సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1384వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కోరిక న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఉంటే బాబా తప్పక నెరవేరుస్తారు
2. ఆరోగ్యనిచ్చే బాబా

కోరిక న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఉంటే బాబా తప్పక నెరవేరుస్తారు


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


నాపేరు చైతన్య. నేను ఒక సాయి భక్తురాలిని. 'సాయీ' అంటే 'ఓయీ' అని పలికే దైవం ఆ శిరిడీ సాయినాథుడు. ఆయన మనల్ని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతుంటారు.  ఆయన మనకు ఏదైనా అవసరమైనప్పుడు 'నేనున్నాన'ని ఏదో ఒక రూపంలో మనకి సహాయం అందిస్తూ ప్రతిరోజు ఎన్నో అనుభవాలు ప్రసాదిస్తుంటారు. ఈ బ్లాగులో అటువంటి అనుభవాలు చదువుతుంటే సాయి సత్సంగంలో ఉన్నట్టు అనిపించడంతోపాటు బాబా మనతో ఉన్నారని చాలా ధైర్యంగా ఉంటుంది. బాబా ప్రసాదించే అనుభవాలను సోదర సాయి భక్తులతో పంచుకునే అద్భుత అవకాశాన్నిస్తున్న బ్లాగు నిర్వాహకులకు కృతజ్ఞతలు. ఇక నా అనుభవాల విషయానికి వస్తే...  మేము ఎప్పటినుండో శిరిడీ వెళ్లాలనుకుంటున్నాము కానీ, కరోనా కారణంగా వెళ్లలేకపోయాం. చివరికి బాబా అనుమతితో మేము 2022, ఆగస్టులో శిరిడీ వెళ్ళడానికి టిక్కెట్లు బుక్ చేసుకున్నాము. తర్వాత హఠాత్తుగా మా మామయ్యగారి ఆరోగ్యం బాగా లేకుండాపోయింది. ఆయన వేరే ఊరిలో ఉంటారు. నేను, "బాబా! మా మామయ్యగారి ఆరోగ్యం బాగుండేటట్లు దయచూపు తండ్రి. ఆయన ఆరోగ్యంగా ఉంటే మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి'లో పంచుకుంటాను" అని చెప్పుకుని, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని స్మరించి మా ఇంట్లో అందరం ఊదీ ధారణ చేసాము. బాబా దయవల్ల మావయ్యగారి  ఆరోగ్యం కుదుటపడింది. అది ఊదీ మహిమ. బాబా ఊదీ సంజీవని. "ధన్యవాదాలు బాబా".


మా శిరిడీ ప్రయాణానికి వారం రోజుల ముందు మా ఇంట్లో అందరికీ ఒకరి తర్వాత ఒకరికి జ్వరం, జలుబు, దగ్గు వచ్చాయి. అందరికీ అలా వస్తుండేసరికి మాకు చాలా భయమేసి, 'మేము శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుంటామో, లేదో అని అనుకున్నాము. అప్పుడు నేను, "బాబా! ఏ ఆటంకం లేకుండా మా శిరిడీ యాత్ర బాగా జరిగి, మేము క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే, మీ కృపను 'సాయి మహారాజ్ సన్నిధి'లో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల మా ప్రయాణానికి ఒకరోజు ముందు అందరి ఆరోగ్యం కుదుటపడింది. మేము ఆనందంగా శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాము. బాబా తమ దర్శన భాగ్యాన్ని మాకు మూడుసార్లు ప్రసాదించారు. మా అత్తయ్య పెద్దావిడ. అంతసేపు నిలబడలేరని ఆవిడకి దర్శనం టికెట్ బుక్ చేసి నాకు, మా పిల్లలిద్దరికీ ఆన్లైన్‍లో హారతి టిక్కెట్లు బుక్ చేసుకున్నాము. కానీ అత్తయ్య, "నేను కూడా ఆరతి చూస్తాను" అని అన్నారు. అప్పుడు నేను, "బాబా! మా అత్తయ్య హారతి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నారు. దయచేసి ఆవిడకి ఆరతి దర్శనం ఇవ్వండి" అని చెప్పుకుని మా చిన్నబాబు స్థానంలో అత్తయ్యను తీసుకెళ్ళాము. కానీ చెకింగ్ దగ్గర పేరు వేరుగా ఉన్నందున ఆవిడను అనుమతిస్తారో, లేదో అని చాలా భయమేసింది. కానీ బాబా దయవల్ల ముగ్గురు వ్యక్తులున్నారని మాత్రమే చూసి పంపించేసారు. నేను చాలాసార్లు శిరిడీ వెళ్లాను కానీ, ఎప్పుడూ ఆరతి చూడలేదు. అదే మొదటసారి. ఆరతి దర్శనంతో మేము చాలా చాలా సంతోషించాము. మరుసటిరోజు మేము ద్వారకామాయి, చావడి మొదలైన అన్ని ప్రదేశాలు దర్శించుకున్నాము. నేను గురుస్థాన్ వద్ద ప్రదక్షిణలు, పారాయణ హాల్లో పారాయణ చేసుకున్నాను. బాబా కృప, ఆశీర్వాదం వల్ల మేము ఏ ఇబ్బంది లేకుండా శిరిడీ యాత్ర పూర్తిచేసుకుని ఇంటికి తిరిగి వచ్చాము. బాబా ఆజ్ఞ లేనిదే మనం శిరిడీ యాత్ర చేయలేం. బాబా అనుమతి, ఆ తండ్రి దర్శనం అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. "ధన్యవాదాలు బాబా".


మన కోరిక న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఉంటే బాబా తప్పక నెరవేరుస్తారు. నేను నా గత అనుభవంలో బాబా ఆశీస్సులతో మా బాబుకి తన కోరుకున్న యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సీటు వచ్చిందని పంచుకున్నాను. మా బాబు ఆ యూనివర్సిటీ హాస్టల్లో ఉంటున్నాడు. తను సెలవులకి హైదరాబాద్ రావడానికి తనకి ఎలాట్ చేసిన మెంటర్‍ని(గైడ్) అనుమతి అడిగితే అనుమతి ఇవ్వలేదు. మా బాబు ఫోన్ చేసి, "ఇంటికి రావడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఎంత రిక్వెస్ట్ చేసినా, టికెట్లు బుక్ చేసుకున్నానని చెప్పినా నెక్స్ట్ టైం వెళ్ళవచ్చులే అని అన్నారు" అని చెప్పాడు. అప్పుడు నేను బాబాని తలుచుకుని బాబుతో, "మళ్లీ ఈ-మెయిల్ పెట్టు. అలాగే తరువాత వెళ్లి రిక్వెస్ట్ చేయి".అని చెప్పాను. సరేనని, తను మళ్ళీ ఈ-మెయిల్ పెట్టాడు. నేను, "బాబా! ఎలాగైనా మెంటర్ అనుమతి ఇచ్చేలా మీరే చూడాలి. బాబుని చూసి చాలారోజులు అయింది. తను కూడా మమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాడు. టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము. నేను కోరింది న్యాయమైన కోరిక అయితే మీరే అనుమతి ఇప్పించండి, లేకపోతే వద్దు" అని బాబాని వేడుకున్నాను. మరుసటిరోజు ఉదయం మెంటర్ మా బాబు పెట్టిన ఈ-మెయిల్‍కి 'ఓకే' అని రిప్లై ఇచ్చాడు. అంటే అప్పటివరకు ఒప్పుకోని మెంటర్ మా బాబుని ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. కాదు, బాబానే ఇప్పించారు. మనం ఏదైనా సహాయంగాని, సలహానుగాని కోరితే, అది మంచిదైతే బాబా తప్పకుండా నెరవేరుస్తారు. కాకపోతే మనం సంపూర్ణ విశ్వాసం, సబూరీ(సంతోషంతో కూడిన సహనం)లతో వేచి ఉండాలి. "ధన్యవాదాలు బాబా. ఇలాగే మీ దయ ఎల్లప్పుడూ మా పిల్లల మీద చూపించు తండ్రి. వారికి దిశానిర్దేశం చేసి మంచిగా చదువుకునే శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించండి.


మేము గత రెండు సంవత్సరాలుగా శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని అనుకుంటున్నప్పటికీ కరోనా కారణంగా దర్శించలేకపోయాం. ఈ సంవత్సరం ఎలాగైనా వెళ్లాలని 2022, అక్టోబర్ 10వ తేదీకి దర్శనం టికెట్లు బుక్ చేసుకున్నాము. రూమ్స్ బుక్ చేసుకుందాం అనేసరికి రూమ్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. ఆ సమయంలో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. రూమ్ లేకపోతే చాలా ఇబ్బంది పడతాము. అందువల్ల నేను, "బాబా! ఎలాగైనా కొండపైన మాకు రూమ్ దొరికేలా చూడండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయతో తెలిసినవాళ్ళ ద్వారా మాకు రూమ్ ఇప్పించారు. అర్ధరాత్రి 12 గంటలకు మాకు దర్శనం అయింది. బాబా దయవల్ల ఆ ఏడుకొండలవాడి దర్శనం, పద్మావతి అమ్మవారి దర్శనం బాగా జరిగాయి. "థాంక్యూ సో మచ్ బాబా. మీ కరుణాకటాక్షాలు మాపై సదా ఉండాలి తండ్రి. నేనెప్పుడూ మీ నామస్మరణలో ఉండేలా దీవించండి బాబా. అందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించండి".


ఆరోగ్యనిచ్చే బాబా


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు జగదీశ్వర్. నేను గతంలో కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని పంచుకుంటాను. నేను 2022, సెప్టెంబరులో మామూలుగా జనరల్ బాడీ చెకప్ చేయించుకుంటే నాకు షుగర్ లెవెల్స్ ఇర్రెగ్యులర్‍గా ఉన్నట్టు, డయాబెటిక్ ఎఫెక్ట్ అయినట్టు, బ్లడ్‍లో క్రియాటిన్ లెవెల్స్ పెరిగినట్టు రిపోర్ట్ వచ్చింది. డాక్టర్ మందులిచ్చారు. నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "అంతా మీదే భారం బాబా" అని అనుకోని మందులు వాడాను. బాబా దయవల్ల ఒక నెల తర్వాత మళ్లీ బ్లడ్ సాంపిల్స్ ఇస్తే, షుగర్ లెవెల్స్ కంట్రోలై నార్మల్ స్థాయికి వచ్చాయని, అలాగే సీరం క్రియాటిన్ కూడా నార్మల్‍కు వచ్చిందని రిపోర్టు వచ్చింది. డాక్టర్ డయాబెటిక్ టాబ్లెట్స్ డోస్ తగ్గించి రాశారు. ఆ టాబ్లెట్స్ వాడి నెలరోజుల తర్వాత నవంబరులో మళ్ళీ టెస్టు చేయించుకుంటే షుగర్ లెవల్స్ నార్మల్‍గానే ఉన్నాయి. డాక్టర్ మూడు నెలల తర్వాత చెక్ చేద్దామన్నారు. "ధన్యవాదాలు బాబా. షుగర్ లెవెల్స్ ఎప్పటికీ నార్మల్‍గా ఉండేలా చేసి, తక్కువ డోస్ టాబ్లెట్ల అవసరం కూడా లేకుండా చేసి నన్ను కాపాడండి బాబా".


2022, అక్టోబర్ నెల రెండవ వారంలో ఒకరోజు నేను మా ఇంట్లో పనిచేసే ఆమె రాకపోతే, "ఏం జరిగింది?" అని విచారించాను. అప్పుడు 'రెండు వారాల నుండి ఆమె ఏడాదిన్నర బాబు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడని, డాక్టర్, "ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది, హాస్పిటల్లో అడ్మిట్ చేసి చికిత్స అందించాల"ని  చెప్పారని, కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి కారణంగా బాబుని ఇంట్లోనే ఉంచి ఇంజెక్షన్ చేయిస్తు'న్నట్లు తెలిసింది. అప్పుడు నేను మా ఇంట్లోని పూజగదికి వెళ్లి బాబా ముందు రాలిపడి ఉన్న అగరుబత్తి పొడిని నా నుదుటన పెట్టుకుని, "బాబా! ఆ బాబుకి తొందరగా నయమయ్యేలా అనుగ్రహించండి. మీ కృపను బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. రెండు రోజుల తర్వాత విచారిస్తే, 'బాబు కోలుకుని క్రమక్రమంగా నార్మల్ అవుతు'న్నట్టు తెలిసింది. అంతా బాబా దయ. "బాబా! మీకు ప్రణామాలు తండ్రి. ఈ ప్రపంచంలో మిమ్మల్నే నమ్ముకుని మీరున్నారన్న ధైర్యంతో ఉన్న వాళ్ళం చాలా మందిమి ఉన్నాం బాబా. సదా మాకు తోడుగా ఉండండి తండ్రి".


2022, నవంబర్ 21న మా మనవరాలి మొదటి పుట్టినరోజు ఉండగా నవంబర్ 20 ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే ఫంక్షన్ ఏర్పాటు చేసాము. అయితే ఫంక్షన్‍కి మూడురోజుల ముందు మా మనమరాలికి తీవ్రంగా జలుబు, దగ్గు ఉన్నాయి. నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! నా మనవరాలికి ఫంక్షన్ రోజుకల్లా జలుబు, దగ్గు తగ్గి ఫంక్షన్ బాగా జరగాలి. అలా జరిగితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. నేను కోరుకున్నట్లే ఫంక్షన్ రోజుకి మా మనవరాలికి జలుబు, దగ్గు తగ్గిపోయి ఫంక్షన్ చాలా బాగా జరిగింది. అంతా బాబా ఆశీర్వాదం. "ధన్యవాదాలు బాబా. నా కుటుంబంలో కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయని మీకు తెలుసు. మా యందు దయ చూపి అన్ని సమస్యలు, ఇబ్బందుల నుండి కాపాడండి ప్రభూ".


శరణం శరణం శరణం, సాయి శరణం!!!


5 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏

    ReplyDelete
  3. Sai nannu na barthani kalupu sai na kapiranni nilabettu sai vamsi nannu manaspurthi ga barya ga sweekarinchu nannu kapuraniki thiakellela chudu sai naku na bartha

    ReplyDelete
  4. ఈ ప్రపంచంలో మిమ్మల్నే నమ్ముకుని మీరున్నారన్న ధైర్యంతో ఉన్న వాళ్ళం చాలా మందిమి ఉన్నాం బాబా. సదా మాకు తోడుగా ఉండండి తండ్రి

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo