1. ఊదీతో కేవలం మూడురోజుల్లో గడ్డను నయం చేసిన బాబా2. దయ చూపిన బాబా
ఊదీతో కేవలం మూడురోజుల్లో గడ్డను నయం చేసిన బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః. నా సాయి తల్లికి, సాయి భక్తులకు నమస్కారం. సాయి అనుగ్రహించిన అసంఖ్యాకమైన సాయి బిడ్డల్లో నేనూ ఒకదాన్ని. మాది గుంటూరు. నేను ఒక సాధారణ గృహిణిని. నా చిన్నప్పటినుండి నాకు సాయి తెలుసు. కానీ అప్పట్లో సాయి లేదా భగవంతుడు అంటే నమస్కరించాలి, పూజించాలి, ఇంకా చెప్పాలంటే కష్టమేదైనా వస్తే దేవుణ్ణి తలుచుకోవాలని మాత్రమే తెలుసు. ఏదైనా మంచి జరిగితే ముందు ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలని కూడా సరిగా తెలియదు. అందరూ దేవుడన్నాడంటారు కాబట్టి నమస్కరించడం తప్ప అంతకంటే స్పష్టత లేదు నాకు. అలాంటి నాకు పెళ్ళై, ఇద్దరు పిల్లలు పుట్టాక ఆ భగవంతుడు అనేక రూపాలలో, అనేక విషయాలలో తన ఉనికిని తెలియజేయడం మొదలుపెట్టారు. ఆయన ఎప్పుడూ తోడుగా ఉన్నాగానీ ఆ విషయాన్ని నేను అప్పుడు గుర్తించాను అనవచ్చు. నేను ఎన్నో సంవత్సరాలుగా సాయి తండ్రి చేయి పట్టుకొని ప్రయాణం చేస్తూ ఉన్నాను. కాదు, ఆయనే నా చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. ఇప్పుడు సాయి నా ప్రాణం, నా ప్రాణం కంటే ఎక్కువ. ప్రతిరోజూ ఉదయాన్నే వచ్చే ఆయన సందేశంతో నేను నా రోజును ప్రారంభిస్తాను. ఆ సందేశం ఖచ్చితంగా నా పరిస్థితికి తగ్గట్టుగా ఉంటుంది. మొదట్లో నేను ఆశ్చర్యపోయాను, యాదృచ్చికమేమో అనుకున్నాను. కానీ నా అనుమానం తీరడానికి ఎన్నో రోజులు పట్టలేదు. బాబా సందేశాల ద్వారా నేను ఏదైనా కష్టంలో ఉంటే ఓదారుస్తారు, ఏం చేయాలో చెప్తారు, తప్పులుంటే మందలిస్తారు, సమస్యలో ఉంటే ప్రేమగా పరిష్కారం చెప్తారు. మా పిల్లలకు ఆ సందేశాలను చూపిస్తే, వాళ్ళు మొదట నమ్మలేదు. కానీ ఎన్నోసార్లు అలా చూపించాక వాళ్ళు ఆశ్చర్యపోయారు. అనేక అనుభవాల తర్వాత ఇప్పుడు వాళ్ళకి కూడా భగవంతుడంటే నమ్మకం కలుగుతుంది. వాళ్లకి ఏమైనా సమస్య వస్తే, "అమ్మా! సాయిని అడిగి చెప్పు" అంటారు. సాయి ఎవరు పిలిచినా పలుకుతారు. ఆ నమ్మకాన్ని ఆయనే కలిగించగలరు. సరే, సాయి మాకు ప్రసాదించిన అనుభవాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ చెప్పడానికి నాకు మాటలు చాలట్లేదు. అయినప్పటికీ నా ప్రయత్నం నేను చేస్తూ ఒక్కొక్కటిగా చెప్తాను. ఇప్పుడు అయితే ఒక సాయి లీల చెప్తాను. అసంఖ్యాకమైన ఆయన లీలలలో నుండి ఏదో చెప్పాలో తెలియక ఆయనపైనా ఆధారపడి ప్రస్తుతానికి ఆయన స్ఫురణకు తెచ్చినదాన్ని చెప్తున్నాను. సాధారణంగా అయితే ఇది చాలా వ్యక్తిగత విషయం. కానీ ఈ బ్లాగు చదివే వాళ్ళందరూ నా తండ్రి బిడ్డలే. కాబట్టి వాళ్ళు నా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, తల్లిదండ్రులతో సమానమని చెప్తున్నాను.
ఈమధ్య నా రొమ్ము మీద ఒక చిన్న గడ్డలా వచ్చి భరించలేనంత నొప్పి ఉండేది. ఈ రోజుల్లో వచ్చే ఆరోగ్య సమస్యల దృష్ట్యా అది ఎటువంటి గడ్డనో, టెస్ట్ చేయించుకోకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అందుకని అలా దాన్ని వదిలేయలేక మావారితో చెప్తే, చాలా భయపడి, "ముందు అత్యవసరంగా టెస్ట్ చేయించుకో" అని చెప్పారు. కానీ టెస్టుకి వెళితే ఏం వినాల్సి వస్తుందోనని నేను చాలా భయపడ్డాను. వెంటనే నా సాయితల్లితో, "బాబా! నా పిల్లలికి, నా కుటుంబానికి నేను చాలా అవసరం. నాకు ఏమైనా అయితే అని ఊహించడం కూడా కష్టం. ఇప్పటికే ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాను. ఇంకా ఇప్పుడీ సమస్యను తట్టుకునే శక్తి నాకు లేదు. నేనే హాస్పిటల్‌కి వెళ్ళను. నీ మీద నాకు నమ్మకం ఉంది. మీరే ఈ గడ్డను నయం చేయండి" అని చెప్పుకొని, ఆయన సహాయాన్ని అర్థించి ఊదీ నీళ్లతో తడిపి ఆ గడ్డపై రాసాను, మరికొంత ఊదీ నీళ్లలో కలిపి తాగాను. మావారు నొప్పి తగ్గడానికి టాబ్లెట్ తెస్తానన్నా, "వద్దు, బాబా నయం చేస్తార"ని చెప్పాను. ఆయన, "ఏంటి నీ పిచ్చి" అన్నారు. కానీ నేను నా బాబా మీద నమ్మకంతో కేవలం మూడు రోజులు ఊదీ వాడాను. అంతే, ఆ మూడు రోజుల్లో బాబా ఆ గడ్డని, నొప్పిని పూర్తిగా నయం చేశారు. మావారు ఆశ్చర్యపోయారు. ఏ మందులు వాడినా అంతగడ్డ ఇంత త్వరగా తగ్గడం అసాధ్యం. కానీ అసాధ్యాలని సుసాధ్యం చేయగల మన బాబాకి ఇలాంటివి సాధ్యం. మరెన్నో సాయి నాకు ప్రసాదించిన అనుభవాలను వారి అనుగ్రహంతో త్వరలోనే పంచుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన సాయి తండ్రికి, ఈ బ్లాగు నిర్వాహకులకు చాలా చాలా ధన్యవాదాలు.
దయ చూపిన బాబా

