సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 738వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. నమ్ముకున్నవారిపట్ల బాబాకున్న బాధ్యత, కరుణ అపారమైనవి
  2. బాబా ఆశీస్సులతో తీరిన ఉద్యోగ సమస్య

నమ్ముకున్నవారిపట్ల బాబాకున్న బాధ్యత, కరుణ అపారమైనవి

బెంగళూరు నుండి శ్రీమతి లక్ష్మి తమకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

నేను సాయిభక్తురాలిని. బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. వాటిలోనుండి కొన్ని అనుభవాలను పంచుకుంటాను. మావారికి 75 సంవత్సరాలు. ఆయన ఊపిరితిత్తులు పాడైపోయాయి. ఇటీవల పరిస్థితి విషమించడంతో ఆయనను హాస్పిటల్లో చేర్చాము. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే మావారికి కరోనా పరీక్ష చేయించాలన్నారు. ఆ విషయం తెలిసి నేను చాలా భయపడిపోయాను. ఎందుకంటే, కరోనా ఊపిరితిత్తులపైనే ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఆ భయంతోనే మావారికి అనారోగ్యంగా ఉన్నా ఒక్కసారి కూడా కరోనా టెస్ట్ చేయించలేదు, చేయిస్తే లేనిపోని తంటా ఎందుకని. పైగా ఆయన పరిస్థితి అలా ఉన్నప్పటికీ బాబా ఉన్నారనే ధైర్యంతో నేను అప్పుడప్పుడు మా పెద్దబ్బాయి దగ్గరకు వెళ్తుండేదాన్ని. మళ్ళీ మావారు ఎలా ఉంటారోననే భయంతో అక్కడే ఉండిపోలేక తిరిగి వస్తుండేదాన్ని. అలాంటిది ఇప్పుడు తప్పనిసరై మావారిని హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది. భయంతో నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! నువ్వేం చేస్తావో నాకు తెలియదు, మావారికి కరోనా పాజిటివ్ మాత్రం రానివ్వకు, తనకు నెగెటివ్ వచ్చేలా చూడు బాబా" అని వేడుకున్నాను. ఆరోజు, మరుసటిరోజు రిపోర్టులు వచ్చేవరకు, "బాబా! నెగెటివ్ రానివ్వండి, నెగెటివ్ రానివ్వండి" అంటూ బాబాను తలచుకోవడం తప్ప నాకు ఇంకొకటి తోచలేదు. దయామయుడైన బాబా మాపై దయచూపారు. మావారికి కరోనా నెగెటివ్ అని రిపోర్టు వచ్చింది. నిజానికి మా ఇంట్లో అందరమూ ఖచ్చితంగా తనకు పాజిటివ్ వస్తుందనే అనుకున్నాము. అలాంటిది నెగెటివ్ అని తెలిసేసరికి నాకు మళ్ళీ జన్మెత్తినట్లై, 'బాబా ఋణం ఎట్లా తీర్చుకుంటానా?' అని అనుకున్నాను. ఆనందంతో నాకు కన్నీళ్లు ఆగలేదు. బాబా నా భర్తను కాపాడారు.    

మరో అనుభవం:

ఒకసారి డెబ్భయ్యవ ఏట అడుగుపెడుతూనే మావారి ఆరోగ్యపరిస్థితి విషమించింది. వెంటనే ఆయనను హాస్పిటల్లో చేర్చాము. '24 గంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేమ'ని డాక్టర్లు అన్నారు. మావారు ఎప్పుడు హాస్పిటల్లో ఉన్నా నేను ఆయన నుదుటికి బాబా ఊదీని పెట్టి, బాబా ఫోటోను కూడా తన మంచం ప్రక్కనే పెడతాను. ఆరోజు కూడా అలాగే చేసి, "బాబా! నీదే భారం. ఏమి చేస్తావో ఏమో నాకు తెలియదు. నీట ముంచనన్నా ముంచు, తేల్చనన్నా తేల్చు. ఏదైనా నీదే భారం. నన్ను ముత్తయిదువుగా తీసుకుపో" అని ఒకటే వేడుకున్నాను. డాక్టర్లు చెప్పిన 24 గంటలు దాటిపోయింది. ఆయన పరిస్థితిలో మార్పులేదు. రెండురోజుల పాటు విపరీతమైన జ్వరంతో ఆయన బాధపడసాగారు. మరోవైపు మా మనవరాలు కూడా జ్వరంతో బాధపడుతోంది. ఈ పరిస్థితుల మధ్య రెండురోజులు నాకు పూర్తిగా నిద్రలేదు. మధ్యాహ్నం పూట కాసేపు పడుకుందామంటే, డాక్టర్లో లేదా ఎవరో ఒకరు వస్తుండటంతో నిద్రపోలేకపోయాను. ఇక నా వల్ల కాలేదు. రెండోరోజు రాత్రి నా మంచానికి, మావారి మంచానికి మధ్య ఒక కుర్చీ వేసి, "బాబా! నీ ఇష్టం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. రెండురోజుల నుంచి నాకు నిద్రలేదు. ఈ నిద్రను జయించటం నా వల్ల కావట్లేదు. నాకేమీ చేసే శక్తి లేదు. నీ మీదే భారం వేస్తున్నాను. నువ్వే మావారిని చూసుకో" అని బాబాకు చెప్పుకున్నాను. తరువాత అక్కడున్న నర్సుతో, "నా వల్ల కావడం లేదు. కాసేపు పడుకుంటాను. నువ్వు కాస్త చూసుకుంటావా?" అని అడిగాను. తను, "పడుకోండి ఆంటీ. నేను చూసుకుంటాను" అని చెప్పింది. సరేనని నేను నిద్రపోయాను. అప్పటికే మావారు కూడా నిద్రపోయారు. రెండురోజులుగా నిద్రలేని కారణంగా నాకు చాలా గాఢంగా నిద్రపట్టేసింది. మధ్యలో ఒకసారి మెలకువ వచ్చి ఆయన ఎలా ఉన్నారో చూద్దామంటే కళ్ళు తెరవడం నా చేత కాలేదు. అయితే, అక్కడ నేను వేసిన కుర్చీలో ఎవరో కూర్చొని, మావారి తలపై చేయి వేసి ఉన్నట్లుగా మసకమసకగా కనిపిస్తూ ఉంది. కానీ నాకు లేవడానికిగానీ, పూర్తిగా కళ్ళు తెరచి చూడటానికిగానీ సాధ్యం కాలేదు. మళ్ళీ అలాగే నిద్రపోయాను. మనిషి మాత్రం అక్కడ కూర్చొని ఉన్నట్లే ఉంది. మరునాడు పొద్దున్నే నర్సుని, "ఏమ్మా! రాత్రి మాకోసం ఎవరైనా వచ్చారా? నువ్వేమైనా ఇక్కడ కూర్చొని ఉన్నావా?" అని అడిగాను. అందుకామె, "ఒక వస్తువు కోసం వచ్చాను. మీరు, అంకుల్ మంచి నిద్రలో ఉన్నారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని ఆ వస్తువు తీసుకొని నెమ్మదిగా వెళ్ళిపోయాను. ఇంకెవరూ రాలేదు" అని చెప్పింది. తరువాత మావారు లేస్తూనే, "పద, అలా వాకింగ్‌కి పోయి వద్దాం" అని అన్నారు. అప్పటివరకూ మంచం దిగడానికే ఓపికలేని మావారు వాకింగ్‌కి పోదామంటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ తరువాత మావారు నాతో, "రాత్రి ఎవరో నా తలమీద చేయివేసి నిమిరారు. ఆ స్పర్శకు నాకు మెలకువ వచ్చింది, ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది" అన్నారు. అది విని, ‘రాత్రి నాకు కుర్చీలో కనిపించింది మరెవరో కాదు, ఆ సాయినాథుడే’ అని అర్థమై, ఎంతో ఆనందంతో దయగల నా సాయితండ్రికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

బాబా ఆశీస్సులతో తీరిన ఉద్యోగ సమస్య


సాయిబంధువులందరికీ నా నమస్కారములు. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా ధన్యవాదములు. నా పేరు మంగతాయి. మేము హైదరాబాదులో నివసిస్తున్నాము. మేము సాయిబాబా భక్తులం. చాలా సంవత్సరాల నుండి బాబాను పూజిస్తున్నాము. బాబా దయ ఉంటే ఏ సమస్య అయినా తీరుతుందని నాకు తెలుసు. అందుకే మా అబ్బాయి ఉద్యోగానికి సంబంధించిన సమస్యను బాబాకు విన్నవించుకొని, "బాబా! ఈ సమస్య నుండి మమ్మల్ని గట్టెక్కిస్తే, నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. ఇక అసలు వివరాల్లోకి వస్తే.. 


మా అబ్బాయి పేరు కౌశిక్. తను ఐఐటీ చేసి, యు.ఎస్.ఏ.లో మాస్టర్స్ పూర్తిచేసి, అక్కడే నివాసం ఉంటున్నాడు. మా అబ్బాయి తను చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగం నుంచి ఫుల్ టైమ్ ఉద్యోగంలోకి మారాలని JP MORGAN CHASE & CO కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. బాబా ఆశీర్వాదంతో మా అబ్బాయి తొందరగా ఉద్యోగంలో చేరాలని నేను మహాపారాయణ గ్రూపులో చేరి పారాయణ మొదలుపెట్టాను. బాబా దయవలన మా అబ్బాయి ఇంటర్వ్యూ విజయవంతంగా పూర్తిచేశాడు. ఆఫర్ లెటర్ కూడా వచ్చింది. ఆరునెలల్లో అన్ని పనులూ పూర్తయి ఈ మార్చిలో మా అబ్బాయి ఉద్యోగంలో చేరాడు. బాబా ఆశీస్సులతో అలా అన్నీ సానుకూలంగా ముగిశాయి. "బాబా! ధన్యవాదాలు తండ్రీ. అబ్బాయికి తన ఉద్యోగంలో ఎటువంటి సమస్యలు రాకుండా, అంతా బాగుండేలా, అన్నిటా విజయం సిద్ధించేలా ఆశీర్వదించు తండ్రీ. దయచేసి నాకున్న కొన్ని కుటుంబ సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని కలిగించండి బాబా".


8 comments:

  1. Om sai baba with your blessings life is happy. Sai baba saves his devotee with love.sai gave darshan to that devotee.if we trust him he takes care of our family.please bless my son. Be with him. He is corona doctor. Give him long life. Om sai maa ❤❤❤��

    ReplyDelete
  2. 🙏🙏🙏Om srisairam Om srisairam Om srisairam thank you sister

    ReplyDelete
  3. Kothakonda SrinivasApril 8, 2021 at 10:20 AM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. Om sai ram ������ baba amma arogyam bagundali thandri ��

    ReplyDelete
  6. Baba amma kadupu noppi tiseyi thandri 🙏pleaseeee

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo