సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 336వ భాగం.


ఖపర్డే డైరీ - ఇరవైఒకటవ భాగం. 

19-1-1912.

ఈరోజు చాలా దుర్దినం. నేను చాలా పెందరాళే లేచి నా ప్రార్థనానంతరం, తెల్లవారేందుకు ఇంకా చాలా సమయముందని గుర్తించాను. అందుచేత పడుకొని  కాకడ ఆరతికి బాపూసాహెబ్ జోగ్ లేపితే లేచాను. మేఘుడు తెల్లవారుఝామున నాలుగు గంటలకు పోయాడని దీక్షిత్ కాకా చెప్పాడు. కాకడ ఆరతి అయింది కానీ బాబా తమ ముఖాన్ని స్పష్టంగా మాకు చూపటం గానీ, తమ కళ్ళు తెరవటం గానీ చేయలేదు. తమ దయను వర్షిస్తున్న చూపుల్ని మాపై ఆయన ప్రసరింపచేయలేదు. మేము తిరిగి వచ్చేసరికి మేఘుడి శరీరానికి అంత్యక్రియల కోసం ఏర్పాట్లు జరిగాయి. శరీరం బయటకు తెచ్చే సమయానికి సాయిబాబా వచ్చి అతని మరణానికి పెద్దగా విలపించారు. వారి కంఠస్వరం హృదయానికి హత్తుకునేలా ఉండి ప్రతి వారి కంటినుండి కన్నీరు కారేలా చేసింది. ఆ శరీరాన్ని గ్రామంలో రోడ్డు మలుపు వరకూ అనుసరించి, తమ మామూలు త్రోవలో వెళ్ళిపోయారాయన. మేఘుడి శరీరానికి పెద్ద చెట్టు క్రింద అగ్నిసంస్కారం చేశారు. అతని మరణానికి సాయిబాబా విలపించటం దూరానిక్కూడా ప్రస్ఫుటంగా వినిపించింది. ఆరతి సమయంలోలాగా ఆయన తమ చేతులను ఊపుతూ చివరి వీడ్కోలు ఇస్తున్నట్లు అనిపించింది. ఎండుకట్టెలు బాగా వేయటం వల్ల మంటలు ఉవ్వెత్తుగా ఆకాశానికి ఎగసాయి. దీక్షిత్ కాకా‌‍, నేను, బాపూసాహెబ్ జోగ్, ఉపాసనీ, దాదాకేల్కర్ ఇంకా ఇక్కడున్న వారందరం అక్కడే ఉన్నాం. సాయిబాబా మేఘుడిని చూసి అతని తలనీ, హృదయాన్నీ, భుజాలనీ‌, కాళ్ళనీ‌, అతని శరీరాన్నంతటినీ స్పృశించటంలోని మేఘుని అదృష్టాన్ని మేమెంతగానో చెప్పుకున్నాం. 

ఆ క్రతువంతా పూర్తయ్యాక మేము ప్రార్థిస్తూ కూర్చుని ఉండవలసింది కానీ, బాపూసాహెబ్ జోగ్ రావటంతో నేను అతనితో మాట్లాడుతూ కూర్చున్నాను. ఆ తరువాత సాయిబాబాను దర్శించటానికి నేను వెళ్ళినప్పుడు 'ఈ మధ్యాహ్నం ఎలా గడిపాన'ని ఆయన నన్ను అడిగారు. మాటలతో మధ్యాహ్న సమయం వృధా చేశానని చెప్పటానికి నేను సిగ్గుపడ్డాను. ఇది నాకు గుణపాఠం. "ఇది మేఘుడి చివరి ఆరతి" అని సాయిబాబా మూడురోజుల క్రితమే అతని మరణాన్ని ముందే ఎలా చెప్పారో నేను గుర్తుతెచ్చుకున్నాను. తన సేవ పూర్తయినందుకూ, తను వెళ్ళిపోతున్నందుకూ మేఘుడు ఎలా బాధపడ్డాడో, తన గురువుగా భావించిన సాఠేను చూడలేకపోతానన్న ఆలోచనకు అతనెలా కంటతడిపెట్టాడో, సాయిబాబా ఆవులను వదిలివేయాలని ఎలా కోరుకున్నాడో అన్నీ గుర్తుతెచ్చుకున్నాను. అతను ఇంతకుమించి మరో కోరికను వ్యక్తీకరించలేదు. అతని అపారమైన భక్తిపూరిత జీవితాన్ని మేమంతా గౌరవించాము. నేను ప్రార్థనలో గడపకుండా అర్థంలేని మాటలను విన్నందుకు చాలా విచారించాను. భీష్మ, నా కొడుకు బల్వంత్‌లు అనారోగ్యంగా ఉండటంతో భజన జరుగలేదు. దీక్షిత్ కాకా రాత్రి రామాయణం చదివాడు. గుప్తే, అతని సోదరుడు, వారి కుటుంబాలతో బొంబాయి వెళ్ళిపోయారు.

20-1-1912.


ఉదయం తెల్లవారకముందే ప్రార్థన చేసుకొని, మిగతా అందరితో సమానంగా నిత్యజీవనక్రమాన్ని ప్రారంభించేందుకు సమయానికి లేచాను. బాపూసాహెబ్ జోగ్, ఉపాననీ, రామమారుతిలతో కలిసి పరమామృతాన్ని చదివాను. భీష్మ, నా కొడుకు బల్వంత్ అనారోగ్యంగా ఉన్నారు. సాయిమహారాజును బయటకు వెళ్ళేటప్పుడూ, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడూ దర్శించాను. హాయిగా కబుర్లు చెపుతూ కూర్చున్నాం. ప్రస్తుతానికి ఈ చుట్టుప్రక్కలే ఎక్కడో ఉన్న గ్రామానికి జాగీర్దారైన ఒక వ్యక్తి వస్తే అతన్ని సాయిబాబా పూజ చేయనివ్వకపోవటమే కాక కనీసం తన దగ్గరకైనా రానివ్వలేదు. చాలామంది ఈ విషయంలో కల్పించుకోబోయారు. కానీ లాభంలేకపోయింది. అప్పాకోతే వచ్చి, జాగీర్దారుని కనీసం మామూలుగా చేసే పూజయినా చేసుకోనివ్వమని శాయశక్తులా ప్రయత్నించాడు. సాయిబాబా ఎలాగో కొంచెం దయచూపించి మశీదులోకి వచ్చి ధుని వద్దనున్న స్తంభాన్ని పూజించుకొమ్మన్నారు, కానీ "ఊదీ" ఇవ్వనన్నారు. సాయిబాబాకు కోపం వస్తుందని నేను అనుకున్నాను, కానీ మధ్యాహ్న ఆరతి అంతా మామూలు ప్రకారం జరిగిపోయింది. అన్ని సమయాల్లో అన్ని ఆరతులూ ఇవ్వమని సాయిబాబా బాపూసాహెబ్ జోగ్‌ని ఆజ్ఞాపించారు. దీనిని నేను మేఘుడు పోవటానికి రెండురోజుల ముందుగానే ఊహించాను. 

మధ్యాహ్న భోజనమయ్యాక వార్తాపత్రికలు చదువుతూ కూర్చున్నాను. ఖాండ్వాలో ప్రాక్టీసు చేస్తున్న దీక్షిత్ చిన్నతమ్ముడు (భుజ్ సంస్థానానికి ఇప్పుడు దివాన్) ఈరోజు ఉదయాన్నే వచ్చాడు. అతని బొంబాయి ఏజెంటు మధ్యాహ్నం వచ్చాడు. దీక్షిత్ తమ్ముడు దీక్షిత్‌ని తిరిగి పనిలోకి తీసుకువెళ్ళటానికి తీవ్రంగా ప్రయత్నించాడు, కానీ ఫలితం లేకపోయింది. ఈ విషయం అతను సాయిబాబాకి విన్నవించాడు. కానీ సాయిబాబా విషయాన్నంతా దీక్షిత్‌కే వదిలేశారు. బాపూసాహెబ్ జోగ్‌కి ఇంకా నలుగురు అతిథులొచ్చారు. ఢిల్లీ దర్బారు నుండి తిరిగి వెళుతూ బాపూసాహెబ్ జోగ్ తోడల్లుడు తన పూర్తి కుటుంబంతో వచ్చాడు. ఆయన సాంగ్లీలో చీఫ్ ట్రెజరీ ఆఫీసరు. అతని భార్య బాపూసాహెబ్ జోగ్ భార్యను తమతో తీసుకువెళ్ళాలనుకున్నది. కానీ బాబా అందుకు అనుమతించలేదు. సాయిమహారాజు తమ సాయంకాలపు వ్యాహ్యాళికి వెళ్ళేటప్పుడు మేము వారిని దర్శించుకున్నాం. అప్పుడు వాడా ఆరతీ, ఆ తరువాత శేజారతీ జరిగాయి. దీక్షిత్ యథాప్రకారం రామాయణాన్ని చదివాడు. భీష్మ అనారోగ్యం వల్లా, నా కొడుకు బల్వంత్ పరిస్థితి మరింత క్షీణించటం వల్లా భజన జరగలేదు. ఇప్పుడిక్కడ మోరేశ్వర్ జనార్దన్ వధారే తన భార్యతో ఉన్నాడు. ఆయన పక్షవాతంతో చాలా బాధపడ్డాడు. ఇక్కడ పాడే కొన్ని ప్రార్థనాగీతాల అచ్చుకాపీలతో వసయీకి చెందిన జోషీ వచ్చాడు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

2 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. om sai ram today is our wedding annivery.sai bless us.be with us.please grant long healthy life to my hubby.om saima

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo