ఈ భాగంలో అనుభవాలు:
1. 'నేనున్నాను' అనే భరోసా ఇచ్చిన బాబా
2. పంట బాగా పండడానికి వర్షం రాకుండా సహాయం చేసిన బాబా
'నేనున్నాను' అనే భరోసా ఇచ్చిన బాబా
నా పేరు శ్రీవాణి. నేను ఇప్పుడు పంచుకోబోయే అనుభవం చాలా సామాన్యమైనది కానీ, సాయి ఇచ్చిన భరోసా చాలా అమోఘమైనది. నేను చాలా సంవత్సరాల నుంచి ఒంటరితనం వల్ల డిప్రెషన్‌తో బాధపడుతున్నాను. ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే, రోజంతా ఆకారణంగా ఏదో మనోవ్యధ, గుండె నిండా ఏదో బాధ, భారం ఉన్నట్టు ఉంటుంది. ఎవరైనా ఆప్యాయత చూపిస్తూ, ఓదార్పు మాటలు మాట్లాడితే కొంచెం ఉపశమనంగా అనిపిస్తుంటుంది. అందుకని మనసెప్పుడూ ఒక సాయి(భక్తుల)స్నేహం కోసం ఆశిస్తూ ఉంటుంది. ఎందుకంటే, మనకన్నా ఆధ్యాత్మిక జ్ఞానం, సాయి భక్తిలో ఒక మెట్టు పైన ఉన్నవారి సత్సంగత్యం మనల్ని సాయిబాబాకి సన్నిహితంగా ఉంచుతూ మాయకి దూరం చేస్తుందని అంటారు. కాబట్టి సాయి పరమైన చర్చ, సాయి విషయాలు, భావాలు పంచుకుంటూ, సాయి ప్రేమ తెలుసుకుంటూ ఒంటరితనం కూడా పోగొట్టుకోవచ్చని నేనెప్పుడూ బాబాని ఈ విషయం గురించే ప్రార్థిస్తూ అలాంటి భక్తుల స్నేహం కోసం ప్రయత్నించేదాన్ని. కానీ ఇం తవరకు నేను కోరుకునేటటువంటి స్నేహం నాకు లభించలేదు, అలాంటి సాయిభక్తులు వున్నా కూడా వాళ్ళెవరూ నాతో సాయి విషయాలు పంచుకోడానికి ఆసక్తి చూపలేదు. అందువల్ల నేను ప్రతిరోజూ ఎక్కడ వున్నా నా కంటూ ఏ తోడులేక ఒంటరిగా, భారంగా ఫీల్ అవుతుంటాను. రోజులో ఎక్కువ భాగం బాబా విషయాల్లో ఉంటున్న కూడా మధ్యమధ్యలో ఒంటరితనపు భారంతో బాధపడుతూ వుంటాను. ఆ క్రమంలో 2026, ఆగస్టు 23, ఆదివారంనాడు హైదరాబాద్‌లో పూజ్య గురుదేవులు శ్రీఅమ్ముల సాంబశివరావుగారు రచించిన పుస్తకంపై నిర్వహించే పరీక్షకి హాజరయ్యాను. పరీక్ష అయిపోయాక మధ్యాహ్నం తిరిగి ఇంటికెళ్లాలని అనిపించలేదు. ఎందుకంటే, ఇంటికెళ్ళాక మళ్ళీ ఒంటరిగా ఉండాలని తలుచుకుంటే, భయమేసింది. అందుకని మా అక్క వాళ్ళింట్లో ఈరోజు గడుపుదామని వాళ్ళింటికి వెళ్ళా ను. అయితే నేను వెళ్లిన కాసేపటికి వాళ్ళు సాయంత్రం వాళ్ళ స్నేహితుల ఇంట్లో ఫంక్షన్ ఉందని బయటికి వెళ్లిపోయారు. నన్ను రమ్మన్నారు కానీ, ఫంక్షన్లకి రెడీ అవ్వడం వంటివి సాధారణంగా నాకు ఆసక్తి వుండని కారణంగా వెళ్ళలేదు. దాంతో ఇంట్లో ఒంటరిగా ఉండాల్సి వచ్చి, 'ఎంత ప్రయత్నించినా ఈ ఒంటరితనం తప్పట్లేదు' అనిపించింది. కాసేపటికి మళ్ళీ గుండెలో ఏదో బాధతో భారంగా అనిపించడం మొదలైంది. సాదారణంగా నేను అలాంటి సమయాల్లో 'సాయి నామం' చెప్పుకుంటూ, బాబా పుస్తకాన్ని గుండెకి హత్తుకుని, బాబా ఒడిలో నా తలవాల్చి సేదతీరుతున్నట్లు భవిస్తూ ఆ బాధ పోగొట్టుకునే ప్రయత్నం చేస్తుంటాను..అలా చేస్తుంటే గుండె తేలికై బాధాకరమైన ఆ స్థితి శాంతిస్తూ ఉంటుంది కూడా. అలా ఆరోజు కూడా బాబాని తలచుకుంటూ, బాబా ఒడిలో ఉన్నట్లు భావిస్తూ నడుం వాల్చాను. మనసులో, "'బాబా! ఇంకెన్నాళ్లు ఈ డిప్రెషన్? మంచి ఆధ్యాత్మిక జ్ఞానం, సాయి భక్తి కలిగిన వారి స్నేహం అందించవచ్చు కదా!' అని అనుకున్నాను. తర్వాత ఇక నిద్రకు ఉపక్రమిద్దామని అనుకుంటూ నేను వేసుకున్న పంజాబీ డ్రెస్ చున్నీకి పెట్టిన సేఫ్టీ పిన్స్ తీద్దామని ప్రయత్నిస్తుంటే, ఒక సేఫ్టీ పిన్‌లో బట్ట ఇరుక్కోవడం వల్ల ఎంత ప్రయత్నించినా అది ఊడి రాలేదు. అప్పుడు మనసులో, "బాబా! ఇప్పుడు మళ్లీ ప్రయతిస్తాను. మరు సెకన్లో సేఫ్టీ పిన్ సునాయసంగా వచ్చేస్తే, 'నేను నీ తోడు వున్నాను, నువ్వు ఒంటరిని కావు' అని మీరు నాకు భరోసా ఇచ్చినట్టు అనుకుంటాను" అని సాయికి చెప్పుకున్నాను. ఆశ్చర్యకరంగా ఈసారి ఒకేఒక్క సెకనులో సేఫ్టీ పిన్ తేలికగా ఊడి వచ్చేసింది. అంతసేపు ఎంత ప్రయత్నించినా బట్ట ఇరుక్కుని ఉండడం వల్ల ఎంతకీ ఊడి రాని పిన్ను, ఒకేఒక సెకనులో ఎలా వచ్చింది? ఇది సాయి లీల మాత్రమే. ఆయన ఆ లీల ద్వారా 'నేనున్నాను' అనే భరోసా ఇచ్చారు. బాబా భక్తుల ఏవిధంగా సమాధానం ఆశిస్తే, ఆయన ఆవిధంగానే స్పందిస్తూ సమాధానం ఇస్తారు. సాయి ఎప్పుడూ మన ప్రేమకోసం తపిస్తూ ఉంటారు. మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా 'సాయీ, నువ్వే నాకు తోడు' అని చెప్పుకుంటామో, వెంటనే ఆయన వాత్సల్యం కురిపిస్తూ మనల్ని అక్కున చేర్చుకుంటారు. సాయిలోనే సర్వమూ వుంది. ఆశ, శ్వాస, భరోసా, జన్మజన్మలకి వదలని తోడు, చల్లని వాత్సల్యం, అద్భుతమైన స్నేహం, గొప్ప రక్షణ అన్నీ సాయిలో వున్నాయి. సాయిలో లేనిది ఏదీ లేదు. మనం ఆర్తితో అడగాలే కానీ, అది మనకి అవసరమే అయితే సాయి ఇవ్వలేనిది ఏదీ లేదు. అలాంటి సాయిని వేరే ఎవరి స్నేహం కోసమో ప్రార్టించే అవసరం లేదు. అన్నీ ఇచ్చే సాయినే ఆశిస్తూ ప్రార్థిద్దాం.
పంట బాగా పండడానికి వర్షం రాకుండా సహాయం చేసిన బాబా
నా పేరు అమర్నాథ్. సాయి పాద పద్మాలకు నమస్కరిస్తూ నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. సాయి కృపతో ఈ సంవత్సరం మా వరి పంట చక్కగా పండింది. తర్వాత మేము శనగ పంట వేసాము. శనగ పంట గాలిలో తేమతోనే పండుతుంది. అయితే పంట మంచిగా ఉన్నప్పుడు వర్షాలు పడే సూచన ఉందని వార్తలు వచ్చాయి. కొన్నిచోట్ల వర్షాలు పడ్డాయి కూడా. వర్షం కురిస్తే పంట అంతా పాడైపోతుంది. కనీసం ఖర్చులు కూడా రావు. అందువల్ల నేను, "వర్షం కురవకూడద"ని బాబాకి దణ్ణం పెట్టుకొని ఆ రాత్రంతా బాబాను తలుచుకుంటూ పడుకున్నాను. బాబా దయ చూపారు. మా చుట్టుపక్కల ఊర్లలో వర్షం కురిసినా మా ఊరిలో చిన్న జల్లు పడి ఆగిపోయింది. పంట బాగా పండింది. "ధన్యవాదాలు బాబా. మమ్ము ఎల్లప్పుడూ ఇలాగే చల్లగా కాపాడు తండ్రీ. త్వరలో మీ దర్శన భాగ్యం ప్రసాదించండి బాబా".
