సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 760వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. అన్నీ అడ్డంకులు అధిగమింపజేసి క్షేమంగా అమెరికా చేర్చిన బాబా
  2. ఉదయానికల్లా జ్వరం, తలనొప్పి తగ్గిపోయేలా దయ చూపిన బాబా

అన్నీ అడ్డంకులు అధిగమింపజేసి క్షేమంగా అమెరికా చేర్చిన బాబా


సాయిభక్తురాలు శ్రీమతి మంగ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


సాయిబంధువులందరికీ నమస్కారం. నేను ఈమధ్యనే ఈ బ్లాగ్ చదవటం జరిగింది. ఎన్నెన్ని అనుభవాలు! ఎంతమంది భక్తులు! ఈ బ్లాగ్ నిర్వాహకులకు చాలా కృతజ్ఞతలు. నా పేరు మంగ. నేను 2016 నుండి సాయిభక్తురాలిగా మారాను. అంతకుముందు కూడా సాయిని పూజించేదాన్ని, కానీ బాబాపై అంత నమ్మకం ఉండేది కాదు. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈమధ్యకాలంలో జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.


మా అమ్మాయి తన కుటుంబంతో యు.ఎస్.ఏ లో నివసిస్తోంది. తను గర్భవతిగా ఉన్నప్పుడు 2020, సెప్టెంబరు నెలలో తనకు డెలివరీ టైం ఇచ్చారు. అయితే, 2020, ఏప్రిల్ నెలలోనే మా వీసా గడువు పూర్తికావటంతో తనకు సహాయంగా వెళ్ళే అవకాశం మాకు లేకుండా పోయింది. కరోనా కారణంగా వీసా రెన్యువల్‌కి దరఖాస్తు చేసుకోవడం వెంటనే వీలుపడలేదు. ఆ తరువాత దరఖాస్తు చేసుకుంటే 2021, ఫిబ్రవరిలో వీసా రెన్యువల్ అయింది. దాంతో మేము మార్చి 26వ తేదీన అమెరికా వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఇంతలో, ‘మార్చి ఒకటో తారీఖు నుండి 60 సంవత్సరాలు పైబడినవారికి కరోనా వ్యాక్సినేషన్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామ’ని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో, మేము వ్యాక్సినేషన్ తీసుకున్న తరువాతే అమెరికా వెళదామని నిర్ణయించుకున్నాము. మార్చి 2వ తారీఖున కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నాము. 28 రోజుల తరువాత, అంటే మార్చి 30వ తారీఖున రెండవ డోస్ వ్యాక్సినేషన్ తీసుకోవాల్సి ఉంది. అందువల్ల అంతకుముందు మార్చి 26వ తేదీకి బుక్ చేసుకున్న ఫ్లైట్ టికెట్లను క్యాన్సిల్ చేసుకుని, రెండవ డోస్ తీసుకున్న 10 రోజులకి, అంటే ఏప్రిల్ 9వ తారీఖున అమెరికా వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఈలోగా, మొదటి డోస్‌కి, రెండవ డోస్‌కి మధ్య కనీసం 6 నుంచి 8 వారాల సమయం ఉంటే టీకా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పి రెండవ డోస్ తీసుకోవాల్సిన తేదీని మార్చారు ప్రభుత్వంవారు. “ఇదేంటి ఇలా జరిగింది? ఇప్పటికే ఒకసారి ప్రయాణం వాయిదా వేసుకున్నాము. మళ్ళీ ప్రయాణం వాయిదా వేసుకోవాలా?” అని అనుకున్నాము. అక్కడ అమెరికాలో మా అమ్మాయి ఒకవైపు ఉద్యోగాన్ని, మరోవైపు పిల్లలిద్దరినీ చూసుకోలేక చాలా బాధపడుతోంది. పోనీ నానీ(సహాయకురాలు)ని పెట్టుకుందామంటే కరోనా సమయం. దాంతో నా బాధనంతా బాబాకు చెప్పుకుని మాకు సహాయం చేయమని ప్రార్థించాను. సాయిని ప్రార్థించగానే మార్చి 29వ తేదీన ప్రైవేట్ హాస్పిటల్స్‌లో వ్యాక్సిన్ ఇస్తారని తెలిసింది. ఎంతో సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుని రెండవ డోస్ వ్యాక్సినేషన్ తీసుకున్నాము. అలాగే, విదేశాలకు వెళ్ళేముందు RTPCR టెస్ట్ రిపోర్టు కూడా నెగిటివ్ రావాలని బాబాను కోరుకుని 5 వారాలు సాయి దివ్యపూజ చేశాను. ఎందుకంటే కొన్నిసార్లు టెస్ట్ చేసే కిట్స్‌లో లోపం వలన టెస్ట్ రిపోర్టులు కూడా తప్పుగా వస్తుంటాయి. బాబా దయవలన RTPCR టెస్ట్ రిపోర్టు నెగిటివ్‌గా వచ్చింది. ఆ తరువాత బాబా ఆశీస్సులతో మేము ఏప్రిల్ 9వ తేదీన బయలుదేరి ఏ ఇబ్బందీ లేకుండా క్షేమంగా అమెరికా చేరుకున్నాము. అమెరికా చేరుకున్నాక క్వారంటైన్లో ఉండాల్సిన సమయం కూడా ఏ సమస్యలూ లేకుండా పూర్తయింది. బాబాకు మా వేలవేల ధన్యవాదాలు. బాబా ప్రసాదించిన ఈ అనుభవాన్ని మీతో పంచుకోగలగటం చాలా సంతోషంగా ఉంది.


ఉదయానికల్లా జ్వరం, తలనొప్పి తగ్గిపోయేలా దయ చూపిన బాబా


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సద్గురు శ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ కీ జై!


నా పేరు మాధురి. ముందుగా, సాయిబంధువులకు, ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. బాబా ఆశీస్సులు ఎల్లవేళలా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మొదటిసారి నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటున్నాను. 2021, ఏప్రిల్ 6వ తేదీ సాయంత్రం నాకు బాగా తలనొప్పి వచ్చింది. రాత్రయ్యేసరికి జ్వరం కూడా వచ్చింది. కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మా ఇంట్లో మరమ్మత్తు పనులు చేయడానికి కొంతమంది పనివాళ్ళు వస్తున్నారు. అందుచేత నాకు చాలా భయమేసి బాబా ఊదీని నీళ్లలో కలుపుకొని త్రాగి, టాబ్లెట్ కూడా వేసుకున్నాను. చాలామంది భక్తులు కోవిడ్ భయానికి, ఇంకా పలురకాల సమస్యల విషయంలో పరిష్కారం లభిస్తే తమ అనుభవాలను బ్లాగులో పంచుకుంటామని అనుకోవటం, సాయినాథుని కృపతో అవి పరిష్కారమవటం రోజూ బ్లాగులో చదువుతూ ఉంటాను. అందువలన నేను కూడా బాబాతో, "ఉదయానికల్లా ఈ జ్వరం, తలనొప్పి తగ్గిపోతే, నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి బ్లాగు'లో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. బాబా దయ చూపించారు. ఉదయానికల్లా తలనొప్పి, జ్వరం పూర్తిగా తగ్గిపోయాయి. "థాంక్యూ బాబా. మీ కృప మా అందరిపై ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను".


సాయిభక్తుల అనుభవమాలిక 759వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • జీవితంలో అత్యంత ఉత్తమమైన శిరిడీ యాత్ర

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు ఇటీవల తనకు బాబా ప్రసాదించిన అద్భుతమైన శిరిడీ దర్శనానుభవం గురించి మనతో పంచుకుంటున్నారు.


భక్తులందరికీ నమస్తే. బాబా ప్రసాదించిన అనుభవాలను పంచుకొనే అవకాశాన్ని మాకు కల్పిస్తున్నందుకు బ్లాగ్ బృందానికి చాలా ధన్యవాదాలు. ఇలాంటి అత్యున్నతమైన కార్యాన్ని కొనసాగించేలా బాబా బ్లాగ్ బృందాన్ని ఆశీర్వదించాలి. బాబా నన్ను తిరిగి తమ దగ్గరకు ఎలా తీసుకున్నారో ఇటీవల నేను మీ అందరితో పంచుకున్నాను. ఆ అనుభవం చివరిలో 'నేను ఇంక బాబాను దర్శనానికి వేచి ఉండలేను. ఈ నెల చివరివారంలో నేను శిరిడీ వెళ్లాలని ప్రణాళిక చేసుకుంటున్నాను' అని ప్రస్తావించాను. ఇప్పుడు దాని గురించి, అంటే నా శిరిడీ సందర్శనలోని అనుభవాలను పంచుకోబోతున్నాను. నా అనుభవం కాస్త వివరంగా, పెద్దదిగా ఉండబోతున్నందుకు నన్ను క్షమించమని అడుగుతున్నాను.  


బాబా ఆశీస్సులతో, వారి అనుమతితో 2021, మార్చి నెలాఖరులో నేను నా శిరిడీ ప్రయాణానికి రైలు టిక్కెట్లు బుక్ చేసుకుని, ప్రయాణమయ్యే రోజు కోసం ఆత్రంగా ఎదురుచూడసాగాను. ప్రతిచోటా బాబా ఉన్నారని అనుభవమవుతున్నప్పటికీ జీవితంలోని అడ్డంకులను అధిగమించి ముందుకు సాగడానికి కావాల్సిన నూతన శక్తిని నేను శిరిడీలో పొందుతుంటాను. అందుచేత నేను సాధారణంగా సంవత్సరానికి 5-6 సార్లు శిరిడీ సందర్శిస్తుండేదాన్ని. కానీ కొంతకాలం నేను బాబాకు దూరమై, ఆ తరువాత బాబాకు దగ్గరైనప్పటికీ కోవిడ్ కారణంగా శిరిడీ వెళ్ళలేకపోయాను. చివరికి బాబా నన్ను శిరిడీ పిలిచినందుకు నిజంగా నేను పొందిన ఆనందాన్ని మాటల్లో వ్యక్తం చేయలేను. బాబా ప్రేమకు నేను ఎంతో కృతజ్ఞురాలినై ఉంటాను. ఇకపోతే, ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో దర్శన వేళల గురించి తెలియనందున దర్శనం గురించి, శిరిడీలో బస చేయడం గురించి కాస్త ఆందోళన చెందాను. ఒక వారం ముందు దర్శనానికి మరియు రూమ్స్ బుక్ చేసుకోవడానికి ఆన్లైన్‌లో ఓపెన్ అయ్యాయి. నేను శిరిడీలో ఉండే ఒకటిన్నర రోజుకు గానూ రెండుసార్లు దర్శనానికి బుక్ చేసుకున్నాను. అంతకంటే ఎక్కువసార్లు బుక్ చేసుకోవడానికి సంస్థాన్ వెబ్‌సైట్ అనుమతించలేదు. అయితే నేను ఆరతికి బుక్ చేసుకోలేదు. ఎందుకంటే, శిరిడీ సందర్శించిన నా స్నేహితులలో ఒకరు సంస్థాన్ వాళ్ళు ఆరతికి అనుమతించడం లేదని నాతో చెప్పినందువలన నేను కూడా అదే భ్రమలో ఉన్నాను. ఇక రూమ్ విషయానికి వస్తే, ఒక్క వ్యక్తి కోసం మాత్రమే అయితే రూమ్ బుక్ చేయడానికి సంస్థాన్ వెబ్‌సైట్ అనుమతించలేదు. కోవిడ్ కారణంగా ప్రైవేట్ హోటళ్ళలో రూమ్ బుక్ చేయడానికి నేను సంకోచించి, ఏమి చేయాలో అర్థంకాక, నేను ఒంటరిగానే శిరిడీ వెళ్తున్నప్పటికీ, "ఇద్దరి కోసం సంస్థాన్‌లో రూమ్ బుక్ చేసుకోవచ్చా?" అని బాబాను అడిగాను. బాబా నుండి సానుకూల సమాధానం వచ్చింది. దాంతో బాబాపై విశ్వాసముంచి రెండవ ఆలోచన లేకుండా నేను రూమ్ బుక్ చేసుకున్నాను. కోవిడ్ సమయంలో 24 గంటలపాటు ప్రయాణమంటే నా కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. కానీ నా ప్రయాణాన్ని ప్లాన్ చేసింది బాబా కాబట్టి నేను ఏ మాత్రమూ ఆందోళన చెందలేదు. నా ఆందోళనంతా శిరిడీలో బాబా దర్శనం గురించే.


చివరికి నేను ప్రయాణం చేయాల్సినరోజు రానే వచ్చింది. నేను శిరిడీ వెళ్లే రైలు ఎక్కాను. నేను కూర్చున్న చోట మరో ఇద్దరు ఉన్నారు. అయితే ఆ కోచ్‌ లోని మిగతా బెర్తులన్నీ ఖాళీగా ఉన్నాయి. అందువలన వాళ్లిద్దరూ వేరే బెర్త్‌లకు మారారు. సామాజిక దూరం పాటించాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఒంటరిగా ఉండేలా బాబానే చేశారు. నా ప్రయాణం చాలా సాఫీగా సాగింది. ఏ అవాంతరాలు లేకుండా సమయానికి శిరిడీ చేరుకున్నాను. అంతలా సురక్షితమైన యాత్రను బాబా నాకోసం ఏర్పాటు చేశారు. శిరిడీ చేరుకున్నాక నేను నేరుగా ఆటోలో ద్వారావతి వసతి గృహానికి వెళ్ళాను. ఇక్కడ కూడా బాబా తమ అనుగ్రహాన్ని చూపించారు. నేను ఇద్దరి కోసం రూమ్ బుక్ చేసినప్పటికీ ఎటువంటి ఇబ్బందీ లేకుండా నాకు ఒక్కదానికి రూమ్ కేటాయించారు. నిజానికి చెక్-ఇన్ టైం ఉదయం 11 గంటలకైతే, నేను 2 గంటలు ముందుగా వెళ్ళాను. అయినప్పటికీ అదనంగా డబ్బు చెల్లించమని నన్ను అడగలేదు. సాధారణంగా ప్రైవేట్ హోటళ్లలో అయితే అదనపు మొత్తాన్ని వసూలు చేస్తారు.


నేను మధ్యాహ్నం 2 గంటల సమయంలో దర్శనానికి బుక్ చేసుకొని ఉన్నప్పటికీ అంతవరకూ బాబా దర్శనం కోసం వేచి ఉండదలచుకోలేదు. కాబట్టి త్వరగా తయారై ఉదయం 11 గంటల సమయంలో మందిరానికి బయలుదేరాను. అయితే ద్వారావతిలో బయోమెట్రిక్ టికెట్లు ఇస్తున్న సంగతి గమనించక చకచకా మందిరానికి వెళ్ళిపోయాను. దర్శనం కోసం సెక్యూరిటీని విచారిస్తే, "బయోమెట్రిక్ టికెట్లు 11.30 వరకు మాత్రమే ఇస్తారు. కాబట్టి త్వరగా వెళ్ళండి" అని అన్నారు. అయితే అప్పటికే 11.20 అయింది. నేను పరుగున వెళ్లి టికెట్ తీసుకొని, నా మొబైల్, చెప్పులు సంబంధిత కౌంటర్లలో విడిచిపెట్టి 10 నిమిషాల్లో క్యూ లైన్‌లోకి వెళ్ళాను. క్యూ కాంప్లెక్స్ లోపలికి వెళ్ళాక 11.30 అవడంతో లైన్ ఆపేశారు. నేను ఆరతికి అనుమతి లేదన్న ఆలోచనలో ఉన్నందున ఆరతి పూర్తయిన తరువాత మమ్మల్ని లోపలికి పంపుతారని అనుకున్నాను. కానీ 15 నిమిషాల తరువాత సెక్యూరిటీవాళ్ళు కొద్దిమందిని లోపలికి పంపారు. కేవలం నలుగురం మాత్రమే ఉండిపోయాము. నేను కొంచెం నిరాశ చెంది, "ఆరతికి అనుమతించమ"ని బాబాను అడిగాను. కానీ తరువాత, “బాబా నన్ను శిరిడీకి పిలవడమే గొప్ప ఆశీర్వాదం. నేను మరీ అత్యాశతో ఉండకూడదు. నాకన్నా ప్రస్తుతం ఆరతికి లోపలికి వెళ్ళిన వాళ్ళకి బాబా ఆశీస్సులు అవసరం ఉండి ఉండవచ్చు. అయినా ఈ సంఘటన ద్వారా ఆరతికి అనుమతి ఉందని తెలిసింది, లేకపోతే దీని గురించి నాకు తెలిసేది కాదేమో! కేవలం దర్శనం చేసుకొని శిరిడీ నుండి తిరుగు ప్రయాణం అయివుండేదాన్ని. ఇప్పుడు ఆరతికి వెళ్లొచ్చని తెలిసింది, కాబట్టి సాయంత్రం ఆరతికి ప్లాన్ చేసుకుందామ”ని అనుకున్నాను.


ఆరతి పూర్తయిన తరువాత మమ్మల్ని లోపలికి అనుమతించారు. సమాధిమందిరంలోని బాబాను దూరం నుండి దర్శించుకుంటూ ప్రధాన హాలు గుండా ముందుగా ద్వారకామాయిలోకి పంపారు. ద్వారకామాయిలోకి అడుగుపెట్టిన క్షణాన నాకు కన్నీళ్లు ఆగలేదు. మొత్తానికి ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కాలం గడిచాక బాబా ముందు ఉండే అవకాశం నాకు వచ్చినందుకు ఆ సమయమంతా నా కళ్ళనుండి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. తరువాత ద్వారకామాయి నుండి ప్రధాన హాలు గుండా బాబా దగ్గరకు చేరుకున్నాను. బాబాను చూసి కన్నీళ్ల పర్యంతమయ్యాను. వెనుక నుండి నెట్టేవారెవరూ లేనందున బాబాను దర్శించుకునేందుకు మాకు తగినంత మంచి సమయం దొరికింది. అటువంటి అందమైన మరియు ఆనందకరమైన దర్శనాన్ని నేను మాటలలో వర్ణించలేను. బాబాను చూస్తూ పరవశించిపోయాను. ఆరతి విషయంలో అత్యాశ పడినందుకు హృదయపూర్వకంగా బాబాకు క్షమాపణలు చెప్పుకున్నాను. తరువాత గురుస్థాన్ వద్ద దర్శనం చేసుకొని చివరిగా ప్రసాదం తీసుకున్నాను. కోవిడ్ గురించి ఏ మాత్రమూ భయపడాల్సిన పనిలేనంతగా సంస్థాన్ వారు మందిరం లోపల, వెలుపల సామాజిక దూరం పాటించేలా చక్కటి ఏర్పాట్లు చేశారు. 


బాబా ప్రసాదించిన అద్భుతమైన దర్శనంతో నేను ఆనందంతో భోజనానికి వెళ్ళి తృప్తిగా భోజనం చేసి, మళ్ళీ నేను బుక్ చేసుకున్న 2 గంటల దర్శనానికి వెళ్ళాను. అప్పుడు నా ముందు ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు. ఈసారి దర్శనం మరింత ప్రశాంతంగా అనిపించింది. నేను చాలాసేపు బాబాను చూస్తూ ఉండిపోయాను. నన్ను ఎవరూ నెట్టడం గానీ, వెళ్ళమనడం గానీ జరగలేదు. కావాల్సినంతసేపు తృప్తిగా బాబా దర్శనం చేసుకున్నాను. ఇదే శిరిడీ సందర్శించడానికి అత్యంత ఉత్తమమైన సమయమని అనిపించింది. నేనెప్పుడూ అంత ప్రశాంతమైన దర్శనభాగ్యాన్ని పొందలేదు. వెంటనే రాత్రి 8 గంటలకు నేను బుక్ చేసుకొని ఉన్న దర్శనం టికెట్ మీద మరోసారి దర్శనానికి వెళ్ళాను. ఆ సమయంలో ఒక సెక్యూరిటీ నాతో కొద్దిసేపు మాట్లాడి ఆరతికి, దర్శనానికి సంబంధించిన అంశాలను చక్కగా వివరించాడు. దాంతో నేను సాయంత్రం ఆరతి సమయానికి ఖచ్చితంగా అక్కడ ఉండాలని అనుకున్నాను. బాబా ఇవ్వాలనుకుంటే ఆరతికి అనుమతించి ఆశీర్వదిస్తారు, లేకుంటే వారి దర్శనంతో నేను సంతృప్తి చెందుతాను, అంతేగానీ అత్యాశ కూడదని అనుకొని ప్రశాంతంగా బాబా దర్శనం చేసుకున్నాను.


దర్శనానంతరం నేను నా గదికి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకొని, ఆ తరువాత బస చేసిన చోటే బయోమెట్రిక్ టికెట్ తీసుకొని మందిరానికి బయలుదేరాను. ముందుగా అనుకున్నట్లు ఆరతి లైన్ ఆపే సమయానికి నేను క్యూ లైన్‌లో ఉన్నాను. కొద్దిసేపటికి ఆరతి కోసం లోపలికి పంపడానికి సెక్యూరిటీ గేట్ తీశారు. వావ్! బాబా అద్భుతాన్ని చూడండి. బాబా తమ ఆరతి దర్శనానికి నన్ను అనుమతించారు. ఆరతికి కేవలం 35-40 మంది మహిళలను, 35-40 మంది పురుషులను మాత్రమే అనుమతిస్తున్నారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ భక్తులు కూర్చోడానికి/నిలబడటానికి అనువుగా స్లాట్‌లు ఏర్పాటు చేశారు. తొలుత ఆన్‌లైన్ ద్వారా ఆరతి బుక్ చేసుకున్నవారిని పంపి, ఆపై మిగిలిన స్లాట్‌లను లెక్కించి అందుకు తగ్గట్టు ఉచిత పాస్ ద్వారా వచ్చిన భక్తులను మాత్రమే ఆరతికి అనుమతిస్తున్నారు. అందులో నేను కూడా ఒకదాన్ని కావడం బాబా కృపావిశేషం. ఆ సమయంలో నా ఆనందాన్ని మీరు ఊహించగలరని నేను అనుకుంటున్నాను. బాబాను స్పష్టంగా చూస్తూ నిలబడి ఆరతి పాడాను. ఆ సమయంలో నేను పట్టలేని ఆనందంలో మునకలేశాను, కొన్ని నిమిషాలపాటు కన్నీళ్లపర్యంతమయ్యాను. "బాబా! మీరు మాత్రమే మీ బిడ్డలపై అటువంటి ఆశీస్సులను కురిపించగలరు. నేను ఈ స్థితిని ఎలా వివరించగలను? ఆ ఆనందాన్ని అనుభూతి చెందాల్సిందే. బాబా! దయచేసి మీ బిడ్డలందరికీ అలాంటి ఆనందాన్ని ప్రసాదించండి".


అద్భుతమైన ఆరతి దర్శనం తరువాత భోజనం చేసి నేను నా గదికి వెళ్లి, నాలో నేనే, "రేపు దర్శనానికి మాత్రమే వెళ్ళాలి, ఆరతికి ప్లాన్ చేసుకోకూడదు. ఎందుకంటే, నాలాగే తోటి భక్తులు కూడా ఆరతి దర్శనాన్ని కోరుకుంటారు. పైగా నేను తిరుగు ప్రయాణానికి కోపర్గాఁవ్‌లో రైలు అందుకోవాలి. కాబట్టి మధ్యాహ్నానికల్లా నేను శిరిడీ నుండి బయలుదేరాలి. అందుచేత ఉదయాన్నే రెండుసార్లు దర్శనం చేసుకొని మధ్యాహ్నం వరకు విశ్రాంతి తీసుకొని శిరిడీ విడిచి వెళ్ళాల'ని అనుకున్నాను. ఇంకా నేను శిరిడీ సమీపంలో ఉన్న ఇతర ప్రదేశాలను దర్శించాలని అనుకొని బాబా అనుమతి అడిగాను. అయితే బాబా నుండి అనుమతి లభించలేదు. బాబా అనుమతి ఎందుకు ఇవ్వలేదో నాకు తరువాత అర్థమైంది.


మరుసటిరోజు ఉదయం నేను ముందుగా ఖండోబా ఆలయాన్ని దర్శించాను. (నేను శిరిడీ వెళ్ళినప్పుడల్లా ఖండోబా ఆలయాన్ని దర్శించేలా చూసుకుంటాను.) తరువాత ముందుగా అనుకున్నట్లు మరో రెండుసార్లు బాబా దర్శనానికి వెళ్ళబోతున్నానని చాలా ఉత్సాహంగా మందిరానికి వెళ్ళాను. బాబా చక్కటి దర్శనాలను అనుగ్రహించారు. రెండవ దర్శనం తరువాత బయటికి వచ్చేముందు గురుస్థాన్ దగ్గర అదివరకు ఉండే ముఖదర్శనం ఇప్పుడు లేదని నేను గుర్తించాను. నిజానికి అక్కడినుంచి బాబాను చూడటం నాకు చాలా ఇష్టం. కారణం తెలియదుగానీ అక్కడినుండి బాబాను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. సరే, "ఈసారి యాత్రలో ఇదే నా చివరి దర్శనం" అనుకొని, చివరిగా బాబాకు వీడ్కోలు చెప్పి, "మళ్ళీ త్వరలోనే నన్ను శిరిడీకి పిలవమ"ని బాబాను అడిగాను. తరువాత అక్కడినుండి బయలుదేరబోతుండగా అకస్మాత్తుగా ముఖదర్శనం వైపునుండి ఒక కుక్కపిల్ల నా దగ్గరకు వచ్చింది. ఆ రూపంలో వచ్చింది బాబానే అని భావించి, నా దగ్గర ఉన్న బాబా ప్రసాదాన్ని దానికి తినిపించి, నీళ్లు కూడా అందించాను. కానీ ఆ కుక్కపిల్ల ప్రసాదం మాత్రమే తీసుకుంది, నీళ్లు ముట్టలేదు. నేను ఆ కుక్కపిల్లతో కొంతసేపు గడిపాను. నిజానికి కోవిడ్ కారణంగా మందిర ప్రాంగణంలో ఉండటానికి భక్తులను అనుమతించడంలేదు, వెళ్లిపొమ్మని చెప్తున్నారు. అయితే నేను కుక్కపిల్లతో అంతసేపు ఉన్నప్పటికీ నన్ను ఎవరూ ఏమీ అనలేదు. ఆ కుక్కపిల్లని విడిచిపెట్టి రావడానికి నాకు బాధగా అనిపించింది. అది కూడా నా వెనుకనే ఎగ్జిట్ గేట్ వరకు వచ్చింది. నన్ను పంపించడం బాబాకి కూడా ఇష్టం లేదని నాకనిపించింది.


నేను బయటికి వచ్చాక అల్పాహారం తిని తిరిగి నా గదికి వెళ్ళాను. నేను విశ్రాంతి తీసుకుంటుండగా సుమారు 10.30కి నా సోదరి ఫోన్ చేసి, తన పక్కింట్లో ఉన్నావిడ తన తరపున బాబాకు దక్షిణగా హుండీలో కొంత మొత్తాన్ని వేయమని చెప్పారని చెప్పింది. నేను తనతో, "ఇక నేను దర్శనానికి వెళ్ళడం లేదు. డొనేషన్ కౌంటర్లో డబ్బు కడతాను" అని చెప్పాను. కానీ కొద్దినిమిషాల్లో నా మనసుకి, ‘బాబా నన్ను తమ దర్శనానికి మళ్ళీ రమ్మని పిలుస్తున్నట్లు’గా అనిపించి, కొంతసేపటి క్రితం కుక్కపిల్ల రూపంలో బాబానే స్వయంగా వచ్చి, 'నేను ఇప్పుడే నిన్ను పంపడం లేదు, నువ్వు మళ్ళీ దర్శనానికి రా' అని సూచించినట్లుగా అప్పుడు అనిపించింది. వెంటనే నేను బాబాను, "మరోసారి మీ దర్శనానికి రానా?" అని అడిగాను. బాబా నుండి "రమ్మ"ని సమాధానం వచ్చింది. అయితే ఆరతి సమయం కావొస్తున్నందున నేను ఆరతికి వెళ్లాలని, ఒకవేళ కేవలం దర్శనమే లభించినప్పటికీ తృప్తి చెందాలని అనుకున్నాను. వావ్.. ఎంత అద్భుతం! బాబా నాకు మళ్ళీ ఆరతి దర్శనాన్ని అనుగ్రహించారు. నా కళ్ళు ఆనందభాష్పాలతో నిండిపోయాయి. నేను నా అనుభూతిని వివరించలేను. భక్తులందరికీ ఇలాంటి అద్భుతమైన బాబా ఆశీస్సులను అనుభవించే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నాను. బాబా నన్ను ఇతర ప్రదేశాల దర్శనానికి ఎందుకు అనుమతించలేదో నేను అప్పుడు గ్రహించాను. ముందురోజు నేను కోల్పోయిన మధ్యాహ్న ఆరతి దర్శనాన్ని బాబా నాకోసం ప్లాన్ చేశారని చాలా ఆనందించాను. అదివరకు 2-3 దర్శనాలు పొందడమే నాకు చాలా కష్టమయ్యేది. అలాంటిది మొత్తం ఏడుసార్లు ఆనందకరమూ, ప్రశాంతమూ అయిన దర్శనాలతో బాబా నన్ను అనుగ్రహించారు. కానీ చివరికి శిరిడీ వదిలి రాలేక భారమైన హృదయంతో గురువారం ఇంటికి తిరిగి వచ్చాను. ఇది నా జీవితంలో అత్యంత ఉత్తమమైన శిరిడీ యాత్ర. "బాబా! చాలా చాలా ధన్యవాదాలు. నా అనుభవాన్ని పంచుకోవడంలో ఆలస్యం చేసినందుకు దయచేసి నన్ను క్షమించండి. అందరిపై మీ అపారమైన ఆశీస్సులు కురిపించండి. అందరికీ ఇటువంటి అద్భుతమైన అనుభవాలను ప్రసాదించండి".


సాయిభక్తుల అనుభవమాలిక 758వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా ఆశీస్సులతో నెరవేరిన సమస్యలు
  2. అమ్మానాన్నల క్షేమాన్ని చూసుకున్న బాబా

బాబా ఆశీస్సులతో నెరవేరిన సమస్యలు


రాజమండ్రి నుండి సాయిభక్తుడు రాధాకృష్ణ తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


బాబా నాకు ప్రసాదించిన అనుభవాలలో నుండి ఒకదానిని ఇంతకుముందు మీతో పంచుకున్నాను. ఆ అనుభవం ‘ఎంతో కృపతో మాకు ఏ ఇబ్బందులూ లేకుండా చూసుకున్న బాబా’ అనే శీర్షికతో ఈ బ్లాగులో ప్రచురితమైంది. ఆ లింక్‌ను ఈ క్రింద జతపరుస్తున్నాను.


https://saimaharajsannidhi.blogspot.com/2021/01/652.html


ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకోవాలనీ, ఆ సాయినాథుని లీలలను మీకు విశదపరచాలనీ నా కోరిక. మా అక్క, బావగారు మద్రాసులో ఉంటారు. ఒకరోజు మా అక్క నాకు ఫోన్ చేసి, “మీ బావగారికి ఒంట్లో బాగాలేదు. ఒకటే వాంతులవుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయంటున్నారు” అని చెప్పింది. అక్క చెప్పింది విని నేను బాబాకు నమస్కరించుకుని, “బావగారికి వాంతులు, కళ్ళుతిరగటం తగ్గిపోయి తను ఆరోగ్యంగా ఉంటే ఆ అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని ప్రార్థించాను. బాబా అనుగ్రహం వల్ల మా బావగారు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. తనకున్న చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా తగ్గించమని బాబాను కోరుకుంటున్నాను. 


మా అమ్మాయికి వివాహమై ఒక సంవత్సరం అయింది. వివాహమైన తరువాత వాళ్ళు ఒరిస్సాలో కాపురం పెట్టారు. కొంతకాలానికి మా అమ్మాయి గర్భవతి అయింది. 4 నెలలు గడచిన తరువాత కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించారు. గర్భం దాల్చిన తొలి మాసాలలో వాంతులతో ఇబ్బందిపడుతుండటంతో మా అమ్మాయి స్పెషల్ పాస్ తీసుకుని తన భర్త, అత్తగారితో కలిసి మా వద్దకు వచ్చింది. నెలలు నిండాక బాబా కృపతో తను పండంటి బాబుకు జన్మనిచ్చింది. మళ్ళీ ఒరిస్సా వెళితే సహాయం చేసేవారు ఎవరూ లేక చంటిబిడ్డతో మా అమ్మాయి అక్కడ ఎలా ఉంటుందో అని దిగులుపడి ఈ సమస్యకు పరిష్కారం చూపమని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల మా అల్లుడిగారికి బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. బంధుమిత్రులంతా అక్కడికి దగ్గరలోనే ఉండటం వల్ల మా అమ్మాయి చంటిబిడ్డతో వెళ్ళి బెంగళూరులో కాపురం పెట్టినా తను ధైర్యంగా ఉండగలదనే భరోసాను ఈ అనుభవం ద్వారా బాబా మాకు ప్రసాదించారు. ఈ లీల ద్వారా బాబా సహకారం మాకు ఎల్లప్పుడూ ఉన్నదన్న నమ్మకం మరింత దృఢపడింది


నా శ్రీమతికి ఈమధ్య ఒళ్ళంతా ఎలర్జీ వచ్చింది. నేను బాబాకు నమస్కరించుకుని, ‘నా భార్య ఎలర్జీ తగ్గితే ఆ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన’ని చెప్పుకున్నాను. బాబా అనుగ్రహంతో ఆ ఎలర్జీ తీవ్రత తగ్గిపోయింది. ఇలా సాయిలీలలు ఇంకా ఎన్నో ఉన్నాయి. మరిన్ని సాయిలీలలతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ... 


రాధాకృష్ణ.


అమ్మానాన్నల క్షేమాన్ని చూసుకున్న బాబా


పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు బాబా తనకి ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:


తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ తానే అయిన సాయితండ్రికి నా శతకోటి ధన్యవాదాలు. ఒకరోజు మా అమ్మ పనిచేస్తుండగా హఠాత్తుగా తన కాలు బెణికింది. దానివల్ల అమ్మ నడవలేకపోయింది. కాలినొప్పి తగ్గటానికి మందులు వాడినా ఫలితం లేకపోయింది. ఇంక అమ్మను హాస్పిటల్‌కి తీసుకువెళ్ళి డాక్టరుకి చూపించాలనుకున్నాము. కానీ మా అమ్మకు ఇంజక్షన్ అంటే భయం. అందువల్ల నేను బాబాకు నా బాధను చెప్పుకుని, “మీ అనుగ్రహంతో అమ్మకు కాలినొప్పి తగ్గిపోతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అనుకున్నాను. బాబా దయవల్ల అమ్మకు మరుసటిరోజు ఉదయానికల్లా నొప్పి తగ్గిపోయింది. ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.


మరో అనుభవం:


ఒకరోజు సాయంత్రం మా నాన్నగారు సరుకులు తేవడానికి బయటికి వెళ్ళారు. ఇంతలోనే చిన్న తుఫానులాగా విపరీతమైన గాలివాన ప్రారంభమైంది. నాన్న ఇంకా ఇంటికి రాలేదు. ఈ గాలివానలో ఆయన ఎక్కడ చిక్కుకున్నారోనని మాకు ఒకటే ఆందోళన. అప్పుడు నేను బాబాకు నమస్కరించి, “మా నాన్న క్షేమంగా ఇంటికి చేరుకుంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన”ని బాబాను ప్రార్థించాను. కాసేపట్లోనే నాన్న క్షేమంగా ఇంటికి వచ్చేలా చేశారు బాబా. “థాంక్యూ సో మచ్ బాబా. నేను ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నాను. దాన్ని ఎలాగైనా నువ్వే నయం చేయాలి బాబా. ఈ చంచల మనస్కురాలిని నువ్వే ఆదుకోవాలి బాబా. నీకు శతకోటి ధన్యవాదాలు తండ్రీ!”


సాయిభక్తుల అనుభవమాలిక 757వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. ఎటువంటి క్లేశాన్నయినా తప్పించగలరు బాబా
  2. అన్నీ బాబానే చూసుకుంటారు

ఎటువంటి క్లేశాన్నయినా తప్పించగలరు బాబా


సాయి భక్తుడు వెంకటరావు తమకి బాబా ఇటీవల ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:


రాజాధిరాజ యోగిరాజ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!


ఇటీవలే బాబా నాకు అనుగ్రహించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కొన్ని నెలల క్రితమే పెళ్ళయిన మా కొడుకు, కోడలికి ఇటీవల ఏదో చిన్న విషయంలో కాస్త మాటా మాటా పెరిగింది. దాంతో ఇద్దరూ కోపంతో అలిగి ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా మౌనంగా ఉండిపోయారు. అంతేకాదు, ఇంట్లోవారితో కూడా మాట్లాడటం మానేశారు. ఆ మాటపట్టింపులు సాయంత్రం దాకా కొనసాగాయి. మనం మధ్యలో కలిపించుకుంటే వాళ్ళేమనుకుంటారో ఏమోనని మేము కూడా మౌనంగా ఉండిపోయాము. అలా అని ఊరకే కూర్చోవటానికి మనసొప్పటం లేదు. ఏం చేయాలో అర్థం కాని స్థితి. దాంతో “సాయినాథా, నీదే భారం” అని బాబాను తలచుకొని వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నించాము. ఇద్దరూ ఎవరి వాదనను వాళ్ళు వినిపిస్తున్నారు. ఎవరినీ తప్పుపట్టటం మన ఉద్దేశ్యం కాదు కదా. అయితే ఈ ప్రక్రియ వాళ్ళ మధ్య అసంపూర్తిగా ఆగిపోయిన వాద ప్రతివాదాలను మళ్ళీ బయటకు తెచ్చింది. దాంతో పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టయింది మా పరిస్థితి. కనుచూపు మేరలో పరిష్కారమేమీ కనిపించలేదు.


ఇక బాబా మాత్రమే ఈ సమస్యను పరిష్కరించగలరనే నమ్మకంతో మనసులోనే బాబాకు నమస్కరించుకుని, "బాబా! ఇలా జరుగుతుందేమిటి తండ్రీ? ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత నీదే సాయినాథా" అని ఎంతో ఆర్తిగా బాబాను వేడుకున్నాను. ఒకవైపు వాళ్ళిద్దరి మాటలు వింటూనే మాకు సాయం చేయమని ఆ సాయినాథుని అర్థిస్తున్నాను. బాబా కరుణించాడో లేక వాళ్ళు అలసిపోయారో తెలియదుగానీ - ఒక్కసారిగా నిశ్శబ్దం! కాసేపటికి ఇద్దరూ దగ్గరై ఒకరికొకరు సారీ చెప్పుకున్నారు. తరువాత ఇద్దరూ మా దగ్గరకొచ్చి, "మీకు ఇబ్బంది కలిగించినందుకు మాకెంతో సిగ్గుగా ఉంది. ఇలాంటి పరిస్థితి మీకెప్పుడూ రానీయం. ఇదే మా మాట" అంటూ మా చేతులు పట్టుకున్నారు. “ధన్యవాదాలు సాయిదేవా! ఎటువంటి క్లేశాన్నయినా మీరే తప్పించగలరు. మిమ్మల్ని ఎల్లవేళలా నమ్మటమే మేం చేయాల్సింది. మీ భక్తులను మీరెల్లప్పుడూ కరుణిస్తూనే ఉంటారు”.  

         

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


అన్నీ బాబానే చూసుకుంటారు


సాయిభక్తుడు శ్రీనివాస్ తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


సాయిబంధువులకు నా నమస్కారం. నా పేరు శ్రీనివాస్. ప్రస్తుతం మేము విదేశాలలో నివసిస్తున్నాము. ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. మీరు ఈ బ్లాగులో పంచుతున్న లీలల ద్వారా ఎందరికో బాబా పట్ల నమ్మకం పెరిగేలా, వారి వారి సమస్యలకు పరిష్కారం దొరికేలా బాబా చేస్తున్నారు. సాయిభక్తులందరి అనుభవాలు చదువుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది. మనసు బాగాలేనప్పుడు మీ బ్లాగులోని అనుభవాలు చదువుతాము. వాటి ద్వారా బాబా చెప్పిన శ్రద్ధ, సబూరీలు ఎంత అవసరమో నేను స్వయంగా తెలుసుకున్నాను.


బాబా నాకు ప్రసాదించిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి చెప్తాను. 15 సంవత్సరాల క్రితం ఒకరోజు రాత్రి స్వప్నంలో బాబా నాకు దర్శనమిచ్చారు. ఆ స్వప్నంలో బాబా నా నుంచి దూరంగా పరిగెడుతున్నారు. దాని అంతరార్థమేమిటో నాకేమీ అర్థం కాలేదు. అప్పట్లో నేను కేవలం బాబాకి రోజూ దణ్ణం పెట్టుకునేవాడిని, అంతే. అందుకేనేమో, నేను ఆ స్వప్నాన్ని అంతగా పట్టించుకోలేదు. అసలు ఆ స్వప్నం ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాలేదు. ఆ తరువాత అనుకోకుండా అసలు ఊహించని ఒక క్లిష్టమైన సమస్యలో ఇరుక్కున్నాను. అయితే బాబా దయవల్ల అందులో నుండి క్షేమంగా బయటపడ్డాను. తరువాత నాకు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాను. బాబా నా ఉద్యోగ విషయంలోనూ, మా పిల్లల విషయంలోనూ ఎంతో సహాయం చేశారు. ఇంతకుముందు నేను బాబాకు చేసే ప్రార్థనలో కేవలం నా కోరికలను తొందరగా తీర్చమని ఆత్రుతగా అడిగేవాడిని. అంతేగానీ, బాబా పట్ల నమ్మకం ఉండేది కాదు. ఎప్పుడైతే బాబా పట్ల స్థిరమైన నమ్మకం మరియు ఓపిక వచ్చిందో అప్పటినుంచి చాలా మార్పును గమనిస్తున్నాను. ముఖ్యంగా, నా ఉద్యోగం విషయంలోనూ, మా బేబీ విషయంలోనూ అద్భుతాలు జరుగుతున్నాయి. సాయిభక్తులకు చిన్న మనవి: మీరు అనుకున్నవి జరగాలంటే ఒక్కటే మార్గం, ‘అన్నీ బాబానే చూసుకుంటారు’ అనే స్థిరమైన నమ్మకంతో మీ ప్రయత్నం చేయండి. ఓపిక పట్టండి. ఏది వచ్చినా మన మంచికే అవుతుంది. ఇది నా స్వానుభవంతో చెబుతున్నాను. అందరికీ మంచి జరగాలని సాయినాథుని మనసారా కోరుకుంటున్నాను.


సాయిభక్తుల అనుభవమాలిక 756వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా అనుగ్రహించిన కొన్ని అనుభవాలు
  2. పుత్ర సంతానాన్ని ప్రసాదించిన బాబా

బాబా అనుగ్రహించిన కొన్ని అనుభవాలు


హైదరాబాదు నుండి శ్రీమతి దీప్తి తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వాహకులకు, సాటి సాయిబంధువులకు నా నమస్కారం. నా పేరు దీప్తి. నేను ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను కొన్నింటిని మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకోబోతున్నాను. 


మొదటి అనుభవం:


లాక్‌డౌన్ తరువాత 2020, నవంబరు నెలలో శిరిడీ సాయి సంస్థాన్ వారు బాబా దర్శనానికి అనుమతి ఇచ్చారు. దాంతో, శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకుందామని మావారిని అడిగితే, తను ‘మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయ’ని శిరిడీ వెళ్ళడానికి ఒప్పుకోలేదు. శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకోవాలని మనసు ఎంతగా తపిస్తున్నా మావారు ఒప్పుకోలేదని మౌనంగా ఉండిపోయాను. డిసెంబరు 21వ తేదీన గూగుల్ ఫోటోస్ చూస్తుంటే, 2019లో అదే తేదీన మేము శిరిడీ వెళ్ళినప్పుడు తీసిన ఫోటోలు కనిపించాయి. అవి చూసి ఆరోజు నేను ఎంతగానో ఏడ్చాను. అప్పుడు మా అమ్మ నన్ను ఓదార్చి, ‘రెండురోజులలో పిల్లలకు సెలవులు వస్తాయి కదా, ఎక్కడికైనా వెళదాము’ అని చెప్పింది. మేము గాణ్గాపురంగానీ, కురువపురంగానీ వెళ్దామని అనుకుని, ఎక్కడికి వెళ్ళమంటారో తెలుపమని బాబాను ప్రార్థించి బాబా ఫోటో ముందు చీటీలు వేస్తే, ‘కురువపురం వెళ్ళమ’ని చీటీలో వచ్చింది. మేము బాబా దయవలన కురువపురంలో శ్రీపాద శ్రీవల్లభ తపోభూమి దర్శనానికి వెళ్ళాము. ఆరోజు స్వామి శ్రీనృసింహసరస్వతి అవతారంలో దర్శనమిచ్చి, ‘దత్తావతారాలన్నీ ఒక్కటే, ఎక్కడైనా తామే ఉన్నామ’న్న సందేశాన్నిచ్చారు. 


రెండవ అనుభవం: 


సంక్రాంతి సెలవులకు మా అత్తగారింటికి వెళుతూ శంషాబాద్ దగ్గర ఉన్న ధర్మసాయిక్షేత్రాన్ని దర్శించుకున్నాను. మా ఊరిలో పండుగ జరుపుకున్నాక ఇంటికి తిరిగి వచ్చే ముందురోజు పిల్లలందరూ కలిసి మా పొలంలో నిర్మిస్తున్న ప్రాజెక్టును చూడటానికి వెళ్ళారు. మా చిన్నమ్మాయిని, మా తోడికోడలు కొడుకుని మా మామయ్య తన బండిపై తీసుకెళ్ళారు. తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఉన్న రాయిని తప్పించబోయి బండి బ్యాలెన్స్ తప్పిపోయి అందరూ క్రిందపడ్డారు. మా అమ్మాయికి చీలమండ దగ్గర వాచింది. మామయ్యకి కొద్దిగా గీరుకుపోయింది. మా పాప కాలివాపు చూసి తనకు ఫ్రాక్చర్ అయిందేమోనని భయపడి, ‘పాప కాలికి ఫ్రాక్చర్ అవకుండా చూడమ’ని సాయిని ప్రార్థించసాగాను. పాప కాలిని పరీక్షించిన డాక్టర్, ‘ఫ్రాక్చర్ ఏమీ లేదు, కేవలం టిష్యూస్ మాత్రమే ప్రక్కకు జరిగాయి. మందులతోనూ, పట్టీతోనూ వాపు తగ్గిపోతుంది’ అని చెప్పారు. అంతా బాబా అనుగ్రహం. అంతేకాదు, అంతకుముందు మా మామయ్య కాలికి knee joint replacement surgery జరిగింది. కానీ ఆ కాలికి దెబ్బలేమీ తగలలేదు. బండి చక్రం తగలకుండా, కాలికి ఫ్రాక్చర్ అవకుండా మా పాపని, మా మామయ్యని సాయిబాబానే కాపాడారు


మూడవ అనుభవం:


2020, డిసెంబరు 30వ తేదీన, సాయిబాబా గుడిలో సాయిభక్తుల ఫోటోలు మరియు వారి గురించిన వివరాలను ఒక ఫ్లెక్సీలో ప్రింట్ చేయించే విషయమై ఒక సాయిబంధువు నాకు ఫోన్ చేసి, ‘2 గంటలలో అబ్దుల్‌బాబా, భాగోజీషిండే, స్వామిశరణానంద గురించి వ్రాసి పంపమ’ని కోరింది. ఆ భక్తుల వివరాల కోసం ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి ఫోన్ చేశాను. కానీ తన ఫోన్ చాలాసేపు ఎంగేజ్ వచ్చింది. ఇప్పుడేం చేయాలా అని ఆలోచిస్తూ ఆ భక్తుల గురించి బ్లాగులోనూ, గూగుల్లోనూ సెర్చ్ చేస్తూ, ‘అందరి భక్తుల గురించి ఒకే దగ్గర పెట్టవచ్చు కదా’ అని అనుకున్నాను. సరిగ్గా ఒక వారంరోజుల్లో, జనవరి 5వ తేదీన ఈ బ్లాగులో ‘అనుగ్రహసుమాలు’ శీర్షికతో బాబా సమకాలీన భక్తుల వివరాలన్నీ ఒకేచోట ఉండటం కనిపించింది. అది చూస్తూనే బాబా నా కోరికను నెరవేర్చారని ఎంతో సంతోషించాను. “నా అనుభవాలను ఇంత ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాబా!”


చివరిగా ఇంకో చిన్న అనుభవం:


మా ఇంటికోసం అవసరమై బ్యాంకులో గోల్డ్ లోన్ తీసుకున్నాము. కానీ అనుకోకుండా బాబా కృపవలన కొంత డబ్బు రావడంతో 2021, ఏప్రిల్ 1, గురువారంనాడు మొత్తం బంగారాన్ని విడిపించుకున్నాము. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


పుత్ర సంతానాన్ని ప్రసాదించిన బాబా


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


ముందుగా బాబాకు నా పాదాభివందనాలు. నేను ఇంతకుముందు ఒక అనుభవాన్ని పంచుకున్నాను. ఇది నా రెండవ అనుభవం. బాబా దయవలన మేము ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న ఒక కోరిక 2021, ఏప్రిల్ 6న నెరవేరింది. అసలు విషయం ఏమిటంటే, మా తాతయ్యకు ముగ్గురు ఆడపిల్లలు. ఆ ముగ్గురు ఆడపిల్లలకి మళ్ళీ ఆడపిల్లలే పుట్టారు. ఊళ్ళోవాళ్ళంతా ‘మీకు మగపిల్లలు లేర’ని అంటుండేవారు. తనకు ఒక్క మనవడైనా పుడితే బాగుంటుందని మా అమ్మమ్మకు ఎంతో కోరిక. ఇలా రోజులు గడుస్తుండగా కొన్ని రోజులకు మా చిన్న పిన్ని గర్భవతి అయింది. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! మా చిన్న పిన్నికి కొడుకు పుట్టేలా అనుగ్రహించండి. మీ అనుగ్రహంతో తనకు కొడుకు పుడితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను మనస్ఫూర్తిగా వేడుకున్నాను. బాబా దయవలన మా పిన్నికి ఏప్రిల్ 6న బాబు పుట్టాడు. మా ఆనందానికి అవధులు లేవు. "బాబా! మీరు ఎల్లప్పుడూ ఇలాగే మాతో ఉంటూ మాకు ఆనందాన్ని ఇవ్వాలనీ, ఇలాగే మరిన్ని అనుభవాలు పంచుకోవాలనీ కోరుకుంటున్నాను. మీకు చాలా చాలా కృతజ్ఞతలు".


కాకాసాహెబ్ దీక్షిత్ - ఏడవ భాగం.....



"గురువినా కౌన్ బతావే బాట్" అనే గేయంలో, 'గురువు లేకపోతే మార్గమెవరు చూపుతారు? గురువు లేదా మార్గదర్శి సహాయం ఉంటే ఎటువంటి కష్టమూ ఉండదు, వాళ్ళు సురక్షితంగా తమ లక్ష్యాన్ని చేరుకుంటారు' అని కబీరు వివరించారు. అయితే శిష్యుడు నిష్ఠ(విశ్వాసం), సబూరి(ధైర్యం, పట్టుదలతో కూడిన ఓరిమి)లు కలిగివుండటంతో పాటు ఫలాపేక్ష లేకుండా తను, మన, ధన, ప్రాణములను గురువు యొక్క చరణాలకు సంపూర్ణంగా సమర్పించుకోవడం అత్యంత ఆవశ్యకం. వాటితోపాటు ప్రాపంచిక అనురక్తి నుండి, కామం, క్రోధం మొదలైన అరిషడ్వర్గాల నుండి బయటపడకపోతే శిష్యుడు ఎన్నటికీ భగవంతుని లేదా గురువుని స్థిరంగా అంటిపెట్టుకోలేడు. కాకాసాహెబ్ దీక్షిత్ సంపూర్ణ విశ్వాసంతో తన తను, మన, ధనములను బాబా పాదాలకు అర్పించుకున్నాడు. అతను తన ప్రాక్టీసును, రాజకీయంగా, సామాజికంగా తనను వరించిన అన్ని గౌరవాలనూ వదులుకొని బాబాకు, ఆయన భక్తులకు సేవ చేస్తూ 1918కి ముందు, ఆ తరువాత, ఒక్క మాటలో చెప్పాలంటే తన జీవితాంతమూ శిరిడీకి అతుక్కుపోయాడు. ఎవరైనా, "కాకా వైరాగ్యంతో సంపాదనను వదులుకుంటే, అతనిపై ఆధారపడిన వారి పరిస్థితి ఏమిటీ?" అని అతని బంధువులు అడిగినట్లే అడగవచ్చు. ఇదే ప్రశ్నను బాలక్‌రామ్ మాన్కర్ విషయంలో కూడా అతని బంధువులు బాబాను అడిగారు. కుటుంబానికి ముఖ్య సంపాదకుడైన మాన్కర్ అకస్మాత్తుగా బాబాకు ఆకర్షితుడై అన్నీ విడిచిపెట్టి బాబా సన్నిధిలోనూ, బాబా ఆదేశం మేరకు ఒంటరిగా మచ్ఛీంద్రగఢ్‌లోనూ గడిపాడు. అప్పుడు అతని బంధువులు, "అతనిలా సంపాదించడం మానేస్తే అతని కొడుకు పరిస్థితి ఏమిటి?" అని బాబాను అడిగారు. అందుకు బాబా, "అతని కొడుకుకి కావలసినవి నేను సమకూరుస్తాను" అని అన్నారు. తాను మాటిచ్చినట్లే బాబా వాళ్ళకు కావాల్సినవన్నీ అందించారు. భవిష్యత్తులో వాళ్లంతా ఆర్థికంగా ఆశించిన ఉన్నతస్థాయిని పొందారు. కాకాసాహెబ్ దీక్షిత్ విషయంలో బాబా ఈ ప్రశ్నకు తొలిరోజుల్లోనే, "కాకా! నీకెందుకు చింత? చింత అంతా నాది (కాకా తులా కైజీ కస్లీ? మాలా సారా కల్జీ అహే)" అని అతనితో చెప్పారు. చెప్పడమే కాదు, దీక్షిత్ బాధ్యత, అతని బంధువుల బాధ్యతంతా తాము తీసుకుని అతనికిచ్చిన వాగ్దానాన్ని నిలుపుకున్నారు. బాబా తమ మహాసమాధికి ముందు, తరువాత కూడా ఆ బాధ్యతను నెరవేర్చారని నిరూపించే అనేక సంఘటనలు ప్రస్తావించవచ్చు.

1913వ సంవత్సరంలో దీక్షిత్ శిరిడీలో బాబా సన్నిధిలో కాలం గడుపుతున్నాడు. ఆ సమయంలో బొంబాయి, విల్లెపార్లేలో చదువుకుంటున్న అతని కొడుకు ఒకటి, రెండు నెలల్లో పరీక్షలున్నాయనగా జ్వరంతో బాధపడ్డాడు. పిల్లవాని జ్వరం రోజులు తరబడి కొనసాగుతుండటంతో దీక్షిత్ సోదరుడు, "ఇక్కడికొచ్చి పిల్లవాణ్ణి చూసుకోమ"ని దీక్షిత్ కి ఉత్తరం వ్రాసాడు. కాకాసాహెబ్ ఆ ఉత్తరాన్ని బాబాకు చూపించినప్పుడు బాబా అతనితో, "నువ్వు వెళ్ళవద్దు. పిల్లవాణ్ణే ఇక్కడికి పంపమ"ని లేఖ వ్రాయమన్నారు. శిరిడీలో సరైన వైద్యసౌకర్యం అందుబాటులో ఉండదేమోననే భయంతో శిరిడీకి పంపడం ఇష్టంలేనప్పటికీ బాబా ఆజ్ఞానుసారం పిల్లాడిని శిరిడీకి పంపాడు దీక్షిత్ సోదరుడు. ఆశ్చర్యంగా శిరిడీ చేరుకున్నాక పిల్లవాని ఆరోగ్యం మెరుగుపడి పూర్తిగా కోలుకున్నాడు. తరువాత దీక్షిత్ సోదరుని వద్దనుండి, ‘నవంబరు రెండవ తారీఖున వార్షిక పరీక్ష ఉందనీ, కాబట్టి చదువుని దృష్టిలో పెట్టుకొని వెంటనే పిల్లవాణ్ణి ముంబాయికి పంపమనీ’ ఉత్తరం వచ్చింది. అప్పుడు బాబాను అనుమతిని అడిగితే, “చూద్దాం” అని మాత్రమే చెప్పి పిల్లవాణ్ణి పంపడానికి ఒప్పుకోలేదు, కనీసం పరీక్ష సమయానికి వెళ్ళడానికి కూడా అనుమతించలేదు. బాబా పిల్లవాని భవిష్యత్తును పాడుచేస్తున్నారని అందరికీ అన్పించింది. కానీ దీక్షిత్ చెదరని విశ్వాసంతో బాబా ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాడు. అతని నమ్మకం వమ్ము కాలేదు. పరీక్షా కేంద్రంలో ప్లేగుతో చచ్చిన ఎలుక కనిపించడంతో 02-11-1913న జరగాల్సిన పరీక్ష 06-11-1913వ తేదీకి వాయిదాపడింది. దాంతో దీక్షిత్ సోదరుని వద్దనుండి “పిల్లవాణ్ణి 6వ తేదీ పరీక్షకు బొంబాయి పంపమ”ని ఉత్తరం వచ్చింది. అప్పుడు కూడా బాబా పిల్లవాణ్ణి పంపడానికి అనుమతించలేదు. అయితే మళ్ళీ పరీక్ష కేంద్రంలో చచ్చిన ఎలుక కనిపించడంతో పరీక్ష 13-11-1913వ తేదికి వాయిదా పడింది. ఈసారి పిల్లవాణ్ణి పంపడానికి బాబా అనుమతించారు. పిల్లవాడు బొంబాయి వెళ్లి పరీక్ష వ్రాసి, ఉత్తీర్ణుడయ్యాడు. బాబా అజ్ఞానుసారం నడుచుకోవడం వల్ల పిల్లవాని ఆరోగ్యం బాగుపడటంతో పాటు పరీక్షలలో కూడా ఉత్తీర్ణుడయ్యాడు.

బాబా దేహత్యాగం చేసిన తరువాత కూడా దీక్షిత్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండేది. చాలాకాలం పాటు ఆర్థికమాంద్యంలో ఉన్నప్పటికీ అతనెప్పుడూ బాధపడలేదు, నిరాశకు లోనుకాలేదు. 'దేవుడు మనకిచ్చిన దానితో సంతృప్తిగా ఉండాలి' అని తన మనసుకి చెప్పుకొని అంతటి కష్టకాలంలోనూ అతను సంతృప్తిగా, మనశ్శాంతితో ఉండేవాడు. అయితే బాబాపై తనకున్న విశ్వాసాన్ని పరీక్షించి, నిర్ధారించిన కొన్ని ప్రత్యేక సందర్భాలు తలెత్తాయి. బాబా సమాధి చెందిన కొంతకాలానికి ఒక మార్వాడీకి 30,000 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి దీక్షిత్‌కు ఎదురైంది. గడువు సమీపిస్తున్నా అంత పెద్ద మొత్తాన్ని ఎలా సమకూర్చుకోవాలో అతనికి తెలియలేదు. అటువంటి సమయంలో ఒకరాత్రి అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో మార్వాడీ తనను డబ్బులిమ్మని ఒత్తిడి చేస్తుంటే, దీక్షిత్ ఆ మార్వాడీతో, "మీరేమీ భయపడవద్దు. నాకు చున్నీలాల్, చమన్‌లాల్ వంటి గొప్ప ధనవంతులైన స్నేహితులున్నారు. వాళ్ళనడిగి డబ్బు తీసుకొచ్చి గడువు లోపల మీ బాకీ తప్పక తీరుస్తాను" అని చెప్పాడు. తరువాత అతనికి మెలకువ వచ్చి, కలలో తాను సంభాషించినదానిని గుర్తుచేసుకుని బాధపడ్డాడు. కొండంత దేవుడు సాయిబాబా తనకు అండగా ఉండగా అవసరమైన సమయంలో అక్కరకురాని సామాన్యమానవుల సహాయం పొందాలనుకోవడం తెలివితక్కువతనమని తలచి పశ్చాత్తాపం చెంది, వెంటనే బాబా పటం ముందు కూర్చుని తను చేసిన తప్పును మన్నించమని కన్నీరు కారుస్తూ ఆర్తిగా ప్రార్థించాడు. బాబా తమ భక్తులను కష్టసమయంలో ఆదుకుంటారని భావించి తన బరువు బాధ్యతలన్నీ బాబాపై వేసి నిశ్చింతగా గడపసాగాడు. కానీ, అప్పు తీర్చవలసిన గడువు తేదీ దగ్గరపడినప్పటికీ డబ్బు అందే అవకాశమేదీ కనపడలేదు. సరిగ్గా గడువు తేదీకి ముందురోజు దీక్షిత్ ఆఫీసులో ఉండగా అతని సన్నిహిత స్నేహితుని కుమారుడు అతని వద్దకు వచ్చాడు. తన వద్ద 30 వేల రూపాయలు ఉన్నాయనీ, ఆ మొత్తాన్ని ఎలా పెట్టుబడి పెడితే బాగుంటుందో తెలుపమనీ దీక్షిత్‌ను అడిగాడు. దీక్షిత్ మొదట పెట్టుబడులు, వాటి సాధకబాధకాల గురించి వివరించాడు. ఒకవేళ ఆ డబ్బును తన దగ్గర మదుపు చేసే ఆలోచన గనుక ఉంటే తనను చివరగా పరిగణనలోకి తీసుకోమనీ, అతని తండ్రితో ఉన్న సాన్నిహిత్యాన్ని ఆధారంగా చేసుకుని లాభపడాలనే ఉద్దేశ్యం తనకు ఎంతమాత్రం లేదనీ చెప్పాడు. అంతేకాదు, ప్రస్తుతం తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆ డబ్బును గడువులోగా బహుశా తిరిగి చెల్లించలేకపోవచ్చని నిస్సంకోచంగా చెప్పాడు. ఇదంతా విని ఆ వ్యక్తి ఏ మాత్రం భయపడకపోగా అంత నిజాయితీగా అన్ని విషయాలూ చెప్పడం వల్లే దీక్షిత్‌కు ఆ డబ్బు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పి, తండ్రి సమానులకు కష్టసమయంలో సహాయం చేయడం కుమారునిగా తన కర్తవ్యమనీ, అందువల్ల ఆ డబ్బును స్వీకరించవలసిందేననీ పట్టుబట్టి ఆ డబ్బును దీక్షిత్‌కు ఇచ్చాడు. దాంతో దీక్షిత్ గడువులోగా అప్పును తీర్చగలిగాడు. తమను సంపూర్ణంగా నమ్మినవారిని బాబా తప్పక ఆదుకుంటారనే దానికి ఇదొక ఉదాహరణ. 

తమ భక్తులకు సహాయపడే కార్యంలో భాగంగా ఎంతోమంది ఆలోచనల్లో, సంకల్పాలలో మార్పు తేగలరనీ, వేలాది రూపాయలను తమ భక్తుల కోసం సమకూర్చిపెట్టగల సమర్థులనీ ఈ లీల ద్వారా బాబా నిరూపించారు. కొన్ని సంకట పరిస్థితుల్లో బాబా వ్యవహరించే తీరు తరచూ ఈ విధంగానే ఉండేది. ఉదాహరణకు, జోగ్ పితృశ్రాద్ధము చేసే సమయానికి వచ్చేలా బ్రాహ్మణుల మనస్సును బాబా మలిచారు. ఇంకోసారి, శిక్షపడబోయే తమ సేవకుడు రఘుపాటిల్‌కు న్యాయం చేయడానికి తీర్పు చెప్పే న్యాయమూర్తి మనస్సును ప్రభావితం చేశారు. మరో సందర్భంలో, ఖపర్డేపై న్యాయవిచారణకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వ అధికారుల మనసును ప్రభావితం చేశారు. 1911, జూన్ నెలలో ఉపాసనీ మహరాజ్ శిరిడీకి వచ్చేలా చేయడంలో బాబా కొందరి మనస్సులను ప్రభావితం చేశారు. ఇలా ఎన్నో సంఘటనలను ప్రస్తావించవచ్చు. బాబాకు అన్నీ తెలుసు, అందరి మనస్సులూ వారి అధీనంలో ఉంటాయి. కనుక తమనే నమ్ముకున్న దీక్షిత్‌ను ఋణవిముక్తుణ్ణి చేయడానికి సరైన సమయానికి అతని స్నేహితుని కుమారుడిని 30,000 రూపాయలతో తీసుకొచ్చారు. దీక్షిత్‌కు ఇలాంటి ఎన్నో అనుభవాలున్నాయి. అవి పసిబిడ్డ తన తల్లిపై పూర్తిగా ఆధారపడినట్లు అతను తన గురువైన బాబాపై ఆధారపడటాన్ని ధ్రువీకరిస్తాయి.

కానీ ఆర్థికపరమైన విషయాలు అంత ప్రాధాన్యమైనవి కావు. అంతకంటే, ఆత్మ యొక్క పరిపక్వత, పూర్వార్జిత వాసనా క్షయం, బలాన్ని పెంపొందించుకోవడం మరియు పరిపూర్ణమైన నిష్ఠ, సబూరీల ఆధారంగా శాంతిని పరిపూర్ణం చేసుకోవడం అత్యంత ఉత్తమమైనవి. దీక్షిత్ యొక్క ఈ విషయాలలో కూడా బాబా బాధ్యత వహించారు. ఆయన తన కాకాను విమానంలో తీసుకెళ్తామని తొలిరోజులలోనే స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ మాటల మర్మమేమిటి? దాని గురించి పురాణాల్లో చెప్పబడింది. ఇంకా తుకారాం వంటి వ్యక్తుల పవిత్ర ఆత్మలు మరణానంతరం విమానంలో స్వర్గాన్ని చేరుకుంటాయని అంటారు. ఆ దృష్ట్యా బాబా మాటలను పరికిస్తే, కాకాకు అత్యంత ఉత్తమమైన సద్గతి ప్రాప్తిస్తుందనీ, అతని భవిష్యత్తు, మరణం సంతోషంగా, ప్రశాంతంగా ఉంటాయన్న గొప్ప హామీని బాబా ఇచ్చారనీ అర్థమవుతుంది.

భగవద్గీత, 8వ అధ్యాయం, 6వ శ్లోకం: 

యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరమ్|
తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః||  
 
భావం: కౌంతేయా! మనుష్యుడు అవసానదశయందు ఏ ఏ భావములను స్మరించుచూ దేహత్యాగం చేయునో అతను మరుజన్మలో ఆయా స్వభావములనే పొందును. ఏలనన అతడు సర్వదా వానినే స్మరించుచుండును.

కాబట్టి శ్రీకృష్ణుడు ఇచ్చిన సలహా ఏమిటంటే:-

తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ|
మయ్యర్పితమనోబుద్ధిః మామేవైష్యస్యసంశయమ్||

భావం: కావున ఓ అర్జునా! నీవు సర్వదా నన్నే స్మరించుచుండుము. యుద్ధమును (కర్తవ్యకర్మను) కూడా చేయుము. ఈవిధముగా నీ మనోబుద్ధులను నాయందే నిలిపియున్నచో నిస్సందేహంగా నన్నే పొందుదువు.

అందుకే చాలామంది తమ అంత్యకాలమందు భగవంతుని గురించి ఆలోచించేందుకు ప్రయత్నిస్తారు. కానీ జీవితకాలమంతా ప్రాపంచిక అనుబంధాలలో తలమునకలై చివరిక్షణంలో దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు భగవంతుని గురించి ఆలోచించడమన్నది ఎంత మాత్రమూ సులభం కాదు. కానీ, దీక్షిత్ మాత్రం ఎల్లప్పుడూ బాబా స్మరణలోనే గడిపేవాడు. అతను ప్రతినిత్యం, "బాబా! మీ పాదాల యందు ప్రేమ, భక్తి అధికమవ్వనీ. దేవా! మీ పాదాల యందు ప్రేమ పెరగనీ. బాబా! మీ పాదాల యందు నా ప్రేమ వృద్ధి కానివ్వండి. ఇదే నా చివరి ప్రార్థన" అంటూ అచంచల భక్తితో బాబాను ప్రార్థించేవాడు. అంతటి భక్తునికి బాబా సద్గతిని ఎలా ప్రసాదించారో చూద్దాం. 

కాకా మరణం – సద్గతి

అందరూ తమ ప్రస్తుత జన్మకు మంచి ముగింపు లభించాలని కోరుకుంటారు. సాధారణంగా ఏకాదశి రోజున మరణిస్తే స్వర్గానికి చేరుకుంటామని ఎంతోమంది విశ్వసిస్తారు. ఆ విశ్వాసం దీక్షిత్‌కి బలంగా ఉండేది. ఆ విషయాన్ని అతను తాను సచ్చరిత్రకు వ్రాసిన ముందుమాటలో ప్రస్తావించారు. అది అతని సంతకంతో పాటు 1923, సాయిలీల మాసపత్రికలో ప్రచురితమైంది. అందులో దీక్షిత్, 'హరి భక్తుల మరణం హరికి ప్రియమైన ఏకాదశిరోజున సంభవిస్తుంది' అని పేర్కొనడమే కాకుండా కాశీరాం, అప్పాభిల్ వంటి కొంతమంది సాయిభక్తులకు బాబా ఏకాదశిరోజున మరణాన్ని ప్రసాదించారని కూడా వ్రాశాడు. తరువాతి కాలంలో మహల్సాపతి, నానాసాహెబ్ చాందోర్కర్, తాత్యాకోతేపాటిల్ మొదలైన సాయిభక్తులు కూడా ఏకాదశి రోజున మరణించారని మనం గమనించవచ్చు. భగవంతునిపై ఏకాగ్రదృష్టి నిలిపేందుకు ఏకాదశి ప్రశస్తమైన రోజనీ, ఆ రోజున ఉపవాసం, భజన, పవిత్రగ్రంథాల అధ్యయనం మరియు ధ్యానములలో గడపాలని శాస్త్రాలలో చెప్పబడింది. కాకాసాహెబ్ దీక్షిత్ విషయంలో ఇవన్నీ తన ఆచరణలో ఉండేవి. దీక్షిత్ ప్రతిరోజూ భావార్థ రామాయణం, ఏకనాథ భాగవతం గ్రంథాలను పఠిస్తూ ఉండేవాడు. సాయిబాబాతో లోతైన అనుబంధమున్న సచ్చరిత్ర రచయిత అన్నాసాహెబ్ దభోల్కర్‌తోనూ మరియు సాయిబాబా భజనమాల పేరుతో సాయిబాబాపై అసంఖ్యాక భజన గీతాలు స్వరపరిచిన టెండూల్కర్ కుటుంబంతోనూ దీక్షిత్‌కు చెప్పుకోదగ్గ గొప్ప సాహచర్యం ఉండేది. వారిరువురూ దీక్షిత్ చేసే ఏకనాథ భాగవత పారాయణ శ్రవణం చేయడానికి నిత్యమూ హాజరవుతుండేవారు. 1926, జూలై 4న పారాయణకు హాజరైన వారిరువురూ భారీవర్షం కారణంగా ఆరోజు అక్కడే ఉండిపోయారు. మాధవరావు దేశ్‌పాండే కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. ఆరోజు రాత్రి దీక్షిత్ తన పారాయణలో భాగంగా ఏకనాథ భావార్థ రామాయణంలోని 21వ అధ్యాయమైన సుందరకాండ పఠించాడు. అందులో గజేంద్రమోక్షము గురించి వచ్చింది. అదేరోజు రాత్రి అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో అతనికి బాబా దర్శనమిచ్చారు. బాబా నేరుగా వచ్చి దీక్షిత్ కప్పుకున్న దుప్పట్లో దూరారు. దీక్షిత్ ఎంతో ప్రేమగా బాబాను ఆలింగనం చేసుకున్నాడు. అంతటితో కల ముగిసింది(ఒక్కో ఆర్టికల్ లో ఒక్కోలా ఉన్న ఈ కల గురించి విజయకిషోర్ గారు తమ దీక్షిత్ డైరీలో లోతుగా విశ్లేషించి, ఒక స్పష్టత ఇచ్చారు. దాన్నే ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది). మరుసటిరోజు 1926, జులై 5, ఏకాదశి. ఉదయం నిద్రలేచాక దీక్షిత్ తనకొచ్చిన కల గురించి అన్నాసాహెబ్, షామా, లగాటే తదితరులతో పంచుకున్నాడు. ఆ తరువాత వాళ్ళంతా కొంతసమయం భజన, గ్రంథపారాయణలో గడిపారు. దీక్షిత్ చేసిన ఏకనాథ భాగవత పారాయణలో 25వ అధ్యాయం, ఏకాదశ స్కంథంలో, ముఖ్యంగా 23వ శ్లోకంలో అష్టమహాసిద్ధుల గురించి ఇలా చెప్పబడింది.

'పరకాయం విశన్ సిద్ధః ఆత్మానం తత్ర భావయేత్,
పిండం హిత్వా విశత్ ప్రాణో వాయు భూత షడంఘ్రివత్'

భావం: పరకాయ ప్రవేశం చేయాలనుకునే యోగి ముందుగా ఆ జీవితో మానసికంగా తాదాత్మ్యం చెందుతాడు. ఆ తరువాత, తేనెటీగ ఒక పువ్వును విడిచిపెట్టి మరొక పువ్వు మీద వాలినంత తేలికగా యోగి తన శరీరాన్ని విడిచి, సూక్ష్మరూపంలో ఆ జీవి శరీరంలోకి ప్రవేశిస్తాడు.

పై చరణానికి ఏకనాథుడు ఇచ్చిన అత్యంత అద్భుతమైన వ్యాఖ్యానాన్ని గుండెలనిండా పొంగిపొర్లుతున్న భక్తిప్రేమలతో పఠించాడు దీక్షిత్. భవిష్యత్ పరిణామాల దృష్ట్యా అది ఆ సందర్భానికి ఎంత సముచితమైన శ్లోకమో తరువాత అందరికీ అర్థమైంది. పారాయణ ముగిసిన తరువాత దభోల్కర్, టెండూల్కర్‌లు తమ తమ ఇళ్లకు బయలుదేరుతుండగా, బొంబాయిలోని డాక్టర్ దేశ్‌ముఖ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన కొడుకు రామకృష్ణను చూడటానికి దీక్షిత్ కూడా వాళ్లతో పాటు బయలుదేరాడు. వాళ్ళంతా కాస్త ఆలస్యంగానే స్టేషనుకి చేరుకున్నప్పటికీ వాళ్ళు ఫ్లాట్‌ఫారం మీదికి వెళ్ళగానే రైలు వచ్చి ఆగింది. ముగ్గురూ ఒక బోగీలోకి ఎక్కారు. అప్పుడు దభోల్కర్‌తో దీక్షిత్, "అన్నాసాహెబ్! చూడండి, బాబా ఎంతటి దయామయులో! మనం రాగానే రైలు అందేలా చేశారు. ఒక్క నిమిషమైనా మనల్ని వేచివుండనివ్వలేదు" అని అన్నాడు. తరువాత అతను తన జేబులో ఉన్న రైల్వే టైమ్‌టేబుల్ తీసి చూస్తూ, "బాబానే రైలు ఆలస్యంగా వచ్చేలా చేసి మనం సమయానికి అందుకునేలా చేశారు. లేకుంటే మనం కొలాబాలో దిగి వేరొక రైలుకోసం నిరీక్షిస్తూ నిరుత్సాహపడేవాళ్ళం. ఇదే సాయి దయ!" అని అన్నాడు. అన్నాసాహెబ్, కాకాసాహెబ్ ఎదురెదురుగా కూర్చున్న తరువాత ప్రేమపూర్వకమైన బాబా కరుణను గుర్తుచేసుకుంటూ కాకాసాహెబ్ కళ్ళు మూసుకున్నాడు. అంతలోనే దీక్షిత్ తూలుతున్నట్లు గమనించిన అన్నాసాహెబ్, బహుశా అతనికి నిద్రవస్తోందని తలచి, నిద్రలో అతని తల ప్రక్కకు వాలిపోకుండా తన భుజాన్ని ఆసరా ఇవ్వాలని భావించి దీక్షిత్ ప్రక్కకు వెళ్లి, "మీకు నిద్రొస్తోందా?" అని అడిగారు. దీక్షిత్ నుండి ఎటువంటి సమాధానమూ రాకపోవడంతో అతనికి స్పృహతప్పిందేమోనని భయపడి కాకాను బెర్తు మీద పడుకోబెట్టాడు అన్నాసాహెబ్. రైలు వేగంగా పరుగులు తీస్తోంది. అన్నాసాహెబ్ తన స్నేహితుడు టెండూల్కర్‌తో, "నేను వచ్చే స్టేషనులో దిగి గార్డుతో మాట్లాడతాను. మనం కాకాను క్రిందికి దించుదాం" అని చెప్పాడు. కానీ భారీవర్షం మరియు రద్దీ కారణంగా అన్నాసాహెబ్ బాంద్రాలో రైలు దిగలేకపోయాడు. తరువాత వచ్చిన మాహిమ్ స్టేషనులో దిగి గార్డుతో మాట్లాడి విషయం చెప్పాడు. వెంటనే గార్డు ఫోన్ చేసి పరేల్ స్టేషన్లో ఒక స్ట్రెచర్, డాక్టర్ సిద్ధంగా ఉండేలా ఏర్పాటు చేశాడు. తరువాత పరేల్ రాగానే కాకాసాహెబ్‌ని క్రిందికి దించారు. డాక్టర్ పరీక్షించి కాకాసాహెబ్ మరణించినట్లు నిర్ధారణ చేశాడు. ఆకస్మిక మరణమైనందున విచారణ జరుపకుండా శరీరాన్ని అప్పగించే పరిస్థితి లేదు. పైగా ఇంకెన్నో సమస్యలు తలెత్తే అవకాశముంది. అయినప్పటికీ అదృష్టవశాత్తూ ఆ డాక్టర్ దీక్షిత్ మరణ ధృవీకరణ పత్రంతో పాటు, దీక్షిత్ పార్థివదేహాన్ని కూడా అన్నాసాహెబ్‌కు అప్పగించారు. అటు తర్వాత దీక్షిత్ పార్థివదేహానికి అంత్యక్రియల ఏర్పాట్లు చేశాడు అన్నాసాహెబ్. ‘నా కాకాను విమానంలో తీసుకెళ్తామ’న్న తమ బాధ్యతను బాబా ఎలా నెరవేర్చారో ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం. దేహత్యాగానికి ముందు దీక్షిత్‌కి ఎటువంటి బాధా, భయమూ లేవు. తన దైవమైన సద్గురు సాయి కృపకు పరవశిస్తున్న క్షణంలో అతనికి మరణం ప్రాప్తించింది. అటువంటి మరణాన్ని పొందిన అతను గీతలో భగవానుడు చెప్పినట్లు సాయి సాయుజ్యాన్ని ఖచ్చితంగా పొందివుంటాడు. భక్తతుకారాం విమానంలో స్వర్గానికి తీసుకొని వెళ్ళబడటం ఒక చక్కని, ఆనందకరమైన, అద్భుతమైన ముగింపు. కానీ అది ఒక చమత్కారం. అయితే ఏ చమత్కారమూ లేకుండా బాబా తన కాకాకు ఎంతో ఉత్తమమైన ముగింపునిచ్చి తమ వాగ్దానాన్ని నెరవేర్చారు.

"భగవంతుడి ప్రతినిధులు అంతటా ఉన్నారు. వారికి విస్తారమైన శక్తులున్నాయి. నాకూ విస్తారమైన శక్తులున్నాయి" అని చెప్పిన బాబా, తాము ఆ శక్తులను ఎలా ఉపయోగిస్తున్నారో పేర్కొంటూ వివిధ సందర్భాలలో, "నువ్వు నిశ్చలంగా కూర్చో, అవసరమైనదంతా నేనే చేస్తాను. చివరికంటా నిన్ను గమ్యం చేరుస్తాను" అనీ, "ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాదిమందిని శుభ్రమార్గాన గమ్యం చేరుస్తాడు" అనీ, "మరణ సమయమున నా భక్తులను నేను నా వద్దకు లాక్కుంటాను” అనీ, “శిరిడీకి వేల మైళ్ళ దూరంలో ఉన్నా అంత్యకాలమందు నా భక్తులను నా వద్దకు లాక్కుంటాను" అనీ, "నేను నా భక్తుని నష్టపోనివ్వను” అనీ, “భగవంతుడు నాకప్పగించిన ప్రతిజీవినీ తిరిగి నేను ఆ భగవంతునికి అప్పగించాలి" అనీ చెప్పారు. అంతేకాదు, 1912, జనవరిలో మరణించిన ఉపాసనీ భార్యను ప్రస్తావిస్తూ బాబా, "ఆమె (ఆత్మరూపంలో) నా దగ్గరకు వచ్చింది" అని అన్నారు. "నేను రోహిల్లా పిష్యా మరియు రావుసాహెబ్ గాల్వంకర్‌లను వారి వారి తల్లుల గర్భంలో ఉంచాను" అని అన్నారు. మరణించిన రేగే బిడ్డ గురించి, "తను నా హృదయాన్ని చేరుకుంది. శాశ్వతంగా అక్కడే ఉంటుంది" అని చెప్పారు. దీనిని బట్టి సద్గతిని ప్రసాదించడమే బాబా కర్తవ్యమని అవగతమవుతుంది.

శ్రీవాసుదేవ సరస్వతి ఇలా చెప్పారు:

సంతపస్చి సదా జావే త్యాంచే జవాలి బైసావే
ఉపదేశ తే నా దేతి తారి ఐకవ్య త్యా గోష్ఠి
తేచి ఉపదేశ హోతి త్యాచి కష్ట నష్ట హోతి
వాసుదేవ హ్మణే శాంత సంగే కరీతి పాశంత

భావం: మనం సత్పురుషుల చెంతకు వెళ్లి వాళ్ళ సాంగత్యంలో ఉందాము. వాళ్ళు ఎటువంటి ఉపదేశం ఇవ్వకపోయినా వారి పెదవుల నుండి జాలువారే ప్రతి మాటనూ ఆలకిద్దాం. వారి ప్రతిమాటా ఉపదేశమవుతుంది. వారి ప్రభావంతో మన కష్టాలన్నీ సమసిపోతాయి. సత్సంగం వలన పరమసుఖం కలుగుతుంది.

ఇది దీక్షిత్‌కు మాత్రమే కాదు, బాబా దర్శనం కోసం శిరిడీ వెళ్లిన ప్రతి భక్తుని అనుభవం కూడా. బాబా ఎప్పుడూ ఎవరికీ ఎటువంటి ఉపదేశాన్ని ఇవ్వకపోయినా వారి ప్రతి మాట, చర్య పూర్తి బోధతో కూడుకొని స్ఫూర్తిదాయకంగా ఉండేవి. దీక్షిత్ 1909 నుండి 1918 వరకు తొమ్మిదేళ్ళ కాలంలో బాబా ప్రతి మాటను, చర్యను, కృత్యాన్ని అధ్యయనం చేశాడు. ఈ అధ్యయనం బాబాతో అతనికున్న వ్యక్తిగత అనుబంధానికి తోడు ప్రత్యేక సత్సంగమైంది. అలా అతను తన మది నిధిలో నిక్షిప్తం చేసుకున్న బాబా పలుకులను, చర్యలను 1923లో తాను ప్రారంభించిన శ్రీసాయిలీల మాసపత్రికలో 'మహరాజాంచే అనుభవ్', 'మహరాజాంచి బోధ్ పద్ధతి' మరియు 'మహరాజాంచి బోల్' అనే శీర్షిక క్రింద వ్యాసాలుగా ప్రచురించాడు. అంతేకాదు, దాదాపు శిరిడీ సందర్శించే ప్రతి భక్తుడూ దీక్షిత్‌ని కలసి తమ అనుభవాలను అతనితో పంచుకుంటూ ఉండేవారు. వాటిని కూడా సాయిలీల పత్రికలో ప్రచురించి సాయిబాబాకు, సాయి ఉద్యమానికి దీక్షిత్ చేసిన సేవ ఎనలేనిది.

సామాన్య భక్తులకు ఉపాసనీ మహరాజ్, కుశాభావు వంటి భక్తుల అనుభవాల కంటే దీక్షిత్ అనుభవాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ఎందుకంటే, దీక్షిత్ సద్గురువు, అతీతమైన ఆధ్యాత్మిక జీవితం వంటి వాటి ఛాయలే లేని సాధారణ న్యాయవాద జీవితాన్ని గడిపి, 45 ఏళ్ళు నిండిన తరువాత అపారమైన బాబా దయవల్ల మొదటి దర్శనంతోనే తనకు తాను తన సద్గురువైన సాయికి అప్పగించుకోగలిగాడు. ఫలితంగా తన పూర్తి బాధ్యత తమదన్న గొప్ప భరోసాను బాబా నుండి పొందాడు. ఆ హామీపై సంపూర్ణంగా ఆధారపడటం వలన శాంతి, నిశ్చలతను అనుభవించాడు. సద్గురువునందున్న పూర్ణమైన నిష్ఠ, సబూరీలతో తన ప్రాపంచిక, ఆధ్యాత్మిక వ్యవహారాలను కొనసాగిస్తూ అత్యంత ఉత్తమమైన జీవిత లక్ష్యాన్ని చేరుకోగలమన్న భరోసాను పొందాడు. చివరికి సద్గురువు తనను విమానంలో తీసుకొనిపోగా సంతోషకరమైన మరణాన్ని పొందాడు. మనలో చాలామంది లక్ష్యంగా పెట్టుకోవాల్సింది ఇదే. అయితే 1902-1918 మధ్యకాలంలో దీక్షిత్‌కు బాబాతో ఉన్న ప్రత్యక్ష అనుబంధం ఈనాడు మనకు లేదని ఎవరైనా అనవచ్చు. కానీ సాయిబాబా మరణించలేదు. ఆయన భగవంతుడు, ఆయనకు మరణంలేదు. కాలం సాయిని కనుమరుగు చేయలేదు, ఆచారం అనంతమైన ఆయన గొప్పతనాన్ని చప్పబరచలేదు. 

1918లో బాబా దేహత్యాగం చేసిన తరవాత వారి పార్థివదేహం ద్వారకామాయిలో ఉండగానే తెల్లవారితే బుధవారమనగా, షామా మేనమామయైన లక్ష్మణ్ మామా జోషీకి బాబా స్వప్నంలో కనిపించి, “త్వరగా లే! బాపూసాహెబ్ జోగ్ నేను మరణించాననుకొంటున్నాడు. అందువల్ల అతడు ఆరతి ఇవ్వడానికి రాడు. నీవు వచ్చి కాకడ ఆరతి ఇవ్వు!” అని ఆదేశించారు. (బాబా ఆ స్వప్నంలో చెప్పినట్లే ప్రతిరోజూ బాబాకు ఆరతులు నిర్వహించే జోగ్ బుధవారం ఉదయం కాకడ ఆరతి ఇవ్వడానికి రాలేదు! మసీదులో ఉన్న మౌల్వీలు ఎంత అభ్యంతరం పెడుతున్నా లెక్కచెయ్యకుండా లక్ష్మణ్ జోషీ బాబాకు కాకడ ఆరతి చేసి వెళ్ళిపోయాడు. ఆ విషయం తెలిసి జోగ్ మధ్యాహ్న ఆరతికి యథాప్రకారం వచ్చాడు.) అంతేకాదు, బాబా తరచూ, "నా సమాధి మాట్లాడుతుంది, సర్వస్య శరణుజొచ్చినవారి వెంటే తిరుగుతుంది. నేను నా సమాధి నుండి కూడా అప్రమత్తుడనై ఉంటాను. సమాధి చెందిన తరువాత కూడా నేను మీతో ఉంటాను. మీరు ఎక్కడున్నా నన్ను తలచుకున్న మరుక్షణం నేను మీతో ఉంటాను. ఎవరైనా నన్ను ప్రేమతో పిలిచిన వెంటనే నేను వారి ముందుంటాను. నా ప్రయాణానికి వాహనం అవసరం లేదు" అని చెప్తుండేవారు. కాబట్టి సాయిపై దృష్టి కేంద్రీకరించాలనే ధృఢమైన కోరిక, పట్టుదల ఉంటే గనక నేడు కూడా బాబా మాట వినవచ్చు, వారి సాంగత్యాన్ని పొందవచ్చు. అది కూడా ఎటువంటి అద్భుత చమత్కారాలు లేకుండా, వివిధ భాషలలో అందుబాటులోనున్న సాయి సాహిత్యాల అధ్యయనం, శ్రవణం, మననం, నిధిధ్యాసనం మొదలైన చాలా సాధారణ మార్గాల ద్వారా. ఇంకా ఆనాడు దీక్షిత్ చేసిన అదే పూజ, భజన, పవిత్ర గ్రంథాల పారాయణ, ధ్యానం నేడు కూడా మనం చేయవచ్చు. సాయిబాబాకు, సాయి సంస్థాన్‌కు 14 సంవత్సరాలపాటు ఆత్మసమర్పణ భావంతో సేవ చేసుకునే గొప్ప అవకాశాన్ని, సామర్థ్యాన్ని దీక్షిత్ కలిగి ఉన్నాడనడంలో సందేహం లేదు. అయితే అలాంటి సేవ ఇప్పుడు కూడా చాలామందికి వారి వారి శక్తిసామర్థ్యాలు, అవసరాలననుసరించి అందుబాటులో ఉంది. ముఖ్యంగా దీక్షిత్‌ను సాయి అధీనంలో స్థిరంగా ఉంచిన రెండు ప్రధానాంశాలైన 'సాయి సేవ, సాయి ధ్యానం' ఇప్పటికీ మన అందరి అందుబాటులో ఉన్నాయి. అయితే బాబాపై మరింత సమర్థవంతంగా ఏకాగ్రదృష్టి నిలిపేందుకు దీక్షిత్‌కు బాబా విధించిన తొమ్మిది నెలల ఏకాంతవాసం ఉందని అనవచ్చు. కానీ అటువంటి ఏకాంతవాసం చేస్తామంటే, ఏకాగ్రదృష్టి నిలుపుతామంటే ఎవరు మనల్ని అడ్డుకుంటారు? కొందరు, ‘సాయిబాబా భౌతికదేహంతో ఉండి, అన్ని బాధ్యతలు తీసుకొని అన్నివిధాలా దీక్షిత్ కిచ్చిన రక్షణ కంటే అధిక రక్షణను నేడు బాబా మనకి ఇవ్వగలరా?’ అని అనుకోవచ్చు. కానీ ఆ అభిప్రాయం తప్పు. బాబా దేహత్యాగం చేసిన తరువాత కూడా 1918 నుండి 1926 వరకు దీక్షిత్ బాబా రక్షణను పొందాడు. ఇదివరకు చెప్పుకున్న 30,000 రూపాయల ఋణాన్ని తీర్చిన ఉదంతాన్ని ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. అయినప్పటికీ ‘ఈ విధంగా బాబా తమకు రక్షణ కల్పిస్తారా?’ అని అజ్ఞానులు, చెడు మనస్తత్వం గలవారు మాత్రమే క్షణక్షణం అనుమానపడుతూ ఉంటారు. ఇలా సందేహించడమంటే, "సమాధి అనంతరం కూడా మీరు నన్ను తలచుకున్న మరుక్షణం ఏ ప్రదేశంలోనైనా నేను మీతో ఉంటాను" అని చెప్పిన బాబాయందు, వారి బోధనల యందు విశ్వాసం లేకపోవడమే! కాస్త శ్రమ తీసుకొని ఉత్సుకతతో 1918 తరువాత భక్తులు పొందిన అనుభవాలను చదివితే, 1918కి ముందు ఉన్నట్లే నేడు కూడా బాబా రక్షణ ఖచ్చితంగా ఉందని రూడి అవుతుంది. దీక్షిత్ గురించి జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, చాలామంది తమ జీవితాలను సరిగ్గా దీక్షిత్ జీవించిన మార్గంలో నడుపుకోగలిగే వీలు కల్పించుకోగలుగుతారు, రోజురోజుకీ విశ్వాసం, సహనం మరింతగా వృద్ధిపరచుకుంటారు. వారి సహనం దీక్షిత్ చెప్పిన సంతృప్తి అనే సూత్రం మీద ఆధారపడి ఉంటుంది (‘ఠేవిలే అనంతే తైసేచ్ రహావే’ - అంటే భగవంతుడు మనకు కేటాయించిన దానితో సంతృప్తి చెందాలని). కాబట్టి దీక్షిత్ కనబరిచిన అదే విశ్వాసం, అదే శరణాగతుల ద్వారా మనలో ప్రతి ఒక్కరూ సద్గురు సాయి నుండి దీక్షిత్ పొందినటువంటి అభయాన్ని పొందవచ్చు. పర్యవసానంగా నిర్భయత్వాన్ని, ప్రశాంతతను, దీక్షిత్ పొందినటువంటి సంతోషకరమైన మరణాన్ని నిశ్చయంగా పొందవచ్చు.

రాస్నే, ధుమాళ్, ఎమ్.బి.రేగే మొదలైన చాలామంది, ఇంకా ఇప్పుడు కూడా మనలో చాలామంది తమను సంరక్షించే దైవమైన సాయి దయ, జాగరూకతల యొక్క ప్రయోజనాలను తమ రోజువారీ వ్యవహారాలలో అనుభూతి చెందుతూ, తాము బాబాకు చెందినవారమనీ, ‘నా భక్తుల యోగక్షేమాలకు నేనే బాధ్యత వహిస్తాన’న్న తమ వాగ్దానాన్ని బాబా నిలుపుకుంటున్నారనీ మనకు భరోసా ఇస్తున్నారు. ఇదంతా విశ్వాసానికి సంబంధించినది. విశ్వాసం దృఢంగా ఉన్నట్లయితే ఫలితం త్వరగా లభిస్తుంది, అపారమైన బాబా రక్షణను ఆస్వాదించాలనే భావన ఏర్పడుతుంది మరియు మానసిక ప్రశాంతత, సంతోషం చేకూరుతాయి.

షేక్‌స్పియర్ రచించిన హామ్లెట్ లేదా కాళిదాస శకుంతల వంటి క్లాసిక్ రచనలు పదేపదే చదువుతుంటే క్రొత్త అర్థాలు మరియు క్రొత్త అందాలు వెల్లడవుతాయి. అలాగే బాబా జీవితం, వారి బోధనలు, చర్యల గురించి చదవటంలో శ్రద్ధను పెంపొందించుకుంటే క్రొత్త అర్థాలు, క్రొత్త అన్వయాలు మరియు మనల్ని మనం మార్చుకోవడానికి, బాబాను సేవించడానికి క్రొత్త అవకాశాలు తెలుస్తాయి. సాయి ప్రేమ, వారి బోధనలలో నిత్య తాజాదనం విశ్వాసాన్ని దృఢపరుస్తుంది.

సమాప్తం...

source: సాయిపథం - ప్రధమ సంపుటము,
లైఫ్ అఫ్ సాయిబాబా by బి.వి.నరసింహస్వామి
రిఫరెన్స్: దీక్షిత్ డైరీ బై విజయకిషోర్.

  ముందు భాగం కోసం బాబా పాదుకలు తాకండి. 


సాయిభక్తుల అనుభవమాలిక 755వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. సాయినాథుడే రక్ష
  2. అంతా బాబా దయ

సాయినాథుడే రక్ష


సాయిభక్తుడు కృష్ణ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని, తన అభిప్రాయాలను మనతో పంచుకుంటున్నారు.


ఓం శ్రీ సాయినాథాయ నమః. నా పరాత్పర గురువైన సాయినాథుని పాదపద్మములకు నమస్కరిస్తూ, సాయినాథుడు చూపిన మరో మహత్యాన్ని వివరిస్తున్నాను. నా పేరు కృష్ణ. కొన్ని రోజుల క్రితం వికారంతో వాంతులవటం, ఆహారం సహించకపోవడం, నీరసం మొదలైన లక్షణాలతో మా అమ్మగారు బాధపడ్డారు. నా స్నేహితుడు ఒక వైద్యుడు. నేను కూడా వైద్యసంబంధమైన వృత్తిలోనే ఉన్నాను. నా స్నేహితుడు మా అమ్మకి వైద్యం చేస్తున్నాడు. కానీ నేనెప్పుడూ నా స్నేహితుడు వైద్యం చేస్తున్నాడని అనుకోను, నా స్నేహితుని ద్వారా ఆ సాయినాథుడే వైద్యం చేస్తున్నాడని ప్రగాఢంగా విశ్వసిస్తాను. అది నిజం కూడా. నేను ఎన్నో సందర్భాల్లో దీన్ని అనుభవించాను. వైద్యం జరుగుతున్నప్పటికీ రెండు మూడు రోజులైనా అమ్మ ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పూ రావటం లేదు. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఎంతో భయంతో చాలా దారుణంగా ఉండేది నా పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ సాయినాథుని దయవల్ల నేను చాలా ప్రశాంతంగానూ, ఆయన మీద పూర్తి విశ్వాసంతో ధైర్యంగానూ ఉండగలుగుతున్నాను. బాబా మా అమ్మను ఖచ్చితంగా కాపాడుతారని నాకు తెలుసు. వైద్యంతో పాటు అమ్మకు బాబా ఊదీ కూడా ఇస్తున్నాను. నాలుగు రోజుల తరువాత అమ్మ ఆరోగ్య పరిస్థితిలో కొద్దిగా కొద్దిగా మార్పురావడం మొదలుపెట్టి క్రమంగా ఆరోగ్యం చేకూరుతోంది. ఏప్రిల్ 4వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు కొద్దిగా నలతగా ఉన్న అమ్మ ఆరోగ్యం ఏడు గంటల తర్వాత ఉన్నట్టుండి సాధారణస్థితికి వచ్చేసింది. వికారం పోయి బాగా ఆకలి వేసింది. ఆహారం తీసుకుంటే వాంతి రావటం లేదు. సాయినాథుని దయవల్ల అమ్మ చక్కగా నార్మల్ అయిపోయారు


అయితే, అందరికీ ఒకటి అనిపించవచ్చు, ‘అది ముందే జరగవచ్చు కదా’ అని. కానీ, నాకు తెలిసినంతవరకు నాలాంటివాళ్ళు ఎన్నోరకాల ప్రారబ్ధకర్మలతో ఉంటారు. నిజానికి మనం ఈ కర్మలను కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని నెలలపాటు, కొన్ని రోజుల పాటు అనుభవించవలసి ఉంటుంది. కానీ మన పరాత్పరుడైన సాయినాథుడు ఎంతో దయతో మనం సంవత్సరం పాటు అనుభవించాల్సిన కర్మలను కేవలం కొన్ని రోజుల పాటు, కొన్ని రోజుల పాటు అనుభవించాల్సిన వాటిని కేవలం కొన్ని గంటలు మాత్రమే అనుభవించేలా చేసి వాటిని తొలగిస్తారు. కొన్ని సందర్భాల్లో ఆ సాయినాథుడు మనకు ఏ కష్టం రాకుండా స్వప్నావస్థలోనే ఈ ప్రారబ్ధకర్మలను పూర్తిగా పోగొట్టి మనకు సరైన దారి చూపిస్తూ ఉంటారు. ఇది నా జీవితంలో ఎన్నోసార్లు పొందినటువంటి అనుభవం. నాకు తెలిసినంతవరకు ఆ పరాత్పరుడైన సాయినాథుని శరణు వేడడం తప్ప మనకు వేరే మార్గం లేదు. బాబాను పట్టుకుందామనుకుంటే ఆయన కృష్ణునిలాగా పారిపోతారు. ఆయనను పట్టుకోవడం మన వల్ల కాని పని, కేవలం శరణాగతి ఒక్కటే మనం చేయవలసింది. రెండు చేతులూ జోడించి, “నాకు మీరే దిక్కు” అని వేడుకుంటే, మన దగ్గరకు వచ్చి మనలను పూర్తిగా దగ్గరకు తీసుకొని అనంతమైన తన ప్రేమను పంచుతారు. ఇది నా స్వానుభవం. రెండు చేతులూ జోడించి శరణాగతి పొందడం ఒక్కటే మార్గం. అయితే, ఈ శరణాగతిగానీ, శ్రద్ధ-సబూరి గానీ, ఆయన మీద భక్తిగానీ మనకు ప్రసాదించమని మళ్ళీ తిరిగి ఆయననే వేడుకోవాలి తప్ప నాకు తెలిసినంతవరకు వేరే మార్గం లేదు. “నాకు మీయందు భక్తి కలగాలి, నాకు మీయందు నమ్మకం ఉండాలి, నేను మిమ్మల్ని విశ్వసించాలి, మీ పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి” అని బాబాను మనసారా వేడుకోవాలి. అన్నీ ఆయనే ప్రసాదిస్తారు. ఆయన తప్ప వేరేవాళ్ళెవరూ చేయలేరు. ఇది నా స్వానుభవం మరియు అభిప్రాయం. ఏది ఏమైనా మనలను రక్షించేది, కాపాడేది ఆ సాయినాథుడే. కాస్త ఆలస్యమైనప్పటికీ బాబా మనలను ఖచ్చితంగా కాపాడతారు. మా ఇంటిలోని వారందరినీ ఆ సాయినాథుడు ఎల్లవేళలా అనుక్షణం వెన్నంటి ఉండి కాపాడుతూ ఉన్నారు, సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూరుస్తున్నారు. మాకు ఆ సాయినాథుడే రక్ష.


అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన, రక్ష రక్ష సాయినాథ!


అంతా బాబా దయ


సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు నికిత. నేను ఇంతకుముందు నా అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకున్నాను. మళ్ళీ ఇంత త్వరగా బాబా ప్రసాదించిన మరో అనుభవంతో మీ ముందుకు వస్తానని నేను అనుకోలేదు. అంతా బాబా దయ.


మా అక్క, బావల మధ్య చాలా గొడవలు వచ్చాయి. దానివలన మా అక్క ఎంతో బాధపడినప్పటికీ తన అత్తగారింట్లో గొడవల గురించి తను మాకు ఏనాడూ చెప్పలేదు. ఒక్కసారిగా ఆ విషయాలు తెలిసేసరికి మేము చాలా బాధపడ్డాము. ఆ బాధతో అమ్మ, నాన్న అస్సలు నిద్రపోలేదు. నేను మాత్రం, "గొడవలన్నీ సర్దుకునేలా చేయమ"ని సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించాను. తరువాత నేను మొబైల్లో ఇన్‌స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు, "ఒక గంటలో అంతా సద్దుమణుగుతుంది" అని బాబా మెసేజ్ నా కంటపడింది. బాబా చెప్పినట్లే గొడవలన్నీ సద్దుమణిగాయి. ఇప్పుడు అందరం చాలా సంతోషంగా ఉన్నాము. అంతా బాబా దయ. బాబా ఆశీస్సులతో ఇప్పుడు మా అక్క గర్భవతి. "థాంక్యూ బాబా. మీ దయవలన అక్కకి సాధారణ కాన్పు జరగాలని కోరుకుంటున్నాను".


మరొక అనుభవం:


నేనొకసారి నా స్నేహితురాలి అన్నయ్యను కలవాలని అనుకున్నాను. ఆ విషయమై నేను మూడు వారాలుగా అడుగుతున్నప్పటికీ మా అమ్మానాన్నలు ఒప్పుకోలేదు. అప్పుడు నేను, "మా అమ్మానాన్నల మనసు మార్చి, నేను వెళ్ళడానికి అనుమతించేలా చేయమ"ని బాబాను ప్రార్థించాను. ఆశ్చర్యం! బాబాను ప్రార్థించిన అయిదు నిమిషాల్లో అమ్మ నన్ను వెళ్ళమని చెప్పింది. నాన్న కూడా ఒప్పుకున్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించి బాబాకు మనసారా ధన్యవాదాలు చెప్పుకున్నాను. 


మరొక అనుభవం:


ఒక అంకుల్ ద్వారా నాకు బాబా పరిచయమయ్యారు. ఆ అంకుల్‌కి బాబా అంటే చాలా ఇష్టం. ఒకసారి నాకు కలలో ఆ అంకుల్ ఏడుస్తూ కనిపించారు. నాకు ఏమీ అర్థం కాలేదు. ‘అంతా బాబా చూసుకుంటారులే’ అని ఊరుకున్నాను. కానీ, 'అంకుల్ కరోనా సమయంలో చాలా భయపడిపోయార'ని నాకు తరువాత తెలిసింది. ప్రస్తుతం బాబా దయవలన అంకుల్ బాగానే ఉన్నారు. "థాంక్యూ బాబా".



సాయిభక్తుల అనుభవమాలిక 754వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా అనుగ్రహాశీస్సులు
  2. ఊదీతో చేకూరిన ఆరోగ్యం


బాబా అనుగ్రహాశీస్సులు


సాయిబంధువులకు నమస్కారం. సాయిభక్తులకు, బ్లాగ్ నిర్వాహకులకు నా అభినందనలు. "సాయిబాబా! ఎల్లవేళలా నీడలా నాతో ఉండండి. నేను ఎలాంటి తప్పుడు పనులు చేయకుండా నా చేయి పట్టుకొని నన్ను ఆపండి. సదా మాతో ఉండి మమ్మల్ని ఆశీర్వదించండి బాబా".


నా పేరు విజయ. నేను ఢిల్లీలో నివాసముంటున్నాను. నేనిప్పుడు నా అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇదివరకు నేను నొప్పులతో ఎంతో బాధపడుతూ ఇంటిపనులు చేసేందుకు ఆసక్తి చూపలేకపోయేదాన్ని. మా అత్తగారితో, నా భర్తతో నాకున్న చేదు అనుభవాల వలన నాలో చికాకు, ప్రతికూల భావనలు ఉండేవి. సాయిబాబా మహాపారాయణ ప్రారంభించినప్పటినుండి నా కోపం అదుపులోకి వచ్చింది. అంతేకాదు, అతి తక్కువ సమయంలోనే నేను నా పనులన్నీ చక్కగా చేసుకోగలుగుతున్నాను. ఇంకా కొన్ని సమస్యలున్నప్పటికీ డాక్టర్లను సంప్రదించాల్సిన అవసరం లేకుండా బాబా నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. ఆయన ఊదీ అత్యంత అద్భుతమైనది. నేను ఎప్పుడూ నా బాధను, చేదు అనుభవాలను బాబాతో చెప్పుకుంటాను. ఆయన నుండి నాకు సమాధానం కూడా లభిస్తుంది. ఒకసారి నా సోదరి వసుంధరకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు, బాబాకు చెప్పుకున్నాను. ఆయన దయవల్ల ఇప్పుడు నా సోదరి ఆరోగ్యంగా ఉంది.


మరో అనుభవం:


ఇటీవల మా అబ్బాయి పవన్ చైతన్య తన 9వ తరగతి పరీక్షలు వ్రాసి ఇంటికొచ్చాక, "అమ్మా! నాకు లెక్కల్లో 58%, సైన్సులో 60% వస్తాయి. దయచేసి నాకు మంచి రిజల్ట్ వచ్చేలా అనుగ్రహించమని బాబాను ప్రార్థించు" అని చెప్పాడు. ఎందుకంటే, బాబా ఆశీస్సులతో గత సంవత్సరం వరకు తనకు ఎప్పుడూ మొదటి ర్యాంకు వస్తుండేది. నేను ప్రతిరోజూ సాయి సచ్చరిత్రలో ఒక అధ్యాయం చదివి, "దయచేసి నా బిడ్డను చూసుకోండి" అని బాబాను ప్రార్థించేదాన్ని. 2021, ఏప్రిల్ 3న ఫలితాలు వెలువడతాయనగా ముందురోజు నేను, "బాబా! రేపు ఫలితాలు వెలువడనున్నాయి. దయచేసి నన్ను నిరాశపరచవద్దు" అని బాబాతో చెప్పుకున్నాను. మరుసటిరోజు ఉదయం గం. 9-40 ని.లకు మేము మా అబ్బాయి చదివే స్కూలుకి వెళ్ళాము. నా కొడుకుని చూసి తన క్లాసు టీచర్ సంతోషంగా, "పవన్! నీకు నా హృదయపూర్వక అభినందనలు. నువ్వు మొదటి ర్యాంక్ సాధించావు. గుడ్, ఎప్పుడూ ఇలాగే కొనసాగించు" అని చెప్పారు. అది విని నాకు నోటమాట రాలేదు. ఎంతో ఆనందంగా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నేను కొన్ని విషయాల గురించి బాబాను ప్రార్థించాను. ఆయన ఆశీస్సులతో అవి నెరవేరగానే ఆ అనుభవాలను కూడా నేను మీ అందరితో పంచుకుంటాను. "బాబా! దయచేసి మీ ఆశీస్సులు ఇలాగే మాపై కురిపించండి. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను, 'ప్రస్తుత కరోనా పరిస్థితికి ప్రజలంతా భయపడుతున్నారు. దీనినుండి రక్షించగలిగేది మీరు మాత్రమే. నాడు కలరాను నిర్మూలించినట్లు దయచేసి ఈ కరోనాను కూడా నిర్మూలించండి బాబా. ఎప్పుడూ మాతో ఉంటూ మాకు హితం చెప్పండి. మేము చెడుమార్గంలో వెళ్తున్నప్పుడల్లా మా చేయి పట్టుకొని ఆపి మంచిపనులు చేసేలా సూచించండి".


ఊదీతో చేకూరిన ఆరోగ్యం


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా ధన్యవాదాలు. తోటి సాయిభక్తుల అనుభవాలు చదువుతుంటే ఒక రకమైన ఆనందాన్ని అనుభూతి చెందుతున్నాను. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకోబోతున్నాను.


మొదటి అనుభవం:


ఒకసారి నాకు కుడిచేయి చాలా నొప్పిగా అనిపించింది. అదే తగ్గుతుందిలే అని నేను దాని గురించి అంతగా పట్టించుకోలేదు. కానీ రెండు రోజుల తర్వాత నా ఛాతీ భాగంలో గడ్డలా గట్టిగా ఉండి బాగా నొప్పిగా అనిపించింది. దాంతో నాకు చాలా భయం వేసింది. ఆ భయం వలన ఎన్నో అనుమానాలు నన్ను చుట్టుముట్టాయి. అప్పుడు నేను బాబాకు నమస్కరించి, "బాబా! నాకు నువ్వే దిక్కు" అని ప్రార్థించి, గడ్డలు, నొప్పి ఉన్న ప్రాంతంలో ఊదీ రాశాను. తరువాత, "మీ దయవలన నాకు నయమైతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకు మ్రొక్కుకున్నాను. నాలుగు రోజులపాటు క్రమం తప్పకుండా బాబా ఊదీ రాసేసరికి బాబా దయవలన గడ్డలు తగ్గిపోయాయి. "ఇదంతా మీ దయే బాబా. మీకు శతకోటి ధన్యవాదాలు. నా చెయ్యినొప్పి కూడా మీరే తగ్గిస్తారని నమ్ముతున్నాను తండ్రీ!”

 

రెండవ అనుభవం:


ఒకరోజు రాత్రి గ్యాస్ట్రిక్ సమస్య బాగా ఎక్కువై నిద్రపట్టక నేను చాలా బాధపడ్డాను. వెంటనే బాబా ఊదీ నీళ్ళలో కలుపుకొని త్రాగి, "నా ఈ బాధ తగ్గితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని మ్రొక్కుకున్నాను. వెంటనే గ్యాస్ట్రిక్ సమస్య తగ్గిపోయి నాకు చక్కగా నిద్రపట్టేసింది. "థాంక్యూ బాబా. నా అనారోగ్య సమస్యలన్నీ పటాపంచలయ్యేలా అనుగ్రహించు తండ్రీ. నా మనసులో ఉన్న పెద్ద కోరిక మీకు తెలుసు. అది వెంటనే నెరవేరేటట్లు అనుగ్రహించండి బాబా".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo