1. బాబా కరుణ చాలా అపారమైనది2. వచ్చింది బాబానే ఏమో!
3. ఆపదలో ఉన్నప్పుడు బాబా స్మరణ ఎంతో మేలు చేస్తుంది
బాబా కరుణ చాలా అపారమైనది
ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా ధన్యవాదాలు. నా పేరు శివకుమార్. మాది పాలకొల్లు ప్రక్కన చిన్న గ్రామం. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. 1999లో నేను10వ తరగతి పరీక్షలు వ్రాసేటప్పుడు ఇంగ్లీష్, మాథ్స్ పేపర్లు సరిగా రాయలేదు. అప్పుడు నేను రోజూ బాబా గుడికి వెళ్తూ, "బాబా! మీదే భారం" అని అనుకుంటూ ఉండేవాడిని. బాబా దయవల్ల నేను పదవ తరగతి ఫస్ట్ క్లాసులో పాసయ్యాను. ఇది నేను బాబా ద్వారా పొందిన మొదటి అనుభవం.
ఇక రెండో అనుభవం విషయానికి వస్తే, నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ఒకరోజు మా తమ్ముడు మా నాన్నగారితో గొడవపడి ఇంట్లో నుండి బయటకి వెళ్ళిపోయాడు. రాత్రైనా ఇంటికి తిరిగి రాలేదు. మాకు భయమేసి బాబాను ప్రార్ధించాము. పది నిమిషాలలో తమ్ముడి వద్ద నుండి మాకు ఫోన్ వచ్చింది, "నేను ఇంటికి వచ్చేస్తున్నాను" అని. మాకు చాలా సంతోషాన్నిచ్చిన బాబాకు ధన్యవాదాలు.
మూడవ అనుభవం: 2021లో మా నాన్నగారు కాలం చేశారు. ఆయన మీద బెంగతో నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తి ఏమి తిన్నా అరిగేది కాదు. హాస్పిటల్‍కి వెళితే, ఎండోస్కోపి మొదలు అన్ని టెస్టులు చేసి, "అంతా బాగానే ఉంది, ప్రాబ్లమ్ ఏమీ లేదు" అన్నారు. కాని నాకు వికారంగా ఉండటంతో మరలా హాస్పిటల్‍కి వెళితే, రేడియాలజీ చేశారు. ఆ రిపోర్టు ఆధారంగా, "కిడ్నీలో రాళ్లున్నాయి. నీళ్లు ఎక్కువగా త్రాగండి" అని అన్నారు. అదలా ఉంటే, 2022, శివరాత్రి నుండి నాకు నిద్రపట్టేది కాదు. హాస్పిటల్‍కి వెళితే, నిద్రపట్టడానికి టాబ్లెట్లు ఇచ్చారు. 'నాకు ఏమిటి ఈ పరిస్థితి?' అనుకుంటూ ఉండగా మా పిన్నిగారు ఫోన్ చేసి నా ఆరోగ్యం గురించి వాకబు చేసి, "బాబాని ప్రార్ధించు" అని సలహా ఇచ్చారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇంటర్ తర్వాత 2021 వరకు నేను సాయిబాబాకు పూజ చేసేవాడిని కాదు, ఆయనను స్మరించేవాడిని కూడా కాదు. అయినా మా పిన్నిగారి సలహామేరకు నేను బాబాని శరణువేడి, 'సాయి లీలామృతం', 'సచ్చరిత్ర' పారాయణ మొదలుపెట్టాను. ఆ రోజు నుండి నిద్రమాత్రలు వేసుకోకుండానే నాకు నిద్ర బాగా పడుతుంది. అంతేకాదు, ఆరోజు నుండి ప్రతిరోజూ వేసుకునే గ్యాస్ టాబ్లెట్ వేసుకోవడం పూర్తిగా మానేసాను. నాకు ఇప్పుడు అంతా బాగానే ఉంది. బాబా కరుణ చాలా అపారమైనది. "ధన్యవాదాలు బాబా. తెలిసీతెలియక ఏవైనా తప్పులు చేస్తే క్షమించు బాబా".
వచ్చింది బాబానే ఏమో!
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!! సాయి బంధువులకు నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి అభినందనపూర్వక ధన్యవాదాలు. నేను ఒక సాయి భక్తుడిని. నేను వేసే ప్రతి అడుగు సాయి ప్రేరణతోనని నా ప్రగాఢ విశ్వాసం. అది 1986 - 87వ సంవత్సరం అనుకుంటా. నేను ఒక ప్రైవేటు సైంటిఫిక్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‍గా పని చేస్తూ ఉండేవాడిని. నేను నా ఉద్యోగరిత్యా మహారాష్ట్ర టూర్‍కి వెళ్లాను. 'మజల్‌గావ్' అనే ఊరిలో నేను నా పని ముగించుకుని పూణే వెళ్ళడానికి బయల్దేరాను. నేను ప్రయాణిస్తున్న బస్సు 40 నిమిషాల తర్వాత ఒక ఊరిలో ఆగింది. ఆ బస్టాండులో ఒక రకమైన మనసుని ఆహ్లాదపరిచే చక్కటి వాతావరణం నెలకొని ఉంది. నాతోపాటు ప్రయాణిస్తున్న ప్రయాణికులలో చాలామంది బస్సు దిగి ఒక ఇరవై నిమిషాల తర్వాత తిరిగి వచ్చారు. వాళ్ళ చేతుల్లో ప్రసాదం ప్యాకెట్లు ఉన్నాయి. నేను బస్సు కండక్టరుని, "అయ్యా! ఇంత ఆహ్లాదంగా ఉంది. ఏమిటి ఈ ఊరు విశేషం?" అని అడిగాను. అందుకతను, "అయ్యో! మీకు తెలియదా? ఇది శిరిడీ" అని చెప్పారు. నేను అతన్ని, "ఎంత దూరం ఉంటుంది సాయి మందిరానికి" అని అడిగాను. అతను, "దగ్గర్లోనే" అనే బదులిచ్చాడు. నేను అతన్ని, "అయ్యా! నేను బాబాని దర్శించుకుని వస్తాను" అని అర్థించాను. కాని సమయాభావం వలన నేను ఆశించింది జరగని పరిస్థితి. పోనీ, ఆ బస్సు దిగిపోయి బాబా దర్శనం చేసుకుని వేరే బస్సు పట్టుకుని పూణే వెళదామంటే నా దగ్గర డబ్బులు సరిపడా లేవు. అందువలన బాబా దర్శనం చేసుకోకుండానే నేను పూణే వెళ్ళిపోయాను. తర్వాత సాయి సచ్చరిత్ర పారాయణ చేసినప్పుడు, "నా అనుమతి లేనిదే శిరిడీలో అడుగుపెట్టలేరు" అన్న బాబా మాటలు చదివి 'ఆనాడు బస్సు దిగలేనిది నేను కాదు. బాబానే నన్ను తమ దర్శనానికి అనుమతించలేదు' అని చాలా చాలా బాధపడ్డాను. 'అయ్యో.. అయ్యో..' అని కొన్ని వేలసార్లు అనుకుని ఉంటాను. ఇక ఎప్పుడెప్పుడు శిరిడీ వెళదామా అని నాకు ఉండేది. చివరికి బాబా అనుగ్రహంచారు. నేను, నా శ్రీమతి, మా బాబు, అత్తమామలతో కుటుంబసమేతంగా 1992లో నేను మొట్టమొదటిసారి శ్రీ సాయినాథుని దర్శనం చేసుకున్నాను. దర్శనమైతే బాగా జరిగింది కానీ, సంసారఝంజాటం వల్ల పిల్లవాడికి పాలు, పెద్దవాళ్లకు టిఫిన్లు, వసతి వగైరాలతో మనసు నిలకడలేదు. ఏదో తెలియని అసంతృప్తి. అసలే నా పరిస్థితి అలా ఉంటే, మా మామగారు 'అన్నమో రామచంద్ర' అంటూ గోల. యువకుడినైన నాకు విసుగు, కోపం. ఇప్పుడు ఆలోచిస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. సరే, స్నానాలు కానించుకుని సమాధి మందిరానికి బయలుదేరాము. ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఒక అద్భుతం జరిగింది. ముమ్మూర్తులా సాయిబాబాను పోలిన(బాబానే ఏమో!) వ్యక్తి నా ముందుకు వచ్చి, చాలా దగ్గరగా నిలబడి, "పైసా దేవ్, పైసా దేవ్" అన్నారు. సంభ్రమాశ్చర్యాలలో ఉన్న నేను, "పైసా నహి హై" అన్నాను. ఆయన, "ఆహా.. పైసా నహి హై అపకే పాస్" అని పెద్దగా నవ్వుతూ, "పైసా నహి హై. ఆహా... ఆహా.. ఠీక్ హై. పైసా జాయేగా" అని వెళ్ళిపోయారు. నేను కాస్త తేరుకుని ఆయనకోసం అటు ఇటు చూసాను కానీ, ఆయన మళ్లీ కనపడలేదు. 'బాబా బాబా' అని నిరంతరం తలుస్తాం, తీరా ఆయన ఎదురుగా వస్తే, మాయలో పడిపోతాము. అసలు విషయం ఏమిటంటే, నేను, 'పైసా నహి హై' అని బాబాతో చెప్పినప్పుడు, ఆయన "ఓహో... పైసా నహి హై. ఠీక్ హై, పైసా జాయేగా" అని అన్నారు కదా! మా తిరుగు ప్రయాణంలో డబ్బులు, శిరిడీలో కొన్న ప్రసాదాలు, ఇతరత్రా వస్తువులు ఉన్న సూట్కేస్ పోయింది. కానీ బాబా ఎంత దయామయులు అంటే, తిరుగు ప్రయాణంలో మాకు ఎటువంటి కష్టం లేకుండా, తిండికి ఏ లోటూ లేకుండా చూసి క్షేమంగా మా ఇంటికి చేర్చారు. తరువాత నా శ్రీమతి గుడిలో ప్రశ్నించగా, "ఆ డబ్బులు చేరవలసిన చోటుకే చేరాయి" అని జవాబు వచ్చింది. ఇలా లెక్కకు మించి అనుభవాలు బాబా నాకు ప్రసాదించారు. సాయి కృపతో వాటిని మీతో ముందుముందు పంచుకుంటాను. బాబా మన అందరి సొంతం. 'ఐ లవ్ బాబా. వి అల్ లవ్ బాబా'.
ఆపదలో ఉన్నప్పుడు బాబా స్మరణ ఎంతో మేలు చేస్తుంది
ముందుగా ఆ సాయినాథుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఒక సాయి భక్తుడిని. బాబా నా జీవితంలోకి వచ్చి ఇప్పటికి 5 సంవత్సరాల పైమాటే. ఈ 5 సంవత్సరాలలో బాబా నాకు ఎన్నో అనుభవాలిచ్చారు. వాటిలో నుండి కొన్ని అనుభవాలను నేను ఇంతకుముందు ఈ బ్లాగు ద్వారా తోటి సాయి బంధువులతో పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలను పంచుకుంటున్నాను. నేను చదువుకున్న చదువుకి తగ్గ ఉద్యోగం కాకపోయినా నా కుటుంబాన్ని పోషించటం కోసం ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాను. అది కూడా బాబా ఆశీర్వాదమని అనుకుంటున్నాను. ఈ సమయంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు కారణంగా మా కుటుంబంలో గొడవలు జరుగుతుండేవి. అందుకు కారణమేమిటా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే, నా తమ్ముడు అని తెలిసింది. అప్పుడు నేను నా మనసులో, "బాబా! నా తమ్ముడి బుద్ది మారి ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుంటే బాగుంటుంది" అని అనుకొన్నాను. అదే సమయంలో నా భార్య కూడా మనసు బాగాలేక చీటికిమాటికి గొడవపడుతూ ఉండేది. నేను, "వీళ్ళిద్దరూ మారితే 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకు మొక్కుకున్నాను. కొన్ని రోజుల తరవాత నా తమ్ముడు తనంతట తానే ఒక ఉద్యోగంలో చేరాడు. బాబా వాణ్ణి మార్చారు అనుకున్నాను. తర్వాత నా భార్య కూడా ఎటువంటి గొడవ చేయకుండా సంతోషంగా ఉండసాగింది.
ఒకరోజు రాత్రి నా భార్య పంటినొప్పితో బాధపడుతూ విషయం నాకు చెప్పింది. అపుడు సుమారు అర్థరాత్రి 12 గంటలు అయింది. నేను తనకొక టాబ్లెట్ ఇచ్చి వేసుకోమని చెప్పాను. తర్వాత బాబా ఊదీ తన నుదిటన పెట్టి, మరికొంచెం ఊదీ తన నోటిలో వేసి 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే బాబా నామాన్ని స్మరించాను. ఆశ్చర్యం! కొన్ని నిమిషాలకే నొప్పి తగ్గి, తను హాయిగా నిద్రపోయింది. ఇలాంటి అనుభవాలు బాబా నాకు ఎన్నో ప్రసాదించారు. ఆపదలో ఉన్నప్పుడు బాబా నామస్మరణ మనకు ఎంతో మేలు చేస్తుంది. మనమంతా బాబా సేవలో నిత్యం తరించాలని కోరుకుంటున్నాను.
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!
Jaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm sai ram please cure my son from covind . Please remove my negative thoughts from my. Mind.please give full aaush for my son.Be with him and bless him with normal report.
ReplyDeleteసాయిరాం దేవా నీవే కలవు.. నీవు తప్ప మరెవరూ లేరు ఈలోకం లో.. నీవుంటే చాలు బాబా నీ ఆశీర్వాదం నాకు వేలకోట్ల సంపద.. మీ దివ్యమైన ఆశీర్వాదాలు మాకు ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యలు
ReplyDeleteసాయి
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete