సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 352వ భాగం


ఖపర్డే డైరీ - ముప్పయిఏడవ  భాగం

4-3-1912

నా భార్య సాయిసాహెబ్‌ని పూజించేందుకు ఆలస్యంగా వెళ్ళినప్పటికీ తను చేస్తున్న భోజనాన్ని నిలిపివేసి ఆమెని పూజచేసుకోనిచ్చారు బాబా.

6-3-1912

మేము కూటస్థదీప్‌ని పూర్తిచేసి ధ్యానదీప్ ప్రారంభించాము. తరగతి అయిపోయాక మామూలు ప్రకారం నేను మశీదుకి వెళ్ళాను. సాయిబాబా చాలా ప్రశాంతంగా ఉండటంతో వారికి సేవచేస్తూ కూర్చున్నాను. తమకి నడుమువద్దా, ఛాతీవద్దా, మెడదగ్గరా బిగపట్టినట్లుందనీ, తమలపాకులు కళ్ళమీద పెట్టాలని అనుకున్నామనీ, వాటిని తీసినప్పుడు విషయమేమిటో తెలుసుకున్నామని అన్నారు. తమకి అర్థంకానిదేదో కనిపించేసరికి చాలా ఆశ్చర్యం వేసిందట. వారు దాని కాలుని పట్టుకొని దాన్ని క్రిందపడేశారట. వారు అగ్నిని ప్రజ్వరిల్ల చేద్దామనుకొంటే కట్టెలు తడిగా ఉండటం వల్ల అవి అంటుకోలేదట. తాము నాలుగు శవాలను చూశామనీ, అవి ఎవరివో తమకు అర్థంకాలేదని అన్నారు. సాయిబాబా అదే అలసటతో అలా చెపుతూనే ఉన్నారు. తమ ఎడమవైపు పై దవడా, క్రింది దవడా చాలా నొప్పిగా ఉండటం వల్ల తాము నీరు కూడా త్రాగలేకపోతున్నారట.

7-3-1912

కాకడ ఆరతికి హాజరయ్యాను. సాయిమహారాజు చాలా ఆనందంగా ఉన్నారు. చావడి నుండి మశీదుకు వెళ్ళే సమయంలో నృత్యం చేశారు.

8-3-1912

ఉదయం భీష్మ, బందూ పెందరాళే లేచి ప్రార్థనా గీతాలు పాడారు. అవి చాలా బాగున్నాయి. నా ప్రార్థనానంతరం పంచదశి తరగతిని నిర్వహించాము. సాయిమహారాజు బయటకు వెళ్ళటం చూసి నేను తరువాత మశీదుకు వెళ్ళాను. సాయిమహారాజు ఎంతో దయగా నన్ను పేరు పెట్టి పిలిచి, నేను కూర్చున్న వెంటనే తనకి నలుగురు సోదరులున్న కథను చెప్పటం ప్రారంభించారు. తను చాలా చిన్నవాడినైనా చాలా తెలివిగలవాడినని చెప్పారు. ఎంతో విశాలమైన తన ఇంట్లోనూ, దానికి ఎంతో సమీపంలో ఉండే అషుబ్‌‌ఖానా వద్దా ఆడుకునేవారట. దాని దగ్గరలో ఒక వృద్ధుడు కూర్చుని ఉండేవాడట. అతను మశీదులోకి గానీ, అషుబ్‌ఖానాలోకి గానీ వెళ్ళకుండా తనున్నచోటు తనది అని అంటూ ఉండేవాడట. అతని మనుషులు కోరుకోనప్పటికీ సాయిబాబా అషుబ్‌ఖానాకి కూడా వెళ్ళి, అక్కడ జరిగే కార్యక్రమాన్ని మెచ్చుకునేవారు. అక్కడ ఉండే వృద్ధుడే తన తల్లికి తండ్రి అవటం వల్ల శ్రీసాయిబాబా ఆయన కోసం ఎప్పుడూ ఒక రొట్టె, దానిలో నంచుకోవటానికి ఏదైనా తీసుకుని వెళ్ళేవారట. ఆ వృద్ధుడు కుష్టురోగి. ఆయన వేళ్ళు రోజురోజుకీ అధ్వాన్నంగా అయి చివరికి అతను ఆహారాన్ని నిరాకరించి చనిపోయాడట. అప్పుడు సాయిబాబా ఆయన దగ్గరలోనే ఆడుకుంటున్నారు. మరణం అంత సమీపంలోనే ఉందని ఆయన అనుమానించలేకపోయారు. దీన్ని గురించి వారి తల్లికి చెప్పగా ఆమె తన తండ్రిని చూడటానికి వెళ్ళింది. సాయిబాబా అక్కడకు వెళ్ళి ఆ వృద్ధుడు చనిపోగానే, ఆయన శరీరం ధాన్యంగా మారటాన్ని కనుగొన్నారట. ఆ వృద్ధుడి బట్టలను ఎవరూ తీసుకోలేదు. ధాన్యం మాయమైన తరువాత వృద్ధుడు మళ్ళీ జన్మించాడట, కానీ అంత్యజులతో కలిశాడట. సాయిబాబా అతనికి ఆహారం ఇచ్చారట. అప్పుడు వృద్ధుడు మూడవసారి కొండాజీ కొడుకుగా జన్మించాడట. ఆ పిల్లవాడు సాయిబాబాతో ఆడుకుంటూ ఉండేవాడు. అతను కొద్దినెలల క్రితం చనిపోయాడు. 

మధ్యాహ్న ఆరతి సమయంలో సాయిబాబా నా దగ్గరకు వచ్చి నా ఎడమచేతిని పట్టుకొని, తన చేతిని ఛాతీ వద్ద పెట్టి ఒక కుఱ్ఱవాడి గురించి చెప్పటానికి మనం ఎలా సైగలు చేస్తామో అలా చేసి, రెండవ చేతితో 'ఎవరో వెళ్ళిపోయారు' అనే సంజ్ఞను, తమ కళ్ళతో మరో సంజ్ఞను చేశారు. పూర్తిగా అర్థం చేసుకోలేకపోవటం వల్ల నేను రోజంతా ఆ ఆలోచనలోనే చిక్కుపడిపోయాను.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

4 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo