సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 367వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • తల్లి కంటే ఎక్కువగా బాబా చూపిస్తున్న ప్రేమ

నా పేరు అంజలి. బాబా ఇప్పటివరకు నా జీవితంలో చూపించిన లీలలను మీ అందరితో పంచుకుంటానని మీతో చెప్పాను. అందులో భాగంగా కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. అవి చదవాలనుకునే వారు కింది ఇవ్వబడిన లింక్స్ పై క్లిక్ చేసి చదవగలరు.

(బాబా పరిచయం - ఏర్పరిచిన జీవనాధారం 
 https://saimaharajsannidhi.blogspot.com/2020/03/344.html
బాబా ప్రసాదించిన సంతానం - ప్రభుత్వ ఉద్యోగం
 - https://saimaharajsannidhi.blogspot.com/2020/03/353.html )

ఇప్పుడు తరువాత అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ముందుగా అందరికీ బాబా అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను.

మొదటి అనుభవం:

గత అనుభవంలో నేను బాబా నాకు ఉద్యోగాన్ని, బాబుని ప్రసాదించారని చెప్పాను. 2012 డిసెంబరు నుండి నకరేకల్‌లో మా క్రొత్త జీవితాన్ని ప్రారంభించాము. సుబ్బారావు సార్ నాకు పరిచయమైనప్పటి నుండి ఫోన్ కాంటాక్టులో ఉండేవారు. ఏదైనా సమస్య వస్తే సార్‌కి ఫోన్ చేసి అడిగేదాన్ని, ఆయన బాబాని అడిగి నాకు సమాధానం చెప్పేవారు. నేను నాన్-లోకల్‌ క్యాటగిరీలో ఏపీ. ట్రాన్స్కో ఏ.ఈ..గా పోస్టింగ్ అయ్యాను. నల్గొండ జిల్లాకి చెందిన ఒకామె ‘ఒక నాన్-లోకల్‌కి పోస్టింగ్ ఎలా ఇస్తార’ని నా మీద కేసు వేసింది. ‘ఇలా జరిగిందేమిటా?’ అని నేను చాలా షాక్ అయ్యాను. అయితే ఆమె కేసులో నేను హైకోర్టులో రివర్ట్ సబ్మిట్ చేయాలి. హైకోర్టు లాయర్ అంటే ఫీజు చాలా ఎక్కువగా వుంటుందని అందరికీ తెలిసిందే కదా! అందువలన నేను చాలా కలవరపడి సుబ్బారావుగారికి ఫోన్ చేసి ఏమి చేయమంటారో బాబాని అడిగి చెప్పమన్నాను. “తనని రిప్లై ఇవ్వమని చెప్పు. లాయర్ ఫీజు ఏమీ అవదుఅని బాబా చెప్పారు. తరువాత మాకు మావారి తాతగారి తరపు బంధువులలో చాలా ప్రఖ్యాతిపొందిన లాయరు లభించారు. మామూలుగా ఆయన ఫీజు కనీసం 50,000 రూపాయలు ఉంటుంది. కానీ ఫ్రీగానే నా తరఫున కోర్టులో రివర్ట్ వేశారు ఆయన. అంతటితో ఆ సమస్య పరిష్కారమైంది. అంతా బాబా దయ. ఆయన చెప్పినట్లే జరిగింది.

రెండవ అనుభవం:

బాబా నన్ను పదకొండు వారాలు గురుచరిత్ర పారాయణ చేయమన్నారు. గురుచరిత్ర పారాయణ చేస్తున్న రోజుల్లోనే మా బాబు పుట్టినరోజు వచ్చింది. ఆ సందర్భంగా మేము కాకాని శివుని మందిరానికి వెళ్ళాము. అక్కడ మరలా బాబా నాచేత రావిచెట్టుకి ఊయల కట్టించారు. అలా చేసిన తరువాత 2014లో మాకు బాబా అనుగ్రహంతో పాప పుట్టింది. పాప కడుపులో ఉన్నప్పుడు మాకు కారు అవసరం ఏర్పడింది. అప్పుడు 'కొత్తకారు తీసుకోవాలా? లేక సెకండ్ హ్యాండ్ కారు తీసుకోవాలా?' అని బాబాని అడిగితే, "సెకండ్ హ్యాండ్ కారు వద్దు, కొత్త కారు కొనుక్కో"మన్నారు. కానీ, మావారు కొత్త కారుకి కావలసినంత డబ్బు లేదని బాబా మాట వినకుండా సెకండ్ హ్యాండ్ కారే కొన్నారు. ఇక అక్కడినుండి మాకు కష్టాలు మొదలయ్యాయి. వచ్చే జీతం అసలు సరిపోయేది కాదు. నెలలో కనీసం అయిదుసార్లయినా ఏదో ఒక పనిమీద కారులో గుంటూరు వెళ్ళవలసి వచ్చేది. డబ్బులు మొత్తం ఖర్చయిపోయి ప్రతి నెలా అప్పు చేయవలసి వచ్చేది. నా బంగారం అమ్మి మరీ ఆ కారు కొనుక్కుంటే, దాని మరమ్మత్తులకి కొనడానికి పెట్టినంత మొత్తం ఖర్చుచేయాల్సి వచ్చింది. ఎందుకు అలా జరుగుతోందో అస్సలు అర్థమయ్యేది కాదు. మేముండే ఇల్లు కలిసిరావటం లేదేమోనని సందేహించి సుబ్బారావు సార్‌ని అడిగితే, ‘మేము వుండే ఇంటిలో ఏ దోషమూ లేద’ని చెప్పారు బాబా. అయితే మేము కారు గురించి ఆయన్ని అడగలేదు. ఇలా దాదాపు రెండు సంవత్సరాలు గడిచిపోయింది. ఒకరోజు మేము గుంటూరు నుండి కారులో వస్తూ ఉన్నాము. ఉన్నట్లుండి కారుకి షివరింగ్ వచ్చింది. బాబా దయవలన క్షేమంగా నకరేకల్‌కి చేరుకున్నాము. మావారు, “కారుకి ఏదో పెద్ద సమస్యే వచ్చినట్టుంది, చూపించి వస్తాన”ని చెప్పి నన్ను ఆఫీసులో దింపి నేరుగా కారుని నల్గొండ తీసుకొని వెళ్ళారు. నార్కేట్‌పల్లి దాటగానే నల్గొండ వెళ్లే హైవేలో కారు కొంచెం స్లో చేశారు. అంతలో కారు టైరు పేలిపోయి కారు ఆగిపోయింది. అది అసలే యాక్సిడెంటల్ హైవే. కారు స్పీడ్ గనక ఎక్కువగా ఉంటే జరిగే పరిస్థితి ఊహించడానికే భయమేసింది. బాబానే మావారిని కాపాడారు. ఆయన కాక మన జీవితాలను ఇంకెవరు రక్షిస్తారు? నాకు ఈ పరిస్థితులను చూసి భయమేసి సుబ్బారావు సార్‌కి ఫోన్ చేసి కారు గురించి బాబాను అడగమని చెప్పాను. నేను సార్‌తో మాట్లాడుతూనే వున్నాను, అదే సమయంలో సార్‌కి బాబా సమాధానం చెపుతూనే వున్నారు: "అది యాక్సిడెంట్ జరిగిన కారు. దానిలో ఇంతకుముందు కొందరి ప్రాణాలు పోయాయి. కానీ వీళ్ళు నన్నే నమ్ముకొని వున్నారు. వీళ్ళ ఒంటిమీద ఒక్క గీత కూడా పడకుండా వాళ్ళని రక్షిస్తున్నాను. అంతా కారుకే పెట్టిస్తున్నా (డబ్బు రూపంలో ఖర్చు). ఆ కారుని రోడ్డు మీదనే వదిలేయమని చెప్పు, ఇంటికి తీసుకువెళ్ళవద్దు” అని. ఆ మాటలు వింటూనే, తల్లి కంటే ఎక్కువగా నా మీద, నా కుటుంబం మీద బాబా చూపిస్తున్న ప్రేమకు నాకు కన్నీళ్లు కారిపోసాగాయి. “ఎన్ని జన్మలెత్తినా నీ ఋణం తీర్చుకోలేని దీనురాలిని బాబా! నా కుటుంబం మీద మీరు చూపిస్తున్న ప్రేమకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను దేవా?” ఎప్పటికయినా కొత్త కారే తీసుకోమన్నారు బాబా.

బాబా చెప్పినట్లు ముందే కొత్త కారు తీసుకునివుంటే మాకు ఈ సమస్యలు తప్పేవి. పాత కారుకి పెట్టిన డబ్బులతో కొత్త కారు వచ్చేది. ఏం చేస్తాం? బాబా మాట వినకపోవడంతో ఆ బాధలు అనుభవించాము. కానీ మేము బాబా మాట వినకపోయినప్పటికీ మా ప్రాణాలకు ఎలాంటి హనీ జరగకుండా కాపాడారు బాబా. డబ్బు ఈరోజు పోతే రేపు వస్తుంది. మరి పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? అందుకే బాబా చెప్పింది వింటే మనందరికీ బావుంటుంది

అదే సమయంలో మా బాబుకి కంటిలో పెన్సిల్ గుచ్చుకుని కంటికి సర్జరీ చేయాల్సి వచ్చింది. బాబా దయవలన మా బాబు క్షేమంగానే ఉన్నాడు. కొద్ది నెలల వరకు మేము బాధపడినగాని మా బాబు కన్ను సాధారణస్థితికి వచ్చింది. ఆ సమయంలో బాబా నన్ను కొద్ది వారాల పాటు ప్రతి గురువారం గుడికి వెళ్ళి తనకు పూలమాల సమర్పించి, ఆరతి ఇమ్మని చెప్పారు. బాబా చెప్పినట్టు చేయడం ప్రారంభించాక కారు సమస్య తీరిపోయింది. ఇంటిలో సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తీరిపోతూ వచ్చాయి. 2015 దత్తజయంతి రోజున బాబాకి పూలమాల సమర్పించి ఆరతి ఇవ్వటం మొదలుపెట్టాను. ఇప్పటికీ చేస్తూ ఉన్నాను. బాబా అనుగ్రహంతో నా జీవితాంతం ఇలాగే చెయ్యాలని కోరుకుంటున్నాను. మరిన్ని అనుభవాలతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను.


4 comments:

  1. మీ అనుభవం లో బాబా ని అడిగి చెప్పిన సర్ ఎవరు
    ఆయన బాబా ని ఎలా అడిగారు

    ReplyDelete
    Replies
    1. ఆయనిప్పుడు లేరు సాయి. ఆయన మరణించి మూడేళ్ళు అవుతుంది

      Delete
  2. om sairam
    sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo