ఈ భాగంలో అనుభవం:
- సాకార రూపుడై దర్శనమిచ్చి, ఆశీర్వదించిన సాయినాథుడు
గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరా
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయిబంధువులకి నా నమస్కారములు. నా పేరు సంధ్య. శ్రీ సద్గురు సాయినాథుని దివ్యపాదాలకు నమస్కరిస్తూ, 2007వ సంవత్సరంలో ఒక గురువారంనాడు సాయిబాబా నన్ను అనుగ్రహించి, నాకు రాబోయే వ్యాధిని నిర్మూలించి, నా జీవితంలో వ్యాధిరూపంలో ఉన్న చెడుకర్మ నుండి నన్ను రక్షించిన అద్భుతలీలని నేనిప్పుడు మీతో పంచుకోబోతున్నాను.
మొదట్లో నాకు తెలిసిన దైవాలు శివుడు, జగన్మాత. ప్రతిరోజూ నేను దేవుని ముందు దీపం వెలిగిస్తాను. ఆరోజు గురువారం, UKG, Nursery చదువుతున్న మా పిల్లల్ని స్కూలుకి పంపించి, 12 గంటలలోపు దీపం వెలిగించే అలవాటున్న నేను స్నానానంతరం తులసీమాతకు నీళ్ళుపోద్దామని బయటకు వచ్చాను. అనుకోకుండా గేటువైపు చూశాను. ప్రహరీ లోపల గేట్ దగ్గర సాయిబాబా తెల్లని కఫ్నీ, తలపాగా, జోలెతో (మాసిన తెలుపు వర్ణంలో), ప్రశాంత వదనంతో, ఆహ్లాదకరమైన ముఖవర్ఛస్సుతో నిల్చుని ఉన్నారు. తులసీమాతకు నీళ్ళు పోసి వడివడిగా బాబా దగ్గరికి వెళ్ళాను. నాకు నోట మాట రాలేదు. బాబాను అలా చూస్తూ ఉండిపోయాను. అప్పటికి సాయిబాబా గురించి ఏమీ తెలియని అజ్ఞానురాలిని. నేను లోలోపల కాస్త భయపడుతున్నాను. బాబా నాతో, “భయపడుతున్నావా?” అన్నారు. నేను, “మీరు అచ్చం సాయిబాబాలాగే ఉన్నారు” అన్నాను. అప్పుడు బాబా చిరునవ్వు నవ్వారు. నెమ్మదిగా క్రింద కూర్చున్నారు. వాతావరణం చాలా ఆహ్లాదంగా, ప్రశాంతంగా ఉంది. బాబా నన్ను బియ్యం ఇవ్వమని అడిగారు. నేను వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఒక డబ్బాతో బియ్యం తీసుకొచ్చి బాబాకు ఇచ్చాను. బాబా మరలా బియ్యం అడిగారు. నేను మరొక డబ్బా బియ్యం తీసుకువచ్చి బాబా జోలెలో పోశాను. తరువాత, “నాకు డబ్బులు ఇవ్వు” అని అడిగారు బాబా. నేను ఇంట్లోకి వెళ్ళి, ఎంత డబ్బివ్వాలా అని ఆలోచించాను. ఇంట్లో డబ్బులు ఉన్నాయి, కానీ మావారు ఇంట్లో లేనందున నా దగ్గర ఉన్న 1001 రూపాయలు తీసుకొచ్చి బాబాకు ఇచ్చాను. బాబా ఇంకా డబ్బులిమ్మని అడిగారు. ‘శిరిడీ పాదయాత్రకు డబ్బులు కావాల’ని అడిగారు. కానీ, బాబా గురించి ఏమాత్రం తెలియని నేను, ‘అంతే ఇవ్వగలను బాబా’ అన్నాను. బాబా చిన్నగా తలవూపి, ‘ఒక రూపాయి ఇవ్వు’ అన్నారు. నేను ఇంట్లోకి వెళ్ళి ఒక రూపాయి తీసుకువచ్చి బాబాకి ఇచ్చాను. ఆ రూపాయిని చేతిలోకి తీసుకుని, ఆ రూపాయిని నిమ్మకాయగా చేసి, ఆ నిమ్మకాయలో ఉన్న పులుపురసాన్ని అంతా పిండేసి, దానిని చిన్ని ముద్దమందార పువ్వులా చేశారు. ఆ పువ్వు చిన్నదిగా, చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంది. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. తరువాత, ‘ఒక క్రొత్త బట్ట ఇవ్వు’ అని అడిగారు. నేను ఇంట్లోకి వెళ్ళి ఆకుపచ్చ రంగులో ఉన్న ఒక చిన్న బట్టను తీసుకొచ్చి బాబాకు ఇచ్చాను. బాబా ఆ బట్టలో ఆ చిన్ని ముద్దమందారాన్ని పెట్టి ఇచ్చారు. ‘దీన్ని ఏమి చేయాల’ని అడిగాను. బాబా తన జోలెలోంచి రెండు ఔషధమూలికలను తీసి నాకు ఇచ్చారు. నేను అజ్ఞానంతో, “ఇదేంటి? చెత్తలా ఉంది” అన్నాను. బాబా నవ్వి, “దీనిని మీ పూజామందిరంలో ఉంచు” అన్నారు. బాబా నవ్వినపుడు తన నోరు తాంబూలం వేసుకున్నట్లుగా ఎర్రగా ఉంది. ఆయన నాకు ఒక చీటీ ఇచ్చారు. ఆ చీటీలో సకల మతాల గుర్తులూ ఉన్నాయి. చీటీ క్రిందిభాగంలో, ‘శిరిడీ పాదయాత్రకు సహాయం చేయండి’ అనీ, ‘నీ అహంకారం వదలి నావైపు చూడు’ అనీ ఉంది. ఆ చీటీని, ఆ చిన్ని ముద్దమందారాన్ని మూలికలతో సహా బట్టలో పెట్టి మూటకట్టి పూజామందిరంలో ఉంచాను. అప్పుడు మాది అద్దె ఇల్లు. బాబా నన్ను, “తుల్జాపూర్ యాత్రకి వెళ్ళారా?” అని అడిగారు. నా చేతికి ఉన్న తుల్జాపూర్ గాజులు చూసి అడిగారేమో అనుకున్నాను. “ఆఁ, అవును, నా భర్త తుల్జాపూర్ వెళ్ళి వచ్చారు” అన్నాను. బాబా లేచి నిలబడ్డారు. “మేము కొత్త ఇల్లు కట్టుకుంటున్నాము” అని బాబాతో చెప్పాను. బాబా నవ్వారు. “ప్రక్కన ఇంట్లో నాకు తెలిసిన అక్క ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళండి” అన్నాను. బాబా నవ్వుతూ ‘సరే’ అని అక్కడనుండి వెళ్ళిపోయారు. నా అజ్ఞానం చూడండి, బాబా ఉన్నంతసేపూ ‘దేవుడిముందు దీపం వెలిగించాలి, సమయం 12 గంటలు కావస్తోంది. పిల్లలకి లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి’ అనే ఆలోచనలోనే ఉన్నాను. ఆ తరువాత దేవుడి ముందు దీపం వెలిగించి, పిల్లలకి లంచ్ బాక్స్ తీసుకుని స్కూల్‌కి వెళ్ళాను. స్కూల్ నుండి వచ్చాక ప్రక్కింటి అక్కను అడిగాను, “బాబా రూపంలో ఉన్న వృద్ధుడు వచ్చారా?” అని. “ఆఁ, వచ్చారు, నువ్వు మా ఇంటికి వెళ్ళమని చెప్పావంట కదా!” అని చెప్పింది. ఆ అక్క కూడా తాను బాబాకి బియ్యం ఇచ్చానని చెప్పింది.
ఇక ప్రతిరోజూ ఈ విషయం గురించే నేను ఆలోచించేదాన్ని, “వచ్చింది సాయిబాబానేనా? వచ్చింది భగవంతుడే అయితే పదే పదే బియ్యం, డబ్బులు ఎందుకు అడుగుతారు? భగవంతుడు మనం ఇచ్చింది తీసుకుంటాడేమో కదా! దైవం ఎక్కడైనా తాంబూలం వేసుకుంటారా? అసలు రూపాయి ఎందుకు అడిగారు? రూపాయిని నిమ్మకాయగా చేసి, పులుపంతా పిండేసి, ముద్దమందారంగా ఎందుకు చేశారు? జోలె నుండి ఆ మూలికలు తీసి ఎందుకిచ్చారు? దేవుడు గారడీ విద్యలు చేస్తాడా?” అని ప్రతిరోజూ ప్రశ్నించుకునేదాన్ని. ఈ జరిగిన సన్నివేశమంతా నాకు దగ్గరివాళ్ళకు చెప్పి, ‘అచ్చం సాయిబాబాలా ఉన్నారు, ఇలా చేశారు’ అని చెప్పి చాలా సంతోషించాను కూడా. నేను చెప్పిన వారిలో కొందరు సాయిని పూజించేవాళ్లు కూడా ఉన్నారు. అందరూ సంతోషిస్తున్నారే గానీ, ‘వచ్చింది సాక్షాత్తూ సాయిబాబానే’ అని నాకు ఎవరూ చెప్పలేదు. నా లోపల ఎన్నో ప్రశ్నలు తలెత్తినప్పటికీ సాయిబాబా రూపం మాత్రం నా మదిలో నిలిచిపోయింది. ఎంతో ప్రశాంతంగా, నిరాడంబరంగా, దయతో, కరుణతో ఉన్న ఆ ముఖారవిందం నా కన్నులలో నిలిచిపోయింది.
ప్రతిరోజూ నాకు నేనే ప్రశ్న వేసుకుంటూ ఉండేదాన్ని, “అహంకారం వదిలి నావైపు చూడు అని ఆ చీటీలో ఉంది, నాకేమి అహంకారం ఉంది?” అని. అలా నా అహంకారంతో రోజులు గడుస్తూనే ఉన్నాయి. ప్రతిరోజూ బాబా ముఖవర్ఛస్సుని గుర్తుచేసుకుంటూ, ఆ చిరునవ్వుని తలచుకుంటూ ఉండేదాన్ని. తరువాత కొంతకాలానికి మేము క్రొత్త ఇంటిలోకి వచ్చాము. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఒకసారి మేము శిరిడీ వెళ్ళాము. అక్కడ నాతో ముచ్చటించిన బాబా రూపం ఉన్న ఫోటో నా కంటపడింది. వెంటనే ఆ ఫోటోను కొనుక్కుని ఇంటికి తీసుకువచ్చాను. బాబా ఎన్నో లీలలు చూపిస్తున్నప్పటికీ బాబా ఉనికిని తెలుసుకోలేని ఒక అజ్ఞానురాలిగా ఉండిపోయాను.
అయిదు సంవత్సరాలు గడిచిపోయాయి. చాలా ఆరోగ్యంగా, ఉత్సాహంగా పనిచేసుకుంటూ నా కుటుంబంతో హాయిగా ఉన్నాను. అనుకోకుండా ఒకరోజు నా శరీరంపై తెల్లటి మచ్చ కనిపించింది. ఒక్కసారిగా నా జీవితం భయాందోళనలతో నిండిపోయింది. అంతకు కొన్నిరోజుల ముందు ఒక సాయిభక్తురాలు నాకు ‘సాయి నవగురువార వ్రతం’ పుస్తకాన్ని ఇచ్చింది. నేను ఆ పుస్తకాన్ని మా పూజామందిరంలో ఉంచాను. భయాందోళనలతో నిండిన నా జీవితంలోకి బాబా నవ గురువార పుస్తకం రూపంలో మళ్ళీ వచ్చి నన్ను అనుగ్రహించారు. డాక్టరును సంప్రదించగా, నా శరీరంపై ఉన్న తెల్లమచ్చ నేను అనుమానించిన వ్యాధేనని (బొల్లి, vitiligo) ఆయన తేల్చి చెప్పారు. ఇది ఎందుకు వస్తుందని నేను డాక్టరును అడిగాను. “నేను నాన్ వెజ్ తినను, అన్నీ శాకాహారమే తింటాను. మరి నాకు ఈ వ్యాధి ఎందుకు వచ్చింది?” అని అడిగాను. “ఇది పుల్లటి పదార్థాలు ఎక్కువగా త్రాగడం వలన, తినడం వలన వచ్చింది” అన్నారు డాక్టర్. అప్పుడు నాకు గుర్తుకు వచ్చింది, వేసవిలో ఎండతీవ్రతకు వేడిచేయడం వలన ఉప్పు కలుపిన నిమ్మకాయనీళ్ళు ఎక్కువగా త్రాగిన విషయం. పులుపు పదార్థాలకు దూరంగా ఉండమని సలహా ఇస్తూ మందులు వ్రాశారు డాక్టర్. నేను ఇంటికి వచ్చి చాలా ఏడ్చాను. “నేను ఏ పాపం చేశాను? నాకు ఈ వ్యాధి ఎందుకు వచ్చింది? నేను ప్రతినిత్యం ఈశ్వరుడిని, జగన్మాతను పూజిస్తూ, నామజపం చేసుకుంటూ ఏ లోటూ లేకుండా హాయిగా జీవిస్తున్న నాకు ఈ గతి ఏమిటి?” అని పూజామందిరంలో నా ఇష్టదైవానికి చెప్పుకుని భోరున విలపించాను. “ఏమిటీ శిక్ష నాకు? నేను ఏ పాపం ఎరుగను. నా పిల్లల పరిస్థితి ఏంటి? నేను ఇంటా బయటా ఎలా ఉండగలను? నా జీవితం అంధకారమేనా?” అని చాలా ఏడ్చేశాను. నన్ను ఓదార్చడం మావారి తరం కాలేదు. “నీకు నేనున్నాను, నీకు ఏమీ కాదు, తగ్గిపోతుందిలే” అని తను ఎంతగా భరోసా ఇచ్చినా, “ఈ మచ్చలను చూసి నా పిల్లలు నన్ను ఇష్టపడతారా?” అని భయంతో, బాధతో ఏడ్చేదాన్ని. అలా ఏడుస్తూనే పూజామందిరంలో ఉన్న సాయి నవ గురువార వ్రతం పుస్తకంలో ఏమి ఉందా అని చూశాను. మరుసటి గురువారం బాబా మందిరానికి వెళ్ళి, “రోగులను కాపాడే సాయీ, నన్ను రక్షించు తండ్రీ!” అని దీనంగా, ఆర్తిగా వేడుకున్నాను. కేవలం సాయీశ్వరుని కృపాకటాక్షాలతో సాయి నవ గురువార వ్రతం పూర్తయ్యే లోపే నా శరీరంపై ఉన్న తెల్లమచ్చ పూర్తిగా నా శరీరవర్ణంలోకి మారిపోయింది. ఆ అనుభవాన్ని ఇంతకుముందు ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకున్నాను.
2007వ సంవత్సరంలోనే బాబా గురువారంరోజున 11 గంటల సమయంలో మేము ఉంటున్న ఇంటికి వచ్చి, నా శరీరతత్వానికి నిమ్మకాయ పులుపు చెడుచేస్తుందని నా వద్ద రూపాయి తీసుకుని, దానిని నిమ్మకాయగా చేసి, నా కర్మలో ఉన్న వ్యాధిని నిమ్మకాయరసం రూపంలో పిండేసి, చిన్ని ముద్ద మందారంగా చేసి, ఆ పువ్వులా వికసించమని నన్ను ఆశీర్వదించడానికే వచ్చి, నన్ను ఆశీర్వదించి వెళ్ళారని ఆరు సంవత్సరాల తరువాత తెలుసుకున్నాను. ఒకరోజు బాబా ఇచ్చిన చీటీ, ముద్దమందారం, మూలికలు ఉన్న మూటను తెరచి చూశాను. మూలికలు అలాగే ఉన్నాయి. పువ్వు మాత్రం నల్లని బూడిదగా అయిపోయింది. చీటీలోని మిగిలిన అక్షరాలన్నీ చెదిరిపోయి, కేవలం ‘2007’ మరియు ‘నీ అహంకారాన్ని వదిలి నా వైపు చూడు’ అన్న అక్షరాలు మాత్రమే కనిపించాయి. “సాయిబాబా పదే పదే భిక్షను అడుగుతారని, దక్షిణ మళ్ళీ మళ్ళీ అడుగుతారని, అలా దక్షిణ స్వీకరించి భక్తుల చెడుకర్మలని తీసివేస్తార”ని సాయిసచ్చరిత్రలో కొన్ని అధ్యాయాలను మన సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో చదువుతుంటే నా కళ్ళల్లో ఆనందాశ్రువులు పొంగిపొర్లాయి. బాబా వైద్యుడని, మొదట్లో మూలికలతోనే వైద్యం చేసేవారని తెలుసుకున్నాను. 2007వ సంవత్సరం గురువారం ఉదయం 11 గంటల సమయంలో బాబా నా ముందే నిలబడివున్నారు. అజ్ఞానంతో, అహంకారంతో నేను బాబాని గుర్తించలేని ఒక మూర్ఖురాలిని. బాబా నా చెడుకర్మని తీసివేయడానికి వచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్లారు. ఈరోజు ఆరోగ్యంగా, నా కుటుంబంతో సంతోషంగా ఉన్నానంటే అది నా సాయి పెట్టిన భిక్షే! “నా భక్తులను పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు లాక్కుంటాను” అనే బాబా వాక్కు నా విషయంలో నూటికి నూరుపాళ్ళు ధృవీకరణ అయింది. గురువారం 11 గంటల సమయంలో భక్తులంతా బాబా ఆరతి కోసం వరుసలో నిలుచుని ఎదురుచూస్తూ ఉంటారు. కానీ ఆ సమయంలో బాబా నాకోసం, నన్ను ఆశీర్వదించడానికి వచ్చి, నా చెడుకర్మను తీసివేసి, నిత్యం ఆ సాయినాథుని దివ్యమంగళరూపాన్ని నా ఉచ్ఛ్వాసనిశ్వాసాలలో నిలుపుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించారు. “సాయీ! మీ ప్రేమ మాటలకందనిది. తేనెను రుచి చూస్తేనే తీపి తెలిసినట్లు, మీ ప్రేమ పొందితేనే అందులోని మాధుర్యం తెలుస్తుంది. సాయీ! మీ దివ్యచరణాలకు వందనం చేస్తూ మరొకసారి చెబుతున్నాను. నా చెడుకర్మ అనే వ్యాధిని నిర్మూలించి నాకు పునర్జన్మను ప్రసాదించారు. ఇదంతా కేవలం మీ భిక్షే తండ్రీ! బాబా! మీకు ఏనాడూ పూజ చేయలేదు, ధూపదీపనైవేద్యాలను పెట్టలేదు. కనీసం మీ పేరైనా ఆర్తిగా పిలవలేదు. కేవలం వివాహం జరిగిన వెంటనే నా భర్తతో కలిసి నామమాత్రంగా శిరిడీని దర్శించాను, అంతే. బాబా! నాపైన మీకు ఎందుకు ఇంత ప్రేమ? మీరు నా ఇష్టదైవమైన శివుడే కదా! సాయీ! మీ ప్రేమను, ఉనికిని తెలుసుకున్నాను”.
అప్పటినుంచి నేను బాబాను సాయీశ్వరునిగా ప్రేమించటం ప్రారంభించాను. “సాయీ! మీ ప్రేమ పొందాకే ప్రేమకు సరైన నిర్వచనం నాకు లభించింది. ప్రేమస్వరూపా! ప్రేమంటే ఏమిటని అడిగితే, “ప్రేమకు నిలువెత్తు సాకారరూపమే సాయీశ్వరుడు” అని చెబుతాను తండ్రీ! మీ పాదాలను ఎన్నటికీ విడువను. నన్ను, మీ భక్తకోటిని ఆశీర్వదించండి. నా కుటుంబమంతా సదా నా సాయిస్మరణలో ఉండేలా ఆశీర్వదించండి”. సాయి దయవలన నేను అనేక రకాల ఆహారపదార్థాలను తింటున్నాను. పులుపు కూడా తింటున్నాను. సద్గురువే రక్షించాక నాకు భయమెందుకు? ఈరోజు అన్ని రుచులూ ఆరగిస్తున్నానంటే అది కేవలం సాయి భిక్షే. నేను స్వయంగా చూసిన నా సాయిబాబా ఎలా ఉంటారో మీకూ చూపిస్తాను, చూడండి. ఈక్రింది ఫోటోలో ఎలా ఉన్నారో అచ్చం అలాగే ఉన్నారు బాబా. తలపాగా, కఫ్నీ, జోలె మాత్రం తెలుపువర్ణంలో ఉన్నాయి. ఆ దివ్యమంగళరూపాన్ని మళ్ళీ నేను శిరిడీలో ఈ ఫోటో రూపంలో చూశాను. ప్రేమతో ఆ ఫోటోను నాతో తీసుకువచ్చాను. ఈ ఫోటో రూపంలో బాబా ప్రతిరోజూ నా చేత పూజలందుకుంటారు. ప్రతిరోజూ బాబాని చూస్తాను, బాబా కూడా నవ్వుతూ నన్ను చూస్తుంటారు.
This comment has been removed by the author.
ReplyDeleteఓం సాయిరాం
ReplyDeleteఓం సాయిరాం🌷🙏🌷
ReplyDeleteఓం శ్రీ సాయిరాం తాతయ్య 🙏🙏🙏
ReplyDeleteసాయీ మీ దివ్యచరణాలకు వందనం
ReplyDeleteOm Sai ram
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm Sai Ram 🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram
ReplyDelete