సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 326వ భాగం.


ఖపర్డే డైరీ - పదకొండవ భాగం

22-12-1911 

నేను ఉదయం పెందరాళే కాకడ ఆరతికి వెళ్ళాలని నిద్ర లేచాను కానీ, మాధవరావు దేశ్‌పాండే అన్న కొన్ని మాటల వల్ల వెళ్ళొద్దనుకున్నాను. అయితే తరువాత మాధవరావు దేశ్‌పాండే వెళుతూ ఉండటం వల్ల అతనితో కలిసి వెళ్ళాను. సాయి మహారాజు ఆహ్లాదంతో విశిష్టంగా కనిపించారు. మశీదుకు ప్రశాంతంగా వెళ్ళారు. వారు బయటకు వెళుతున్నప్పుడు, మళ్ళీ మశీదుకు తిరిగి వెళ్ళేటప్పుడూ మేమంతా వారిని దర్శించుకున్నాం. షింగణే, దర్వేష్ సాహెబ్‌లు ఈరోజు వెళ్ళిపోయేందుకు ప్రయత్నించారు, కానీ సాయి మహారాజు అనుమతించలేదు. దర్వేష్ సాహెబ్‌కి కొద్దిగా అస్వస్థత, జ్వరమూ వచ్చింది. డాక్టర్ హాటే ఆయనకి వైద్యం చేశాడు. టిప్నిస్ అనే ఆయన తన భార్యతో ఇక్కడ ఉంటున్నాడని ఇంతకుముందు చెప్పాననుకుంటా. ఆమె కూడా కొంచెం అస్వస్థురాలైతే డా. హాటే ఆమెకు తాను చేయగలిగిందంతా చేస్తున్నాడు. రామమారుతి మహారాజు కూడా ఆమెకు సాయపడేందుకు అక్కడే ఉన్నాడు. ఆమెకు సాయంత్రానికి మూర్ఛ వచ్చింది. అది ఒక అవరోధంగా పరిణమించింది. దీక్షిత్, మాధవరావు దేశ్‌పాండే, ఇంకా మరికొందరు ఆమెను చూసేందుకు వెళ్ళారు. ఆమె నివసించే ఇంటి యజమానీ ఇంకా ఇద్దరు అంత్యజులూ దయ్యాలై ఆమెని పట్టారు. ఆ యజమాని తను ఆమెను చంపి ఉండేవాడినని, కానీ సాయిబాబా అలా చేయవద్దని ఆజ్ఞాపించారని చెప్పాడు. అంత్యజులను కూడా సాయిబాబా పక్కకు నెట్టేశారు. టిప్నిస్ తన భార్యను ఈ వాడాకి తరలిస్తానంటే ఆ ఆత్మలు అతన్ని అలా చేయవద్దని తీవ్రంగా ప్రార్థించాయి. ఆ ఆత్మలు సాయిబాబా తమను కొడతారని చెప్పాయి. యథాప్రకారం భీష్మ భజన, తరువాత దీక్షిత్‌చే రామాయణ పఠనం మధ్యరాత్రికి కొంచెం ముందు జరిగాయి.

23-12-1911

ఉదయం నేను పెందరాళే లేచి, మళ్ళీ నిద్రపోయి చాలా ఆలస్యంగా లేచాను. క్రిందకు వచ్చేసరికి షింగణే, అతని భార్య, దర్వేష్ సాహెబ్ వారి ఇళ్ళకు వెళ్ళేందుకు అనుమతి పొందారని తెలుసుకున్నాను. కనుక షింగణే, అతని భార్య బొంబాయికి, దర్వేష్ షా కల్యాణ్‌కి వెళ్ళిపోయారు. దర్వేష్ సాహెబ్ ఆధ్యాత్మికంగా చాలా పురోగమించాడు. సాయి మహారాజు అతన్ని చూసేందుకు పగిలిన గోడ వరకూ వచ్చారు. మేమిద్దరం సుదీర్ఘ చర్చలు జరువుతుండేవాళ్ళం కాబట్టి అతను లేని లోటు నాకు బాగా తెలిసింది. బొంబాయి సొలిసిటర్ నిన్న తన కుటుంబంతోనూ, నలుగురు సోదరులు, చాలామంది పిల్లలతోనూ వచ్చాడు. అతను చాలా మంచివాడు. మేం మాట్లాడుకుంటూ కూర్చున్నాం. క్రిందటి సంవత్సరం నేను కలిసిన మహాజని ఈరోజు వస్తూ మంచి పండ్లూ, సాయిబాబా దీపాలకి మంచి గ్లోబులూ తెచ్చాడు. భయందర్‌కి చెందిన గోవర్ధనదాసు కూడా ఇక్కడే ఉన్నాడు. అతను మంచి పండ్లూ, చావడిలో బాగుచేయించిన సాయి గదిని అలంకరించేందుకు సిల్కు కర్టెనులూ, గొడుగు, చామరాలు, వింజామరలు పట్టుకునే వాలంటీర్లకి నూతన వస్త్రాలూ పట్టుకొచ్చాడు. అతను చాలా ధనవంతుడు. దీక్షిత్ వాడాలో ఉండే విషయంలో మాధవరావు దేశ్‌పాండేకి - నా భార్య, కొడుకులకి మధ్య అర్థం లేని ఒక చిన్న వాగ్వాదం చెలరేగింది. ఆ వాడా దీక్షిత్‌కి గానీ, మాధవరావుకి గానీ చెందింది కాదనీ, అది తనకే చెందిందనీ సాయి మహారాజు అన్నారు. ఆ విషయం అలా చల్లబడింది. సాయి మహారాజు బయటకు వెళ్ళేటప్పుడు చూడలేకపోయాను కానీ వారు మశీదుకి తిరిగి వచ్చేటప్పుడు నా నమస్కారాలు తెలుపుకున్నాను. వారు నాకు పండ్లు ప్రసాదించి, తన చిలుం ఇచ్చి పీల్చమన్నారు. మధ్యాహ్నం కొద్దిసేపు నిద్రించి, ఈ రోజు వచ్చిన దినపత్రికలు చదువుతూ కూర్చున్నాను. వామనరావు పటేల్ ఎల్.ఎల్.బి పాసయ్యాడు. డా౹౹ హాటే కూడా పాసవాలని కోరుకున్నాను. తానొక మంచి వార్త చెప్తానని సాయి మహారాజు అన్నారు. టిప్నిస్ తన బస మార్చాడు. అతని భార్య ఇప్పుడు కొంచెం బాగుంది. ఆమె ఇదివరకంతటి అశాంతిగా లేదు. రామమారుతిబువా ఇంకా ఇక్కడే ఉన్నాడు. మేం శేజారతికి వెళ్ళాం. ఊరేగింపు చాలా బావుంది. క్రొత్త తెరలూ, వస్త్రాలూ చాలా బావున్నాయి. నేను చాలా ఆనందించాను. అలాంటి మంచి బహుమతులు నేనివ్వలేకపోవటం నిజంగా విచారకరం. భగవంతుడు గొప్పవాడు. రాత్రి భీష్మ భజన, తరువాత దీక్షిత్ రామాయణ పఠనం జరిగింది.

24-12-1911.


ఉదయం నేను త్వరగా లేచి కాకడ ఆరతికి వెళ్ళాను. తిరిగి వచ్చి ప్రార్థన చేసుకొని, కొద్దిసేపు పచార్లు చేశాను. తిరిగి వెళ్ళేందుకు మంత్రికి అనుమతి లభించింది. అతను అక్కడున్న అందరికీ వీడ్కోలు ఇచ్చి తన కుటుంబంతో కలిసి వెళ్ళిపోయాడు. అతను చాలా మంచివాడు. వామనరావు పటేలు కూడా వెళ్ళిపోయాడు. అప్పుడు చాలామంది భక్తులు వచ్చారు. వారిలో అనసూయబాయి అనే ఆమె ఉంది. ఆమె ఆధ్యాత్మికంగా ఎంతో పరిణితి చెందినట్లు అనిపించింది. సాయి మహారాజు ఆమెని ప్రత్యేకంగా చూసి, ఆమెకు నాలుగు పండ్లు ప్రసాదించారు. తరువాత వారు ఐదుగురు కొడుకులున్న ఒక మనిషి కథ చెప్పారు. వారిలో నలుగురు తమకు రావలసిన భాగాన్ని తాము తీసుకొన్నారు. అందులో ఇద్దరు తిరిగి తమ తండ్రితో కలిసేందుకు నిర్ణయించుకున్నారు. తండ్రి వీరిద్దరిలో ఒకరికి విషమివ్వమని తల్లిని ఆజ్ఞాపిస్తే ఆమె అలాగే చేసింది. రెండవ వారు చెట్టుపైనుండి పడి తీవ్రంగా దెబ్బలు తగిలి చావుబతుకుల్లో ఉన్నాడు. అయితే అతనికి ఒక కొడుకూ, ఒక కూతురూ పుట్టేవరకు, అంటే పన్నెండు సంవత్సరాలు సేవచేసేందుకు తండ్రి నుంచి అనుమతిని పొంది అప్పుడతను చనిపోయాడు. సాయిబాబా అయిదో కొడుకు గురించి ఏమీ చెప్పలేదు. ఆ కథ అసంపూర్తిగా ఉందనిపించింది నాకు. మధ్యాహ్న భోజనానంతరం కొద్దిసేపు విశ్రమించి, తరువాత రామాయణం చదువుతూ కూర్చున్నాను. సాయంత్రం మామూలుగా చావడి ముందు సాయిసాహెబ్‌కు నమస్కరించుకొని, రాత్రి భీష్మ భజన, దీక్షిత్ రామాయణము విన్నాను. డా॥ హాటే ఇంకా ఇక్కడే ఉన్నాడు. అతను చాలా మంచివాడు. మహాజని కూడ ఇక్కడే ఉన్నాడు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo