ఈ భాగంలో అనుభవాలు:
1. కన్నతల్లి ప్రేమ కంటే అధికమైన ప్రేమను చూపే బాబా
2. ఊహించని విధంగా పరిస్థితులు మలచి మంచి ఉద్యోగాన్ని ప్రసాదించిన బాబా
కన్నతల్లి ప్రేమ కంటే అధికమైన ప్రేమను చూపే బాబా
సాయి ప్రేమికులందరికీ నా నమస్కారాలు. నా జయశ్రీ. 2005, శ్రావణమాసంలో నాగులపంచమినాడు పూజచేసి పుట్టలో పాలు పోయాలని నేను, మా అమ్మ, అమ్మమ్మ పుట్టకి వెళ్లాము. మేము పూజ మొదలుపెట్టామో, లేదో అకస్మాత్తుగా ఎక్కడినుంచో చాలా కోతులు అక్కడికి వచ్చాయి. అవి మేము తీసుకెళ్లిన పూజాసామాగ్రి చూసి చాలా అలజడి సృష్టించి సామాగ్రి అంతా చెల్లాచెదురు చేసాయి. నేను అప్పుడు 8 నెలల గర్భవతినైనందున సులువుగా ఎటూ కదలలేని పరిస్థితి. అమ్మమ్మ చూస్తే పెద్ద ఆవిడ. అక్కడ మేము తప్ప ఎవరూ లేకపోవడం వల్ల మా ఇద్దరినీ ఎలా కాపాడుకోవాలో దిక్కుతోచని పరిస్థితి మా అమ్మది. మేము భయంతో కేకలు వేసాము. అంతలో 3 అడుగుల పెద్ద కోతి ఒకటి పెద్దగా అరుస్తూ, దూక్కుంటూ వచ్చి సరిగ్గా నా ఎదురుగా చుట్టూ ఉన్న ఇనుప కంచె మీద కూర్చుంది. దానికి నాకు మధ్య ఒక మూరెడు దూరం మాత్రమే ఉంది. గర్భంలో ఉన్న ప్రాణాన్ని ఎలాగైనా కాపాడుకోవాలనే ఆరాటంతో మా అమ్మ నా పొట్ట చుట్టూ చేతులు వేసి రక్షణగా పట్టుకుని, మోకాళ్లపై కూలబడి రోదించింది. నేను భయంతో విపరీతంగా వణికిపోతూ గట్టిగా 'బాబా బాబా' అరిచాను. బాబా చేసిన అద్భుతం చూడండి. అక్కడిదాకా దూకుతూ కోపంగా వచ్చిన ఆ కోతికి నా మీదికి దూకడం పెద్ద సమస్య కాదు. కానీ అది అలా చేయలేదు. అది నా ముఖం ముందుకు వచ్చి పదే పదే గట్టిగా అరిచిందే తప్ప, నా శరీరాన్ని తాకడం, బాధించడం చేయలేదు. కాసేపటికి అది నెమ్మదిగా వెనక్కి తగ్గింది. దాన్ని బాబానే నియంత్రించారు. లేదంటే నా శరీరం కోలుకోలేనంతగా గాయాలపాలయ్యేది. కొంతకాలం తరువాత నేను చూసిన ఒక సినిమాలో భక్తుడిని కాపాడటానికి ఆ భక్తుడి వెనుక ఉగ్రనరసింహస్వామి కనపడి, రౌడీలు పారిపోయేలా చేస్తారు. ఆ సమయంలో భక్తుడు ఏమీ చేయకపోయినా తన వెనుక ఉండే శక్తి తనని కాపాడిందని కూడా ఆ భక్తుడు తెలుసుకోలేడు. ఆ సన్నివేశం చూసిన నేను నాకు జరిగిన పైఅనుభవాన్ని గుర్తుచేసుకొని, బాబా ప్రేమను తలుచుకొని కన్నీళ్ల పర్యంతమయ్యాను.
పై అనుభవం జరిగిన తర్వాత ఒక వారానికి నాకు డెలివరీ అయింది. అయితే, అప్పటికి రెండురోజుల ముందే కడుపులోని ఆడబిడ్డ చనిపోయింది. ఆ విషయం మాకు ఆలస్యంగా తెలిసింది. ఇంకా కొంచెం ఆలస్యం అయుంటే నా ప్రాణాలకు ప్రమాదం వాటిల్లేదని డాక్టర్ అన్నారు. అంతటి విషమ పరిస్థితుల్లో కూడా బాబా దయవల్ల ఎలాంటి కష్టం లేకుండా నార్మల్ డెలివరీ అయింది. మొత్తానికి బాబా నన్ను పెద్ద పెద్ద ప్రాణాపాయ గండాల నుండి కాపాడారు అనేది 100 పర్సెంట్ నిజం. కన్నతల్లి కంటే కూడా ఎంతో ప్రేమ మన బాబాకి మనందరి మీద ఉందనేది ముమ్మాటికీ వాస్తవం. ఇవన్నీ ఇంత కాలానికి మీ అందరితో పంచుకునే భాగ్యాన్ని ఈ బ్లాగ్ ద్వారా బాబా ఇచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మనందరి మీద బాబా దయ ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ..
సర్వేజనా సుఖినోభవంతు.
ఊహించని విధంగా పరిస్థితులు మలచి మంచి ఉద్యోగాన్ని ప్రసాదించిన బాబా
శ్రీసాయి పాదపద్మములకు శతకోటి నమస్కారములు. నేను ఒక సామాన్య సాయి భక్తురాలిని. నేను అప్పుడప్పుడే సాయికి దగ్గరవుతున్న రోజుల్లో నాకు జరిగిన ఒక అనుభవం ఇదివరకు ఈ బ్లాగులో పంచుకున్నాను. ఆ అనుభవం తర్వాత సాయిపై నా భక్తి ఎన్నో రెట్లు అధికమైంది. ఎప్పటికీ సాయినాథుని పాదాలను విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకోవాలని ఆ తండ్రిని కోరుకుంటూ ఇప్పుడు మరో అనుభవం పంచుకుంటున్నాను.
ఒకప్పుడు నేను అమెరికాలో చాలా చల్లని వాతావరణం ఉండే ప్రాంతంలో నివసిస్తుండేదాన్ని. బహుశా ఆ కారణంగా అనుకోకుండా నా ఆరోగ్యం దెబ్బతింది. ఆ సాయినాథుడే నన్ను ఆ ఆరోగ్య సమస్య నుండి కాపాడారు. ఆ తర్వాత నేను మరో ఉద్యోగం వెతుక్కొని ఒక మంచి ప్రాంతానికి మారాలని ఎంతో ప్రయత్నించాను. కానీ నేను ఎంత ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. ఎందుకంటే, అమెరికాలో ఉద్యోగం సంపాదించడం అంత సులభం కాదు. అదీకాక అప్పటికే చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి వెళ్లడానికి మనసు కూడా ఒప్పుకోలేదు. అయినప్పటికీ, ఇక లాభం లేదని బాబాపై నమ్మకంతో రెండేళ్లుగా చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి, ఆ తండ్రి అనుగ్రహంతో మేము అనుకున్న వేరే ప్రాంతానికి మారిపోయాము. అక్కడికి వెళ్లిన వారంలోపే నాకు మంచి జీతంతో ఒక ఉద్యోగం వచ్చింది. అయితే, ఆ ఉద్యోగం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఎందుకంటే, పని ఒత్తిడి మరియు ఆఫీసును వెళ్లి, వచ్చే ప్రయాణం వల్ల నేను సాయంత్రం ఇంటికి వచ్చేసరికి చాలా నీరసంగా అయిపోతుండేదాన్ని. ఇంట్లో ఉన్న చిన్నపాపను చూసుకోవడానికి కూడా ఓపిక ఉండేది కాదు. అందుకని తనని దాదాపు 11 గంటల పాటు డేకేర్‌లో ఉంచాల్సి వచ్చేది. చివరికి ఇక నా వల్ల కావడం లేదని, మళ్లీ బాబాపై అచంచలమైన నమ్మకంతో, “బాబా! నా వల్ల కావడం లేదు. ఇక నీదే భారం!” అని మనసులోనే ఆయనను వేడుకొని, మావారికి ఇష్టం లేకపోయినా ఉద్యోగానికి రాజీనామా చేశాను. నేను అంతకుముందు ప్రభుత్వ విభాగానికి సంబంధించిన ఉద్యోగం చేశాను. అక్కడ ఎంత సౌకర్యవంతంగా ఉండేదో మాటల్లో చెప్పలేను. పని ఒత్తిడి లేకుండా, నా పాపను, కుటుంబాన్ని చూసుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉండేది. మళ్లీ అలాంటి ఉద్యోగం దొరుకుతుందని నేను ఎన్నడూ ఊహించలేదు. కానీ మన ఊహకు కూడా అందని అద్భుతాలను చేస్తారు మన బాబా కదా! నేను రెండోసారి ఉద్యోగం వదిలేసిన తర్వాత మొట్టమొదట ఒక ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి హాజరయ్యాను. బాబా నాకు మునుపటి ప్రభుత్వ ఉద్యోగం కంటే మంచి, సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని నాకు ప్రసాదించారు. ఒకవేళ నేను ఆ ముందు ఉద్యోగాన్ని వదిలిపెట్టకపోయుంటే, కనీసం ఇంటర్వ్యూకి కూడా హాజరయ్యే అవకాశం నాకు ఉండేది కాదు. ఎందుకంటే, ఆ కంపెనీవాళ్ళు వారానికి ఐదు రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు రావాలనే విషయంలో చాలా కఠినంగా ఉండేవారు. అలాంటిది బాబా నేను ఊహించని విధంగా పరిస్థితులు మలచి నాకు ఒక మంచి ఉద్యోగాన్ని ప్రసాదించారు. ఇప్పుడు నేను ఎంతో సంతోషంగా నా ఉద్యోగాన్ని చేసుకుంటూ, నా కుటుంబాన్ని కూడా చక్కగా చూసుకుంటున్నాను. ఈ అనుభవాన్ని మీ అందరితో పంచుకునే అవకాశాన్నిచ్చిన బాబాకు శతకోటి నమస్కారములు. "థాంక్యూ బాబా! లవ్ యు బాబా! దాదాపు రెండేళ్లుగా నేను మిమ్మల్ని ఒక కోరిక కోరుకుంటున్నాను. దానికి సంబంధించి మీరు నాకు ఎన్నో పరీక్షలు పెడుతున్నారు. ఎన్ని పరీక్షలు పెట్టినా చివరికి మీరు నన్ను అనుగ్రహిస్తారని దృఢంగా నమ్ముతున్నాను బాబా".

