1. అడుగడుగునా బాబా మనకి తోడుంటారు
2. ఎక్కిళ్ళ బాధను తీర్చడానికి వచ్చిన సాయినాథుడు
అడుగడుగునా బాబా మనకి తోడుంటారు
నేను ఒక సాయి భక్తురాలిని. నా జీవితంలో బాబా నాకు ఎన్నో అనుభవాలను ఇచ్చి ఆయన మీద నమ్మకాన్ని వృద్ధి చేస్తున్నారు. నేను ఆయన్ని మరిచిపోయినా ఆయన నన్ను ఎన్నడూ మరిచిపోలేదు. ప్రతిక్షణం బాబా నేనున్నానంటూ నాకు నిదర్శనమిస్తున్నారు. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మా ఆఫీసులో నాతోపాటు పనిచేసే ఒక సహోద్యోగి కొడుకు ఒకరోజు సైకిల్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. ఎక్స్-రే తీస్తే ఆ అబ్బాయి తొడ భాగంలో ఎముక విరిగి మూడు ముక్కలైందని తెలిసింది. డాక్టరు సర్జరీ చేయాలి అని అన్నారు. ఆ విషయం వినగానే, 'అంత చిన్నపిల్లాడికి ఎందుకలా అయింద'ని నాకు చాలా బాధగా, భయంగా అనిపించింది. అప్పుడు 'బాబా మనకు ఏదైనా మంచి చేయాలనుకున్నప్పుడు మన దుష్కర్మల చెడు ప్రభావాన్ని ముందుగా తీసేస్తారు. ఇది కూడా అలాంటిదే అయుంటుంది' అని భావించి, "బాబా! ఆ బాబుకి బాగుండాలి. బాబుకి ఏ ప్రాబ్లం లేకుండా చూడండి" అని బాబాతో చెప్పుకుని 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రాన్ని జపించసాగాను. ఇలా ఉండగా మరుసటిరోజే ఆపరేషన్ చేస్తామని డాక్టరు చెప్పారు. నేను నా సహోద్యోగితో, "బాబు విషయంలో అంతా మంచిగా ఉండాలని బాబాని కోరుకుని, బాబా ఊదీ బాబుకి పెట్టమ"ని చెప్పాను. కానీ తను వెళ్లేసరికి బాబుని ఆపరేషన్ థియేటర్ లోపలకి తీసుకుని వెళ్లారు. తను, "ఒకసారి లోపలికి వెళ్లి, బాబుకి ఊదీ పెట్టి వస్తాన"ని అక్కడ స్టాఫ్‍ని అభ్యర్థిస్తుండగా అక్కడికి ఒక నర్సు వచ్చి, "నేనూ బాబా భక్తురాలినే. నేను బాబుకి ఊదీ పెడతాను" అని ఊదీ తీసుకుని వెళ్లి బాబుకి పెట్టింది. ఇలా అడుగడుగునా బాబా మనకి తోడుగా ఉంటారు. బాబా దయవల్ల సర్జరీ ఏ ప్రాబ్లం లేకుండా బాగా జరిగింది. కానీ తరువాత ఎక్స్-రే తీస్తే, ముక్కలైన మూడు ఎముకలను కలిపిన చోట ఒక ఎముక కొంచం బయటకి వచ్చినట్లుగా కనిపించింది. అయితే డాక్టరు పిల్లలు పెద్దవుతూ ఉంటే అది దానంతట అదే సెట్ అయిపోతుంది అని అన్నారు. "బాబా! బాబు మంచం మీద కష్టపడుతున్నాడు. డాక్టర్లు ఏం చెప్పినా, ఏం చేసినా నమ్మకం మరియు ఓపిక ఉంటే మీరు దేనినైనా, ఎటువంటి పరిస్థితినైనా మంచిగా మార్చగలరన్న నమ్మకం నాకు ఉంది బాబా. మళ్ళీ ఎక్స్-రే తీసేసరికల్లా ఆ ఎముక సెట్ అయి అంతా నార్మల్ అయ్యేలా చూడండి బాబా. ఆక్సిడెంట్ జరిగినప్పటినుంచి ప్రతిక్షణం ఎవరో ఒకరిని బాబు పక్కన ఉంచి ఏ పెద్ద ప్రాబ్లం లేకుండా ఇక్కడివరకు తీసుకు వచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఎప్పటికీ మీకు ఋణపడి ఉంటాను బాబా".
ఈమధ్య మా అమ్మ బాగా కాళ్లనొప్పులతో తన ఆరోగ్యం బాగుండట్లేదు అంటుండేది. కొన్ని సంవత్సరాల క్రితం అమ్మ కిడ్నీ దగ్గర ఒక బుడగలా ఉందని, తరచూ చెకప్ చేయించుకుంటూ ఉండమని డాక్టరు చెప్పారు. అయితే ఈ మధ్య చాలాకాలంగా చెకప్ చేయలేదు. అందువల్లే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయేమోనని అమ్మ భయపడుతూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు మా బ్రదర్ అమ్మని చెకప్ కోసం హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాడు. అప్పుడు నేను, "బాబా! అమ్మకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా చూడండి" అని బాబాను వేడుకున్నాను. డాక్టరు టెస్టు చేసి, "సమస్యేమీ లేదు. వయసు పైబడటం వల్ల కాళ్ళనొప్పులు వస్తున్నాయి" అని చెప్పి క్యాల్షియం టాబ్లెట్లు ఇచ్చి పంపించారు. అంతా బాబా దయ. "చాలా ధన్యవాదాలు బాబా. అమ్మానాన్నలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చూడండి బాబా".
ప్రస్తుతం నా మరదలు ఎనిమిది నెలల గర్భవతి. ఒకరోజు తను మా ఇంటికి వచ్చినప్పుడు తీసుకున్న ఆహారం పడక వాంతులు చేసుకుని అసౌకర్యంగా ఉందని ఏమీ తినకుండా పడుకుంది. అప్పుడు నేను, "బాబా! తనకి నార్మల్ అయ్యి ఆరోగ్యం బాగుండేలా చూడండి. మీ దయతో తను నార్మల్ అయితే బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకుని కొద్దిగా ఊదీ తన నుదుటన పెట్టాను. కాసేపటికి తను నిద్రపోయింది. మరుసటిరోజు ఉదయం నేను తనని, "ఇప్పుడు ఎలా ఉంది?" అని అడిగాను. అందుకు తను, "రాత్రి అస్సలు మెలుకువ రాలేదు. బాగా నిద్రపట్టింది" అని చెప్పింది. "బాబా! తనకి ఏ ఇబ్బందీ లేకుండా ప్రశాంతంగా నిద్రపోయేలా అనుగ్రహించి తనని నార్మల్ చేసినందుకు మీకు ధన్యవాదాలు".
ఇంకోరోజు ఇంట్లో ఏదో వండితే, అది తిన్న మా మరదలు, ఆ ఆహారం పడక తనకి కడుపునొప్పి వస్తుందని వెళ్లి పడుకుంది. మా ఇంట్లో అందరికీ చాలా భయమేసింది. అప్పుడు నేను తనకి బాబా ఊదీ పెట్టి, మేడపైకి వెళ్లి నా ఫోన్‌లో బాబా లైవ్ దర్శన్ ఓపెన్ చేసి, "బాబా! నేను కిందకి వెళ్లేసరికి తనకి కడుపునొప్పి తగ్గి, తను భోజనం చేయాలి" అని బాబాతో చెప్పుకుని 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రాన్ని108 సార్లు స్మరించాను. ఆపై బాబాని తలుచుకుని కిందకి వెళ్లేసరికి నా మరదలు లేచి తనంతటతానే భోజనం కూడా చేసింది. నిజంగా ఇది బాబా చేసిన అద్భుతం. నేను మా ఇంట్లోవాళ్ళతో, "నేను బాబాను తలుచుకున్నాను, తనకి తగ్గింది" అని చెపితే, అందరూ చాలా సంతోషించారు. "చాలా చాలా థాంక్స్ బాబా. తనకి త్వరలోనే డెలివరీ ఉంది. నార్మల్ డెలివరీ అయ్యేలా, తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చూడండి బాబా".
మనం రోజూ ఎన్నో మెసేజ్లు చూస్తాం. కానీ కొన్ని మనసుకి బాగా కనెక్ట్ అవుతాయి. ఒకరోజు ఉదయం నేను నిద్రలేవగానే ఈ బ్లాగులో, "బావూ! ఈరోజు నేను మీ ఇంటికి భోజనానికి వస్తాను" అన్న బాబా మెసేజ్ చూసాను. నాకెందుకో ఆ మెసేజ్ బాగా కనెక్ట్ అయి, 'మా ఇంటికి ఎవరు వస్తారు? సరే, ఈరోజు మధ్యాహ్నం ఎవరైనా వస్తారేమో చూద్దాం' అని అనుకున్నాను. ఉదయం 11 గంటలకి నా మీటింగ్ అవగానే మా ఇంటి గుమ్మం దగ్గరికి ఎవరో భిక్షకోసం వచ్చారు. అదివరకు మా ఊరిలో ఒకతను భిక్షకోసం వచ్చి ఇచ్చిన దానితో తృప్తి చెందక బలవంతంగా అందరి వద్ద నుండి డబ్బులు తీసుకుంటుండేవాడు. ఆ అబ్బాయే వచ్చాడని మా అమ్మ అనుకుంటుండగా నేను వెళ్లి, "ఎవరో పిలుస్తున్నారు. ఎవరమ్మా" అని అమ్మను అడిగాను. అప్పుడు అమ్మ నా చేతికి కొంచెం డబ్బులిచ్చి, "వీటిని దూరం నుంచి అతనికిచ్చి వచ్చేయి, అతనేమన్నా పట్టించుకోకు" అని చెప్పింది. కానీ వచ్చింది ఆ అబ్బాయి కాదు, వేరే అతను. నాకు ఎందుకో అతన్ని చూడగానే ఉదయం చదివిన బాబా మెసేజ్ గుర్తుకు వచ్చి, 'బాబానే వచ్చారా?' అని అనిపించి, 'ఆయనకి ఏమి ఇవ్వాలి?' అని అనుకున్నాను. కానీ ఎవరో అనుకుని అప్పటికే అపార్థం చేసుకున్న అమ్మని ఏదైనా అడిగితే, ఏమంటుందోనని ఆలోచిస్తుంటే, అప్పుడే మా డాడీ తెచ్చిన పళ్ళు కనిపించాయి. వాటిని తీసుకుని అతని దగ్గరకి వెళ్లాను. అతని చేతిలో ఉన్న డబ్బులు చూసి, ఇతను డబ్బులు తీసుకునే వ్యక్తి కాబోలు, పళ్ళు తీసుకోరేమో అనుకున్నాను. కానీ నేను పండ్లు ఇస్తే, అతను సంతోషంగా వాటిని తీసుకుని 'జై సాయిరామ్' అని వెళ్ళిపోయాడు. నాకైతే అతని రూపంలో బాబానే వచ్చారనిపించి చాలా చాలా సంతోషించాను. తరువాత పొద్దున్న బ్లాగులో వచ్చిన బాబా మెసేజ్ గురించి అమ్మకి చెప్తే, "అయ్యో! నేను అతన్ని గుర్తుపట్టలేనందున ఏమీ ఇవ్వలేకపోయాను" అని చాలా బాధపడింది. అతన్ని వెనక్కి పిలిచి ఏదైనా ఇద్దామని మా వీధిలో, వెనక వీధిలో వెతికాము కానీ, ఆయన అప్పటికే ఏటో వెళ్ళిపోయారు. ఈ అనుభవం ఎందుకు పంచుకున్నాను అంటే, 'బాబా ఏదో ఒక రూపంలో మీ ముందుకు కూడా రావచ్చు. ఆయన వచ్చినప్పుడు మీరు ఆయన్ని గుర్తుపట్టి, ఆయనపట్ల మీ ప్రేమను వ్యక్తపరుస్తార'ని. "అనుభవాలు పంచుకోవడంలో ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి బాబా. కొన్నాళ్లుగా ఒక సమస్యతో నాలో నేనే స్ట్రగుల్ అవుతున్నాను. అది పోయినట్లే అనిపించింది. కానీ మళ్లీ వస్తుందని నాకు బాధగా, భయంగా ఉంటుంది. నేను ఏదైనా తప్పు చేసి ఉంటే, దయతో నన్ను మన్నించి ఏ ఇబ్బందీ లేకుండా ఆ సమస్య నుండి బయటపడేసి మీ బ్లాగులో నా అనుభవాన్ని పంచుకునేలా ఆశీర్వదించండి బాబా".
Om sai ram
ReplyDeleteOm sai please cure my urine infection.in ladies it is not easy to cure this రోగం
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
A carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete