సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 732వ భాగం....




ఈ భాగంలో అనుభవం:
  • దూరమయ్యాననుకున్న బిడ్డను దగ్గరకు తీసుకుని అమితంగా ఆశీర్వదించిన బాబా

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలను మనతో ఇలా పంచుకుంటున్నారు:


సాయిభక్తులందరికీ నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయిభక్తులకు బాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. బ్లాగులో మీరు ప్రచురించే బాబా లీలలు మాలో బాబాపట్ల ప్రేమ, విశ్వాసం పెంపొందేలా సహాయం చేస్తూ బాబాతో మమ్మల్ని అనుసంధామయ్యేలా చేస్తున్నాయి. నేను బాబా ప్రేమను చాలా పొందాను. ఇదివరకు నా అనుభవాలను కొన్నింటిని ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు నాకు బాబాపై దృఢమైన విశ్వాసం లేనప్పుడు ఆయన నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను వారి ఆశీస్సులతో మీతో పంచుకోవాలనుకుంటున్నాను.


కోల్పోయిన విశ్వాసాన్ని పునరుద్ధరించిన బాబా:


నవంబరు 2019 వరకు నాకు బాబాపై అంతులేని విశ్వాసం ఉండేది. ఎప్పుడూ ఆయన గురించే ఆలోచిస్తూ ఉండేదాన్ని. కానీ హఠాత్తుగా ఏమీ కలిసిరాక నా పరిస్థితి బాగా దిగజారిపోయింది. వివరాలలోకి వెళితే, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల 2019, ఫిబ్రవరిలో నేను నా ఉద్యోగాన్ని వదిలేసి నాకు సరిపడా ఉద్యోగావకాశాలు లేని వేరే నగరానికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. 2019 డిసెంబరు నాటికి ఆర్థికంగా మరియు వ్యక్తిగతంగా నా పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. ఏదీ నాకు అనుకూలంగా జరిగేది కాదు. ఆ పరిస్థితులను ఎదుర్కొనే శక్తి నాకు లేకుండా పోయింది. అటువంటి పరిస్థితుల మధ్య నేను బాబాపై విశ్వాసం కోల్పోయాను. ఆయన గురించి ఆలోచించడం, ప్రార్థించడం మానేశాను. కానీ బాబా మాత్రం నన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. నేను ఆయనను ప్రార్థించకపోయినా మహాపారాయణ ద్వారా నేను సచ్చరిత్ర చదివేలా చేశారు. అలా సుమారు 4, 5 నెలలు నేను కేవలం మహాపారాయణ చేస్తుండేదాన్ని. 2020, ఫిబ్రవరిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాకు ఒక ఉద్యోగం వచ్చింది. అది ఖచ్చితంగా బాబా నాపై కురిపించిన అనుగ్రహమే. కానీ నేను బాబాకు దూరంగా ఉన్నందున ఏ విషయంలోనైనా సాధారణంగా బాబాను అడిగి నిర్ణయం తీసుకునే నేను ఆసారి ఆయనను అడగకుండా నా స్వంత నిర్ణయం తీసుకుని కంపెనీలో చేరాను. ఉద్యోగం వచ్చినప్పటికీ నేను అంత సంతోషంగా లేను. అలా రోజులు గడుస్తుండగా ఒకానొక సమయంలో బాబాకు దూరంగా ఉండటం నాకు చాలా బాధాకరంగా తోచి, 'బాబా లేకుండా నేను జీవించలేననీ, ఆయనకు దూరంగా ఉండటం నావల్ల కాద'ని గ్రహించాను. దాంతో మళ్ళీ బాబాకు దగ్గరయ్యాను. అయితే ఉద్యోగంలో నేను చాలా సమస్యలను ఎదుర్కోవడం వలన 8 నెలల్లోనే ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టాను. బాబాను సంప్రదించకుండా నా స్వంత నిర్ణయం వల్లే అలా జరిగిందని నేను నమ్ముతున్నాను. బాబాను విశ్వసించడం మానేసిన మూర్ఖురాలిని నేను. కానీ ఒక్కక్షణం కూడా బాబా నన్ను విడిచిపెట్టలేదు. "బాబా! నా తప్పులను మన్నించి నన్ను జాగ్రత్తగా చూసుకోండి".


నవగురువార వ్రత సమయంలో నేను అనుభవించిన బాబా లీలలు:


నేను కొంతకాలం బాబాకు దూరమై మళ్ళీ ఆయనకు దగ్గరైనప్పటికీ నా పనుల కారణంగా ఆయన ధ్యాసలో ఎక్కువ సమయం గడపలేకపోయాను. ఉద్యోగం మానేశాక నాకు తగిన సమయం దొరికి 2021, జనవరిలో నేను నవగురువార వ్రతాన్ని ప్రారంభించాను. వ్రతం ప్రారంభించేటప్పుడు నేను బాబాను ఏ కోరికా కోరుకోలేదు. కేవలం బాబా స్మరణలో ఉంటూ ఆయన ప్రేమలో మునిగిపోవాలనుకున్నాను. వ్రతం సమయంలో నేను గురువారంనాడు బాబా మందిరానికి వెళ్లి మధ్యాహ్న ఆరతికి హాజరై స్వీట్లు పంచిపెడుతుండేదాన్ని. ఒక గురువారంనాడు స్వీట్ తయారుచేయడానికి నాకు చాలా సమయం పట్టింది. నిజానికి ఆ స్వీట్ తయారీ చాలా తేలికైనదైనప్పటికీ ఎందుకనో ఆరోజు చాలా సమయం పట్టింది. దాంతో ఆరతి సమయం అయిపోవచ్చింది. నాకు చాలా బాధగా అనిపించినప్పటికీ అది బాబా నిర్ణయం అని సరిపెట్టుకున్నాను. నేను బాబా మందిరానికి వెళ్లేసరికి గం.12.15ని. అయింది. ఆశ్చర్యం! ఇంకా ఆరతి మొదలు కాలేదు. పూజారి వాహనపూజలో నిమగ్నమై ఉన్నారు. అందువలన ఆరతి కాస్త ఆలస్యంగా ప్రారంభించబడింది. నేను వచ్చిన తరువాతే ఆరతి ప్రారంభమయ్యేలా బాబా చేశారని ఆనందంతో కన్నీళ్లపర్యంతమయ్యాను. అంతేకాదు, బాబా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి నన్ను చాలా సంతోషపెట్టారు. ఆకుపచ్చ రంగు దుస్తుల్లో బాబా దర్శనం నాకు చాలా ఇష్టం. బాబా ఎప్పుడు నన్ను ఆశీర్వదించినా, భరోసా ఇచ్చినా ఆయన ఖచ్చితంగా ఆకుపచ్చ రంగు దుస్తుల్లో ఉంటారు. ఆరోజు నేను పొందిన ఆనందాన్ని మాటల్లో వ్యక్తపరచలేకపోతున్నాను. నా వ్రత సమాప్తి రోజు బాబా నన్ను మరొక లీలతో ఆశీర్వదించారు.


ఆరోజు కూడా మా ఇంట్లో పూజకు హాజరైన కొద్దిమంది అతిథుల వలన ఆరతికి వెళ్ళడానికి నాకు ఆలస్యమైంది. అదీగాక, మందిరంలో పంపిణీ చేయడానికి వ్రత పుస్తకాలు కొనాల్సి ఉంది. అయితే ఆలస్యమైనందున పుస్తకాలు కొనకుండా అప్పటికే నా వద్ద ఉన్న  కేవలం 5 పుస్తకాలను పంపిణీ చేద్దామని అనుకున్నాను. కానీ అలా చేయడం నాకంత తృప్తిగా అనిపించలేదు. అందువల్ల 'ఇంకా పుస్తకాలు కొనాలా? లేక ఈ 5 పుస్తకాలే పంపిణీ చేయాలా?' అని బాబాను అడిగాను. 'పుస్తకాలు కొనమ'ని బాబా సమాధానం వచ్చింది. ఇక బాబాపై భారం వేసి గం.11.40ని.కి నేను ఇంటినుండి బయలుదేరాను. అయితే నాకు ఒక్క ఆటో కూడా దొరకలేదు. అంతలో అదృష్టవశాత్తూ నా కజిన్ నన్ను కలిశాడు. అతను నన్ను ఆటోస్టాండ్‌ వద్ద దించాడు. నేను మార్కెట్‌కు వెళ్లి పుస్తకాల దుకాణానికి వెళ్ళాను. అప్పటికి గం.11.55 నిమిషాలైంది. వ్రత సమాప్తి రోజు నేను ఆరతికి ఆలస్యం అవుతున్నాని లోలోపల ఆందోళన చెందుతున్నాను. పుస్తకాలు తీసుకున్నాక ఆ దుకాణం యజమాని నన్ను కాసేపు వేచి ఉండమని అన్నారు. బాబా అనుగ్రహాన్ని ఊహించగలరా! ఆ దుకాణం యజమాని నాకు శిరిడీ ప్రసాదం ఇచ్చాడు. అది చూడగానే నాకు కన్నీళ్లు ఆగలేదు. కానీ అది బహిరంగ ప్రదేశమైనందున నన్ను నేను నియంత్రించుకున్నాను. కోవిడ్ కారణంగా శిరిడీ వెళ్లలేక, శిరిడీ దర్శన భాగ్యం కోసం ఎదురుచూస్తున్న నన్ను వ్రత సమాప్తి రోజున శిరిడీ ప్రసాదంతో బాబా ఆశీర్వదించారు. ఇంకా పుస్తకాలు కొనమని బాబా ఎందుకు సమాధానమిచ్చారో నాకు అప్పుడు అర్థమైంది. ఆయన నన్ను ఇంతలా ఆశీర్వదించాలనుకున్నారు. ఈ ఆనందాన్ని ఇంతకంటే ఎలా వ్యక్తపరచాలో నాకు తెలియడం లేదు. బాబా నుండి దూరమైన నన్ను కరుణామయుడైన బాబా అంతలా ఆశీర్వదించారు. మనం బాబా బిడ్డలం. మన తల్లిదండ్రుల వలె బాబా కూడా మన తప్పులను లెక్కించక సరైన దారిలో నడిచేలా చేస్తారు. తరువాత నేను ఆటో ఎక్కి సుమారు గం.12.10 నిమిషాలకి మందిరానికి చేరుకున్నాను. సరిగ్గా అప్పుడే ఆరతి ప్రారంభమైంది. అలా నేను ఆరతికి హాజరవడం తప్పిపోకుండా చూడటమే కాకుండా మళ్ళీ ఆకుపచ్చ రంగు దుస్తుల్లో దర్శనమిచ్చి నన్ను ఆశీర్వదించారు బాబా. బాబా ఎంత గొప్పవారు! మనల్ని ప్రేమించడానికి, ఆశీర్వదించడానికి బాబాకు తమవంటూ తమవైన ప్రత్యేక మార్గాలుంటాయి.


బాబా అనుగ్రహించిన అద్భుత వరం - ఉద్యోగం:


నేను 2020, నవంబరులో ఉద్యోగం మానేశాను. తరువాత నేను బాబా సూచన మేరకు తీవ్రంగా ఉద్యోగ ప్రయత్నాలు చేయలేదు. వ్రత సమయంలో ఒక గురువారంనాడు నాకొక బహుళజాతి సంస్థ నుండి కాల్ రాగా నేను ఇంటర్వ్యూకి హాజరయ్యాను. మరుసటి గురువారం నాకు రెండవ రౌండుకి కాల్ వచ్చింది. అయితే, రెండవ రౌండు ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళనుండి నాకెటువంటి సమాచారమూ లేదు. ఆ సమాచారం గురువారం వస్తుందని నేను ఆశించాను. అదేరోజు నేను ఆరతికి ఆలస్యం కావడం, ఆకుపచ్చరంగు దుస్తుల్లో బాబా దర్శనం ఇవ్వడం జరిగింది. అలా బాబా ఆశీర్వదించాక, ఇంటర్వ్యూ విషయంలో ఫలితం ఏదైనా దాన్ని నేను సంతోషంగా స్వీకరించాలని నిర్ణయించుకున్నాను. అయితే ఆ సంస్థ నుండి ఇప్పటికీ నాకు ఏ సమాచారమూ అందలేదు. ఏదైనా నా మంచికే అనుకుని దానిగురించి పెద్దగా ఆలోచించలేదు. కానీ ఉద్యోగ విషయంలో నాకెప్పుడూ కష్టాలే. పనిచేసే చోట నాకు సత్సంబంధాలు ఉన్నప్పటికీ అక్కడుండే రాజకీయాల కారణంగా ఉద్యోగాన్ని వదులుకోవాల్సి రావడం, పలుమార్లు ఇంటర్వ్యూలకు హాజరవడం, వాళ్ళు తిరస్కరించడం.. అవన్నీ నాకెంతో బాధాకరంగా అనిపించి చాలా నిరుత్సాహపడి, 'ఇంటర్వ్యూ ప్రక్రియ లేకుండా నేను ఉద్యోగాన్ని పొందలేనా?' అని అనుకున్నాను. కానీ అంతా బాబాకే వదిలేశాను. మార్చి మొదటివారంలో నా వ్రతం పూర్తవుతూనే పెండింగులో ఉన్న విషయాలన్నిటిలో కదలిక మొదలైంది. నేను అదివరకు పనిచేసిన పాత సంస్థ వాళ్ళు ఫోన్ చేసి ఎటువంటి ఇంటర్వ్యూ ప్రక్రియా లేకుండా నాకు ఉద్యోగ అవకాశాన్ని ఇచ్చారు. అది కూడా ఆఫీసుకి వెళ్లకుండా ఇంట్లోనే చేసుకునే ఉద్యోగం. అప్పుడు నేను ఆ ఉద్యోగావకాశాన్ని ఆమోదించాలా, వద్దా అని బాబాను అడిగితే, ఆయన 'ఆమోదించమ'ని చెప్పారు. నేను సాయంత్రం ఆరతి తరువాత మందిరం నుండి సంస్థవాళ్ళకి నా ఆమోదం తెలుపుదామనుకుని సంధ్యారతికి హాజరయ్యాను. అప్పుడు కూడా బాబా ఆకుపచ్చరంగు దుస్తుల్లో నన్ను ఆశీర్వదించారు. ఇంకా, బాబాకు వేసిన పూలమాలను పూజారి నాకు ఇచ్చారు. ఆ మాలలోని ఒక గులాబీరేకుపై బాబా దర్శనం కూడా ఇచ్చారు. ఆ ఫోటోను క్రింద జతపరుస్తున్నాను.


తరువాత నేను మందిరంలో నుంచే సంస్థవాళ్ళకి నా ఆమోదం తెలిపాను. 2021, మార్చి 10న నాకు ఆఫర్ లెటర్ వచ్చింది, నేను కాంట్రాక్టుపై సంతకం చేశాను. ఇంకా పెండింగులో ఉన్న ఇతర పనులు కూడా ఆరోజే పూర్తయ్యాయి. బాబా నాపై చాలా ప్రేమను, ఆశీస్సులను కురిపించి ఆరోజుని నా లక్కీ డే గా మలిచారని భావిస్తున్నాను. నిజంగా నేను నా ఆనందాన్ని వర్ణించలేకపోతున్నాను. కేవలం నాకొచ్చిన ఆలోచనను బాబా నిజం చేసి అంతలా అనుగ్రహించారు. అదివరకు ఒకసారి క్వశ్చన్ అండ్ ఆన్సర్ వెబ్‌సైటులో బాబా నాకు "అంతా బాగుంటుంది, నష్టం పూడుకుంటుంది" అని హామీ ఇచ్చారు. అది ఇప్పుడు నిజమైంది. నేను ఇంకా బాబాను చూడటానికి వేచి ఉండలేను. ఈ నెల చివరివారంలో నేను శిరిడీ వెళ్లాలని ప్రణాళిక చేసుకుంటున్నాను. అంతటా బాబా ఉన్నారని అనుభూతి కలుగుతున్నప్పటికీ శిరిడీలో మరింత శాంతి, మానసికబలం లభిస్తుంది. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. అందరిపై మీ ప్రేమను కురిపిస్తూ అమితంగా ఆశీర్వదించండి".


5 comments:

  1. Om sai ram you blessed her. Some times in life we leave baba. Baba won't leaves us that is our luck. I also in depression I leave baba in that pain I suffer lout. It is unbearable. With baba blessings I am fine. Medicine also reduce. With that medicine I got icing problem. I suffered for 2 years. My son is doctor. He cured me. Sai took care of me. I am thank full to him.om sai ram please take care of my family ��������������❤❤❤

    ReplyDelete
  2. Om sai ram baba nennu orupu tho vechi chustuna please na problem tondarga teerchu thandri sainatha

    ReplyDelete
  3. Om sai ram baba amma ki tondarga cure cheyi baba pleaseeee

    ReplyDelete
  4. సాయి ఏమిటి తండ్రి నీ లీలలు. ఎటువంటి విపత్కర పరిస్థితి అయినా సాయి అనే నీ నామస్మరణ మమ్మల్ని రక్షిస్తుందని మరల మరల నిరూపిస్తున్నారు తండ్రి...

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo