సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1186వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబాను మించిన వైద్యుడు, శ్రేయోభిలాషి మనకి ఎవ్వరూ లేరు
2. నమ్ముకుంటే ఎటువంటి కష్టాన్నైనా దూరం చేస్తారు బాబా
3. చెప్పుకున్నంతనే ఆరోగ్యం సరిచేసిన బాబా

బాబాను మించిన వైద్యుడు, శ్రేయోభిలాషి మనకి ఎవ్వరూ లేరు

ముందుగా సాయి భక్తులకు నమస్కారాలు. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు పుష్పలత. నేను ఇంతకుముందు బాబా అనుగ్రహంతో నా జీవితంలో జరిగిన రెండు అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరొక అనుభవాన్ని మీ అందరితో పంచుకునే అవకాశం బాబా ఇచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ అనుభవాన్ని పంచుకోవటంలో ఆలస్యం చేసినందుకు బాబాకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటూ విషయంలోకి వస్తున్నాను. నేను హైదరాబాదులో ఒక మంచి పేరున్న కామర్స్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరరుగా పనిచేస్తున్నాను. నా వయస్సు 42 సంవత్సరాలు. నేను గత సంవత్సరం నుండి నెలసరి సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నాను. దానివల్ల రక్తహీనత కూడా వచ్చింది. కానీ డాక్టరు వద్దకు వెళ్ళాలంటే నాకు చాలా భయమేసింది. అసలు నా ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు వచ్చాయో, డాక్టరు ఏమి చెప్తారోనని భయంతో ప్రతినెలా డాక్టరు దగ్గరకి వెళ్లడం వాయిదా వేస్తూ ఉండేదాన్ని.

నేను నాకు ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారం కోసం రెండు చీటీలు వ్రాసి బాబా పాదాల వద్ద ఉంచి, వాటిలో నుండి ఒక చీటీ తీసి, అందులో ఉన్నదాన్ని బాబా సందేశమని ప్రగాఢంగా విశ్వసిస్తాను. అలాగే పైన చెప్పిన నా సమస్య విషయంలో కూడా 'డాక్టరుని సంప్రదించాలా, వద్దా' అని చీటీల మీద వ్రాసి మూడుసార్లు తీశాను. మూడుసార్లూ డాక్టరుని సంప్రదించమని వచ్చింది. అంతే, నేను ఇంట్లో ఆ విషయం గురించి ఎవ్వరితోనూ చర్చించకుండా కాలేజీలో క్లాసులు అయ్యాక మాకు తెలిసిన ఒక గైనకాలజిస్ట్ దగ్గరకి వెళ్ళాను. నేను హాస్పిటల్లో అడుగుపెడుతూనే ఒక పెద్ద ఫొటో రూపంలో ఆ సాయినాధుడు నాకు దర్శనమిచ్చారు. డాక్టరుని కలసి టెస్టు చేయించుకున్నంతవరకు నేను నా మనసులో బాబానే తలుచుకుంటూ "హేస్ట్రెక్టమీ(గర్భసంచి తొలగించే) ఆపరేషన్ చేయాలని డాక్టరు చెప్పకూడద"ని బాబాతో చెప్పుకుంటూ ఉన్నాను. కాని డాక్టరు నన్ను పరిశీలించి, "గర్భసంచిలో నీటి తిత్తుల పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల గర్భసంచి బాగా ఉబ్బింది. వెంటనే ఆపరేషన్ చెయ్యాలి" అని అన్నారు. నేను, "బాబా! ఇలా జరిగిందేంటి?" అని చాలా ఏడ్చాను. కాని బాబా మనల్ని తల్లిదండ్రులకన్నా ఎక్కువగా కంటికి రెప్పలా కాపాడుతారనే విషయాన్ని నేను మనసా, వాచా, కర్మణా నమ్ముతాను. ఆ నమ్మకంతోనే 'నాకు గురువారమే ఆపరేషన్ జరగాలని, మళ్ళీ గురువారానికి నేను క్షేమంగా ఇంటికి రావాల'ని బలంగా కోరుకున్నాను. నేను కోరుకున్నట్లే అన్నీ సవ్యంగా జరిగి మూడు రోజులకే నేను హాస్పిటల్ నుండి ఇంటికి తిరిగి వచ్చాను. ఐతే ఆపరేషన్ సమయంలో తొలగించిన దానిని బయాప్సీ టెస్టుకి పంపించారు. 'ఆ రిపోర్ట్ నార్మల్‍గా రావాల'ని నేను క్షణం విడవకుండా బాబాని అడుగుతుండేదాన్ని. ఆ బాబా దయవల్ల బయాప్సీ రిపోర్ట్ 100% నార్మల్ అని వచ్చింది. డాక్టరు, "ముందు ముందు ఏ సమస్యలు ఉండవు" అని చెప్పారు. అది విని బాబాపై నాకున్న విశ్వాసం మరింత బలపడింది. అంత పెద్ద ఆపరేషన్ జరిగినా బాబా దయవల్ల 12 రోజులకే నేను యధావిధిగా కాలేజీకి వెళ్ళగలిగాను. అందుకు కారణం మందులు కాదని, బాబా చల్లని చూపేనని నేను నమ్మకంగా చెప్పగలను. బాబాను మించిన వైద్యుడు, శ్రేయోభిలాషి మనకి ఎవ్వరూ లేరు. "బాబా! మీకు చాలా చాలా ధ్యన్యవాదాలు. నేను ప్రక్కవారి తప్పును తప్పు అని ఖండించే మనస్తత్వం కలిగిన వ్యక్తిని అవ్వటం వల్ల నా కుటుంబంలో వ్యక్తులతోనూ, నా సహోద్యోగులతోనూ కుండ బద్దలు కొట్టినట్లు ముక్కుసూటిగా మాటాడతాను. ఇంకా చుట్టుపక్కలవాళ్ళు నటిస్తూ మాట్లాడినా, అబద్దాలతో మోసం చేసినా తట్టుకునే మనస్తత్వం కూడా నాది కానందున నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. నేను మీ చరిత్రలో చెప్పబడిన 'పరనింద మహాపాపమ'నే విషయాన్ని ఎన్నోసార్లు చదివి పరనింద చేయకుండా ఉండాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాను. కానీ అది నాకు కొంతవరకు మాత్రమే సాధ్యమవుతుంది. మీ దివ్య ఆశీసులతో నాకు మరింత మనోనిగ్రహం కలగాలని కోరుకుంటున్నాను తండ్రి". మరో మంచి అనుభవాన్ని అతిత్వరలో మీ అందరితో పంచుకోవాలని ఆశిస్తూ …

నమ్ముకుంటే ఎటువంటి కష్టాన్నైనా దూరం చేస్తారు బాబా

ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా 'సాయి మహారాజ్ సన్నిధి' అనే అద్భుతమైన బ్లాగు నిర్వహిస్తూ సాయి లీలామృతాన్ని భక్తులకు అందిస్తున్న బ్లాగు నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, వారికి ఆ సాయి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తుడిని. ప్రస్తుతం నా భార్య 6నెలల గర్భవతి. బాబా దయవల్ల ఇప్పటివరకు తల్లీబిడ్డల ఆరోగ్యం బాగుంది. 2022, ఏప్రిల్ నెల చివరి వారంలో మా మావయ్యగారి (నా భార్య తండ్రి) ఆరోగ్యం విషమించి ఐ.సి.యులో అడ్మిట్ అయ్యారు. అప్పట్నుండి నా భార్య దిగులుగా ఉండడం నేను గమనించాను. అదీకాక ఎప్పుడూ రాత్రి పడుకునే ముందు తన గర్భంలోని బిడ్డ కదలికలు తెలుస్తున్నాయనే నా భార్య రెండు రోజులుగా బిడ్డ కదలికలు తెలియట్లేదని టెన్షన్ పడింది. నేను గురువారం ఉదయం బాబా ఊదీ నా భార్య నుదుటన పెట్టి, నేను కూడా పెట్టుకుని 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని స్మరించడం మొదలుపెట్టి, "బాబా! సాయంత్రం వరకు బిడ్డ కదలిక తెలిస్తే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో నా అనుభవం పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. ఆ రోజు సాయంత్రం మందిరానికి వెళ్లి కూడా బాబాకి మొక్కుకున్నాను. తరువాత నా భార్యని ఆఫీసు నుండి తీసుకుని వస్తుంటే తను "బిడ్డ కదలికలు ఈరోజు తెలిసాయి" అని చెప్పింది. దాంతో పోయిన ఊపిరి తిరిగి వచ్చినట్టు అనిపించింది నాకు. ఆ బాబాని నమ్ముకుంటే ఎటువంటి కష్టాన్నైనా దూరం చేస్తారు. ఆయన కరుణామయులు. "ధన్యవాదాలు బాబా. నా కెరీర్ సమస్య గురుంచి మీకు తెలుసు. తొందరగా ఆ సమస్య సమసిపోయేలా చూడు తండ్రి. ఇంకా ఈసారి వచ్చే ప్రమోషన్ లిస్టులో నా పేరు ఉండేలా కరుణించు తండ్రి. నాకు ప్రమోషన్ వస్తే, నా అనుభవాన్ని మీ బ్లాగు ద్వారా తోటి మీ బిడ్డలతో పంచుకుంటాను. తెలిసీతెలియక ఏవైనా తప్పులు చేసి ఉంటే క్షమించు తండ్రి. మీ బిడ్డలందరిపై మీ కరుణాకటాక్షాలు ఉండేలా చూడు తండ్రి".

అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీసచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కి జై!!!

చెప్పుకున్నంతనే ఆరోగ్యం సరిచేసిన బాబా

సాయి భక్తులకు నమస్కారం. నా పేరు నళిని. నేను వేడుకున్నంతనే బాబా ఎన్నోసార్లు నా బాధలు తీర్చారు. నాకు ఉద్యోగం ప్రసాదించారు. నేను నా అనుభవాలను బ్లాగులో పంచుకుంటానని మొక్కుకుని మర్చిపోయిన కొన్ని సందర్భాలలో బాబా కలలో కనిపించి వాటిని గుర్తు చేశారు. అలాగే నేను ఏదైనా మర్చిపోతే బాబా ఏదో రూపంలో గుర్తు చేస్తారు. ఇటీవల నా ఆరోగ్యం బాగాలేని సమయంలో హఠాత్తుగా బంధువులు వచ్చారు. అప్పుడు నేను, "బాబా! నా ఆరోగ్యం బాగా లేని కారణంగా వాళ్ళని సరిగా చూసుకోలేనేమో" అని అనుకున్నాను. అంతే, బాబా నా ఆరోగ్యం బాగుండేలా చేశారు. ఇలా ఏది అడిగినా బాబా వెంటనే తీరుస్తారు. "ఎప్పుడూ నా వెంట ఉంటూ నన్ను కాపాడుతున్నందుకు ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ ఇలాగే నాతో మీరు ఉంటారని ఆశిస్తున్నాను బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1185వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రతి ఒక్క కోరికను తీరుస్తూ సంతోషంగా చూసుకుంటున్న బాబా
2. బాబా అందరివాడు - ఎవ్వరు ఏది అడిగినా ఇస్తారు
3. సాయి దయతో చెల్లెమ్మకు కొడుకు

ప్రతి ఒక్క కోరికను తీరుస్తూ సంతోషంగా చూసుకుంటున్న బాబా

ఓం శ్రీసాయినాథాయ నమః!!! నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా సాయితండ్రికి నా శతకోటి వందనాలు. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న సాయికి, సాయి భక్తులకు నా నమస్కారాలు. నేను ఇప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను పంచుకోవాలనుకుంటున్నానుఈమధ్య అంటే 2022, మార్చిలో మేము తిరుమలకి వెళ్లాలని నిర్ణయించుకుని బస్సులో వెళ్లేందుకు టికెట్లు బుక్ చేయించుకున్నాము. మాతో ఇద్దరు పిల్లలు ఉన్నందున నేను బాబాతో, "బాబా! మా తిరుమల ప్రయాణం సంతోషంగా ఏ ఇబ్బంది లేకుండా జరిగేటట్లు చూడండి. దర్శనం విషయంలో ఆలస్యం లేకుండా బాగా తృప్తిగా జరిగితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల నా ప్రయాణం, శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం చాలా బాగా, సంతోషదాయకంగా జరిగాయి. "థాంక్యూ బాబా".

మా బాబుకి మార్చి నెల చివరిలో అమ్మవారు పోసింది. ఇంట్లో చిన్నపాప ఉన్నందున నాకు చాలా భయమేసి, "బాబా! బాబుకి త్వరగా తగ్గిపోయేలా చూడండి. అలాగే పాపని, మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోండి" అని చెప్పుకున్నాను. బాబుకి ఐదు రోజుల్లో చాలావరకు తగ్గి, తొమ్మిదో రోజుకి పూర్తిగా నార్మల్ అయిపోయాడు. మాకు కూడా ఏ ఇబ్బంది కలగలేదు. బాబా దయవల్లనే మా బాబు త్వరగా కోలుకున్నాడు. అయితే అమ్మవారు తగ్గాక బాబు ఒంటిమీద గడ్డలు లేచి బాధపడ్డాడు. అవి చాలారోజుల వరకు తగ్గలేదు. అప్పుడు నేను బాబాతో, "బాబా! బాబుకి పరీక్షలు మొదలయ్యేసరికి తన ఆరోగ్యం బాగయ్యేలా చూడండి. అలా జరిగితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. బాబా దయవలన ఆ గడ్డలు త్వరగా తగ్గిపోయాయి.

ఉగాది రోజు నుంచి మా నాన్న ఒంటి మీద సర్పితో చాలారోజులు ఇబ్బందిపడ్డారు. నాకు భయమేసి, "బాబా! నాన్నకి త్వరగా తగ్గిపోయేలా చూడు తండ్రి" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయతో నాన్నకు సర్పి తగ్గింది కానీ, నొప్పులు తగ్గలేదు. అందువల్ల స్కానింగ్ తీయించుకోవాలని నాన్న హాస్పిటల్ కి వెళ్లారు. అప్పుడు నేను, "బాబా! స్కానింగ్ లో అంతా నార్మల్‍గా ఉండాల"ని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవలన రిపోర్టులో ఏమి ఇబ్బంది లేదని వచ్చింది. డాక్టరు కొన్ని మందులు రాసి పంపించారు. నాన్న ఇప్పుడు ఆ మందులు వాడుతున్నారు. బాబా దయతో నాన్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

మనం బాబాతో ఏవైనా కోరికలు చెప్పుకుని, బ్లాగులో పంచుకుంటామని చెప్పుకుంటే, బాబా ఖచ్చితంగా వింటారు, తప్పకుండా మన కోరికలను తీరుస్తారు. ఎన్ని సమస్యలున్నా బాబాతో చెప్పుకుంటే చాలా ఊరటగా ఉంటుంది. ఆయన మా ప్రతి ఒక్క కోరికను తీరుస్తూ మమ్మల్ని సంతోషంగా చూసుకుంటున్నారు. "బాబా! మీకు నా కోరిక ఏంటో తెలుసు. దయచేసి దానిని త్వరగా తీరేలా చూడు తండ్రి. అయినా ఏది, ఎప్పుడు, ఎలా జరగాలో మీకు తెలుసు. ప్లీజ్ బాబా మా జీవితానికి ఒక ఆధారం చూపించు తండ్రి. ఇంకా మా అత్తగారివాళ్ళతో ఉన్న సమస్యలు కూడా త్వరగా తీరిపోయేలా చూడు బాబా. అలాగే అందరూ సంతోషంగా ఉండేలా చూడు తండ్రి".

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జైజైజై!!!

బాబా అందరివాడు - ఎవ్వరు ఏది అడిగినా ఇస్తారు

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, నా పాలిట రక్షకుడు, మా ఇంటి ఇలవేల్పు అయిన మా సాయినాథునికి పాదాభివందనాలు. సాయి బంధువులందరికీ నమస్కారాలు. బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని బ్లాగులో పంచుకునే అవకాశమిచ్చిన 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహకులకు కృతజ్ఞతలు. నా పేరు విద్యారాణి. మావారి పేరు బాలకృష్ణ. మాకు ఇద్దరు పిల్లలు రంగినేని విహాన్, రోహన్. బాబా ఆశీస్సులతో మేము ఈ మధ్యకాలంలో ఒక ఫ్లాట్ తీసుకున్నాము. అయితే ఆ సమయంలో మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేనందున అప్పు చేసి మరీ ఆ ఇల్లు కొన్నాము. అప్పటినుంచి నేనుకానీ, మావారుకానీ సంతృప్తిగా ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. కారణం చేసిన అప్పు ఎలా తీర్చాలన్న ఆందోళన. బాబా దయతో అంతా మంచిగా ఉంటుందని అనిపిస్తున్నప్పటికీ లోపల అప్పు ఎప్పుడు తీరుతుందో, వడ్డీలు కట్టలేకపోతున్నామని ఏదో టెన్షన్‍గా ఉండేది. అదలా ఉంచితే, నేను చిట్టీ వ్యాపారం చేస్తాను. అందులో నాకు చాలా నష్టం వచ్చింది, చాలామందికి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. కానీ మా దగ్గర డబ్బులేదు. ఇటువంటి పరిస్థితుల్లో 2022, మే నెల మొదటివారంలో నేను బాబాను, "బాబా! ఈ నెలలో డబ్బులకి చాలా టైట్‍గా ఉంది. చిట్టీల వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఇంటి అప్పు తీర్చాలి. కానీ నేను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను. మీరే నన్ను రక్షించాలి. మీ దయతో అంతా సవ్యంగా జరిగితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అంతే, బాబా నా బిజినెస్ మీద లోన్ పెట్టేలా నాకు ప్రేరణనిచ్చారు. ఆయన దయతో లోన్ సాంక్షన్ అయింది. ఆ డబ్బులతో కొంత అప్పు తీర్చి, మరికొంత చిట్టీల వాళ్ళకి ఇచ్చి టెన్షన్ నుండి 60% ఉపశమనం పొందాను. బాబా నా ఫ్రెండ్. నాకు ఎప్పుడు ఏది కావాలో దాన్ని నా దగ్గరికి పంపిస్తారు. ఆయన అందరివాడు. ఎవ్వరు ఏది అడిగినా సరే ఇస్తారు. అదీ నా బాబా. ఆయన నాకు విలువైనదిచ్చి నేను తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టారు. "ధన్యవాదాలు బాబా. నేను ఎన్నటికీ మిమ్మల్ని మరువను తండ్రి. మీ దయతో ఇప్పటివరకైతే బాగుంది. లోన్ తీసుకున్నాను. కానీ ఏదో టెన్షన్‍గా ఉంది. నెలకు లక్షకు పైన EMI కట్టాలి. ఆ స్థోమతను నాకు ఇవ్వండి. ఇంకా నేను చాలా నష్టపోయాను. ఆ నష్టమంతా తిరిగి పూడ్చుకోవాలి. అలాగే నాకున్న మరి కొన్ని కోరికలు కూడా నెరవేరితే, నా అనుభవాన్ని ఖచ్చితంగా బ్లాగులో పంచుకుంటాను. మీరు నాపై దయ ఉంచి, ఎల్లవేళలా నాతో ఉంటూ నన్ను సంరక్షించండి. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు కావాలి బాబా. లవ్ యు బాబా".

సాయి దయతో చెల్లెమ్మకు కొడుకు

సాయి బంధువులకు నమస్కారం. నా పేరు సాయిరాజ్ కుమార్. మాది వరంగల్. నేను గతంలో మన ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. 24 ఏళ్ళ కిందట మా అమ్మ చనిపోయింది. నాన్న 2019వ సంవత్సరంలో చనిపోయారు. అప్పటినుంచి చెల్లికి పెళ్లికాలేదన్న బాధ మాకు ఎక్కువగా ఉండేది. తను కూడా సాయిబాబా భక్తురాలు. మేము, "బాబా! మీ దయతో చెల్లికి పెళ్ళై కొడుకు పుడితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాము. శ్రీసాయినాథుని దయతో చెల్లికి పెళ్ళై, ఆయన వరప్రసాదంగా 2022, ఏప్రిల్ 15న చెల్లి ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అంతా సవ్యంగా జరగడానికి ఆ శిరిడీ సాయినాథుని అపార అనుగ్రహమే ప్రధాన కారణం. ఇలా అమ్మానాన్న లేని మాకు శ్రీసాయినాథుడే అమ్మానాన్నగా ఉండి నడిపిస్తున్నారు. "హృదయపూర్వక కృతజ్ఞతలు సాయీశ్వరా".

సాయిభక్తుల అనుభవమాలిక 1184వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఒమిక్రాన్ నుండి ఇంటిల్లిపాదిని కాపాడిన బాబా
2. కాపాడే తండ్రి బాబా
3. నార్మల్ రిపోర్టు వచ్చేలా అనుగ్రహించిన బాబా

ఒమిక్రాన్ నుండి ఇంటిల్లిపాదిని కాపాడిన బాబా


నేను ఒక సాయి భక్తురాలిని. అడుగడుగునా 'నేనున్నాను' అని నిరూపిస్తూ, మనల్ని అన్ని విధాలా భరిస్తూ తల్లీ, తండ్రీ సర్వమూ తామేనని చాటుతున్న శ్రీసాయినాథునికి శతకోటి ప్రాణామాలు. సాయి బంధువులందరికీ నమస్కారం. కష్టంలో, దిక్కుతోచని స్థితిలో ఉన్న ఎందరికో బాబా మీద నమ్మకాన్ని పదింతలు చేసే ఈ మహత్కార్యాన్ని ఒక యజ్ఞంలా భావించి ఎందరికో 'బాబా ఉన్నారు, మన భారం ఆయనపై వేసి, మన పగ్గాలను ఆయనకు అప్పగిస్తే, ఆయన తప్పక మనకు దారి చూపిస్తార'ని నిరూపించే ఎన్నో వేల అనుభవాలను పోగుచేసి ఆధునిక సచ్చరిత్రగా ఈ బ్లాగును నిర్వహిస్తున్న బ్లాగు నిర్వాహకులకు నా ధన్యవాదాలు. "బాబా! దయచేసి ఎప్పటిలానే నన్ను క్షమించండి. నా ఈ అనుభవాల్ని పంచుకోవడంలో చాలా ఆలస్యం చేశాను. మేమందరం కేవలం మీ చేతిలో తోలుబొమ్మలం. కనుక తెలిసీతెలియక మేము చేసే తప్పొప్పులను ప్రేమతో మీరే సరిచేసి మాకు మీ మీద ఉన్న శ్రద్ధ, భక్తులను సదా వందల రెట్లు పెరిగే విధంగా నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి" అని వేడుకుంటున్నాను. ఇక నా అనుభవానికి వస్తే..


సరిగ్గా కరోనా థర్డ్ వేవ్ మొదలవుతున్న సమయంలో ఒక ముఖ్యమైన పని మీద నేను ఒక నెల రోజులు ఇంటికి, కుటుంబానికి దూరంగా క్యాంపుకు వెళ్ళవలసి వచ్చింది. సౌత్ ఆఫ్రికా, అమెరికా, లండన్ తదితర దేశాల్లో ఒమిక్రాన్ విజృంభించటం, ఫ్లైట్స్ రాకపోకల మీద ఆంక్షలు విధించటం జరుగుతున్నాయి. ఇండియాలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. అయితే అప్పటికే నా ప్రయాణానికి సంబంధించి టికెట్స్ మొదలు ప్రోగ్రాం అంతా ప్లాన్  అయిపోయింది. ఎక్కువ రోజుల దూరప్రయాణం, ఇంటికి దూరంగా నేను, ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు. నేను వాళ్ళను చూసుకున్నంత శ్రద్ధగా ఇంకెవరూ చూసుకోరు, అలాంటిది నేను లేకపోతే వాళ్ళు జాగ్రత్తగా ఎలా ఉంటారో అని దిగులు, అనుమానం, భయం అన్నీ కలిసి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. అందువలన నా ప్రయాణం నిశ్చయమైన నెల రోజుల దగ్గర నుండి నేను నా అనుమానాలు, భయాలు అన్ని బాబాతో చెప్పుకుంటూ ఆయనని పరిపరి విధాల విసిగిస్తుండేదాన్ని. ఆయన ప్రతి విషయానికి, 'నేనున్నానుగా, ప్రశాంతంగా వెళ్లి రా' అనే సంకేతాలు ఇస్తుండేవారు. ఇక భారం ఆయనపై వేసి ప్రయాణానికి సిద్ధం అవుతుండగా మేమున్న ప్రాంతంలో ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరగటం మొదలయింది. ఇప్పుడు మనకి అంత భయం లేదు కానీ, అప్పటి పరిస్థితుల్లో కరోనా సెకండ్ వేవ్ తాలూకు భయాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. పైగా థర్డ్ వేవ్ డామేజ్ అంటూ మన న్యూస్ చానెల్స్ కూడా భయపెట్టేస్తుండేవి. నేను ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తుండగా దారిలో 'ఎయిర్ పోర్టులో కొందరికి న్యూ వేరియంట్, వాళ్లలో కొందరు పారిపోయారు. వందల కొద్ది కొత్త వేరియంట్ కేసులు బయటపడుతున్నాయి' అని న్యూస్ వచ్చింది. ఆ నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకుని ఇంటికి వెళ్లిపోదామన్న ఎన్నో ఆలోచనలు నా మనసును చుట్టుముట్టాయి. కానీ బాబా, 'నీకేం భయం లేదు, నీ వాళ్ళని నేను జాగ్రత్తగా చూసుకుంటాను వెళ్ళిరా' అని పదేపదే చెప్తున్నట్టు పలురకాల సందేశాలు అందాయి. చివరికి భారం బాబాపై వేసి, ఇక బాధ్యత అంతా ఆయనదే అన్న ధీమాతో, నమ్మకంతో నా ప్రయాణం సాగించి రోజులు గడిపాను.


నేను తిరిగి వచ్చే సమయానికి కరోనా థర్డ్ వేవ్ తారాస్థాయికి చేరుకుంది. నేను ఎంతో జాగ్రత్తగా ఇంటికి వచ్చి భయం భయంగా వారం రోజులు ఇంట్లోవాళ్లకు దూరంగా గృహనిర్బంధంలో ఉన్నాను. అప్పటికీ లోలోపల అనుమానంగా, భయంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈలోపు సంక్రాంతి పండుగ వచ్చింది. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నారని ఎవరినీ, పనుల కోసం ఇబ్బందిగా ఉన్నప్పటికీ చివరికి పనిమనిషిని కూడా ఇంట్లోకి రానివ్వకుండా సురక్షితంగా ఉంటున్నాము. అలాంటి పరిస్థితుల్లో మా ఇంటికి అనుకోని అతి సమీప బంధువు, వారికోసం పనిమీద వచ్చిన ఇంకొకరు అంటే అతని స్నేహితుడు వచ్చారు. ఆ స్నేహితుని భార్యకి ఆ సమయంలో జ్వరం ఉంది. అయితే అతను అది మామూలు జ్వరమేనని మా బంధువుతో కలిసి మా ఇంట్లో తిరిగారు. పిల్లలు గంటలకొద్దీ వాళ్ళ పక్కన, ఎదురుగా కూర్చుని ఆడుకున్నారు. అత్తయ్య, మావయ్యలు కూడా వాళ్ళ పక్కన, ఎదురుగా కూర్చుని చాలా ఎక్కువసేపు మాట్లాడుకోవటం, కలిసి టిఫిన్లు, భోజనాలు చేయడం వంటివన్నీ జరిగాయి. నేను, 'ఈ సమయంలో వచ్చిన జ్వరం ఖచ్చితంగా కరోనానే' అని భయపడుతూ ఉన్నప్పటికీ అతను బాధ్యత లేకుండా ఉంటే ఏమీ చెప్పలేక, "ఇంట్లో అందరూ సురక్షితంగా ఉండాలి" అని బాబాకు చెప్పుకుంటూ ఉండసాగాను.


మరుసటిరోజు ఆ స్నేహితుని ఇంట్లో అందరికీ జ్వరాలు మొదలయ్యాయి. కోవిడ్ టెస్టులో అతని ఇంట్లో అందరికీ ముందు నెగిటివ్ వచ్చినా, తరువాత పాజిటివ్ వచ్చింది. అతను ఏం చెయ్యాలో తెలియక మాకు ఫోన్ చేసి, "మా ఇంట్లో పెద్దవాళ్ళున్నారు. అందరూ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి. ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. ఏ గైడెన్స్ దొరకట్లేదు. మీకు తెలిసిన వాళ్లందరినీ కనుక్కోని మాకు సహాయం చేయండి" అని అన్నాడు. ఇక నా పైప్రాణాలు పైనే పోయాయి. అనుకున్నంతా అయింది. అతనితో మా ఇంట్లో కలిసిమెలిసి తిరిగిన పిల్లలు, పెద్దలు అందరికీ ఒకటే భయం పట్టుకుంది. నేను మాత్రం, "ఇప్పుడు ఇంట్లో అందరి క్షేమాన్ని మీరే చూడాలి బాబా" అని బాబాను ఒకటే నస పెట్టేశాను. ఆ మరుసటిరోజుకి మా బంధువుకి నీరసం, జలుబు వంటి లక్షణాలు మొదలయ్యాయి. అయినా అతను,  'ఏమీ లేదులే, ఎసి దగ్గర ఉన్నాను, బయట చల్లగా ఉంది, చిన్న చిన్న అనుమానాలను పెద్దగా చేసుకుని మనం ఊరికే టెన్షన్ పడతామ'ని లెక్చర్ ఇచ్చారు. కానీ అతనికి ఆ రాత్రికి జ్వరం కూడా వచ్చింది. ఉదయానికి అతని భార్య కంగారుపడటం మొదలుపెట్టింది. ఆమె భర్త మాత్రం 'పెద్ద జ్వరం ఏమీ లేదు. వంద ఉంది. అంతే' అని అనసాగారు. ఎటూ, ఏమీ మాట్లాడలేని పరిస్థితి. కానీ ఒకే ఇంట్లో ఉన్న అందరికీ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని అప్పటికే చాలా చూశాం. అందువలన నేను లోలోపల భయంతో ఏదో విధంగా అందరినీ గృహనిర్బంధంలో ఉంచి క్షణక్షణం అందరినీ గమనించుకుంటూ, బాబాను ప్రార్థిస్తూ వారం రోజులు గడిపాను. పదిరోజుల వరకు మనఃశాంతి లేదనే ఒక్కటి తప్పితే బాబా ఇంట్లో అందరినీ కాపాడారు. మాకెవ్వరికీ ఏమీ కాలేదు. ఏమిచ్చి బాబా ఋణం తీర్చుకోగలను?


"ధన్యవాదాలు బాబా. మీకు ఒక విన్నపం బాబా, నా విషయంలో మా బాస్ ప్రవర్తనలో ఏదో కొద్దిపాటి తేడా కనిపిస్తోంది. బాగా వర్క్ బిజీలో ఉండి నన్ను కాస్త పట్టించుకోవడం లేదో ఏమో నాకు తెలియదు. కానీ, నేను తెలిసితెలిసి వారి విషయంలో లేదా వర్క్ విషయంలో ఎటువంటి తప్పూ చేయలేదు బాబా. నాపట్ల ఏవైనా అపోహలు, అపార్ధాలు వంటివి ఉండి ఉంటే వాటిని దయచేసి క్లియర్ చేయండి బాబా. మీ తర్వాత అంత గౌరవం, విలువ వారికి ఇస్తాను అనే విషయం ఆయనకు కూడా తెలుసు బాబా. కానీ నా పరిధిలో ఉన్న వర్క్ వేరే వాళ్లకు షేర్ చేసే విషయంలో నాకు మాటైనా చెప్పకపోవడం, నేను శ్రద్ధగా కష్టపడి టైంకు వర్క్ పూర్తి చేసి ఇచ్చిన వర్క్ కు వేరే వాళ్ళు తన కళ్ళ ఎదురుగా క్రెడిట్ తీసుకుంటున్నా కూడా మౌనంగా ఉండటం వంటివి నేను ఓర్పుగా చూస్తున్నాను బాబా. ఇది 2, 3 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. అన్నీ తెలిసి ఎందుకు మౌనంగా ఉన్నారో నాకు తెలీదు. దయచేసి ఆ విషయంలో అంతా మంచిగా మారేలా మీరు అనుగ్రహించండి తండ్రి. ఇంకొక ముఖ్యమైన విషయం మీ చేతిలో పెట్టాను, మీ పాదాలు పట్టుకున్నాను. ఎటువంటి మోసాలు, కుట్రలు, కుతంత్రాలు వంటి వాటికి బలి కాకుండా మీ రక్షణ వలయంలో మమ్మల్ని కాపాడండి బాబా. ఎవరినీ నమ్మలేని పరిస్థితులు ఉన్నాయి. మీరు మా మంచి, చెడులు చూస్తూ, సరైన నిర్ణయాలు మాత్రమే మా జీవితంలో జరిగేట్టుగా అనుగ్రహించండి".


కాపాడే తండ్రి బాబా


ముందుగా శ్రీసాయి పాదపద్మములకు ప్రణామాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి, సాయి బంధువులకు నా నమస్కారాలు. నా పేరు శ్రీదేవి. నేను బాబా బిడ్డను. నా తండ్రి నన్ను ప్రతిక్షణమూ కాపాడుతున్నారు. కరోనా సెకండ్ వేవ్‍లో నాకు కోవిడ్ వచ్చి చాలా బాధపడ్డాను. ఆ సమయంలో నేను రోజూ బాబా చరిత్ర చదువుకుంటూ ఉండేదాన్ని. సినిమాలు చూసినా నా తండ్రి బాబా సినిమాలే చూసేదాన్ని. నా తండ్రి దయతో నేను కరోనా నుండి కోలుకున్నాను. తరువాత కరోనా మూడో వేవ్‍లో నాకు మళ్ళీ జ్వరం వచ్చింది. ఆ రాత్రి నాకు చాలా భయమేసి గుండెల్లో దడ వచ్చింది. అప్పుడు నేను పడుకున్నా, కూర్చున్నా బాబా ఫోటోని గుండెలకి హత్తుకుని, "బాబా! నాకు జ్వరం తగ్గి, నేను మామూలుగా ఐతే నా అనుభవాన్ని, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల నేను ఉదయానికి మామూలుగా అయ్యాను.


ఈమధ్య మా అక్క కూతురు వివాహం బాబా దయవల్ల ఏ ఆటంకం లేకుండా జరిగింది. ఆ పెళ్లి హడావిడిలో ఇంకో అక్కవాళ్ళ బంగారం పోయింది. మేము చాలా భయపడి, "ఇలా జరిగిందేమిటి బాబా? పోయిన బంగారం దొరికితే, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాము" అని బాబాకి చెప్పుకొని వెతికితే వెంటనే ఆ బంగారం దొరికింది. "పిలవగానే పలికే సాయితండ్రి! మీ కరుణకు శతకోటి వందనాలు తండ్రి. మీరు ఎప్పుడూ మాతోనే ఉంటారని నిరూపించారు. బాబా అమ్మలా నన్ను ఎప్పుడూ కాపాడుతూ నా తప్పులు ఏవైనా ఉంటే క్షమించు తండ్రి".


నార్మల్ రిపోర్టు వచ్చేలా అనుగ్రహించిన బాబా


బ్లాగు నిర్వాహకులకు మరియు సాయి బంధువులందరికీ నమస్కారం. నేనొక సాయి భక్తురాలిని. నాపేరు శ్రీదేవి. బాబా ప్రసాదించిన ప్రతి అనుభవాన్నీ తోటి సాయి బంధువులందరితో పంచుకోవటానికి ఈ బ్లాగు ఎంతో ఉపయుక్తంగా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇంతకుముందు పంచుకున్న ఒక అనుభవంలో నా చెల్లెలి భర్త ఆరోగ్య విషయంలో బాబా అనుగ్రహాన్ని మీతో పంచుకున్నాను. అయితే ఈమధ్య మళ్ళీ అదే ఆనారోగ్య సమస్యతో మా మరిది చెకప్ కోసం హాస్పిటల్‍కి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు నేను, "బాబా! మా మరిది టెస్టు రిపోర్టుల్లో ఎలాంటి సమస్యా లేదని వస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల తనకి 'లంగ్స్ లో ఎలాంటి సమస్య లేదు, అంతా నార్మల్' అని రిపోర్టు వచ్చింది. కానీ నేను నా అనుభవాన్ని బ్లాగులో పంచుకోవటం మర్చిపోయాను. అందువల్లనేమో మా మరిదికి ఇంకా ఆరోగ్యం కుదుటపడలేదు. "బాబా! నా తప్పు మన్నించు తండ్రి. మీరే మాకు సర్వస్వం. నీ బిడ్డకు ఆరోగ్యం ప్రసాదించు తండ్రి. అందర్నీ మీ చల్లని చూపులతో అనుగ్రహించు తండ్రి".


సాయిభక్తుల అనుభవమాలిక 1183వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా తోడుగా ఉంటే, అంతకన్నా అదృష్టమేముంటుంది!!
2. కొంతసేపు అయోమయానికి గురిచేసినా అంతలోనే "నేనున్నా" అని చేయూతనిచ్చిన బాబా

బాబా తోడుగా ఉంటే, అంతకన్నా అదృష్టమేముంటుంది!!


'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు, సాయి భక్తులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఒక అసాధ్యమైన పరిస్థితిలో ఎంతో బాధలో ఉండి, "బాబా! నాకు సహాయం చేయండి. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను బాబా" అని ప్రార్థించినంతనే బాబా నాకు సహాయం చేసి చాలా సంతోషాన్ని కలిగించారు. ఆ అనుభవాన్ని నేనిప్పుడు ముందుగా మీతో పంచుకుంటాను. ఒక గురువారంనాడు నేను, మా అక్క పని మీద బయటకు వెళ్తుంటే, గేటు దగ్గర నా చెయ్యి ఎవరో పట్టుకుని వెనక్కి లాగినట్టుగా అనిపించింది. చూస్తే, నా చేతికున్న చాలా విలువైన బాబా బ్రేస్లెట్ తాలూకు చైన్ గేటుకు పట్టుకుని ఉంది. వెంటనే దాన్ని సరి చేసుకుని, "ఇదేమిటి బయటికి వెళ్తుంటే, ఇలా అయింది?" అని కొంచం సెంటిమెంట్‌గా ఫీల్ అవుతూనే తప్పనిసరిగా బయటికి వెళ్ళాల్సి ఉండటంతో బాబాకు మళ్లీ దణ్ణం పెట్టుకుని వెళ్ళాము. పనులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుంటున్నప్పుడు చేతికి బ్రేస్లెట్ లేకపోవడం చూసి నా గుండె ఆగినంత పనైంది. వెంటనే ఇంట్లో, బయట, కారులో వెతికినా ఆ బ్రేస్లెట్ ఎక్కడా కనిపించలేదు. నాకు ఎప్పటినుండో ఆ చైన్ అంటే చాలా సెంటిమెంట్. నాకున్న ఆరోగ్య సమస్యలకోసం చాలా విలువైన రత్నాలు పొదిగి మరీ చేయించుకున్న చాలా ఖరీదైన వస్తువది. అందులోనూ బాబాది. కాబట్టి అది ఎంతో అమూల్యమైనది. అందువలన నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! మీరు నా నుండి వేరు కాకూడదు. ఆ బ్రేస్లెట్ నాకెంతో అవసరం. నేను దానిని కేవలం బంగారపు విలువైన వస్తువుగా చూడట్లేదు. అదంటే నాకు ఎంతో సెంటిమెంట్. మీరు ఉన్న వస్తువు. అది కోల్పోతే, నా జీవితంలో అతి ముఖ్యమైన, అతి విలువైన వస్తువుని పోగొట్టుకున్నట్లే. అది దొరకడం అసాధ్యమని నాకు తెలుసు. ఎందుకంటే, అంత విలువైన వస్తువు దొరికితే, ఎవ్వరూ తిరిగి ఇవ్వరు. కానీ మీరు నాతో ఉన్నారు. మీకు అసాధ్యం అనేది లేదు, ఉండదు. మీరు తప్పకుండా నాకోసం మిరాకిల్ చేస్తారని నమ్ముతున్నాను. అది దొరికినట్లైతే నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకుని బాబాని తలచుకుంటూ ఉన్నాను.


ఇకపోతే మేము పని మీద చాలా చోట్లకు వెళ్లి రావటం వల్ల ఎక్కడ వెతకాలన్న ఆలోచన కూడా రావట్లేదు. అయినా వెళ్లొచ్చిన ప్రతి చోటుకీ వెళ్లి వెతకడం అంత తేలిక కూడా కాదు. అందువలన దగ్గరలో కొన్ని చోట్ల అడిగినా ప్రయోజనం లేకపోయింది. అందరూ మాకు తెలీదనే అన్నారు. ఒకవేళ తెలిసినా అంత విలువైన వస్తువు వెనక్కి ఇవ్వటమన్నది దాదాపు అనుమానమే. అందుచేత ఎక్కడికి వెళ్ళాలో అర్ధంకాక బాబాకు నా బాధను చెప్పుకుంటూ ఉండగా అక్కతోపాటు ఒక చిన్న షాపులోకి వెళ్ళటం గుర్తొచ్చి, ఏ మాత్రమూ ఆశ లేకున్నా ఊరికే వెళ్లి అడుగుదాం, పోయిందేముందని ఆ షాపుకి అక్క, నేను వెళ్ళాము. మమ్మల్ని చూస్తూనే అక్కడున్న ఒక సేల్స్ గర్ల్ నిర్ఘాంతపోయి ఒకలా చూస్తోంది. ఆమె భావాలను చూస్తుంటే ఎందుకో తెలీదుగానీ తనే చైన్ తీసుంటుందని అనిపించలేదుగాని, అబ్బా... వీళ్ళెందుకు వచ్చారని చూస్తున్నట్లనిపించింది. "క్షమించండి బాబా. ఇలా అనుకోకూడదేమో కానీ, ఆ క్షణం నా మనసుకి అదే అనిపించింది. నిజం మీకు తెలుసు". అదలా ఉంచితే, షాపులో ఆమె పక్కనున్న మరో సేల్స్ గర్ల్ ను మేము చైన్ గురించి అడిగాము. ఆమెకి చెప్పడం ఇష్టం లేకపోయినప్పటికీ తను చెప్పకపోతే, పక్కనున్న ఆమె నిజం చెప్పేస్తుందేమో అన్నట్టు సణుగుతూ, "అది మీదా?" అని నిట్టూర్పుగా అడిగింది. ఇంకా "ఇది బంగారందా? బంగారం అనుకోలేదు, కిందపడిపోతే తీసి పక్కన పెట్టాను. మీదేనా?" అంటూ తప్పనిసరై వెనక్కి ఇచ్చింది. ఈలోపు నా మీద ఎంతో ప్రేమతో తన మొక్కులతో బాబాను ఉక్కిరిబిక్కిరి చేస్తూ నాతోపాటు వెతకటానికి వచ్చిన మా అక్క ఆమెకు చాలా థాంక్స్ చెప్పి, ఆ చైన్ నాకెంత ముఖ్యమో చెప్పి కొంత డబ్బు ఇవ్వబోయింది. ఆమె మోహమాటంతో తీసుకోలేదు. ఏదేమైనా మా వస్తువు మాకు దొరికినందుకు చాలా సంతోషంగా అనిపించి బాబాకి ఎన్నో వేల కృతజ్ఞతలు చెప్పుకుంటూ అక్కడినుండి వచ్చేసాము. అంతా ఒక కలలా జరిగిపోయింది. నిజానికి ఆ చైన్ దొరికే అవకాశమే లేదు. కానీ బాబా మమ్మల్ని అదే చోటుకు వెళ్ళేలా ప్రేరణ నివ్వటం, ఆ సేల్స్ గర్ల్ గత్యంతరం లేక ఇక్కడ పడిపోతే తీసి పక్కన పెట్టాను అని చెప్పటం ఇదంతా బాబా మిరాకిల్ తప్ప వేరొకటి  కానేకాదు. ఆమె నాకు తెలీదని ఒక్క మాట అనేసి ఉంటే మేమేమీ చేయగలిగేవాళ్ళం కాదు. అలాంటిది బాబా అటువంటి పరిస్థితిని నాకు అనుకూలంగా మలిచి మళ్లీ నా వస్తువును నా దగ్గరకు చేర్చారు. అంత విలువైన వస్తువు వెనక్కి దొరకటం అసాధ్యమైనప్పటికీ బాబా దాన్ని సాధ్యం చేశారు. పిలిచిన వెంటనే నేనున్నాను అని నిదర్శనం చూపించే బాబా ఋణం ఎలా తీర్చుకోగలం? కృతజ్ఞతతో ఆయనకు నమస్కరించి ప్రేమించటం తప్ప!


పై అనుభవం జరిగిన వారం, పదిరోజులకి మా అక్క కుటుంబంతో కలిసి మేమందరం గుడికి వెళ్ళాము. దైవ దర్శనానంతరం బయటకు వచ్చి కూర్చున్నాం. అక్కడ కింద పచ్చగడ్డిలో మా అక్క చెవి ఝుంకా పడిపోవటం మేము చూసుకోలేదు. తీరా గుడి నుండి బయటకు వచ్చాక చూస్కుంటే, అక్క చెవికి ఝుంకా కనిపించలేదు. వెంటనే నేను, "బాబా! ఆ బంగారపు ఝుంకా దొరికేట్టు చేయండి. ఆ రోజు నా చైన్ పోయినప్పుడు అక్క నాకోసం చాలా బాధపడి ఎంతో సహాయం చేసింది. అలాంటి తన వస్తువు పోకూడదు బాబా. అది దొరికితే ఈ అనుభవాన్ని కూడా బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్తించి మేము అంతకుముందు కూర్చున్న చోటుకు వెళ్లి చూస్తే, అక్కడ అక్క ఝుంకా దొరికింది. ఈ రెండు సందర్భాలలోనూ బాబా చాంద్‌పాటిల్‌తో అతని తప్పిపోయిన గుఱ్ఱం విషయంలో అక్కడకి వెళ్లి చూడమని చెప్పడం ద్వారా గుఱ్ఱం జాడ తెలిపినట్లు మా మనసుకు తెలిసేలా చాలా స్పష్టమైన ప్రేరణనిచ్చారు. ఆయన సూచించిన చోటే మా వస్తువులు మాకు దొరికాయి.


ఇంకొకసారి మా అక్క సంగీతానికి సంబంధించి సీనియర్ పరీక్షలకు అటెండ్ కావాల్సి ఉండగా కుటుంబ బాధ్యతల బిజీ వల్ల పూర్తిస్థాయిలో ప్రాక్టీస్ చేయలేకపోయింది. అదీకాక కరోనా సమయంలో చాలాసార్లు ప్రాక్టికల్ పరీక్షలు కాన్సిల్ చేసి తేదీలు మార్చి చివరికి హఠాత్తుగా పరీక్షల తేదీని ప్రకటించారు. అందువల్ల అక్క చాలా టెన్షన్‌కి గురై చివరి నిమిషంలో ప్రిపేరేషన్ మొదలుపెట్టింది. ఇంకా 'బాబా తోడుగా ఉన్నారు, భయపడొద్ద'ని ధైర్యం తెచ్చుకుని, "బాబా! ఏదో ఒకలా పరీక్ష గట్టెక్కించండి, మీ దయతో ఈ సంవత్సరం వృధా అవకుండా ఉంటే, అంతే చాలు. అదే జరిగితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను బాబా" అని బాబాకు చెప్పుకుని అక్క పరీక్షకి వెళితే మొదటి టెస్టు తనకే తీసుకున్నారు. కానీ ఎందులో అయితే తను వీక్‌గా ఉందో, ఆ భాగం నుండే తనని ప్రశ్న అడిగారు. సరిగా అదే సమయానికి ఎవరో వచ్చి ఆ ఎగ్జామినర్‌ని డిస్టర్బ్ చేయడం, దాంతో ఆవిడ కాసేపు డైవర్ట్ అయి ఏదో డిస్కషన్‌లో పడటం జరిగాయి. ఇకపోతే టెస్ట్ చేయడానికి చాలామంది ఉండటంతో అక్కని ఆ ప్రశ్నకు సమాధానం చెప్పమని ఇబ్బంది పెట్టకుండా వదిలేయటంతో తను ఊపిరి పీల్చుకుని బాబాకు ధన్యవాదాలు చెప్పుకుని సంతోషంగా ఇంటికి వచ్చేసింది. అంతా బాబా మహిమకాక మరేమిటి? ఇలా అన్నింటిలోనూ బాబా తోడుగా ఉంటే అంతకన్నా అదృష్టం ఏముంటుంది! "శతకోటి ధన్యవాదాలు బాబా. మీ ఋణం ఎలా తీర్చుకోగలం తండ్రి? ఎప్పటికీ మా చేయి విడవొద్దు బాబా. మీ నీడలోనే మా జీవితాలు తరించాలి" అని వేడుకుంటూ... మీ అమ్మాయి.


కొంతసేపు అయోమయానికి గురిచేసినా అంతలోనే "నేనున్నా"అని చేయూతనిచ్చిన బాబా


సాయి బంధువులకి వినయపూర్వక నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయి స్వరూపులకు కృతజ్ఞతాభినందనాలు. నేను ఒక సాయి భక్తుడిని. నా పేరు విజయచంద్ర. మాది పశ్చిమ గోదావరి జిల్లా. ఇప్పుడు నేను పంచుకోబోయే అనుభవం 15 సంవత్సరాల క్రితం శ్రీసాయినాథుడు నాపై చూపిన కృపకు నిదర్శనం. బాబా దయవలన మా పెద్దబాబు శ్రీవత్స సాయికి NTTF బెంగళూరులో సీటు వచ్చింది. ఆ సీటు వచ్చినందుకు, అది కూడా బెంగుళూరులో వచ్చినందుకు మేము ఆనందంతో పొంగిపోయాము. అడ్మిషన్ సమయంలో నేను వెళ్ళాను. తరువాత బాబుకి క్లాసులు ప్రారంభించినపుడు, హాస్టల్లో చేర్చడానికి నా శ్రీమతి వెళ్ళింది. సరిగ్గా నెల తరువాత ఒక అర్ధరాత్రి బెంగుళూరు హాస్టల్ నుండి ఆ హాస్టల్ వార్డెన్ మాకు ఫోన్ చేసి, "మీ అబ్బాయికి చాలా సీరియస్ గా ఉంది" అని చెప్పారు. మేము ఉండేది ఏలూరులో. ఆ రోజుల్లో వెంటనే అర్ధరాత్రివేళ బెంగుళూరుకు బయలుదేరే పరిస్థితి లేదు. కొన్ని కొన్ని సందర్భాలలో ఎంత భక్తి, నమ్మకం ఉన్నా మనిషి భయబ్రాంతులకు లోనై విచక్షణ కోల్పోతాడు. దానికి ఉదాహరణ నేనే. ఇంట్లో బాబా పటం ముందు కూర్చొని, "ఓ  బాబా..! నిరంతరం నిన్నే తలుస్తూ, పూజ, పారాయణాలు చేస్తాను కదా! మీకు ఇంత కూడా దయలేదా? పరిస్థితి చాలా సీరియస్‍గా ఉంది. నేను ఇప్పుడు ఎలా అక్కడికి వెళ్ళాలి? అసలు నువ్వున్నావా? నిన్నే నమ్ముకున్న నన్ను బాధపెట్టడం నీకు తగునా చెప్పు" అని పెద్దగా అరుస్తూ, "'నువ్వు లేవు" అని ఆయన పటం తీసే ప్రయత్నం చేస్తూ పరమ మూర్ఖుడిలా ప్రవర్తించాను. తీవ్రమైన భయాందోలనలతో గంటకు పైగా నా దరిద్రపు వాగుడు కొనసాగించాను. మనం పామరులం, ఎమోషనల్ ఇడియట్లం, కంగారుపడడం మన నైజం కదా మరి. మన దేవుడు, మనకు సర్వస్వం అయిన బాబా నా ఉక్రోషం చూసి నవ్వుకున్నారేమో! సరిగ్గా గంటన్నర తరువాత మా అబ్బాయి ఫోన్ చేసి, "నేను బాగానే ఉన్నాను. మా వార్డెన్  శ్రీకాంత్ అనే అబ్బాయి తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి బదులు మీకు ఫోన్ చేసార"ని చెప్పాడు. అది విని నా మనసు ప్రశాంతించింది. మన బాబా ఎంతటి మహిమాన్వితులో కదా! మనని కొంతసేపు అయోమయానికి గురిచేసినా అంతలోనే "నేనున్నా" అని చేయూతనిస్తారు. ఇదంతా ఇప్పుడు వ్రాస్తుంటే గగుర్పాటు కలుగుతుంది, ఆనందంతో మనసు ఉప్పొంగిపోతుంది. ఈ అనుభవం ద్వారా నేను తెలుసుకున్నది ఏమిటంటే, బాబా అండ మనకుంటే మనం భయాందోళనలు చెందనవసరం లేదని. బాబాని నమ్మినవారికి ఏ కష్టమూ ఉండదు. ఇది సత్యం, ముమ్మాటికీ నిజం. సాయి నామస్మరణే మనకు రక్ష. చివరిగా ఒక మాట, బాబా దయవల్ల మా అబ్బాయి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు.


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1182వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఏ సమస్యనైనా ఇట్టే తీర్చే బాబా
 2. సాయినాథుని దయ
3. ఊదీ నీళ్లు త్రాగమని సూచించి తద్వారా కడుపునొప్పి తగ్గించిన బాబా

ఏ సమస్యనైనా ఇట్టే తీర్చే బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!!

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!


నా పేరు సంధ్య. నేను శిరస్సు వంచి శ్రీసాయినాథుని దివ్యపాదాలకు నమస్కరిస్తూ నా అనుభవాలను పంచుకోవడంలో ఆలస్యమైనందుకు ఆయనకు క్షమాపణలు వేడుకుంటూ నా అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ముందుగా 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న సాయికి, సాయిబంధువులకు నమస్కారాలు. నేను మహాశివరాత్రి సందర్భంగా ఇల్లు శుభ్రపరుస్తున్నప్పుడు నాకు చాలా మెడనొప్పి వచ్చింది. ఊదీ పెట్టుకుని, ఊదీ తీర్థాన్ని తీసుకుని బాబాను ప్రార్ధించాను. మెడనొప్పి కొంతవరకు తగ్గింది. అయితే రెండు రోజుల వ్యవధిలో మళ్ళీ వచ్చింది. ఈసారి దానితోపాటు తలనొప్పి కూడా వచ్చింది. ఆ మెడనొప్పి, తలనొప్పి భరించలేక 'హాస్పిటల్‍కి వెళ్ళాలా, వద్దా' అని చీటీలు వేసి బాబాను అడిగాను. బాబా, 'హాస్పిటల్‍కి వెళ్ళమ'ని చెప్పారు. అప్పుడు నేను, "సరే బాబా, మీరు చెప్పినట్లే హాస్పిటల్‍కి వెళ్తాను. ఏ సమస్య లేదని డాక్టరు చెబితే, మీ ఆశీర్వాదాన్ని, ప్రేమను 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను తండ్రి" అని బాబాను ప్రార్ధించి హాస్పిటల్‍కి వెళ్ళాను. డాక్టరు, "శారీరక శ్రమ, ఒత్తిడి వల్ల ఆ నొప్పులు వచ్చాయి. తగ్గిపోతుంది" అని ఒక ఇంజక్షన్, 3 రోజులకి మందులు ఇచ్చారు. బాబా దయవల్ల మూడు రోజుల్లో మెడనొప్పి పూర్తిగా తగ్గిపోయింది. బాబాకి చెప్పినట్లుగా నా అనుభవాన్ని ఇలా బ్లాగులో పంచుకున్నాను.


ఒకసారి నాకు విపరీతమైన నడుము నొప్పి వచ్చి ఇంట్లో పని చేయడానికి కూడా చేత కాలేదు. నా బాధ బాబాకు చెప్పుకుని, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని జపిస్తూ, "హాస్పిటల్‍కి వెళ్ళే పని లేకుండా ఊదీతోనే ఈ నొప్పిని తగ్గించండి బాబా. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను సాయితండ్రి" అని ప్రార్ధించాను. బాబా దయవల్ల హాస్పిటల్‍కి వెళ్ళకుండానే నడుము నొప్పి తగ్గిపోయింది. "ధన్యవాదాలు సాయితండ్రి".


ఈమధ్య అద్దెకిచ్చిన మా ఇల్లు ఒకటి ఖాళీ అయ్యాక రెండు నెలలు గడిచినా ఎవరూ అద్దెకు రాలేదు. వచ్చిన వాళ్లంతా చూసి వెళ్ళిపోయేవారు. అప్పుడు నేను, "ఏంటి బాబా, ఇల్లు రెండు నెలల నుండి ఖాళీగా ఉంది. మీ దయవలన ఈ రోజు కనుక ఎవరైనా ఇంట్లో అద్దెకు దిగితే, మీ ప్రేమను, కరుణను సాయి బంధువులతో పంచుకుంటాను" అని బాబాను ప్రార్ధించాను. ఆశ్చర్యం! బాబాతో అలా చెప్పుకున్నానో, లేదో ఆ సాయంత్రమే ఒక కుటుంబం వచ్చి ఇల్లు కావాలని అడిగారు. నేను ఇల్లు చూపిస్తే, వాళ్లకు నచ్చింది. వాళ్ళు అద్దెకు దిగడం, ఇల్లు ఖాళీగా ఉందనే నా చింత తొలగిపోవడం చకచకా జరిగిపోయాయి. అంతా బాబా దయ. అంతకుముందు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంటి ముందు ఊడ్చేవాళ్ళు కాదు. అందువలన నేను, "ఈసారి సొంత ఇల్లులా చక్కగా చూసుకునే వాళ్ళు రావాల"ని బాబాను ప్రార్తించాను. బాబా నా మొర ఆలకించి, చక్కగా ఇల్లు వాకిలి ఊడ్చుకుని చక్కగా ఉండేవాళ్ళను పంపించారు. "ధన్యవాదాలు సాయి".


ఇటీవల రెండు నెలల కాలంలో నేను బరువు పెరిగాను. నా ఒళ్ళు నాకే బరువుగా అనిపించడం, బద్దకం, నిద్ర, అలసటలతో నాకు నేనే సోమరిగా ఉండడం గమనించి గతంలో నాకు థైరాయిడ్ ఉందని డాక్టర్ చెప్పిన విషయం గుర్తొచ్చి, 'హాస్పిటల్‍కి వెళ్ళాలా, వద్దా' అని చీటీల ద్వారా బాబాను అడిగాను. బాబా హాస్పిటల్‍కి వెళ్ళమని చెప్పారు. అప్పుడు నేను, "బాబా! అధిక బరువు నుండి నన్ను రక్షించు తండ్రి. నాకు థైరాయిడ్ వ్యాధి లేదని డాక్టరు చెప్పాలి. థైరాయిడ్ నార్మల్‍గా ఉందని చెపితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్ధించి హాస్పిటల్‍కి వెళ్ళాను. డాక్టరు బ్లడ్ టెస్టు వ్రాసి, నాకు థైరాయిడ్ ఉందని, మందులు వాడాలని, లేకపోతే బరువు పెరగడమేగాని, తగ్గడం ఉండదని మందులు వ్రాసి నెల రోజుల తర్వాత మళ్ళీ రమ్మన్నారు. "బాబా! నేను థైరాయిడ్‍కి టాబ్లెట్లు వాడుతున్నాను. నాపై దయుంచి థైరాయిడ్ గ్రంధి సక్రమంగా పనిచేసి నేను ఆరోగ్యంగా ఉండేలా అనుగ్రహించండి. మీ ఆశీర్వాదంతో నేను టాబ్లెట్లు వాడకుండా పూర్తి ఆరోగ్యంతో ఉండేలా అనుగ్రహించండి సాయీశ్వరా. డాక్టరు నెలరోజుల తర్వాత మళ్ళీ టెస్టు చేయించుకోమన్నారు. మీ దయవలన టెస్టులో థైరాయిడ్ నార్మల్ అని రిపోర్ట్ వస్తే, మీ అపారప్రేమని, నాపై చూపుతున్న కృపను బ్లాగు ద్వారా సాయి బంధువులతో పంచుకుంటాను సాయితండ్రి. ఈ థైరాయిడ్ సమస్యను నా నుండి దూరం చేయండి, మీరే నాకు దిక్కు, మీ పాదాలే శరణం. నాకు, నా కుంటుంబానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాందించండి గురుదేవా సాయి సమర్థా, మీరే మాకు అండ, దండ. సర్వమూ మీరే సాయి. రక్షించండి బాబా. 


సద్గురు చరణం భవభయ హరణం సాయినాథ శరణం!!!

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయినాథుని దయ


సాయి మహారాజ్‍కి నా శతకోటి నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. 2022, ఏప్రిల్ 12వ తేదిన మేము మా అమ్మవాళ్ళతో విజయవాడ వెళ్ళాము. మరుసటిరోజు అమ్మ పాదాలకి వాపు వచ్చింది. మేము ప్రయాణం వల్ల  వాపు వచ్చిందేమో అనుకొన్నాము. కానీ వారం రోజులైనా తగ్గలేదు. అప్పుడిక అమ్మని హాస్పిటల్‍కి  తీసుకెళ్ళాము. డాక్టర్ హార్ట్, కిడ్నీ సంబంధిత టెస్టులు రాసారు. మేము అన్ని టెస్టులు చేయించి, "రిపోర్టులు నార్మల్‍గా రావాల"ని బాబాకి  విన్నవించుకుని రిపోర్టులు వచ్చేదాక బాబా నామస్మరణలో గడిపాము. ఆ సాయంత్రం రిపోర్టులు ఇచ్చారు. డాక్టరు రిపోర్టులు చూసి, "ఏ సమస్య లేదు, బ్లడ్ తక్కువగా ఉంది" అని చెప్పారు. "శతకోటి నమస్కారాలు సాయితండ్రీ. అందరినీ చల్లగా కాపాడు తండ్రి" .


2019లో నాకు నెలసరి సమస్య వస్తే స్కానింగ్ చేసారు. రిపోర్టులో యుటరస్ ఫైబ్రియోడ్ అని వచ్చింది. డాక్టరు, "ఆపరేషన్ చేయాలి" అన్నారు. నాకు భయమేసి ఒకటి, రెండు నెలలు ఆయుర్వేద మందులు వాడి, ఆ తర్వాత నుండి రోజూ బాబాకి నా సమస్య గురించి చెప్పుకుంటూ ఊదీ నా పొట్టకి రాసుకుంటూండేదాన్ని. 2022, మార్చి 3న మళ్లీ స్కానింగ్ చేయించుకుని 'రిపోర్టు నార్మల్‍గా  రావాల'ని బాబా స్మరణ చేశాను. రిపోర్టు వచ్చాక డాక్టర్ దగ్గరకి వెళ్తే, పాత రిపోర్టు, కొత్త రిపోర్టు రెండు పరిశీలించి, "ఫైబ్రియోడ్ పరిమాణం తగ్గింది. ఇప్పుడు ఇక ఆపరేషన్ వద్దు. మందులు కూడా అవసరం లేదు. మళ్లీ 6 నెలల తరువాత స్కాన్ చేసి చూద్దాం" అని డాక్టరు అన్నారు. అంతా మన సాయినాథుని దయ.  మరలా ఆరు నెలలకి స్కానింగ్ చేయించే సమయానికి బాబా ఆ ఫైబ్రియోడ్‍ని పూర్తిగా తగ్గిస్తారన్న నమ్మకంతో నా సమస్యని ఆయన పాదాల దగ్గర పెట్టాను. ఇక ఆ సాయినాథుడే అంతా చూసుకుంటారు. "బాబా! ఇంకా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలున్నాయి. అవి కూడా తగ్గిపోయేలా చూడమని మిమ్మల్ని కోరుకుంటున్నాను తండ్రి. మేము ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి సాయి". 


జై బోలో సాయినాథ్ మహారాజ్ కి జై!!!


ఊదీ నీళ్లు త్రాగమని సూచించి తద్వారా కడుపునొప్పి తగ్గించిన బాబా


శ్రీసమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

ఓం శ్రీసాయినాథాయ నమః!!!


సాయి మహరాజుకు నా అనంతకోటి వందనాలు. ఈబ్లాగు సభ్యులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా కృతజ్ఞతలు. నేను ఒక చిన్న సాయి భక్తురాలిని. నేను ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. 2022, మే 2న నాకు విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. ఆ కారణంగా అస్సలు నిలుచోలేకపోయాను, కూర్చోలేకపోయాను. ఏడుపు ఒక్కటే తక్కువ. అప్పటికి రెండు రోజుల ముందు నుండి ఏవో కారణాల వల్ల నేను మన 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు చదవలేదు. ఇంక అప్పుడు ఆ నొప్పితోనే చదవటం ప్రారంభించాను. ఆశ్చర్యం! బ్లాగు తెరవగానే 'బాబా కృపతో తగ్గిన కడుపునొప్పి' అనే టైటిల్‌తో ఒక బాబా భక్తురాలు తమ అనుభవం పంచుకున్నట్లు కనిపించింది. ఆ భక్తురాలు తను కడుపునొప్పితో బాధపడుతున్నప్పుడు 'బాబా ఊదీ నీళ్లలో కలుపుకుని త్రాగాను' అని పంచుకున్నారు. అప్పుడు 'నాకు ఆ ఆలోచన రానందుకు బాబా దయతో మందలిస్తూ, నన్ను కూడా ఊదీ కలిపిన నీళ్లు త్రాగమ'ని ఆదేశిస్తున్నట్లు నాకనిపించింది. వెంటనే నీటిలో ఊదీ కలుపుకుని త్రాగి, బ్లాగులో భక్తులు పంచుకున్న అనుభవాలన్నీ చదివి సాయి నామస్మరణ చేసుకుంటూ పడుకున్నాను. కాసేపటికి నిద్రపట్టింది. తెల్లవారేసరికి నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. అంతా బాబా దయ. "బాబా! మీరు ఎల్లప్పుడూ నాతోనే ఉంటూ నాకు దారి చూపిస్తున్నందుకు నేను మీకు సదా  ఋణపడి ఉంటాను. ఎప్పుడూ నా చేయి విడువకు తండ్రి".


శ్రీసమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!

సర్వం శ్రీసద్గురు సాయినాథార్పణమస్తు!!!


సాయిభక్తుల అనుభవమాలిక1181 వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఎంతటి కరుణామయులు
2. ఆ శ్రీకృష్ణుడే శ్రీసాయినాథుడు
3. బాబాకు చెప్పుకుంటే తీరిపోతుంది సమస్య

బాబా ఎంతటి కరుణామయులు


నాకు తల్లి, తండ్రి, దైవం అన్నీ అయిన సాయినాథునికి సాష్టాంగ నమస్కారాలు. సాయి బంధువులకు ప్రణామాలు. బ్లాగు నిర్వహిస్తూ సాయి అనుగ్రహాశీస్సులను ఎందరో భక్తులకు అందజేస్తున్న బ్లాగు సభ్యులు సాక్షాత్తు సాయి స్వరూపాలే. వారికి నా ధన్యవాదాలు. నా పేరు శ్రీరంజని. 2022, ఏప్రిల్ నెలలో నాకు నీరసంగా ఉంటూ ఇరవై రోజులైనా తగ్గకపోయేసరికి నేను మందులు వేసుకోసాగాను. అయితే ఆ మందులవల్ల నా కడుపులో నొప్పి మొదలైంది. అది కొంచెం కొంచెంగా పెరిగి ప్రతి 5 నిమిషాలకొకసారి నొప్పి వస్తుండేది. నాకు చాలా భయమేసింది. ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదివి, "బాబా! మీరు నన్నెందుకు కరుణించట్లేదు. ఇది 24 గంటల కడుపునొప్పి కాకుండా తగ్గిపోతే, నేను నా అనుభవాన్ని రేపే బ్లాగులో పంచుకుంటాన"ని బాబాని వేడుకున్నాను. బాబా ఎంత కరుణామయులంటే మరుక్షణమే నొప్పి తగ్గిపోయింది, మళ్లీ రాలేదు. "ధన్యవాదాలు బాబా! ఇలాగే నీరసం సమస్య కూడా తగ్గేలా చూడండి బాబా. నీరసం వల్ల నేను ఏ పని చేయలేకపోతున్నాను. నీరసం తగ్గిపోయి నేను పూర్తిగా కోలుకుంటే, మళ్లీ నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను తండ్రి".


మరో అనుభవం విషయానికి వస్తే, అనేక అవాంతరాల వల్ల నా చదువు ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం నేను 'US CPA' అనే కోర్సు చేయాలని సంకల్పించి అందుకు కావాల్సిన అర్హతలు నాకు ఉన్నాయో, లేదో తెలుసుకుందామని ముందుగా ఒక విద్యాసంస్థను సంప్రదించాను. వాళ్ళు, "రెగ్యులర్ డిగ్రీ చేసిన వారికి ఈ కోర్సు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. కానీ మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పద్దతిలో డిగ్రీ చేసారు. కాబట్టి మీకు ఈ కోర్సు చేసే అవకాశం ఉందో, లేదో తెలియదు. మీరు మీ మార్క్ షీట్స్ పంపించండి. చూసి చెప్తాం" అని అన్నారు. అప్పుడు నేను, "బాబా! నేను CPA కోర్సు చేయడానికి అర్హురాలినయ్యేలా చూడండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల నేను ఆ కోర్సు చేసేందుకు అర్హురాలినయ్యాను. "చాలా చాలా ధన్యవాదాలు సాయి".


ఒకసారి నడుస్తుంటే నడుము కిందగా ఉండే కాలు జాయింట్ నొప్పి వస్తుండేది. డాక్టరు దగ్గరకి వెళ్తే ఎక్స్-రే తీయించి, ఏమి చెప్తారో అని భయమేసి బాబాను ప్రార్ధించి కొబ్బరినూనెలో బాబా ఊదీ వేసి నొప్పి ఉన్న చోట రాస్తూ ఉండేదాన్ని. బాబా దయవల్ల ఒక వారం రోజులలో నొప్పి తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా".


2022, మే 3న నా ఫోన్ ఆకస్మికంగా పనిచేయటం మానేసింది. ఎన్నిరకాల ప్రయత్నాలు చేసినా మళ్ళీ పని చేయలేదు. అప్పుడు బాబాను తలుచుకుని, ఫోన్‍కి బాబా ఊదీ పెట్టి, "బాబా! నా ఫోన్ పని చేస్తే, శిరిడీ సంస్థానానికి 116 రూపాయలు విరాళంగా ఇస్తాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల కొంతసేపటికి నా ఫోన్ పని చేసింది. నేను బాబాకి మ్రొక్కుకున్నట్లుగా 116 రూపాయలు సంస్థానానికి విరాళం ఇచ్చాను. ఈవిధంగా అక్షయతృతీయ పర్వదినాన బాబా నాచేత అన్నదాన నిధికి  విరాళం ఇప్పించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి అనుభవాన్ని నేను ఈ బ్లాగులోని తోటి భక్తుల అనుభవాలలో కూడా చదివాను. ఆ అనుభవాలు నాలాంటి ఎంతోమందిని  బాబా వైపుకి నడిపిస్తున్నాయి. "ధన్యవాదాలు బాబా".


ఆ శ్రీకృష్ణుడే శ్రీసాయినాథుడు


సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు మహేష్. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు నా జీవితంలో జరిగిన మహాధ్భుతమైన మరో రెండు అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. 2021, జులై 31(అష్టమి రోజు)న నేను, మా అన్నయ్య మొట్టమొదటిసారి శిరిడీయాత్రకు రైలులో బయలుదేరాము. ప్రయాణంలో రాత్రి నిద్రపోయాక నాతో ఎవరో శ్రీకృష్ణుని గురించి అనుకుంటా చెబుతున్నారు. నాకు మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. వెంటనే నాకు మెలకువ వచ్చి, లేచి చూస్తే ఎవరూ లేరు. నాకు చాలా అశ్చర్యంగా అనిపించింది. మరుసటిరోజు ఆగష్టు 1, తెల్లవారుఝామున మేము శిరిడీ దర్శించుకున్నాము. కొన్ని రోజుల తరువాత స్వయంగా బాబా నాకు స్వప్న దర్శనమిచ్చి, "'శ్రీమహాభాగవతం' పారాయణ చేయమ"ని ఉపదేశించారు. నేను చాలా ఆనందించాను.


2022, మార్చి 20, ఆదివారంనాటి రాత్రి నేను శ్రీరామ నామం పలుకుతూ నిద్రపోయాను. తెల్లవారితే 2022, మార్చి 21, సోమవారం, సంకష్టహర చతుర్థి. ఆరోజు తెల్లవారుఝామున 3 నుండి 4గంటల సమయంలో నాకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో నేను, మా అన్నయ్య, మా బంధువు ఒకరు మా పొలం దగ్గర రోడ్డు మీద నిలబడి ఉన్నాము. నేను 'కృష్ణ.. శ్రీకృష్ణ..' అని పిలుస్తున్నాను. మరుక్షణం రోడ్డు పక్కన నీలిమేఘశ్యామునిగా శ్రీకృష్ణ పరమాత్ముడు దర్శనమిచ్చారు. కొద్దిసేపట్లో నేను మా ఇంట్లో మంచం మీద నిద్రిస్తూ మళ్ళీ 'కృష్ణ... శ్రీకృష్ణ..' అని పిలిచాను. వెంటనే నేను నిద్రిస్తున్న మంచం ప్రక్కనే శ్రీకృష్ణుడు దర్శనమిచ్చి కొద్దిసేపట్లో అదృశ్యమయ్యాడు. వెంటనే శ్రీసాయిబాబా వారి రూపం నాకు దర్శనమిచ్చింది. ఆయన ఒక స్క్రీన్ మీద ఏదో చూపిస్తూ నాకు బోధిస్తున్నారు. నాకు వెంటనే మెలకువ వచ్చింది. నేను చాలా చాలా అశ్చర్యపోయాను. అలాగే స్వప్నమందు దైవ దర్శనమైనందుకు 'నా జన్మధన్యమైంద'ని నేను చాలా చాలా ఆనందించాను. ఆ ఆనందానికి అవధులు లేవు. తరువాత మరొకరోజు స్వప్నంలో ఒక చిన్న కాలువ ప్రాంతంలో రుక్మిణిసమేత శ్రీపాండురంగ విఠలుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చారు. ఇలా చాలాసార్లు కృష్ణునితోపాటు శ్రీసాయిబాబా నాకు దర్శనం ఇచ్చారు. ఎంతటి భాగ్యం! సాక్షాత్తు శ్రీకృష్ణుడు నాకు దర్శనమిచ్చారు. కాదు, కాదు సాయిబాబానే నాకు కృష్ణ దర్శన భాగ్యాన్ని ప్రసాదించారు. ఆ శ్రీకృష్ణుడే శ్రీసాయినాథుడు అని నేను విశ్వసిస్తున్నాను. "బాబా! ఎల్లపుడూ మీ అనుగ్రహం మా మీద ఉండాలి శ్రీసాయికృష్ణ. నన్ను సరైన మార్గంలో ముందుకు నడిపించే బాధ్యత మీదే సాయి దేవా".


సాయిరామ హరే, సాయికృష్ణ హరే, జయ సాయి సాయి హరే హరే!!!


బాబాకు చెప్పుకుంటే తీరిపోతుంది సమస్య


ముందుగా ఈ బ్లాగు నిర్వాహకులకు మరియు తోటి సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇప్పుడు బాబా నాకు అనుగ్రహించిన అనుభవాలను తోటి సాయి భక్తులతో  పంచుకోవాలనుకుంటున్నాను. ఒకరోజు నేను మా ఇంట్లోని గ్యాస్ స్టవ్ శుభ్రపరుస్తుంటే దానికి ఉన్న నట్లు ఊడిపోయాయి. తిరిగి వాటిని   పెట్టడం నాకు రాలేదు. ఒకవేళ ఏదో విధంగా పెట్టినా అవి సరిగా సెట్ కాకపోతే ఏమైనా అవుతుందేమోననని నాకు భయమేసింది. అందువలన ఏం చేయాలో తెలియక, "బాబా! లంచ్ టైమ్ అవుతుంది. స్టవ్ మంచిగా సెట్ అయ్యేలా చూడండి తండ్రి. స్టవ్ మంచిగా అయితే, నా అనుభవాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులందరితో పంచుకుంటాను" అని అనుకున్నాను. వెంటనే బాబా దయవల్ల మా పక్కింటి అక్కకి ఇలాంటివి బాగా తెలుసనిపించి తనని పిలిచాను. తను వచ్చి చాలాసేపు ఉండి స్టవ్ మంచిగా చేసి వెళ్ళింది. అప్పుడు నేను ఏ భయం లేకుండా వంట చేశాను  ఇదంతా బాబా దయవల్లనే. ఆయన దయవల్లనే స్టవ్ అంతా పాడైపోయినా, అక్క 'నాకు తెలియదు, నా వల్ల అవ్వదేమో!' అంటూనే స్టవ్ మంచిగా సెట్ చేసింది. "ధన్యవాదాలు బాబా".


మా అమ్మ మా ప్రాంతంలో జరిగే అమ్మవారి అన్నదాన కార్యక్రమంలో నాతో అన్నదానం చేయిస్తానని మొక్కుకుంది. అయితే, సరిగా అప్పుడే నాకు నెలసరి సమయం కావడం వల్ల ఆ మ్రొక్కు తీర్చుకోవడం అవుతుందో, లేదో అని టెన్షన్ పడ్డాం. ఎందుకంటే, అన్నదానం చేసే అవకాశం సంవత్సరానికి ఒకసారే వస్తుంది. ఇప్పుడు చెయ్యలేకపోతే మళ్ళీ సంవత్సరం వరకు ఆగాలి. అటువంటి స్థితిలో నేను, "బాబా! నేను మొక్కు తీర్చుకునేలా చూడండి. అలా జరిగితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా నేను కోరుకున్నట్లే అనుగ్రహించారు. నేను సంతోషంగా మొక్కు తీర్చుకున్నాను. "ధన్యవాదాలు బాబా".


సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1180వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. తలపై తమ అభయహస్తాన్ని ఉంచి ఆశీర్వదించిన బాబా
2. మూగజీవికి తగిన ఆశ్రయాన్ని చూపి, వాటిపట్ల బాధ్యతను తెలియజేసిన బాబా
3. బాబా అనుమతిస్తే పనులు చకచకా అయిపోతాయి

తలపై తమ అభయహస్తాన్ని ఉంచి ఆశీర్వదించిన బాబా


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! నా పేరు విజయచంద్ర. మాది పశ్చిమ గోదావరి జిల్లా. ముందుగా సాయి బంధువులకు నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయి ప్రేమికులారా, సాయి స్వరూపులారా మీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పను? దైవం మానుషరూపేణా అన్నట్టు మీరందరూ సాక్షాత్తూ సాయి స్వరూపులే అని తలుస్తాను. మీరు అనుమతినిస్తే, నా బాబాతో నాకున్న అనుభవాలను పంచుకుంటాను. ఇప్పటివరకు నా జీవితంలో బాబా నా యందు చూపిన కృప, దయ, లీలలు కోకొల్లలు. నన్ను, మనందరినీ నడిపించేది బాబానే. ఆయనతో ప్రతిరోజు మనకు ఒక అనుభవం ఉంటుంది. ఇది పచ్చి నిజం, అతిశయోక్తి కాదు. బాబా మన గురువు, దైవం, స్నేహితుడు మనకు సర్వమూ ఆయనేనని మన భావన కదా! మనమందరం ప్రతిరోజు బాబాతో మాట్లాడుతాం కదా! అవునా? కాదా? నేనైతే బాబాతో అన్నీ చెపుతాను. నాకు ఆయనంటే అమితమైన ప్రేమ. అలానే సాయి స్వరూపులంటే కూడా అంతే అభిమానం. మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. ఇక నా అనుభవానికి వస్తే...


అది 2001వ సంవత్సరం. నా వయస్సు 33-34 ఉంటుంది. నేను వెంకటరాయ డయాగ్నస్టిక్స్ & హాస్పిటల్ నందు సీనియర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‍గా పని చేస్తున్నాను. మా హాస్పిటల్లో ఒక డాక్టరు, నా సహోద్యోగి జ్యోతిష్యం చెప్పడంలో దిట్ట. ఆయన ఎవరికైనా ఏదైనా చెప్తే చాలా మటుకు నిజాలయ్యేవి. ఆయన ఒకరోజు నాకు కూడా చెప్పారు. ఆయన చెప్పిందేమిటంటే, "విజయ్, నీకు ప్రాణగండం ఉంది" అని. ఒక్కసారిగా నేను భయభ్రాంతుడనయ్యాను. మృత్యువు అంటే ఎవరికైనా భయమే కదా! ఆయన వేరే వాళ్ళకి చెప్పినవన్నీ జరిగి ఉన్నందున 'ఇదేంట్రా దేవుడా?' అనుకుంటూ బాధతో ఇంటికి బయలుదేరాను. వెళ్తూ వెళ్తూ ఏవో ఆధ్యాత్మిక గ్రంధాలు తీసుకుని ఇల్లు చేరాను. మనసంతా ఒక రకమైన భయం, బాధ ఆవహించి ఉన్నాయి. పిల్లలు చిన్నవాళ్లు. పెద్దబాబు 6వ తరగతి, చిన్నవాడు 2వ తరగతి చదువుతున్నారు. పిచ్చిపిచ్చి ఆలోచనలతో ఏం చేస్తాం అనుకుని స్నానం వగైరాలు కానిచ్చుకుని మా ఇంట్లో అభయహస్తంతో ఆశీర్వదిస్తున్నట్లు ఉన్న బాబా చిత్రపటం ముందు కూర్చుని నా దృష్టి ఆయన మీదే నిలిపి, "ఏమయ్యా బాబా, ఏంటిది? నీవే నా సర్వస్వం అనుకున్నానే, నా రక్షకుడివని తలచానే, నాకేంటి ఈ విపరీత పరిస్థితి నాయన" అని కన్నీళ్లు పెట్టుకుని బాబాను వేడుకున్నాను. అంతే, ఒక క్షణంపాటు నా తనువు గగుర్పాటుకి లోనయ్యింది. చిరునగవు మోముతో ఆ దివ్యమంగళ స్వరూపుడు తమ అభయహస్తాన్ని నా  తలపై ఉంచి, 'నీకు ఏమి భయం లేదు' అన్నట్టు దీవించారు. శ్రీసాయినాథుని హస్తస్పర్శ నాకు స్పష్టంగా తెలిసింది. నాలో నెలకొన్న భయాందోళనలు మటుమాయమయ్యాయి. మరో అద్భుత విషయం ఏమిటంటే, మా ఇంట్లో ఉన్న బాబా చిత్రపటాలు, బాబా మూర్తుల దగ్గరల్లా విభూదే విభూది. ఆ విషయం గురించి ఇతరులతో చెపుదామనుకున్నాను కానీ వాళ్ళు నమ్ముతారో, లేదోనని భయపడ్డాను. అందువల్ల ఎవరితోనూ పంచుకోలేదు, కేవలం నా భార్యతో తప్ప. బాబా లీల నిజమైనప్పటికీ లోకులు పలు కాకులని అంటారు కదా! వాళ్ళు ఇంత లీల చూపిన సాయినాథుని నమ్మక ఏమైనా ప్రతికూలంగా మాట్లాడుతూ అవాకులు చెవాకులు పేలుతారని భయపడ్డాను. మనం నమ్మే మన బాబాని, మన సాయి బంధువులను అవమానిస్తే మనకే కదా బాధ. అందుచేత మౌనంగా ఉండిపోయాను. అలాంటిది ఇన్ని సంవత్సరాల తరువాత నా ఈ అనుభవాన్ని సాయి బంధువులతో ఈవిధంగా పంచుకునేలా సాయి అనుగ్రహించడం యన లీల కాకపోతే ఇంకేంటి? "ధన్యవాదాలు బాబా".


మూగజీవికి తగిన ఆశ్రయాన్ని చూపి, వాటిపట్ల బాధ్యతను తెలియజేసిన బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!! 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు మరియు సాయి బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. నా పేరు అనురాధ. ఎప్పుడూ నీవెంటే ఉన్నానంటూ ఆ కరుణామూర్తి అయిన మన సాయినాథుడు ప్రేమతో నాకు అనుగ్రహించిన కొన్ని అనుభవాలను గతంలో మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు సాయితండ్రి ఆశీర్వదించిన మరో అనుభవాన్ని మీ అందరితో పంచుకోవడమనేది సాయిమా ఆదేశంగా భావిస్తున్నాను. 2021వ సంవత్సరం జులై నెలలో ఒక గురువారం నాడు బాబాకు అభిషేకం పూర్తి చేసిన తరువాత డోర్ బెల్ మ్రోగితే బయటకు వెళ్ళాను. అక్కడ మావారు 35 రోజుల వయస్సున్న ఒక చక్కటి కుక్కపిల్లతో నిలబడి ఉన్నారు. వాస్తవానికి నాకు కుక్కలంటే చాలా భయం. కానీ అది గురువారంనాడు వచ్చింది. బాబా కూడా సచ్చరిత్రలో, "ఏ ఋణానుబంధం లేనిదే ఎవరు ఎవరినీ కలవర"ని చెప్పారు. కాబట్టి, దానిని బాబానే పంపించారని తలచి, బాబా ఊదీ పెట్టి మరీ ఇంట్లోకి ఆహ్వానించాను. మేము ప్రేమతో ఆ కుక్కపిల్లకు 'లియో' అని పేరు పెట్టాము. మూగజీవులు ఎంతటి నిస్వార్థమైన ప్రేమను చూపిస్తాయో నాకు అనుభవంలోకి తెచ్చింది మా లియో. నేను లియో మీద ఎంతో ప్రేమను పెంచుకున్నాను. ఆరు నెలల తరువాత బ్యాక్ బోన్ ప్రాబ్లమ్ కారణంగా లియోకి సర్జరీ చేయవలసి వచ్చి సర్జరీ చేయించాము. కానీ డాక్టరు మన ఇళ్లలో ఉండే ఫ్లోర్ జారుడుగా ఉండటం వలన సర్జరీ తరువాత కూడా భవిష్యత్తులో బోన్ ప్రాబ్లమ్ ఎక్కువ కావచ్చని చెప్పారు. అంతేకాకుండా మరికొన్ని ఇతర కారణాల వలన లియోని ఎవరికైనా దత్తత ఇచ్చేలా పరిస్థితులు  దారితీసాయి. మాకు లియోతో ఋణానుబంధం అంతవరకే ఉందేమో ఆ బాబాకే ఎరుక. నేను మనస్పూర్తిగా బాబాను ఒకటే వేడుకున్నాను, "బాబా! లియోని చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళ దగ్గరికి పంపించే ఏర్పాటు చేయండి. వాళ్ల ఇంటి వాతావరణం లియో ఆరోగ్యానికి సహకరించేలా, భవిష్యత్తులో తనకి బోన్ ప్రాబ్లమ్ రాకుండా ఉండేలా చూడండి. లియో అటువంటి ఇంటికి వెళితే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి'లో పంచుకుంటాను" అని. 2 నెలల తర్వాత (లియోకి 8నెలల వయసు) 2022, జనవరి 1న నేను కోరుకున్నట్లే లియో ఒక మంచి ఇంటికి వెళ్లేలా బాబా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత లియో జ్ఞాపకాలు నన్ను చాలా బాధకు గురిచేసాయి. నా మనసు ఎంతో వేదనను అనుభవించగా, "బాబా! ఎందుకు బంధాలను ముడి వేస్తావు. మరల దూరమయ్యే పరిస్థితులను కల్పిస్తావు" అని అనుకున్నాను. అప్పుడు నా అంతర్వాణి (నా బాబా) చెప్పిన సమాధానం: "నువ్వు ఆ ఒక్క కుక్క మీదే అనుబంధం పెట్టుకోవద్దు. మూగజీవులు ఎంతో నిస్వార్థమైన ప్రేమను చూపిస్తాయి. నువ్వు కూడా వాటిపట్ల అంతే నిస్వార్థమైన ప్రేమను చూపించు" అని వాటిపట్ల నా బాధ్యతను గుర్తు చేశారు. దాంతో నేను ముందుగా ప్రతి గురువారం కుక్కలకు స్వీట్లు ఆహారంగా ఇవ్వాలని సంకల్పించి బాబా ఆశీర్వాదంతో ఆవిధంగా చేస్తున్నాను. ఈవిధంగా తమను సేవించుకోమని బాబా నన్ను ఆదేశిస్తున్నారని నేను బలంగా నమ్ముతున్నాను. అన్ని జీవులతో ఆత్మ స్వరూపునిగా ఉన్నది ఆయనే కదా. బాబా తన మార్గంలో ఉన్నవారి జీవితాలలో ఎదురయ్యే ప్రతి ఛాలెంజ్ నుండి ఏదో ఒక విషయాన్ని మనకు నేర్పుతూనే ఉంటారు. "బాబా! అటువంటి ఛాలెంజ్‌‍లను ఎదుర్కొనే మానసిక శక్తిని, దాని ద్వారా మీరు మాకు భోదించాలనుకున్న విషయాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని మీ బిడ్డలందరికీ ప్రసాదించమని నా హృదయపూర్వక ప్రార్థన తండ్రి. ఈ అనుభవాన్ని పంచుకోవడంతో జరిగిన ఆలస్యానికి నన్ను మన్నించు బాబా".


సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


బాబా అనుమతిస్తే పనులు చకచకా అయిపోతాయి


సాయి భక్తులందరికీ నమస్తే. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఈరోజు బాబా నాకు ప్రసాదించిన ఇంకొక అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. క్రిందటి సంవత్సరం మేము ఒక సైట్(స్థలం) విషయంలో ఆ సైట్ కొనాలా, వద్దా అని బాబాను చీటీల ద్వారా అడిగితే, 'కొనవద్ద'ని బాబా సమాధానం వచ్చింది. అందుకని ఆ సైట్ కొనే ఆలోచనను మానుకున్నాము. మళ్ళీ ఈ మధ్య మా పాపకోసం స్థలం కొందామనిపించి బాబాను అడిగితే, 'కొనమ'ని బాబా సమాధానం ఇచ్చారు. బాబా టైమింగ్, ఆయన లీలలు మనకు అర్ధం కావు. బహుశా అప్పట్లో మా ఆర్ధిక పరిస్థితిని బట్టి బాబా నుండి ఆ విధమైన జవాబు వచ్చి ఉంటుంది అనుకుని కార్యంలోకి దిగాము. బాబా అనుమతితో చేసే ఏ పనైనా గుఱ్ఱంలా పరిగెడుతుంది. మా కజిన్ ఆ స్థలం డెవలపర్‍ని సైట్ కావాలని అడగగానే అతను ప్రస్తుతం అమ్ముతున్న ధరకి కాకుండా తక్కువ ధరకే, పూర్వం తీసుకుని అమ్మేస్తున్నవాళ్ళ దగ్గరినుండి మాకు ఇప్పించాడు. ఇది ఒక అద్భుతం. ఇకపోతే రెండోది, మొదటి గురువారం అడ్వాన్స్ ఇచ్చి, మిగతా అమౌంట్ విషయంలో మా ప్రోగ్రాం ప్రకారం లోన్ తీసుకుని దాన్ని క్యాష్ చేసుకుని ఇవ్వడానికి మేము ఊరు వెళ్ళే తేదీలు, బ్యాంకు సెలవులు మొదలైనవన్నీ కలిసిరాక చాలారోజులు గడపాల్సి వస్తుందేమోనని నేను చాలా ఆలోచించాను. కానీ ఆ తరువాత గురువారంనాడు ఒకేఒక్క రోజులో ఏ ఇబ్బందీ లేకుండా అనుకున్నంత గోల్డ్ లోన్ రావడం, దాన్ని ఇవ్వాల్సిన వారికి ఇచ్చేయడం, కొంత మొత్తం బ్యాంకు ద్వారా ట్రాన్స్ఫర్ చెయ్యడం అన్నీ జరిగిపోయాయి. చివరిగా కొంత అమౌంట్ ఆరోజు బ్యాంక్ ట్రాన్స్ఫర్ లిమిట్ దాటిపోవడం వల్ల 2022, మే 2న ట్రాన్స్ఫర్ చేసాము. ఆలా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే నా అనుభవాన్ని మీ అందరితో పంచుకోవడానికి బ్లాగు నిర్వహిస్తున్న సాయి అన్నయ్యకు పంపాను. బాబా అనుమతించాక పనులు ఎలా చకచకా అవుతాయి అన్నదానికి ఈ నా అనుభవం పెద్ద ఉదాహరణ. బాబా అండ ఉంటే ఆ ధైర్యమే వేరు. "ధన్యవాదాలు బాబా. ఇక రిజిస్ట్రేషన్ ఒక్కటే మిగిలింది. అది కూడా అతి త్వరలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా పూర్తి అయ్యేటట్లు చూడు సాయి".


శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1179వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కంటికి రెప్పలా కాపాడే బాబా
2. సాయి తన బిడ్డలను బాధపడనివ్వరు
3. సాయికి చెప్పుకున్నంతనే జరిగిన పని

కంటికి రెప్పలా కాపాడే బాబా


సాయి భక్తులందరికీ నమస్కారాలు. నేను ఒక చిన్న సాయి భక్తురాలిని. మా కుటుంబానికి బాబా చాలా ఆశీస్సులు అందించారు. ఇక ముందు కూడా అందిస్తారని ఆశిస్తున్నాను. ముందుగా చాలా ఆలస్యంగా నా అనుభవాలను పంచుకుంటున్నందుకు నన్ను క్షమించమని బాబాను వేడుకుంటున్నాను. కరోనా మొదటి వేవ్‌లో మా కుటుంబంలో అందరికీ కరోనా వచ్చింది. మా బాబు డాక్టరు అయినందువల్ల ఇంట్లోనే మా అందరికీ ట్రీట్మెంట్ చేశాడు. మా బాబుకి, పాపకి, అమ్మకి పదిరోజుల్లోనే తగ్గినా, మా వారికి 14 రోజులైనా తగ్గపోవడంతో మేము చాలా కంగారుపడ్డాము. ఆయనకి అదివరకే హార్ట్ సర్జరీ అయింది. బీపీ, షుగర్ కూడా ఉన్నాయి. అందువల్ల ఆయన కూడా చాలా ఆందోళనకు గురయ్యారు. ఎన్ని మందులు వాడినా ఆయన CRP చాలా ఎక్కువైంది. దాంతో స్టెరాయిడ్స్ స్టార్ట్ చేశాము. అయినా CRP కంట్రోల్ అయ్యేది కాదు. అప్పుడు నేను, "బాబా! మీ దయతో ఆయనకు కరోనా కంట్రోల్ అయితే నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. ఆయన దయవల్ల రెండో రోజు నుండి CRP కంట్రోల్‍లోకి వచ్చింది. ఇప్పుడు ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు.


కరోనా నుండి కోలుకున్న కొన్నిరోజులకి మా అమ్మకి గుండెదడ ఎక్కువైంది. మేము చాలా కంగారుపడ్డాము. నాలుగు సంవత్సరాల ముందు ఆమెకు అదే సమస్య ఉండేది. మందులు వాడితే తగ్గింది. కరోనా తరువాత అది మళ్ళీ మొదలైంది. అమ్మని గుండె డాక్టరుకి చూపించాము. కానీ ఎన్ని మందులు వాడినా అమ్మకి తగ్గలేదు. అప్పుడు నేను, "బాబా! అమ్మకి గుండెదడ తగ్గి నార్మల్ అయితే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని సాయిని వేడుకున్నాను. ఆయన దయవల్ల ఇప్పుడు అమ్మకి కొద్దిగా తగ్గింది. ఇంతకుముందు 7, 8 సార్లు వచ్చే దడ ఇప్పుడు రెండు లేదా మూడుసార్లు వస్తుందని అమ్మ అంటుంది. సాయి ఆశీస్సులతో త్వరలో నార్మల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. సాయి భక్తురాలైన అమ్మ కూడా 'బాబాయే తన గుండెదడ తగ్గిస్తార'న్న నమ్మకంతో ఉంది.


మా అబ్బాయికి కరోనా తగ్గిన తరువాత ఏది తిన్నా కొద్దిసేపటికి దగ్గు వచ్చి, గొంతులో ఏదో ఉన్నట్లు చాలా ఇబ్బందిపడేవాడు. స్వయంగా తనే ఒక డాక్టర్ అయినందువల్ల పేషెంట్ల ముందు చాలా ఇబ్బందికి గురయ్యేవాడు. ఎన్ని సిరప్‍లు వాడినా ఆ దగ్గు సమస్య తగ్గేది కాదు. అప్పుడు నేను, "బాబా! బాబుకి దగ్గు తగ్గితే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల అప్పటినుండి దగ్గు పూర్తిగా తగ్గింది. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు.


డాక్టరైన మా అబ్బాయి చాలా ఊళ్ళకి వెళ్లి వైద్యం చేస్తుంటాడు. వాడు ఎక్కడికి వెళ్ళినా స్వయంగా తానే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి, ఎంత రాత్రయినా తిరిగి ఇంటికి వచ్చేస్తుంటాడు. అయితే తరచూ దూరప్రాంతాలకు కారు డ్రైవ్ చేయడం వలనో, లేక పుస్తకాలు ఎక్కువగా చదవడం వలనో తన కళ్ళు చాలా స్ట్రెయిన్ అయ్యేవి. అయినా తానే డ్రైవ్ చేసుకుని వెళ్తుండేవాడు. ఇలా ఉండగా ఈమధ్య కళ్ళు డ్రై అయిపోయి నొప్పి పెట్టడంతో తను చాలా ఇబ్బందిపడ్డాడు. అప్పుడు కంటి డాక్టరుకి చూపిస్తే, ఐ డ్రాప్స్ ఇచ్చారు. వాటిని వాడినా ఆ సమస్య అలాగే ఉండటంతో నేను, "బాబా! బాబు కళ్ళు నార్మల్ అయ్యేట్లు చూడు తండ్రి, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను. వెండికళ్ళు మీ హుండీలో వేస్తాను" అని బాబాకు మొక్కుకున్నాను. ఇప్పుడు బాబు కళ్ళు నార్మల్ అయ్యాయి. చదవడానికి, కారు డ్రైవ్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇదంతా బాబా దయవల్ల సాధ్యమయింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం బాబా వల్లనే అవుతుంది అని నా నమ్మకం. "చాలా చాలా ధన్యవాదాలు సాయి. మిమ్మల్ని కొలిచిన భక్తులను కంటికి రెప్పలా కాపాడతారని నా నమ్మకం. అదే నిజం కూడా. నాకు మీరే దిక్కు సాయి. నన్ను నా కుటుంబాన్ని సదా కంటికి రెప్పలా కాపాడు తండ్రి". ధన్యవాదాలు సాయి.


సాయి తన బిడ్డలను బాధపడనివ్వరు


ఓం శ్రీసాయినాథాయ నమః!!!

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!


'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న సాయికి మరియు సాయి బంధువులకు నా నమస్కారం. గత 5 సంవత్సరాలుగా నేను బాబాకు అంకిత భక్తుడిని. నాకు ఇదివరకు జరిగిన అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఈమధ్య జరిగిన మరో రెండు అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ఈ మధ్య నా కుడికాలు, అలాగే నా శరీరంలో కుడివైపు అంతా ఒక్కటే నొప్పిగా ఉంటూ కాలు లాగేస్తూ ఉండేది. అందువలన నేను ఏ పని చేసుకోలేకపోయేవాడిని. కనీసం నడవటానికి కూడా ఇబ్బందిపడుతుండే వాడిని. అప్పుడు నేను ఎంతో ఆర్తిగా, "బాబా! ఈ పార్శ్వపు నొప్పులను తొలగించి నాకు హాయిని ప్రసాదించండి. ఈ నొప్పిలు తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. అంతే, రెండు రోజుల్లో నొప్పులు పూర్తిగా తగ్గిపోయాయి. "థాంక్యూ బాబా".


మా పాప హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుకుంటుంది. తనకు గవర్నమెంట్ నుండి స్కాలర్‍షిప్ వస్తుంది. దానికోసం మేము ఆన్లైన్లో అప్లై చేసి, ఆ పేపర్స్ కాలేజీలో ఇవ్వాల్సి ఉండగా నేను ఆ పేపర్లు మా పాపకిచ్చి కాలేజీవాళ్ళు అడిగినప్పుడు ఇమ్మని చెప్పాను. తను అలాగేనని ఆ పేపర్లు తీసుకుంది. తరువాత 2022, ఏప్రిల్ 23న కాలేజీవాళ్ళు ఆ పేపర్ల గురించి అడిగారు. కానీ ఆ పేపర్లు కనిపించలేదు. దాంతో మా పాప నాకు ఫోన్ చేసి, "డాడీ ఆ పేపర్లు లేవు" అని చెప్పింది. నాకు చాలా బాధేసి, "సాయీ! ఆ పేపర్లు సాయంత్రంకల్లా దొరికితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. సాయి మహిమ చూపారు. మా పాప ఆ పేపర్లు తన ఫ్రెండ్ పెట్టెలో(మా పాపే అందులో పెట్టింది) దొరికాయని ఫోన్ చేసి చెప్పింది. అది విని నాకు చాలా సంతోషమేసింది. "థాంక్యూ సాయి. మీరు మీ బిడ్డలను బాధపడనివ్వరని మాకు తెలుసు".


సాయికి చెప్పుకున్నంతనే జరిగిన పని


సాయి భక్తులందరికీ నమస్కారం. నా పేరు అంజలి. ఈ మధ్య బాబా చూపించిన ప్రేమను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను మా తమ్ముడు ప్రసాద్‍కి బదిలీ అయి దాదాపు ఒక సంవత్సరం అవుతున్నా, తన పే స్లిప్‍లో తను పని చేస్తున్న చోటుగాని, శాలరీలో హెచ్.ఆర్.ఏ గాని మారలేదు. ఆ విషయమై పిర్యాదు పెట్టుకుని చాలా రోజులు అవుతున్నా ఏ స్పందనా లేదు. చివరికి నేను వేరే వాళ్ళని సంప్రదిస్తే మెయిల్ ద్వారా రిక్వెస్ట్ పెట్టమన్నారు. నేను బాబాను తలుచుకుని నా పోర్టల్ నుండి మెయిల్ పెట్టాను. అంతే బాబా దయవల్ల పదిరోజుల్లో పని అయిపోయింది. ప్రసాద్ పనిచేసే చోటు, శాలరీ హెచ్.ఆర్.ఏ రెండూ మారాయి. ఈ పని అయితే మన బ్లాగులో పంచుకుంటానని బాబాతో చెప్పుకున్నట్లు నా అనుభవాన్ని ఇలా మీ అందరితో పంచుకున్నాను. "థాంక్యూ సో మచ్ బాబా. అన్ని చికాకులను తొలగించు తండ్రి. తమ్ముడు ప్రసాద్‍ని, తన కుటుంబసభ్యులందరినీ, ఇంకా అందరినీ చల్లగా చూడు తండ్రి. మీ అనుగ్రహంతో త్వరలో మరికొన్ని అనుభవాలను తోటి భక్తులతో పంచుకోవాలనుకుంటున్నాను తండ్రి".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo