1. ఒమిక్రాన్ నుండి ఇంటిల్లిపాదిని కాపాడిన బాబా
2. కాపాడే తండ్రి బాబా3. నార్మల్ రిపోర్టు వచ్చేలా అనుగ్రహించిన బాబా
ఒమిక్రాన్ నుండి ఇంటిల్లిపాదిని కాపాడిన బాబా
నేను ఒక సాయి భక్తురాలిని. అడుగడుగునా 'నేనున్నాను' అని నిరూపిస్తూ, మనల్ని అన్ని విధాలా భరిస్తూ తల్లీ, తండ్రీ సర్వమూ తామేనని చాటుతున్న శ్రీసాయినాథునికి శతకోటి ప్రాణామాలు. సాయి బంధువులందరికీ నమస్కారం. కష్టంలో, దిక్కుతోచని స్థితిలో ఉన్న ఎందరికో బాబా మీద నమ్మకాన్ని పదింతలు చేసే ఈ మహత్కార్యాన్ని ఒక యజ్ఞంలా భావించి ఎందరికో 'బాబా ఉన్నారు, మన భారం ఆయనపై వేసి, మన పగ్గాలను ఆయనకు అప్పగిస్తే, ఆయన తప్పక మనకు దారి చూపిస్తార'ని నిరూపించే ఎన్నో వేల అనుభవాలను పోగుచేసి ఆధునిక సచ్చరిత్రగా ఈ బ్లాగును నిర్వహిస్తున్న బ్లాగు నిర్వాహకులకు నా ధన్యవాదాలు. "బాబా! దయచేసి ఎప్పటిలానే నన్ను క్షమించండి. నా ఈ అనుభవాల్ని పంచుకోవడంలో చాలా ఆలస్యం చేశాను. మేమందరం కేవలం మీ చేతిలో తోలుబొమ్మలం. కనుక తెలిసీతెలియక మేము చేసే తప్పొప్పులను ప్రేమతో మీరే సరిచేసి మాకు మీ మీద ఉన్న శ్రద్ధ, భక్తులను సదా వందల రెట్లు పెరిగే విధంగా నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి" అని వేడుకుంటున్నాను. ఇక నా అనుభవానికి వస్తే..
సరిగ్గా కరోనా థర్డ్ వేవ్ మొదలవుతున్న సమయంలో ఒక ముఖ్యమైన పని మీద నేను ఒక నెల రోజులు ఇంటికి, కుటుంబానికి దూరంగా క్యాంపుకు వెళ్ళవలసి వచ్చింది. ఆ సమయంలో సౌత్ ఆఫ్రికా, అమెరికా, లండన్ తదితర దేశాల్లో ఒమిక్రాన్ విజృంభించటం, ఫ్లైట్స్ రాకపోకల మీద ఆంక్షలు విధించటం జరుగుతున్నాయి. ఇండియాలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. అయితే అప్పటికే నా ప్రయాణానికి సంబంధించి టికెట్స్ మొదలు ప్రోగ్రాం అంతా ప్లాన్ అయిపోయింది. ఎక్కువ రోజుల దూరప్రయాణం, ఇంటికి దూరంగా నేను, ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు. నేను వాళ్ళను చూసుకున్నంత శ్రద్ధగా ఇంకెవరూ చూసుకోరు, అలాంటిది నేను లేకపోతే వాళ్ళు జాగ్రత్తగా ఎలా ఉంటారో అని దిగులు, అనుమానం, భయం అన్నీ కలిసి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. అందువలన నా ప్రయాణం నిశ్చయమైన నెల రోజుల దగ్గర నుండి నేను నా అనుమానాలు, భయాలు అన్ని బాబాతో చెప్పుకుంటూ ఆయనని పరిపరి విధాల విసిగిస్తుండేదాన్ని. ఆయన ప్రతి విషయానికి, 'నేనున్నానుగా, ప్రశాంతంగా వెళ్లి రా' అనే సంకేతాలు ఇస్తుండేవారు. ఇక భారం ఆయనపై వేసి ప్రయాణానికి సిద్ధం అవుతుండగా మేమున్న ప్రాంతంలో ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరగటం మొదలయింది. ఇప్పుడు మనకి అంత భయం లేదు కానీ, అప్పటి పరిస్థితుల్లో కరోనా సెకండ్ వేవ్ తాలూకు భయాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. పైగా థర్డ్ వేవ్ డామేజ్ అంటూ మన న్యూస్ చానెల్స్ కూడా భయపెట్టేస్తుండేవి. నేను ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తుండగా దారిలో 'ఎయిర్ పోర్టులో కొందరికి న్యూ వేరియంట్, వాళ్లలో కొందరు పారిపోయారు. వందల కొద్ది కొత్త వేరియంట్ కేసులు బయటపడుతున్నాయి' అని న్యూస్ వచ్చింది. ఆ నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకుని ఇంటికి వెళ్లిపోదామన్న ఎన్నో ఆలోచనలు నా మనసును చుట్టుముట్టాయి. కానీ బాబా, 'నీకేం భయం లేదు, నీ వాళ్ళని నేను జాగ్రత్తగా చూసుకుంటాను వెళ్ళిరా' అని పదేపదే చెప్తున్నట్టు పలురకాల సందేశాలు అందాయి. చివరికి భారం బాబాపై వేసి, ఇక బాధ్యత అంతా ఆయనదే అన్న ధీమాతో, నమ్మకంతో నా ప్రయాణం సాగించి రోజులు గడిపాను.
నేను తిరిగి వచ్చే సమయానికి కరోనా థర్డ్ వేవ్ తారాస్థాయికి చేరుకుంది. నేను ఎంతో జాగ్రత్తగా ఇంటికి వచ్చి భయం భయంగా వారం రోజులు ఇంట్లోవాళ్లకు దూరంగా గృహనిర్బంధంలో ఉన్నాను. అప్పటికీ లోలోపల అనుమానంగా, భయంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుండగా ఆలోపు సంక్రాంతి పండుగ వచ్చింది. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నారని ఎవరినీ, పనుల కోసం ఇబ్బందిగా ఉన్నప్పటికీ చివరికి పనిమనిషిని కూడా ఇంట్లోకి రానివ్వకుండా సురక్షితంగా ఉంటున్నాము. అలాంటి పరిస్థితుల్లో మా ఇంటికి అనుకోని అతి సమీప బంధువు, వారికోసం పనిమీద వచ్చిన ఇంకొకరు అంటే అతని స్నేహితుడు వచ్చారు. ఆ స్నేహితుని భార్యకి ఆ సమయంలో జ్వరం ఉంది. అయితే అతను అది మామూలు జ్వరమేనని మా బంధువుతో కలిసి మా ఇంట్లో తిరిగారు. పిల్లలు గంటలకొద్దీ వాళ్ళ పక్కన, ఎదురుగా కూర్చుని ఆడుకున్నారు. అత్తయ్య, మావయ్యలు కూడా వాళ్ళ పక్కన, ఎదురుగా కూర్చుని చాలా ఎక్కువసేపు మాట్లాడుకోవటం, కలిసి టిఫిన్లు, భోజనాలు చేయడం వంటివన్నీ జరిగాయి. నేను, 'ఈ సమయంలో వచ్చిన జ్వరం ఖచ్చితంగా కరోనానే' అని భయపడుతూ ఉన్నప్పటికీ అతను బాధ్యత లేకుండా ఉంటే ఏమీ చెప్పలేక, "ఇంట్లో అందరూ సురక్షితంగా ఉండాలి" అని బాబాకు చెప్పుకుంటూ ఉండసాగాను.
మరుసటిరోజు ఆ స్నేహితుని ఇంట్లో అందరికీ జ్వరాలు మొదలయ్యాయి. కోవిడ్ టెస్టులో అతని ఇంట్లో అందరికీ ముందు నెగిటివ్ వచ్చినా, తరువాత పాజిటివ్ వచ్చింది. అతను ఏం చెయ్యాలో తెలియక మాకు ఫోన్ చేసి, "మా ఇంట్లో పెద్దవాళ్ళున్నారు. అందరూ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి. ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. ఏ గైడెన్స్ దొరకట్లేదు. మీకు తెలిసిన వాళ్లందరినీ కనుక్కోని మాకు సహాయం చేయండి" అని అన్నాడు. ఇక నా పైప్రాణాలు పైనే పోయాయి. అనుకున్నంతా అయింది. అతనితో మా ఇంట్లో కలిసిమెలిసి తిరిగిన పిల్లలు, పెద్దలు అందరికీ ఒకటే భయం పట్టుకుంది. నేను మాత్రం, "ఇప్పుడు ఇంట్లో అందరి క్షేమాన్ని మీరే చూడాలి బాబా" అని బాబాను ఒకటే నస పెట్టేశాను. ఆ మరుసటిరోజుకి మా బంధువుకి నీరసం, జలుబు వంటి లక్షణాలు మొదలయ్యాయి. అయినా అతను, 'ఏమీ లేదులే, ఎసి దగ్గర ఉన్నాను, బయట చల్లగా ఉంది, చిన్న చిన్న అనుమానాలను పెద్దగా చేసుకుని మనం ఊరికే టెన్షన్ పడతామ'ని లెక్చర్ ఇచ్చారు. కానీ అతనికి ఆ రాత్రికి జ్వరం కూడా వచ్చింది. ఉదయానికి అతని భార్య కంగారుపడటం మొదలుపెట్టింది. ఆమె భర్త మాత్రం 'పెద్ద జ్వరం ఏమీ లేదు. వంద ఉంది. అంతే' అని అనసాగారు. ఎటూ, ఏమీ మాట్లాడలేని పరిస్థితి. కానీ ఒకే ఇంట్లో ఉన్న అందరికీ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని అప్పటికే చాలా చూశాం. అందువలన నేను లోలోపల భయంతో ఏదో విధంగా అందరినీ గృహనిర్బంధంలో ఉంచి క్షణక్షణం అందరినీ గమనించుకుంటూ, బాబాను ప్రార్థిస్తూ వారం రోజులు గడిపాను. పదిరోజుల వరకు మనఃశాంతి లేదనే ఒక్కటి తప్పితే బాబా ఇంట్లో అందరినీ కాపాడారు. మాకెవ్వరికీ ఏమీ కాలేదు. ఏమిచ్చి బాబా ఋణం తీర్చుకోగలను?
"ధన్యవాదాలు బాబా. మీకు ఒక విన్నపం బాబా, నా విషయంలో మా బాస్ ప్రవర్తనలో ఏదో కొద్దిపాటి తేడా కనిపిస్తోంది. బాగా వర్క్ బిజీలో ఉండి నన్ను కాస్త పట్టించుకోవడం లేదో ఏమో నాకు తెలియదు. కానీ, నేను తెలిసితెలిసి వారి విషయంలో లేదా వర్క్ విషయంలో ఎటువంటి తప్పూ చేయలేదు బాబా. నాపట్ల ఏవైనా అపోహలు, అపార్ధాలు వంటివి ఉండి ఉంటే వాటిని దయచేసి క్లియర్ చేయండి బాబా. మీ తర్వాత అంత గౌరవం, విలువ వారికి ఇస్తాను అనే విషయం ఆయనకు కూడా తెలుసు బాబా. కానీ నా పరిధిలో ఉన్న వర్క్ వేరే వాళ్లకు షేర్ చేసే విషయంలో నాకు మాటైనా చెప్పకపోవడం, నేను శ్రద్ధగా కష్టపడి టైంకు వర్క్ పూర్తి చేసి ఇచ్చిన వర్క్ కు వేరే వాళ్ళు తన కళ్ళ ఎదురుగా క్రెడిట్ తీసుకుంటున్నా కూడా మౌనంగా ఉండటం వంటివి నేను ఓర్పుగా చూస్తున్నాను బాబా. ఇది 2, 3 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. అన్నీ తెలిసి ఎందుకు మౌనంగా ఉన్నారో నాకు తెలీదు. దయచేసి ఆ విషయంలో అంతా మంచిగా మారేలా మీరు అనుగ్రహించండి తండ్రి. ఇంకొక ముఖ్యమైన విషయం మీ చేతిలో పెట్టాను, మీ పాదాలు పట్టుకున్నాను. ఎటువంటి మోసాలు, కుట్రలు, కుతంత్రాలు వంటి వాటికి బలి కాకుండా మీ రక్షణ వలయంలో మమ్మల్ని కాపాడండి బాబా. ఎవరినీ నమ్మలేని పరిస్థితులు ఉన్నాయి. మీరు మా మంచి, చెడులు చూస్తూ, సరైన నిర్ణయాలు మాత్రమే మా జీవితంలో జరిగేట్టుగా అనుగ్రహించండి".
కాపాడే తండ్రి బాబా
ముందుగా శ్రీసాయి పాదపద్మములకు ప్రణామాలు. నా పేరు శ్రీదేవి. నేను బాబా బిడ్డను. నా తండ్రి నన్ను ప్రతిక్షణమూ కాపాడుతున్నారు. కరోనా సెకండ్ వేవ్‍లో నాకు కోవిడ్ వచ్చి చాలా బాధపడ్డాను. ఆ సమయంలో నేను రోజూ బాబా చరిత్ర చదువుకుంటూ ఉండేదాన్ని. సినిమాలు చూసినా నా తండ్రి బాబా సినిమాలే చూసేదాన్ని. నా తండ్రి దయతో నేను కరోనా నుండి కోలుకున్నాను. తరువాత కరోనా మూడో వేవ్‍లో నాకు మళ్ళీ జ్వరం వచ్చింది. ఆ రాత్రి నాకు చాలా భయమేసి గుండెల్లో దడ వచ్చింది. అప్పుడు నేను పడుకున్నా, కూర్చున్నా బాబా ఫోటోని గుండెలకి హత్తుకుని, "బాబా! నాకు జ్వరం తగ్గి, నేను మామూలుగా అవ్వాలి" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల నేను ఉదయానికి మామూలుగా అయ్యాను.
మా అక్క కూతురు వివాహం బాబా దయవల్ల ఏ ఆటంకం లేకుండా జరిగింది. ఆ పెళ్లి హడావిడిలో ఇంకో అక్కవాళ్ళ బంగారం పోయింది. మేము చాలా భయపడి, "ఇలా జరిగిందేమిటి బాబా? పోయిన బంగారం దొరికేలా అనుగ్రహించండి" అని బాబాకి చెప్పుకొని వెతికితే వెంటనే ఆ బంగారం దొరికింది. "పిలవగానే పలికే సాయితండ్రి! మీ కరుణకు శతకోటి వందనాలు తండ్రి. మీరు ఎప్పుడూ మాతోనే ఉంటారని నిరూపించారు. బాబా అమ్మలా నన్ను ఎప్పుడూ కాపాడుతూ నా తప్పులు ఏవైనా ఉంటే క్షమించు తండ్రి".
నార్మల్ రిపోర్టు వచ్చేలా అనుగ్రహించిన బాబా
నేనొక సాయి భక్తురాలిని. నాపేరు శ్రీదేవి. బాబా ప్రసాదించిన ప్రతి అనుభవాన్నీ తోటి సాయి బంధువులందరితో పంచుకోవటానికి ఈ బ్లాగు ఎంతో ఉపయుక్తంగా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇంతకుముందు పంచుకున్న ఒక అనుభవంలో నా చెల్లెలి భర్త ఆరోగ్య విషయంలో బాబా అనుగ్రహాన్ని మీతో పంచుకున్నాను. అయితే ఈమధ్య మళ్ళీ అదే ఆనారోగ్య సమస్యతో మా మరిది చెకప్ కోసం హాస్పిటల్‍కి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు నేను, "బాబా! మా మరిది టెస్టు రిపోర్టుల్లో ఎలాంటి సమస్యా లేదని రావాల"ని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల తనకి 'లంగ్స్‌లో ఎలాంటి సమస్య లేదు, అంతా నార్మల్' అని రిపోర్టు వచ్చింది. "బాబా! మీరే మాకు సర్వస్వం. నీ బిడ్డకు ఆరోగ్యం ప్రసాదించు తండ్రి. అందర్నీ మీ చల్లని చూపులతో అనుగ్రహించు తండ్రి".
