సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1854వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కోరుకున్నట్టు పసుపు రంగు వస్త్రాల్లో దర్శనమిచ్చిన బాబా
2. బాబా దయ అపారం

కోరుకున్నట్టు పసుపు రంగు వస్త్రాల్లో దర్శనమిచ్చిన బాబా


నేను ఒక సాయిభక్తురాలిని. గత 4 సంవత్సరాల నుండి నేను నా నాన్న సాయినాథుని నమ్ముకొని బ్రతుకుతున్నాను. నాలుగు సంవత్సరాలుగా నా వివాహాం గురించి నా నాన్నని అడుగుతూ, ఆయన నా వివాహం చేస్తారని నమ్మకంతో ఉన్నాను. 2024, ఏప్రిల్ 3న నా స్నేహితురాలి పెళ్ళికి కరీంనగర్ వెళ్ళాను. అక్కడినుండి సాయినాథుని దర్శనార్థం మంచిర్యాలలో నా నాన్న సాయినాథుడు ఇచ్చిన అక్క ఇంటికి వెళ్ళాను. అక్కడ నా నాన్న నన్ను అక్క రూపంలో తమ సొంత మనిషిలా చూసుకుని, నా బాధను అర్థం చేసుకొని నా వివాహం విషయంగా నాకు ధైర్యం చెప్పారు. ఆరోజు అక్క వాళ్ళింట్లో నాకన్నీ సాయి అనుభూతులే. నా చుట్టూ సాయి ఆవరించి ఉన్నట్లు అనిపించింది. నా మనసులో ఎప్పుడూ 'ఎప్పుడైనా మంచిర్యాలలో బాబా దర్శనానికి వెళ్లినప్పుడు ఆయన పసుపు రంగు వస్త్రాలలో కనిపించాలని ఉండేది. అందుచేత నేను నాన్నని, "నాన్నా! నేను నీ బిడ్డను అయితే, నువ్వు ఈ నెలలోపు నా వివాహం కుదిరించినట్లైతే గుడిలో పసుపు రంగు వస్త్రాలలో దర్శనమివ్వు" అని మనసులో గట్టిగా అడిగాను. అదే విషయం రాత్రి పడుకునేటప్పుడు అక్కతో చెప్తే, "సానుకూలంగా ఉండు. రేపు నీకోసం సాయి పసుపు రంగు వస్త్రాల్లో కనిపిస్తారు. నువ్వు సంతోషిస్తావు. ఈ నెలలో పెళ్లి కూడా నిశ్చయమవుతుంది" అని అక్క నాకు ధైర్యం చెప్పింది. నేను అదే ధైర్యంతో నిద్రపోయాను. మరుసటిరోజు తెల్లవారగానే నేను నా ఫోన్‌‌లో శిరిడీలోని బాబా ఫోటో చూస్తే, సాయి పసుపురంగు వస్త్రాల్లో ఉన్నారు. నేను, అక్క చాలా సంతోషపడ్డాం. తర్వాత బాబా గుడికి వెళితే, అక్కడ కూడా బాబా పసుపు రంగు వస్త్రాల్లో దర్శనమిచ్చారు. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను ఇది నిజమా, కాదా అని ఆలోచనలో పడ్డాను. అంతా ఒక భ్రమలా అనిపించింది. నేను ఆరోజు మధ్యాహ్న హారతిలో పాల్గొన్నాను. ఆ సమయంలో నా ఒళ్ళంతా పులకరించిపోయింది. నాకు తెలియకుండానే నేను చాలా భావోద్వేగానికి లోనయ్యాను. ఇది నా జీవితంలో ఒక పెద్ద మిరాకిల్. నేను ఈ ఏప్రిల్ నెలలో నా పెళ్లి నిశ్చయమవుతుందని అనుకున్నాను కానీ, కాలేదు. ఇక నేను నా వివాహం బాబా చరణాలకే వదిలేసాను. ఇంకా ఇంకా నేను ఆయన్ని అడగలేకపోతున్నాను. "బాబా! నా కోరిక విని అందుకు తగ్గట్టు నాకు దర్శనమిచ్చినందుకు నేను మీకు చాలా ఋణపడి ఉంటాను. ఎల్లవేళలా నాకు తోడుండు నాన్నా. నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు నాన్నా. నన్ను తన సొంత తోబుట్టువుల చూసుకున్న అక్క, అన్నలకి వాళ్ళ కుటుంబానికి మీ అనుగ్రహం నిరంతరం ఉండాలని, వారి కోరికలు నెరవేర్చి, బాధలు తీర్చాలని కోరుకుంటున్నాను".

బాబా దయ అపారం


సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. 2024, ఏప్రిల్ నెల చివరి వారంలో నేను ఒక మాల బుక్ చేశాను. దానికి డబ్బులు కూడా కట్టినప్పటికీ ఎన్ని రోజులైనా ఆ మాల రాలేదు. బుక్ చేసిన వాళ్లతో మాట్లాడితే, “మీరే చెక్ చేసుకోండి” అన్నారు. కొరియ‌ర్‌వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు. అటువంటి స్థితిలో నేను బాబాకి దణ్ణం పెట్టుకొని, "ఆ మాల వచ్చేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. అలా వేడుకున్న రెండు రోజుల్లోనే కొరియర్ వచ్చింది. "థాంక్యూ సో మచ్ బాబా".


మావారు రెండు రాత్రిళ్ళు గదిలో ఏసీ ఎక్కువగా వేయడం వల్ల నేను గొంతునొప్పితో చాలా బాధపడ్డాను. అప్పటికే ఇతరత్రా సమస్యలకు మందులు వాడుతుండటం వల్ల కొత్తగా గొంతునొప్పికి కూడా మందులు వేసుకోవడం ఇష్టంలేక రాత్రి పడుకునే ముందు ఊదీ తీసుకుని, "తగ్గేలా దయ చూపమ"ని బాబాకి దణ్ణం పెట్టుకొని పడుకున్నాను. ఆశ్చర్యంగా పొద్దున్న లేచేసరికి గొంతునొప్పి మాయమైపోయింది. "థాంక్యూ సో మచ్ బాబా".


మా అన్నయ్య ఈ(2024) వేసవిలో పిల్లలు ఆడుకోవడానికి కోడి పిల్లల్ని కొని తీసుకొచ్చాడు. అందులో ఒక కోడి పిల్ల కాలుకి ఏం జరిగిందో తెలీదుగానీ అది చాలా కుంటుతూ ఉండేది. దాన్ని చూసి మా పెద్దపాప చాలా బాధతో డల్ అయిపోయింది. నాకూ బాధేసి, "బాబాకి దణ్ణం పెట్టుకొని ఊదీ రాయమ"ని అన్నాను. పాప నేను చెప్పినట్లే బాబాకి దణ్ణం పెట్టుకొని ఆ కోడిపిల్ల కాలికి ఊదీ రాసింది. రెండు గంటల్లో ఆ కోడిపిల్ల చలాకీగా నడుస్తూ, పరుగెడుతూ ఉండసాగింది. ఇలా ప్రతి విషయంలోనూ మాతో ఉండి నడిపిస్తున్నారు బాబా. బాబా దయ అపారం! "థాంక్యూ సో మచ్ బాబా. కేవలం మీ దయ, చల్లని చూపు వల్లనే మేము సంతోషంగా వున్నాము. మాకున్న రెండు సమస్యలను తీర్చండి బాబా ప్లీజ్".

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo