ఆ చల్లటి నీళ్ళు పడగానే నా భార్య తలంతా మొద్దుబారిపోయింది. అయినా భరించి తను మరో చెంబు నీళ్లు తల మీద పోసుకుంది. ఇక అంతే, స్పర్శ తెలియనంతగా తల మొద్దుబారిపోయి తను ప్రాణ సంకటంలో పడింది. వెంటనే తనకి బాబా గుర్తొచ్చి, కుడిచేతి మణికట్టుకు దారంతో కట్టిఉన్న బాబా లాకెట్‍ను తన నుదుటికి ఆనించుకుని, తరువాత తలపై పెట్టుకుంది. తరువాత 'రెండు చెంబులు పోసుకున్నాను కదా? మూడో చెంబు కూడా పోసుకుంటే స్నానం చేసిన ఫలితం దక్కుతుంద'ని ధైర్యం చేసి మూడవ చెంబు తలపై పోసుకుంటూ బాబాను తలచుకుంది. అంతే, తన ఒళ్ళంతా వెచ్చగా అయిపోయి చాలా హాయిగా అన్పించింది. తన చుట్టూ వెచ్చగా ఒక వలయం ఏర్పడింది. తరువాత తను నడుస్తున్నా ఆ వెచ్చదనం తనతోనే చాలాసేపు ఉంది. అందువల్ల వచ్చేటప్పుడు కప్పుకొని వచ్చిన దుప్పటి అవసరం వెళ్ళేటప్పుడు లేకుండా పోయింది. తను గంగామాత దర్శనం చేసుకుని, ప్రసాదం తీసుకుని గుడి బయటికి వచ్చి, అక్కడున్న బెంచి మీద కూర్చుంది. అప్పుడు ఎందుకో తనకు బాబా పుస్తకం చదవాలనిపించి,  పుస్తకంలోని ఒక పేజీ తెరవగానే, “నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటాను” అనే వాక్యం కన్పించేసరికి బాబా కృపకు, వాత్సల్యానికి ఆమెకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. తర్వాత ఆమె అర కిలోమీటరు దూరంలో ఉన్న కారు వద్దకు బయలుదేరింది. పది నిమిషాలు నడిచాక, “బాబా! ఈ రోజు గురువారం. ఇక్కడంతా శివుడు, శివలింగం ఫోటోలే కన్పిస్తున్నాయి. మీ దర్శనం ప్రసాదించండి బాబా" అని మనసులో అనుకుంది. ఆశ్చర్యం! ఒక్క సెకండులో రెండు షాపులకి మధ్య ఉన్న ఒక పెద్ద గూట్లో చిన్న శివలింగం, ప్రక్కనే కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న శ్రీసాయినాథుడు దర్శనమిచ్చాడు. నా భార్య మనసంతా ఆనందంతో నిండిపోయింది. 'గంగోత్రిలో సాయినాథుని ఫోటో' అన్న భావనే తనకు మధురంగా అన్పించి అంతకుముందే కొని తన చేతిలో ఉన్న జిలేబీ ప్యాకెట్లు ఆయనకు నైవేద్యంగా సమర్పించి, ఆయన పాదాల వద్ద ఉంచి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని, ఆ తండ్రి దీవెనలతో అక్కడున్న బత్తాయి పండు ప్రసాదంగా తీసుకుని కారు వద్దకు వెళ్లి అందరికీ పంచింది. ఆ చన్నీటి స్నానానికి అక్కడే స్పృహ తప్పి పడిపోవాల్సిన నా భార్యను బాబా కాపాడారు. సదా రక్షణ కవచంలా ఉండి కాపాడే బాబాకు హృదయపూర్వక వందనాలు.


నా భార్య 'చార్‌ధామ్' యాత్రలోని మరికొన్ని విశేషాలతోపాటు మరికొన్ని అనుభవాలు తరువాయి భాగంలో .. 




 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 


 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 



4 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Sai nannu vamsi ni kalupu sai na kapuranni nilabettu sai thanu manchi ga Mari nannu barya ga swikarinchi kapuraniki thiskellela chudu sai kapadu sai plssssss

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo