సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 389వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. నా ప్రేమను తిరిగి తెచ్చారు బాబా
  2. బాబాది పక్కా టైమింగ్

నా ప్రేమను తిరిగి తెచ్చారు బాబా

మలేషియా నుండి ఒక సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

స్థిరమైన విశ్వాసం, సహనం ఉన్నవారికి బాబా నుండి సమాధానం తప్పక లభిస్తుందని నేను అనుభవంతో తెలుసుకున్నాను. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

నాకు మూడు సంవత్సరాలుగా ఒక అమ్మాయితో పరిచయం ఉంది. మా ఇద్దరి మధ్య ప్రేమపూర్వకమైన మంచి అనుబంధం ఉంది. మేము వివాహం చేసుకుందామని నిర్ణయించుకుని, మా భవిష్యత్తును చక్కగా మలచుకోవడానికి ఎన్నో ప్రణాళికలు వేసుకుని కష్టపడి పనిచేశాము. కొన్నిసార్లు మా మధ్య వాదోపవాదాలు, చిన్న చిన్న తగాదాలు ఉండేవి. కానీ మేము మాట్లాడుకుని వాటిని తక్కువ వ్యవధిలోనే పరిష్కరించుకునే వాళ్ళం. కానీ ఒకరోజు హఠాత్తుగా తను నన్ను వదులుకోవాలనుకుంటున్నానని, నా దారిన నన్ను జీవితంలో ముందుకు వెళ్ళమని చెప్పింది. ఒక్కసారిగా నా గుండె బద్దలైంది. నేను ఏం తప్పు చేశానో నాకు అర్థం కాలేదు. ఆలోచించి ఆలోచించి ఎంతో ఏడ్చాను. నిరాశలో కూరుకుపోయాను, కొన్ని వారాల పాటు బాధపడుతూ గడిపాను.

అటువంటి సమయంలో మా మామయ్యలలో ఒకరు సాయి నవగురువార వ్రతం పుస్తకం నాకిచ్చి, బాబాను ప్రార్థించమని చెప్పారు. నేను చాలా సంవత్సరాల నుండి బాబా భక్తుడిని. కానీ నేనెప్పుడూ ఆయనను 'ఇది కావాలని' ప్రార్థించలేదు. ప్రతిరోజూ మామూలుగా నమస్కరించుకునేవాడిని, అంతే! అలాంటి నేను బాబాపై నమ్మకం పెట్టుకుని వ్రతం మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాను. అలాగే వ్రతాన్ని ప్రారంభించి, అన్ని విధివిధానాలతో పూర్తి చేశాను. వ్రతంతోపాటు సాయి సచ్చరిత్ర, బ్లాగులోని అనుభవాలను చదువుతూ ఉండేవాడిని. అయితే ప్రతిరోజూ నేను గుండెనొప్పితో బాధపడుతూ ఉండేవాడిని. గుండెనొప్పి ఏమిటి అనుకుంటున్నారా? ఎంతగానో ప్రేమించిన వ్యక్తిని కోల్పోవడమంటే అది గుండెకైన అతిపెద్ద గాయం. ఆ నొప్పిని భరించడం చాలా కష్టం.

రోజులు, వారాలు, నెలలు గడిచిపోతున్నాయి. కానీ నేను బాబాను పూర్తిగా విశ్వసించి, సమస్యను ఆయనకు వదిలిపెట్టాను. హఠాత్తుగా నా బాబా తమ అనుగ్రహాన్ని నాపై కురిపించారు. ఐదు నెలల తరువాత ఆమె నుండి నాకొక మెసేజ్ వచ్చింది. ఆమె విహారయాత్రకు వెళ్ళి తిరిగి విమానాశ్రయానికి చేరుకుంది. అప్పటికే బాగా ఆలస్యమైనందువల్ల టాక్సీలో వెళ్లడం సురక్షితం కాదని నన్ను రమ్మని నాకు మెసేజ్ పెట్టింది. నేను వస్తానని చెప్పానే గానీ, నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. తన దగ్గర మామూలుగా ఉండటానికి నన్ను నేను సిద్ధం చేసుకున్నాను. ఇంటి నుండి బయలుదేరే ముందు బాబాను ప్రార్థించాను. తరువాత నేను ఆమె దగ్గరికి వెళ్ళాక, ఆమె నా కారు ఎక్కింది. కాసేపు మేమిద్దరం మౌనంగా ఉన్నాము. కొన్ని నిమిషాల తరువాత నేను ఆమెను "ఎలా ఉన్నావ"ని అడిగాను. ఆమె 'ఓకే' అని బదులిచ్చింది కానీ ఆమె కళ్ళలో కన్నీళ్ళు నేను చూశాను. అయినా నేను తొందరపడి ఏదీ మాట్లాడకుండా, "ఆకలిగా ఉందా?" అని అడిగాను. తరువాత కారు ఆపి తనకోసం ఫుడ్ తీసుకువచ్చాను. తరువాత ఇద్దరం మాట్లాడుకున్నాము. ఆరోజునుండి మేము మునుపటిలా కలిసి ఉన్నాము. మా ప్రేమ సాయి ఆశీస్సులతో బలపడింది. "ధన్యవాదాలు బాబా. మీరు చేసే అద్భుతాలు ఈ ప్రపంచానికి దూరంగా ఉన్నాయి. వాటిని అందరికీ చేరువ చేసేలా దయచేసి బ్లాగు వెనుక ఉన్న మీ భక్తబృందాన్ని ఆశీర్వదించండి".

ఓం సాయిరామ్!

source:http://www.shirdisaibabaexperiences.org/2020/01/shirdi-sai-baba-miracles-part-2608.html

బాబాది పక్కా టైమింగ్

సాయిభక్తులందరికీ సాయిరాం! సాయినాథ్ మహరాజ్ కీ జై! నా పేరు సునీత. ఇంతకుముందు ఈ బ్లాగ్ ద్వారా నేను ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు బాబా నాకు ప్రసాదించిన మరో అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

మా పెద్దబాబు ఢిల్లీలో చదువుకుంటున్నాడు. ఒకరోజు వాడు నాకు ఫోన్ చేసి, “మాకు సెలవులు ఇచ్చారమ్మా, నేను ఇంటికి వస్తాను” అన్నాడు. ఆ విషయం మావారితో చెబితే ఆయన, “సెలవులు ఇస్తే చక్కగా చదువుకోమను. అటూ ఇటూ తిరగడమెందుకు? రావద్దని చెప్పు” అన్నారు. దాంతో మా బాబు చాలా దిగులుపడ్డాడు. నేను వారిద్దరికీ సర్దిచెప్పలేక బాబా వద్దకు వెళ్ళి, “బాబా! మావారు తనంతట తానే మా బాబును ఇంటికి రమ్మని చెప్పాలి, లేదా మా బాబు తాను ఇంటికి రాలేకపోతున్నాననే దిగులు లేకుండా అక్కడే సంతోషంగా ఉండాలి. ఈ రెండింటిలో మీకు ఏది మంచిదనిపిస్తే అది చేయండి బాబా” అని ఆర్తిగా బాబాను ప్రార్థించాను. బాబా అందరికీ అద్భుతాలెన్నో చేస్తారు. అలాగే ఈ విషయంలో కూడా అద్భుతాన్ని చేశారు. మావారు మా బాబుకి ఫోన్ చేసి, వాడి దిగులు పోయేలా వాడిని ఎంతో బ్రతిమిలాడి, బుజ్జగించి ఇంటికి రమ్మని పిలిచారు. రాత్రి 10.30 ఫ్లైట్‌కి బయలుదేరి రమ్మని చెబితే, రాత్రి 7.30 సమయంలో టికెట్ బుక్ చేసుకుని, 10.30 ఫ్లైట్‌కి బయలుదేరాడు. బాబు ఇంటికి వచ్చేసరికి అర్థరాత్రి 2 గంటలు అయింది. అద్భుతం ఏమిటంటే, ఆ తెల్లవారినుంచి లాక్‌డౌన్ ప్రకటించారు. జరిగినవాటిలో ఏది ఆలస్యమైనా లాక్‌డౌన్ వల్ల మా బాబు అక్కడే చిక్కుకుపోయి ఎంతో ఇబ్బందిపడేవాడు. బాబా చూశారా, ఎంతటి దయామయులో! సరైన సమయంలో బాబుని ఇంటికి చేర్చారు. తన భక్తులు బాధపడుతుంటే ఆయన చూస్తూ ఉండలేరు. ఇంత పెద్ద సమస్యని అతిసుళువుగా పరిష్కరించారు బాబా. ఎంతో ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇలా మరెన్నో అనుభవాలను మీ అందరితో పంచుకోవాలని బాబాను ప్రార్థిస్తూ..

సెలవు.. సాయిరాం!


3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo