సాయి వచనం:-
'గ్రంథములను అభ్యసించి ఆచరణలో పెట్టవలెను. ఊరకనే గ్రంథములు చదువుట వలన ప్రయోజనము లేదు. నీవు చదివిన విషయమును గూర్చి జాగ్రత్తగా విచారించి, అర్థము చేసుకొని, ఆచరణలో పెట్టవలెను. లేనిచో ప్రయోజనము లేదు. గురువు అనుగ్రహము లేని ఉత్త పుస్తకజ్ఞానము నిష్ప్రయోజనము.'

'సాయిబాబాను ప్రార్థించు, బాబా తప్పక సహాయం చేస్తారు' - శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 349వ భాగం.


ఖపర్డే డైరీ - ముప్పయినాలుగవ భాగం 

23-2-1912

మామూలుగానే లేచి ప్రార్థన చేసుకొని, ఉదయమే పంచదశి తరగతిని నిర్వహించాము. అందులో మామూలు సభ్యులు కాక నాసిక్‌కి చెందిన సుందరీబాయి అనే స్త్రీ ఒకామె ఉన్నారు. సాయిసాహెబ్ బయటకు వెళ్ళేటప్పుడూ, మళ్ళీ మశీదుకు తిరిగి వచ్చాక మశీదులోనూ చూశాము. వారు నాతో తాము తమ చిన్నప్పుడు ఒక ఉదయం బయటకు వెళ్ళి హఠాత్తుగా అమ్మాయిగా ఎలా మారిపోయిందీ, కొంతకాలం అలాగే ఎలా కొనసాగిందీ చెప్పారు. ఎక్కువ వివరాలు చెప్పలేదు. మధ్యాహ్న ఆరతి మామూలుగానే జరిగిపోయింది. పూజ చేసుకునేందుకు చాలామంది వచ్చారీ రోజు. మధ్యాహ్న భోజనానంతరం విశ్రమించి, పంచదశిని కొనసాగించాము. ఈరోజు మాధవరావు సాయిబాబాను నా తిరుగు ప్రయాణం గురించి ప్రశ్నించగా, నాకు పరిస్థితులు ప్రతికూలంగా ఉండటం వల్ల నేను ఇక్కడ మరికొద్ది నెలలు ఉండవలసి ఉందని సమాధానం చెప్పారు. సాయంకాలం బాబాను సాయంత్రపు వ్యాహ్యాళిలోనూ, వాడా ఆరతి తరువాత చూడటానికి వెళ్ళాము. శేజారతి అయ్యాక భీష్మ భాగవతము, దాసబోధ చదివాడు.

24-2-1912

కాకడ ఆరతికి హాజరయ్యాక మా పంచదశి తరగతి నిర్వహించాం. సాయిమహారాజు బయటకు వెళ్ళినపుడు చూసి మధ్యాహ్న ఆరతికి మశీదుకి వెళ్ళాం. మధ్యాహ్న ఆరతి యథాప్రకారం జరిగింది. భోజనానంతరం విశ్రాంతి తీసుకున్నాను. కోపర్గాం మామ్లేదారు సానే, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నానాసాహెబ్ బిహారీతో, బాలాసాహెబ్ భాటేతో కలిసి వచ్చి, కొంతసేపు కూర్చుని సంభాషించారు. వారు వెళ్ళిపోయాక మా పంచదశి తరగతి కొనసాగించినా బాగా సాగలేదు. సాయంత్రపు వ్యాహ్యాళిలో సాయిబాబాను చూశాము. నాసిక్ నుంచి వచ్చిన స్త్రీలు వాడా ఆరతి అయ్యాక భజనలో పాల్గొన్నారు. వారికి మంచి కంఠస్వరాలు ఉన్నా చాలా బలహీనంగా ఉండటంతో పాడలేకపోయారు.

25-2-1912

నేను పెందరాళే లేచి, ప్రార్థన చేసుకొని, మాధవరావు దేశ్‌పాండే నాగపూరుకి బయలుదేరటం చూశాను. అక్కడనుంచి అతను నానాసాహెబ్ చందోర్కర్ గారి అబ్బాయి పెళ్ళికి గ్వాలియరు వెళ్ళి, అటునుండి దశలవారీగా కాశీ, అలహాబాదు, మధుర, ఇంకా దారిలో ఉన్న పవిత్ర క్షేత్రాలన్నీ చూసుకొని వస్తాడు. మా పంచదశి తరగతి నిర్వహించాము గానీ ఉపాసనీకి అస్వస్థతగా ఉండటం వల్ల అది బాగా సాగలేదు. మధ్యాహ్న ఆరతి, భోజనము అయ్యాక మళ్ళీ పంచదశి చదవటం కొనసాగించి కొంతవరకు చదివాము. సాయంత్రం దీని తరువాత భీష్మ దాసబోధ చదివాడు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

4 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo