సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 343వ భాగం.


ఖపర్డే డైరీ - ఇరవైఎనిమిదవ భాగం 

6-2-1912.

నేను లేచి కాకడ ఆరతికి హాజరయ్యాను. నేను తిరిగి వెళ్ళేందుకు అనుమతి ఈరోజు దొరకవచ్చునని మాధవరావ్ దేశ్‌పాండే చెప్పాడు. అందుకని నేను అతనితోనూ, వామన్ గావోంకర్‌తోనూ కలిసి ఉదయం ఏడున్నర గంటలకు సాయిసాహెబ్ వద్దకు వెళ్ళాను. సాయిసాహెబ్ మధ్యాహ్నం మళ్ళీ రమ్మన్నారు. అందుకని మేము వెనక్కి తిరిగి వచ్చాక నేను నా నిత్యక్రమాన్ని ప్రారంభించాను. నేను, ఉపాసనీ, బాపూసాహెబ్ జోగ్ పంచదశి చదివి, సాయిమహారాజు బయటకు వెళ్ళటాన్ని చూశాము. తరువాత మధ్యాహ్న ఆరతికి హాజరయ్యాము. బ్రహ్మానందబాయి అక్కడ ఒక ఆరతి, కొన్ని పదాలు పాడింది. బాపూసాహెబ్ జోగ్ తన పెన్షన్ తెచ్చుకునేందుకు ఈరోజు కోపర్గాం వెళ్ళాల్సి ఉండటంతో ఆరతి త్వరగా అయింది. మధ్యాహ్నం భోజనానంతరం నేను, వామన్ గావోంకర్ మశీదుకు వెళ్ళాము. కాకాసాహెబ్ దీక్షిత్ అక్కడే ఉన్నాడు. సాయిసాహెబ్ రేపు మేము వెళ్ళవచ్చునన్నారు. మాధవరావు దేశ్‌పాండే కూడా అక్కడకు వచ్చాడు. 

సాయిసాహెబ్, ఆ ప్రయాణానికి ఎంతగానో ప్రాముఖ్యాన్ని ఇస్తున్నాననీ, రాత్రింబవళ్ళు తీవ్రంగా ఆలోచిస్తున్నాననీ అన్నారు. "అందరూ దొంగలే, కానీ వారితోనే మనం వ్యవహరించాలి" అన్నారు. ఆయన భగవంతుణ్ణి "వారు బాగైనాపడాలనీ లేక వారిని తొలగించటమైనా జరగాలని" రాత్రింబవళ్ళు ప్రార్థిస్తున్నారట. అయితే భగవంతుడు ఆలస్యం చేస్తూ బాహ్యానికి ఆ దృక్పథాన్ని అంగీకరించక ఆ పార్థనను ఆమోదించలేదన్నారు. “మనం ఒక నెలో, రెండు నెలలో వేచి ఉండి అప్పుడు చూద్దాం. మనం చచ్చో, బ్రతికో ఆయన్ని దేనికోసం ప్రార్థిస్తున్నామో దాన్ని పొందుదాం. తేలి దగ్గరకు వణీ దగ్గరకూ పోయి వారిని యాచించను. మనుషుల్లో మంచితనమూ, భక్తితత్పరతా లేవు. వారు వారి చిత్తాల్లో అస్థిరంగా ఉన్నారు. కొద్దిమంది స్నేహితులు ఒకచోట చేరి దివ్య జ్ఞానాన్ని గురించి చర్చించుకుంటూ కూర్చుని ధ్యానం చేసుకోవాల"ని అన్నారు. వారు "కొన్ని వేల రూపాయలు” అని అన్నారు కానీ అది దేనికి సంబంధించి అన్నారో నాకు గుర్తులేదు. 

నేను అప్పుడు తిరిగి వచ్చి దీక్షిత్ రామాయణ పురాణం విన్నాను. వారు వ్యాహ్యాళికై బయటకు వచ్చినప్పుడు వారిని దర్శించుకోవటానికి వెళ్ళాము. వారు చాలా సంతోషకరమైన ధోరణిలో ఉన్నారు. రాజారాంపంత్ దీక్షిత్ ఈరోజు ఖాండ్వా వెళ్ళాడు. ఉపాసనీశాస్త్రి భార్యను కోల్పోయాడు. ఈ దుర్వార్త ఉత్తరం ద్వారా వచ్చింది. నేను, దీక్షిత్ ఉపాసనీ వద్దకు వెళ్ళి అతనిని ఓదార్చి వాడాకు తీసుకువచ్చాము. నేను తిరిగి వెళ్ళటం గురించి ఫకీరుబాబా అడిగినట్లు, సాయిబాబా నేను రేపు వెళుతున్నానని ఆయనతో చెప్పినట్లు తెలుస్తోంది. నా భార్య నా తిరుగు ప్రయాణం గురించి మాట్లాడినప్పుడు, నేను స్వయంగా సాయిబాబాను అనుమతి కోసం అడగలేదు కనుక ఆయనేమీ చెప్పలేనన్నారట. వెంటనే నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. సాయిబాబా దాదాభట్టు దగ్గరనుంచి ఐదు వందల రూపాయలూ, మరొకరి వద్దనుండి రెండువందల రూపాయలూ తీసుకొని దాన్ని ఆయనకు ఇవ్వకుండా నేను వెళ్ళలేనని చెప్పారు. బాపూసాహెబ్ జోగ్ కోపర్గాం నుండి తిరిగి రావాలి కనుక వాడా ఆరతి కొంచెం ఆలస్యమైంది. బ్రహ్మానందబాయి, శివానందశాస్త్రి భజన చేశారు. భీష్మ కూడా చేశాడు.

7-2-1912

నేను త్వరగా లేచి ప్రార్థన ముగించి మా పంచదశి తరగతి మామూలుగా నిర్వహించాను. అనుమతి కోసం సాయిమహారాజు వద్దకు వెళ్ళలేదు. వారు బయటకు వెళ్ళటం చూసి, మళ్ళీ వారు మశీదుకి తిరిగి వచ్చాక నేను వెళ్ళాను. సాయిమహారాజు ఆరుబయట కూర్చుని, ఒకడు తాను నేర్పిన విద్యలను కోతి చేత చేయిస్తుంటే చూస్తూ ఉన్నారు. అక్కడే ఒక గాయకురాలూ, నాట్యకత్తె కూడా ఉన్నారు. మంచి కంఠస్వరం ఉన్న ఆమె మతపరమైన పాటలు పాడింది. తరువాత బ్రహ్మానందబాయీ, ఆమె సహచరులు నలూబాయీ, శివానందశాస్త్రి వచ్చారు. వారు పూజ చేశాక అందరిచేత 'అమ్మగారు' అని పిలిపించుకొనే బ్రహ్మానందబాయి మధురంగా గానం చేసింది. సాయిసాహెబ్ సింహాసనం మొదలైనవన్నీ తెమ్మని ఆజ్ఞాపించగా వాటిని అమరుస్తున్నప్పుడు మేము మా స్తంభాల వద్ద నిలబడ్డాము. అమ్మగారు మళ్ళీ రెండు పాటలు అత్యద్భుతంగా పాడినప్పుడు మా ఆనందం అవధులు దాటింది. సాయిసాహెబ్ వాళ్ళని ఇష్టపడ్డారనుకొంటా. తరువాత మేము మామూలు ఆరతిచ్చి మధ్యాహ్న భోజనానికి తిరిగి వచ్చాము. అమ్మగారూ, వారి మనుషులూ మా బసలోనే భోజనం చేశారు. భోజనానంతరం వామన్ గావోంకర్, అమ్మగారూ వారి మనుషులతో తిరిగి వెళ్ళిపోయేందుకు సాయిసాహెబ్ అనుమతి కోసం వెళ్ళారు. అమ్మగారూ, నలూబాయీ అనుమతిని పొంది బండిలో వెళ్ళిపోయారు. శివానందశాస్త్రి, వామన్ గావోంకర్ సాయిమహారాజు చెప్పటం వల్ల ఆగిపోయారు. 

నేను పడుకుని ఒక మంచి కునుకు తీశాను. దీక్షిత్ రామాయణం చదివాక నేను దాసబోధ చదువుకున్నాను. మేమంతా సాయిసాహెబ్‌ను వారి సాయంత్రపు వ్యాహ్యాళిలో చూసి వాడా ఆరతి ఆయ్యాక శేజారతికి హాజరయ్యాము. రాత్రి భీష్మ భాగవతం చదివితే, దీక్షిత్ రామాయణం చదివాడు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo