సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 340వ భాగం


ఖపర్డే డైరీ -  ఇరవై ఐదవ భాగం

28-1-1912.

గడచిన రాత్రి బాగా నిద్రపోయి, ఉదయాన్నే ప్రార్థన చేసుకొనేందుకు లేచి, నిత్యక్రమం ప్రారంభించాను. ఎనిమిది గంటలకు ఉపాసనీబాబా ఉండే ఖండోబా ఆలయానికి వెళ్ళి అతనితో మాట్లాడుతూ కూర్చున్నాను. ఇది చక్కటి చిన్న ప్రదేశం. మా వరండాలో వేదాంతం గురించి మాట్లాడుతూ చర్చించుకోవటం నా కొడుకు బల్వంత్‌కి ఇబ్బంది కలిగిస్తుందని మా పరమామృతం తరగతిని బాపూసాహెబ్ జోగ్ ఇంట్లో పెట్టాము. సాయిమహారాజు బయటకు వెళ్ళటం, తిరిగి మశీదుకి రావటం చూశాము. ఉదయమంతా ఎలా గడిపానని వారు నన్నడిగితే ఆరోజు నేను చేసినవన్నీ వారి ముందు ఏకరువు పెట్టాను. ఆయన ఆహ్లాదకరమైన ధోరణిలోనే ఉన్నట్లనిపించింది. రాధాకృష్ణఆయికి విసుగ్గా ఉందో ఏమో, ఆమె తలువులు మూసుకోవటం వల్ల ఆరతి సామాగ్రి త్వరగా రాలేదు. అది తప్ప మధ్యాహ్న ఆరతి బాగానే అయింది. మధ్యాహ్న భోజనం అయ్యాక కొద్దిసేపు పడుకొని, ఒక జాబు వ్రాసి, దీక్షిత్ రామాయణ పురాణానికి వెళ్ళిపోయాను. తరువాత సాయంకాలం సాయిమహారాజుని వ్యాహ్యాళి సమయంలో చూశాము. అప్పుడు వాడా ఆరతి అయింది కానీ, భీష్మ ఒంట్లో బాగుండకపోవటం వల్ల భజన జరుగలేదు. రాత్రి శేజారతి నుంచి తిరిగి వచ్చాక దీక్షిత్ రామాయణం చదివాడు.

29-1-1912.

నేను చాలా పెందరాళే లేచి, ప్రార్థనానంతరం నేను కొంచెం త్వరగా లేచానని తెలుసుకొని అలాగే ఉండిపోయి కాకడ ఆరతికి హాజరయ్యాను. తిరిగి వచ్చి నా నిత్యకార్యక్రమం కొనసాగించాను. బాపూసాహెబ్ జోగ్ ఇంటికి వెళ్ళి అతనితోనూ, ఉపాసనీతోనూ కలసి పరమామృతం మొదలుపెట్టాను. కానీ ఎందుకో నాకు చాలా నిద్రమత్తుగా అనిపించటం వల్ల పరమామృతం కొంచెం కూడా ముందుకు జరగలేదు. చివరికి నా బసకి వచ్చి, పన్నెండున్నరా, ఒంటిగంటవరకూ అలాగే పడుకొని లేవలేకపోయాను. మాధవరావు దేశ్‌పాండే, ఇంకా ఇతరులు ఆరతి కోసం నన్ను లేపే ప్రయత్నంలో పెద్దగా పిలిచినా నేను లేవలేదు. చివరికి వారు ఆరతికి వెళ్ళిపోయారు. ఈ విషయం ఎలాగో సాయిమహారాజు చెవులకు సోకి, అతన్ని నేను లేపుతానన్నారట ఆయన. ఆరతి అవబోయే సమయంలో ఎలా లేచానో గానీ, లేచి ఆరతి పూర్తయ్యేముందు హాజరయ్యాను. అంతలా నిద్రపోయినందుకు నేను చాలా సిగ్గుపడ్డాను. మిగతా రోజంతా అలా నిద్రమత్తుగానే ఉంది. షోలాపూర్ నుంచి నారాయణరావు వామన్ గావోంకర్ ఈరోజు వచ్చాడు. అతను చాలా మంచి కుర్రాడు. అతనితో మాట్లాడుతూ కూర్చున్నాను. మధ్యాహ్నం దీక్షిత్ పురాణానికి వెళ్ళి సాయిసాహెబ్‌ను సాయంత్రపు వ్యాహ్యాళిలోనూ, ఉదయం తొమ్మిది, పది గంటల మధ్య ఆయన బయటకు వెళ్ళినప్పుడు కూడా చూశాను. సాయంత్రం భీష్మ భజన, దీక్షిత్ పురాణం జరిగాయి. అతను యథాప్రకారం రామాయణం చదివాడు.

30-1-1912.

నేను పెందరాళే లేచాను గానీ, పడక మీదనుండి లేచి పని మొదలుపెడితే నిన్నటిలాగా రోజంతా నిద్రలో పడిపోతానేమోనన్న భయంతో పడక మీదనుండి లేవలేదు. తెల్లవారేముందు పడకనుంచి లేచి, నా ప్రార్థన ముగించి, పరమామృతం తరగతికి బాపూసాహెబ్ జోగ్ ఇంటికి వెళ్ళాను. ఉపాసనీ శాస్త్రి, శ్రీమతి కౌజల్గి, బాపూసాహెబ్ జోగ్‌లు అక్కడే ఉన్నారు. ఈరోజు తరగతి బాగా జరిగింది. సాయిబాబా బయటకు వెళ్ళేటప్పుడూ, మళ్ళీ తిరిగి ఆయన మశీదుకు వస్తున్నప్పుడూ వారిని చూశాము. ఉదయం ఎలా గడిపానని వారు నన్నడిగితే, మేము ఏం చేశామో అవన్నీ ఆయనకు చెప్పాను. మధ్యాహ్న ఆరతి తరువాత మేము తిరిగి వచ్చి భోజనం చేశాము. దీక్షిత్ రామాయణం చదువుతుంటే, భీష్మ, మాధవరావు దేశ్‌పాండే హాజరయ్యారు. చదవటం పూర్తయ్యాక సీతారాం డేంగలే చిన్న తమ్ముడూ, గ్రామంలోని ఇద్దరు మనుషులూ వచ్చి కూర్చుని మాట్లాడసాగారు. వారిలో ఒకరు రామాయణంలోని ఛందస్సు పాడటం మొదలుపెట్టారు. బాబా దర్శనం కోసం నేను మశీదుకి వెళ్ళినప్పుడు ఆయన నన్ను మధ్యాహ్నం ఎలా గడిపావని మళ్ళీ అడిగారు. జాబులు రాస్తున్నానని చెప్పినప్పుడు, "ఉట్టినే కూర్చోవటం కంటే ఏదో చేతులు కదిలించటమన్నా చేశావు. నయమేలే" అన్నారు నవ్వుతూ. సాయంత్ర వ్యాహ్యాళి నమయంలో వారిని చూసి, రాత్రి శేజారతికి హాజరయ్యాం. రాత్రి భజన లేదుగానీ, భాగవతం చదవటానికే చాలా సమయం పట్టింది. దీక్షిత్ రామాయణం చదివాడు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo