సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 379వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా దయవల్ల ఏ ఇబ్బందీ లేకుండా జరిగిన సర్జరీ మరియు తగ్గిన జలుబు, గొంతునొప్పి 
  2. 'ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః'

బాబా దయవల్ల ఏ ఇబ్బందీ లేకుండా జరిగిన సర్జరీ మరియు తగ్గిన జలుబు, గొంతునొప్పి 

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

సాయిబంధువులందరికీ సాయిరాం. బాబా ప్రసాదించిన అనుభవాలను సాటి సాయిభక్తులతో పంచుకునే అవకాశం కల్పించిన సాయిమహరాజ్ సన్నిధి బ్లాగ్ వారికి నా ధన్యవాదాలు. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నా అనుభవాలను ఇంత ఆలస్యంగా బ్లాగులో పంచుకుంటున్నందుకు ముందుగా బాబాకి క్షమాపణలు చెప్పుకుంటున్నాను. 

బాబా పేరు నేను చిన్నప్పటినుంచి వింటున్నప్పటికీ బాబా గురించి నాకు ఏమీ తెలియదు. నా జీవితంలో వచ్చిన సమస్యల వల్ల నేను బాబాకు దగ్గరవటం మొదలుపెట్టాను. నా డిగ్రీ పూర్తయిన తరువాత నా తల్లిదండ్రులు నాకు పెళ్ళిసంబంధాలు చూడటం మొదలుపెట్టారు. కానీ అప్పుడే పెళ్ళిచేసుకోవటం నాకు ఇష్టం లేదు. 2018 నుంచి నాకు సమస్యలు ఎక్కువయ్యాయి. కొద్ది రోజులకి ఒక పెళ్ళిసంబంధం కుదిరింది. నాకు ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఆ విషయం బాబాతో చెప్పుకున్నాను. ఆ తరువాత ఆ పెళ్లికొడుకు గుణవంతుడు కాదని తెలిసి నా తల్లిదండ్రులు ఆ సంబంధం రద్దు చేసుకున్నారు. అప్పటినుంచి నాకు బాబా పైన నమ్మకం మొదలైంది. మళ్ళీ వెంటనే 2019 ఫిబ్రవరిలో ఇంకో సంబంధం కుదిరింది. మే నెలలో మా పెళ్ళి జరిగింది. రోజులు సంతోషంగా గడుస్తున్నాయి. పెళ్ళైన ఆరు నెలలకి హైదరాబాదులో ఫ్యామిలీ పెట్టాము. అప్పుడు తెలిసింది, అతనికి ఉద్యోగం లేదని. అప్పటికే నేను గర్భవతిని. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఎంతో బాధతో బాబాను ప్రార్థించాను. బాబా దివ్యపూజ చేయటం మొదలుపెట్టాను. మొదటి గురువారం పూజ పూర్తయిన తరువాత బాబా అతని నిజస్వరూపాన్ని బయటపెట్టారు. అతనికి వేరే అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని తెలిసింది. దాంతో మనస్తాపం చెందిన నేను చాలా రోజులు తిండి మానేసి, మందులు కూడా మానేసి ఎప్పుడూ ఏడుస్తూ ఉండేదాన్ని. ఈ పరిస్థితిలో ఇంట్లో వాళ్లు నాకు అబార్షన్ చేయించాలని అనుకున్నారు. డాక్టరుని సంప్రదిస్తే, సర్జరీ చేశాక రక్తం ఎక్కించాల్సి ఉంటుందని అన్నారు. నేను చాలా భయపడ్డాను. అప్పుడు, “బాబా! నేను చేస్తున్నది సరైనదే అని మీకనిపిస్తే ఏ ఆటంకమూ లేకుండా సర్జరీ సవ్యంగా జరిపించండి” అని బాబాను ఆర్తిగా వేడుకున్నాను. 2020 జనవరిలో ఏ ఇబ్బందీ లేకుండా, రక్తం ఎక్కించాల్సిన అవసరం లేకుండా, ఏ నొప్పీ లేకుండా నాకు సర్జరీ జరిగింది. నాకు తోడుగా ఉండి నన్ను రక్షించినందుకు బాబాకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. 

రెండవ అనుభవం – జలుబు, గొంతునొప్పి నివారణ:

2020 ఫిబ్రవరి నెలలో ఉన్నట్టుండి జలుబు చేసి గొంతునొప్పి వచ్చింది. గొంతునొప్పి వల్ల ఏమీ తినలేకపోయాను, తాగలేకపోయాను. చాలా బాధ అనుభవించాను. “బాబా! గొంతునొప్పి త్వరగా తగ్గిస్తే సాయిమహరాజ్ సన్నిధి బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను” అని ప్రార్థించాను. మరుసటిరోజుకల్లా గొంతునొప్పి తగ్గిపోయింది. ఎంతో ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. వెంటనే బ్లాగులో పోస్ట్ చెయ్యడానికి కుదరలేదు, అందుకే బాబాను ముందుగా క్షమాపణ అడిగాను.

ఇప్పటికీ నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, కానీ బాబా వాటినన్నింటినీ త్వరలోనే తీరుస్తారని నాకు నమ్మకం ఉంది. బాబాకు తెలుసు తన బిడ్డలకు ఎప్పుడు ఏమి ఇవ్వాలి అనేది. ఆలస్యం అయినా సరే మంచే చేస్తారు. వారి బిడ్డలకు వారు ఎప్పుడూ తోడు, నీడ, రక్షణగా ఉంటారు. “బాబా! నేను ఎప్పుడైనా మిమ్మల్ని బాధపెట్టే పనులు చేసివుంటే దయతో మీ బిడ్డను క్షమించండి బాబా!”

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి

'ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః'

ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నేను సాయిభక్తురాలిని. కొన్నిరోజులుగా నా బిడ్డకు దగ్గు, జలుబు, జ్వరం. మేము ఇద్దరు డాక్టర్లని సంప్రదించినప్పటికీ తనకి నయం కాలేదు. తల్లిగా నేను చాలా ఆందోళన చెందాను. ఒకరోజు నేను ఒక మహాపారాయణ అనుభవాన్ని చూశాను. అందులో ఒక తల్లి తన బిడ్డకు ఆరోగ్యం బాగాలేకపోతే, ఆమె 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అన్న మంత్రాన్ని జపించింది. దాంతో ఆ బిడ్డ కోలుకున్నాడు. అది చదివాక నేను, "బాబా! నేను కూడా ఆ మంత్రాన్ని జపిస్తాను. నా బిడ్డకు నయమైతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను ప్రార్థించాను. తరువాత బాబా దయతో నా బిడ్డ కోలుకున్నాడు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"


2 comments:

  1. ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః'
    Om Sai Ram 🙏🌹🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo