సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 334వ భాగం.


ఖపర్డే డైరీ - పంతొమ్మిదవ భాగం 

14-1-1912.

నేను ఉదయాన్నే లేచి నా ప్రార్థన ముగించి బాపూసాహెబ్ జోగ్, రామమారుతిలతో కలసి రంగనాథ్ గారి యోగవాశిష్ఠం చదవటం మొదలుపెట్టాను. సాయిమహారాజు బయటకు వెళ్ళటం చూసి, మేము దానిని కొనసాగించాము. వారు తిరిగి వచ్చాక మేము మశీదుకు వెళ్ళి అక్కడ వారి స్నానానికి ఏర్పాట్లు జరుగుతూండటం చూశాము. అందుకని నేను తిరిగి వచ్చి రెండు జాబులు వ్రాసి మళ్ళీ వెళ్ళాను. ఆయన నాపై ఎంతో కరుణ చూపిస్తూ తమకోసం బాపూసాహెబ్ జోగ్ తెచ్చిన నువ్వుండలు నాకిచ్చారు. ఆయన వాటిని బల్వంత్‌కి కూడా ఇచ్చారు. మేఘుడి ఒంట్లో ఇంకా కులాసా చిక్కకపోవటం వల్ల మధ్యాహ్న ఆరతి ఆలస్యమైంది. తిల సంక్రాంతి అవటంతో పారస్ (పాత్ర నిండుగా ఉన్న ఒక రకమైన ఆహార పదార్థం. దీన్ని భక్తులు తెస్తారు.) ఆలస్యంగా వచ్చింది. మేము తిరిగి వచ్చి, మధ్యాహ్న భోజనం పూర్తి చేసేసరికి సాయంత్రం నాలుగు గంటలైంది. దీక్షిత్ రామాయణం చదివాడు కానీ అది ఎక్కువ సాగలేదు. 

మధ్యాహ్నం నేను వెళ్ళినప్పుడు, సాయిబాబా ఎవరినీ రానివ్వలేదు. అందుకని నేను బాపూసాహెబ్ జోగ్ ఇంటికి వెళ్ళి సాయంత్రం నమస్కారం టైముకి అందుకున్నాను. ఇంకా ఇక్కడే ఉన్న ఖాండ్వా తహసీల్దారు క్రమేపీ ఇక్కడి పద్ధతులకి అలవాటు పడుతున్నాడు. గుప్తే అనే ఆయన తన సోదరుడితోనూ, కుటుంబంతోనూ వచ్చాడు. ఠాణాలో ఉన్న బాబాగుప్తే అనే నా స్నేహితుడికి తాను దూరపు బంధువునని అతను చెప్పాడు. నేను అతనితో మాట్లాడుతూ కూర్చున్నాను. సాయంత్రం శేజారతి, భీష్మ భజన, దీక్షిత్ రామాయణం జరిగాయి. మేమంతా సాధారణ స్థాయిలోనే అయినప్పటికీ సంక్రాంతిని జరుపుకున్నాం.

15-1-1912.

ఉదయాన్నే నిద్రలేచి, ప్రార్థనానంతరం కాకడ ఆరతికి హాజరయ్యాను. కానీ మేఘుడి ఒంట్లో బాగుండకపోవటంతో శంఖం ఊదేందుకు అతను పెందరాళే లేవలేకపోవటం వల్ల కొంచెం ఆలస్యమైంది. సాయిమహారాజు లేచి చావడి నించి వెళ్ళారు. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఉపాసనీశాస్త్రి, బాపూసాహెబ్ జోగ్ త్వరగా రాలేదు. అందుచేత నేను జాబులు రాస్తూ కూర్చున్నాను. సాయిమహారాజు బయటకు వెళుతూ "ఉదయం ఎలా గడిపావు?" అని నన్నడిగారు. నేనేమీ చదవకుండానూ, ధ్యానం చేయకుండానూ గడిపినందుకు అదొక సున్నితమైన మందలింపు. 

వారు తిరిగి వచ్చాక వారిని దర్శించటానికి మళ్ళీ వెళ్ళినప్పుడు వారెంతో దయ చూపించారు. వారో పెద్ద కథ చెప్పటం మొదలు పెట్టి, నాతోనే చెపుతున్నారా అన్నట్లు చెపుతున్నా కానీ, నాకు ఆ సమయంలో నిద్రమత్తు ఆవరించటం వల్ల కథలో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. తరువాత ఆ కథంతా గుప్తే జీవితంలో నిజంగా జరిగిన సంఘటనల సారాంశమేనని నేను తెలుసుకున్నాను. అలా అని ఆయనే చెప్పాడు. మధ్యాహ్న ఆరతి చాలా ఆలస్యమై, మేం తిరిగి వచ్చి భోజనం చేసేసరికి మధ్యాహ్నం మూడు గంటలైంది. కొద్దిసేపు విశ్రమించి దీక్షిత్ పురాణానికి వెళ్ళాను. తరువాత మేము మశీదుకి వెళ్ళాము కానీ, సాయి దూరం నుంచే నమస్కారం చేసుకొని వెళ్ళమనటంతో ఆ ప్రకారమే చేశాం. సాయిబాబా వ్యాహ్యాళికి వెళ్ళొచ్చాక మామూలుగా నమస్కరించుకున్నాము. దీక్షిత్ మశీదుకి నిన్న, ఈరోజు కూడా దీపాలంకరణ చేశాడు. రాత్రి భీష్మ భజన, దీక్షిత్ పురాణం జరిగాయి.

16-1-1912.

నేను మామూలుగా ఉదయాన్నే లేచి, ప్రార్థనానంతరం, 'పరమామృతం'తో నా నిత్య కార్యక్రమం ప్రారంభించాను. మరాఠీలో వేదాంతం మీద ఇది చాలా మంచి రచన. ఉపాసనీ చదువుతూ ఉండటం, నేను, బాపూసాహెబ్ జోగ్, భీష్మ వింటూ ఉండటం. ఇది చాలా బావుంది. అవసరమైన చోట్ల నేను వివరణ ఇస్తున్నాను. సాయిమహారాజు బయటకు వెళ్ళటం చూడగలిగాను, కానీ వారు మళ్ళీ మశీదుకు తిరిగి వచ్చినప్పుడు వెళ్ళి చూసేందుకు నాకు ఆలస్యమైంది. అందుకు వారు ఎటువంటి అసంతృప్తిని ప్రకటించకపోవటమే కాక, నా పట్ల అపారమైన కరుణను చూపటంతో వారి సేవచేస్తూ కూర్చున్నాను. మేఘుడు జబ్బుపడ్డాడు కనుక త్వరగా రావాలన్న ఆజ్ఞ రాకపోవటంతో మధ్యాహ్న ఆరతి ఆలస్యమైంది. చివరికి అతను ఎలాగో ఆరతి చేశాడు. ఆరతై, మేం భోజనాలు చేసేసరికి దాదాపు సాయంత్రం నాలుగైంది. దీక్షిత్ రామాయణం కొద్దిగా చదివాడు. 

మేము సాయిమహారాజు దర్శనానికి మశీదుకు వెళ్ళాము. ఆయన మమ్మల్ని ఎక్కువసేపు కూర్చోనివ్వకుండా, వాడాకు తిరిగి పొమ్మని ఆజ్ఞాపించారు. వారు బయటకు వచ్చి వారి వ్యాహ్యాళిని త్వరత్వరగా పూర్తిచేసుకొన్నారు. దీన్ని మేము అర్థం చేసుకోలేక పోయాము. అయితే వాడాకు వచ్చాక దీక్షిత్ గారి హరి అనే పనివాడు క్రిందటి రోజు అస్వస్థతకు గురై ఈరోజు చనిపోయాడని తెలిసింది. దానికి మందేదో తెలిసిన ఉపాసనీ కోసం పంపాము కానీ అతను కనపడలేదు. ఆ మనిషైతే చనిపోయాడు. అందులో అనుమానమేమీ లేదు. మేం వాడాలో మామూలు ఆరతి ఇచ్చి, శేజారతికి హాజరయ్యాము. శేజారతి సమయంలో సాయిమహారాజు ప్రత్యేకించి చాలా దయగా ఉండి, ఆహ్లాదపూరితమూ, అద్భుతమూ అయిన వ్యాఖ్యానాలనూ, ఆజ్ఞలను జారీ చేశారు. అలాగే రామమారుతిని కూడా అనుగ్రహించారు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

4 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo