సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 381వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • అంతులేని ప్రేమను పంచిన సాయి - మొదటి భాగం...

యు.ఎస్.ఏ నుండి పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు బాబా తనకు ప్రసాదించిన చక్కని అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

నేను సాయిభక్తురాలిని. 2019లో మా భారత పర్యటన సందర్భంగా నేను పొందిన అనుభవాలను, నా జీవితంలో నేను ఎప్పుడూ ఊహించని విధంగా శిరిడీలో బాబా ఇచ్చిన ఆనందకరమైన దర్శనం గురించి నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నిజానికి ఇదంతా ఎలా వివరించాలో నాకు అంతగా తెలియదు కానీ, మీతో వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే, నేనెప్పుడూ ఇంత బాబా ప్రేమను అనుభూతి చెందలేదు. మా పర్యటన అంతా బాబా నాపై కురిపించిన అనుగ్రహంతో నిండి ఉంది.

2019, మే 17న నా సోదరుడి వివాహం కోసం మేము భారతదేశానికి వెళ్లాలని ప్లాన్ చేశాము. ఇక అప్పటినుండి నేను మా ప్రయాణం, వివాహం, శిరిడీ దర్శనం, ఇంకా ఇతర దర్శనాలన్నీ ఆనందదాయకంగా ఉండాలని ఎప్పటికప్పుడు బాబాని అడుగుతుండేదాన్ని. నా ప్రియమైన బాబా USA లోనే తమ దర్శనంతో మా ప్రయాణాన్ని చక్కగా ప్రారంభించారు. భారతదేశానికి వెళ్లేముందు బాబాను దర్శించడం నా అలవాటు. ఆ అలవాటు ప్రకారం మరుసటిరోజు మా భారత పర్యటన అనగా 'భారతదేశానికి వెళుతున్నామ'ని బాబాతో చెప్పడానికని మేము సాయి ఆలయానికి వెళ్ళాము. ఆరోజు గురువారం. సాధారణంగా మేము ప్రతి గురువారం సాయి ఆలయానికి వెళ్తాము. అయితే ఆరోజు ఏదో కారణం చేత మేము మా డిన్నర్ పూర్తిచేసి ఆలస్యంగా 8:30 గంటల సమయంలో ఆలయానికి వెళ్ళాము. అంతకుముందెప్పుడూ అంత ఆలస్యంగా వెళ్ళలేదు. సరిగ్గా ఆ సమయానికి మందిరంలో శేజ్ ఆరతి ప్రారంభించారు. మొదటిసారి శేజ్ ఆరతికి హాజరు కావడంతో నాకు చాలా సంతోషంగా అనిపినించింది. బాబా చక్కటి దర్శనంతో నన్ను చాలా ఆశీర్వదించారు. నా సంతోషానికి మరో కారణం కూడా ఉంది. ఇంతకుముందెప్పుడూ నేను ఆరతులకు హాజరు కానందున, ఈసారి మా శిరిడీ ప్లాన్‌లో అన్ని ఆరతులకూ బుక్ చేయమని మావారిని అడిగాను. ఆయన అన్ని ఆరతులకూ బుక్ చేసే ప్రయత్నం చేశారుగానీ శేజ్ ఆరతి టిక్కెట్లు పొందలేకపోయారు. దాంతో నేను కాస్త కలత చెందినప్పటికీ, మిగిలిన మూడు ఆరతులకు బాబా టిక్కెట్లు ఇచ్చారని అనుకున్నాను. మన బాబా తన భక్తులను కలవరపడనివ్వరు. పది సంవత్సరాలుగా నేను USA లో ఉంటున్నా ఏనాడూ శేజ్ ఆరతికి హాజరయ్యే సందర్భమే రాలేదు. అలాంటిది బాబా చక్కగా మలిచి ఆ సందర్భాన్ని తీసుకొచ్చి, శిరిడీలో మిస్ అవుతున్న శేజ్ ఆరతిని ముందుగా ఇక్కడే హాజరయ్యేలా చేశారు. మొదటిసారి శేజ్ ఆరతి దర్శనంతో నా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి.

బాబా ఆశీస్సులతో మేము భారతదేశంలో దిగాము. భారతదేశంలో దిగిన తర్వాత బాబాను దర్శనం ఇవ్వమని అడగడం నాకు అలవాటు. ఇప్పుడు కూడా అలాగే అడిగి కార్లు, ఆటోలు మొదలైన అన్నింటిపై బాబా కోసం వెతకడం ప్రారంభించాను. కానీ నేను బాబా ఫోటో ఒక్కటి కూడా చూడలేకపోయాను. దాంతో నేను నిరాశ చెంది, "బాబా! దయచేసి రేపు ఉదయమైనా నాకు ఒక చక్కని దర్శనం ఇవ్వండి" అని అడిగాను. మరుసటిరోజు మేమంతా పెళ్ళికి సంబంధించిన షాపింగ్ కోసం బయలుదేరాము. మా కుటుంబసభ్యులందరం రోడ్డు ప్రక్కన నడుస్తున్నాము. నా కళ్ళు ఇంకా బాబా కోసం వెతుకుతున్నాయి. ఇంతలో నేను ఒక కారు మీద భగవాన్ రమణమహర్షి ఫోటో చూశాను. నాకు ఆయన కూడా ఇష్టమైనప్పటికీ బాబా కోసమే నేను వెతుకుతున్నాను. ఎక్కడా బాబా జాడ కనిపించక నేను చాలా కలతపడుతూ, "ఈరోజు కూడా మీరు నాకు కనపడటం లేదు. ఎందుకిలా? నేను మిమ్మల్ని చూడలేనా?" అని బాబాను అడుగుతున్నాను. మరునిమిషంలో నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. కొంతమంది భక్తులు బాబా భజనలు చేస్తూ వస్తున్నారు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి దక్షిణ అడిగారు. నేను 'నా బాబా వచ్చార'ని అనుకుంటూ సంతోషంగా బాబా దర్శనం చేసుకొని దక్షిణ సమర్పించాను. నా ఆనందానికి అవధులులేవు.

బాబా ఆశీస్సులతో మా షాపింగ్ సజావుగా సాగింది. మేము మా సొంత ఊరికి తిరుగు ప్రయాణమయ్యాము. వధువు కుటుంబం కూడా మాతో ఉన్నారు. మరుసటిరోజు గురువారం. ఉదయం మేము రైలులో ఉన్నాము. వధువు తల్లి నా వద్దకు వచ్చి, "రాత్రి బాగా నిద్ర పట్టిందా? అంతా బాగానే ఉందా?" అంటూ కుశలప్రశ్నలు అడిగారు. కొంత సాధారణ సంభాషణ జరిగిన తరువాత ఆమె నాకు శిరిడీ ఊదీ ప్యాకెట్ ఇచ్చింది. గురువారంనాడు బాబా నన్ను మళ్ళీ ఆశీర్వదించినందుకు నేను ఆనందంలో మునిగిపోయాను.

బాబా అశీస్సులతో మేమంతా క్షేమంగా మా ఊరికి చేరుకుని పెళ్లి పనులను ప్రారంభించాము. నేను మొదటి శుభలేఖను, కొన్ని స్వీట్లను తీసుకొని బాబా ఆలయానికి వెళ్లి, బాబాని ఆహ్వానిస్తూ, "బాబా! మీరు పెళ్ళికి రావాలి. నేను మిమ్మల్ని గుర్తించాలి" అని చెప్పుకున్నాను. బాబా ఆశీస్సులతో పెళ్లి బాగా జరిగింది. పెళ్ళైన చాలారోజుల తరువాత నా సోదరుడు పెళ్ళికి వచ్చిన కానుకలను ఓపెన్ చేయడం మొదలుపెట్టాడు. తనకి చాలా బహుమతులు వచ్చాయి. వాటిలో ఒక బాబా విగ్రహం ఉంది. ఆశ్చర్యమేమిటంటే, దానిపై ఇచ్చిన వారి పేరు లేదు. మా ఇంట్లో నేను తప్ప బాబా భక్తులు వేరెవరూ లేరు. అందువలన ఆ విగ్రహాన్ని నాతోపాటు నేను యుఎస్ఎ తెచ్చుకున్నాను. నేను బాబాను పెళ్ళికి రమ్మని ఆహ్వానించాను. ఆయన నాకోసం వచ్చి, నాకు అండగా ఉంటున్నారు.

పెళ్లి తరువాత యుఎస్ఎ తిరిగి వెళ్లడానికి తక్కువ సమయమే ఉన్నందున మేము దేవాలయాలను సందర్శించడం ప్రారంభించాము. ముందుగా సాయి ఆశీస్సులతో మా యాత్రను తిరుపతితో ప్రారంభించాము. మా పిల్లలను నా తల్లిదండ్రుల వద్ద విడిచిపెట్టి, నేను, నా భర్త అక్కడినుండి అరుణాచలం వెళ్ళాము. అరుణాచలం వెళ్లడం అదే మొదటిసారి. డ్రైవర్ నిద్రలో తూలుతుండటం వలన ఆ రాత్రి మా కారు పెద్ద ప్రమాదానికి గురయ్యేదే. కేవలం బాబా కృపతో ప్రమాదం తప్పి మేము మా గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకున్నాము. మరుసటిరోజు గురువారం. ఉదయం మేము గిరిప్రదక్షిణ చేస్తున్నాము. మొదటిసారి అయినందున ఆ చోటు గురించి, అక్కడి దేవాలయాల గురించి మాకు ఎటువంటి అవగాహనా లేదు. చాలా ఎండగా ఉంది, మేము బాగా అలసిపోయాము. అయినా ముందుకు వెళుతుండగా మేము ఒక పెద్ద సాయి ఆలయాన్ని చూశాము. అరుణాచలం అంతటా శివాలయాలు, శివలింగాలే ఉంటాయకున్నానుగానీ, బాబా ఆలయాన్ని నేనస్సలు ఊహించలేదు. ఆనందంతో నేను లోపలికి వెళ్ళాను. పెద్ద విగ్రహం రూపంలో బాబా చాలా అందంగా ఉన్నారు. ఆయన తమ కాళ్ళకి అందమైన పట్టీలు ధరించి ఉన్నారు. అక్కడ కొంతమంది భక్తులు సాయంత్రం పల్లకి సేవకోసం పూలమాలలు సిద్ధం చేస్తున్నారు. అంతలో నా భర్త శివునికి సంబంధించిన ఒక పుస్తకాన్ని కొన్నారు. ఆ షాపతను ఆ పుస్తకంతోపాటు ఒక అందమైన బాబా ఫోటో, ఊదీ ప్యాకెట్ ఇచ్చాడు. నా సాయి మరోసారి నన్ను ఆశీర్వదించి, అరుణాచలం నుండి కూడా నాతో వచ్చారు. సాయి నేను అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. ఆయన కృపతో అరుణాచల యాత్రను మంచి అనుభూతితో ముగించాము.

మరికొన్ని అనుభవాలు తరువాయి భాగాలలో... 


2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo