సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక1181వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఎంతటి కరుణామయులు
2. ఆ శ్రీకృష్ణుడే శ్రీసాయినాథుడు
3. బాబాకు చెప్పుకుంటే తీరిపోతుంది సమస్య

బాబా ఎంతటి కరుణామయులు


నాకు తల్లి, తండ్రి, దైవం అన్నీ అయిన సాయినాథునికి సాష్టాంగ నమస్కారాలు. సాయి బంధువులకు ప్రణామాలు. నా పేరు శ్రీరంజని. 2022, ఏప్రిల్ నెలలో నాకు నీరసంగా ఉంటూ ఇరవై రోజులైనా తగ్గకపోయేసరికి నేను మందులు వేసుకోసాగాను. అయితే ఆ మందులవల్ల నా కడుపులో నొప్పి మొదలైంది. అది కొంచెం కొంచెంగా పెరిగి ప్రతి 5 నిమిషాలకొకసారి నొప్పి వస్తుండేది. నాకు చాలా భయమేసింది. ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదివి, "బాబా! మీరు నన్నెందుకు కరుణించట్లేదు. ఇది 24 గంటల కడుపునొప్పి కాకుండా తగ్గిపోవాల"ని బాబాని వేడుకున్నాను. బాబా ఎంత కరుణామయులంటే మరుక్షణమే నొప్పి తగ్గిపోయింది, మళ్లీ రాలేదు. "ధన్యవాదాలు బాబా! ఇలాగే నీరసం సమస్య కూడా తగ్గేలా చూడండి బాబా. నీరసం వల్ల నేను ఏ పని చేయలేకపోతున్నాను. నీరసం తగ్గిపోయి నేను పూర్తిగా కోలుకోవాలి తండ్రీ".


మరో అనుభవం విషయానికి వస్తే, అనేక అవాంతరాల వల్ల నా చదువు ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం నేను 'US CPA' అనే కోర్సు చేయాలని సంకల్పించి అందుకు కావాల్సిన అర్హతలు నాకు ఉన్నాయో, లేదో తెలుసుకుందామని ముందుగా ఒక విద్యాసంస్థను సంప్రదించాను. వాళ్ళు, "రెగ్యులర్ డిగ్రీ చేసిన వారికి ఈ కోర్సు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. కానీ మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పద్దతిలో డిగ్రీ చేసారు. కాబట్టి మీకు ఈ కోర్సు చేసే అవకాశం ఉందో, లేదో తెలియదు. మీరు మీ మార్క్ షీట్స్ పంపించండి. చూసి చెప్తాం" అని అన్నారు. అప్పుడు నేను, "బాబా! నేను CPA కోర్సు చేయడానికి అర్హురాలినయ్యేలా చూడండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల నేను ఆ కోర్సు చేసేందుకు అర్హురాలినయ్యాను. "చాలా చాలా ధన్యవాదాలు సాయి".


ఒకసారి నడుస్తుంటే నడుము కిందగా ఉండే కాలు జాయింట్ నొప్పి వస్తుండేది. డాక్టరు దగ్గరకి వెళ్తే ఎక్స్-రే తీయించి, ఏమి చెప్తారో అని భయమేసి బాబాను ప్రార్ధించి కొబ్బరినూనెలో బాబా ఊదీ వేసి నొప్పి ఉన్న చోట రాస్తూ ఉండేదాన్ని. బాబా దయవల్ల ఒక వారం రోజులలో నొప్పి తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా".


2022, మే 3న నా ఫోన్ ఆకస్మికంగా పనిచేయటం మానేసింది. ఎన్నిరకాల ప్రయత్నాలు చేసినా మళ్ళీ పని చేయలేదు. అప్పుడు బాబాను తలుచుకుని, ఫోన్‍కి బాబా ఊదీ పెట్టి, "బాబా! నా ఫోన్ పని చేస్తే, శిరిడీ సంస్థానానికి 116 రూపాయలు విరాళంగా ఇస్తాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల కొంతసేపటికి నా ఫోన్ పని చేసింది. నేను బాబాకి మ్రొక్కుకున్నట్లుగా 116 రూపాయలు సంస్థానానికి విరాళం ఇచ్చాను. ఈవిధంగా అక్షయతృతీయ పర్వదినాన బాబా నాచేత అన్నదాన నిధికి  విరాళం ఇప్పించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి అనుభవాన్ని నేను ఈ బ్లాగులోని తోటి భక్తుల అనుభవాలలో కూడా చదివాను. ఆ అనుభవాలు నాలాంటి ఎంతోమందిని  బాబా వైపుకి నడిపిస్తున్నాయి. "ధన్యవాదాలు బాబా".


ఆ శ్రీకృష్ణుడే శ్రీసాయినాథుడు


సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు మహేష్. 2021, జులై 31(అష్టమి రోజు)న నేను, మా అన్నయ్య మొట్టమొదటిసారి శిరిడీయాత్రకు రైలులో బయలుదేరాము. ప్రయాణంలో రాత్రి నిద్రపోయాక నాతో ఎవరో శ్రీకృష్ణుని గురించి అనుకుంటా చెబుతున్నారు. నాకు మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. వెంటనే నాకు మెలకువ వచ్చి, లేచి చూస్తే ఎవరూ లేరు. నాకు చాలా అశ్చర్యంగా అనిపించింది. మరుసటిరోజు ఆగష్టు 1, తెల్లవారుఝామున మేము శిరిడీ దర్శించుకున్నాము. కొన్ని రోజుల తరువాత స్వయంగా బాబా నాకు స్వప్న దర్శనమిచ్చి, " 'శ్రీమహాభాగవతం' పారాయణ చేయమ"ని ఉపదేశించారు. నేను చాలా ఆనందించాను.


2022, మార్చి 20, ఆదివారంనాటి రాత్రి నేను శ్రీరామ నామం పలుకుతూ నిద్రపోయాను. తెల్లవారితే 2022, మార్చి 21, సోమవారం, సంకష్టహర చతుర్థి. ఆరోజు తెల్లవారుఝామున 3 నుండి 4గంటల సమయంలో నాకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో నేను, మా అన్నయ్య, మా బంధువు ఒకరు మా పొలం దగ్గర రోడ్డు మీద నిలబడి ఉన్నాము. నేను 'కృష్ణ.. శ్రీకృష్ణ..' అని పిలుస్తున్నాను. మరుక్షణం రోడ్డు పక్కన నీలిమేఘశ్యామునిగా శ్రీకృష్ణ పరమాత్ముడు దర్శనమిచ్చారు. కొద్దిసేపట్లో నేను మా ఇంట్లో మంచం మీద నిద్రిస్తూ మళ్ళీ 'కృష్ణ... శ్రీకృష్ణ..' అని పిలిచాను. వెంటనే నేను నిద్రిస్తున్న మంచం ప్రక్కనే శ్రీకృష్ణుడు దర్శనమిచ్చి కొద్దిసేపట్లో అదృశ్యమయ్యాడు. వెంటనే శ్రీసాయిబాబా వారి రూపం నాకు దర్శనమిచ్చింది. ఆయన ఒక స్క్రీన్ మీద ఏదో చూపిస్తూ నాకు బోధిస్తున్నారు. నాకు వెంటనే మెలకువ వచ్చింది. నేను చాలా చాలా అశ్చర్యపోయాను. అలాగే స్వప్నమందు దైవ దర్శనమైనందుకు 'నా జన్మధన్యమైంద'ని నేను చాలా చాలా ఆనందించాను. ఆ ఆనందానికి అవధులు లేవు. తరువాత మరొకరోజు స్వప్నంలో ఒక చిన్న కాలువ ప్రాంతంలో రుక్మిణిసమేత శ్రీపాండురంగ విఠలుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చారు. ఇలా చాలాసార్లు కృష్ణునితోపాటు శ్రీసాయిబాబా నాకు దర్శనం ఇచ్చారు. ఎంతటి భాగ్యం! సాక్షాత్తు శ్రీకృష్ణుడు నాకు దర్శనమిచ్చారు. కాదు, కాదు సాయిబాబానే నాకు కృష్ణ దర్శన భాగ్యాన్ని ప్రసాదించారు. ఆ శ్రీకృష్ణుడే శ్రీసాయినాథుడు అని నేను విశ్వసిస్తున్నాను. "బాబా! ఎల్లపుడూ మీ అనుగ్రహం మా మీద ఉండాలి శ్రీసాయికృష్ణ. నన్ను సరైన మార్గంలో ముందుకు నడిపించే బాధ్యత మీదే సాయి దేవా".


సాయిరామ హరే, సాయికృష్ణ హరే, జయ సాయి సాయి హరే హరే!!!


బాబాకు చెప్పుకుంటే తీరిపోతుంది సమస్య


ముందుగా తోటి సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. ఒకరోజు నేను మా ఇంట్లోని గ్యాస్ స్టవ్ శుభ్రపరుస్తుంటే దానికి ఉన్న నట్లు ఊడిపోయాయి. తిరిగి వాటిని పెట్టడం నాకు రాలేదు. ఒకవేళ ఏదో విధంగా పెట్టినా అవి సరిగా సెట్ కాకపోతే ఏమైనా అవుతుందేమోననని నాకు భయమేసింది. అందువలన ఏం చేయాలో తెలియక, "బాబా! లంచ్ టైమ్ అవుతుంది. స్టవ్ మంచిగా సెట్ అయ్యేలా చూడండి తండ్రీ" అని అనుకున్నాను. వెంటనే బాబా దయవల్ల మా పక్కింటి అక్కకి ఇలాంటివి బాగా తెలుసనిపించి తనని పిలిచాను. తను వచ్చి చాలాసేపు ఉండి స్టవ్ మంచిగా చేసి వెళ్ళింది. అప్పుడు నేను ఏ భయం లేకుండా వంట చేశాను. ఇదంతా బాబా దయవల్లనే. ఆయన దయవల్లనే స్టవ్ అంతా పాడైపోయినా, అక్క 'నాకు తెలియదు, నా వల్ల అవ్వదేమో!' అంటూనే స్టవ్ మంచిగా సెట్ చేసింది. "ధన్యవాదాలు బాబా".


మా అమ్మ మా ప్రాంతంలో జరిగే అమ్మవారి అన్నదాన కార్యక్రమంలో నాతో అన్నదానం చేయిస్తానని మొక్కుకుంది. అయితే, సరిగా అప్పుడే నాకు నెలసరి సమయం కావడం వల్ల ఆ మ్రొక్కు తీర్చుకోవడం అవుతుందో, లేదో అని టెన్షన్ పడ్డాం. ఎందుకంటే, అన్నదానం చేసే అవకాశం సంవత్సరానికి ఒకసారే వస్తుంది. ఇప్పుడు చెయ్యలేకపోతే మళ్ళీ సంవత్సరం వరకు ఆగాలి. అటువంటి స్థితిలో నేను, "బాబా! నేను మొక్కు తీర్చుకునేలా చూడండి" అని అనుకున్నాను. బాబా నేను కోరుకున్నట్లే అనుగ్రహించారు. నేను సంతోషంగా మొక్కు తీర్చుకున్నాను. "ధన్యవాదాలు బాబా".


సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!


8 comments:

  1. om sairam
    sai always be with me

    ReplyDelete
  2. ఓం సాయి బాబా ఈ రోజు న మా.అమ్మాయి పుట్టినరోజు కాబట్టి తన ని సంపూర్ణ ఆయుష్షు పృసాదించు ఆశీస్సులు అందించు.నా భర్త కి నా కొడుకు కు సంపూర్ణ ఆయుష్షు ఆరోగ్యం ప్రసాదించు తండ్రి. మా వెంట వుండి కాపాడు నాయన..నీ ప్రేమ కావాలి .

    ReplyDelete
  3. ఓం సాయి బాబా ఈ రోజు సాయి అనుభవాలు చాలా బాగా వున్నాయి. చదివి సంతోషించాను.బాబా దయ చూపించు నా ఆలోచనలు మారి పోయేలా గ ఆశీస్సులు అందించు

    ReplyDelete
  4. Jaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  6. A carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba

    ReplyDelete
  7. ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo