సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

రావ్‌బహాదుర్ దివాడ్కర్



  • రావ్‌బహాదుర్ దివాడ్కర్

ముంబాయిలోని దాదర్ నివాసి శంకర్రావు నెరూర్కర్ ఇలా చెప్తున్నారు: "నేను బాబాకు పూర్తిగా అంకితమైన కుటుంబంలో పెరిగిన చాలా అదృష్టవంతుడిని. 94 సంవత్సరాల వయసులో 2003లో మరణించిన మా నాన్నగారు బాబాకు పరమ భక్తుడు. అతనికి తెలిసిన ఒకేఒక దైవం బాబా. అతను తన రోజును బాబా ఆరాధనతో ప్రారంభించి రోజంతా బాబా నామాన్ని జపిస్తూ, శ్రీసాయి సచ్చరిత్ర చదువుతూ, మిగిలిన సమయమంతా కూడా బాబా గురించే సంభాషిస్తుండేవారు. ఆవిధంగా మా ఇల్లు ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయింది. నాకు పిల్లనిచ్చి పెళ్ళి చేసిన మా మావయ్య మనోహర్ దివాడ్కర్ కూడా బాబా భక్తుడు. అతను తనకి సుమారు 4 సంవత్సరాల వయస్సున్నప్పుడు బాబాను దర్శించారు. అతని తండ్రి రావ్‌బహాదుర్ దివాడ్కర్ కూడా బాబాకు అత్యంత భక్తుడు. అతను దయార్థహృదయాడు, పరోపకార స్వభావం గలవాడు, మృదువుగా మాట్లాడేవాడు. బాబానే అతని సద్గురువు, అతనికి వేరే గురువు, దైవం తెలియదు. అతని రోజు పెదవులపై బాబా పేరుతో ప్రారంభమై బాబాకు 'కృతజ్ఞతలు' తెలపడంతో ముగిసేది. 1910-1918 మధ్యకాలంలో అతను బాబాతో సన్నిహితంగా గడిపారు. ఆ కాలంలో అతను తరచుగా శిరిడీ వెళ్లి బాబాకు తాను చేయగలిగిన సేవను సంతోషంగా చేసుకుంటుండేవారు. అతను తన జీవితాన్ని బాబాకు ఆమోదయోగ్యంగా ఉండే విద్గంగా జీవించాడు.

ఒకసారి రావ్‌బహాదుర్ శిరిడీలో ఉన్నప్పుడు జరిగిన ఒక ఆసక్తికరమైన లీల జరిగింది. ఆ రోజుల్లో మసీదు పురాతనమైన శిథిలావస్థలో ఉన్న భవనం. మట్టి నేలపై ఆవు పేడతో అలికి ఉండేది. ఒకరోజు బాబా తమ సాధారణ స్థలంలో కట్టడా వద్ద కూర్చొని ఉండగా ఆయన పక్కన షామా, మహల్సాపతి, దీక్షిత్, నిమోన్కర్, డెంగ్లే వంటి ఇతర భక్తులు ఆయన ముందు కూర్చున్నారు. ఒక భక్తుడు బాబా పాదాలు ప్రేమతో మర్దన చేస్తుండగా మరో భక్తుడు ఆయన వీపు మర్దన చేస్తున్నాడు. ఆ సమయంలో రావ్‌బహాదుర్ మశీదుకు వెళ్లి, తన కొడుకు మనోహర్‌ని ఒడిలో పెట్టుకొని బాబాకి ఎదురుగా కూర్చున్నాడు. బాబా భక్తులతో కబుర్లు చెప్తుండగా షామా చిలుము సిద్ధం చేసి ఆయనకి ఇచ్చాడు. బాబా ఒకసారి పొగ పీల్చి చిలుము గొట్టాన్ని ఒక భక్తునికి అందించారు. అతను ఒకసారి పొగ పీల్చిన మీదట వినయంగా చిలుము గొట్టాన్ని తిరిగి బాబాకి ఇచ్చాడు. అప్పుడు బాబా ఇంకోసారి పొగ పీల్చి చుట్టూ ఉన్న భక్తులకు ఇచ్చారు. కొద్దిసేపటి తర్వాత బాబాకు తీవ్రంగా దగ్గు వచ్చింది. ఆయన కఫం తెగక దగ్గుతో ఇబ్బందిపడుతుంటే రావ్‌బహాదుర్ ఆందోళన చెందాడు. బాబా మాత్రం ఒక పక్క చిలుము పిలుస్తూ, అదే సమయంలో మరోపక్క దగ్గుతూ ఉన్నారు. ఇక రావ్‌బహాదుర్ తనని తాను నిగ్రహించుకోలేక చాలా భయపడుతూ, "బాబా! మీరు చాలా ఎక్కువగా పొగ తాగుతున్నారు. మీకు కడుపునొప్పి రావట్లేదా?" అని అడిగి, ఆపై తన మాటలకి బాబా కోప్పడతారని అనుకున్నాడు. కానీ బాబా నవ్వుతూ, "అరె! నువ్వు కూడా నా చిలుము తాగు. ఇదిగో ఈ చిలుము తీసుకుని పొగ పీల్చు" అని అన్నారు. మునుపెన్నడూ పొగ తాగిన అలవాటులేని రావ్‌బహాదుర్ సంకోచిస్తూనే, "బాబా! నేను ఇంతకు ముందెన్నడూ పొగ తాగలేదు. కాబట్టి నేను మీరు ఇచ్చే చిలుము తాగలేను" అని అన్నాడు. అయినప్పటికీ బాబా అతను ఎలాగైనా ఒకటి, రెండుసార్లు పొగ పీల్చాల్సిందేనని నిశ్చయించుకున్నందున బలవంతంగా చిలుము అతని చేతిలో పెట్టి, "కానివ్వు, ఒకటి, రెండుసార్లు చిలుము పీల్చి ఏమి జరుగుతుందో చూడు!" అని అన్నారు. ఇక అతనికి వేరే దారి లేకుండా పోయింది. గురు ఆజ్ఞను పాటించకపోతే ఘోర పాపానికి పూనుకున్నట్లే! కాబట్టి గురువు చెప్పినట్లు చేయాలని లేదంటే సంపాదించినా ఆధ్యాత్మిక సంపదనంతా కోల్పోతానని అతనికి తెలుసు. అందుచేత అతను బలవంతంగా చిలుము పెదవుల దగ్గర పెట్టుకొని ఒకసారి పొగ పీల్చాడు. తర్వాత మరోసారి కూడా పీల్చాడు. తర్వాత కూడా బాబా అతనిని ఇంకా ఇంకా పీల్చమని  ప్రోత్సహించారు. అతను ఆయన మాటకి తలొగ్గాడు. కొద్దిసేపటి తర్వాత అతను మరోసారి పొగ పీలిస్తే, ఆ చిలుము గొట్టం నుండి అమృతం స్రవించనారంభించింది. చిలుము గొట్టం గుండా కారుతున్న ఆ అమృతం చిక్కగా, మధురంగా, సువాసనభరితంగా ఉంది. దాని రుచి చూసిన రావ్‌బహాదుర్ పరమానందభరితుడయ్యాడు. బాబా అతని వైపు చూసి నవ్వారు. అమృతం ఇంకా స్రవిస్తూ ఉండడంతో దాన్ని బాబా ఆశీర్వాదంగా భావించి అతను తన కొడుకుకి కొద్దిగా పట్టి, ఆపై చుట్టూవున్న భక్తులందరికీ ఇచ్చాడు. అందరూ బాబా అమృతాన్ని స్వీకరించారు. బాబా పెదవులపై చిరునవ్వుతో ఆ దృశ్యాన్నంతా చూసి పైకి చూసి, "అల్లా మాలిక్. అల్లా మాలిక్" అన్నారు.


(రిఫ్: సాయి ప్రసాద్ మ్యాగజైన్; 2004; దత్తజయంతి సంచిక

సోర్స్: ఏ డివైన్ జర్నీ విత్ బాబా బై విన్నీ చిట్లూరి.)


సాయిభక్తుల అనుభవమాలిక 1862వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సదా వర్షించే సాయి కృపకు నిదర్శనం
2. పదేళ్లనాటి నొప్పిని పూటలో మాయం చేసిన బాబా

సదా వర్షించే సాయి కృపకు నిదర్శనం


సాయిభక్తులకు శతకోటి ప్రణామాలు. నా పేరు మణిమాల. నేను ఒక ఉపాధ్యాయురాలిని. సాయి పిలిస్తే పలుకుతాడు, అడగకుండానే ఇచ్చేస్తాడు. ఎన్ని జన్మల పుణ్యమో ఈ అదృష్టం నాకు దక్కింది. ఇక నా అనుభవం విషయానికి వస్తే, మావారి పుట్టినరోజు 2024, మే 10న వచ్చింది. నాటితో ఆయనకి 60వ సంవత్సరాలు. అందుచేత మా అమ్మాయిలు షష్టిపూర్తి వేడుక చేయాలనుకున్నారు. కానీ నా మనసెరిగిన  మావారు నాకు తెలియకుండానే మా కుటుంబం(నేను, నా భర్త, మా ఇద్దరమ్మాయిలు, అల్లుళ్ళు, ముగ్గురు మనవళ్లు, ఒక మనవరాలు) అందరికీ శిరిడీ వెళ్లేందుకు టిక్కెట్లు బుక్ చేశారు. అది తెలిసి నా ఆనందానికి అవధులు లేవు, ఎందుకంటే, సాయి సన్నిధిలో ఉండటం కంటే ఫంక్షన్ గొప్పది కాదు. అయితే అనుకోకుండా నాకు ఎలక్షన్ డ్యూటీ పడింది. శిరిడీ వెళ్తామంటే నాకు వేసిన డ్యూటీ రద్దు చేయరు. అందుకని ఎలాగూ ఆరోగ్యం బాగుండట్లేదు కదా అని ఆఫీసర్లకి డాక్టర్ సర్టిఫికెట్లు చూపించాను. కానీ ఆఫీసర్లు వాటిని ఆమోదించలేదు, నా డ్యూటీ రద్దు కాలేదు. నేను పడిన వేదన అంతాఇంతా కాదు. ఎంత ప్రయత్నించినా వృధా అయిందని బాధపడ్డాను. ఇంకా బాబా మీదే భారమేసి ఏమైనా పర్వాలేదని ధైర్యంగా 9వ తేదీన ట్రైన్ ఎక్కాను. 10వ తేదీన బాబా సమక్షంలో నాకు కలిగిన అనుభూతి వర్ణించనలవికానిది. అప్పుడు నాకు కలిగిన గగూర్పాటు, ఆనందభాష్పాలు చూసిన అక్కడి సిబ్బంది 'రుక్ జా' అని నన్నోక్కదాన్నే చాలాసేపు ఉండనిచ్చారు. అది మరపురాని మధుర స్మృతి. మరునాటి ఉదయం సాయి పూర్తిగా కనిపించేలా ఆయన ముందర కూర్చుని కాకడ ఆరతి చూసాను. ఎలక్షన్ డ్యూటీ గురించి నా మదిలో ఆలోచనే లేదు. సాయిపై భారం వేస్తే ఆదుకోకుండా ఉంటారా? నేను శిరిడీ వచ్చేముందు ఎందుకైనా మంచిదని మా బ్రదర్(టీచర్)కి ఒక లెటర్ తోపాటు మెడికల్ సర్టిఫికెట్లు ఇచ్చి వచ్చాను. అతను నేను శిరిడీలో ఉండగా ఫోన్ చేసి "మీ డ్యూటీ కాన్సల్ అయింది. హాయిగా దర్శనం చేసుకోండి" అని చెప్పాడు. నాకు చాలా ఆనందమేసింది. ఆఫీసరుకి కాల్ చేసి ధన్యవాదాలు చెప్పాను. ఎవ్వరికీ కాన్సల్ కానీ డ్యూటీ నాకు మాత్రమే కావడం సాయి దయకాక మరేమిటి? నాపై సదా సాయి కృప ఉందనడానికి ఇంకొక నిదర్శనం. నేను సప్తశృంగేరిదేవి దర్శనం కలిగించమని సాయితండ్రిని వేడుకున్నాను. మొదట ఆలోచించిన నా కుటుంబం చివరికి సరే అన్నారు. అది కూడా అద్భుత దర్శనం. హారతి ఇచ్చే సమయానికి మేము అమ్మవారి ముందు వున్నాము. మరువలేని దర్శనమని మా కుటుంబమంతా ఆనందపడ్డారు. సాయి దయతో ఆ మర్నాడు మూడుసార్లు సాయిని దర్శించుకొని తిరుగు ప్రయాణమై మా ఇల్లు చేరుకున్నాము. ఈ అనుభవం మీతో పంచుకుంటుంటే నా కళ్ళల్లో నీళ్లు కమ్ముకుంటున్నాయి. సాయి భక్తులకు ఏది శ్రేయస్కరమో అది తప్పక చేస్తారు. సదా సాయినామం, ధ్యానం ఇవే మనకు దారి  చూపుతాయి, రక్షణనిస్తాయి. "ధ్యన్యవాదాలు బాబా".



పదేళ్లనాటి నొప్పిని పూటలో మాయం చేసిన బాబా


సాయిభక్తులకు నమస్కారాలు. నా పేరు స్వాతి. బాబా నా జీవితంలో మర్చిపోలేని అద్భుతం చేశారు. దాదాపు 10 ఏళ్ల నుంచి నా కుడిభుజం నొప్పిగా ఉంటుంది. కుడి వైపు తిరిగి పడుకున్నా, పని ఎక్కువైనా భుజం చాలా నొప్పి పెట్టేది. డాక్టర్‌కి చూపిస్తే, "అంతా నార్మల్‌గా ఉంది" అని చెప్పారు. ఫిజియోథెరపీ చేయించుకుంటే, చేయించినన్నీ రోజులు బాగుండేదిగాని తరువాత మళ్ళీ అదే పరిస్థితి. చివరికి నేను విసుగు చెంది బాబాకి దణ్ణం పెట్టుకొని, "ఫిజియోథెరపీకి అంతంత డబ్బులు ఖర్చు పెట్టలేను బాబా. ఇక మీదే భారం" అని చెప్పుకొని భుజానికి ఊదీ రాసుకొని పడుకున్నాను. మరుసటిరోజు నుంచి నా చేయి నొప్పి మాయమైపోయింది. నన్ను నేనే నమ్మలేకపోయాను. కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్న నొప్పిని ఒక్క పూటలో తీసేసారు బాబా. పూర్వజన్మలో ఎంతో అదృష్టం ఉంటే కానీ, ఈ జన్మలో సాయి పాదాల చెంత మనం ఉండలేం. కనుక మనందరం ఈ అదృష్టాన్ని సక్రమంగా వినియోగించుకుంటూ బాబాకి నచ్చిన పనులు చేస్తూ ఆయన సేవలో గడుపుతూ ఉండాలి. "ధన్యవాదాలు బాబా. మీ ఆశీస్సులు సదా మాపై ఇలాగే కురిపించండి బాబా".


ఓం శ్రీ సాయినాథాయ నమః.


సాయిభక్తుల అనుభవమాలిక 1861వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా కరుణ
2. బాబా దయ
3. దయతో మర్నాటికి నొప్పి తగ్గించిన బాబా

బాబా కరుణ

నేను ఒక సాయి భక్తురాలిని. ప్రతిరోజు ఈ బ్లాగులో వచ్చే అనుభవాలు చదవడం వల్ల చాలా ధైర్యం, నమ్మకం కలుగుతున్నాయి. బాబా దయవల్ల 2023, ఆగస్టు 20న నా వివాహం జరిగింది. నాకు గుండె సమస్య ఉన్నందున నేను చాలా అంటే చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. నాకు ఎలాంటి భర్త వస్తాడో అనుకున్నాను. కానీ బాబా దయతో నన్ను అర్థం చేసుకునే వ్యక్తిని నాకు భాగస్వామిగా ఇచ్చారు. ఇప్పుడు నా జీవితం బాగుంది. పెళ్లయ్యాక నాలుగు నెలలకు ప్రెగ్నెన్సీ కోసంగా నేను ప్రతిరోజు ఊదీ నీళ్ళు రెండు నెలలపాటు తీసుకున్నాను. అలా చేయడం వల్ల బాబా దయతో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మేము చాలా సంతోషించాము. 500 రూపాయలు బాబా గుడిలో అన్నదానికి ఇచ్చాము. ఇకపోతే ప్రెగ్నెన్సీలో చాలా సమస్యలు వస్తుంటాయి. నాకు చాలా కడుపునొప్పి ఉంటుండేది. హాస్పిటల్‌కి వెళ్లి టెస్టులు, స్కానింగ్లు చేయించి కడుపునొప్పి తగ్గడానికి చాలా టాబ్లెట్లు వాడినా ఉపయోగం లేకుండా పోయింది. ఇంతలో నాకు ఐదవ నెల వచ్చింది. అప్పుడు ఇంకా నొప్పి తగ్గకపోతే ఇతర సమస్యలు వస్తాయని ఒక గురువారంనాడు నేను బాబాకి పూజచేసి, "వారం రోజుల్లో నొప్పి తగ్గితే, మరుసటిరోజు మీరు నాకు చేసిన మేలును బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. అంతే, చాలావరకు నొప్పి తగ్గింది. "ప్లీజ్ బాబా, మిగిలిన నొప్పిని కూడా తగ్గించి కాన్పు సక్రమంగా జరిగేలా చూడండి. నాకున్న గుండె సమస్య వల్ల చివరి వరకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసి బిడ్డ ఆరోగ్యంగా పుట్టేలా దీవించండి. త్వరలో మేము ఇల్లు కొనుక్కునేలా చూడండి. ఎల్లప్పుడూ నన్ను, నా కుటుంబాన్ని కాపాడండి".

బాబా దయ

సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు అన్నపూర్ణ. ఒకరోజు మావారు హైదరాబాదు వెళ్లాలని కారులో బయలుదేరారు. సూర్యాపేట దగ్గరకు వెళ్లిన తర్వాత హఠాత్తుగా కారు ఆగిపోయింది. మా కారు కొత్తదే అయినప్పటికీ ఎంత ప్రయత్నించినా స్టార్ట్ అవ్వలేదు. మావారు నాకు ఫోన్ చేసి విషయం చెప్పారు. నేను, "ఇలా అయిందేమిటి సాయీ? తొందరగా ఆ సమస్యను పరిష్కరించు" అని బాబాకి మొరపెట్టుకున్నాను. బాబా దయవల్ల మెకానిక్ వచ్చి కారు స్టార్ట్ చేసి, "ఏమీ లేదు, బ్యాటరీ డౌన్ అయింది. మరేం పర్వాలేదు మీరు బయలుదేరండి" అని అన్నారు. అప్పుడు మావారు కారు స్టార్ట్ చేస్తే వెంటనే స్టార్ట్ అయింది. ఆయన క్షేమంగా వెళ్లొచ్చారు.


ఈమధ్య మా పాపవాళ్ళు యుఎస్‌లో ఇల్లు కొనుక్కున్నారు. అయితే మే నెల నుండి మూఢాలు ఉన్నందువల్ల వెంటనే పాలు పొంగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ అది మా అమ్మాయికి నెలసరి వచ్చే సమయం. అందువల్ల తను, "ఇప్పుడెలా అమ్మా?" అని అంది. నేను, "బాబా చూస్తారులే" అన్నాను. మరుసటిరోజు తెల్లారి మా అమ్మాయి ఫోన్ చేసి, "నాకు నెలసరి వచ్చిందమ్మా" అని చెప్పింది. నేను బాబా ఉన్నారని చాలా సంతోషపడ్డాను. ఆయన ఏ సమస్యా లేకుండా వారం ముందే నెలసరి వచ్చేలా అనుగ్రహించారు. ఇలాంటి అనుభవమే ఒకసారి నేను చదివి, "ఇలాంటివి కూడానా" అని మనసులో అనుకున్నాను. నా వరకు వచ్చినప్పుడు తెలిసింది, "అది బాబా దయ" అని. ఇలా నా నిజ జీవితంలో బాబా ప్రతి క్షణం కాపాడుతూ ఉన్నారు. "ధన్యవాదాలు బాబా".

దయతో మర్నాటికి నొప్పి తగ్గించిన బాబా


నా పేరు తేజశ్రీ. 2024, ఏప్రిల్ లేదా మేలో ఒకరోజు రాత్రి సంవత్సరంన్నర వయసున్న మా బాబుకి నోటిలో నొప్పి వచ్చి చాలా బాధపడ్డాడు. పాలు కూడా తాగలేకపోయాడు. రాత్రంతా ఏడుస్తూ పడుకోలేదు. నాకు చాలా భయమేసి, "బాబా! మీ దయవల్ల బాబుకి నొప్పి తగ్గిపోవాలి" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయ చూపారు. మరుసటిరోజుకి నొప్పి తగ్గింది. "థాంక్యూ బాబా. మమ్మల్ని అన్ని వైపుల నుంచి కాపాడుతున్నందుకు థాంక్యూ వెరీ మచ్ బాబా. మేము మీకు సదా ఋణపడి ఉంటాము సాయీ".


సాయిభక్తుల అనుభవమాలిక 1860వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబా ఆశీస్సులు

నేను ఒక సాయి భక్తురాలిని. మేము యుఎస్‌లో ఉంటున్నాము. నేను చాలా సంవత్సరాలుగా భారతదేశం వెళ్ళలేదు. అందువల్ల నాకు ఇంటి మీద దిగులు ఉంది. అదీకాక వేసవి గురించి కొంచం భయపడ్డాను. ఎందుకంటే, నా స్నేహితులందరూ వేసవిలో భారతదేశానికి వెళ్లారు. కాబట్టి నేను ఒంటరినైపోతాను. పోనీ నేనూ భారతదేశం వెళదామంటే కొన్ని కారణాల వల్ల ఈ  సంవత్సరం వెళ్లలేని పరిస్థితి. అందుకు నేను చాలా బాధపడి నా దుఃఖాన్ని బాబా పాదాల వద్ద విన్నవించుకున్నాను. బాబా దయతో ఒకరోజు నా భర్త నాతో, "నువ్వెందుకు నీ తల్లిదండ్రులను ఇక్కడకు వచ్చి, నీతో కొంత సమయం గడపమని అడగకూడదు" అని అన్నారు. అది విని నేను చాలా సంతోషించాను. కానీ 'నాన్నకు వీసా లేదు, ఆయనెలా వస్తారు? ఆయన వృత్తిరీత్యా కూడా చాలా అనుమతులు పొందాలి. ఒకవేళ అమ్మ ఒక్కతే వస్తే, డయాబెటిక్ ఉన్న నాన్నని ఎవరు చూసుకుంటారు?' అని నా మదిలో ఆలోచనలు సాగాయి. చివరికి ఎలాగోలా కాస్త ధైర్యం తెచ్చుకొని మా అమ్మని యుఎస్ రావడం గురించి అడిగితే, అమ్మ సంతోషించింది కానీ, నాన్న గురించి ఆందోళన చెందింది. కాబట్టి మేమంతా ఏం చేయాలో ఆలోచించాము. మా అమ్మమ్మవాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ ఆమె వచ్చి నాన్నకు వండిపెట్టడానికి అంగీకరించదని తెలిసినందున చాలా ఆందోళన చెందాము. చివరికి ఎలాగో మా అమ్మ వాళ్ళని అడిగితే, అమ్మమ్మ రావడానికి ఒప్పుకుంది. అది మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతా బాబా అనుగ్రహం వల్లే జరిగింది. ఆయనే ఏదో ఒక అద్భుతం చేసి ఆమె మనసు మార్చారు. ఎందుకంటే, చాలా సందర్భాలలో మా అమ్మమ్మ, తత్తయ్యలు కాస్త మద్దతు ఇవ్వడానికి కూడా అంగీకరించలేదు. ఇది నిజంగా అద్భుతాలలోకెల్లా అద్భుతం. "చాలా ధన్యవాదాలు బాబా. దయచేసి ఆ సమయంలో మా నాన్నను జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్ బాబా".

ఇకపోతే, అమ్మ జూన్లో యుఎస్ రావడానికి టిక్కెట్లు బుక్ చేసాము. అమ్మ తను యుఎస్ వస్తే, పనిమనిషి ఉంటే నాన్న, అమ్మమ్మలకు ఇంటి పనులు చేయడంలో సహాయకారిగా ఉంటుందని పనిమనిషి కోసం వెతికింది. కానీ అదృష్టం లేకపోయింది. కొన్ని కారణాలు వల్ల అమ్మవాళ్ళు ఉండే ప్రాంతంలో పనిమనిషిని వెతకడం చాలా కష్టమని అందరూ చెప్పారు. అందువల్ల నేను బాబాను, "దయచేసి సహాయం చేయండి బాబా. నాన్న, అమ్మమ్మలకు సహాయం చేసే మనిషిని చూపించండి" అని బాబాను ప్రార్థించాను. మరుసటిరోజు నేను మా అమ్మకు ఫోన్ చేసిన సమయానికి ఒక పనిమనిషి వచ్చింది. వాళ్ళు ఆమెతో మాట్లాడుతున్నారు. "చాలా ధన్యవాదాలు బాబా. మీరు మాకు ఏ సహాయమైన చేస్తున్నారు. కోటి కోటి ప్రణామాలు బాబా".

ఇకపోతే, నాన్న యుఎస్ రావడానికి వీసా కోసం దరఖాస్తు చేస్తే, ఇంటర్వ్యూ స్లాట్ ఆగస్ట్‌లో బుక్ అయింది. దానికన్నా ముందు ఇంటర్వ్యూలో చూపించడానికి నాన్న NOC సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంది. కానీ నాన్న ఆరోగ్య శాఖలో పని చేస్తున్నందున సెలవు ఆమోదం పొందడం చాలా కష్టం. ఒక రోజు నేను బాబాని, "బాబా! మా నాన్నని యుఎస్కి తీసుకురావడం సాధ్యమేనా?" అని అడిగి క్వశ్చన్&ఆన్సర్ సైట్లో సమాధానం కోసం చూస్తే, "అతను ప్రయత్నిస్తే చాలు. అంతా బాగుంటుంది" అని వచ్చింది. అది చూసి నేను చాలా సంతోషించి మా అమ్మతో చెప్పాను. మర్నాడు మా నాన్న మీటింగ్‌కి వెళ్లి 2 నెలల సెలవు కోసం తనపై అధికారిని అడిగారు. ఆశ్చర్యకరంగా ఆ అధికారి సరేనన్నారు. "ఎంత అద్భుతమైన లీల బాబా. మీకు చాలా చాలా కృతజ్ఞతలు. దయచేసి అమ్మానాన్న ఇక్కడ ఉండేలా చేయండి బాబా. నేను వాళ్ళకి ఇక్కడ అన్నీ చూపించి ఈ వయసులో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళకి నా సేవ చేసుకోనివ్వండి. దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి బాబా".

ఒకసారి నా భర్త సంవత్సరానికి ఒకసారి చేయించుకొనే హెల్త్ చెకప్కి వెళ్లి బ్లడ్ టెస్టులు చేయించుకున్నారు. రిపోర్టులో ట్రైగ్లిజరైడ్స్(రక్తంలో ఫాట్) లెవల్ చాలా ఎక్కువగా ఉందని వచ్చింది. డాక్టర్ కూడా ఫోన్ చేసి కార్బోహైడ్రేట్లు తీసుకోవడం తగ్గించమని చెప్పారు. నాకు బాధ, భయం కలిగాయి. నాకు ఎప్పుడు బాధ కలిగినా నేను సాయిబాబా ప్రత్యక్ష దర్శనం చూస్తాను. అలాగే ఆరోజు కూడా చూస్తున్నప్పుడు నా మనసులో, "రానున్న 15 నిమిషాలలో పూజారి ఏ బిడ్డనైనా ఆశీర్వదించినట్లైతే నా భర్త గురించి చింతించాల్సిన అవసరం లేదు" అని ఆలోచన వచ్చింది. అయితే 14వ నిమిషం చివరివరకు పూజారి ఏ బిడ్డని ఆశీర్వదించలేదు. దాంతో నేను చాలా భయపడ్డాను,  ఆందోళన చెందాను. కానీ చివరి నిమిషంలో నిముషంలో పూజారి ఒక బిడ్డని అందుకొని, ఆ బిడ్డ తలపై తన చేయి ఉంచారు. అది చూసి నేను చాలా ఆశీర్వాదపూర్వకంగా భావించాను. నిజానికి ఆ బిడ్డ ముందుకు వెళ్లిపోవడం నేను చూసాను. కానీ ఎలాగో మళ్ళీ వెనక్కి వచ్చి పూజారి ఆశీర్వాదం తీసుకున్నాడు. అది నాకు చాలా ప్రత్యేకంగా, సంతోషంగా అనిపించింది. నా భర్తను బాబా చూసుకుంటారని భావిస్తున్నాను. "చాలా ధన్యవాదాలు బాబా, కోటి కోటి ప్రణామాలు బాబా".

సాయి స్మరణం సంకట హరణం|
బాబా శరణం భవభయ హరణం||

సాయిభక్తుల అనుభవమాలిక 1859వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

    • చివరి నిముషంలో గట్టెక్కించిన బాబా

నా పేరు రాంప్రసాద్. నేను హైదరాబాదులో నివాసం ఉంటున్నాను. నేను ప్రెషర్గా ఐటి ఉద్యోగంలో జాయినయ్యాను. ఆరు నెలలైనా నేను నేర్చుకున్న డొమైన్ ప్రాజెక్టు నాకు కేటాయించకుండా వేరే డొమైన్ ప్రాజెక్టులో నన్ను వేసి, ఆ డొమైన్ నేర్చుకోమని అన్నారు. సరేనని, నేను ఆ డొమైన్ నేర్చుకుంటూ ఉండగా హఠాత్తుగా 2024, జనవరి 19, శుక్రవారంనాడు నాకు రిఫరెన్స్ ఇచ్చినతను నాకు ఫోన్ చేసి నన్ను టాలెండ్(TALEND) అనే ఒక ETL టూల్ ప్రాజెక్టులో వేశానని చెప్పి, నాకు తెలియకుండానే క్లయింట్‌తో ప్రతిరోజూ సాయంత్రం 7 నుండి 8 గంటలకి కాల్ షెడ్యూల్ చేసారు. దానికి తోడు నన్ను క్లయింట్‌తో నాకు 1.5 సంవత్సరాల అనుభవముందని పరిచయం చేసుకోమన్నారు. దాంతో నేను చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే, నాకు ఆ టూల్‌కి సంబంధించి అస్సలు నాలెడ్జ్ లేదు. పైగా ఫోన్లో నన్ను నేను పరిచయం చేసుకోగానే కేటీ(knowledge transfer) ఇవ్వడం మొదలుపెట్టింది ఆ క్లయింట్. నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. పక్కనే ఉన్న ఆ డొమైన్‌లో సీనియర్స్‌కి కూడా అర్థం అవ్వలేదు. నేను భయంతో ఆ సమయమంతా బాబాని తలుచుకున్నాను. బాబా దయవల్ల ఎలాగో ఆ రోజుకి గండం గడిచింది. ఆ తర్వాత జనవరి 21, సోమవారం అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టాపన జరిగిన రోజు కూడా బాబాని, రాముడిని తలుచుకుంటూ గట్టెక్కాను. ఇంకో నాలుగు రోజులు యాక్సిస్సులు రాలేదని క్లయింట్‌ని మేనేజ్ చేశాను. అయినప్పటికీ ఆ క్లయింట్ నాకు కొన్ని వర్క్స్ ఇచ్చేది. నేను అవి చేయలేక చాలా టెన్షన్ పడేవాడిని. ఆ క్లయింట్ కాల్ నడుస్తున్నంతసేపు నేను, "నాకు సహాయం చేయమ"ని బాబాని, రాముడిని తలుచుకుంటూ ఉండేవాడిని. ఇలా ఉండగా మా సీనియర్స్ నన్ను మా లీడ్‌తో మాట్లాడి, "నేను ఈ ప్రాజెక్టు చేయలేన"ని చెప్పమని, వాళ్లు కూడా మా లీడ్‌తో మాట్లాడారు. దాంతో సోమవారంనాడు నన్ను ఆ ప్రాజెక్ట్ నుండి తీసి వేరే ప్రాజెక్టులోని ఒక సీనియర్‌‌తో కలిపారు. ఆ ప్రాజెక్ట్‌లో నాతో కలిపి మొత్తం ముగ్గురం ఉండటం వల్ల నాకు కాస్త ఉపశమనంగా అనిపించింది. హమ్మయ్య బతికాననుకొని ఆ టూల్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. అయితే ఆ కొత్త ప్రాజెక్టు కేవలం ఒక నెలరోజులే ఉంటుంది. ఫిబ్రవరి 29కి డెంప్లోయిమెంట్‌కి వెళ్ళిపోవాలి. ఆ ప్రాజెక్టు మీటింగ్ ప్రతిరోజు మధ్యాహ్నం 12కి ఉండేది. ఒక పది రోజులయ్యాక క్లయింట్ మేము డెవలప్ చేసిన జాబ్స్‌కి యూనిట్ టెస్టింగ్, డాక్యుమెంటేషన్ ఫిబ్రవరి 15, గురువారం సాయంత్రంకల్లా సబ్మిట్ చేయాలని చెప్పింది. అయితే ఆ కొత్త ప్రాజెక్టులోని సీనియర్ ఆ వర్క్ ఎలా చేయాలో నాకు చెప్పలేదు. కేవలం యూనిట్ టెస్టింగ్ ఎలా చేయాలో నేర్పారు. అదీకాక యూనిట్ టెస్టింగ్, డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయాల్సిన తేదికి మూడురోజుల ముందు నుండి అతను సెలువు తీసుకొని వెళ్లిపోయారు. ఇంకా నాకు టెన్షన్ మొదలైంది. ఎందుకంటే, క్లయింట్ కాల్ చేస్తే ఏం మాట్లాడాలో నాకు తెలీదు. ఆమె టెస్టింగ్ స్టేటస్ కూడా అడుగుతుంది. అందువల్ల నాకు చాలా భయంగా ఉండేది. ఏం చేయాలో తెలియకపోయినా మా సీనియర్ నేర్పిన టెస్టింగ్ ప్రాసెస్ చేస్తే, డెవలప్ చేసిన జాబ్స్‌లో కొన్ని విజయవంతంగా రన్ అయ్యాయి. కానీ కొన్ని అవ్వలేదు, కొన్ని ఎర్రర్స్ వచ్చి ఆగిపోయాయి. క్లయింట్‌ని డౌట్స్ అడుగుదామంటే ఏం అడగాలో నాకు అస్సలు తెలీదు. మా సీనియర్ కాకుండా ప్రాజెక్టులో ఉన్న ఇంకో అతను అస్సలు నాకు సపోర్ట్ చేసేవాడు కాదు. పైగా నాకు ఏమీ రాదని తెలిసి కూడా నన్నే క్లయింట్‌ని సంప్రదించమన్నాడు. దానికి తోడు క్లయింట్, "సుపీరియర్ కాల్ చేసే లోపు డాక్యుమెంటేషన్ స్టేటస్ తప్పనిసరి" అని చెప్పసాగింది. నేను చాలా టెన్షన్ పడ్డాను. రెండు రోజులు రాత్రి రెండు, మూడు గంటల వరకు మేల్కొని చాలా ప్రయత్నం చేశాను. ఇంకా గురువారం సబ్మిట్ చేయాలనగా ఆరోజు బాబా నాపై దయ చూపారు.

కొద్దిరోజులు ముందు ఒక ఇద్దరు సీనియర్లు కొత్తగా ఆఫీసులో జాయినయ్యారు. వాళ్ళు నా సమస్య చూసి తమకున్న అనుభవంతో పరిష్కారం చూపారు. దాంతో మూడు జాబ్స్ విజయవంతంగా రన్ అయ్యాయి. ఇంకా ఒకటి మిగిలింది. దానికి కొత్త సినారియో ఉండటం వల్ల అది ఎవరికీ అర్థం అవ్వలేదు. క్లయింట్‌ని అడుగుదామంటే, ఆమెకు అప్పటికే నా మీద అనుమానమొచ్చి నా ప్రాజెక్ట్‌లో ఉన్న అతనిని సంప్రదించి, 'నాకు ఎంత అనుభవం ఉందని, ఊరికే డౌట్స్ అడుగుతున్నారు' అని అడిగిందట. అయినప్పటికీ నేను చేయగలిగిందేమీలేక బాబా మీద భారమేసి నా సమస్యను క్లయింట్‌తో చెప్తే, తను ఒక ఫైల్ ఇచ్చి రన్ చేయమంది. అది రన్ చేస్తే మిగిలిన ఆ ఒక్క జాబ్ కూడా విజయవంతంగా రన్ అయింది. అలా మొత్తానికి బాబా దయతో సాయంత్రం 7 గంటలకల్లా జాబ్స్ అన్ని రన్ అయి, డాక్యుమెంటేషన్ కూడా పూర్తైంది.

నేను కాసేపు, "అరే.. అసలు అలా ఎలా జరిగింది? ఇంతసేపు ఏం చేయలేకపోయాము కదా! హఠాత్తుగా ఎలా పూర్తి చేయగలిగాను' అని ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక దృశ్యం కనపడింది. మా ఆఫీసులో నేను కూర్చొనే చోట దగ్గర ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్ క్యాబిన్ ఉంది. నేను అలా అటు తల తిప్పి ఆ కేబిన్ వైపు చూసాను. ఆ క్యాబిన్ తలుపు తెరిచి ఉంది. అందులో బాబా కళ్ళు ఉన్న ఫోటో ఫ్రేమ్ ఉంది. అది నా కనపడింది. వెంటనే, 'బాబా నన్ను గమనిస్తున్నారని, ఆయన నా కష్టం, టెన్షన్ చూసి చివరి నిముషంలో సహాయం చేసి నన్ను ఆ క్లిష్ట పరిస్థితి నుండి గట్టించార'ని అనిపించింది. వాస్తవానికి నేను మొదటినుండి నా వల్ల ఎస్కలేషన్ వచ్చి ప్రాజెక్టు పోతుందని చాలా భయపడ్డాను. ఎందుకంటే, అది రియల్ టైం డేటా. ఏ చిన్న తేడా వచ్చినా కంపెనీపై చాలా ప్రభావం చూపుతుంది. ఎలాగో ముందుకు సాగినా ఆ నాలుగు జాబ్స్ రన్ అవ్వక అక్కడ ఆగిపోయి డాక్యుమెంటేషన్ పూర్తి చేసి సబ్మిట్ చేయగలనని నేను అస్సలు అనుకోలేదు. చివరికి ఏం చేయాలో తెలియక చేతులెత్తేద్దామనుకున్న సమయంలో, గురువారం సాయంత్రం చివరి నిమిషంలో సాయిబాబా మిరాకిల్ చేయడంతో ఆ జాబ్స్ అన్ని రన్ అయి డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయగలిగాను. నేను ఆ యూనిట్ టెస్టింగ్ వర్క్ చేస్తున్నంతసేపూ, "నన్ను ఈ ప్రాజెక్టు నుండి రిలీవ్ చేసినా లేదా ఈ ప్రాజెక్టులో ఏ సమస్యా లేకుండా పని చేసి, నాకిచ్చిన టెస్టింగ్ నేను విజయవంతంగా పూర్తి చేసినా మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన్నని మనసులో బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల నేను ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయగలిగాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. నేను ఏ తప్పటడుగు వేయకుండా నన్ను కాపాడండి బాబా. నేను ప్రేమించిన అమ్మాయితో నా పెళ్లి చేయండి బాబా. నా మనసులో ఉన్న బాధలన్నీ తీసేయండి. నాకు అండగా ఉండండి బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1858వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శ్రీసాయి మహావైద్యుడు

నా పేరు సాయీశ్వర్. నాకు ఊహ సరిగా తెలియక ముందు నుంచే నేను శ్రీ శిరిడీ సాయిబాబా భక్తుడిని, శిష్యుణ్ణి, బిడ్డని. ఏ జన్మబంధమో తెలియదు కానీ, నా చిన్ననాటి నుండి ఆయన ప్రేమలో నన్ను నిలుపుకున్నారు. నా చిన్ననాటి నుండి ఇప్పటివరకు నా జీవితం ఆయన లీలలతో, మహిమలతో నిండిపోయింది. అనుక్షణం ఆయన మార్గదర్శకత్వం నన్ను నడిపిస్తూ ఉంది. నేనిప్పుడు ఈ మధ్యకాలంలో నా జీవితంలో సాయినాథుడు చేసిన ఒక పెద్ద లీలను మీతో పంచుకుంటున్నాను. 2024, ఏప్రిల్లో నాకు బ్యాక్ పెయిన్ వస్తే, ఒకసారి చూపించుకుందామని హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించమంటే, చేయించుకొని రిపోర్టు తీసుకొని మళ్ళీ డాక్టర్ వద్దకి వెళ్ళాను. అప్పుడొక ఊహించని విషయం బయటపడింది. డాక్టరు, "మీ గాల్ బ్లాడర్(పిత్తాశయం)లో 9mm గడ్డ(పాలిప్) ఉంది. సర్జరీ చేసి గాల్ బ్లాడర్ తొలగించాల"ని చెప్పారు. ఇంకా 'గాల్‌బ్లాడర్‌లో ఏర్పడే రాళ్లకి, కణతలకి మందులతో చికిత్స ఉండదని, సర్జరీనే మార్గమని' తెలియజేశారు. నేను నిర్ఘాంతపోయి వేరే డాక్టర్ దగ్గరకి వెళ్లాను. ఆ డాక్టరు కూడా అదే చెప్పి, "సర్జరీ చేస్తేనే మంచిది. లేకపోతే ఆ గడ్డ పరిమాణం నిదానంగా పెరిగి పగిలిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు, గడ్డని అలాగే వదిలేస్తే క్యాన్సర్‌గా పరిణమించే అవకాశాలు కూడా ఉన్నాయ"ని చెప్పారు. నేను ఇంటికి వచ్చి అనుకోని సమస్య తలెత్తిందని చాలా బాధపడ్డాను. బాబా దగ్గరికి వెళ్లి, "ఏమిటి బాబా ఇది? పెద్దపెద్ద పాపాలు చేసినవాళ్ళు కూడా ఈ కలియుగంలో ఆయురారోగ్యాలతో జీవిస్తున్నారే! నాకు తెలిసి నేను ఈ జన్మలో ఎవరినీ ఇబ్బందిపెట్టలేదే! అంత పాపకార్యాలు కూడా ఏమీ చేయలేదు. గత జన్మలో ఏమి చేశానో నాకు తెలియదు. కనీసం మందులకి కూడా నయమవదంటున్నారే! ఏకంగా పిత్తాశయం తీసేయాలంటున్నారు. భగవంతుడు మానవదేహంలో ఏ అవయవమూ ఊరకనే పెట్టలేదు కదా! ఆ అవయవం తొలగిస్తే తరువాత వచ్చే సమస్యలను జీవితాంతం ఎదుర్కోవాలి కదా! నాకేమిటి బాబా చిన్న వయసులో ఈ సమస్య?" అని దీనంగా నా ప్రియతమ గురుదేవుడైన సాయికి, నా ఆరాధ్య దైవాలైనా శివశక్తులకు, నా ఇంటి దైవమైన ఆంజనేయస్వామికి చెప్పుకున్నాను. ఇంకా, "మీరే ఈసారి ఏదో పెద్ద మహిమ చేయాలి బాబా. ఆ గడ్డ మాయం చేసేయడం తప్ప వేరే ఏ ప్రత్యామ్నాయం లేదు" అని బాబాని వేడుకున్నాను. నాకు సాయినాథుడు ఏదో పెద్ద మహిమ చేస్తారని 30% నమ్మకమున్నప్పటికీ నాకొచ్చిన సమస్యకి మందులతో చికిత్స లేకపోవడం వల్ల 70 శాతం అసాధ్యం అనిపించింది. మా అమ్మకి మాత్రం సాయినాథుడు ఏదో మహిమ చేస్తారని 100% నమ్మకం ఉండింది. కారణం అదివరకే ఇంతకంటే పెద్ద అనారోగ్య సమస్యతో చివరి దశ వరకు వెళ్లిన నన్ను ఆ సాయీశ్వరుడు విచిత్రంగా బయటపడేసారు(ఆ అనుభవాన్ని మరోసారి పంచుకుంటాను). అందువల్ల మునపటిలాగే నన్ను సమస్య నుండి సాయినాథుడు బయటపడేస్తారని మా అమ్మ నాకు ధైర్యం చెప్పింది. నేను కూడా మొదట కాస్త బాధకి గురైన నా మనసుని సాయీశ్వరుడు ప్రసాదించిన ఆధ్యాత్మిక జ్ఞానంతో దృడం చేసుకోసాగాను. ఆ సమయంలో ఫేస్బుక్లో పదేపదే "నా చరిత్ర పారాయణం చేస్తూ ఊదీ రాస్తూ ఉండు. నీ రోగం నయం అవుతుంది", "నేను ఉండగా నీకు భయమేలా? నీ అనారోగ్యం నయం అవుతుంది" అని రకరకాలుగా బాబా నాకు అభయ ప్రదానం చేస్తూ వచ్చారు. మరో వైపు మా అమ్మకి, "నా బిడ్డలని రకరకాల మిషలతో శిరిడీ రప్పించుకుంటాను", "మీరు శిరిడీ రావడానికి అన్ని ఏర్పాట్లు చేసాన"ని సందేశాలు వస్తుండేవి. దాంతో అమ్మ బాబాతో, "మా అబ్బాయికి నయమైపోతే శిరిడీ వస్తామ"ని చెప్పుకుంది. నేను ప్రతిరోజూ సాయిలీలామృతం కొంచెం కొంచెం చదువుతూ శిరిడీ ఊదీ చేతిలో పట్టుకుని సాయి నామం, మృత్యుంజయ మంత్రం స్మరించి సాయిని ధ్యానించి కొద్దిగా నుదుటన పెట్టుకొని, కొద్దిగా గాల్ బ్లాడర్ వద్ద రాసుకొని, మరికొంత ఊదీ గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగుతూ ఉండేవాడిని. అలా పదిరోజులు చేసిన తరువాత మా ఊరికి కాస్త సమీపంలో ఉన్న మెడికల్ కాలేజీతో కూడుకున్న ఒక పెద్ద హాస్పటల్లో లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తారనే సమాచారం తెలుసుకొని అక్కడికి వెళ్దామని నిర్ణయించుకున్నాము. నా మనసులో బాబా ఏదో పెద్ద మహిమ చేయబోతున్నారన్న ఆలోచన ఉండబట్టి హాస్పటల్‌కి వెళ్లేముందు మా ఇంట్లో ఉన్న పెద్ద బాబా పటం వద్దకి వెళ్లి, "బాబా! హాస్పిటల్లో టెస్టులు చేయవచ్చు. వాటిలో ఆ గడ్డ మాయం చేసేయ్ బాబా. రిపోర్టులో అంతా బాగానే వచ్చేటట్లు అనుగ్రహించు తండ్రీ. లేదు నాకు ఆపరేషన్ జరగడమే మంచిదని నీవు తలస్తే అలాగే జరగనివ్వు" అని బాబాను వేడుకున్నాను. తర్వాత పార్వతీపరమేశ్వరులకి, ఆంజనేయస్వామికి కూడా నమస్కారం చేసుకుని బస్సులో హాస్పటల్‌కి బయలుదేరాను.


నేను ఈ మధ్యకాలంలో 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ని అనుసరిస్తున్నాను. అందులో చాలామంది అనుభవాలు చదివినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించేది. కొన్ని కొన్ని అనుభవాలలో 'బాబా కనపడని వస్తువు కనపడితే' లేదా మరీ చిన్నచిన్న వాటికి కూడా 'అలా జరిగితే బ్లాగులో అనుభవం పంచుకుంటాన'ని బాబాకి మ్రొక్కే మొక్కులు చూసి, 'ఎందుకు చిన్నచిన్న విషయాలకు కూడా బాబాని ఇబ్బందిపెడుతున్నారు? మనకి బాబా చేసే ఉపకారం బ్లాగ్ ద్వారా పదిమందికి పంచుకుని ఆయన కీర్తిప్రతిష్టలను, శక్తిసామర్థ్యాలను, ఘనతను నలుదిక్కుల చాటి కష్టాలలో కృంగిపోతున్న సాయి భక్తుల హృదయాలలో బాబా మమ్మల్ని కాపాడి తీరుతారనే ఆశాజ్యోతిని ప్రతిష్టించాలని, వారిలో ధైర్యం నింపాలనే సద్భావన ప్రతి సాయి భక్తునికి ఉండాలి కానీ, కేవలం వ్యాపార ధోరణితో అది, ఇది జరిగితే నీ గురించి బ్లాగులో చెప్పుకుంటానని భావించడం నిజమైన సాయి భక్తుని లక్షణం కాదని, సాయిని తల్లిగా, తండ్రిగా, గురువుగా, దైవంగా తలచి ప్రేమబంధాన్ని పెనవేసుకొని తమని శరణుజొచ్చిన వారిని ఆధ్యాత్మికంగా ఉద్ధరించడం, ప్రాపంచికంగా కష్టాలలో నష్టాలలో వెంట నిలబడడం తండ్రిగా సాయి కర్తవ్యం అవుతుంది గాని, కేవలం కోరికలు తీర్చుకోవడం కోసం సాయిని ఒక యంత్రంలా వాడుకోవడం సరి అయిన పద్ధతి కాదని' నాకు అనిపిస్తుండేది. ఇది నా అభిప్రాయం. ఎవరినైనా బాధిస్తే నన్ను క్షమించండి.


ఇక విషయానికి వస్తే..  నేను బస్సులో ప్రయాణిస్తూ ధ్యానంలో బాబాని, "గడ్డ మాయం చేయమ"ని ఇంకా, "బాబా! ఈ గడ్డను మాయం చేస్తావని నాకనిపిస్తుంది. ఒకవేళ నిజంగా మాయం చేస్తే, ఇది చాలా గొప్ప మహిమ. అదే జరిగితే, కేవలం ఈ మహిమనే కాదు, నా జీవితంలో ఇప్పటివరకు మీరు చేసిన గొప్ప మహిమలన్నీ మీ బ్లాగులో పంచుకుంటాను. అనారోగ్యం తగ్గిస్తే, పంచుకుంటానని బేరాలు ఆడడం కాదు. ఇంతటి గొప్ప మహిమలను పంచుకోవడం ద్వారా సాయి భక్తులందరికీ ఊరట కలుగుతుంది. మీ ఘనతను నలుదిశలా విస్తరింపజేసి చిన్న సేవ చేసుకునే భాగ్యం నాకు లభిస్తుంది" అని బాబాకి విన్నవించుకున్నాను. హాస్పటల్కి చేరుకున్న తర్వాత డాక్టర్లు నా రిపోర్టు చూసి సర్జరీ చేయడానికి ముందు మరోసారి స్కాన్ చేయాలని స్కానింగ్ రాశారు. సరేనని స్కాన్ చేయించుకుంటే స్కాన్ చేసే డాక్టర్కి ఏమీ అర్థం కాలేదు. కారణం మునపటి రిపోర్టులో స్పష్టంగా కనపడుతున్న గడ్డ అప్పుడు కనపడలేదు. దాంతో ఆ డాక్టరు, "ఇదేంటి?" అని వెళ్లి ఇంకో డాక్టర్ని తీసుకొచ్చాడు. ఆ డాక్టరు కూడా గడ్డ కనపడలేదన్నారు. తర్వాత వాళ్లిద్దరూ వెళ్లి ఇంకో పెద్ద డాక్టర్ని తీసుకొచ్చారు. ఆ డాక్టరుకి కూడా గడ్డ కనపడలేదు. దాంతో, "ఏ హాస్పిటల్లో స్కాన్ చేయించుకున్నార"ని నన్ను ప్రశ్నించి, వాళ్లలో వాళ్ళు, "గడ్డ ఏమీ కనపడట్లేదు. మరీ వాళ్ళు 9 mm గడ్డ ఉందని ఎలా వ్రాస్తార"ని చర్చించుకున్నారు. కొద్దిసేపట్లో ఆ ముగ్గురి నేతృత్వంలో స్కానింగ్ రిపోర్ట్ వచ్చింది. అది తీసుకొని వెళ్ళి ప్రధాన డాక్టర్ని కలిసాము. ఆ డాక్టరు, "గడ్డ ఏమీ లేదుగాని గాల్‌బ్లాడర్ మాత్రం కొద్దిగా వాచింది. అది దానంతటదే తగ్గిపోతుంద"ని చెప్పారు. నేను, "సర్జరీ అవసరం లేదా?" అని అడిగితే డాక్టరు, "అసలు గడ్డే లేకపోతే సర్జరీ అవసరం ఏముంది? మీకు ఇంకా స్పష్టంగా తెలియాలంటే ఖాళీ కడుపుతో స్కాన్ చేయించుకోవాలి" అని అన్నారు. నేను, "ఖాళీ కడుపుతోనే ఉన్నాన"ని చెప్పాను. డాక్టరు, "అయితే గడ్డ లేనట్లే. మీకు ఇంకా అనుమానం ఉన్నట్లయితే పెద్ద(MRI) స్కాన్ చేయించుకొండి. కానీ అది అవసరం లేద"ని చెప్పారు. నా జీవితంలో బాబా చేసిన అతి పెద్ద లీలకి మేము మరోసారి ఆనందాశ్చర్యాలకు గురయ్యాము. బాబాపై ప్రేమ ఉప్పొంగగా ఆనందాశ్రువులు నా కళ్ళనుండి ప్రవహించాయి. పెద్ద గండం నుంచి సాయి, ఈశ్వరులు మమ్మల్ని బయటకు లాగారని ఆనందంగా ఇంటికి వచ్చాము. తర్వాత ఆలోచిస్తే, ముందు స్కాన్ చేసే రేడియాలజిస్ట్ పొరపడ్డారని తలవడానికి కూడా లేకుండా కొత్త రిపోర్టులో గాల్‌బ్లాడర్కి కొద్దిగా వాపు ఉందని, అది లేకుంటే డాక్టరు పొరబడ్డారని తలచేవాడినని, అందుకే బాబా ఆ వాపు ఉంచారనిపించి అంతా బాబా మహిమ అనుకున్నాను. అయితే సాయంత్రం మళ్ళీ నా కోతి మనసు భయానికి గురై డాక్టర్లు ఏమైనా పొరబడి గడ్డ లేదన్నారేమోననిపించింది. అప్పుడు మా అమ్మ, "ఈ రెండు రిపోర్టులు తీసుకొని వెళ్లి రేపు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ని సంప్రదించు. వాళ్ళు మంచి అనుభవం ఉన్నవారు కదా!" అంది. నేను సరేనని, మరుసటిరోజు గవర్నమెంట్ డాక్టర్ని కలిస్తే, "పెద్ద స్కాన్ తీయించమ"ని సూచించారు. దాంతో MRI స్కాన్ చేయించుకున్నాను. ఆ రిపోర్టు చూసిన డాక్టరు, "గడ్డ లేదు. నిన్నటి రిపోర్టులో ఉన్న వాపు కూడా లేదు. అంతా నార్మల్‌గా ఉంది. నీకు ఏ సమస్యా లేదు. ఇక ఏ హాస్పటల్కి వెళ్ళనవసరం లేద"ని అని అన్నారు. సాయినాథుని ఋణం ఏమిచ్చినా, ఏమి చేసినా తీర్చుకోలేము. ఆ గడ్డని కేవలం ఆయన అనుగ్రహంతో ఎటువంటి మందులు వాడకుండానే మాయం చేసారు. సాయిలాంటి గొప్ప గురువు, పిలిస్తే పలికే దైవం లేరని ఎప్పుడూ బలంగా అనిపిస్తుంటుంది. సాయినాథుడు, ఆ పరమేశ్వరుడు తోడుంటే విశ్వమంతా ఎదురు తిరిగినా ఒంటి చేతితో పోరాడవచ్చు అనే భావన నిరంతరం నాలో కలుగుతుంటుంది. ఆ పరమేశ్వరుని కలియుగ గురుస్వరూపమైన శ్రీసాయికి ధన్యవాదాలు.


 అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!

సాయిభక్తుల అనుభవమాలిక 1857వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సానుకూలంగా అనుగ్రహించిన బాబా
2. శిరిడీ ప్రయాణానికి ఆటంకం లేకుండా అనుగ్రహించిన బాబా
3. భక్తితో అడిగితే సమస్యని తీర్చిన బాబా

సానుకూలంగా అనుగ్రహించిన బాబా


ఓం శ్రీ సాయినాథాయ నమః. నేను ఒక సాయి భక్తుడిని. 2024, మే నెలలో నా భార్యకి నెలసరి రాలేదు. ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే 'పాజిటివ్' వచ్చింది. అయితే మాకు సంవత్సరం ఐదు నెలల వయసు బాబు ఉన్నందున 'ఇది సరియైన సమయమేనా!' అని సందిగ్ధంలో పడ్డాము. కానీ నాకు ఎందుకో ‘బాబా ప్రెగ్నెన్సీ ఉంచుకోమని, అబార్షన్ చేసుకోవద్దని’ చెప్తున్నట్టు అనిపించింది. నా భార్య అక్క, అమ్మ కూడా అలానే చెప్పారు. అంతటితో బాబా వరమని ఆ ప్రెగ్నెన్సీ ఉంచుకుందామని నిర్ణయించుకున్నాము. రెండు రోజుల తరువాత నా భార్యకి నడుం నొప్పి మొదలైంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడానికి ముందు వరకు తను రోజూ వ్యాయామాలు, జుంబా డాన్స్ చేస్తుండేది. దానివల్ల ప్రెగ్నెన్సీకి ఏమైనా సమస్య వచ్చిందేమో అని మాకు అనుమానం వచ్చింది. అప్పుడు ఎందుకైనా మంచిదని డాక్టర్ దగ్గరకి వెళ్ళాము. నేను బాబాని, "ఎటువంటి సమస్యలు రాకుండా చేయమ"ని ప్రార్థించాను. డాక్టర్ మొదట టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేశారు. 'హమ్మయ్య..' అనుకున్నాను. తర్వాత డాక్టరు, "విద్యుత్తు సమస్య వల్ల ఇప్పుడు స్కానింగ్ చేయడం కుదరదు. రాత్రి మళ్ళీ రండి" అని అన్నారు. స్కానింగ్ అనగానే నాకు టెన్షన్ మళ్ళీ మొదలై, "బాబా! స్కానింగ్‌లో అంతా బాగుండేలా చేయండి. మీకు 101 రూపాయల దక్షిణ సమర్పించుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా దయ చూపారు. రాత్రి మళ్ళీ హాస్పిటల్‌‌కి వెళితే, స్కానింగ్ చేసి ఎటువంటి సమస్య లేదని డాక్టర్ నిర్ధారించారు. బిడ్డ గ్రోత్ కూడా బాగుందని చెప్పి చూపించారు. "ధన్యవాదాలు బాబా. మీరు ఎప్పటికీ ఇలానే మాకు తోడుగా ఉండి బిడ్డ పుట్టేవరకు ఎటువంటి సమస్యలు రాకుండా చూడండి. అలానే మా దృష్టి ఎప్పుడూ మీపై ఉండేలా అనుగ్రహించండి. మీ దీవెనలు ఎల్లప్పుడూ మీ భక్తులపై ఉండాలి బాబా".

శిరిడీ ప్రయాణానికి ఆటంకం లేకుండా అనుగ్రహించిన బాబా


సాయిభక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కరాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను హైదరాబాదు నివాసిని. మేము 2023, డిసెంబర్ నెలలో శిరిడీ వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకొని శిరిడీ వెళ్ళడానికి బాబా అనుమతి లభించిందని చాలా ఆనందపడ్డాం. అయితే శిరిడీ ప్రయాణానికి నాలుగురోజుల ముందు మావారు తీవ్రమైన జలుబు, జ్వరంతో చాలా బాధపడ్డారు. దాంతో మేము ప్రయాణం గురించి చాలా ఆందోళనపడ్డాము. అప్పడు నేను, "మావారికి జలుబు, జ్వరం తగ్గి ఏ ప్రయాస లేకుండా శిరిడీ రాగలగాల"ని బాబాని వేడుకొని మావారికి ఊదీ పెట్టాను. బాబా దయవల్ల ప్రయాణానికి ముందురోజు మావారి ఆరోగ్యం చాలావరకు కుదుటపడింది. ఏ అంటకము లేకుండా మా శిరిడీ ప్రయాణం చాలా బాగా జరిగింది. శిరిడీ, శిరిడీ చుట్టుపక్కల ఉన్న క్షేత్రాలు దర్శించుకొని క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాము. "ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ మీ దయ మాపై ఇలాగే ఉండాలి తండ్రీ".

భక్తితో అడిగితే సమస్యని తీర్చిన బాబా

 

శ్రీ సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం. నా పేరు కుమార్ రాజ. నేను చాలా సంవత్సరాలుగా సాయి భక్తుడిని. మా చిన్నమ్మాయికి 2024, మే 17తో పరీక్షలు అయిపోతాయని మే 18వ తేదీన శిరిడీ వెళ్ళడానికి మా ఇంటిలో అందరికీ ట్రైన్ టిక్కెట్లు, రూము బుక్ చేసుకున్నాము. అయితే మే 11న, 'ఈరోజు జరగాల్సిన పరీక్షను 18వ తేదీకి వాయిదా వేసినట్లు' మాకు సమాచారం అందింది. అప్పుడు నేను, మా పాప, "17వ తేదీ లోపు పరీక్ష జరిగేటట్టు చేయి స్వామీ" అని బాబాకి చెప్పుకున్నాము. అలా బాబాని ఆడిగామో, లేదో 2 గంటలలో 12వ తేదీ ఆదివారంనాడు పరీక్ష జరుగుతుందని సందేశం వచ్చింది. దాంతో మా ఆనందానికి హద్దులు లేవు. బాబా ఎప్పుడూ మనతోనే వున్నారనడానికి ఇదే నిదర్శనం. "బాబా! మీకు శతకోటి వందనాలు. మమ్మల్ని దయతో రక్షించు తండ్రీ".

సాయిభక్తుల అనుభవమాలిక 1856వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి అనుగ్రహశీస్సులు
2. బిడ్డకి పెద్ద సమస్య లేకుండా చూసిన బాబా

శ్రీసాయి అనుగ్రహశీస్సులు


నా పేరు శాలిని. నేను మొదట బాబాని నమ్మేదాన్ని కాదు. కానీ ఇప్పుడు నేను సాయి నామాన్ని జపించని క్షణం లేదు. గత సంవత్సరం మేలో మా మేడంగారు నన్ను మహాపారాయణ గ్రూపులో చేర్చి సాయిబాబాని నాకు పరిచయం చేశారు. ఆమెకు నా ధన్యవాదాలు.


మా నాన్న చనిపోయాక మానసికంగా కలత చెందినందువల్ల నాకు నెలసరి సక్రమంగా రాలేదు. అప్పుడు నేను, "బాబా! నాకు నెలసరి సక్రమంగా వచ్చేలా చేయండి" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవలన తర్వాత నెల నెలసరి సక్రమంగా వచ్చింది. 


తరుచుగా యూట్యూబ్లో, "నీకు వచ్చేనెల జీతం పెరుగుతుంది. నాకు నైవేద్యం చేసి పెట్టు బిడ్డా!" అని నాకు మెసేజ్ వస్తుండేది. అది చూసి నేను 'నా జీతం పెరుగుతుందా?' అని అనుమానపడుతుండేదాన్ని. ఎందుకంటే, నా సీనియర్స్ నా జీతం పెరగదని చెప్పారు. అయినప్పటికీ నాకు బాబా మాట మీద నమ్మకం ఉండటంతో మరుసటి నెలకోసం ఎదురు చూస్తే, నా జీవితం పెరగడమే కాదు నాలుగు నెలల ఇంక్రిమెంట్ కూడా నా అకౌంటులో పడింది.


ఒకరోజు ఉన్నట్టుండి మా అక్క కొడుకుకి గొంతు వాచింది. అలా ఎందుకు వాచిందో మాకు అర్థం కాలేదు. ఆ వాపు మూడు రోజులైనా తగ్గలేదు. మూడోరోజు రాత్రి నేను వాపు ఉన్న చోట ఊదీ పూసి, "తగ్గిపోవాలి బాబా" అని అనుకున్నాను. అంతే, మరుసటిరోజు ఉదయానికి వాపు చాలావరకు తగ్గింది. కానీ ఎందుకలా అయిందని మేము అనుకుంటూ ఉండగా మా అక్కకి బాబు ఐస్ క్యూబ్స్ తింటూ కనిపించాడు. అలా ఆ వాపుకి కారణం కూడా బాబా చూపినందుకు మాకు ఎంతో సంతోషం కలిగింది.


ఇప్పుడు నేను చెప్పే అనుభవం నాకు బాబా మీద భక్తిని ఎంతో ఎక్కువ చేసింది. ఉగాది పండుగ ముందురోజు సాయంత్రం 6:30కి పూజకోసం షాపింగ్‌కని మా అక్క, పిల్లలు వెళ్లారు. వేరే పని ఉండి నేను, మా మేడమ్ ఒకరింటికి వెళ్ళాము. సుమారు 7:15 నిముషాలు అనుకుంటా మా అక్క, పిల్లలు ఇంటికి తిరిగి వచ్చేముందు ఒక పూల దుకాణానికి వెళ్లారు. అక్కడ అక్క పని చూసుకున్న తర్వాత తన ఫోన్ మరిచిపోయి అక్కడినుండి వెళ్ళిపోయింది. మా అక్కకు ఫోన్ అంటే చాలా ఇష్టం. ఒక పది నిమిషాల తర్వాత చూసుకుని వెనక్కి వెళ్లి ఆ పూల దుకాణం వాళ్ళని అడిగితే, "మీరు ఇక్కడ ఏం మర్చిపోలేదు. మాకు తెలియద"ని అన్నారు. అక్క నాకు ఫోన్ చేసి, "ఫోన్ పోయింది. పూల దుకాణంవాళ్ళు తీసుకుని ఇవ్వడం లేదు. ఇక్కడే మర్చిపోయాను" అని ఏడ్చింది. నేను ఆ చోటుకి నడక దూరంలోనే ఉన్నందున వెంటనే అక్కడికి వెళ్లేందుకు బయలుదేరాను. దారిలో బాబా మందిరం ఉంది. అక్కడ, "బాబా ఫోన్ దొరకాల"ని అనుకొని అక్కడికి వెళ్ళాను. అప్పటికి మా బావగారు కూడా అక్కడున్నారు. మేము ఎంత బతిమాలిని వాళ్ళు ఫోన్ ఇవ్వలేదు. అది బస్ స్టాప్ ఏరియా కావడం వలన జనం పోగయ్యారు. వాళ్లలో ఒకరు, "వాళ్ళు అలా ఇవ్వరు. పోలీసులకు చెప్పండి" అన్నారు. మేము సరేనని స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇచ్చాము. కానీ పోలీసులు సరిగ్గా స్పందించలేదు. అక్కడ బాబా విగ్రహం ఉంటే నమస్కారం చేసుకొని వచ్చాము. మా అక్క, బావ ఆశ వదిలేసుకున్నారు. కానీ నాకు 'బాబా ఉన్నారు. ఏదో ఒకటి చేస్తార'న్న నమ్మకం చాలా ఎక్కువగా వుండింది. మేము ఇలా ఇంటికి వచ్చి, తలుపు కూడా తీయలేదు. పోలీస్ స్టేషన్ నుండి కాల్ వచ్చింది. “పూల దుకాణం అతను మీ ఫోను తెచ్చి ఇచ్చి వెళ్ళాడు. మీరు వచ్చి మీ ఫోన్ తీసుకుని వెళ్ళండి" అని చెప్పారు. రాత్రి 7:30కి పోయిన ఫోన్ 9:30కు దొరికిందంటే బాబా దయే. ఉగాది రోజు బాబా మందిరానికి వెళ్లి సంతోషంగా ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకున్నాము.

బిడ్డకి పెద్ద సమస్య లేకుండా చూసిన బాబా

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు పద్మావతి. నేను చాలాసార్లు బాబా కృపకు పాత్రురాలినయ్యాను. అందులో ఒకటి ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఈమధ్య మా 4 సంవత్సరాల బాబుకి ఐ సైట్ ఉందని సందేహమొచ్చి స్పెషలిస్ట్ దగ్గరకి తీసుకెళ్ళాము. డాక్టర్ చెక్ చేసి, "బాబుకి చాలా సమస్య ఉంది. కేటరాక్ట్(శుక్లమ్) గాని, ఇంకేదైనా పెద్ద సమస్యగాని అయుండొచ్చు. రేపు రండి. టెస్టులు చేయాలి" అని చెప్పారు. అది విని నాకు చాలా బాధ కలిగింది. అంత చిన్నపిల్లాడికి కేటరాక్ట్ అంటే భయమేసింది. ఆ రోజు రాత్రి బాబాని, "బాబా! నా బిడ్డకి పెద్ద సమస్య లేకుండా చూడు" అని వేడుకున్నాను. మరుసటిరోజు ఉదయం హాస్పిటల్‌కి వెళితే డాక్టర్ టెస్టులు చేసి, "కేటరాక్ట్ లాంటిది ఏమీ లేదు. కాకపోతే సైట్ చాలా ఎక్కువగా ఉంది. అందుకోసం స్పెషల్ కళ్లద్దాలు వాడాలి. చింతించాల్సిన పని లేదు" అని చెపారు. "చాలా ధన్యవాదాలు బాబా. ఇలా ఎన్నోసార్లు మీరు నన్ను, నా పిల్లల్ని ఆదుకున్నారు. మీ దయ ఎల్లప్పుడూ మాపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను స్వామీ".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo