సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 372వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయి కృపతో తగ్గిన జ్వరం - వ్రాసిన పరీక్ష 
  2. బాబా సహాయం మన ప్రార్థనంత దూరంలోనే ఉంది

సాయి కృపతో తగ్గిన జ్వరం - వ్రాసిన పరీక్ష 

సాయిభక్తురాలు శ్రీమతి సంధ్య ఇటీవల బాబా తనకు ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! ఓం సద్గురు సాయినాథాయ నమః.

సాయిబంధువులందరికీ నా నమస్కారములు. సాయి దివ్యపాదాలకు నమస్కరిస్తూ నాకు కలిగిన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. మా బాబు హాస్టల్లో ఉండి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇప్పుడు పరీక్షల సమయం. అన్ని పరీక్షలూ బాగా వ్రాశాడు. చివరి పరీక్ష రేపనగా ముందురోజు వాడు బాగా జలుబు, జ్వరంతో బాధపడుతూ వాంతులు చేసుకున్నాడని మాకు ఫోన్ వచ్చింది. బాబుకు అలా అయ్యేసరికి మాకు చాలా బాధ కలిగింది. దూరంగా ఉన్న తనని జాగ్రత్తగా చూసుకునే అవకాశం మాకు లేనందున అందరి క్షేమాన్నీ చూసుకునే ఆ సాయినాథుడినే తలచుకున్నాము. ఆయనపై నాకున్న విశ్వాసంతో ఆరోజు రాత్రి, "సాయీ! బాబుకి సహాయంగా ఉంటూ తెల్లవారేసరికల్లా జ్వరం తగ్గించి, చివరి పరీక్ష వ్రాసేటట్టు అనుగ్రహించండి" అని ఆర్తిగా బాబాను వేడుకున్నాను. తరువాత బాబుని ఊహించుకుని బాబా ఊదీని నా నుదుటిపై పెట్టుకుని, మరికొంత ఊదీని నీళ్ళలో కలుపుకుని త్రాగాను. తెల్లవారేసరికి బాబా దయతో బాబుకి జ్వరం తగ్గి పరీక్ష బాగా వ్రాస్తే, నా అనుభవాన్ని తోటి సాయిబంధువులతో పంచుకుంటానని కూడా బాబాకి మాట ఇచ్చాను. తమ బిడ్డలకి కష్టమొచ్చిందంటే పరుగున వచ్చే మన బాబా లీల చూడండి. తెల్లవారేసరికి బాబుకు జ్వరం తగ్గింది. బాబా కృపతో పరీక్ష బాగా వ్రాశాడు. ఈ అనుభవంతో నాకు సాయిపై నమ్మకం, విశ్వాసం, ప్రేమ మరింత దృఢపడ్డాయి. "సాయీ! మీకు చాలా చాలా కృతజ్ఞతలు. సదా నన్ను, నా కుటుంబాన్ని మరియు సాయిబంధువులందరినీ ఆశీర్వదించండి".

ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి.

బాబా సహాయం మన ప్రార్థనంత దూరంలోనే ఉంది

యు.ఎస్.ఏ. నుండి ఒక సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

బాబా నాకోసం చేసిన అద్భుతం గురించి నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నేను వృత్తిరీత్యా యు.ఎస్.ఏ. లో నివసిస్తున్నాను. 80 ఏళ్లు దాటిన నా తల్లి భారతదేశంలో ఉంటుంది. తనని చూడటానికి నేను ప్రతి సంవత్సరం వెళ్తుంటాను. అలాగే గత సంవత్సరం(2019) జూన్ నెలలో వెళ్ళాను. తిరుగు ప్రయాణంలో నేను ముంబై నుండి ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఎయిర్ ఇండియా విమానం చాలా ఆలస్యం అయింది. తత్ఫలితంగా నేను న్యూ ఢిల్లీ నుండి న్యూయార్క్ వెళ్లే కనెక్టింగ్ విమానం మిస్సయ్యాను. ఆ విషయమై నేను ఎయిర్ ఇండియా సిబ్బందిని సంప్రదిస్తే వాళ్ళు ఏమీ చేయలేమని చెప్పేశారు. దాంతో నాకు టికెట్ జారీచేసిన KLM ఎయిర్‌లైన్స్‌తో మాట్లాడి సహాయాన్ని అర్థించడమే మిగిలింది. వాళ్లతో మాట్లాడితే, విమానాలు లేవని, సీట్లు అందుబాటులో లేవని, అన్నీ బుక్ అయిపోయాయని చెప్పారు. యు.ఎస్.ఏ తిరిగి వెళ్ళడానికి టికెట్ లేనందున నేను ఢిల్లీలో చిక్కుకున్నాను. అది తెల్లవారుఝామున 3 గంటల సమయం. ఏం చేయాలో అర్థంకాక సహాయం చేయమని బాబాను అడిగాను. తరువాత టెన్షన్‌గా ఆలోచిస్తున్నాను. అనుకోకుండా డెస్క్ మీద ఉన్న ఒక క్యాలెండర్ పై నా దృష్టి పడింది. అది మన ప్రియమైన సాయిబాబా! ఆయన క్యాలెండర్ నుండి నవ్వుతూ నన్ను చూస్తూ, 'ఏమీ భయంలేదు, అంతా బాగుంటుంద'ని సంకేతం ఇస్తున్నట్లుగా అనిపించింది.


తరువాత నేను KLM ఎయిర్‌లైన్స్‌తో మాట్లాడి మళ్ళీ ప్రయత్నించమని అడిగాను. అతను 15 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి, "ఎతిహాద్ ఎయిర్‌వేస్ ద్వారా మీకోసం టికెట్ సంపాదించగలిగాన"ని చెప్పాడు. అది 3 గంటల సమయంలో బయలుదేరింది. ఇది బాబా అనుగ్రహమే తప్ప మరొకటి కాదు. ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు. మనం చేయాల్సిందల్లా ఆయన సహాయం కోరడమే. ఆయన చెప్పినట్లు, ఆయన సహాయం మన ప్రార్థనంత దూరంలోనే ఉంది. "బాబా! నన్ను ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు".


4 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo