సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1173వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయ ఉంటే ప్రతి సమస్య ఇట్టే తొలగిపోతుంది
2. బాబా దయతో కనబడనివి కనిపించాయి
3. బాబాకి చెప్పుకున్నంతనే దొరికిన చెవిరింగు

బాబా దయ ఉంటే ప్రతి సమస్య ఇట్టే తొలగిపోతుంది

అందరికీ నమస్తే. నా పేరు అంజలి. నేనిప్పుడు బాబా నాపై చూపిన ప్రేమను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈమధ్య ఒకరోజు నాకు, మావారికి మధ్య చిన్న మనస్పర్థ వచ్చింది. నా తప్పేమీ లేనందున నేను, "మావారే వచ్చి నాకు సారీ చెప్పేలా చేసి సమస్యను తొలగించండి బాబా" అని బాబాకి చెప్పుకున్నాను. ఆయన దయవల్ల కొంతసేపటికి మావారు వచ్చి, నాకు సారీ చెప్పారు. అంతటితో మా మధ్యనున్న సమస్య తొలిగిపోయింది. 

ఒకరోజు మా కుటుంబం, మా తమ్ముడు కలిసి బయటకు వెళ్ళాము. మా పాప తమ్ముడి బైక్ తాళంతో ఆడుకుంటూ దాన్ని ఎక్కడో పెట్టేసింది. అక్కడంతా వెతికినా తాళం కనిపించలేదు. అప్పుడు నేను, "బాబా! బైక్ తాళం దొరికితే, బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల ఆ తాళం మా కారులోనే దొరికింది.

మేము 2022, ఏప్రిల్ 5న తిరుపతి వెళ్ళాము. అప్పుడు నేను 'బాబా దయవల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనమైతే, బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. మొదట మాకు తిరుమలలో రూమ్ దొరకక చాలా ఇబ్బంది పడినప్పటికీ బాబా దయవల్ల తరువాత రెండురోజులకి మంచి రూమ్ దొరికింది. దర్శనం కూడా బాగా జరిగి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాము.

2022, ఏప్రిల్ 12న మళ్ళీ మేము మా ఫ్రెండ్ వాళ్ళకోసం తిరుపతి వెళ్లాల్సి వచ్చింది. ఏప్రిల్ 13న దర్శనానికి మా అందరికీ టిక్కెట్లు ఉన్నాయి. కానీ ఏప్రిల్ 12న దర్శనానికి పెద్దవాళ్లకు టిక్కెట్లు ఉన్నప్పటికీ మా బాబుకు టికెట్ బుక్ చేయలేదు. మేము ఏప్రిల్ 12న తిరుపతి చేరుకున్నాము. బాబా దయవల్ల మాకు రూమ్ దొరికింది. ఆ రాత్రి పదిగంటల దర్శనానికి మేము వెళ్తూ టికెట్ లేకపోయినా బాబా మీద భారం వేసి మా బాబుని కూడా తీసుకుని వెళ్ళాము. దర్శనానికి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ పాయింట్‍లో ఐ.డి. ప్రూఫ్ చెక్ చేస్తారు. 12 సంవత్సరాలలోపు పిల్లలకి టికెట్ అవసరం లేదు. కానీ మా బాబు వయసు 13 సంవత్సరాలు. కాబట్టి టికెట్ ఉండాలి. నేను, "బాబా! బాబుని దర్శనానికి అనుమతిస్తే, బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అలా చెప్పుకుంటే నేరుగా బాబాతో చెప్పుకున్నట్లే అని నా నమ్మకం. నిజంగా బాబా అద్భుతం చేసారు. అక్కడ ఐ.డి ప్రూఫ్స్ పరిశీలించే అతను మా బాబు ఐడి ప్రూఫ్ చూడకుండానే దర్శనానికి అనుమతించాడు. బాబా దయవల్ల వెంకన్నస్వామి దర్శనం చాలా బాగా జరిగింది. నేను అనుకున్నట్లుగా ఏప్రిల్ 13న శ్రీవారి పాదాలు దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యాము. దారిలో మా కారు టైరు బ్లాస్ట్ అయింది. కానీ బాబా దయవల్ల ఎవరికీ ఏమీ కాలేదు. క్షేమంగా ఇల్లు చేరుకున్నాము. "ధన్యవాదాలు బాబా".

మా బాబు మాకు చెప్పకుండా ఎక్కడికీ వెళ్ళడు. అలాంటిది ఒకరోజు నేను ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి మా బాబు ఇంట్లో లేడు. నాకు చాలా టెన్షన్‍గా అనిపించి, "బాబా! బాబు తొందరగా ఇంటికి వస్తే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల కొద్దిసేపట్లో బాబు వచ్చాడు. నాకు చాలా ఉపశమనంగా అనిపించింది. అలాగే ఇటీవల ఇంకోసారి నా మనసులో ఉన్న కోరిక ఒకటి తీరితే బ్లాగులో పంచుకుంటాను అనుకున్నాను. దయామయుడైన బాబా నా కోరిక తీర్చారు. "బాబా! మీకు చెప్పుకున్న వెంటనే మా కోరికలు తీరుతాయి తండ్రి. మీకు చాలా చాలా కృతజ్ఞతలు బాబా". మరికొన్ని అనుభవాలతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. 

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

బాబా దయతో కనబడనివి కనిపించాయి

ముందుగా ఈ బ్లాగు నిర్వాహకులకు మరియు సాటి సాయి బంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. బాబా అనుగ్రహ ప్రసాదమైన మా పాపకి ఇప్పుడు ఐదు నెలల వయసు. తనకి పుట్టుకతోనే హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. ఆపరేషన్ చేస్తే నయమవుతుందని డాక్టరు చెప్పారు. నేను రోజూ బాబా ఊదీ మంత్రం చదువుతూ పాప నుదిటిపై, గుండెలపై ఊదీ రాస్తూ ఉంటాను. అయితే ఈమధ్య ఒకరోజు ఊదీ డబ్బా కనపడలేదు. నాకు చాలా బాధేసి ఇల్లంతా వెతికాను. చివరికి, "బాబా! ఊదీ డబ్బా దొరికితే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవలన మరుసటిరోజు ఆ ఊదీ డబ్బా దొరికింది. "థాంక్యూ సో మచ్ బాబా".

ఒకసారి మావారికి తన ఆఫీసులో ఒక స్మార్ట్ వాచ్ గిఫ్ట్ గా ఇస్తే, ఆయన దాన్ని నాకు ఇచ్చారు. సాధారణంగా నేను ఖరీదైన వస్తువులు వాడను. ఎందుకంటే, వాటిని చాలా రఫ్‍గా వాడి చెడగొడతానని నాకు భయం. ఒకరోజు శ్రీమంతం ఫంక్షన్‍కని మా కాలనీలోని ఒకరి ఇంటికి మావారిచ్చిన స్మార్ట్ వాచ్ పెట్టుకుని వెళ్ళాను. మరుసటిరోజు ఆ స్మార్ట్ వాచ్ కోసం చూస్తే, అది ఎక్కడా కనిపించలేదు. నాకు భయమేసి బాబాకి దణ్ణం పెట్టుకుని, "వాచ్ దొరికితే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజు వాచ్ దొరికింది. "థాంక్యూ సో మచ్ బాబా. నా పాపకి ఆపరేషన్ అవసరం లేకుండా తన హార్ట్ ప్రాబ్లమ్‌ని నయం చేసి దీర్ఘాయుష్షు ప్రసాదించండి బాబా. నా కుటుంబాన్ని సదా సంరక్షించండి బాబా. నా తప్పులు ఏవైనా ఉంటే క్షమించండి బాబా".

ఓం శ్రీసచ్చిదానంద సమర్ధ సద్గురు శ్రీసాయినాథాయ నమః!!!

బాబాకి చెప్పుకున్నంతనే దొరికిన చెవిరింగు
 
సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నాకు ఇటీవల బాబా ప్రసాదించిన ఒక అనుభవం గురించి నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఒకరోజు మా పాప చెవిరింగు కనిపించలేదు. దాదాపు ఒక రోజంతా ఆ చెవిరింగు కోసం నేను ఇంట్లో, బయట అంతా వెతికినప్పటికీ అది కనిపించలేదు. నాకు నీరసమొచ్చి, "బాబా! చెవిరింగు కనపడితే, నా అనుభవాన్ని తప్పకుండా బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. అప్పటివరకు ఎంత వెతికినా కనపడని చెవిరింగు మా ఇంట్లో డబల్ కాట్ మంచం దగ్గర దొరికింది. బాబా ప్రేమ అనంతం. "ధన్యవాదాలు సాయి. మీకు మాటిచ్చినట్లు నా అనుభవాన్ని పంచుకున్నాను తండ్రి".

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo