సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1163వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కొండంత సమస్యను గోరంతలా మార్చే సాయికృప
2. ప్రార్థించినంతనే తమ కృపను వర్షింపజేసిన బాబా
3. లాప్టాప్ ఛార్జర్ దొరికేలా అనుగ్రహించిన బాబా

కొండంత సమస్యను గోరంతలా మార్చే సాయికృప


ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః!!!


ముందుగా ఈ బ్లాగు నిర్వాహకులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ బ్లాగులో అనుభవం పంచుకుంటే బాబాకి చెప్పుకున్నట్లుగా ఉంటుంది. నా పేరు సౌజన్య. మాది భీమవరం. నేను ఇంతకుముందు రెండుసార్లు నా అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలు మీ అందరితో పంచుకుంటున్నాను. "సర్వకర్త అయిన దైవాన్ని శరణువేడి ఓరిమితో కర్మఫలాన్ని అనుభవించు, ఆయనెలా చక్కబెడతారో చూడు" అన్నారు బాబా. అది నా అనుభవం కూడా. 2022, ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం గం.6:30 నిమిషాలకు నేను, మా అమ్మాయి బండి మీద బాబా గుడికి బయలుదేరాము. బయలుదేరిన పదినిమిషాల తర్వాత మేము క్రింద పడిపోయాము. ఆ సమయంలో కరెంట్ లేదు. అది గుంతల రోడ్డు, రోడ్డుకు ఒకప్రక్క పెద్ద కాలువ ఉంది, బండి నా మీద పడింది, మా అమ్మాయి రోడ్డు మీద పడింది. నా మోకాలికి బాగా దెబ్బ తగిలి వాపు వచ్చింది. ఇంటికి వచ్చి దెబ్బ కడుక్కుని, బాబా మీద భారం వేసి ఎప్పటిలా మామూలుగానే వారంరోజులపాటు నా పనులు, ఇంటిపనులు అన్నీ చేసుకున్నాను. కానీ కాలివేళ్ళతో సహా అంతా వాచిపోయింది. వాపు ఎక్కువైపోతోందని హాస్పిటల్‍కి వెళ్ళి ఎక్స్-రే తీయించుకుంటే, బాబా దయవల్ల దెబ్బ పైన మాత్రమే తగిలింది, లోపల ఏమీ కాలేదని చెప్పారు. తరువాత కొద్దిపాటి వ్యాయామంతో నా వాపులన్నీ తగ్గిపోయాయి. అంతా బాబా కృప. అతి పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ కాలువలో పడిపోకుండా రోడ్డుకు మరోవైపు పడేలా చేసి, మా ప్రారబ్ధ కర్మను చిన్నదిగా చేసి నన్ను, నా బిడ్డను కాపాడారు బాబా. అందుకే నా అనుభవాన్ని ఈ బ్లాగులో మీ అందరితో  పంచుకోవాలని అనుకున్నాను. తద్వారా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 


2022, మార్చి 11వ తేదీన చాలా ఎక్కువసేపు ప్రయాణం చేయడం వలన మరుసటిరోజు నాకు ఒళ్ళునొప్పులు, జ్వరం వచ్చాయి. అప్పుడు నేను బాబా మీద భారం వేసి ఒకేఒక్క టాబ్లెట్ వేసుకున్నాను. సాయంత్రం అయ్యేసరికి నేను నార్మల్ అయ్యాను. రెండు రోజుల తరువాత నుండి విపరీతమైన తలనొప్పితో అర్థరాత్రి నిద్రలేక చాలా బాధపడ్డాను. బాబా నామస్మరణ చేసుకుంటూ, ఆయన లీలలను తలచుకుంటూ ఎప్పటికో నిద్రపోయాను. నిద్ర చాలనందున పగలంతా చాలా ఇబ్బందిగా అనిపించింది. దీనికి తోడు గ్యాస్ సమస్య, మలబద్దకం వచ్చి పొట్ట అంతా ఉబ్బరంగా అనిపించి చాలా భయపడిపోయాను. ఇంక అప్పుడు బాబాకి దణ్ణం పెట్టుకుని, పారాయణ చేసుకుని, ఊదీ పొట్టకు రాసుకొని, ఊదీ తీర్థం త్రాగి, బాబా మీద విశ్వాసంతో ఏ హాస్పిటల్‌కీ వెళ్ళలేదు. అవసరమైతే ఏ హాస్పిటల్‌కైనా, టెస్టులకైనా బాబానే తీసుకుని వెళ్తారన్న నమ్మకంతో ఉండిపోయాను. కానీ నరాలు చిట్లిపోయే, తల పగిలిపోయే తలనొప్పికి నాకు బాగా ఏడుపు వచ్చేది. ఈ నొప్పిని భరించేకంటే చచ్చిపోయినా బాగుండు అనిపించింది. అప్పుడు బాబాకి గట్టిగా దణ్ణం పెట్టుకుని, "బాబా! తలనొప్పి తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల హోమియో మందులతో రెండురోజులకు తలనొప్పి పూర్తిగా తగ్గింది. పొట్ట ఉబ్బరం, గ్యాస్ మరియు  మలబద్ధకం సమస్యలు కూడా వారంరోజులకు తగ్గి నేను చాలావరకు కోలుకున్నాను. ఇప్పుడు తలనొప్పి రావడం లేదు. "మీకు శతకోటి ధన్యవాదాలు సాయిదేవా!".


ప్రార్థించినంతనే తమ కృపను వర్షింపజేసిన బాబా


అందరికీ నమస్కారాలు. నా పేరు లక్ష్మీప్రసాదమ్మ. మేము తగరపువలసలో నివాసముంటున్నాము. నేను గవర్నమెంటు స్కూలు టీచరుని. మా నాన్నగారి ద్వారా నాకు చిన్నప్పటినుండి దైవభక్తి అలవడి బాబాపట్ల కూడా భక్తిని పెంచుకున్నాను. నేను నిత్యం సచ్చరిత్ర పారాయణ చేస్తుంటాను. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నాకు ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరికీ వివాహాలై మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వాళ్లిద్దరూ ఒకేసారి గర్భవతులయ్యారు (పెద్దపాప రెండవసారి, చిన్నపాప మొదటిసారి). వారి కాన్పు సక్రమంగా అయ్యే బాధ్యతను నేను భగవంతునిపై వేశాను. అయితే, పెద్ద పరీక్ష అన్నట్టు కరోనా బాగా ప్రబలి ఉన్న సమయంలో రెండురోజుల తేడాలో మా అమ్మాయిలిద్దరికీ కరోనా సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. నాకు ఏం చేయాలో అర్థంకాక బాధపడుతూ భగవంతునిపై భారమేసి పిల్లలిద్దరినీ వేర్వేరు గదుల్లో ఉంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాను. బాబా దయవల్ల కొన్ని రోజుల్లో వాళ్ళిద్దరికీ కరోనా లేదని డాక్టరు తెలిపేసరికి ఊపిరి పీల్చుకున్నాం. కరోనా నుండి బయటపడటమైతే పడ్డారు కానీ, ఆ ప్రభావం కడుపులో బిడ్డ మీద ఉంటుందేమోనని మేము, అత్తింటివాళ్ళు కంగారుపడ్డాము. మేము భయపడినట్లే పెద్దపాపకి స్కానింగ్ చేసిన డాక్టరు, "కడుపులో బిడ్డకి ప్రేగులు చుట్టుకుని ఉన్నాయి. బిడ్డకి కొంచెం శ్వాస తక్కువగా ఆడుతోంది" అని చెప్పారు. ఇంకోపక్క చిన్నమ్మాయికి కరోనా సమయంలో ఎటాక్ అయిన బి.పి, షుగర్లు నెలలు నిండినా కొనసాగుతుండటంతో కాన్పు కష్టతరమవుతుందేమోనని డాక్టరు అన్నారు. దాంతో నేను ఒకటే ఆందోళన చెందాను. ఒక్క అమ్మాయికి నార్మల్ డెలివరీ చేయించి, జాగ్రత్తగా అత్తవారింటికి పంపడమే అత్యంత ప్రయాసతో కూడుకున్న ఈ రోజుల్లో ఇద్దరు అమ్మాయిలకి ఒకేసారి డెలివరీ సమయం కావడం, అదీకాక స్కూల్ టీచరుని అయిన నేను నెలల తరబడి సెలవులు పెట్టడానికి నాకు ఎక్కువగా సెలవులు లేకపోవడం అటువంటి స్థితిలో నేను ఎంత మధనపడ్డానో ఆ భగవంతునికే ఎరుక. ఆ సమయంలో నేను బాబాపై భారమేసి, "నా సమస్యలను తగ్గించమ"ని ప్రార్థించాను. సరిగా అప్పుడే మా స్కూల్లో నాతోపాటు పనిచేసే ఒక టీచరు, "ఈ సమస్యల నుండి గట్టెక్కించినట్లయితే, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటానని బాబాకు మాటిస్తే, ఆయన సహాయం మీకు తప్పకుండా లభిస్తుంది" అని సలహా ఇచ్చారు. తక్షణమే నేను ఆమె చెప్పినట్లు నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని బాబాతో చెప్పుకున్నాను. అలా చేసినంతనే బాబా తమ కృపను వర్షించారు. ఆయన కాన్పు సమయంలో ఎటువంటి ఇబ్బందీ లేకుండా చేసి బాబు, పాపల రూపంలో తమ వరప్రసాదాలను మాకు అందించారు. బిడ్డలిద్దరూ చక్కటి ఆరోగ్యంతో ఉన్నారు. ఇంతలా మాపై అనుగ్రహం చూపిన బాబాకు శతసహస్రకోటి ప్రణామాలతో ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాగే అన్ని సమస్యల నుండి అందరినీ ఎల్లవేళలా కాపాడమని ప్రార్థిస్తూ, ఈ అనుభవం పంచుకోవడంలో కొంచెం ఆలస్యమైనందుకు బాబాను మన్నించమని వేడుకుంటున్నాను.


శ్రీశ్రీశ్రీ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


లాప్టాప్ ఛార్జర్ దొరికేలా అనుగ్రహించిన బాబా


నా పేరు సాయిదీప్. నేను బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని మీతో మొదటిసారిగా పంచుకుంటున్నాను. 2002, మార్చి నెల చివరిలో నేను మా చుట్టాల ఇంట్లో జరిగిన ఒక పండగకి వెళ్ళాను. అక్కడ నా లాప్టాప్ ఛార్జింగ్ పెట్టిన తరువాత ఛార్జర్ తీసి షెల్ఫ్‌లో పెట్టాను. ఉదయాన్నే లేచి చూస్తే నా ఛార్జర్ కనిపించలేదు. మొత్తం అంతా వెతికినా ఆ ఛార్జర్ ఎక్కడా కనపడలేదు. దాంతో అది దొరుకుతుందన్న ఆశ వదిలేసుకున్నాను. కానీ దాని అవసరం నాకు ఎంతో ఉంది. పోనీ, కొత్త ఛార్జర్ తీసుకుందామంటే నా దగ్గర డబ్బులు లేవు. అందువల్ల చాలా బాధపడి చివరగా, "బాబా! ఛార్జర్ దొరికితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని సాయిని వేడుకున్నాను. సరిగ్గా 3 రోజుల తర్వాత నేను మా ఊరిలో ఉన్న బాబా మందిరానికి వెళ్లి, మందిరంలోకి ప్రవేశించగానే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. "బాబా! మీరే నన్ను పిలుస్తున్నారా!" అని మనసులో అనుకుంటూ ఆ కాల్ లిఫ్ట్ చేశాను. మా చుట్టాల అబ్బాయి, "ఛార్జర్ దొరికింది" అని చెప్పాడు. ఆ మాట వినేటప్పుడు నేరుగా బాబాను చూస్తున్న నాకు చాలా సంతోషంగా అనిపించింది. "ధన్యవాదాలు బాబా".



6 comments:

  1. Sai మహిమలు సర్వాంతం

    ReplyDelete
  2. Jaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. జై బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ దేవుని కి జై.. జై బోలో షిరిడి సాయినాథ్ మహారాజ్ కీ జై.. సర్వ దేవతల నవ్యాకృతి జై బోలో షిరిడి సాయినాథ్ మహారాజ్ కీ జై.. మాకు ఆయురారోగ్యాలను అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే సాయినాథ థాంక్యూ థాంక్యూ థాంక్యూ

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  6. Carpenter manasu marchi ma money maku ravali baba please

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo