1914లో అవస్థి పండరీపురానికి వెళ్లాలని అనుకొని తన మహిళ గురువు(వృద్ధ మహాత్మురాలు) చెప్పిన మాట నెరవేరాలని పండరినాథుని ప్రార్థించాడు. ఆ సమయంలో అతను ఇండోర్ జిల్లా న్యాయమూర్తిగా ఉండగా రేగే అతని క్రింద సివిల్ న్యాయమూర్తిగా ఉండేవాడు. పండరీపురం వెళ్లాలన్న అవస్థి ఉద్దేశ్యం తెలుసుకున్న రేగే అతనితో, "ఇండోర్ నుండి పండరీపురం వెళ్లే దారిలో శిరిడీ వుంది. మీరు అక్కడ ఆగి వెళ్ళండి" అని సూచించాడు. అదివరకే శ్రీ హెచ్.ఎస్.దీక్షిత్ కూడా అతనితో "శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోమ"ని చెప్పి ఉన్నాడు. కానీ అవస్థి తన చిన్నవయసులోనే ఒక స్త్రీని గురువుగా ఆశ్రయించి గురుమంత్రాన్ని స్వీకరించి ఉన్నందున ఆమె సజీవంగా ఉందో లేదో తనకి తెలియనప్పటికీ దీక్షిత్ చెప్పినట్లు బాబా దర్శనానికి వెళ్లడం గురుద్రోహంగా భావించాడు. అందువల్ల రేగేకు బాబాతో ఉన్న అనుబంధాన్ని తెలుసుకున్న అవస్తే తన మనస్సులోని సందేహాన్ని రేగేతో చెప్పాడు. అప్పుడు రేగే అతనితో, "బాబా గొప్ప మహాత్ములు, దైవస్వరూపులు. గురువులందరిలో ఉన్న ఆత్మయే వారు. కాబట్టి, మీ గురువులోనూ బాబా ఉన్నారు. శిరిడీ వెళ్తే, బాబాలో మీ గురువు ఉన్నారని మీకు అనుభవమవుతుంది" అని చెప్పాడు. దానితో అతను శిరిడీ వెళ్ళడానికి అంగీకరించి, "1914 క్రిస్మస్ సెలవుల్లో తనను శిరిడీ తీసుకెళ్లమ"ని రేగేతో చెప్పాడు. అయితే ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది. అవస్థి చాలా నెమ్మదస్తుడైనందున అతను పూర్తి చేయాల్సిన చాలా పనులు పూర్తికాకుండా ఉండిపోయాయి. అవి పూర్తి చేయకపోతే క్రిస్మస్ సెలవులను వినియోగించుకోరాదని అతనికి ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయి. సెలవులు ఆరంభమవుతూనే అతడు ఆ పెండింగ్ పనులు మొదలుపెట్టాడు. అతను ఆశ్చర్యపోయేలా కొన్ని రోజులలోనే ఆ పనులు పూర్తి చేయగలిగాడు. అది బాబా సహాయానికి సాక్ష్యంగా అతనికి తోచింది.
తరువాత ఒక శుభదినాన రేగే, అవస్తేలు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే ఊహించని మరో అవాంతరం వచ్చి పడింది. ఆ సమయంలో యుద్ధం జరుగుతున్న కారణంగా రైళ్లన్నీ సైనికాధికారుల హస్తగతం చేయబడ్డాయి. ఇండోర్ నుండి మన్మాడ్ వెళ్లే మార్గంలో మహౌ కంటోన్మెంట్ స్టేషన్ దాటవలసి ఉంది. ఆ స్టేషన్‌లో సైనికాధికారి రైల్లోని ప్రయాణీకులను దింపి సైనికులను ఎక్కించసాగాడు. అందరితోపాటు రేగే, అవస్థిలు కూడా దిగవలసి వచ్చింది. ఇక శిరిడీయాత్ర ముందుకు సాగదని వారికి అనిపించింది. అయితే చిత్రంగా వాళ్ళు రైలు దిగబోతున్న సమయంలో సైనికాధికారి రైలులోకి వచ్చి, “ఈ బోగీ చిన్నదైనందున మాకు అవసరం లేదు. కాబట్టి మీరు ఈ బోగీలో మీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు” అని చెప్పాడు. బాబా అనుగ్రహంతో అలా అనూహ్యరీతిన వారిద్దరికీ ప్రయాణం కొనసాగించే అవకాశం లభించింది. రేగే ఆ రాత్రంతా 'బాబా, బాబా' అంటూ బాబాను పిలుస్తూ భజన, నామజపం చేస్తూ గడిపాడు. వాళ్ళు శిరిడీ చేరగానే బాబా దర్శనార్థం మసీదుకు వెళ్లారు. ‘బాబాను మొదటిసారి కలిసినప్పుడే పి.ఆర్.అవస్థి భక్తి పారవశ్యంతో ఉప్పొంగిపోయాడని, వారిపై అతనికి కలిగిన భక్తి ఎంత తీవ్రమైనదంటే దానిని మాటల్లో వర్ణించలేమని, అతనికి సాయిబాబా భగవంతునిలా అనిపించసాగారని, ఎక్కడ చూసినా సాయిబాబానే కనిపించసాగారని. అంతలా అతను బాబాతో మమేకమైపోయారని’ అవస్థి కొడుకు శ్రీనారాయణ్ పురుషోత్తమ్ అలియాస్ నానాసాహెబ్ అవస్థి తన స్మృతులలో చెప్పారు. అయితే బాబా పి.ఆర్.అవస్థిను ఉద్దేశిస్తూ రేగేను, "ఎవరీ పిచ్చివాడు?" అని అడిగారు. అది విని అవస్థి ఉద్రిక్తుడయ్యాడు. బాబా ఆంతర్యమేమిటో ఆ తరువాత భక్తులకు అర్థమైంది.
రేగే ఎప్పుడు శిరిడీ వెళ్లినా రాధాకృష్ణఆయీ ఇంట బస చేసేవాడు. అలాగే ఆసారి కూడా అతను అవస్థిను తీసుకొని రాధాకృష్ణమాయి ఇంట బస చేయడానికి వెళ్ళాడు. అప్పుడు అవస్థికి రాధాకృష్ణఆయీ తన సద్గురువుగా(వృద్ధ మహాత్మురాలు) కనిపించింది. అంతేకాదు ఆమె అతనికి ఏళ్ళ క్రితం అతను వృద్ధ మహాత్మురాలితో కలిసి ఉన్నప్పుడు జరిగిన ఒక విచిత్రమైన సంఘటనను గుర్తుచేసింది. దాంతో అతనికి ఆమె విలక్షణమైన వ్యక్తిగా తోచి ఆమెను తన గురుసోదరిగా భావించడానికి అంగీకరించాడు కానీ, తన గురువుకి ప్రత్యామ్నాయంగా అంగీకరించలేదు. అప్పుడు ఆయీ అతన్ని, "నేను చనిపోయినా సరే, నువ్వు అంగీకరించవా?" అని అడిగింది. దానికి అతను "అంగీకరించను" అని అన్నాడు. వెంటనే ఆయీ తాను చనిపోతున్నాని కేకవేసి, నిజంగానే చనిపోయినట్లుగా నేల మీద పడిపోయింది. వెంటనే అతనికి తను మొదటిసారి వృద్ధ మహాత్మురాలిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆవిడ సరిగ్గా ఇలాగే చేయడం గుర్తొచ్చి కలత చెంది, పరుగున ఆయీ దగ్గరకు వెళ్లి, ఆమె తలను తన ఒడిలో పెట్టుకొని కన్నీళ్లు కార్చాడు. ఆమెకు స్పృహ తెప్పించడం కోసం, తన గురువు బిగ్గరగా ఉచ్చరించకూడదని చెప్పినప్పటికీ, ఆవిడ తనకు నేర్పిన పంచాక్షరీ మంత్రాలను అతను బిగ్గరగా జపించడం మొదలుపెట్టాడు. ఆ పంచాక్షరీ మంత్రంలోని ఒక్కో అక్షరానికి అధిదేవతలుగా ఉన్న ఆయా దేవతలను, ఆమెను బతికించమని అతను వేడుకున్నాడు. ఆమె బతికితే, తాను 16 ఏళ్లుగా చేసిన ఆ మంత్ర జపం ద్వారా పొందిన పుణ్యమంతా ధారపోస్తానని కూడా అతను ప్రతిజ్ఞ చేశాడు. వెంటనే ఆయీ మూర్చిల్లి మళ్ళీ స్పృహలోకి వచ్చినట్లుగా నెమ్మదిగా కళ్లు తెరిచి అతనితో, "నువ్వు వెళ్లి, నీ పని చూసుకో" అని చెప్పింది. అతను తన అవివేకం వల్ల కలిగిన పరిణామాన్ని సరిదిద్దగలిగినందుకు సంతోషించాడు కానీ, మంత్రాలను బిగ్గరగా ఉచ్చరించకూడదన్న తన గురువు ఆదేశాన్ని ఉల్లంఘించినందుకు బాధపడ్డాడు. అతని మనస్సు ఎంతగానో కలత చెంది, మళ్లీ ఆ మంత్రాలను జపించడం మొదలుపెట్టాడు. అప్పుడు మ్యాజిక్ లాంతరు ప్రదర్శనలో(పాతకాలపు సినిమా ప్రదర్శన) లాగా దేవతలు ఒక్కొక్కరుగా కిందికి దిగి రావడం అతనికి కనిపించసాగింది. మొదటి ఇద్దరు, ముగ్గురు దేవతలు కనిపించిన తర్వాత, ఆయీ అతనితో, "ఈ ప్రదర్శనంతా ఆపి, పడుకొని నిద్రపో!" అని అంది. అతను ఆమె చెప్పినట్లు విన్నాడు.
మరుసటిరోజు అర్థం లేని భయాలతో నలిగిపోతున్న అవస్థి మనసుకు సంకేతంగా రాధాకృష్ణమాయి నాలుగు మల్లెపువ్వులు ఒక దారానికి కట్టి, వాటిని రేగే చేతికిచ్చి, "వీటిని బాబా వద్దకు తీసుకొని వెళ్లి, విడదీయమని చెప్పు" అని చెప్పింది. అతను వాటిని బాబాకు ఇచ్చి ఆయీ చెప్పిన మాటను చెప్పగా బాబా వాటి వాసన చూసి, తిరిగి అతనికిస్తూ, "ఆ పని ఆమే చేయాలి" అని అన్నారు. తరువాత రేగే, అవస్థి కలిసి ఆయీ ఇంటికి వెళ్లారు. మధ్యాహ్న సమయంలో అవస్థికి ఒక ఆలోచన వచ్చింది. అందుకు తగ్గట్టే అతను ఎవరికీ తెలియకుండా బాబాకు సమర్పించబోయే నైవేద్యం పళ్ళెం నుండి ఒక అన్నం ముద్దను చేతిలోకి తీసుకొని, ‘దీన్ని గనుక పిండంగా బాబా స్వీకరిస్తే, తన గురువు ఇక సజీవంగా లేరనీ, బాబాను గురువుగా ఆశ్రయించడం గురుద్రోహం కాదనీ’ అనుకుని, ఆ నైవేద్యం పళ్లాన్ని, దానిక్రిందుగా చేతిలో అన్నం ముద్దను పట్టుకొని మసీదుకు వెళ్ళాడు. ఆ సమయంలో రేగే కూడా అతనితో ఉన్నాడు. బాబా అవస్థితో, "దాన్ని నాకివ్వు" అంటూ ఆ పిండాన్ని తీసుకొని, వాసన చూసి, "ఇది చేరాల్సిన చోటుకి చేరింది" అని అన్నారు. తరువాత అవస్థి, రేగే ఇద్దరూ ఆయీ ఇంటికి వెళ్ళారు. అవస్థి ద్వారం వద్ద నుండే పరుగున వెళ్లి ఆయీ పాదాలపై పడి, అప్రయత్నంగా అరగంటసేపు పాడుతూ బాహ్యస్మృతి లేని స్థితిలో ఉండిపోయాడు. ఆ సమయంలో ఆయీ కూడా సమాధి స్థితిలో ఉంది. ఆ తరువాత అవస్థి రేగేతో, "రాధాకృష్ణమాయి స్థానంలో నేను నా మొదటి గురువును దర్శించాను" అని చెప్పాడు”.
అయితే అవస్థికి మొదటిరోజు కలిగినటువంటి అనుభవాలే తర్వాత రోజుల్లో కూడా కలిగాయి. చివరికి ఏకాదశి రోజున అతనికి గురువు సలహాకు విరుద్ధంగా శిరిడీ వచ్చినందుకు పశ్చాత్తాపం కలిగింది. సాధువులను దర్శించవద్దు, వారు తనని వేదిస్తారని ఎవరో చెప్పి ఉన్నందున అతను శిరిడీలో ఉండటం తనకు ప్రమాదమని, మంత్రాల జపం వల్ల తనకొచ్చిన శక్తి నశిస్తుందని భయపడ్డాడు. అటువంటి మానసిక స్థితిలో అతనికి నెమ్మదిగా, 'సాయి అనే ఒక మంత్రగాడు తనని, రాధాకృష్ణమాయిని తప్పుదారి పట్టించారని, ఆ ముసలి ఫకీరు ప్రజలను, 'ఆయీ'తో సహా ఎంతోమంది నిజాయితీపరులైన భక్తులను తనను తాను సాధువుగానూ, దేవుని అవతారంగానూ నమ్మేలా ప్రేరేపిస్తున్నడని’ అతను భావించడం మొదలుపెట్టాడు. తర్వాత అకస్మాత్తుగా అతనికి, ‘సాయి తన మంత్రతంత్రాలతో తనను వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని’ అనిపించింది; దాంతో తనను తాను రక్షించుకోవాలని, ఆయన వశం నుండి బయటపడాలని అతను అనుకున్నాడు. అందుకోసం అతను 'శ్రీరామ్, శ్రీరామ్' అని బిగ్గరగా, వేగంగా అనడం మొదలుపెట్టి, చాలాసేపు ఆ నామజపం కొనసాగించాడు. అప్పుడు అవస్థిను ఆ చిత్తభ్రమ నుండి బయటపడేయడానికి ఆయీ, రేగే బాబా దగ్గరకు వెళ్లి ప్రార్థించారు. కానీ బాబా ఏమీ మాట్లాడలేదు. అవస్థి పరిస్థితి ఆ రాత్రంతా అలాగే గడిచింది. మరుసటిరోజు ఉదయం చావడిలో ఉన్న బాబా మధురమైన కంఠంతో 'అల్లా మాలిక్ హై' అని గంభీరంగా అనడం వినగానే ఆ స్థితి నుండి అతను బయటపడ్డాడు. అతను తన ఆలోచన, ప్రవర్తనలకు మనసులోనే బాబాకు క్షమాపణ చెప్పుకున్నాడు. బాబా కాకడ ఆరతి పూర్తవుతూనే రేగేను పిలిపించి, ‘అవస్థిను శిరిడీ నుండి తీసుకెళ్లామని’ ఆదేశించారు. వెంటనే ఒక టాంగా సిద్ధం చేసుకొని రేగే, అవస్థిలు బయలుదేరడానికి సిద్ధమయ్యారు. వాళ్ళు గ్రామ ప్రవేశద్వారం వద్ద బాబాకు నమస్కరించి, తమ ప్రయాణానికి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అవస్థికు దారిలో ప్రతి మగ పక్షి, జంతువు బాబాలాగా, ఆడ పక్షులు, జంతువులు 'ఆయీ'లాగా కనిపించాయి. వారు లెండి వాగును చేరుకునే వరకు ఆ స్థితి అలాగే కొనసాగి అటు తర్వాత తొలగిపోయింది. అతను నెమ్మదిగా తన స్నేహితుడు రేగే ఒడిలో పడుకుని నిద్రపోయాడు. వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. పండరీపురం వెళ్లాలన్న అవస్థి కోరిక శిరిడీ సందర్శనంతోనే తీరిపోయింది. ఎలాగంటే, బాబా అతనికి పండరీపురంలోని విఠలుని రూపంలో దర్శనమిచ్చారు. అటుపిమ్మట అతను బాబాకు పరమభక్తుడై తను జీవించి ఉన్నంతకాలం క్రమం తప్పకుండా బాబాను పూజించాడు. 1918లో బాబా మహాసమాధి చెందేవరకు అతను తన కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి సంవత్సరంలో రెండు, మూడు సార్లు శిరిడీ వెళ్లి బాబాను దర్శించి వారి సన్నిధిలో గడుపుతుండేవాడు. బాబాపై విశ్వాసం కుదిరింది అతని ఒక్కడికే కాదు, అతని కుటుంబంలోని చిన్న, పెద్ద అందరూ బాబా భక్తులే. వారిలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అనుభవం ఉంది.
తరువాయి భాగం వచ్చేవారం..
