సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1191వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. చిన్న చిన్న విషయాల్లో కూడా ఎంతో ప్రేమని చూపే బాబా
2. కోరుకున్నట్లే వారంలో దమ్ము, ఆయాసం తగ్గేలా అనుగ్రహించిన బాబా

చిన్న చిన్న విషయాల్లో కూడా ఎంతో ప్రేమని చూపే బాబా

ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః!!! 

సాయి బంధువులకు నమస్కారం. మనం ఎంత ఒత్తిడిలో ఉన్నా మన ఈ బ్లాగులోని తోటి సాయి భక్తుల అనుభవాలు చదివితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను ఒక సాయి భక్తురాలిని. 2022, ఫిబ్రవరి నెలలో మా ఇంట్లో అందరికీ జ్వరాలు వచ్చాయి. జ్వరం మొదట మా మరదలికి వచ్చి తర్వాత మిగతా అందరికీ వచ్చింది. జ్వరం మరదలికి రాగానే కరోనా థర్డ్ వేవ్ వార్తల వల్ల మొదట కొంచెం భయమేసినా మరుక్షణమే బాబా మీద భారం వేసి భయాన్ని వదిలేసాను. బాబా ఎంతలా మమ్మల్ని అనుగ్రహించారంటే, మాలో ఎవరికీ రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు జ్వరం లేదు. అది కూడా ఒకరికి తగ్గాక ఒకరికి వచ్చింది. అదే అందరికీ ఒకేసారి జ్వరం వస్తే చాలా ఇబ్బంది అయ్యేది. అంతా బాబా దయ. ఆయన కృపవలన మేము అందరమూ చాలా త్వరగా కోలుకున్నాము. "అన్నిటికీ చాలా చాలా ధన్యవాదాలు బాబా".

ఇంకో అనుభవం మీతో పంచుకోవాలనిపించి పంచుకుంటున్నాను. ఎందుకంటే, మన సాయి చిన్న చిన్న విషయాల్లో కూడా ఎంత ప్రేమని చూపిస్తారో మీకు చెప్పాలనిపించింది. ఇది అవ్వటానికి చిన్న విషయమే అయినా బాబా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చారు. 2021, జూన్ లేదా జూలైలో మావాళ్ళు ద్వారకాతిరుమల వెళ్ళారు. వాళ్ళు వెళ్ళాక అక్కడినుంచి ఆకుపచ్చరంగు మట్టి గాజులు తెమ్మని చెప్పాలని నాకు అనిపించింది. ఆ విషయం చెప్పటానికి ఫోన్ చేతిలోకి తీసుకున్నాక ఎందుకో సరదాగా బాబాతో, "నేను వాళ్ళకి ఏం చెప్పను. నువ్వే నాకు ఆకుపచ్చ రంగు మట్టి గాజులు పంపించు" అని చెప్పాను. అంతే, ఇక ఫోన్ చేయలేదు. కాసేపటికి తమ్ముడు కాల్ చేసి, "ఏం ప్రసాదం తెమ్మంటావు?" అని అడిగి, అక్కడి ప్రసాదాల లిస్ట్ ఫోటో తీసి పంపాడు. వాళ్ళు ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళారు కానీ, ఇలా ఎప్పుడూ ఫోన్ చేయలేదు. నేను కావాల్సినవి చెప్పాను. కాసేపటికి వాళ్ళు వచ్చారు. నేను అడిగిన ప్రసాదం తెచ్చారు కానీ, నేను అనుకున్న గాజులు తేలేదు. "అదేంటి బాబా, గాజులు పంపలేదు" అని బాబాను అడిగాను. వెంటనే, 'నేను గాజుల గురించి చెప్పాలని ప్రసాదం వంకతో బాబా కాల్ చేయించారేమో! కానీ నేను అడగలేదు. అయ్యో.." అని నవ్వుకున్నాను. తర్వాత ఆ విషయం పూర్తిగా మర్చిపోయాను. కానీ నా సాయి మర్చిపోరు కదా! తర్వాత శ్రావణ పౌర్ణమి రోజు తమ్ముడికి, మేనల్లుడికి రాఖీలు తయారుచేసి, రమ్మని వాళ్ళతో చెప్పాను. వాళ్ళు రాఖీ కట్టించుకోడానికి వచ్చారు. నేను, నా మేనకోడలు రాఖీలు కట్టాం. తర్వాత తమ్ముడు పని ఉందని బయటకు వెళ్లి కాసేపటికి వచ్చి స్వీట్స్ తోపాటు ఒక కవర్ నా చేతిలో పెట్టాడు. ఆ కవరులో ఏముందో మీకు అర్థమై ఉంటుంది కదా. నేను ఆరోజు బాబాని అడిగి మర్చిపోయిన ఆకుపచ్చ రంగు మట్టిగాజులు. వాటిని చూశాక బాబాను అడిగిన గాజుల విషయం గుర్తుకొచ్చి ఎంత సంతోషించి ఉంటానో మీకు చెప్పక్కర్లేదు అనుకుంటా. అతి పవిత్రమైన రాఖీపౌర్ణమి రోజున నేను కోరుకున్నది నాకు ఇచ్చారు బాబా. ఇంకొక విషయమేమిటంటే, మా తమ్ముడు అలా గాజులు నాకోసం తెచ్చి చాలా సంవత్సరాలు అయింది. తను కాలేజీలో చదివే రోజుల్లో తెస్తే, మళ్ళీ ఇన్నాళ్ళకి తెచ్చాడు. అది కూడా నేను కోరుకున్నవి. ఇదంతా బాబా అనుగ్రహం కాకుంటే మరేమిటి. "థాంక్యూ అనేది చాలా చిన్నమాట బాబా. ఎల్లప్పుడూ మమ్మల్ని ఇలాగే ప్రేమగా చూస్తుండండి బాబా".

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!
శుభం భవతు!!!

కోరుకున్నట్లే వారంలో దమ్ము, ఆయాసం తగ్గేలా అనుగ్రహించిన బాబా
 
ఓం శ్రీసాయినాథాయ నము:!!!

నేను ఒక సాయి భక్తురాలిని. ప్రతిరోజు బ్లాగులో ప్రచురితమయ్యే భక్తుల అనుభవాలు చదవడం వల్ల బాబాపట్ల నమ్మకం, భక్తి, ప్రేమలు వృద్ధి చెందుతున్నాయి. నేను ఒక హృద్రోగిని. అయినా నేను దాదాపు అన్ని పనులు సక్రమంగానే చేస్తాను. నేను రోజూ వాకింగ్ కూడా చేస్తాను. అయితే కొన్నిరోజుల నుండి నేను ఏ పని చేసినా దమ్ము, ఆయాసం వస్తున్నాయి. ఈ దమ్ము వల్ల కాసేపు వాకింగ్ చేసినా అది ఇంకా ఎక్కువ అయిపోతుండేది. అప్పుడు నేను, "బాబా! ఒక వారం రోజులలో నాకు ఆయాసం, దమ్ము తగ్గిపోతే, మీకు కిచిడి నైవేద్యంగా సమర్పిస్తాను" అని బాబాతో చెప్పుకున్నాను. సరిగ్గా వారం రోజుల్లో ఆయాసం, దమ్ము తగ్గాయి. "ధన్యవాదాలు బాబా. నామనసులో ఉన్నది జరిగేలా చూడండి, ప్లీజ్ బాబా. నా జీవితంలో ప్రతీది మీవల్లే జరగాలని కోరుకుంటున్నాను తండ్రి".

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo