1. బాబా అనుగ్రహంతో తొలగిన సమస్యలు
2. బాబా తమ భక్తులను ఆకలితో ఉండనిస్తారా?
3. అంతా సజావుగా సాగేలా చూసిన బాబా
బాబా అనుగ్రహంతో తొలగిన సమస్యలు
రాజాధిరాజాయ విద్మహే
యోగిరాజాయ ధీమహే
తన్నో సాయి ప్రచోదయాత్!!!
సాయిబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నా పేరు రఘు. తలచినంతనే పలికే దైవం సాయినాథుడు. ఆయన నాకు ప్రసాదించిన మూడు అనుభవాలను పంచుకుంటున్నాను.
2021, డిసెంబర్ నెల చివరలో నా కూతురు ఈషా, వాళ్ళ అమ్మ న్యూ ఇయర్ హాలిడేస్ మరియు సంక్రాంతి పండగకని వాళ్ళ పిన్ని వాళ్ళింటికి వెళ్లారు. అక్కడ వాళ్ళు న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ బాగా ఎంజాయ్ చేసారు. మరుసటిరోజు ఈషాకి వాంతులు, విరోచనాలు అయ్యాయి. మా అమ్మాయి చాలా సున్నితస్తురాలు. ఏ మాత్రం వాతావరణంలో మార్పు వచ్చినా వెంటనే తను ప్రభావితురాలవుతుంది. అందుచేత నేను తనకి అవుతున్న వాంతులు, విరోచనాలు అటువంటివే అనుకున్నాను. కానీ రెండు రోజులైనా తనకి తగ్గలేదు. దాంతో నాకు భయమేసి, "బాబా! నా కూతురుని కాపాడండి. తనకి ఆరోగ్యం చేకూరేలా చూడండి" అని బాబాను ప్రార్థించాను. తరువాత నేను నా భార్యకి ఫోన్ చేసి, "బాబాను ప్రార్థించి, ఊదీ పాపకి పెట్టి, మరికొంత ఊదీ నీళ్లలో కలిపి పాపకి ఇవ్వు" అని చెప్పాను. తను అలాగే చేసింది. మరుసటిరోజు నుంచి తనకి ఆరోగ్యం చేకూరసాగింది. వాంతులు ఆగాయి, రెండు రోజులకి విరోచనాలు కూడా తగ్గిపోయాయి. "ధన్యవాదాలు బాబా".
మా ఊరిలో మాకు ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి డాబా మీద నీళ్లు నిల్వ ఉండటం వల్ల పాకుడు పట్టింది. దానివల్ల స్లాబ్ పాడైపోతుందేమోనని భయపడి 2022, ఫిబ్రవరిలో ఇంటికి మరమత్తులు చేయిద్దామని అనుకున్నాము. ఒక మేస్త్రికి కాంట్రాక్ట్ ఇచ్చి మరమత్తు పనులన్నీ చేయమని పురమాయించాము. పనులన్నీ అయిపోయాక నీళ్లు పెడితే, స్లాబ్ నుంచి నీళ్లు లీక్ అవ్వసాగాయి. ఇంతకుముందు లేని సమస్య కొత్తగా మొదలైందేంటని మేస్త్రిని అడిగితే, "కొత్తగా స్లాబ్ వేసాము కదా, అలా అవుతుంది" అని అన్నాడు. నేను భయపడి బాబాని ప్రార్థించాను. ఆయన దయవల్ల మొదట మూడు రోజులు నీళ్లు లీకైనప్పటికి, తరువాత కాలేదు. "ఈ సమస్య నుండి కాపాడినందుకు ప్రణామాలు బాబా. ఎల్లప్పుడూ ఇలాగే మా కుటుంబాన్ని కాపాడండి బాబా".
నేను ఈ బ్లాగులో లాప్టాప్, ఫోన్ పని చేయకపోతే బాబాను ప్రార్థించడం గురించి చాలాసార్లు చదివాను. అప్పుడు నేను, 'వీటిని కూడా బాబాని అడగాలా, ఏదో లూజ్ కనెక్షన్ అయుంటుంది. చెక్ చేసుకుంటే సరిపోతుంది కదా!' అని నా మనసులో అనుకునేవాడిని. కానీ అటువంటి సమస్య నాకు కూడా అనుభవమైనప్పుడు వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉంటారో తెలిసి వచ్చింది. "బాబా! నన్ను క్షమించండి. ఇంకెప్పుడూ అలా ఆలోచించను. తల్లి, తండ్రి, గురువు మీరే అయి మాకు సదా మార్గనిర్దేశం చేయండి. ఎల్లప్పుడూ నా కుటుంబానికి సహాయం చేయండి".
అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!
బాబా తమ భక్తులను ఆకలితో ఉండనిస్తారా?
అందరికీ నమస్తే. నా పేరు అరుణ. నేను విజయవాడ నివాసిని. నాకు మా సార్ అంటే చాలా ఇష్టం. తనతో మాట్లాడకుండా నేను అస్సలు ఉండలేను. అయితే ఒకసారి ఒక చిన్న అపార్థం వలన తను నాతో మాట్లాడటం మానేశారు. నేను క్షమాపణ చెప్పినా, బ్రతిమిలాడినా ప్రయోజనం లేకపోయింది. దాంతో నేను డిప్రెషన్‍లోకి వెళ్ళిపోయాను. నేను రోజూ కన్నీళ్లు పెట్టుకుంటూ నా బాధని బాబాకి చెప్పుకుంటూ ఉండేదాన్ని. కానీ బాబా ఎందుకో మౌనంగా ఉండేవారు. దాంతో నేను రోజూ, "ఎందుకు బాబా నన్ను పరీక్షిస్తున్నావు? నేను మీ బిడ్డను కాదా? నన్ను వదిలేసావా? నా ప్రార్ధన మీకు వినపడటం లేదా?" అంటూ బాబా ముందు కూర్చుని ఏడుస్తూ అడుగుతుండేదాన్ని. అలా ఒక నెల గడిచిపోయింది. బాబా మాత్రం, 'శ్రద్ద-సబూరి' అని మెసేజ్ రూపంలో సమాధానం ఇస్తుండేవారు. 2022, ఏప్రిల్ 7వ తేదీ ఉదయం నుండి నా మనసుకి చాలా బాధగా అనిపించింది. ఉదయం 8:30కి బాబాకి పూజచేసి, బాబాతో ఒక్కటే చెప్పాను: "బాబా! నేను ఇన్నిరోజులు నిన్ను ఇంతగా ప్రార్థిస్తున్నా నువ్వు నా ప్రార్ధన వినడం లేదు కదా! మా సార్ నాతో మాట్లాడేవరకు నేను అన్నం తినను. ఎన్ని రోజులు అయినా సరే" అని గట్టిగా చెప్పి, పారాయణ ముగించుకుని నా పని నేను చేసుకోసాగాను. ఒకపక్క ఏడ్చుకుంటూ మరోపక్క మనసులోనే బాబాతో మాట్లాడుకుంటూ ఉన్నాను. దయామయుడు అయిన మన తండ్రి మనల్ని ఆకలితో ఉండనిస్తాడా? ఇంక బాబా లీల చూడండి. ఆయన మా సార్ మనసు మార్చి నాతో మాట్లాడేలా చేశారు. మధ్యాహ్నం 2:30కి మా సార్ ఏమీ జరగనట్టు నాతో మామూలుగా మాట్లాడారు. అసలు నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. ఆ నెల రోజులు ఎంత బాధపడ్డానో, అంతా ఒక్క నిమిషంలో పోయింది. నిజానికి మేము మళ్ళీ కలుస్తాం అన్న నమ్మకం నాకైతే అస్సలు లేదు. అలాంటిది బాబా దయవలన మేము మళ్ళీ దగ్గరయ్యాము. "బాబా! మీరు చేసిన ఈ మేలు నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. ఇంకెప్పుడూ ఇలాంటి మనస్పర్థలు రాకుండా చూడండి బాబా. నేను మిమ్మల్ని ఎన్నోసార్లు నిందించాను బాబా. నన్ను క్షమించండి. ఇంకా నేను తెలిసీతెలియక ఏవైనా తప్పులు చేసి ఉంటే నన్ను దయతో క్షమించండి బాబా. మీ ప్రేమ, కరుణలు ఎప్పుడూ ఇలానే మా అందరి మీదా ఉండాలి బాబా".
శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కి జై!!!
అంతా సజావుగా సాగేలా చూసిన బాబా
సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు ఉమ. మేము దుబాయిలో నివాసముంటున్నాము. నేను 2022, మార్చి 26కి హైదరాబాద్ వెళ్లాలని టికెట్లు బుక్ చేసుకున్నాను. ప్రయాణానికి ముందు పీసీఆర్ టెస్ట్ రిపోర్టు ఉండాలని మార్చి 24న నేను టెస్ట్ చేయించుకున్నాను. మార్చి 25న, 'నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, కాబట్టి మళ్ళీ టెస్టు చేయించుకోవడానికి రమ్మని' మావారికి ఫోన్ వచ్చింది. దాంతో ఆరోజు మధ్యాహ్నం మరోసారి టెస్టుకి ఇచ్చి వచ్చాము. ఆరోజు రాత్రి మావారు, "ఇంకా రిపోర్టు రాలేదు కదా, వచ్చే వారానికి టికెట్ పోస్టుపోన్ చేస్తాను" అన్నారు. నేను, "నాకు కోవిడ్ ఏమీ ఉండదు. అదేదో తప్పు రిపోర్టు వచ్చింది. బాబా దయవల్ల అంతా నార్మల్ అవుతుంది" అని చెప్పి పడుకున్నాను. మరుసటిరోజు రాత్రి పది గంటలకి ఫ్లైట్ అనగా మధ్యాహ్నం రెండు గంటలకి కోవిడ్ నెగిటివ్ అన్న రిపోర్టు వచ్చింది. దాంతో నేను అనుకున్నట్లే హైదరాబాదుకి ప్రయాణమయ్యాను. "బాబా! మీరే అంతా సజావుగా సాగేలా చూసుకున్నారు. మేరే బాబా, ఓ దయామయ తండ్రి. ఎప్పటికీ మీ కృప మా యందు ఉండాలి ఓ కరుణామయ తండ్రి". ధన్యవాదాలు బాబా.

