సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1855వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కేవలం చివరి నాలుగు సంఖ్యలతో అకౌంటు పూర్తి వివరాలు సేకరించేలా అనుగ్రహించిన బాబా
2. సమస్యను పరిష్కరించిన బాబా

కేవలం చివరి నాలుగు సంఖ్యలతో అకౌంటు పూర్తి వివరాలు సేకరించేలా అనుగ్రహించిన బాబా


సాయిభక్తులందరికీ నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. నా జీవితంలో సాయి చేసే ప్రతి మేలును చెప్పుకుంటూ పోతే ఖచ్చితంగా అది ఒక పుస్తకం అవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే అనుభవం వినడానికి విచిత్రంగా ఉన్నా అది వాస్తవం. ప్రతినెలా మా అమ్మకి పెన్షన్ వస్తుంది. అయితే ఒకసారి పెన్షన్ సాధారణంగా ఎప్పుడూ పడే బ్యాంక్ అకౌంటులో కాకుండా వేరే బ్యాంక్ అకౌంటులో పడింది. ఎప్పుడో 2015లో జీరో అకౌంట్ కోసం మా మమ్మీ ఆ బ్యాంకులో అకౌంట్ కోసం అప్లై చేసింది. కానీ ఆ అకౌంట్ పాస్ బుక్ గాని, ఏటీఎం కార్డు గాని మా దగ్గర లేవు. ఎందుకంటే, అకౌంట్ ఓపెన్ అయినట్టు మాకు ఎటువంటి సమాచారమూ అందలేదు. అందువల్ల ఆ బ్యాంకులో అకౌంట్ ఉన్నట్టే మాకు తెలియదు. అలాంటిది ఆ అకౌంటులో పెన్షన్ క్రెడిట్ అయింది. సచివాలయంలో ఆ అకౌంట్ తాలూకు చివరి నాలుగు సంఖ్యలు మాత్రమే మాకు ఇచ్చారు. వాటి ఆధారంగా పూర్తి వివరాలు తెలుసుకొనేందుకు నేను బ్యాంకుకి వెళ్లాలనుకున్నాను. కానీ పాస్ బుక్ లేకుండా చివరి నాలుగు సంఖ్యలతో అకౌంట్ వివరాలన్నీ తెలుసుకోవడం అసాధ్యం. నాకైతే నమ్మకం లేదు కూడా. కానీ, సాయి మీద నమ్మకముంది. అందుచేత నేను ఆయన పాదాలు పట్టుకుని, "సమస్యకు పరిష్కారం చూపించమ"ని అర్థించాను. తర్వాత బ్యాంకుకి వెళ్లేముందు శిరిడీ ఊదీ నా నుదుటన పెట్టుకొని బయలుదేరాను. నిజానికి నేను ఏదైనా ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా శిరిడీ ఊదీ పెట్టుకుని బయలుదేరుతాను. ఎందుకంటే, ఒకరోజు కలలో బాబా, "నువ్వు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నా ఊదీ నుదుటన ధరించి బయట అడుగుపెట్టు" అని చెప్పారు. అప్పటినుండి నేను అలా చేస్తున్నాను. ఇక విషయానికి వస్తే, బాబా దయవల్ల బ్యాంకులో అందరూ నాతో మిత్రుల్లా మసలుకున్నారు. వాళ్ళు నాకు కావాల్సిన వివరాలన్నీ ఇచ్చారు. జీరో అకౌంటుని సేవింగ్ అకౌంటుగా మార్చి పాసుబుక్, ఏటీఎం కార్డు మొదలైన అన్నీ కొన్ని గంటల్లో నా చేతికి ఇచ్చారు. ఇది ఎవరు నమ్మినా, నమ్మకపోయినా కేవలం చివరి నాలుగు సంఖ్యలతో అకౌంటు పూర్తి వివరాలు తెలుసుకున్నాను. అకౌంట్ గురించి ఏమాత్రం అవగాహన లేని నాకు బ్యాంకును చూపించి, అకౌంటు వివరాలు ఇప్పించి, పాస్ బుక్, ఏటీఎం కార్డు అన్నీ రెండు గంటల్లో నా చేతికి వచ్చేలా చేసింది నా సాయి మాత్రమే. అందుకే నాకు ఏది కావాలన్నా నేను నా సాయిని అడుగుతాను. నాకు ఏది ఇవ్వాలన్నా నా సాయి ఇస్తారు. ఎందుకంటే, ఆయన మా ఇంటి పెద్ద. సమస్య చిన్నదైనా, పెద్దదైనా ఆయన తమ భుజస్కందాలపై వేసుకొని దాన్ని పరిష్కరిస్తారు. మాకు అనారోగ్యం వస్తే ఊదీయే ఔషధం. సమస్య వస్తే సాయే పరిష్కారం. మా కుటుంబం దేనికీ భయపడకుండా సాయినాన్న ఉన్నాడు, చూసుకుంటాడులే అనే ఒక గుడ్డి నమ్మకంతో బ్రతుకుతోంది. మా కుటుంబమే కాదు, కొన్ని వేల కోట్ల జీవితాలను ఆయనే నడిపిస్తున్నారు. "సాయీ! ఎప్పటికీ, ఎన్నటికీ మీ కరుణ ఇలాగే నా మీద, నా కుటుంబం మీద, మీ భక్తులందరి మీద ఉండాలి. నేను మీ బాటలోనే పయనించేలా, నీతికి, నిజాయితీకి కట్టుబడి ఉండేలా, కోపాన్ని, అసహనాన్ని అదుపు చేసుకొని శ్రద్ధ-సబూరీతో ఉండగలిగేలా ఆశీర్వదించండి".

సమస్యను పరిష్కరించిన బాబా


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. నా పేరు అనూష. 2024లో మా పిల్లలకి ఒంటిపూట బడి మొదలైనా నేను పనిచేసే స్కూల్లో ఒంటిపూట పెట్టకుండా సాయంత్రం వరకూ ఉన్నందున నాకు బాగా ఇబ్బంది అయింది. అందువల్ల సహాయం కోసం మా అత్తయ్యని రమ్మని పిలిస్తే, ఆమె వచ్చింది. ఆమె ఏప్రిల్ నెలలో పింఛను కోసం ఆంధ్ర వెళ్లి, పింఛను తీసుకొని వచ్చింది. ఆమె ఆ డబ్బులు మమ్మల్ని తీసుకోమంటే, మేము వద్దన్నాము. అయినా ఆమె డబ్బులు నా చేతిలో పెట్టింది. నేను ఆమె ఇచ్చిన డబ్బులు ఆమెకే తిరిగి ఇచ్చేసాను. అయితే మే నెల వచ్చాక ఆమె నా డబ్బులన్నీ మీకే ఇచ్చాను అనింది. నేను డబ్బులు తీసుకోలేదని నాకు గుర్తు ఉన్నప్పటికీ ఆమె, "లేదు, తీసుకున్నావు. బీరువాలో పెట్టావు" అనింది. బీరువా అంతా చూసినా ఆ డబ్బులు కనిపించలేదు. మావారు, "నువ్వు ఎందుకు తీసుకున్నావు? ఒకవేళ తీసుకోకపోయినా కూడా నీ డబ్బులు తనకి ఇచ్చేయ్. నేను మాత్రం ఇవ్వను" అని అన్నారు. నాకు ఏమీ తోచక వెంటనే "బాబా! నేను ఆమె డబ్బులు తీసుకున్నానో, లేదో నాకు గుర్తు రావట్లేదు. నేను అ డబ్బులు తీసుకొని ఉంటే, కనిపించేలా చేయి. తీసుకోలేదంటే మా అత్త నా దగ్గరే ఉన్నాయిలే అనేలా చేయి బాబా" అని బాబాను వేడుకున్నాను. మర్నాడు మా అత్త "డబ్బులు నా దగ్గరే ఉన్నాయి. నువ్వు మళ్ళీ నాకే ఇచ్చేసావు. నాకు ఆ విషయం గుర్తులేదు, మర్చిపోయాను" అని అంది. అలా బాబా నా సమస్య తీర్చారు. "ధన్యవాదాలు బాబా.  ఎప్పుడూ మాకు తోడుగా ఉండి మమల్ని ముందుకు నడిపించండి బాబా. నా కోరిక తీరేలా చేయి బాబా. ప్రతి చిన్న సమస్యను తీర్చి మా బాధని దూరం చూస్తూ మీపై ఇంకా ఇంకా నమ్మకం పెంచుతున్న మీకు శతకోటి నమస్కారాలు బాబా“.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo