ఖపర్డే డైరీ - ముప్పయి మూడవ భాగం
20-2-1912
కాకడ ఆరతికి హాజరయ్యాను. ఇందులో చెప్పుకోదగ్గదేమిటంటే, సాయిసాహెబ్ చావడిని వదిలి మశీదుకి వస్తూ 'భగవంతుడే అందరికంటే గొప్పవాడు' అని అనటం తప్ప మరొక్క మాట కూడా అనలేదు. ప్రార్థనానంతరం నేను, ఉపాసనీ, బాపూసాహెబ్ జోగ్, భీష్మ, శ్రీమతి కౌజల్గిలతో పంచదశి తరగతి నిర్వహించాను. సాయిసాహెబ్ ఉదయ వ్యాహ్యాళి నుండి మశీదుకు తిరిగి వచ్చాక, “తాము మశీదును తిరిగి నిర్మించాలనుకుంటున్నామ"ని అన్నారు. దానికోసం తగినంత డబ్బు ఉందనీ, దానిని గురించి మాట్లాడుతూనే ఉన్నామని చెప్పారు. మధ్యాహ్న ఆరతికి షిర్కే కుటుంబానికి చెందిన కొందరు బరోడా స్త్రీలు హాజరయ్యారు. ఆరతి మామూలుగానే జరిగిపోయింది. రాధాకృష్ణఆయీ సాయిసాహెబ్ కూర్చునే చోటుకి పైన కొంగగ్రుడ్లలాంటివి వ్రేలాడదీస్తే వారు వాటిని పీకి అవతల పారేశారు.
మధ్యాహ్నం మా పంచదశి తరగతిని నిర్వహించి సాయంత్రం ఆరుగంటలకి మశీదుకు వెళ్ళినప్పుడు సాయిమహారాజు రెండు కథలు చెప్పారు. అందులో ఒకటి నేను ఎక్కువ ఇష్టపడేది. మొదటి కథను నేను మర్చిపోయాను. నేను నా భార్యను, అక్కడున్న మిగతా అందర్నీ ఆ కథ గురించి అడిగాను. దాన్ని అందరూ మర్చిపోవటమే ఆశ్చర్యం. రెండవ కథలో ఒక వృద్ధురాలు తన కొడుకుతో జీవిస్తుండేది. ఆమె కొడుకు ఆ గ్రామంలో చనిపోయిన వారి శవాలను తగులబెట్టి దానితో డబ్బు సంపాదించేవాడు. అక్కడ ప్లేగు వ్యాపించి చాలామంది చనిపోయారు. అందుచేత అతని సంపాదన రెట్టింపయింది. అల్లా ఆమెని ఒకసారి కలిసి ఆమె కొడుకుని వ్యాపారంలో లాభాలు ఆర్జించవద్దని చెప్పారు. ఆమె తన కొడుకుతో ఈ విషయం సంప్రదించగా అతను పెడచెవిన పెట్టాడు. కొంతకాలానికి అతను చనిపోయాడు. ఆ వృద్ధురాలు నూలు వడికి తన జీవనం కొనసాగించసాగింది. ఆమెని ఆమె భర్త తరపు బంధువులింటికి వెళ్ళమన్నా కూడా ఆమె తిరస్కరించింది. ఒకరోజు కొందరు బ్రాహ్మణులు ఆమె ఇంటికి ప్రత్తి కొనుగోలుకై వచ్చి, ఆమె ఇంటి సమాచారాన్నంతా రాబట్టి రాత్రికి దాన్ని పడగొట్టేశారు. ఆ దొంగలలో ఒకడు ఆమె ముందు నగ్నంగా నిలబడ్డాడు. అతన్ని పారిపొమ్మనీ, లేకపోతే గ్రామప్రజలు అతని నేరానికి అతన్ని హత్య చేస్తారనీ ఆమె అతనితో చెప్పగా అతను వెంటనే పారిపోయాడు. తరువాత ఆ వృద్ధురాలు చనిపోయి ఆ దోపిడీదారు కుమార్తెగా జన్మించింది. నేనీ కథను సరిగ్గా అర్థం చేసుకున్నానో లేదో నాకు తెలీదు. మేం సాయిసాహెబ్‌ను సాయంకాలపు వ్యాహ్యాళిలోనూ, రాత్రీ చూశాము. వాడా ఆరతి అయ్యాక భీష్మ భాగవతం, దాసబోధ చదివాడు.
21-2-1912
నేను మామూలుగానే లేచాను కానీ, మేమంతా సాక్షాత్ కరీబువా అని పిలిచే దేవాజీ అరుపుల వల్ల నా ప్రార్థనకు అంతరాయం కలిగింది. ఎలాగో నా మనసును స్వాధీనంలో ఉంచుకొని ప్రార్థన పూర్తి చేశాను. తరువాత సాయిమహారాజు బయటకు వెళ్ళటం చూసి మా పంచదశి తరగతిని నిర్వహించాము. దాని తరువాత నేను మశీదుకు వెళ్ళి బరోడాకి చెందిన షిర్కే కుటుంబ స్త్రీలు సాయిని సేవించటం చూశాను. బొంబాయికి చెందిన నాట్యకత్తె ఒకామె ఈరోజు వచ్చి మశీదులో కొన్ని పాటలు పాడింది. ఆమె తను బాలకృష్ణబువా విద్యార్థినిని అని చెప్పింది. సాయిబాబా ఆమె పాటలు విన్నారు. మధ్యాహ్న ఆరతి మామూలుగా జరిగిపోయింది. సాయిబాబా చాలా మంచి ధోరణిలో ఉన్నారు. మధ్యాహ్న భోజనానంతరం కొద్దిసేపు విశ్రమించాక మా పంచదశి తరగతి మా మామూలు సభ్యులతో కొనసాగింది. సూర్యాస్తమయ సమయంలో సాయిబాబాను వారి సాయంత్రపు వ్యాహ్యాళిలో చూసేందుకు వెళ్ళాను. ఆ తరువాత వాడా ఆరతి అయ్యాక, శేజారతిలో బాబాను దర్శించుకున్నాను. ఊరేగింపు, ఇంకా మిగతా ఏర్పాట్లు ఈరోజు చాలా గొప్పగా ఉన్నాయి. గజ్జెలు, తాళాలతో భజన జరిగింది. శేజారతి అయ్యాక కూడా బొంబాయి నృత్యకారిణి మశీదులో కొన్ని పాటలు పాడింది. రాత్రి భీష్మ భాగవతం, దాసబోధ చదివాడు.
22-2-1912
ఈరోజు కాకడ ఆరతికి మేమంతా హాజరయ్యాము. ఆరతి అయ్యాక షిర్కే కుటుంబ స్త్రీలు వారి సేవకులతో కలిసి వెళ్ళిపోయారు. బొంబాయి నృత్యకారిణి తన మనుషులతో తాను వెళ్ళిపోయింది. తను అమరావతి వెళదామనుకుంటున్నానని చెప్పిందామె. మేము మా పంచదశి తరగతిని నిర్వహించాం. దీని తరువాత, నా భార్య ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు ముందు తనకో కల వచ్చిందని చెప్పింది. సాయిసాహెబ్ కూడా దాదాకేల్కర్, బాలాషింపీలతో నేను వెళ్ళిపోవాలనుకొనే విషయం గురించి నేనేమైనా మాట్లాడానా అని అడిగారట. నటేకర్ (హంస) బహుశా ఈ నెలాఖరుకు నేను అమరావతి వెళ్ళేందుకు అనుమతి లభించవచ్చునని చెప్పాడు. ఇదంతా చూసి నా భార్యకు ఆశలు మళ్ళీ చిగురించాయి. కానీ మధ్యాహ్న ఆరతి సమయంలో సాయిబాబా ఈ ప్రస్తావన తేలేదు. మాధవరావు దేశ్‌పాండే మధ్యాహ్న ఆరతి సమయానికి హార్దానుంచి వచ్చేశాడు. అహ్మద్ నగర్ నుంచి అతని భార్యా, పిల్లలు కూడా వచ్చేశారు. మధ్యాహ్న భోజనం తరువాత విశ్రమానంతరం మా పంచదశి తరగతి దాదాపు రాత్రి సమయం వరకు కొనసాగింది. నేను హడావిడిగా మశీదుకు వెళ్ళి సాయిసాహెబ్‌ను దర్శించి ఊదీ తీసుకున్నాను. రాత్రి భీష్మ దాసబోధ, భాగవతం చదివి భజన చేశాడు. భాటే, బాపూసాహెబ్ అబ్కారీ ఇన్‌స్పెక్టరు, వారి పిల్లలూ రాత్రి నన్ను చూసేందుకు వచ్చారు. నిత్యమూ సాయిబాబా చేసే అద్భుతాల గురించి మేము మాట్లాడుకుంటూ కూర్చున్నాము. అప్పుడు మాధవరావు దేశ్‌పాండే కూడా అక్కడే ఉన్నాడు.
తరువాయి భాగం రేపు ......
తరువాయి భాగం రేపు ......
source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.
very nice sai leela.om sai ram
ReplyDeleteOm Sai
ReplyDeleteSri Sai
Jaya Jaya Sai
🙏🙏🙏
Om Sai Ram 🙏🌹🙏
ReplyDeleteOm Sairam🌹🙏🌹
ReplyDelete