సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1393వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నమ్మకంతో ఉంటే బాబా ఖచ్చితంగా దారి చూపిస్తారు
2. ఏ సమస్య అయినా నమ్మకంతో బాబాను ప్రార్థిస్తే, సమసిపోతుంది
3. ఇలా ఉంటుంది బాబా దయ

నమ్మకంతో ఉంటే బాబా ఖచ్చితంగా దారి చూపిస్తారు


నేను సాయిభక్తురాలిని. ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన ఎన్నో అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకున్నాను. ఇప్పుడు బాబా చేసిన ఇంకొక అద్భుతాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఇంతకుముందు పంచుకున్న ఒక అనుభవంలో మా ఫ్రెండ్‍వాళ్ళ బాబుకి యాక్సిడెంట్ అయిందనీ, ఆ యాక్సిడెంట్‌లో తన కాలు ఫ్రాక్చర్ అయిందనీ, డాక్టర్లు ఆ కాలికి సర్జరీ చేశారనీ చెప్పాను. అది నయమై బాబు త్వరగా కోలుకునేలా చేయమని నేను బాబాని కోరుకున్నాను. అయితే, సర్జరీ జరిగి 7 నెలలవుతున్నా బాబుకి సరిగా నడవటం రావట్లేదు. బాబుకి రెగ్యులర్‌గా స్కానింగ్ చేసే డాక్టర్, “ఎముక పెరుగుదల నిదానంగా ఉంటుంది. 6 నెలల్లో ఎముక పెరుగుతుంది. ఒకవేళ పెరగకపోతే మళ్ళీ సర్జరీ చెయ్యాల్సి వుంటుంది” అని చెప్తూ వచ్చారు. కానీ అసలు సమస్యేమిటో చెప్పలేదు. కొన్ని రోజుల తర్వాత, “ఎముక పెరుగుదల సరిగా లేదు, మళ్ళీ సర్జరీ చెయ్యాలి” అని చెప్పారు. ఎందుకైనా మంచిదని సెకండ్ ఒపీనియన్ కోసం వేరే డాక్టర్స్ దగ్గరకి వెళితే, అందరూ స్కానింగ్ రిపోర్టులు చూసి, “మధ్యలో ఉండాల్సిన ఎముక ముక్క శరీరంలో కలిసిపోయింది. అసలు ఎముక అతుక్కోలేదు, కేవలం రాడ్స్ సపోర్ట్‌తో మాత్రమే ఉంది” అన్నారు. ఇలా జరగటానికి కారణమేమిటని అడిగితే, “ఎముక ఇన్ఫెక్ట్ అవడం వల్ల అలా జరిగి ఉండవచ్చు లేదా సర్జరీ సమయంలో ఎముకలకి వైర్లు కట్టడం వల్ల రక్తప్రసరణ ఆగిపోయి అలా జరిగి ఉండవచ్చు” అని చెప్పి, “ఒకవేళ ఎముక ఇన్ఫెక్ట్ అయితే, మొదటగా సర్జరీ చేసి ఆ ఇన్ఫెక్షన్‌ని పూర్తిగా తొలగించాలి. ఇన్ఫెక్షన్ పూర్తిగా తొలగిపోయిన తరువాత మళ్ళీ ఒక సర్జరీ చెయ్యాలి. అయితే ఇదంతా జరగడానికి 6 నెలల పైనే పడుతుంది. ఇప్పటికే 7 నెలలు అయింది. ఇంకో 6 నెలలు, అంటే సంవత్సరం పైనే పడుతుంది. దీనివల్ల సర్జరీ జరిగిన కాలు పొడవు పెరగటం తాత్కాలికంగా ఆగిపోతుంది. ఈలోపు మరో కాలు మాత్రం మామూలుగానే పెరుగుతుంది. రెండు కాళ్ళూ ఒకేలా పెరగాలంటే, ఆ రెండవ కాలు పొడవు పెరగటాన్ని తాత్కాలికంగా ఆపడంకోసం ఆ కాలికి చిన్న సర్జరీ చేసి, క్లిప్స్ వెయ్యాలి” అన్నారు. “ఒకవేళ బోన్ ఇన్ఫెక్ట్ అవకపోతే సింగిల్ సర్జరీతో అయిపోతుంది. కానీ, ఇన్ఫెక్షన్ అయిందీ లేనిదీ ఓపెన్ చేస్తే కానీ చెప్పలేము” అన్నారు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ‘ఇది చాలా క్రిటికల్ కేస్’ అనేవాళ్ళు. ఇదంతా విని మా ఫ్రెండ్ వాళ్ళు చాలా అంటే చాలా బాధపడ్డారు. నాకు కూడా, 'ఇంత చిన్నబాబుకి ఎందుకు ఇంత బాధ?' అనిపించింది. ఏం చెయ్యాలో తెలియక, బాబుని ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలో అర్థంకాక తనలో తనే చాలా స్ట్రగుల్ అయ్యారు మా ఫ్రెండ్. మొదటిసారి డాక్టర్ సర్జరీలో చేసిన తప్పువల్లనే ఇలా జరిగింది అనేసరికి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా ‘ఈసారి సర్జరీ ఎలా చేస్తారో’ అని తనకు భయం వేసేది. నేను వాళ్ళతో ఒక్కటే చెప్పాను, “మీ ప్రయత్నం మీరు చేయండి, బాబానే మంచి డాక్టర్ దగ్గర బాబు కాలికి సర్జరీ అయ్యేలా చేస్తారు, అంతేకాదు, ఏ ఇన్ఫెక్షన్ లేకుండా ఒక్క సర్జరీతోనే బాబు కాలు సెట్ అవుతుంది. జస్ట్ మీరు బాబాపై నమ్మకం ఉంచి ఆయనను ప్రార్థించండి, చాలు. గాడ్ ఈజ్ విత్ యు” అని. నేను కూడా బాబాని ప్రార్థించి, బాబు విషయంలో సహాయం చేయమని ఎంతగానో వేడుకున్నాను. బాబా దయవల్ల మంచి డాక్టర్ దొరికారు. ఈరోజు(2022, నవంబరు 5) ఉదయం బాబుకి సర్జరీ జరిగింది. సర్జరీ జరిగేముందు నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా, నీవు ఎన్నో అంతుచిక్కని రోగాలను నయం చేశావు. ఆరోజు చేసినవాడివి ఈరోజూ చేస్తావు. ‘అందరం నీ బిడ్డలమే’ అంటావు కదా! అలా అయితే నీ బిడ్డను నీవే కాపాడు. ఆ చిన్నపిల్లవాడి జీవితాన్ని నీవే కాపాడు, నీదే బాధ్యత” అని భారం మొత్తం బాబాపైనే వేసి, “ఏ ఇన్ఫెక్షన్ లేకుండా ఒకే సర్జరీతో బాబు ఈ సమస్య నుండి బయటపడేలా చెయ్యి, అలా జరిగితే గ్రూపులో నా అనుభవాన్ని ఈరోజే పంచుకుంటాను” అని ప్రార్థించాను. బాబుకి సర్జరీ జరుగుతున్న సమయంలో బాబా ఈక్రింది మెసేజ్ ద్వారా నాలో ఆశని, నమ్మకాన్ని కలిగించారు. 

3 గంటల సర్జరీ తరువాత డాక్టర్లు వచ్చి, “సర్జరీ బాగా జరిగింది. సింగిల్ సర్జరీ సరిపోయింది, ఇంకో సర్జరీ అవసరం లేదు” అని చెప్పారు. అది విని బాబు తల్లిదండ్రులు, నేను ఎంతో సంతోషించాము. ఇది నిజంగా బాబా చేసిన అద్భుతమే. ఎంతోమంది డాక్టర్లు ఏదేదో చెప్పారు, వింటేనే బాధగా అనిపించింది. ‘తనపై భారం వేస్తే అంతా తానే చూసుకుంటారు’ అని బాబా మళ్ళీ ఋజువుచేశారు. “చాలా చాలా థాంక్స్ బాబా. మీరు చేసిన సహాయాన్ని ఎన్నటికీ మర్చిపోను. మీరు నాకిచ్చిన మెసేజ్‌లో చెప్పినట్టు మీ బిడ్డని మీరే కాపాడారు. థాంక్స్ తప్ప మీకు ఏమీ చెప్పుకోలేను. ఇకముందు కూడా బాబుకి త్వరగా నయమయ్యేలా చేసి, తనను శిరిడీ రప్పించుకుని, నీ సన్నిధిలోకి నడిచివచ్చేలా చెయ్యి బాబా”.


అందరికీ ఒకటే చెప్పాలి అనుకుంటున్నాను.. 'ఏ ఆశా లేనప్పుడు, ఏ దారీ లేనప్పుడు కూడా బాబాపై నమ్మకం ఉంచండి. బాబా తప్పకుండా మీ కష్టాలని తీరుస్తారు. మన నమ్మకం, మన ఓపికే అన్నిటినీ మార్చేస్తుంది. ‘నమ్మకంతో ఉంటే బాబానే ఖచ్చితంగా దారి చూపిస్తారు’ అని మరోసారి అర్థమయ్యేలా బాబా చేశారు'. “చాలా చాలా థాంక్స్ బాబా. ఎల్లప్పుడూ ఇలాగే మా అందరికీ తోడుండి మమ్మల్ని ముందుకు నడిపించు బాబా”.


ఏ సమస్య అయినా నమ్మకంతో బాబాను ప్రార్థిస్తే, సమసిపోతుంది


అందరికీ నమస్తే. నా పేరు అరుణ. నేను ఇంతకుముందు ఎన్నో అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవం పంచుకుంటున్నాను. బాబా దయవల్ల నేను ఈరోజు ఇలా ఉన్నానని ఖచ్చితంగా చెప్పగలను. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, బాబా ఎంతో దయతో మమ్మల్ని బయటపడేస్తున్నారు. నేను ఇంతకుముందు మా అమ్మ ఆరోగ్యం గురించి కొన్ని అనుభవాలు పంచుకున్నాను. బాబా దయవల్ల ఆమె అన్ని ఆరోగ్య సమస్యల నుంచి బయటపడుతుండగా 2022, సెప్టెంబర్ 15, గురువారం ఉదయం అమ్మ బాత్రూం దగ్గర కాలు కింద వేసే మ్యాట్ జారడంతో ఆమె కింద పడిపోయి చాలాసేపు లేవలేకపోయింది, కూర్చోలేకపోయింది. ఎక్స్-రే తీయిస్తే, "బోన్ ఫ్రాక్చర్ అయింది, ఆపరేషన్ చేయాలి" అన్నారు. అప్పటికే ఒక సంవత్సరకాలంలో ఆమె గుండెకి, కాళ్లకి సర్జరీలు అయి ఉన్నందున మళ్ళీ ఆపరేషన్ అనేటప్పటికీ మనసంతా బాధామయం అయిపోయింది. "ఎందుకు బాబా మాకిన్ని కష్టాలు? ఏదేమైనా మీ దయతో అమ్మకి సర్జరీ సురక్షితంగా జరిగితే చాలు. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అమ్మ హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు నేను 'ఓం ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని జపించాను. బాబా దయవల్ల 2022, సెప్టెంబర్ 17, శనివారం సాయంత్రం 7 గంటలకి ఆపరేషన్ బాగా జరిగింది. ఇప్పుడు అమ్మ బాగానే ఉంది. "ధన్యవాదాలు బాబా. కానీ అమ్మకి ఎందుకిన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి? మనసుకు చాలా బాధగా ఉంది. ఆమె గత జన్మ కర్మలు ఏమైనా ఉంటే దయతో వాటిని తొలగించండి. ఇంకా అమ్మని బాధపెట్టొద్దు తండ్రీ. ప్రస్తుతం ఆమెకున్న యూరిన్ సమస్య, జాయింట్ పెయిన్స్ తగ్గించి ఇకమీదట ఆమెకి ఆరోగ్య సమస్యలు రాకుండా చూడండి బాబా ప్లీజ్. మీ మీదే భారం వేస్తున్నాను తండ్రీ".


మా నాన్నగారి వయస్సు 64 సంవత్సరాలు. బాబా దయవల్ల ఆయనకి ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు లేవు కానీ, 2022, నవంబర్ నెల మొదటివారంలో ఒకరోజు నాన్న ఫోన్ చేసి, "మూత్ర విసర్జన చేస్తుంటే రక్తం వస్తోంది" అని చెప్పారు. అది విని నాకు చాలా భయమేసింది. అయినా కూడా, "ఏం కాదు నాన్నా. యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే అలా అవుతుంది. సాయంత్రం వరకు చూద్దాము. తగ్గకపోతే స్కాన్ చేయిద్దాము. మీరేం భయపడవద్దు" అని చెప్పి ఫోన్ పెట్టేశాను. తర్వాత నేను చాలా భయపడుతూ, "బాబా! సాయంత్రంలోపు నాన్నకున్న సమస్య తగ్గితే, మీ అనుగ్రహాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల "సమస్య తగ్గింది" అని నాన్న ఫోన్ చేసి చెప్పారు. ఈ అనుభవం ద్వారా 'ఏ సమస్య అయినా నమ్మకంతో బాబాను ప్రార్థిస్తే, సమసిపోతుంద'ని నాకు విశ్వాసం కుదిరింది. "ధన్యవాదాలు బాబా. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఇలానే ఉండాలి సాయితండ్రీ".


ఇలా ఉంటుంది బాబా దయ 


'సాయి మహరాజ్ సన్నిధి' సాయిభక్తులకు నా వందనాలు. నా పేరు ధనలక్ష్మి. మా కుటుంబమంతా బాబా భక్తులం. నా ప్రతి అడుగు బాబానే నడిపిస్తారు. నేను ఇంతకుమునుపు బాబా నాకు అనుగ్రహించిన అనుభవాలు కొన్ని మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. 2022, నవంబర్ నెల మొదటి వారంలో మా తమ్ముడు తన ఛాతీలో నొప్పిగా ఉందని అన్నాడు. మా ఇంటికి దగ్గరలో ఉన్న హాస్పిటల్‍కు వెళితే, ఈసీజీ చేసి, 'కొంచెం ప్రాబ్లమ్ ఉంద'ని చెప్పారు. మరుసటిరోజు మేము తమ్ముడిని హైదరాబాద్‍లోని నిమ్స్ హాస్పిటల్‍కి తీసుకుని వెళ్ళాము. అక్కడ అన్ని పరీక్షలు చేసి, "అన్నీ నార్మల్ ఉన్నాయి. ఇది గ్యాస్ ప్రాబ్లమ్ అయి ఉండవచ్చు. TMT చేద్దామ"ని చెప్పి ఆ టెస్ట్ చేశారు. దాంట్లో కొద్దిపాటి సమస్య ఉన్నట్లు రావడంతో CT, యాంజియో చేద్దామన్నారు. దాంతో మా కుటుంబసభ్యులు అందరం చాలా ఒత్తిడికి గురి అయ్యాము. నిమ్స్‌లో ఆ పరీక్షలు చేయించి తమ్ముడువాళ్ళని పంజాగుట్ట బాబా గుడికి తీసుకుని వెళ్లి, "బాబా! తమ్ముడికి ఏ సమస్యా లేనట్లైతే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను, గురువారం పెరుగన్నం పంచుతాను" అని బాబాతో చెప్పుకున్నాను. రెండురోజుల తర్వాత వచ్చిన రిపోర్టులు చూసిన డాక్టరు, "నీకు ఏ సమస్యా లేదు. అనవసరంగా హాస్పిటళ్ళ చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకోకు" అని తమ్ముడితో చెప్పారు. ఆ మాటలకు మా కుటుంబసభ్యులు ఎంతో సంతోషించారు. బాబా దయ ఇలా ఉంటుంది. ఒక్కసారి మనం బాబా చేయి పట్టుకుంటే, ఇక ఆయన మనల్ని వదలరు. "ధన్యవాదాలు బాబా. మా అమ్మాయి ఉద్యోగం, పెళ్లి విషయాలలో మంచిగా ఆశీర్వదించండి బాబా". మీరంతా కూడా మా అమ్మాయి గురించి బాబాను ప్రార్థించవలసిందిగా బ్లాగు సభ్యులందరినీ పేరుపేరునా కోరుకుంటున్నాను. మరికొన్ని అనుభవాలతో మళ్ళీ కలుస్తాను.


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


5 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sai baba today Sai Leela is very nice.1st Sai Leela is very nice 👍.He saved that boy with surgery.He is loving god.

    ReplyDelete
  3. Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get normal. Also decrease her neck disk bulges and spine bulg and get it to Normal Jaisairam

    ReplyDelete
  4. Sri samardha sadguru sai nath maharaj ki jai🙏

    ReplyDelete
  5. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo