సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 373వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. తీవ్రమైన మానసిక వ్యధ నుండి బాబా మాత్రమే కాపాడారు
  2. ఫార్మసీ పరీక్షలో ఉత్తీర్ణత గురించి ముందుగా బాబా సూచన

తీవ్రమైన మానసిక వ్యధ నుండి బాబా మాత్రమే కాపాడారు

శ్రీ శిరిడీ సాయినాథాయ నమః

నా పేరు శ్రీనివాసరావు. నాది గుంటూరు జిల్లా. ఈ బ్లాగు రూపొందించినవారికి నమస్కరిస్తూ, శ్రీసాయిబాబా నా జీవితంలో చేసిన అనేక లీలలలో నుండి ఒక అద్భుతమైన లీలను సాటి సాయిభక్తులతో పంచుకుందామని అనుకుంటున్నాను.

రెండు సంవత్సరాల క్రితం బాబా గురించి నాకేమీ తెలియదు. ఏదో మాములుగా గుడికి వెళ్లి టెంకాయ కొట్టి, దండం పెట్టుకుని వచ్చేవాడిని, అంతే. అటువంటి నా జీవితంలో మనోవ్యాధి రూపంలో ఒక పెద్ద కష్టం వచ్చి పడింది. తీవ్రమైన భయాందోళనలతో మనోవ్యాధిగ్రస్తుడనయ్యాను. స్వామి వివేకానంద పుస్తకాలు చదవడం వంటివి చేస్తూ ఎంత ప్రయత్నించినా అందులోనుండి నేను బయటపడలేకపోయాను. పూర్తి నిరాశానిస్పృహలతో నాకు మరణం చేరువలోనే ఉంది అనుకున్నాను. ఆ సమయంలో నేను పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఉన్నాను. ఆ ఉద్యోగాన్ని బాబానే నాకు ప్రసాదించారు. ఆ అనుభవాన్ని ఇంకోసారి మీతో పంచుకుంటాను. అదలా ఉంటే, మనోవ్యాధి నుండి నాకు ఉపశమనం కలిగించమని ఒకరు కాదు అందరి దేవుళ్ళకూ మ్రొక్కుకున్నాను. కానీ ఎటువంటి ఫలితం కనిపించలేదు. అలాంటి పరిస్థితిలో నేను అనుకోకుండా ఒక గదిలో ఉన్న బాబా ఫోటో ముందు నిలబడి ఆయనకు నమస్కరించుకున్నాను. ఆ తరువాత నేను బాబా ఫోటో ఒకటి తెచ్చుకుని నా గదిలో పెట్టుకొని పూజించడం ప్రారంభించాను. అప్పటినుండి నా జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ కష్టం నుంచి బయటపడడానికి బాబానే స్వయంగా నాకు ఒక మార్గం చూపించారు. ఆయనే స్వయంగా నాకు సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని పంపించారు. అదెలా అంటే, అదివరకే ఒకసారి నేను ట్రైనింగ్ సెంటర్లో పరిచయమైన ఒక సాయిబంధువుని 'సాయి సచ్చరిత్ర ఎక్కడ దొరుకుతుంద'ని అడిగాను. ఆశ్చర్యకరంగా అతను నేను ఈ పరిస్థితిని అనుభవిస్తున్న సమయంలో సచ్చరిత్ర తీసుకొచ్చి నాకిచ్చాడు. నేను ఆ గ్రంథాన్ని ఒకసారి పారాయణ చేసి, "నా మనోవ్యాధి పూర్తిగా తగ్గడానికి దారిచూపమ"ని బాబా ఫోటో ముందు కన్నీళ్ళతో ప్రార్థించి, సచ్చరిత్ర గ్రంథం కళ్ళకద్దుకొని, కళ్ళు మూసుకొని ఒక పేజీ తెరిచాను. నా ప్రశ్నకి బాబా సమాధానంగా 'విష్ణుసహస్రనామాలు' చదవమని వచ్చింది. నేను అంతటితో ఆగక, ఆ సందేశం నిజమో కాదో పరీక్షించడానికి ఆ గ్రంథాన్ని క్రింద పెట్టి, మరలా నా చేతుల్లోకి తీసుకొని కళ్ళు మూసుకొని, "బాబా! ఆ సమాధానం చూపించినది సత్యమే అయితే, మరలా నాకు అది చూపించండి" అని మనసులో అనుకొని మరలా సచరిత్రలో ఒక పేజీని తెరిచాను. మళ్ళీ అదే పేజీ వచ్చింది. నేను చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను. ఆ పుస్తకాన్ని అక్కడ పెట్టి వేరొక సాయి సచ్చరిత్ర తీసుకొని, "బాబా! రెండుసార్లు విష్ణుసహస్రనామావళి పారాయణ చేయమని నాకు చూపించావు. అదే సత్యమైతే, ఈ పుస్తకంలో కూడా నేను తీసిన పేజీలో అదే వచ్చినట్లైతే మీరు చెప్పినట్లే పారాయణ చేస్తాను" అని చెప్పుకొని సచ్చరిత్ర  కళ్ళకద్దుకుని కళ్ళు మూసుకొని ఒక పేజీ తీసి ఆశ్చర్యచకితుడనయ్యాను. ఈసారి కూడా విష్ణుసహస్రనామ పారాయణ చేయమని ఉన్న పేజీనే చూపించారు బాబా. ఇక అప్పటినుండి విష్ణుసహస్రనామాలు పారాయణ చేయడం ప్రారంభించాను. నా సమస్యలు తీరిపోయాయి. అంతటితో నేను బాబానే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవము అని తలచి నిరంతరం ఆయన నామస్మరణలో మునిగి తేలుతున్నాను. ఈరోజు నేను జీవిస్తున్నానంటే అది 'బాబా నాకు ప్రసాదించిన పునర్జన్మ' అని గుండెలపై చెయ్యి వేసుకుని చెప్పగలను. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా!" నా అనుభవాన్ని ఇలా మీ అందరితో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అనుభవాలు బాబా నాకు చాలా చూపించారు. ఇంకొకసారి మిగతా అనుభవాలను పంచుకుంటాను. అందరికీ బాబా ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటూ...

జై సాయిరాం!

ఫార్మసీ పరీక్షలో ఉత్తీర్ణత గురించి ముందుగా బాబా సూచన

యు.ఎస్.ఏ నుండి ఒక సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

హాయ్, నేను కాలిఫోర్నియాలో నివాసముంటున్నాను. నేను రెండు సంవత్సరాల నుండి బాబా భక్తుడిని. పంచుకోవడానికి నాకు చాలా అనుభవాలున్నాయి. కానీ ఇటీవల జరిగిన ఒక అనుభవం ఇప్పుడు మీతో పంచుకుంటాను.

ఓం సాయిరామ్! నేను రెండవ ప్రయత్నంలో ఫార్మసీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాను. అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే దాని వెనుక బాబా ఇచ్చిన మంచి అనుభవం ఉంది. నేను మొదటిసారి మే 23, గురువారంనాడు ఫార్మసీ పరీక్షలు వ్రాయబోతుండగా మే 19, ఆదివారంనాడు బాబా మందిరానికి వెళ్లి, "నేను పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా నన్ను అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. ఆరోజు రాత్రి బాబా స్వప్నదర్శనమిచ్చారు. ఆయన అభయహస్తాన్ని చూపుతూ ఒక వేలు చూపించారు. కొద్దిసేపటి తర్వాత అభయహస్తాన్ని చూపుతూ రెండు వేళ్ళు చూపించారు. ఆ సమయంలో నాకు ఏమీ అర్థం కాలేదు. తరువాత నేను మే 23న పరీక్షలు వ్రాశాను. దాంట్లో నేను వైఫల్యం చెంది బాధతో చాలా ఏడ్చాను. అప్పుడు నేను నా రెండవ ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధిస్తానని బాబా సూచించారని గ్రహించాను. కొద్దిరోజులకి నేను రెండవసారి పరీక్షలు వ్రాయడానికి దరఖాస్తు చేసుకున్నాను. మొదట నేను పరీక్షలు కఠినంగా ఉంటాయేమో అని సందేహపడ్డాను. కానీ కలలో బాబా చెప్పారు, కాబట్టి ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధిస్తానని అనుకున్నాను. పరీక్షకు ముందు బాబా మళ్ళీ స్వప్నదర్శనం ఇచ్చారు. ఆయన తన ఒంటిపై శాలువా కప్పుకుని ఉన్నారు. ఈసారి ఆయన ఏ వేలూ చూపలేదు, అభయహస్తమూ చూపలేదు. దాంతో నేను అయోమయంలో పడ్డాను. కానీ మొదటి కలలో బాబా చెప్పినట్లు నేను ఉత్తీర్ణుడనయ్యాను. నా ఆనందాన్ని మాటల్లో వ్యక్తపరచలేను. "మీ సహాయానికి, ప్రేమకు ధన్యవాదాలు బాబా! దయచేసి మాతో, మీ భక్తులందరితో ఉండండి".

ఓం సాయిరామ్!


8 comments:

  1. i iwant to see baba in dreams.i never got that chance to see sai in dreams.my desire is to see sai in dreams.please bless my desire becomes true

    ReplyDelete
  2. ఓం సాయిరాం🌷🙏🌷

    ReplyDelete
  3. Sairam����

    ReplyDelete
  4. om sairam
    sai always be with me

    ReplyDelete
  5. om sairam
    sarvam sainatharpanamasthu

    ReplyDelete
  6. Om Sairam 💙u baba,pls be with me always

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo