ఈ భాగంలో అనుభవాలు:
1. ఎన్నని చెప్పేది ఊదీ మహిమలు!
2. బాబా దయ
ఎన్నని చెప్పేది ఊదీ మహిమలు!
సాయిదేవుడికి, సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు రమాదేవి. నేనిప్పుడు 2025, మార్చి, ఏప్రిల్, మే నెలలలో బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. ఒకరోజు మా వారికి కిడ్నీలో స్టోన్ సమస్య వల్ల మూత్రవిసర్జనలో ఇబ్బంది అయింది. అయినా ఆయన ఆరోజు తప్పనిసరిగా ఆఫీసుకి వెళ్లాల్సి ఉండటం వలన వెళ్లి మధ్యాహ్నం ఇబ్బంది ఎక్కువయ్యేసరికి దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి వెళ్ళారు. డాక్టర్ చెక్ చేసి, "స్టోన్ పెద్దగా అవడం లేదా ఇంకేమైనా సమస్య కావచ్చు. ఆ విషయం తెలుసుకోవడానికి ఒక టెస్ట్ చేయాలి. కొద్దిసేపటి తర్వాత ఆ టెస్ట్ చేస్తాం. ఈలోపు మీరు నీళ్లు ఎక్కువగా తాగండి" అని చెప్పారు. మావారు కంగారుపడి టెస్ట్ చేయించుకోకుండానే పక్కనే ఉన్న బాబా గుడికి వెళ్ళి, కొద్దిగా ఊదీ సేవించి, "ఏ సమస్య లేకుండా నయం చేయండి" అని బాబాని వేడుకొని ఆఫీసుకి వెళ్ళిపోయారు. అక్కడ నీళ్లు ఎక్కువగా తాగి గంట తర్వాత మూత్రవిసర్జనకి వెళ్తే, మూత్రంలో ఒక రాయి పడింది. ఆ తర్వాత మావారు ఏ మాత్రమూ అసౌకర్యం లేకుండా ఇప్పటివరకు సంతోషంగా ఉన్నారు. అది ఊదీ మహిమ, బాబా కరుణ మాత్రమే. "శతకోటి నమస్కారాలు బాబా".
2025, ఏప్రిల్ 6, శ్రీరామనవమి రోజున నేను స్టవ్ మీద నుండి వేడి నీళ్లు దించుతుంటే తొణకడంతో మసులుతున్న నీళ్లు నా ఎడమ చేతి మీద పడ్డాయి. నేను విపరీతమైన మంటను తట్టుకోలేక వెంటనే నా చేయిని కొళాయి కింద చల్లని నీళ్లలో పెట్టి, తర్వాత ఐస్ కూడా పెట్టాను. మావారు ఏదో క్రీమ్ తెచ్చి రాసారు. అయినా మంట ఏ మాత్రం తగ్గలేదు. మేము అప్పటికే దత్తాత్రేయస్వామి గుడికి వెళదామనుకొని ఉన్నందువల్ల ఈ విషయంగా వెళ్లకుండా ఉండకూడదని ఇంట్లోవాళ్ళు వద్దంటు న్నా బయలుదేరి ముందుగా ఇంటి దగ్గరున్న బాబా గుడికి వెళ్ళి, బాబాకి నా బాధ చెప్పుకొని, ఊదీ లభ్యం కాకపోవడం వలన అగర్బత్తి పొడి చేతికి రాసి, ఆపై బాబా తీర్థం కూడా చేతికి రాసి, "ఇంకా ఈ మంట భరించలేను బాబా" అని అనుకున్నాను. బాబా, దత్తస్వామి దయవలన గంటలో దత్త గుడికి చేరే లోపు మంట పూర్తిగా తగ్గిపోయింది. "థాంక్స్ దత్తసాయి". ఇకపోతే, కాలిన గాయం తాలూకు మచ్చ చాలా పెద్దగా ఏర్పడింది. ఆ మచ్చను వారం తరువాత చూసినవాళ్ళు 'ఇది తగ్గటానికి ఎన్ని రోజులు పడుతుందో, ఏంటో!' అన్నారు. మా అమ్మ అయితే, "4, 5 నెలలు పడుతుందేమో! అసలు పూర్తిగా పోతుందో, లేదో!' అని అంది. నాకు భయమేసింది. నేను ఆ మచ్చకి క్రీమ్ ఒకటి, రెండు సార్లు రాశాను అంతే, వేరే ఏ మందు వాడలేదు. "బాబా! పూర్తిగా మచ్చ తగ్గిపోవాలి" అని బాబాకి చెప్పుకొని ఒక్కసారి ఊదీ రాసి, ఆఫీసుకి వెళ్ళాను. ఒక గంటలో చూస్తే, కొద్దిగా పైచర్మం ఊడిపోయి, లోపల నయమవుతున్నట్టు తెలిసింది నాకు. చాలా సంతోషంగా బాబాకి థాంక్స్ చెప్పుకున్నాను. తర్వాత 15 రోజులలో మొత్తం నయమైపోయింది. 25వ రోజుకి 95% చర్మంలో కలిసిపోయింది. నేను చెప్తే తప్పా వేరే వాళ్ళకి తెలియనంతగా చర్మం మామూలుగా అయింది. ఇది బాబా చేసిన అద్భుతం. ఊదీ పరమ ఔషధం. "మీకు శతకోటి కృతజ్ఞతలు బాబా".
ఒకరోజు స్విమ్మింగ్ పూల్‌లో మా బాబు చేయి గీసుకొని పోయి గాయమైంది. నేను ఏదైనా ఇనుప రాడ్ గీసుకుపోయిందేమో అనుకున్నాను కానీ, "స్విమ్మింగ్ పూల్‌లో ప్లాస్టిక్ రాడ్స్ మాత్రమే ఉన్నాయి, కాబట్టి ప్రాబ్లం లేదు" అని అయోడిన్ వేశారు.. నేను ఒక క్రీమ్ కొని గాయం మీద రాసాను కానీ, కొంచం కూడా తగ్గలేదు. అప్పుడు నేను, "అస్సలు తగ్గడం లేదేంటి బాబా" అనుకున్నాను. వెంటనే ఊదీ రాయలేదని గుర్తొచ్చి, ఊదీ మహిమ తెలిసి కూడా ఎలా మరిచిపోయానుకొని బాబాకి నమస్కరించి ఊదీ రాసాను. అంతే, ఆ రాత్రి నుండి తగ్గడం మొదలై పూర్తిగా తగ్గిపోయింది. ఇంకోసారి బాబుకి ఏది తిన్నా కడుపునొప్పి వస్తు, తిన్న తర్వాత వాంతులై రెండు రోజులు బాధపడ్డాడు. రాత్రిపూట వాడు నొప్పికి ఏడ్చేవాడు. నేను బాబాకి చెప్పుకొని బాబుకి ఊదీ ఇచ్చాను. తరువాత ఏ మందు వేయకుండానే బాబా దయవల్ల తగ్గిపోయింది. "థాంక్స్ బాబా". మరోసారి బాబుకి చెవి నొప్పి వచ్చింది. అప్పుడు కూడా నేను మందులతోపాటు ఊదీ ఇవ్వగా బాబా దయవల్ల నొప్పి తగ్గిపోయింది. అలాగే మా పాప మొటిమ వలన నొప్పితో బాధపడుతుంటే ఊదీ రాస్తే, ఉదయానికి పూర్తిగా తగ్గిపోయింది. ఇలా చిన్న, పెద్ద ఎన్ని చెప్పేది ఊదీ మహిమలు? ఎంత చెప్పినా తక్కువే. ఊదీ బాబా మన మీద కురిపించే కరుణ. "కృతఙ్ఞతలు సాయిదేవా".
బాబా దయ
నా పేరు అమర్నాథ్. అఖిలాండకోటి బ్రహ్మాండనాయుకుడైన సాయినాథునికి నమస్కరించి ఈ బ్లాగు ద్వారా ఒక అనుభవాన్ని తోటి సాయిభక్తులతో పంచుకుంటున్నాను. మా తమ్ముడు చిన్నప్పటినుండి చాలా కష్టజీవి. బాగా చదువుకున్నాడు. చదువుతోపాటు వ్యవసాయం కూడా చేశాడు. తర్వాత కోళ్ల ఫారం చేసాడు. వ్యాపారం బాగుంది, చక్కగా స్థిరపడుతున్నాడు అనుకున్న సమయంలో బర్డ్ ఫ్లూ వచ్చి వ్యాపారంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. వాడి జీవితం తలకిందులైంది. నేను బాబాని, "తమ్ముడు దాదాపు 17 సంవత్సరాలుగా అక్కడ, ఇక్కడ ఏదో చేసుకుంటూ కష్టపడుతున్నాడు. తనకి మంచి భవిష్యత్తు ప్రసాదించండి" అని ఎన్నోసార్లు వేడుకున్నాను. బాబా దయవల్ల ఇప్పుడు తమ్ముడికి దగ్గరలోనే ఒక మంచి ఉద్యోగం వచ్చి చాలా ఆనందంగా ఉన్నాడు. "ధన్యవాదాలు బాబా. వాడికి సంతోషమైన జీవితాన్ని ప్రసాదించండి బాబా".
