సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1213వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. మనవరాలు అడిగింది - తాత(బాబా)గారు తీర్చేశారు అంతే!
2. బాబా మేజిక్ - దొరికిన డైమండ్ ఉంగరం

ఓం శ్రీసాయినాథాయనమః!!!

అద్భుతానంత చర్యాయ నమః!!!


సాయి బంధువులందరికీ నమస్కారం. 'ఆధునిక సాయి సచ్చరిత్ర' - 'సాయి మహారాజ్  సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు ధన్యవాదాలు. మ్రొక్కులు మ్రొక్కుకోవడం, ముడుపులు కట్టడం, అంతటితో సమస్యలు తీరడం చిన్నప్పటినుండి నాకు తెలుసు. అయితే ఈమధ్య ఏ సమస్య ఉన్నా, "శ్రీ'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగుకు నా అనుభవాన్ని వ్రాసి పంపిస్తాను బాబా" అని చెప్పుకోగానే ప్రతి సమస్య తీరిపోవడం అత్యంత ఆశ్చర్యకరం. ఆ దృష్ట్యా ఈ బ్లాగు పూర్తిగా బాబా అనుగ్రహంతో, వారి సంకల్పంతో నడుస్తున్న అభినవ డిజిటల్ 'సాయి సచ్చరిత్ర' అనటంలో సందేహమే లేదు. నా పేరు మీనాక్షి. నేనిప్పుడు అడుగడుగునా మన సమస్యలను వింటూ, పిలిచినంతనే పలుకుతూ, నేను నీతోనే ఉన్నానని నిదర్శనమిస్తూ తమపట్ల మరింత నమ్మకాన్ని, ప్రేమను పెంచుతున్న బాబా నాకు ఈ మధ్యకాలంలో ప్రసాదించిన అనుభవాలను మీతో పంచుకుంటున్నాను.


మనవరాలు అడిగింది - తాత(బాబా)గారు తీర్చేశారు అంతే!


కొద్దిరోజుల క్రిందట మేము 8 సంవత్సరాల మా పాప పుట్టినరోజు సందర్భంగా తనకి తను ఎప్పటినుండో కోరుకుంటున్న కొన్ని ఖరీదైన బొమ్మల సెట్ కొని కానుకగా ఇచ్చాము. కరోనా సమయం వల్ల గత రెండు సంవత్సరాలుగా పిల్లలు కలిసి ఆడుకోవడం లేదు. అందుచేత ఈ వేసవి సెలవుల్లో కొందరు కొత్త ఫ్రెండ్స్ దొరికేసరికి మాపాప అందరితో కలిసి ఇంటి ముందరే కూర్చుని ఆడుకోవడం మొదలుపెట్టింది. తనకి ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. వాళ్లతో స్నేహంగా ఉంటూ తన బొమ్మలన్నీ వాళ్ళతో షేర్ చేసుకుని సంతోషంగా ఆడుకుంటుంది. అయితే ఒకరోజు ఆడుకుని లోపలికి వచ్చిన కాసేపటికి తన బొమ్మలన్నీ సర్దుకుని చాలా డల్‍గా అయిపోయింది పాప. చాలాసేపటివరకు తను సైలెంట్‍గా ఉండటం గమనించిన నేను, "ఏమైంది? ఎందుకు డల్‍గా ఉన్నావు?" అని ఎంతలా అడిగినా తను నోరు విప్పలేదు. తను లోలోపలే ఎందుకో బాధపడుతోందని నాకు అర్ధమైంది. రాత్రి పడుకునే సమయంలో తనని దగ్గరకు తీసుకుని, "ఎందుకు అలా ఉన్నావు, ఏమైంది తల్లీ?" అని అన్ని విధాలా సముదాయిస్తూ అడిగితే 'ఎస్', 'నో' అన్న సమాధానాలయ్యాక చివరికి నేను కొనిపెట్టిన బొమ్మల సెట్‍లో కొన్ని బొమ్మలు కనిపించటం లేదని, ఆ విషయం నాతో చెప్పడానికి తను భయపడుతోందని నాకు అర్ధం అయింది. ఆ కనపడకుండా పోయిన బొమ్మల వల్లనే ఆ మొత్తం సెట్‍కి విలువ. అందుకే తను లోపల లోపల బెంగపెట్టుకుంది. ఎందుకంటే, తన సంతోషం కోసం కొంచం ఖరీదు ఎక్కువైనా, వాటిని కొని ఇవ్వాల్సి వచ్చిందన్న విషయం తనకు తెలుసు. అదలా ఉంచితే, ఆరోజు సాయంత్రం నేను ఫోన్ వస్తే మాట్లాడుతూ పిల్లలను గమనించినప్పుడు పిల్లలందరూ టాయ్స్ చాలా కొత్తగా ఉన్నాయని ఆ సెట్‍లోని కొన్ని వస్తువులు తీసి ఆడుకోవడం నేను చూసాను. అయితే మా పాప ఎవరినీ తప్పు పట్టడం లేదు. పైగా వాళ్ళందరూ తన ఫ్రెండ్స్ అని, అందరూ చాలా మంచివాళ్ళు అని, నేనంటే వాళ్ళకి చాలా ఇష్టమని, వాళ్ళెవరూ అలా చేయరని చెప్తోంది. నేను తనతో, "సరే, వాళ్ళు కావాలని తీసుకుని ఉండకపోవచ్చు. కానీ బాగున్నాయని ఆడుకుంటూ తీసుకువెళ్లి తిరిగివ్వలేదేమో, అడుగుదాం" అని అంటే, అందుకు తను 'వద్దు, వాళ్ళు ఫీల్ అవుతారు. అడగవద్దు, వాళ్ళు తీసుకోవడం నేను చూడలేదు. అడిగితే, వాళ్ళు అనుమానిస్తున్నామని తప్పుగా తీసుకుంటారేమో, స్నేహం చెడిపోతుందేమో' అని భయపడుతోంది. 'ఏ ఒకరో తీసుకున్న దానికి మిగతా వాళ్ళు అందరూ ఫీల్ అవుతారు కదా!' అని ఆలోచిస్తోంది. తనకి అన్ని రకాలుగా నచ్చచెప్పి అడుగుతూ పోతే, చివరికి ఒక ఫ్రెండ్ మీద కొంచెం అనుమానంగా అనిపించింది మా ఇద్దరికీ. కానీ, అడిగితే ఒప్పుకుని, ఇస్తారన్న నమ్మకం లేదు. పైగా వాళ్ళ పేరెంట్స్ తప్పుగా తీసుకుంటారు, ఫ్రెండ్స్ ఫీల్ అవుతారేమో అని లోపల అణిచిపెట్టుకున్న దుఃఖమంతా ఒక్కసారిగా బయటకు వచ్చి పాప ఏడ్చేసింది. అంతేకాదు, "అందరితో మంచిగా ఉండటం తప్పా? మంచివాళ్లని నమ్మాను. ఫ్రెండ్స్ తో ఆడుకునేప్పుడు షేర్ చేసుకోవాలి అని నువ్వు చెప్తావు కాబట్టి వాళ్ళకి నా బొమ్మలు ఇచ్చాను. మరి వాళ్ళెందుకు ఇలా చేశారు? నువ్వు నాకు చెప్పినట్టు వాళ్ళ అమ్మలు వాళ్ళకి చెప్పారా? ఇదంతా బాడ్ పేరెంటింగ్ కదా అమ్మా. నమ్మి బొమ్మలు ఇస్తే, వాళ్ళు తీసేసుకుని నన్ను చీట్ చేయకూడదు కదా? పైగా నువ్వు ఎప్పుడూ బాబాకి ఇలా ఉంటే ఇష్టం, బాబా అలా చెప్పారు, ఇలా చెప్పారు అంటావు కదా! నేను అలానే ఉన్నాను, మరి ఎందుకు నాకు ఇలా అయింది" అని బాబాను కూడా ఇన్వాల్వ్ చేసి మరీ నన్ను నిలదీసింది. 8 సంవత్సరాల పాప అడిగిన ఈ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేకపోయినా, "మనం జాగ్రత్తగా ఉండకపోవడం మన తప్పు, అందర్నీ గుడ్డిగా నమ్మకూడదు. నీ వస్తువులను జాగ్రత్త పెట్టుకోవాల్సిన బాధ్యత నువ్వు నేర్చుకోవాలని నీకు ఇదొక పాఠం" అని నాకు తోచిన బుద్ధులు చెప్పాను. అయినా పాప ఏడుస్తూ అవే ప్రశ్నలు అడుగుతుంటే, ఎలా ఊరుకోబెట్టాలో నాకు అర్ధం కాలేదు. అంతలో తను ఒక మాట అంది, "అందరికోసం బాబాకు ప్రేయర్ పెట్టిస్తావు కదా, బొమ్మలకోసం కూడా ప్రేయర్ చేయిస్తే, దొరుకుతాయా అమ్మా?" అని.


'సిల్లిగా బొమ్మలకోసం ప్రేయర్ పెట్టించడమేంటి?' అని నాకు ఒక పక్క నవ్వు వచ్చినా తను ఫీల్ అవకూడదని కవర్ చేసుకుని, "ఎవరో ఎందుకు ప్రేయర్ చేయడం? బాబాకు మనస్ఫూర్తిగా నీ బాధని చెప్పుకో, నీ ప్రశ్నలన్నీ ఆయననే అడుగు, నీలాంటి మంచి పిల్లలు అంటే బాబాకు చాలా ఇష్టం. ఆయన చెప్పినట్టు మనం కరెక్టుగా ఉంటే మనకు ఏ కష్టం వచ్చినా ఆయనే తీరుస్తారు. కాబట్టి ఇప్పుడు నువ్వు బాబాకు నీ బాధ చెప్పుకో, వెంటనే నీ ప్రాబ్లెమ్ క్లియర్ చేస్తారు. కానీ ఒక షరతు, నువ్వు హృదయపూర్వకంగా, 100% నమ్మకంతో మాత్రమే బాబాకు చెప్పాలి. అప్పుడే నీకు సహాయం చేస్తారు" అని చెప్పాను. అప్పుడు తను, "నాకు అడగటం రాదేమో! నువ్వు కూడా చెప్పవా?" అని నా సహాయం కూడా అడిగింది. వెంటనే నా ఫోన్ స్క్రీన్ మీద ఉన్న బాబా ఫోటో చూపించి, "ముందు నువ్వు నీ బాధ చెప్పుకో" అన్నాను. అంతే, తను జరిగినదంతా బాబాకి చెప్పుకుని తన ప్రశ్నల వర్షం కురిపించేసింది. తరువాత నేను కూడా బాబాను గట్టిగా ప్రార్థించాను. "బాబా! చిన్నపిల్ల బాగా హర్ట్ అయింది. అమాయకంగా అడుగుతోంది. తనని మీతో కనెక్ట్ చేయటానికి నాకు ఇది మంచి అవకాశం. ఒక్కసారి తనకి నమ్మకం కుదిరితే, ఇక తను మిమ్మల్ని వదలదు. నాకు దిగులుండదు. తన మంచి, చెడులు అన్నీ మీరే చూసుకుంటారని నేను ధైర్యంగా ఉంటాను. తన బాధను తీర్చండి బాబా. ఈ అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను.


మర్నాడు ఉదయం నేను పని మీద బయటకు వెళ్తుంటే, మా పాప ఫ్రెండ్ వాళ్ల అమ్మగారు కనిపించారు. ఆవిడ ఫ్రెండ్లీగా నన్ను పలకరించి ఏదో అడుగుతున్నారు. నేను మాటల్లో "మా పాప రాత్రంతా బాధపడుతూనే ఉంది. తన బొమ్మల సెట్‍లోని కొన్ని బొమ్మలు మిస్ అయ్యాయని బెంగతో నిద్రపోలేదు. ఎవరినీ అడగటం తనకు ఇష్టం లేదు. ఎందుకంటే, వాళ్ళు హర్ట్ అవుతారని. బొమ్మలు పోవటం కన్నా ముఖ్యంగా నేను నా ఫ్రెండ్స్ ను ఇంత నమ్మాను, వాళ్లకోసం చాలామంచి గిఫ్ట్స్, చాక్లెట్స్ ఇస్తాను, అన్నీ షేర్ చేసుకుంటాను. మరి వాళ్ళు ఇలా ఎందుకు చేశారు అని బాధపడుతోంది" అని చెప్పి, నాకు ఆలస్యమవుతుంది అంటూ నా పని మీద నేను వెళ్ళిపోయాను. ఒక అరగంటలో తిరిగి ఇంటికి వచ్చేసరికి హాల్లో ఏదో కవర్, అందులో కనిపించకుండా పోయిన బొమ్మలు ఉన్నాయి. మా అమ్మాయి గది తలుపు తీసి చూస్తే, తన ముఖం 1000 వాట్స్ బల్బులా వెలిగిపోతుంది. నేను తనని, "ఏమైందేమిటి, ఈ కవర్ ఎలా వచ్చింది" అని చాలా కుతూహలంగా అడిగాను. తను ఆనందంగా, "బాబా నా బొమ్మలు నాకు ఇప్పించేశారు అమ్మా. అయినా అలా ఎలా అయింది అమ్మా?" అని అంది. "సరే, ఇంతకీ ఇవి ఎలా వచ్చాయి" అని అసలు విషయం అడిగితే, తన ఫ్రెండ్ (ఆ పాప నాకు దారిలో కనిపించి నాతో మాట్లాడిన ఆవిడ కూతురు) వచ్చి, వాటిని ఇచ్చిందని చెప్పింది. అప్పుడు నేను తనతో, "చూశావా! నువ్వు బాబాకు నచ్చినట్టుగా ఉంటూ నిజమైన నమ్మకంతో నీ బాధను చెప్పుకున్నావు. కాబట్టి నీకు బాబా సహాయం చేశారు. ఇకపై నీ జాగ్రత్తలో, బాధ్యతగా ఉండాలి. లేకుంటే, నన్ను అడగకు. ఇంతకీ బాబాకి థాంక్స్ చెప్పావా మరి?" అని అడిగాను. "వెంటనే చెప్పేసాను అమ్మా. అయినా అలా ఎలా, ఏం మేజిక్ చేశారు అమ్మా? ఆన్ బిలీవబుల్ కదా అమ్మా!" అని తను ఆనందంతో ఉప్పొంగిపోతుంటే నాకు చాలా ముచ్చటగా, సంతోషంగా అనిపించింది. వెంటనే కొన్ని చాక్లెట్ ప్యాకెట్స్ ఒక కవరులో వేసి తన చేతికిచ్చి, "వీటిని నీ ఫ్రెండ్‍కిచ్చి, నాకోసం బొమ్మలు వెతికి పెట్టినందుకు ధన్యవాదాలు అని చెప్పు. పొరపాటున కూడా తను గిల్ట్ ఫీల్ అయేట్టు ఏమి అనకు. ఎప్పటిలాగే మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్‌లా ఉండాలి. అంతేగాని మీ మధ్యలో బాధించే ఏ భావాలు ఉండకూడదు. నీవల్ల నేను ఈరోజు సంతోషంగా ఉన్నాను. చాలా చాలా థాంక్స్ అని చెప్పిరా" అని చెప్పి పంపించాను. బాబా దయవల్ల ఆ పాప, వాళ్ళ అమ్మ సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం పిల్లలిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్,. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. అసలు సమస్య ఎక్కడ ఉందో, ఎవరి వల్ల పరిష్కారం రావాలో ఆ మనిషినే బాబా నాకు తారసపడేలా చేసి పాప బాధ తీర్చారు బాబా. ఈ అనుభవం ద్వారా మా అమ్మాయికి బాబా మీద బాగా గురి కుదిరింది.


2022, మేలో వరసగా 10 రోజులు మేము ఉండే ప్రాంతంలో ఎడతెరిపి లేని వర్షాలు కురిసాయి. ఇంకొక 10 రోజులు తుఫాను అని హెచ్చరికలు కూడా ఉన్నాయి. ఎప్పటినుంచో మా అమ్మాయి ఔటింగ్(బయట)కి వెళ్ళాలనుకుంటుంది. కానీ ప్రతిసారీ హఠాత్తుగా వర్షం పడటం, నిరాశతో పాప ఏడుస్తూ కూర్చోడం, నా దగ్గర ఒకటే నస పెట్టడం జరుగుతున్నాయి. అలాటింది ఈసారి కూడా వర్షాలు ఉండటంతో పాప బాబాను, "వర్షం వల్ల ఎప్పుడు అనుకున్న బయటకి వెళ్లడం కుదరట్లేదు. ఒక రెండు రోజులు వర్షం వద్దు. మేము బయటికి వెళ్ళాలి" అని అడిగింది. ఆశ్చర్యంగా ఆ వారాంతంలో వర్షం కాదుకదా, కనీసం వర్షం వచ్చే ఛాయలు కూడా లేవు. మనవరాలు అడిగింది - తాతగారు తీర్చేశారు అంతే. విచిత్రం ఏమిటంటే, ఒక వారం పాటు ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు కురుస్తాయిని వెదర్ ఫోర్ కాస్ట్ చూపిస్తుంది. అలాగే ఆ రెండు రోజులు మినహా మళ్లీ వర్షాలు, మబ్బులు. ఏది, ఎందుకు, ఏమిటి, ఎలా అని తెలుసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలో నిర్ణయించగల ఒక మెజీషియన్, ఒక గైడ్ మన బాబా మనతో ఉన్నారు. స్వచ్చమైన నమ్మకం, ప్రేమ ఉంటే ఏదైనా సాధ్యమే అని అడుగడుగునా చూపించే నా తల్లి, తండ్రి, గురువు, దైవం అయిన నా బాబాకు కోటికోటి ప్రేమపూర్వక ప్రాణామాలు.


బాబా మేజిక్ - దొరికిన డైమండ్ ఉంగరం


ఒకరోజు పొద్దున్న ఎన్నో సంవత్సరాలుగా నావేలికి ఉండే డైమండ్ ఉంగరం కనిపించలేదు. అది ఆభరణంగా కాక, జాతకరిత్యా పెట్టుకోవాల్సి వచ్చిన ఉంగరం. సోమవారం రాత్రి వరకు చేతికున్న ఆ ఉంగరం మంగళవారం పొద్దున లేచి స్నానం చేసి వచ్చాక కనిపించలేదు. అది నా చేతికి వదులుగా లేదు, నేను బాత్రూమ్, బెడ్రూంలో తప్ప వేరెక్కడ తిరిగింది కూడా లేదు. అయినా బాత్రూమ్, ఇంకా ఇల్లంతా వెతికినా ఆ ఉంగరం కనిపించలేదు. అప్పుడు నేను, "బాబా! నేను ఏ మాత్రమూ అజాగ్రత్తగా లేను. కానీ ఆ ఉంగరం పోయింది. అది 100% ఇంట్లోనే ఉంటుంది కానీ, ఎక్కడన్నది అర్ధం కావట్లేదు. అందరం అన్ని చోట్లా అణువణువున గాలించేసాం. మా వంతు ప్రయత్నం అయిపోయింది. ఇక మీరే దిక్కు. మీరే ఆ ఉంగరం దొరికేట్టు చెయ్యండి. ఉంగరం దొరికితే, ఈ అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. తరువాత నాకు ఆరోజు ప్రయాణం ఉండటంతో బాధగానే ఇంటినుండి బయల్దేరి దారిలో కూడా బాబాను ప్రార్థిస్తూ, "ఉంగరం దొరికే అవకాశం ఉందా బాబా? ఆరుగురం ఇంటిల్లిపాదీ డస్ట్ బిన్స్ తో సహా అణువణువు వెతికాము, కానీ ఉంగరం ఎక్కడా కనపడలేదు. పనమ్మాయి రాలేదు. నేను ఆ గది దాటి బయటకు వెళ్ళలేదు. నాకు తెలీకుండా జారి బాత్రూం కమోడ్‌లో పడిపోయిందేమో అని అందరూ అంటున్నారు. నాకేమి అర్ధం కావట్లేదు. ఏదైనా టైం బాడ్‍గా నడుస్తుందేమోనని భయంగా ఉంది" అని బాబాను పరిపరి విధాలుగా అడుగుతూ, "బాబా! అది పోవాలని రాసి ఉంటే వదిలేస్తాను. లేదు దొరుకుతుంది అని మీరు నాకు ఆశ కల్పిస్తే నమ్మకం పెట్టుకుంటాను తప్ప ఈ త్రిశంకు స్వర్గంలో బాధపడలేను బాబా" అని గట్టిగా దణ్ణం పెట్టుకున్నాను. ఆ క్షణం నుండి బాబా నాకు ఎన్నో విధాలా సానుకూల  సంకేతాలు ఇవ్వసాగారు. వెంటనే ఇంట్లో అందరికీ, మా అక్కలందరికీ గ్రూపులో, 'బాబా ఉంగరం దొరుకుతుందని చెప్తున్నారు. అది ఎలానో నాకు తెలీదు కానీ, దొరుకుతుంది. అది బాబా చెప్తున్నారు. చూద్దాం, వేచి ఉండటం తప్ప మన చేతిలో ఏమీ లేదు. ఇక బాబాకే వదిలేసాను' అని మెసేజ్ పెట్టి అంతటితో ఆ విషయం వదిలేసాను. తరువాత గురువారం మధ్యాహ్నం బాబా దర్శనానికి మందిరానికి వెళ్ళాను. ఆరతి అయ్యాక మామూలుగా బాబాకి దణ్ణం పెట్టుకుని అన్ని విషయాలు చెప్పుకుని, చివరిలో "అసలే కష్ట సమయం నడుస్తోంది. చింతలు పెరిగిపోయాయి. పైగా నేను ఎంతో సెంటిమెంట్‍గా భావించే ఉంగరం పోయింది బాబా. అది ఇంకా దొరకలేదు. వేలు ఖాళీగా కనిపిస్తున్న ప్రతిసారీ బాధగా అనిపిస్తోంది" అని చెప్పుకుంటుంటే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఆ రోజు సాయంత్రం 4-4.30గంటల సమయంలో మాపాప బాత్రూంకి వెళ్లి 'టిష్యూ పేపర్ రోల్ అయిపోయింది. ఎవరూ పెట్టట్లేదు' అని కొత్తది తెచ్చి రాడ్‍కి పెడుతుంటే, ఆ రాడ్‍కి వేలాడుతూ నా ఉంగరం తనకి కనిపించింది. అంతే, పాప అరుచుకుంటూ వచ్చి ఉంగరం దొరికింది అని చెప్పేసరికి ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే నాకు ఆ ఉంగరం ఫోటో తీసి పెట్టారు. నేను ఎంత సంతోషించానో మాటల్లో చెప్పలేను. ఎందుకంటే, బిడ్డ కళ్ళలో నీళ్ళు రాగానే తల్లి, తండ్రి ఎలా అయితే బాధను తీర్చాలని పరితపిస్తారో, నా కళ్ళలో నీళ్ళు రాగానే బాబా 3-4 గంటలలోనే నాకు నిదర్శనం చూపించారు. ఒకవేళ ఆ ఉంగరం సబ్బు తగిలి జారిపడితే కమోడ్‍లో పడే అవకాశం ఉంటుంది తప్ప అంత చిన్నగా ఉన్న టవల్ రాడ్‍కి ఎలా పట్టుకుంటుంది అనేది ఇప్పటికీ మా అందరికీ అంతుబట్టని విషయం. పోనీ ఆ రాడ్‍కే ఆ ఉంగరం పట్టుకుని ఉందనుకున్నా ఆ రెండు రోజుల్లో ఇంట్లో అందరూ ఆ బాత్రూం వాడుతున్న వాళ్లే. మరి ఒక్కరూ ఆ ఉంగరాన్ని గమనించకపోవడమేమి విచిత్రమో! పాపకి పేపర్ రోల్ పెట్టాలన్న ఆలోచన రావటం, ఉంగరం కనిపించటం ఇది బాబా మేజిక్ తప్ప ఇంకొకటి కాదు. అడుగడుగునా, తోడుగా నీడగా వెన్నంటి ఉండే ఆ సాయినాధునికి జన్మ జన్మలకూ ఋణపడి ఉంటాను. ఏ జన్మలో ఎలా పుట్టినా సరే బాబా చేతిని గట్టిగా పట్టుకుని ఉండాలి, సర్వకాల, సర్వావస్థల్లోనూ బాబా నాకు, నా కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా వెన్నంటి ఉండాలని ఆ సాయినాథున్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ప్రేమ స్వరూపుడు, దయార్ద్ర హృదయుడు, సర్వాంతర్యామి అయిన శ్రీసాయినాథునికి శతకోటి ధన్యవాదాలు, ఆనంతకోటి సాష్టాంగ నమస్కారాలు.


4 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. A carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba...sai divyapuja 5varalu chestha thandri ma money maku vachela cheyi...

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo