సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1858వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శ్రీసాయి మహావైద్యుడు

నా పేరు సాయీశ్వర్. నాకు ఊహ సరిగా తెలియక ముందు నుంచే నేను శ్రీ శిరిడీ సాయిబాబా భక్తుడిని, శిష్యుణ్ణి, బిడ్డని. ఏ జన్మబంధమో తెలియదు కానీ, నా చిన్ననాటి నుండి ఆయన ప్రేమలో నన్ను నిలుపుకున్నారు. నా చిన్ననాటి నుండి ఇప్పటివరకు నా జీవితం ఆయన లీలలతో, మహిమలతో నిండిపోయింది. అనుక్షణం ఆయన మార్గదర్శకత్వం నన్ను నడిపిస్తూ ఉంది. నేనిప్పుడు ఈ మధ్యకాలంలో నా జీవితంలో సాయినాథుడు చేసిన ఒక పెద్ద లీలను మీతో పంచుకుంటున్నాను. 2024, ఏప్రిల్లో నాకు బ్యాక్ పెయిన్ వస్తే, ఒకసారి చూపించుకుందామని హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించమంటే, చేయించుకొని రిపోర్టు తీసుకొని మళ్ళీ డాక్టర్ వద్దకి వెళ్ళాను. అప్పుడొక ఊహించని విషయం బయటపడింది. డాక్టరు, "మీ గాల్ బ్లాడర్(పిత్తాశయం)లో 9mm గడ్డ(పాలిప్) ఉంది. సర్జరీ చేసి గాల్ బ్లాడర్ తొలగించాల"ని చెప్పారు. ఇంకా 'గాల్‌బ్లాడర్‌లో ఏర్పడే రాళ్లకి, కణతలకి మందులతో చికిత్స ఉండదని, సర్జరీనే మార్గమని' తెలియజేశారు. నేను నిర్ఘాంతపోయి వేరే డాక్టర్ దగ్గరకి వెళ్లాను. ఆ డాక్టరు కూడా అదే చెప్పి, "సర్జరీ చేస్తేనే మంచిది. లేకపోతే ఆ గడ్డ పరిమాణం నిదానంగా పెరిగి పగిలిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు, గడ్డని అలాగే వదిలేస్తే క్యాన్సర్‌గా పరిణమించే అవకాశాలు కూడా ఉన్నాయ"ని చెప్పారు. నేను ఇంటికి వచ్చి అనుకోని సమస్య తలెత్తిందని చాలా బాధపడ్డాను. బాబా దగ్గరికి వెళ్లి, "ఏమిటి బాబా ఇది? పెద్దపెద్ద పాపాలు చేసినవాళ్ళు కూడా ఈ కలియుగంలో ఆయురారోగ్యాలతో జీవిస్తున్నారే! నాకు తెలిసి నేను ఈ జన్మలో ఎవరినీ ఇబ్బందిపెట్టలేదే! అంత పాపకార్యాలు కూడా ఏమీ చేయలేదు. గత జన్మలో ఏమి చేశానో నాకు తెలియదు. కనీసం మందులకి కూడా నయమవదంటున్నారే! ఏకంగా పిత్తాశయం తీసేయాలంటున్నారు. భగవంతుడు మానవదేహంలో ఏ అవయవమూ ఊరకనే పెట్టలేదు కదా! ఆ అవయవం తొలగిస్తే తరువాత వచ్చే సమస్యలను జీవితాంతం ఎదుర్కోవాలి కదా! నాకేమిటి బాబా చిన్న వయసులో ఈ సమస్య?" అని దీనంగా నా ప్రియతమ గురుదేవుడైన సాయికి, నా ఆరాధ్య దైవాలైనా శివశక్తులకు, నా ఇంటి దైవమైన ఆంజనేయస్వామికి చెప్పుకున్నాను. ఇంకా, "మీరే ఈసారి ఏదో పెద్ద మహిమ చేయాలి బాబా. ఆ గడ్డ మాయం చేసేయడం తప్ప వేరే ఏ ప్రత్యామ్నాయం లేదు" అని బాబాని వేడుకున్నాను. నాకు సాయినాథుడు ఏదో పెద్ద మహిమ చేస్తారని 30% నమ్మకమున్నప్పటికీ నాకొచ్చిన సమస్యకి మందులతో చికిత్స లేకపోవడం వల్ల 70 శాతం అసాధ్యం అనిపించింది. మా అమ్మకి మాత్రం సాయినాథుడు ఏదో మహిమ చేస్తారని 100% నమ్మకం ఉండింది. కారణం అదివరకే ఇంతకంటే పెద్ద అనారోగ్య సమస్యతో చివరి దశ వరకు వెళ్లిన నన్ను ఆ సాయీశ్వరుడు విచిత్రంగా బయటపడేసారు(ఆ అనుభవాన్ని మరోసారి పంచుకుంటాను). అందువల్ల మునపటిలాగే నన్ను సమస్య నుండి సాయినాథుడు బయటపడేస్తారని మా అమ్మ నాకు ధైర్యం చెప్పింది. నేను కూడా మొదట కాస్త బాధకి గురైన నా మనసుని సాయీశ్వరుడు ప్రసాదించిన ఆధ్యాత్మిక జ్ఞానంతో దృడం చేసుకోసాగాను. ఆ సమయంలో ఫేస్బుక్లో పదేపదే "నా చరిత్ర పారాయణం చేస్తూ ఊదీ రాస్తూ ఉండు. నీ రోగం నయం అవుతుంది", "నేను ఉండగా నీకు భయమేలా? నీ అనారోగ్యం నయం అవుతుంది" అని రకరకాలుగా బాబా నాకు అభయ ప్రదానం చేస్తూ వచ్చారు. మరో వైపు మా అమ్మకి, "నా బిడ్డలని రకరకాల మిషలతో శిరిడీ రప్పించుకుంటాను", "మీరు శిరిడీ రావడానికి అన్ని ఏర్పాట్లు చేసాన"ని సందేశాలు వస్తుండేవి. దాంతో అమ్మ బాబాతో, "మా అబ్బాయికి నయమైపోతే శిరిడీ వస్తామ"ని చెప్పుకుంది. నేను ప్రతిరోజూ సాయిలీలామృతం కొంచెం కొంచెం చదువుతూ శిరిడీ ఊదీ చేతిలో పట్టుకుని సాయి నామం, మృత్యుంజయ మంత్రం స్మరించి సాయిని ధ్యానించి కొద్దిగా నుదుటన పెట్టుకొని, కొద్దిగా గాల్ బ్లాడర్ వద్ద రాసుకొని, మరికొంత ఊదీ గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగుతూ ఉండేవాడిని. అలా పదిరోజులు చేసిన తరువాత మా ఊరికి కాస్త సమీపంలో ఉన్న మెడికల్ కాలేజీతో కూడుకున్న ఒక పెద్ద హాస్పటల్లో లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తారనే సమాచారం తెలుసుకొని అక్కడికి వెళ్దామని నిర్ణయించుకున్నాము. నా మనసులో బాబా ఏదో పెద్ద మహిమ చేయబోతున్నారన్న ఆలోచన ఉండబట్టి హాస్పటల్‌కి వెళ్లేముందు మా ఇంట్లో ఉన్న పెద్ద బాబా పటం వద్దకి వెళ్లి, "బాబా! హాస్పిటల్లో టెస్టులు చేయవచ్చు. వాటిలో ఆ గడ్డ మాయం చేసేయ్ బాబా. రిపోర్టులో అంతా బాగానే వచ్చేటట్లు అనుగ్రహించు తండ్రీ. లేదు నాకు ఆపరేషన్ జరగడమే మంచిదని నీవు తలస్తే అలాగే జరగనివ్వు" అని బాబాను వేడుకున్నాను. తర్వాత పార్వతీపరమేశ్వరులకి, ఆంజనేయస్వామికి కూడా నమస్కారం చేసుకుని బస్సులో హాస్పటల్‌కి బయలుదేరాను.


నేను ఈ మధ్యకాలంలో 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ని అనుసరిస్తున్నాను. అందులో చాలామంది అనుభవాలు చదివినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించేది. కొన్ని కొన్ని అనుభవాలలో 'బాబా కనపడని వస్తువు కనపడితే' లేదా మరీ చిన్నచిన్న వాటికి కూడా 'అలా జరిగితే బ్లాగులో అనుభవం పంచుకుంటాన'ని బాబాకి మ్రొక్కే మొక్కులు చూసి, 'ఎందుకు చిన్నచిన్న విషయాలకు కూడా బాబాని ఇబ్బందిపెడుతున్నారు? మనకి బాబా చేసే ఉపకారం బ్లాగ్ ద్వారా పదిమందికి పంచుకుని ఆయన కీర్తిప్రతిష్టలను, శక్తిసామర్థ్యాలను, ఘనతను నలుదిక్కుల చాటి కష్టాలలో కృంగిపోతున్న సాయి భక్తుల హృదయాలలో బాబా మమ్మల్ని కాపాడి తీరుతారనే ఆశాజ్యోతిని ప్రతిష్టించాలని, వారిలో ధైర్యం నింపాలనే సద్భావన ప్రతి సాయి భక్తునికి ఉండాలి కానీ, కేవలం వ్యాపార ధోరణితో అది, ఇది జరిగితే నీ గురించి బ్లాగులో చెప్పుకుంటానని భావించడం నిజమైన సాయి భక్తుని లక్షణం కాదని, సాయిని తల్లిగా, తండ్రిగా, గురువుగా, దైవంగా తలచి ప్రేమబంధాన్ని పెనవేసుకొని తమని శరణుజొచ్చిన వారిని ఆధ్యాత్మికంగా ఉద్ధరించడం, ప్రాపంచికంగా కష్టాలలో నష్టాలలో వెంట నిలబడడం తండ్రిగా సాయి కర్తవ్యం అవుతుంది గాని, కేవలం కోరికలు తీర్చుకోవడం కోసం సాయిని ఒక యంత్రంలా వాడుకోవడం సరి అయిన పద్ధతి కాదని' నాకు అనిపిస్తుండేది. ఇది నా అభిప్రాయం. ఎవరినైనా బాధిస్తే నన్ను క్షమించండి.


ఇక విషయానికి వస్తే..  నేను బస్సులో ప్రయాణిస్తూ ధ్యానంలో బాబాని, "గడ్డ మాయం చేయమ"ని ఇంకా, "బాబా! ఈ గడ్డను మాయం చేస్తావని నాకనిపిస్తుంది. ఒకవేళ నిజంగా మాయం చేస్తే, ఇది చాలా గొప్ప మహిమ. అదే జరిగితే, కేవలం ఈ మహిమనే కాదు, నా జీవితంలో ఇప్పటివరకు మీరు చేసిన గొప్ప మహిమలన్నీ మీ బ్లాగులో పంచుకుంటాను. అనారోగ్యం తగ్గిస్తే, పంచుకుంటానని బేరాలు ఆడడం కాదు. ఇంతటి గొప్ప మహిమలను పంచుకోవడం ద్వారా సాయి భక్తులందరికీ ఊరట కలుగుతుంది. మీ ఘనతను నలుదిశలా విస్తరింపజేసి చిన్న సేవ చేసుకునే భాగ్యం నాకు లభిస్తుంది" అని బాబాకి విన్నవించుకున్నాను. హాస్పటల్కి చేరుకున్న తర్వాత డాక్టర్లు నా రిపోర్టు చూసి సర్జరీ చేయడానికి ముందు మరోసారి స్కాన్ చేయాలని స్కానింగ్ రాశారు. సరేనని స్కాన్ చేయించుకుంటే స్కాన్ చేసే డాక్టర్కి ఏమీ అర్థం కాలేదు. కారణం మునపటి రిపోర్టులో స్పష్టంగా కనపడుతున్న గడ్డ అప్పుడు కనపడలేదు. దాంతో ఆ డాక్టరు, "ఇదేంటి?" అని వెళ్లి ఇంకో డాక్టర్ని తీసుకొచ్చాడు. ఆ డాక్టరు కూడా గడ్డ కనపడలేదన్నారు. తర్వాత వాళ్లిద్దరూ వెళ్లి ఇంకో పెద్ద డాక్టర్ని తీసుకొచ్చారు. ఆ డాక్టరుకి కూడా గడ్డ కనపడలేదు. దాంతో, "ఏ హాస్పిటల్లో స్కాన్ చేయించుకున్నార"ని నన్ను ప్రశ్నించి, వాళ్లలో వాళ్ళు, "గడ్డ ఏమీ కనపడట్లేదు. మరీ వాళ్ళు 9 mm గడ్డ ఉందని ఎలా వ్రాస్తార"ని చర్చించుకున్నారు. కొద్దిసేపట్లో ఆ ముగ్గురి నేతృత్వంలో స్కానింగ్ రిపోర్ట్ వచ్చింది. అది తీసుకొని వెళ్ళి ప్రధాన డాక్టర్ని కలిసాము. ఆ డాక్టరు, "గడ్డ ఏమీ లేదుగాని గాల్‌బ్లాడర్ మాత్రం కొద్దిగా వాచింది. అది దానంతటదే తగ్గిపోతుంద"ని చెప్పారు. నేను, "సర్జరీ అవసరం లేదా?" అని అడిగితే డాక్టరు, "అసలు గడ్డే లేకపోతే సర్జరీ అవసరం ఏముంది? మీకు ఇంకా స్పష్టంగా తెలియాలంటే ఖాళీ కడుపుతో స్కాన్ చేయించుకోవాలి" అని అన్నారు. నేను, "ఖాళీ కడుపుతోనే ఉన్నాన"ని చెప్పాను. డాక్టరు, "అయితే గడ్డ లేనట్లే. మీకు ఇంకా అనుమానం ఉన్నట్లయితే పెద్ద(MRI) స్కాన్ చేయించుకొండి. కానీ అది అవసరం లేద"ని చెప్పారు. నా జీవితంలో బాబా చేసిన అతి పెద్ద లీలకి మేము మరోసారి ఆనందాశ్చర్యాలకు గురయ్యాము. బాబాపై ప్రేమ ఉప్పొంగగా ఆనందాశ్రువులు నా కళ్ళనుండి ప్రవహించాయి. పెద్ద గండం నుంచి సాయి, ఈశ్వరులు మమ్మల్ని బయటకు లాగారని ఆనందంగా ఇంటికి వచ్చాము. తర్వాత ఆలోచిస్తే, ముందు స్కాన్ చేసే రేడియాలజిస్ట్ పొరపడ్డారని తలవడానికి కూడా లేకుండా కొత్త రిపోర్టులో గాల్‌బ్లాడర్కి కొద్దిగా వాపు ఉందని, అది లేకుంటే డాక్టరు పొరబడ్డారని తలచేవాడినని, అందుకే బాబా ఆ వాపు ఉంచారనిపించి అంతా బాబా మహిమ అనుకున్నాను. అయితే సాయంత్రం మళ్ళీ నా కోతి మనసు భయానికి గురై డాక్టర్లు ఏమైనా పొరబడి గడ్డ లేదన్నారేమోననిపించింది. అప్పుడు మా అమ్మ, "ఈ రెండు రిపోర్టులు తీసుకొని వెళ్లి రేపు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ని సంప్రదించు. వాళ్ళు మంచి అనుభవం ఉన్నవారు కదా!" అంది. నేను సరేనని, మరుసటిరోజు గవర్నమెంట్ డాక్టర్ని కలిస్తే, "పెద్ద స్కాన్ తీయించమ"ని సూచించారు. దాంతో MRI స్కాన్ చేయించుకున్నాను. ఆ రిపోర్టు చూసిన డాక్టరు, "గడ్డ లేదు. నిన్నటి రిపోర్టులో ఉన్న వాపు కూడా లేదు. అంతా నార్మల్‌గా ఉంది. నీకు ఏ సమస్యా లేదు. ఇక ఏ హాస్పటల్కి వెళ్ళనవసరం లేద"ని అని అన్నారు. సాయినాథుని ఋణం ఏమిచ్చినా, ఏమి చేసినా తీర్చుకోలేము. ఆ గడ్డని కేవలం ఆయన అనుగ్రహంతో ఎటువంటి మందులు వాడకుండానే మాయం చేసారు. సాయిలాంటి గొప్ప గురువు, పిలిస్తే పలికే దైవం లేరని ఎప్పుడూ బలంగా అనిపిస్తుంటుంది. సాయినాథుడు, ఆ పరమేశ్వరుడు తోడుంటే విశ్వమంతా ఎదురు తిరిగినా ఒంటి చేతితో పోరాడవచ్చు అనే భావన నిరంతరం నాలో కలుగుతుంటుంది. ఆ పరమేశ్వరుని కలియుగ గురుస్వరూపమైన శ్రీసాయికి ధన్యవాదాలు.


 అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!

17 comments:

  1. Om Sai Ram 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha

    ReplyDelete
  3. 🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Om Sai Ram 🙏🙏🙏

    ReplyDelete
  5. సాయి మహిమ అద్భుతం, అపారం, కరుణామృతం 🙏
    సాయినాధ్ మహారాజ్ కీ జై..
    🌹🙏🙏🙏🌹

    ReplyDelete
  6. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  7. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  8. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 💐💐💐💐

    ReplyDelete
  9. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐

    ReplyDelete
  10. Om Sri Sai Raksha🙏🙏🙏
    Om Sri Sai Aarogyakshemadhaaya Namaha🙏🙏🙏

    ReplyDelete
  11. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi

    ReplyDelete
  12. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  13. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  14. ఓం సాయిరామ్

    ReplyDelete
  15. madava bharam antha meede baba. maa attgarini nannu kalapandi baba

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo