ఈ భాగంలో అనుభవాలు:
1. బాబాను మించిన వైద్యుడు, శ్రేయోభిలాషి మనకి ఎవ్వరూ లేరు
2. నమ్ముకుంటే ఎటువంటి కష్టాన్నైనా దూరం చేస్తారు బాబా
3. చెప్పుకున్నంతనే ఆరోగ్యం సరిచేసిన బాబా
బాబాను మించిన వైద్యుడు, శ్రేయోభిలాషి మనకి ఎవ్వరూ లేరు
ముందుగా సాయి భక్తులకు నమస్కారాలు. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు పుష్పలత. నేను ఇంతకుముందు బాబా అనుగ్రహంతో నా జీవితంలో జరిగిన రెండు అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరొక అనుభవాన్ని మీ అందరితో పంచుకునే అవకాశం బాబా ఇచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ అనుభవాన్ని పంచుకోవటంలో ఆలస్యం చేసినందుకు బాబాకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటూ విషయంలోకి వస్తున్నాను. నేను హైదరాబాదులో ఒక మంచి పేరున్న కామర్స్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరరుగా పనిచేస్తున్నాను. నా వయస్సు 42 సంవత్సరాలు. నేను గత సంవత్సరం నుండి నెలసరి సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నాను. దానివల్ల రక్తహీనత కూడా వచ్చింది. కానీ డాక్టరు వద్దకు వెళ్ళాలంటే నాకు చాలా భయమేసింది. అసలు నా ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు వచ్చాయో, డాక్టరు ఏమి చెప్తారోనని భయంతో ప్రతినెలా డాక్టరు దగ్గరకి వెళ్లడం వాయిదా వేస్తూ ఉండేదాన్ని.
నేను నాకు ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారం కోసం రెండు చీటీలు వ్రాసి బాబా పాదాల వద్ద ఉంచి, వాటిలో నుండి ఒక చీటీ తీసి, అందులో ఉన్నదాన్ని బాబా సందేశమని ప్రగాఢంగా విశ్వసిస్తాను. అలాగే పైన చెప్పిన నా సమస్య విషయంలో కూడా 'డాక్టరుని సంప్రదించాలా, వద్దా' అని చీటీల మీద వ్రాసి మూడుసార్లు తీశాను. మూడుసార్లూ డాక్టరుని సంప్రదించమని వచ్చింది. అంతే, నేను ఇంట్లో ఆ విషయం గురించి ఎవ్వరితోనూ చర్చించకుండా కాలేజీలో క్లాసులు అయ్యాక మాకు తెలిసిన ఒక గైనకాలజిస్ట్ దగ్గరకి వెళ్ళాను. నేను హాస్పిటల్లో అడుగుపెడుతూనే ఒక పెద్ద ఫొటో రూపంలో ఆ సాయినాధుడు నాకు దర్శనమిచ్చారు. డాక్టరుని కలసి టెస్టు చేయించుకున్నంతవరకు నేను నా మనసులో బాబానే తలుచుకుంటూ "హేస్ట్రెక్టమీ(గర్భసంచి తొలగించే) ఆపరేషన్ చేయాలని డాక్టరు చెప్పకూడద"ని బాబాతో చెప్పుకుంటూ ఉన్నాను. కాని డాక్టరు నన్ను పరిశీలించి, "గర్భసంచిలో నీటి తిత్తుల పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల గర్భసంచి బాగా ఉబ్బింది. వెంటనే ఆపరేషన్ చెయ్యాలి" అని అన్నారు. నేను, "బాబా! ఇలా జరిగిందేంటి?" అని చాలా ఏడ్చాను. కాని బాబా మనల్ని తల్లిదండ్రులకన్నా ఎక్కువగా కంటికి రెప్పలా కాపాడుతారనే విషయాన్ని నేను మనసా, వాచా, కర్మణా నమ్ముతాను. ఆ నమ్మకంతోనే 'నాకు గురువారమే ఆపరేషన్ జరగాలని, మళ్ళీ గురువారానికి నేను క్షేమంగా ఇంటికి రావాల'ని బలంగా కోరుకున్నాను. నేను కోరుకున్నట్లే అన్నీ సవ్యంగా జరిగి మూడు రోజులకే నేను హాస్పిటల్ నుండి ఇంటికి తిరిగి వచ్చాను. ఐతే ఆపరేషన్ సమయంలో తొలగించిన దానిని బయాప్సీ టెస్టుకి పంపించారు. 'ఆ రిపోర్ట్ నార్మల్‍గా రావాల'ని నేను క్షణం విడవకుండా బాబాని అడుగుతుండేదాన్ని. ఆ బాబా దయవల్ల బయాప్సీ రిపోర్ట్ 100% నార్మల్ అని వచ్చింది. డాక్టరు, "ముందు ముందు ఏ సమస్యలు ఉండవు" అని చెప్పారు. అది విని బాబాపై నాకున్న విశ్వాసం మరింత బలపడింది. అంత పెద్ద ఆపరేషన్ జరిగినా బాబా దయవల్ల 12 రోజులకే నేను యధావిధిగా కాలేజీకి వెళ్ళగలిగాను. అందుకు కారణం మందులు కాదని, బాబా చల్లని చూపేనని నేను నమ్మకంగా చెప్పగలను. బాబాను మించిన వైద్యుడు, శ్రేయోభిలాషి మనకి ఎవ్వరూ లేరు. "బాబా! మీకు చాలా చాలా ధ్యన్యవాదాలు. నేను ప్రక్కవారి తప్పును తప్పు అని ఖండించే మనస్తత్వం కలిగిన వ్యక్తిని అవ్వటం వల్ల నా కుటుంబంలో వ్యక్తులతోనూ, నా సహోద్యోగులతోనూ కుండ బద్దలు కొట్టినట్లు ముక్కుసూటిగా మాటాడతాను. ఇంకా చుట్టుపక్కలవాళ్ళు నటిస్తూ మాట్లాడినా, అబద్దాలతో మోసం చేసినా తట్టుకునే మనస్తత్వం కూడా నాది కానందున నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. నేను మీ చరిత్రలో చెప్పబడిన 'పరనింద మహాపాపమ'నే విషయాన్ని ఎన్నోసార్లు చదివి పరనింద చేయకుండా ఉండాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాను. కానీ అది నాకు కొంతవరకు మాత్రమే సాధ్యమవుతుంది. మీ దివ్య ఆశీసులతో నాకు మరింత మనోనిగ్రహం కలగాలని కోరుకుంటున్నాను తండ్రి". మరో మంచి అనుభవాన్ని అతిత్వరలో మీ అందరితో పంచుకోవాలని ఆశిస్తూ …
నమ్ముకుంటే ఎటువంటి కష్టాన్నైనా దూరం చేస్తారు బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా 'సాయి మహారాజ్ సన్నిధి' అనే అద్భుతమైన బ్లాగు నిర్వహిస్తూ సాయి లీలామృతాన్ని భక్తులకు అందిస్తున్న బ్లాగు నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, వారికి ఆ సాయి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తుడిని. ప్రస్తుతం నా భార్య 6నెలల గర్భవతి. బాబా దయవల్ల ఇప్పటివరకు తల్లీబిడ్డల ఆరోగ్యం బాగుంది. 2022, ఏప్రిల్ నెల చివరి వారంలో మా మావయ్యగారి (నా భార్య తండ్రి) ఆరోగ్యం విషమించి ఐ.సి.యులో అడ్మిట్ అయ్యారు. అప్పట్నుండి నా భార్య దిగులుగా ఉండడం నేను గమనించాను. అదీకాక ఎప్పుడూ రాత్రి పడుకునే ముందు తన గర్భంలోని బిడ్డ కదలికలు తెలుస్తున్నాయనే నా భార్య రెండు రోజులుగా బిడ్డ కదలికలు తెలియట్లేదని టెన్షన్ పడింది. నేను గురువారం ఉదయం బాబా ఊదీ నా భార్య నుదుటన పెట్టి, నేను కూడా పెట్టుకుని 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని స్మరించడం మొదలుపెట్టి, "బాబా! సాయంత్రం వరకు బిడ్డ కదలిక తెలిస్తే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో నా అనుభవం పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. ఆ రోజు సాయంత్రం మందిరానికి వెళ్లి కూడా బాబాకి మొక్కుకున్నాను. తరువాత నా భార్యని ఆఫీసు నుండి తీసుకుని వస్తుంటే తను "బిడ్డ కదలికలు ఈరోజు తెలిసాయి" అని చెప్పింది. దాంతో పోయిన ఊపిరి తిరిగి వచ్చినట్టు అనిపించింది నాకు. ఆ బాబాని నమ్ముకుంటే ఎటువంటి కష్టాన్నైనా దూరం చేస్తారు. ఆయన కరుణామయులు. "ధన్యవాదాలు బాబా. నా కెరీర్ సమస్య గురుంచి మీకు తెలుసు. తొందరగా ఆ సమస్య సమసిపోయేలా చూడు తండ్రి. ఇంకా ఈసారి వచ్చే ప్రమోషన్ లిస్టులో నా పేరు ఉండేలా కరుణించు తండ్రి. నాకు ప్రమోషన్ వస్తే, నా అనుభవాన్ని మీ బ్లాగు ద్వారా తోటి మీ బిడ్డలతో పంచుకుంటాను. తెలిసీతెలియక ఏవైనా తప్పులు చేసి ఉంటే క్షమించు తండ్రి. మీ బిడ్డలందరిపై మీ కరుణాకటాక్షాలు ఉండేలా చూడు తండ్రి".
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీసచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కి జై!!!
చెప్పుకున్నంతనే ఆరోగ్యం సరిచేసిన బాబా
సాయి భక్తులకు నమస్కారం. నా పేరు నళిని. నేను వేడుకున్నంతనే బాబా ఎన్నోసార్లు నా బాధలు తీర్చారు. నాకు ఉద్యోగం ప్రసాదించారు. నేను నా అనుభవాలను బ్లాగులో పంచుకుంటానని మొక్కుకుని మర్చిపోయిన కొన్ని సందర్భాలలో బాబా కలలో కనిపించి వాటిని గుర్తు చేశారు. అలాగే నేను ఏదైనా మర్చిపోతే బాబా ఏదో రూపంలో గుర్తు చేస్తారు. ఇటీవల నా ఆరోగ్యం బాగాలేని సమయంలో హఠాత్తుగా బంధువులు వచ్చారు. అప్పుడు నేను, "బాబా! నా ఆరోగ్యం బాగా లేని కారణంగా వాళ్ళని సరిగా చూసుకోలేనేమో" అని అనుకున్నాను. అంతే, బాబా నా ఆరోగ్యం బాగుండేలా చేశారు. ఇలా ఏది అడిగినా బాబా వెంటనే తీరుస్తారు. "ఎప్పుడూ నా వెంట ఉంటూ నన్ను కాపాడుతున్నందుకు ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ ఇలాగే నాతో మీరు ఉంటారని ఆశిస్తున్నాను బాబా".
Jaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDelete🙏🕉️✡️🙏 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.. నిన్ను నమ్ముకున్న భక్తులకు కంటికి రెప్పలా కాపాడే షిరిడీశ్వరా మీకు వేల వేల వందనాలు.. థాంక్యూ సాయిరాం.. బాబా
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం శ్రీ సాయి బాబా నాకు బాగా నచ్చిన మాట బాబా ని మించిన వైద్యుడు లేడు. ఇది నిజం. బాబా దయ వుంటే అన్ని వున్నాయి. బాబా నీ ఆశీస్సులు కావాలి తండ్రి. నా చెడు ఆలోచన లు మారిపోయి మంచి గ నీ మీద భక్తి శరణాగతి పొందేలా గ దీవెనలు ప్రసాదించు సాయినాథ
ReplyDeleteOM SAIRAM
ReplyDeleteSAI ALWAYS BE WITH ME
Om sai ram
ReplyDelete