సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 338వ భాగం.


ఖపర్డే డైరీ - ఇరవైమూడవ భాగం. 

23-1-1912

నేను కాకడ ఆరతి సమయానికి సరిగ్గా లేచి కొంచెం తెల్లవారాక నా ప్రార్థన పూర్తి చేసుకున్నాను. ఈరోజు సాయిబాబా పడకనుండి లేచాక ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ వారు మామూలు ప్రకారం బయటకు వెళ్ళేప్పుడు మేము వారిని చూసినప్పుడు వారు చాలా ఉల్లాసంగా ఉన్నారు. నేను ఉపాసనీ, బాపూసాహెబ్ జోగ్, భీష్మలతో కలిసి పరమామృతం చదివాక మేము సాయిబాబాను చూసేందుకు మశీదుకు వెళ్ళాము. వారు మౌనంగా ఉండి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. మధ్యాహ్న ఆరతి ప్రశాంతంగా ముగిసింది. దాని తరువాత మేము తిరిగి వచ్చి మా భోజనాలు కానిచ్చాము. గౌరవనీయురాలైన శ్రీమతి రస్సెల్‌గారికి బాబా ఫోటో, ఊదీ పంపేందుకు మాధవరావు దేశ్‌పాండే సాయిబాబా వద్దనుండి అనుమతి సంపాదించాడు. నేను ఆమెకు రాద్దామనుకున్నానుగానీ, రాసే ధోరణిలో నేను లేనని నాకే అనిపించటంతో సాయిబాబాను చూసేందుకు కుటుంబసమేతంగా ఇటీవల వచ్చిన ఒక స్కూలు టీచరుతో మాట్లాడుతూ కూర్చున్నాను. దీక్షిత్ రామాయణం చదివాక సాయంత్ర వ్యాహ్యాళి సమయంలో సాయిబాబాను చూసేందుకు వెళ్ళాము. అప్పుడు కూడా ఆయన ఏమీ చెప్పలేదు. ఈ వారంలో మొట్టమొదటిసారిగా రాత్రి భీష్మ భజన చేశాడు. గ్రామంలోని కొందరు కుర్రాళ్ళు కూడా భజన చేసేందుకు వచ్చారు. తరువాత దీక్షిత్ రామాయణం చదివాడు. శ్రీమతి లక్ష్మీబాయి కౌజల్గి ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలని అనుకొంది. సాయిబాబా ఆమె తన శ్రేయస్సు కోసం అలా చేయవచ్చునని చెప్పారు.

24-1-1912.

ఎందుకోగానీ ఈ ఉదయం బాగా నిద్రపోయాను. దీనివల్ల ప్రతిదీ ఆలస్యమైపోయి, నా నిత్యక్రమమంతా నేను కంగారుగా చేయవలసి వచ్చింది. ఎందుకో దీక్షిత్ కూడా ఆలస్యమయ్యాడు. ప్రతివాళ్ళూ ఇదే పరిస్థితిలో ఉన్నట్లనిపించింది. సాయిబాబా బయటకు వెళ్ళటం చూశాక, నేను ఉపాసనీ, భీష్మ, బాపూసాహెబ్ జోగ్‌లతో పరమామృతం చదివాను. నేను తరువాత సాయిమహారాజుని చూసేందుకు మశీదుకు వెళ్ళాను. లక్ష్మీబాయి కౌజల్గి మా పరమామృతం తరగతికి హాజరై నేను మశీదు చేరాక తనూ మశీదుకు వచ్చింది. సాయిబాబా ఆమెని తన అత్తగారిగా అభివర్ణించి, ఆమె తనకు నమస్కరించటాన్ని హాస్యం చేశారు. ఆమెని వారు తమ శిష్యురాలిగా అంగీకరించారన్న అభిప్రాయాన్ని అది నాకు కలిగించింది. మామూలు పద్ధతిలో ప్రశాంతంగా మధ్యాహ్న ఆరతి గడచిపోయింది. 

అక్కడనుండి తిరిగి వస్తుండగా కోపర్గాం మామల్తదారు సానే వరండాలో కూర్చొని ఉండటం కనిపించింది. అతను గ్రామ విస్తరణ పనిలో భాగంగా శవాల్ని పూడ్చి, తగులబెట్టే శ్మశానాన్ని తొలగించే రెవెన్యూ పనిలో ఉన్నాడు. భోజనానంతరం కొన్ని జాబులు రాద్దామని ప్రయత్నించాను కానీ, సానేతో మాట్లాడుతూ కూచున్నాను. తరువాత దీక్షిత్ రామాయణం చదివాక, సాయిబాబాను చూసేందుకు మశీదుకు వెళ్ళాను, కానీ అందరూ వెంటనే బయటకు వెళ్ళిపోతూండటంతో నేను 'ఊదీ' తీసుకొని చావడివద్ద నిలుచున్నాను. కొద్ది సంవత్సరాల క్రితం సతాయే, ఆస్నారేతో కలసి అమరావతికి వచ్చిన కబీరుపంథీయుడైన మహమ్మదీయ పెద్దమనిషిని అక్కడ కలిశాను. సాయంత్రం వాడా ఆరతి, చావడిలో శేజారతి జరిగింది. నేను యథాప్రకారం నెమలిపింఛాల విసనకర్ర పట్టుకున్నాను.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo