1. శ్రీసాయి అనుగ్రహం
2. బాబాని భక్తితో అడిగితే కోరిక నెరవేరకుండా ఉంటుందా? - అయన దయామయుడు
శ్రీసాయి అనుగ్రహం
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు శిరీష. మా అమ్మాయి 2024లో పదో తరగతి పరీక్షలు వ్రాసింది. తను బాగా చదువుతుంది కానీ 2024, జనవరి నుంచి తను చాలా ఆందోళనగా ఉంటుండేది. స్కూలుకి వెళ్లడానికి కూడా ఇష్టపడేది కాదు. ఇంకా కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వచ్చి ఫిబ్రవరి నుండి స్కూల్ కూడా మాన్పించాల్సి వచ్చింది. మార్చిలో పరీక్షలు ఉన్నప్పటికీ తను రోజూ ఫోన్ చూస్తూ టైమ్ పాస్ చేస్తుండేది. బాగా చదివే తను టెన్షన్ వల్ల అస్సలు చదవకుండా ఆరోగ్య సమస్యలు కూడా తెచ్చుకుందని నాకు చాలా బాధేసింది. తను అసలు పరీక్షలు వ్రాస్తుందా, లేదా అనిపించి, "తను పరీక్షలు వ్రాయగలిగితే, తనని మీ దర్శనానికి శిరిడీ తీసుకొస్తాన"ని బాబాతో చెప్పుకొని రోజూ, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః', 'ఓం శ్రీసాయి ప్రశాంత చిత్త ప్రదాయ నమః' అనే నామాలు 108 సార్లు జపిస్తుండేదాన్ని. బాబా దయవల్ల తను పరీక్షల ముందు చదవడం మొదలుపెట్టి చాలా టెన్షన్ పడుతూ పరీక్షలు వ్రాసింది. నేను అయితే తను టెన్షన్ వల్ల పరీక్షలకి వెళ్ళదు, వెళ్లినా సరిగా వ్రాయదనుకున్నాను. కానీ తను అన్ని పరీక్షలు వ్రాసింది. అప్పుడే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుందామనుకున్నాను కానీ, మర్చిపోయాను. ఫలితాలు వెలువడ్డాక చూస్తే, తనకి చాలా మంచి మార్కులు వచ్చాయి. అయినా నేను నా అనుభవాన్ని వ్రాయలేదు. తర్వాత ఏప్రిల్ నెలాఖరులో మా బాబు పరీక్షలు వ్రాసాడు. తనకి రేపు పరీక్ష ఉందనగా ముందురోజు సాయంత్రం ఎన్నిసార్లు ఫోన్ చేసినా తను కాల్ ఎత్తట్లేదని నా భర్త అన్నారు. అప్పుడు నేను ప్రయత్నించాను. తను నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. నాకు చాలా భయమేసి, "బాబా! వాడికి ఏమీ కాకుండా చూడు. ఒక 30 నిమిషాల్లో వాడు నాకు ఫోన్ చేయాలి" అని అనుకొని 'ఓం శ్రీసాయి ఆపద్బాంధవాయ నమః' అని జపిస్తూ ఉండగా మా పాప అనుభవం పంచుకుంటాననుకున్న విషయం గుర్తు వచ్చి పేపర్ తీసుకొని వ్రాయడం మొదలుపెట్టగానే మా బాబు ఫోన్ చేశాడు. అప్పుడు నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. "థాంక్యూ బాబా".
బాబాని భక్తితో అడిగితే కోరిక నెరవేరకుండా ఉంటుందా? - అయన దయామయుడు
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య. 2024, మార్చి 28న మా అమ్మ మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవడానికి హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది. అయితే అదేరోజు శస్త్రచికిత్స చేస్తామన్నవాళ్ళు మూడురోజులైనా చేయలేదు. నాకు ఆందోళనగా అనిపించి బాబాని, "బాబా! త్వరగా శస్త్రచికిత్స జరిగేలా చూడండి" అని వేడుకున్నాను. మర్నాడే అమ్మకి శస్త్రచికిత్స జరిగి విజయవంతమైంది. బాబాని భక్తితో అడిగితే కోరిక నెరవేరకుండా ఉంటుందా? అయన దయామయుడు. "ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ మీ కృప మా మీద ఉంచండి".

